Read Narasaiah's story by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • నా కంటే ముందుగా

    నాకంటే ముందుగా!సాయంకాలం నాలుగు గంటలు అయింది. కాకినాడ నగరంలోన...

  • ఉగాది పండుగ

    “ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలుగువార...

  • నరసయ్య కథ

    నరసయ్య కథ.  " నీ కొడుకు నరసయ్య అంతా వాళ్ళ నాన్న పోలిక. ఆ ఒడ్...

  • మనసిచ్చి చూడు - 16

    మనసిచ్చి చూడు.....16ఆ ఫోన్ కళ్యాణ్ నుంచి రావడం మధుకి చాలా భయ...

  • ఉయ్యాల

    ఉయ్యాల.రాత్రి 8.30 గంటలయింది.కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నరసయ్య కథ

నరసయ్య కథ.

  " నీ కొడుకు నరసయ్య అంతా వాళ్ళ నాన్న పోలిక. ఆ ఒడ్డు ఆ పొడుగు అంతా మీ ఆయన పోలికే అంటూ కొడుకు గురించి ఊరి ప్రజలు చెప్తుంటే ఉప్పొంగి పోయేది కావమ్మ. వాడు చేసే అల్లరి గురించి రోజు ఫిర్యాదులు వస్తుంటే తండ్రి లేని బిడ్డ కదా! సరిగా పెంచలేకపోతున్నానేమో అని రోజు మనసులో బాధపడేది నర్సయ్య గురించి. వీడికా చదువు సరిగా రాలేదు. వెనక చూస్తే ఆస్తిపాస్తులు లేవు. వీడి బ్రతుకు ఎలాగ ? అని బాధపడుతూ ఉండేది కొడుకు గురించి కావమ్మ.

ప్రతి ఊర్లో కొంతమంది మంచి మంచి సలహాదారులు ఉంటారు. ఆ ఊర్లోని యువకులకి మంచి మంచి సలహాలిస్తూ వాళ్లని మంచి దారిలో పెట్టడం ఆయనకు హాబీ. అలా అచ్యుతరామయ్య కాళ్లు పట్టుకుంది తన కొడుకు గురించి కావమ్మ. ప్రతి వాళ్లు సలహాలిస్తుంటారు కానీ అవి అమలు చేయడానికి సహాయం చేయరు కానీ ఆ ఊరు హై స్కూల్ హెడ్ మాస్టర్ అచ్యుత రామయ్య మాత్రం సొంత ఖర్చులతో పక్కనున్న టౌన్ కి వెళ్లి అప్లికేషన్ తీసుకొచ్చి నరసయ్యని సైన్యంలోకి పంపడానికి అప్లికేషన్ పెట్టించాడు. 

సహజంగా సైనికుడికి కావలసిన ప్రాథమిక అర్హతలన్నీ నరసయ్యలో ఉండడంతో నరసయ్య సైనికుడు అయిపోయాడు. 

ట్రైనింగ్ పూర్తి చేసుకుని మిలట్రీ డ్రెస్ లో మెరిసిపోతూ ఊర్లోకి అడుగుపెట్టిన నరసయ్యను చూసి ఊరి వారందరూ నరసయ్య ప్రయోజకుడు అయ్యాడని మురిసిపోతుంటే కావమ్మ తన దిగులు మనసులోనే ఉంచుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతుండేది. ఎందుకు ఆ దిగులు ఒక్కగానొక్క కొడుకు ఏడాదికోసారి ఇంటికి వస్తాడా లేదో ముసలి వయసులో తనని చూసే వాళ్ళు ఎవరో! ఇలా బాధపడుతూ ఉండేది. పోనీలే చదువు లేని వాడికి అసలు గవర్నమెంట్ ఉద్యోగం ఎలా వస్తుంది ? అనుకుని మనసును సరిపెట్టుకునేది కావమ్మ. 

పుట్టిన ఊరు తప్ప పక్క టౌన్ కూడా ఎప్పుడు వెళ్ళని నరసయ్యకి కాశ్మీర్ లోయ భయంకరంగా కనబడింది. అందులో ఇరవై నాలుగు గంటలు దేశాన్ని కాపలాకాసే ఉద్యోగం. ఏ మూల నుండి ఏది వచ్చి పడుతుందో తెలియదు. ఎప్పుడు పిరంగులు మోగుతాయో తెలియదు. ఎండ వాన చలిని మర్చిపోయి చేతిలో తుపాకీ పెట్టుకుని సరిహద్దుని అలా కాపలా కాస్తూ ఉండేవాడు నరసయ్య. దేశమాతను రక్షిస్తూ కన్నతల్లిని ఊరికే వదిలేసాడు నరసయ్య ఏం చేస్తాడు పాపం. 

