ఉయ్యాల.
రాత్రి 8.30 గంటలయింది.
కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్
రాజమండ్రి రైల్వే స్టేషన్ లో వచ్చే ఆగింది. అంతవరకు ఎదుటి సీట్లో కూర్చున్న ఒక యువతి వడిలో నిద్రపోతున్న పసిబిడ్డ లేచి
ఏడవడం మొదలెట్టింది.
ఆకలవుతుందేమోనని అనుకుని ఆ యువతి అందుకు తగిన ప్రయత్నాలు చేసి ఇంకా పిల్ల గుక్క పట్టి ఏడవడం మొదలుపెడితే ఆ పక్కన కూర్చున్న పెద్దావిడ తల్లి అనుకుంటా ఉయ్యాల కోసం ఏడుస్తోందేమో అని అంటూ ఇప్పుడు ఎలాగే బాబు! వీడికి ఉయ్యాల బాగా అలవాటైపోయింది అంటూ భుజం మీద వేసుకుని జో కొట్టడం ప్రారంభించింది. ఆ పసిబిడ్డ రైలు కుదుపులకి అమ్మమ్మ ప్రయత్నాలకి ఏమి మోసపోలేదు. ఏడుపు ఆపలేదు.
పాపం ఆ ఇద్దరు ఆడవాళ్లు దిక్కుతోచక ఆ పిల్లవాడిని నిద్రపుచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. పై బెర్త్ మీద పడుకున్న వ్యక్తి ఆ పెద్దావిడకి భర్తనుకుంటా లేచి తిట్టడం ప్రారంభించాడు. వాడికి ఉయ్యాల అలవాటు చేయొద్దు అంటే వినలేదు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నామో అన్నాడు .
దానికి ఆ ముసలాడికి కోపం వచ్చి మీకు నన్ను తిట్టడానికి ఒక సాకు దొరికింది. పసిపిల్లలను ఉయ్యాల్లో కాకుండా మంచం మీద పడుకోబెట్టి పెంచుతాం ఏంటి! మీరేమో ఇరవై నాలుగు గంటలు ఆ ఉయ్యాల బల్ల పట్టుకుని వదలరు. మళ్లీ వాడిని అంటున్నారు. వాడిని నేను ఎత్తుకొని తిరుగుతాను కదా మీకు ఎందుకు మీరు పడుకోండి. అసలు విషయం అది కాదు మీకు ఇంత వయసు వచ్చినా ఉయ్యాల బల్ల మీద తప్ప ఇంకెక్కడ పడుకోరు. మీకు నిద్ర పట్టట్లేదు. తప్పక మాతోపాటు వచ్చారు అంది. ఆ తాతగారు మళ్లీ మాట్లాడలేదు.
పసివాడి మటుకు కొంచెం సేపు ఊరుకొని మళ్ళీ ఏడుపు ప్రారంభించాడు. పాపం ఆ ఇద్దరు ఆడవాళ్లు ఏం చేయాలో తోచక బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. వారికి దగ్గరలో సైడ్ లోయర్ బెర్త్ మీద కూర్చున్న నేను మీరు ఎక్కడ వరకు వెళ్లాల్లి! అని అడిగాను పెద్దావిడని. మేము వరంగల్ వరకు అని చెప్పింది.మా అమ్మాయిని అత్తవారింటికి తీసుకెళ్తున్నాం. పురుడు వచ్చి ఐదు నెలలు అయింది అంటూ చెప్పుకు వచ్చింది. అదంతా బాగానే ఉంది. వరంగల్ అంటే ఇంచుమించుగా తెల్లవారుజాము నాలుగు గంటల అవుతుందేమో అంతవరకు ఈ పసివాడు పడుకుంటాడా లేదంటే ఎలాగా రా బాబు? అని భయం పట్టుకుంది.
