గుడి
ఉదయం 5:00 అయింది.
ప్రతిరోజు లాగే రాఘవచార్యులు గోపాల కృష్ణుడి గుడి తలుపులు తీసి దేవుడి మీదనున్న నిర్మాల్యం తీసి బయట పడేసి శుభ్రంగా తుడుచుకుని ఘంటసాల గారి భగవద్గీత శ్లోకాలు మైకులో వింటూ స్వామి వారికి ఉదయం జరిపే పూజలు యధావిధిగా చేసి తన ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన పాలు పళ్ళు నైవేద్యం పెట్టి ఒక్కసారిగా వీధిలోకి తొంగి చూసాడు. ఎవరైనా భక్తులు వస్తున్నారా అని!. అదేo విచిత్రమో! కార్తీకమాసo పుణ్యదినాలైనప్పటికిపెద్దగా ఎవరూ కనపడలేదు. రోజుకి మహా అయితే పదిమంది వస్తే గొప్ప. అదేమిటి ఇది అతి పురాతన దేవాలయం. ఇంత పుణ్య దినాల్లో కూడా ఎక్కువగా ఎవరు గుడికి రావట్లేదు ఏమిటి ? అనుకుంటూ ప్రతిరోజు మనసులో మధన పడసాగాడు రాఘవాచార్యులు.
రాఘవచార్యులు తెలుగు మాస్టారుగా 35 సంవత్సరాలు సర్వీస్ చేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యి అనువంశికంగా వచ్చిన అర్చకత్వం తీసుకుని తన స్వగ్రామంలో ఉంటూ ప్రభుత్వo ఇచ్చే పెన్షన్తో కాలక్షేపం చేస్తున్నాడు.
దేవుడు మాన్యాలన్ని కాకులు ఎత్తుకుపోయిన రాఘవాచార్యులు గారి వంశస్థులందరూ తమ ఇంటి నుంచి దేవుడికి నైవేద్యం తీసుకువచ్చి పెడుతూ కాలక్షేపం చేసేవారు ఇంతకు ముందు ఉండే అర్చకులు.
ఎందుకంటే ఎవరూ కూడా ఆ గుడి ఆదాయం మీద బతకవలసిన అవసరం లేని వాళ్ళు.ఈ మధ్యనే ఆ గుడిలో కొత్తగా అర్చకుడిగా వచ్చిన రాఘవాచార్యులు గారికి ఆ ఊరి పద్ధతి ఏమిటో చాలా వింతగా అనిపించింది. పోనీఆ ఊర్లో ఇంకా ఏమైనా గుడులు ఉన్నాయంటే పక్క ఊరిలో తప్పితే ఎక్కడ గుడి కనిపించదు. పైగా పురాతనాలయం కావడం వలన గుడి అంత బీటలు వారి వర్షం కూడా కురుస్తోంది. గోడలన్నీ రంగులు లేక వెలిసిపోయినట్లుగా ఉన్నాయి. ప్రహరీ గోడలు పడిపోయి గుడి ఆవరణలో పిచ్చి మొక్కలు లేచిపోయి చూడ్డానికి భయంకరంగా ఉంది. ఎవరో మహానుభావులు కట్టిన గుడి. చుట్టూ పెద్ద స్థలం. ఇవన్నీ చూస్తుంటే రాఘవాచారి గారికి మనసు పీకుతోంది.
పైగా ఊరు గోదావరి పక్కన పల్లెటూరు. ఊర్లో ఉండే గ్రామస్తులు రెండు పార్టీలుగా చీలిపోయి ఐకమత్యం లేకుండా ఎక్కడ అభివృద్ధి కార్యక్రమం అనేది లేదు. పైగా ఎవరో పుణ్యాత్ములు ఇచ్చిన ఆస్తి పెద్దల చేతుల్లో ఉండి దేవుడికి కనీసం ధూప దీపనై వేద్యాలకి కూడా శిస్తు ఇవ్వకుండా స్వాహా చేసే పెద్ద మనుషులు ఉండే ఊరు.
గుడి గురించి ప్రెసిడెంట్ గారికి ఆ విషయం చెబుదామని వెళ్లిన రాఘవాచారికి చేదు అనుభవమే ఎదురైంది. ఆ ఊరి నలుగురు ఐదుగురు పెద్దలను కలిసిన ఏం ఉపయోగం లేకుండా పోయింది. అయినా ఏదో చేయాలి! గుడిని బాగు చేయాలని అనే సంకల్పంతో ఉండేవాడు రాఘవాచారి. పాడుబడిన గుడి ఉంటే ఊరికి అరిష్టమని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పెద్దగా పట్టించుకోలేదు.
