Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నాన్న నా కంటే అదృష్టవంతుడు

నాన్న నాకంటే ఎప్పుడు అదృష్టవంతుడే!

ఉదయం 9.00 అయింది. ఆ ఊర్లో రమేష్ బస్సు దిగి సరాసరి ఇంటికి నడుచుకుంటూ వచ్చి గుమ్మoల్లోకి అడుగు పెట్టేసరికి అరుగు మీద రమేష్ తండ్రి చలపతిరావు వాలుకుర్చీలో పడుకుని పక్కనే కూర్చున్న ఊరి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు.

 " నాన్న ఎలా ఉన్నారని పలకరించే సరికి మీ నాన్నగారికి ఏవండీ చాలా మంచి వ్యక్తి ఉన్న రోజు ఒకలాగే ఉన్నాడు లేని రోజు ఒకలాగే ఉన్నాడు అందరూ కావాలనుకునే వ్యక్తి. అందరి క్షేమం కోరే వ్యక్తి అంటూ అక్కడ కూర్చున్న జనం అంటుంటే ఒక్కసారి గర్వంగా అనిపించింది రమేష్ కి " నువ్వేమిటిరా అలా చిక్కిపోయావ్ ! ఆఫీసులో అంతా బాగానే ఉందా! పిల్లలు కోడలు అంతా క్షేమమేనా అంటూ ప్రశ్నలు కురిపించే నాన్నకు సమాధానం చెప్పి ఎదురుపడిన అమ్మ సీతమ్మని పలకరించి ఇంటి లోపలికి అడుగు పెట్టాడు రమేష్.

రమేషు సాఫ్ట్వేర్ ఉద్యోగిగా హైదరాబాదులో పనిచేస్తుంటాడు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఒక ఇల్లు కొనుక్కుని భార్య ఇద్దరు పిల్లలతో కాలక్షేపం చేస్తూ ఉంటాడు. ఉదయం 9 గంటలకు ఆఫీసుకు బయలుదేరి రాత్రి మళ్ళీ 10 గంటలకి ఇంటికి చేరుతాడు. రమేష్ కి ఇద్దరు పిల్లలు. పెద్దవాడు పేరు చలపతి. చిన్న దాని పేరు సీత. ఇద్దరు పిల్లలు కాలేజీ చదువుల్లో నే ఉన్నారు.
 చీకు చింతాలేని సంసారం. అయినా ఏదో తెలియని అసంతృప్తి
రోజు ఆ ట్రాఫిక్ లో పడి ఆఫీస్ కి వెళ్లడం, ఆఫీస్ పనులు మీటింగు లు బాగా ఒత్తిడి పెరిగిపోయి ఒక నాలుగు రోజులు తల్లిదండ్రుల దగ్గర ఉందామని బయలుదేరి వచ్చాడు. రోజు ఇంటి పనుల తోటి పిల్లల తోటి విసిగిపోయిన రమేష్ భార్య శారద తన పుట్టింటికి వెళ్ళింది. ఇంక పిల్లలు కాలేజీ విహారయాత్రకి స్నేహితులతో కలిసి వెళ్లారు.

రమేష్ గది లోపలికి వెళ్లి బట్టలు మార్చుకుని స్నానం చేసి వచ్చి సీతమ్మ ఇచ్చిన టిఫిన్ తిని ఆలోచనలో పడ్డాడు .సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా రెండు చేతులా లక్షల్లో జీతం సంపాదిస్తున్న కార్లు సొంత ఇల్లు ఇంటి నిండా ఫర్నిచర్ ఎంత ఉన్నా మనశ్శాంతి లేకుండా ఉంటోంది. తెల్లవారి లేస్తే ఆందోళన. ఏమిటో తెలియని భయం. ఆ నగర జీవనం అలా ఉంది. నిత్యం బిజీగా ఉండే రమేష్ కి ఇన్నాళ్ళకి తన గురించి ,తన కుటుంబం గురించి ఆలోచించుకునే సమయం దొరికింది.