ఇక్కడ కావమ్మ ప్రతినెలా మనీ ఆర్డర్ అందుకుని ఏదో చేతనైంది చేసుకొని ముడిచిపెట్టుకుని గుడిసెలో పడుకునేది. లేచినా లేవకపోయినా అడిగేవాళ్లే లేరు. నెలకోసారి వచ్చే ఉత్తరాన్ని ఆత్రుతగా ఆ అచ్యుత రామయ్య దగ్గరికి తీసుకెళ్లి చదివించుకుంటూ ఉండేది .

" లేదు నరసమ్మ ఈనెల కూడా సెలవు దొరకదుట. గణతంత్ర దినోత్సవానికి భద్రత ఏర్పాట్లు గట్టిగా చేస్తున్నారట అంటూ మాస్టారు చదివిన ఉత్తరంలోని సారాంశం విని మౌనంగా ఉండిపోయింది నరసమ్మ పోనీలే వచ్చే నెలలో మన ఊరు శివరాత్రి జాతరకైనా వస్తాడేమో !అనుకొని ఆశగా ఎదురుచూసింది. శివరాత్రి వెళ్ళిపోయింది నర్సమ్మ ఆశ అడియాసలయ్యింది. అమ్మా ! కుంభమేళాలో మా బెటాలియన్ అంతటిని భద్రత కోసం పంపించారు అని వ్రాసిన జాబు చూసి పోనీలే ఎంత అదృష్టవంతుడివి అయ్యావు! అని ఆనంద పడింది నరసమ్మ. 

వేసవికాలం వచ్చేసింది. పిల్లలందరికీ సెలవులు ఇచ్చేసారు. వీధులన్నీ పిల్లలతో నిండిపోయే యి. ఆ పిల్లలతో ఎప్పుడూ వీధిలో తిరిగే నరసయ్య కనిపిస్తాడేమో అని ఆశగా చూసేది తల్లి మనస్సు. వాడు బాధ్యత గల ఉద్యోగి విద్యార్థి కాదుగా అని సరిపెట్టుకుంది.

కొత్త సంవత్సరం వచ్చేసింది. మళ్లీ కావమ్మ ఆశలు చిగురించే యి. దానికి సమాధానంగా అమ్మ నేను ఇప్పుడు సైన్యం లో ఉన్నాను ఎప్పుడు పడితే అప్పుడు రావడం కుదరదు అందులో కొత్తగా ఉద్యోగo లో చేరాను కదా! అంటూ బుజ్జగించిన కొడుకు పరిస్థితి తెలుసుకుంది. 

కాలం ఎవరి గురించి ఆగదు. మారుతూనే ఉంటుంది అలా మండే ఎండల నుంచి పర్వతాల రాళ్లు విరిగిపడే జోరు వానలను తీసుకొచ్చేసింది. చిన్నప్పటి నుంచి నీకు వర్షంలో తడిస్తే పడదు. తడవకుండా జాగ్రత్తలు తీసుకో. పడిశం పడితే చాలా రోజుల వరకు తగ్గదు అంటూ తను ఉత్తరాల్లో జాగ్రత్తలు చెబుతూ తన ఆందోళనను తెలియజేసింది. 

నా గురించి ఆందోళన పడకు. ఇరవై నాలుగు గంటలు నేను ధరించే యూనిఫారము, శత్రువుల్ని గురించి ఆలోచనతో వేడెక్కిపోయిన నా మెదడు, చుట్టూ భయం భయంగా ఉండే వాతావరణం, ఇరవై నాలుగు గంటలు నా భుజానికి వేలాడే తుపాకి,, రాళ్లు రప్పలు మంచు ని లెక్కపెట్టకుండా నా పాదాలకు రక్షణ ఇచ్చే బూట్లు నా శరీరాన్ని, మనసుని కఠినంగా చేసాయి. కాబట్టి తుఫాను కూడా నన్నేమీ చేయలేదు. వరదల్లోనూ భయంకరమైన తుఫానులోను అందరూ ప్రాణభయంతో ఉంటే మేము నిర్భయంగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను రక్షిస్తాం. కాబట్టి సైన్యంలోకి వచ్చిన తర్వాత నా శరీరం మనసు ,రెండు ఉక్కులా తయారైపోయాయి. లేదంటే ఇన్ని రోజులు నిన్ను చూడకుండా ఎలా ఉండగలను ?అని వచ్చిన సమాధానం చూసి నేను ఒక సైనికుడికి తల్లినని గర్వపడింది కావమ్మ. 