ఆదాయం లేని గుడి కదా ప్రభుత్వం వారు కూడా ఇందులో జోక్యం చేసుకోలేదు. ఆ ఊరి ప్రజలకు భక్తి లేదంటే భక్తి లేక కాదు రోజు టీవీలలో చెప్పే ప్రవచనాల్ని క్రమం తప్పకుండా వినేవాళ్లు చాలామంది ఉన్నారు ఆ ఊర్లో. ప్రవచనం వింటున్నారంటే భగవంతుడి మీద విశ్వాసం ఉన్నట్లు కదా. అయితే మరి గుడికి ఎందుకు రావట్లేదు. గుడి పరిస్థితి బాగాలేదు ఆ ఒకటే కారణం అనుకున్నాడు రాఘవాచారి.
ఈ ఏడాది ఎలాగైనా గుడిని బాగు చేయాలని సంకల్పించుకున్నాడు. ఒక్కొక్కసారి మనం తలపెట్టిన సంకల్పానికి దైవం కూడా తోడవుతుంది.
ఎందుకంటే ఆ ఏడాది గోదావరి పుష్కరాలు. ఇంక మూడు నెలల్లోనే ప్రారంభమవుతాయి. ప్రభుత్వం మూడు నెలల ముందు నుంచి గోదావరి ఎక్కడెక్కడ ఉందో అక్కడ స్నానపు ఘాట్లు నిర్మాణం చేయడం ప్రారంభించింది. దానికి తోడు గోదావరి పుష్కరాల గురించి పేపర్లోనూ టీవీల్లోనూ విస్తృత ప్రచారం చేయడం ప్రారంభించింది ప్రభుత్వం. అలాగే ఆ ఊర్లోని గోదావరి దగ్గర స్నానపుఘాట్లు నిర్మాణం చేయడం జరుగుతోంది. రోజు ఐదు నుంచి ఆరు వేలమంది ఆ నదికి వచ్చి స్నానం చేస్తారని ఒక అంచనా. ఇదే మంచి సమయం అనుకున్నాడు రాఘవాచారి. కానీ ఊరి ప్రజలలో చైతన్యం తీసుకురావడం ఎలాగా అని ఆలోచించడం మొదలెట్టాడు.
చివరికి ఒక అద్భుతమైన ఆలోచన రాఘవాచారికే తట్టింది. ఆ రోజే పక్క ఊరి ప్రింటింగ్ ప్రెస్ కి వెళ్లి కరపత్రాలు ముద్రించి ఊరి వారందరికీ పంచిపెట్టాడు. రిక్షాలో మైకు పెట్టి ఊరంతా తిప్పి ప్రచారం మొదలుపెట్టాడు. ఇంతకీ సారాంశం ఏమిటి ఒక ప్రముఖ ప్రవచన కారుడు రామశాస్త్రి గోదావరి పుష్కరాలు సందర్భంగా గుడి ప్రాంగణంలో ప్రవచనం పలానా తేదీ నుంచి పలానా తేదీ వరకు చెబుతారని ఉంది. అంతేకాకుండా రాఘవాచారి కనబడిన వాళ్లందరికీ పలానా రోజున మన గుడిలో ప్రవచనం ఉందని తప్పకుండా రావాలని చెప్పడం ప్రారంభించాడు. ఈ ప్రవచనం ఎవరు పెట్టించారు అని రాఘవాచారి గారిని పదేపదే అందరూ ప్రశ్నించారు కానీ రాఘవాచారి గారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండి పోయేవాడు.
రామ శాస్త్రి మంచి ప్రవచన కారుడు. ప్రజలకి అర్థమయ్యే భాషలో పురాణాల గురించి చెప్తూ ఉంటారు. ఊరి ప్రజలు ఆ ప్రవచనం రోజు టీవీల్లోనూ రేడియోలోనూ వింటున్నారు స్వంత ఊరిలోనే ప్రత్యక్షంగా వినే భాగ్యం కలిగినందుకు చాలా సంతోషపడ్డారు.
రావలసిన మంచి రోజు రానే వచ్చింది.రాఘవాచారి తన సొంత ఖర్చులతో షామియాలలో కుర్చీలు వేదిక సిద్ధం చేసి ఆ ప్రవచన కారుల గురించి ఎదురు చూడ సాగాడు.