రమేష్ ఒక్కడిదే కాదు ఈ సమస్య. రమేష్ లాంటి వాళ్లు ఎంతోమంది నిత్యజీవితంలో ఎంత డబ్బు సంపాదించుకున్నప్పటికీ ఎవరికి ఉత్సాహం ఉండట్లేదు. డబ్బుంటే అన్ని సమస్యలు తీరిపోతాయి అనుకునే వారు ఒకప్పుడు కానీ ఇప్పుడు డబ్బున్న అనేక సమస్యలు తో బాధపడుతున్నారు రమేష్ లాంటివాళ్ళు.
ఆ పల్లెటూర్లో ఉన్న రెండు ఎకరాలు వ్యవసాయం చేసుకుంటూ ఆయుర్వేద వైద్యం చేసుకుంటూ పదిమందికి సహాయం చేస్తూ పిల్లలందరినీ మంచి చదువులు చదివించి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి వయసు మీద పడినా కుర్రవాడిలా అందరికీ తలలో నాలుకలా నాన్న ఎలా ఉండగలుగుతున్నాడు? ఆయనకి ఏమి బాధలు లేవా. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు. అది ఎలా సాధ్యం? 

ఇంత పొద్దున్నే ఆ ఊరి వాళ్లందరూ నాన్న చుట్టూ చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అదే ఆ నగరంలో ఉదయపు నడకలో చెప్పుకునే గుడ్ మార్నింగ్ తప్పితే ఎవరికి ఖాళీ ఉండదు. పక్కింట్లో ఏమి ప్రమాదం జరిగిన వాళ్ళు చెబితే గాని తెలియదు.

 ఇంకా ఆఫీసులో హోదాకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. పై అధికారి తన గదిలో కూర్చుంటాడు ఎవరితోటి ఎక్కువగా మాట్లాడాడు పని ఉంటే తప్పితే. నోరు విప్పి మాట్లాడే మనిషి ఉండడు. నాన్న అందరిలాగే ఒక సామాన్య రైతు డబ్బులు ఉన్నవాడు కూడా కాదు అయినా చుట్టూ పదిమంది చేరి ఎంతో హాయిగా కబుర్లు చెబుతున్నారు.

పైగా ఈ నగరంలో ఒకళ్ళ విషయాల్లో ఒకళ్ళు జోక్యం కలగజేసుకోరు. ఎవరి పని వారిదే. అందుకే ఎవరికి ఏ సమస్య వచ్చినా సొంతంగా చేసుకోవాల్సిందే. సాయం ఎవరూ రారు.
ఈ పల్లెటూరులో పుట్టి పెరిగిన నాన్న చాలా అదృష్టవంతుడు చుట్టూ పిలిస్తే పలికే మనుషులు చాలామంది ఉంటారు.
చిన్నప్పుడు నాన్న పిల్లలందరినీ సైకిల్ మీద కూర్చోబెట్టుకుని లేదో చంకనెత్తుకుని స్కూలుకు తీసుకెళ్లేవాడు. ఏనాడూ ఏమి చదువుతున్నారని అడగలేదు. అది కాన్వెంట్ స్కూల్ కూడా కాదు. సర్కారు వారి బడి. అయినా పిల్లలందరూ బాగా చదువుకుని ఉద్యోగాలు సంపాదించుకున్నారు. రమేష్ పిల్లలు ఇద్దరినీ మంచి కార్పొరేట్ కాలేజీల్లో బోల్డంత ఫీజు కట్టి ఉన్నత చదువులు చదివిస్తున్న ప్రతి సబ్జెక్ట్ కి ట్యూషన్ పెడుతున్న చదువు మీద అంత శ్రద్ధ చూపరు ఆ పిల్లలు. దానికి తోడు ఫ్రెండ్సు ,ఫ్యాషన్లు బాగా ఎక్కువ. ఎప్పుడు ఇంటికి వస్తారో ఎప్పుడు వెళ్తారో తెలియదు. 