ఇంతలో రైలు కొవ్వూరు స్టేషన్లో ఆగింది. ప్రయాణికులు అందరూ తెచ్చుకున్న పలహారాలు కొనుక్కున్న తినుబండారాలతో ఆత్మరాముని సంతృప్తి పరిచి పక్కలు పరిచి ఎవరి స్థానాల్లో వాళ్ళు పడుకున్నారు. రైలంతా నిశ్శబ్దం ఆవరించింది. పసివాడు మటుకు తన శబ్దాన్ని ఆపలేదు. కొన్ని సందర్భాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పగటి ప్రయాణం చికాకు అని రాత్రి అయితే సుఖంగా పడుకోవచ్చని రిజర్వేషన్ చేయించుకుంటాం కదా. అందులో నేను ఒక కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్ ని నిరంతరం ప్రయాణాలు చేస్తుండడంతో ఒళ్ళు అలిసిపోయి ఉంటుంది. ఇప్పుడేం చేయడం!
అలా ఆలోచిస్తుంటే మా బెర్తుకి నాలుగు బెర్తు లు అవతల నుంచి ఒక పెద్దావిడ లేచి వచ్చి ఎందుకమ్మా ఏడుస్తున్నాడు అని అడుగుతూ ఒళ్ళు ముట్టుకు చూసింది. ఉయ్యాలకోసమని! సమాధానం చెప్పిందా యువతి. ఆ తర్వాత ఇద్దరు వయసు మళ్లీన వాళ్ళు ఏదో ఆలోచించి పెట్టిలోంచి ఒక చీరతో ఉయ్యాల వేసి చంటి పిల్లాడిని పడుకోబెట్టారు. ఆ తర్వాత వాడు సింహాసనం ఎక్కిన రాజుగారి లాగా మొహం ప్రశాంతంగా పెట్టుకుని హాయిగా నిద్రపోయాడు.
అబ్బా ఉయ్యాలలో ఇంత మహత్యం ఉందా ! నాకు తెలియని విషయమేమీ కాదు కదా. మరిచిపోయాను అంతే. ఒక్కసారి ఆ పసివాడు నా చిన్నతనంలోకి తీసుకెళ్లిపోయాడు.
చిన్నప్పుడు పెరట్లో నారింజ చెట్టు కొమ్మకి తాడుతో ఉయ్యాల వేసి ఊగుతుంటే గాల్లో తేలిపోతున్నట్టు ఉండేది. ఆకాశం అంచులు అందుకున్నట్లు ఉండేది. ఏదో తెలియని మధురానుభూతి. ఉత్సాహం. బాల్యంలో ఉయ్యాలాట ఒక అందమైన జ్ఞాపకం. మొదట్లో స్పీడుగా ఊగడం అంటే భయంగా అనిపించినా క్రమేపి అలవాటైపోయి అది ఒక సాహస కార్యములా అనిపించేది.
తాళ్లు కట్టి చెట్టుకొమ్మలకి వేసుకునే ఉయ్యాల, పసిపిల్లలకి చీరలతో ఉయ్యాల, బహుళ జాతి కంపెనీల ఉయ్యాల, అన్నిటికన్నా మించి అద్భుతమైన నగిషీ లతో గొలుసులతో వేలాడే ఉయ్యాల, అందమైన టేకు చెక్కతో తయారు చేయించుకున్న ఉయ్యాల బల్ల, రబ్బరు టైర్ కి తాడు కట్టి చెట్టుకొమ్మకు వేలాడ తీసుకున్న ఉయ్యాల ఇలా రకరకాల ఉయ్యాల తో తీయటి అనుభవాలు అందరికీ ఉంటాయి. మధురానుభూతులే కాదు చేదు అనుభవాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటి అంటే చెట్టు కొమ్మకు వేలాడదీసిన తాడు పుటుక్కున తెగిపోవడం కానీ కొమ్మ విరిగిపోవడం గాని జరిగితే అవి చేదు అనుభవాలే కదా! ఏది ఏమైనా ఉయ్యాల అంటే అన్ని వయసుల వాళ్ళకి ఇష్టమే.