నరసయ్య ఇంకా తన అడ్డాల్లో బిడ్డలా అనుకొని ఇంకా ఏవేవో జాగ్రత్తలు చెబుతుంటే నేను మంచు కొండల పక్కన కాపురం చేస్తున్నాను అమ్మా నేను ఎక్కడున్నానో ప్రభుత్వo వారికే తెలుస్తుంది. ఈ పని ఎంత కష్టమైనా దేశమాతను రక్షిస్తున్నాననే గర్వం నా కలుగుతుంది. జీవితంలో చూడలేని ప్రదేశాలు చూస్తున్నా అనే ఆనందం నాకు ఎప్పుడూ ఉంటుంది. పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్లకే ఉద్యోగాలు లేవు. నాలాంటి వాడికి ఉద్యోగం ఇచ్చి నా కుటుంబం బ్రతకడానికి ఆధారం కల్పించిన ఈ రంగానికి నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. కానీ నాకు ఒక్క బాధ ఈ ముసలి వయసులో నిన్ను చూసుకోలేకపోతున్నాను అనే బాధ నన్ను పీడిస్తూ ఉంటుంది. అలా నెలకొకసారి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి . అప్పుడే ఏడాది దాటిపోయింది నరసయ్యను చూసి. ఊరికి ఎప్పుడు వస్తాడు ఏమిటో? అనుకొని రోజు ఎదురుచూస్తూ ఉండేది.

 వయసు పెరిగేకొద్దీ కావమ్మలో భయం పట్టుకుంది. పెరుగుతున్న వయస్సు కొన్ని బాధ్యతలు తీర్చుకోమని చెప్తూ ఉంటుంది. భయం కూడా పెడుతుంటుంది. అలా తన మీదనున్న బాధ్యత తీరాలంటే నరసయ్య కనీసం రెండు మూడు నెలలైనా ఇక్కడ ఉండాలి. అది ఇప్పట్లో అయ్యేలా కనపడటం లేదు. ఎందుకంటే సరిహద్దులలో పరిస్థితి కొంచెం బాగాలేదు. అంతకంటే నేను చెప్పకూడదు. ఉత్తరాల వ్రాయడం ఆలస్యం అవ్వచ్చు. ఇక్కడ నిత్యం ఏదో మూల కాల్పులు జరుగుతూనే ఉంటాయి.

నువ్వు కంగారు పడకు అని కబురు మో సుకు వచ్చిన ఉత్తరం వచ్చినప్పటి నుంచి కావమ్మలో కంగారు మొదలైంది. అందుకే పెట్టెలోంచి ఒక సంచి తీసుకుని అచ్యుత రామయ్య గారి ఇంటికి వెళ్ళింది కావమ్మ." మొన్ననే కదా ఉత్తరం చదివాను మళ్లీ ఉత్తరం వచ్చిందా అని అడిగారు అచ్యుతరామయ్య కావమ్మను చూడగానే. లేదండి ఈ సంచి దాచండి అంటూ సంచి అందించింది కావమ్మ. ఏమున్నాయి ఇందులో? అంటూ సంచి లోపల నుంచి దస్తావేజులు, కొంత సొమ్ము బయటకు తీశారు అచ్యుతరామయ్య.. ఈ సొమ్ము ఎన్ని రూపాయలు? అని అడిగాడు కావమ్మని అచ్యుతరామయ్య. తెలియదన్నట్లుగా చేతులు ఊపింది.  

అచ్యుతరామయ్య కావమ్మని తీసుకుని ఆ ఊరి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఎకౌంటు ఓపెన్ చేసి అందులో ఈ సొమ్ము జమ చేసి పాస్ బుక్ దస్తావేజులు తన దగ్గరే ఉంచుకున్నాడు. ఆ రోజుల్లో ఒక భయం ఉండేది. సైన్యంలోకి వెళ్ళిన వాళ్ళు అంటే అప్పట్లో యుద్ధంలో లోకి అనేవారు తిరిగి రారు అనే అపనమ్మకం ఉండేది. కావమ్మ ఆ తరానికి చెందినదే.

వయసు పెరిగే కొద్దీ కావమ్మనీ అనారోగ్య సమస్యలు బాధిస్తున్నాయి. దానికి తోడు నరసయ్య మీద బెంగ కూడా ఎక్కువైంది. ఎందుకంటే ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. రోజు పోస్ట్ మాన్ కోసం ఎదురుచూడడం నిరాశగా కూర్చోవడం ఇలా ఉంది కావమ్మ పరిస్థితి .