పైగా ఆ కాలేజీల్లో ఈమధ్య డ్రగ్స్ వాడకం ఎక్కువైపోయింది నగరంలో. ఎప్పుడు ఎలాంటి సమస్య తీసుకొస్తారని భయం తల్లిదండ్రులకి. కాలేజీకి మోటార్ సైకిల్ మీద వెడతానంటారు. తెలిసి తెలియని వయస్సు. మోటార్ సైకిల్ ఇవ్వకపోతే ఫ్రెండ్స్ ముందు చిన్నతనం అని ఒకటే గోల పెడతారు నగరంలో ఇలా ఉంది తల్లిదండ్రుల పరిస్థితి

పైగా ఆడపిల్ల తల్లిదండ్రుల భయం చెప్పక్కర్లేదు. చిన్నప్పుడు రమేష్ అక్క లందరూ చీకటి పడే వే ళకి ఇంటికి రాకపోతే సీతమ్మ గుచ్చి గుచ్చి ప్రశ్నలు అడిగేది. అమ్మ తిడుతుంది అనే భయం ఆడపిల్లలకు ఉండేది .అలాంటిది తన కూతురు రాత్రి పది గంటలకు కానీ ఇంటికి చేరటం లేదు.
 ఇవన్నీ తల్లిదండ్రులకు నిజంగా సమస్యలే. ఇంతమంది పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన నాన్న నిజంగా నాకన్న అదృష్టవంతుడు అనుకున్నాడు రమేష్. 

ఈరోజుల్లో ఆడపిల్లలు ఎవరినో తీసుకొచ్చి నేను ప్రేమించాను పెళ్లి చేయమని నెత్తిమీద కూర్చుంటున్నారు. కులగోత్రాలు అడగకూడదు. పోనీ ఆ కాపురాలు అయినా సరిగా చేస్తున్నారంటే ఎప్పుడు పెట్టే బేడా సర్దుకుని ఇంటికి వచ్చేస్తారో అని తల్లిదండ్రులకు భయం వెంటాడుతూనే ఉంది. ఈనాటి పిల్లల్లో ఎవరికి సర్దుకుపోయే గుణంగాని ,సహనం కానీ లేవు.ఏ సినిమా చూసిన ఇటువంటి సంఘటనలే. పిల్లలు వాటినే చూసి నేర్చుకుంటున్నారు. 

ఇంకా ఈ రోజుల్లో పెళ్లిళ్లు అంటే రూపాయలతోటే పని. డబ్బంతా ఆడంబరాలకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. అందమైన కళ్యాణ మండపం , నలభై వెరైటీలతో విందు భోజనం, ఫోటోలు వీడియోలు ,ప్రీ వెడ్డింగ్ షూట్ లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్ లు, ఖరీదైన బట్టలు , ఆభరణాలు,ఒకటేమిటి సొమ్మంతా మంచినీళ్లలా ఖర్చు చేస్తున్నారు.  

ఆ రోజుల్లో ఇంటి ముందు తాటాకు పందిరి వేసి ఎంతో మర్యాదగా అతిధులందరినీ ఆహ్వానించి ఉన్నంతలో మంచి భోజనం పెట్టి గౌరవంగా తన ఆర్థిక స్థితికి తగ్గట్టు కూతుర్ల పెళ్లిళ్లు చేసిన నాన్నను చూస్తుంటే రమేష్ కి చాలా ఈర్ష్యగా అనిపించింది.

గడిచిపోయిన కాలమంతా మంచి కాలమే. ఆ కాలంలో నాన్న లాంటివాళ్ళు ఇటువంటి సమస్యలేవి లేకుండా గట్టెక్కిపోయారు.