ఎవరింటికైనా వెళ్ళినప్పుడు హాలులో వేలాడే అందమైన ఉయ్యాల బల్ల ఊగకుండా ఉండలేం. మన మనుషుల మాట అలా ఉంచండి పరమాత్మకే ఉయ్యాల సేవంటే చాలా ఇష్టం. ఇంచుమించుగా ఈ డోలోత్సవాన్ని ప్రతిరోజు మనం టీవీలలో చూస్తూనే ఉంటాం. మరి ఆ దేవుడితో సమానమైన పసిబిడ్డలకు కూడా ఉయ్యాల పండగ చేస్తాం. బిడ్డ పుట్టిన 21వ రోజున పిల్లలను ఉయ్యాల్లో వేసి పండగ చేసుకుంటాం. అసలు భూమ్మీద పడిన వెంటనే ఆ పసి పిల్లలు ఆసుపత్రిలో ముందుగా ఊయలెక్కి నిద్రపోతాడు. అక్కడి నుంచి మొదలవుతుంది ఉయ్యాలతో అనుబంధం.
అలా అమ్మ బట్ట ఉయ్యాల, నాన్న కొనిచ్చిన కంపెనీ ఉయ్యాల, తాత ఇంట్లోని పాత తరం నాటి అందమైన ఉయ్యాలతో బాల్యమంతా గడిపేస్తాడు. నడక వచ్చిన తర్వాత పార్కులకు పరిగెత్తి పార్కుల్లో ఉయ్యాలతో ఆటలు మొదలుపెడతాడు. కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత ఉయ్యాల బల్ల ఎక్కి ఊగుతూ దాని మీదే నిద్రపోతాడు. జారి పడిపోతాడని అమ్మకు భయం. చిన్నపిల్లలకి సరదా అని అనుకోవచ్చు కానీ తాతయ్య కూడా పగలు మనస్సు తీరేవరకు ఊగి రాత్రిపూట ఆనందంగా పడుకోవడం చూసి పెద్దవాళ్ళను కూడా ఉయ్యాల దగ్గరకు లాగేస్తుంది అని అనుకోక తప్పదు. బంగారం రంగులో మెరిసిపోయే ఊయలతో (cane) అనుభవాలన్నీ బంగారమే.
పిల్లల్ని పెద్దల్ని మురిపించే ఉయ్యాల పండగలలోకూడా ప్రధాన పాత్ర కూడా వహిస్తుంది. అట్లతద్ది పండగ నాడు ఆడపిల్లలకి ఉయ్యాలాట మధుర అనుభవం.
ఉయ్యాల ఊగ ని బాల్యం కోల్పోయిన మధుర జ్ఞాపకం. ఆఖరికి మన మనసును కూడా ఉయ్యాల తో పోలుస్తారు. ఉయ్యాల లాగే అటు ఇటు ఊగిసలాడుతోంది అంటారు. ఉయ్యాలలో పడుకోవడం అలవాటైన పసిబిడ్డ ఉయ్యాల లేకపోతే చుక్కలు చూపిస్తాడు. ఉయ్యాల ఊపడం అమ్మకు కూడా ఒక రకమైన వ్యాయామం. ఆఖరికి పెళ్లిలో ఉయ్యాలతో ఒక వేడుక చేస్తారు. ఇరుపక్షాల వారు ఇచ్చిపుచ్చుకునే వాటిలో ఉయ్యాల చీర కూడా ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది.
చలనచిత్రంలో అనేక జోల పాటలు ఉయ్యాల ఊపుతూ చిత్రీకరించారు. బతుకమ్మ పాటలన్నీ చివరన ఉయ్యాలతో ముగుస్తాయి.
ఉయ్యాల పేరుతో వచ్చిన అనేక చలనచిత్రాలు మనసును ఆనంద డోలికల్లో ఊగించేవి .ఇంతటి మధురానుభూతి మిగిల్చిన ఉయ్యాలని ఎలా మర్చిపోగలం. ఏం మాయ చేస్తుందో ఏమో ఉయ్యాల ఊగితే కనురెప్పలు కూడా వాలిపోయేటట్టు చేస్తుంది. ప్రాణం లేని ఉయ్యాలకి నమస్కారం చేసిన తెలీదు. అపురూపంగా చూసుకోవడం తప్ప
ఏమి చేయగలం. ఎన్ని పసి ప్రాణాలను ఆనందంగా నిద్రపుచ్చిందో! అందుకే కృతజ్ఞతా పూర్వకంగా ఈ కథ ఉయ్యాల మీద.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279