ఒకరోజు టెలిగ్రామ్ పట్టుకుని వచ్చిన వాడిని చూసి రోజు ఉత్తరాలు తీసుకొచ్చేవాడు ఏమయ్యాడు? అని అడిగింది పాపం. ఎందుకంటే కావమ్మ జీవితంలో టెలిగ్రామ్ రావడం అదే మొదటిసారి. అసలు టెలిగ్రామ్ అంటే ఏమిటో తెలియదు. ఏ పరిస్థితుల్లో ఇస్తారో కూడా తెలియదు. అలాంటిది అది పట్టుకుని మాస్టారు ఇంటికి వెళ్లి మాస్టారు చెప్పిన మాట విని అలా శూన్యంలోకి చూస్తూ ఉండిపోయింది . కన్నీళ్లు కార్చడానికి కూడా ఆమెలో శక్తి లేదు. ఇలా ఉన్న ముసలి దాన్ని ఎలా వదిలేయడం ?అని మాస్టారు ఆలోచించి ఇంటి వెనకాల ఉన్న అవుట్ హౌస్ లోకి కావ మ్మని తీసుకుని వచ్చి మంచి చెడ్డలు చూడసాగాడు. కావమ్మకి ఆ మాస్టారికి ఏమీ రక్తసంబంధం లేదు. కేవలం మానవత్వం తప్పితే. 

అలా కొద్ది రోజులకి ప్రభుత్వ లాంఛనాలతో అధికారులు, మానవత్వంతో ఆ మాస్టారు నరసయ్య ఆఖరి యాత్ర సొంత ఊరిలోనే ఘనంగా చేశారు. కన్నవాళ్ళకి రుణం తీర్చుకోవడం కడుపుని పుట్టిన వాళ్ళ బాధ్యత. కానీ ఒక దేశ సైనికుడికి రుణం తీర్చుకునే అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతం అని మాస్టారు గర్వంగా పొంగిపోతే, ఈ వయసులో ఇది నా కర్మ అని బాధపడుతుండేది కావమ్మ

తుపాకీ గు ళ్ళకు ముక్కలైన నరసయ్య శరీరాన్ని తనివి తీరా దగ్గరకు తీసుకోలేకపోయిన కావమ్మ దేశమాత సేవలో వీర స్వర్గం పొందిన తన బిడ్డని ప్రపంచమంతా గర్వించే ఆ పతాకం హత్తుకుని ఉండడం చాలా గర్వంగా అనిపించింది కావమ్మకి. ఎంత ఏడ్చినా మొత్తుకున్నా జరగవలసింది జరిగిపోతూనే ఉంటుంది. ఆపే శక్తి ఎవరికీ లేదు. కర్మ అన్నిటికన్నా బలీయమైనది.

అలా కాలం తన పని చేసుకుంటూ పోతూనే ఉంది. కావమ్మ బ్రతుకుకి భరోసా ఇచ్చింది ప్రభుత్వం. విధి నిర్వహణలో వీరత్వం ప్రదర్శించి ప్రాణాలు కోల్పోయిన నరసయ్యకి కృతజ్ఞతగా ప్రభుత్వం కావమ్మని ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఆహ్వానించింది. ఉన్న ఊరు తప్ప ఎప్పుడూ బయటకు వెళ్లని కావమ్మ దాని విలువ ఏమిటో తెలియక వెళ్ళనని భీష్మించుకుని కూర్చుంటే దాని విలువ తెలిసిన మాస్టారు కావమ్మని వెంటబెట్టుకుని ఢిల్లీ వెళ్లారు. 

అక్కడ నరసయ్య గురించి ఏదో తెలియని భాషలో చెబుతుంటే అర్థం కానీ కావమ్మ ఎవరో వచ్చి గౌరవంగా స్టేజి మీదకి తీసుకెళ్లి చేతిలో ఏదో కవర్ పెడుతుంటే వాటి వైపు చూడకుండా ఆ స్టేజ్ మీదనున్న పూలమాల వేసినకొడుకు ఫోటో చేసి చూస్తూ ఏడుస్తూ ఉండిపోయి "ఆ ఫోటో నాకు కావాలి అని అడిగింది అది అర్థమైన వాళ్లకి కంటి వెంట కూడా నీళ్లు వచ్చేయి. కన్నతల్లి కోరిక తీర్చింది ప్రభుత్వం 

ఎందుకంటే నరసయ్య యూనిఫారంతో తీయించుకున్న ఒక ఫోటో కూడా తల్లి దగ్గర లేదు.ఈ వార్త అన్ని సోషల్ మీడియాలోనూ వార్తాపత్రికల్లో అందర్నీ ఆకర్షించింది. ఎక్కడో మారుమూల గ్రామం లో ఉండే కావమ్మ ఫోటో ప్రపంచానికి తెలిసింది. అవన్నీ కావమ్మకు ఏమి గర్వంగా అనిపించలేదు కానీ తన కొడుకు ఫోటో మంచం పక్కనే పెట్టుకుని గుండెలో కన్నీళ్లు ఇంకిపోతే అలా చూస్తూ ఉండిపోయింది మర్నాడు మరి లేవలేదు.

ఎవరి జీవితం ఎలా ముగుస్తుందో ఎవరికి తెలుసు. ఆ తర్వాత అచ్యుతరామయ్య మంచి మనసుతో తన బాధ్యత నిర్వర్తించాడు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
9491792279 కాకినాడ