పిల్లలందరూ మంచి ఆర్థిక స్థితి మంతులు అయినప్పటికీ నాన్నలో ఏమి మార్పు రాలేదు. ఇప్పటికీ ఆ పాత కాలం నాటి సైకిల్ మీద ఊరంతా తిరుగుతూ ఉంటాడు. అవసరమైతే ఎంత దూరమైనా నడుచుకుంటూ వెళ్లిపోతాడు. ఇప్పుడు తన పరిస్థితి అలా లేదు. మొదట్లో మోటార్ సైకిల్ మీద ఆఫీస్ కి వెళ్లి తర్వాత నాలుగు చక్రాల వాహనం తర్వాత పిల్లలిద్దరికీ చెరో మోటార్ సైకిల్. ఈ రోజుల్లో ఎవరి వాహనo వాళ్లకు లేకపోతే గడవని రోజులు. పైగా పెట్రోల్ ఖర్చులు.  

అప్పటి రోజుల్లో నాన్న సైకిల్ కూడా కొనిపెట్టలేని స్థితిలో ఉన్నప్పటికీ మారు మాట్లాడకుండా రోజులు గడుపుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ కాలం పిల్లలతో అలా కుదరటం లేదు. ఇవన్నీ అనవసరమైన ఒత్తిళ్లు తల్లిదండ్రులకి. 

పిల్లల భవిష్యత్తు బాగుంటుందని లక్షలు ఖర్చుపెట్టి అప్పులు చేసి విదేశాలకు పంపించిన అక్కడికి చేరిన తర్వాత కాలమాన పరిస్థితులను బట్టి సరైన ఉద్యోగాలు రాక పిల్లలు బాధపడుతుంటే తల్లిదండ్రులు ఇక్కడ ఆర్థికంగా నలిగిపోతూ దిక్కుతోచని స్థితిలో ఉండిపోతున్నారు.
 ఆ రోజుల్లో చదువు తప్పితే వేరే వ్యాపకం ఏమీ లేకుండా దొరికిన ఉద్యోగంలో జాయిన్ అయిపోయి ఆ తదుపరి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నాలు చేసి విజయం సాధించిన పిల్లలను కన్న ఆ తండ్రి ఎంత అదృష్టవంతుడు అనుకున్నాడు రమేష్. 

ఆ రోజుల్లో బంధువుల యోగక్షేమాలు పోస్టల్ డిపార్ట్మెంట్ వారు, దేశ విదేశాల వార్తలు రేడియోలు మోసుకొచ్చేవి.. ప్రపంచంలో సాంకేతిక విజ్ఞానం బాగా పెరిగిన తర్వాత సోషల్ మీడియా, మొబైల్ ఫోన్లు సమాచారాన్ని క్షణాల్లో అందిస్తున్నాయి. ఇప్పుడు చేతిలో ఏ విద్యార్థి పుస్తకాలు పట్టుకోవడం లేదు. జేబులో మొబైల్ ఫోన్ లేకుండా ఏ విద్యార్థి లేడు. ఎప్పుడు ఆ మాయా లోకంలోనే ఉంటాడు. రకరకాల రంగుల ప్రపంచాన్ని ఉచితంగా చూపించే ఈ మొబైల్ ఫోన్లు యువతని ఎక్కడికి తీసుకెళ్తాయో అని ఈనాటి తల్లిదండ్రుల భయం. ఇది ఒక ముఖ్యమైన సామాజిక సమస్య. పైగా నెల తిరిగేటప్పటికీ బోల్డంత ఖర్చు. 

ఒకప్పుడు ఏదో ఒక పండగలకు పుట్టినరోజులకి బట్టలు కొనేవారు. ఇప్పుడు సమయం సందర్భం లేదు. బజార్లో నడిచి వెళుతూ బాగుందని అనిపిస్తే ఏసరుకైనా కొని ఇంటికి తెచ్చుకోవడం అలవాటైపోయింది ఈ కాలం వాళ్లకి. జేబులో రూపాయిలు ఉండక్కర్లేదు. అప్పు ఇచ్చే కార్డు ఉంది కదా. నెల ఆఖరికి కట్టుకునే నాన్న ఉన్నాడు. ఇవన్నీ ఈనాటి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయి. 
ఒక కుటుంబానికి తల్లి తండ్రి రెండు రథచక్రాల లాంటి వాళ్ళు. ఇద్దరూ సమర్థవంతంగా బాధ్యతాయుతంగా పనిచేసి ఆ రధాన్ని గోతిలో పడకుండా ఎత్తు పల్లాలు చూసుకుంటూ ముందుకు నడిపించిన ఆ తరం వాళ్లు నిజంగా చాలా ముందు చూపు ఉన్న వాళ్ళు. 