అనుకోని విధంగా వేయించిన కుర్చీలు సరిపోలేదు. ప్రేక్షకులు ఎక్కడపడితే అక్కడ నుంచుని ఆ ప్రవచనం వినాలని ఎదురు చూడ సాగారు.ఈ పరిణామానికి రాఘవాచారి గారు చాలా సంతోషపడ్డాడు మనసులో.
ఏమీ హంగు ఆర్భాటం లేకుండా రామశాస్త్రి తన సొంత కారులో ఆ ఊరు వచ్చి దేవుడు దర్శనం చేసుకుని ఒక్కసారి గుడి ప్రాంగణం అంతా పరిశీలనగా చూసి వేదిక మీద ఉపన్యాసం చెప్పడం ప్రారంభించారు.
ముందుగా గోదావరి తీరాన ఉన్న ఆ ఊరి గురించి ఆ ఊరిలో ఉన్న దేవాలయం గురించి ఎక్కడో పురాణాల్లో చదివిన కథలు చెప్పడం ప్రారంభించాడు. ఒక ఊరికి గుడి ఎంత ముఖ్యమో పదేపదే చెబుతూ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి లీలలు చెప్పడం ప్రారంభించాడు. నిజానికి భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ లీలలు వింటూ ఉంటే ఎవరికైనా చాలా ఆనందం కలుగుతుంది. ఆ ప్రవచనం విన్నంతసేపు అందరూ నిశ్శబ్దంగా వింటూ ఏదో తెలియని లోకంలో ఉండిపోయినట్లు ఉండిపోయారు. అలా రెండు రోజులు పాటు సాగిన ప్రసంగంలో ఆఖరి రోజున ఇంతమంది భక్తులు ఉన్న ఈ ఊర్లో గుడి ఇలా ఉండడం ఏమిటి అని ప్రశ్నించారు. గుడి ఇలా ఉంటే సమాజానికి అరిష్టం. గుడి అనేది సమాజ బాధ్యత.
మన ఇల్లు ఇలా ఉంటే మన ఊరుకోగలమా మరి ఈ గుడి పట్ల మీ బాధ్యత ఏమిటో నేను విడమర్చి చెప్పక్కర్లేదు అంటూ ఆవేశంగా ఉపన్యాసం చెప్పి నేను రాబోయే పుష్కరాలకి మీ ఊరిలోనే స్నానం చేయడానికి వస్తాను ఇది నా బాల్య స్నేహితుడు కోరిక ప్రకారం. ఇదిగో నా బాల్య స్నేహితుడు మీ మధ్య ఉన్నాడు అంటూ రాఘవాచారి వైపు చూపించారు. ఒక్కసారి ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.అలా ప్రసంగం ముగించి అందరి దగ్గర సెలవు తీసుకుని రామశాస్త్రి కారు ఎక్కి వెళ్ళిపోయారు. రాఘవాచారి మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది.
మాట అనే పదం రెండక్షరాలే కానీ ఒక్కొక్కరు చెప్పిన మాటలు సమాజం మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా యువతని సమాజ అభివృద్ధి వైపు నడిపించేలా చేస్తాయి. అలా రామ శాస్త్రి గారి మాటలు ఆ ఊరు యువత మీద ఎక్కడా లేని ప్రభావం చూపే యి. ఆలోచనలు రేకెత్తించే యి. నిజమే కదా మన ఊరిలో ఉన్న గుడిని మనమే బాగు చేసుకోవాలని సంకల్పం కలిగి రాఘవాచారి గారి సలహాతో ఆ ఊరి యువకులు ఒక సంఘంగా ఏర్పడి శ్రమదానం చేసి గుడి ప్రాంగణమంతా శుభ్రపరచి అందమైన పూల మొక్కలు నాటారు.
ఊరి పెద్దల అందరి దగ్గర చందాలు వసూలు చేసి ఆ గుడికి మరమ్మత్తులు చేయించి రంగులు వేయించి అప్పుడే కట్టిన దేవాలయంలా తయారు చేశారు. ఎక్కడకక్కడ విద్యుత్ దీపాల కాంతిలో బృందావనంలా మెరిసిపోతూ కనబడుతోంది ఆ ప్రాంగణం.