కుటుంబానికి మంచి పౌష్టికాహారం అందిస్తూ పిల్లలందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకుంటూ మంచి నడవడిక నేర్పుతూ శుచి శుభ్రతలు నేర్పే తల్లి, పిల్లలందరినీ క్రమశిక్షణలో ఉంచుకుంటూ మంచి విద్యాబుద్ధులు నేర్పించి కుటుంబానికి ఆర్థికంగా రక్షణ కల్పించి ముందుకు నడిపించే తండ్రి ఉండే ఆ రోజులు నిజంగా మంచి రోజులు. ఆ కాలం తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులు. వాళ్లకి ఆ కాలంలో డబ్బు ఒకటే సమస్యగా ఉండేది. ఇప్పుడు డబ్బు పుష్కలంగా ఉన్న తల్లిదండ్రులకి చుట్టూ రకరకాల సమస్యలు. దానికి తోడు కుటుంబాలు గౌరవంగా నడుస్తాయనే గ్యారెంటీ కూడా లేదు.

ఏమిటిరా అలా ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నావు? అందరూ బాగానే ఉన్నారు కదా !అంటూ తల్లి అడిగిన ప్రశ్నకి తనకు వచ్చిన ఆలోచనల్ని భయాల్ని తల్లిదండ్రులు ఇద్దరికీ చెప్పుకుంటూ వచ్చాడు. 

మీరు అంత సంతోషంగా ఎలా బ్రతకగలిగారు రోజుల్లో ?అని అడిగిన రమేష్ ప్రశ్నకి తల్లి తండ్రి నవ్వుతూ మేము ఎప్పుడూ ఇతరులతోటి పోల్చుకోలేదురా!
 అంతేకాదు ఉన్నంతలో సర్దుకుపోతూ పిల్లల్ని గౌరవంగా అప్పులు చేయకుండా పెంచడానికి శాయ శ క్తుల ప్రయత్నం చేశాం. మేము ఎప్పుడూ గొప్పలకి పోలేదు. క్రమశిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఆడపిల్లల్ని విచ్చలవిడిగా వదిలేయలేదు. మీరు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు కానీ కుటుంబ బాధ్యతలు పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపటం లేదు. కుటుంబం అనేదాన్ని నాలుగు మూల నుంచి కాపాడుకుంటూ ఉండాలి. అనుక్షణo పిల్లల్ని కాపలాకాస్తు ఉండాలి. పిల్లల ప్రవర్తన గమనించాలి. ఇది తప్పనిసరి రోజుల్లో. మీకు తెల్లారి లేస్తే డబ్బు లేకుండా గడవదు. ఆ డబ్బు వెంటే పరిగెడుతున్నారు. పరిగెట్టి పరిగెట్టి అలిసిపోయి మిగతా బాధ్యతలను విస్మరిస్తున్నారు. మీరు ఎంత పరిగెట్టినా అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా మీకు బాధ్యతలు తీరటం లేదు. సకాలంలో పిల్లలకు పెళ్లిళ్లు చేయలేకపోతున్నారు. నాన్నకు యాభై ఏళ్లు వచ్చేటప్పటికి మనవలు కూడా పుట్టేశారు అంటూ తల్లి తండ్రి చెప్పిన మాటల్లో అర్థం గ్రహించాడు రమేష్.

ఏది ఏమైనా ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని డిగ్రీలు సంపాదించినా ఎంత విజ్ఞానం సంపాదించిన ఆ తరం వాళ్లు ఎప్పుడూ అదృష్టవంతులే అనుకున్నాడు రమేష్.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279.