ఒక్క నెల రోజులు శ్రమదానంతో దేవాలయం రూపురేఖలు మారిపోయాయి. చూస్తే దిష్టి తగిలేటట్లుగా ఉంది. గుడికి మరమ్మత్తులు చేసిన తర్వాత ఎలా ఉందో చూద్దామని ఊరి ప్రజలు ఒక్కొక్కరు గుడికి రావడం ప్రారంభించారు. దర్శనం చేసుకున్న తర్వాత ఆ ప్రాంగణంలో కూర్చుని అబ్బా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది అనుకుని అందమైన దేవాలయం చుట్టూ పూల మొక్కలు ఎత్తైన ధ్వజస్తంభo పెద్ద ప్రహరీ గోడలు మూలగా నుయ్యి గుడి వెనకాల ఆవు దూడ చూసి రాఘవాచారిని ఆ ఊరి యువకుల్ని అభినందించారు.
కాలం ఎవరి గురించి ఆగదు. జరిగిపోతూనే ఉంటుంది. అలా ఆ ఊరి గోదావరికి పుష్కరాలను కూడా తీసుకొచ్చేసింది. చుట్టుపక్కల ఉండే గ్రామాల నుంచి తండోపతండాలుగా ప్రజలు గోదావరి దగ్గర స్నానాలు చేసుకుని గోపాలకృష్ణుడు దర్శనం చేసుకుని గుడి గురించి వర్ణించడం చూసి రాఘవాచారి మనసు పొంగిపోయింది..
రోజు గుడికి వచ్చే భక్తుల సంఖ్య కూడా పెరిగింది. చెప్పిన మాట ప్రకారం రామశాస్త్రి తన భార్యతో కలిసి ఆ ఊరి గోదావరిలో స్నానం చేసి గోపాలకృష్ణుడు గుడి చూసి ఆశ్చర్యపోయాడు. ఊరి ప్రజలందరినీ అభినందించారు.మీ ఊర్లో నేను చెప్పిన ప్రసంగానికి ముఖ్యకారకుడు రాఘవాచారి.మీ ఊరు గురించి మీ గుడి గురించి నా దగ్గర బాధపడిన తర్వాత ఆయన ఆంతర్యం నేను గ్రహించి ఒక బాధ్యత గల పౌరుడిగా నేను ఈ ఊరివాడిని కాకపోయినప్పటికీ నా వంతు సాయం చేయదలిచాను. నా వంతు సాయం ఏమిటో మీకు చెప్పక్కర్లేదు. అందుకే నాలుగు మంచి మాటలు చెప్పి మీ బాధ్యత మీకే వదిలేసా ను.
నా ప్రసంగంలోని ఆంతర్యం గ్రహించి ఈ గ్రామ యువకులులో చైతన్యం కలిగి నడుము కట్టి ఒక రామ దండుగా ఈ బృహత్కార్యానికి పూనుకోవడం శ్రద్ధగా పూర్తి చేయడం నాకు చాలా సంతోషం కలిగించింది. ఏదో రెండు మూడు గంటలు ప్రసంగం చెప్పి నేను వెళ్ళిపోతే అది సమాజానికి ఏ విధంగా ఉపయోగపడిందో నాకు తెలియదు. ఇటువంటి సంఘటన చూసిన తర్వాత నాకు నా ప్రసంగం విలువ ఏమిటో అర్థమయింది. ప్రసంగం వినడం అంటే కాలక్షేపానికి కాదు తెలియని విషయం తెలుసుకోవడం ఎంతో కొంత మార్పు మనలో తెచ్చుకోవడం ఇది ప్రవచనం యొక్క పరమార్థం.
నెలకు ఒకసారైనా ప్రతి ఊర్లోని గుడిని యువకులు శ్రమదానం చేసి శుభ్రపరచాలని చెబుతూ నాకు చాలా సంతోషంగా ఉందంటూ రామశాస్త్రి అందరి దగ్గర సెలవు తీసుకుని కారు ఎక్కి వెళ్ళిపోయారు. అన్ని దినపత్రికలు ఆ ఊరు గుడి గురించి ఆ ఊరి గురించి గొప్పగా వ్రాశాయి. ఉత్సాహం కలిగిన యువకులు వీడియోలో యూట్యూబ్ లో అప్లోడ్ చేసి మరింత మంది భక్తుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. గోదావరి తీరం అంతా పుష్కరాల పుణ్యమా అని అందంగా తయారయింది. ఇదంతా పరమాత్ముడు లీల అని రాఘవాచారి ఎప్పటిలాగే తన విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ ఆనందంగా జీవితం గడపసాగాడు
రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279