Read Walking God by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • నడిచే దేవుడు

    నడిచే దేవుడుఉదయం 11 గంటలు అయింది బ్యాంక్ అంతా రద్దీగా ఉంది....

  • రెండో భార్య - 2

    రెండో భార్య-2              ఒక మద్యతరగతి అమ్మాయి తన ప్రమేయం ల...

  • మన్నించు - 3

    రోజులు మారేకొద్ది ఇష్టాలు మారిపోతుంటాయి. చిన్నప్పుడు ఇష్టం అ...

  • తరువు కోసం తనువు

    తరువు కోసం తనువుఒరేయ్ రామయ్య నువ్వు గుడిలో నాటిన మామిడి మొక్...

  • ది గోస్ట్ స్టోరీ

     దెయ్యం   భయానకం   భయానకంగా   అర్ధరాత్రి ప్రతి అర్ధరాత్రి కు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నడిచే దేవుడు

నడిచే దేవుడు

ఉదయం 11 గంటలు అయింది 

బ్యాంక్ అంతా రద్దీగా ఉంది. పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఒక కుగ్రామంలో ఉన్న ప్రముఖ జాతీయ బ్యాంకు శాఖ అది. ఇంత మారుమూల గ్రామంలో కూడా బ్యాంకు పెట్టారా! అని ఆశ్చర్యపోతారు ఎవరైనా చూస్తే. ఖాతాదారులు ఎవరు బయట నుంచి రారు. అంతా ఆ గ్రామానికి చుట్టుపక్కల ఉండేవాళ్లే. అయితే ఆ గ్రామం ఆర్థికంగా చాలా బలమైన గ్రామం ఆ జిల్లాలో.

 ప్రభుత్వం వారి పథకాలకి అనుగుణంగా బ్యాంకులు కూడా అతి సామాన్యులకు కూడా ఖాతాలు ఇవ్వడంతో దేశంలో ఏ బ్యాంకుకైనా విపరీతమైన రద్దీ పెరిగింది. ముఖ్యంగా డ్వాక్రా గ్రూపు మహిళలతో బ్యాంకులో ఏవి ఖాళీ ఉండటం లేదు. అలాగే ఆ ఊరు బ్యాంకు కూడా. 

ఇంతలో ఒక తెల్ల లుంగీ పంచి పట్టుకుని పైన షర్టు వేసుకొని నుదురుతున్న బొట్టు పెట్టుకుని చేతిలో బ్యాంకు పాసుబుక్ పట్టుకుని హడావుడిగా వచ్చిన వ్యక్తిని తన గదిలోంచి సీట్లో కూర్చున్న మేనేజర్ రాఘవరావు సబ్ స్టాఫ్ ను పిలిచి ఆ వ్యక్తిని లోపలికి తీసుకురమ్మన్నాడు. ఇంతలో ఎదురు గుండా కూర్చున్న అంతే వయసు గల వ్యక్తి అదే బ్రాంచ్ కి కొత్తగా మేనేజర్ గా ఛార్జ్ తీసుకుంటున్న రామారావు 
 " ఎవరండీ ఆయన అని అడిగాడు రాఘవరావుని. మీకు పరిచయం చేద్దామని పిలిపించాను. చాలా మంచి వ్యక్తి. మన బ్రాంచ్ కి కావాల్సిన వ్యక్తి. అందరి తోటి చాలా స్నేహంగా ఉంటాడు. ఒకరకంగా మన ఉద్యోగుల పాలిట శ్రేయోభిలాషి. డిపాజిట్లు బాగా ఉన్నాయా! అని అడిగాడు కొత్తగా వచ్చిన మేనేజర్. డిపాజిట్లు సంగతి అలా ఉంచండి.

 ఈ రోజుల్లో అందరూ బ్యాంకు వాళ్ళు అంటే తిడుతున్నారు. పనులు సరిగా చేయరని బ్యాంకులో ఎక్కువగా లేట్ అవుతుందని ఇలా రకరకాలుగా కంప్లైంట్ ఇస్తారు. ఈయన ఏనాడు కంప్లైంట్ ఇవ్వడం గాని పరుషంగా మాట్లాడడం గాని చేయలేదు. పైగా మన ఉద్యోగులు అంటే చాలా అభిమానం. అందర్నీ పలకరిస్తూ ఉంటాడు. దానికి తోడు ఎవరికి ఏమి అనారోగ్యం వచ్చిన వైద్యం చేయడమే కాదు తన వల్ల కాకపోతే తణుకు తీసుకెళ్లి వైద్యం చేయిస్తూ ఉంటారు. ఆయనది అంతా సేవాభావం. భగవంతుడి మీద నమ్మకం. 

ఒక బ్యాంకు మేనేజర్ సాధారణంగా డిపాజిట్లు ఉన్న వాళ్ల గురించి బాగా చెబుతుంటారు. కానీ డిపాజిట్లు లేని వ్యక్తి గురించి కూడా ఇంత బాగా చెబుతున్నారంటే ఆయన ఈ ఊరిలో ప్రముఖ వ్యక్తి అనితెలుస్తోంది అనుకున్నాడు కొత్తగా వచ్చిన బ్రాంచ్ మేనేజర్ రామారావు. 

ఇంతలో ఆ పెద్దాయనని వెంటబెట్టుకుని వచ్చాడు సబ్ స్టాప్ సుబ్రమణ్యం. రండి అంటూ ఆయన్ని చూస్తూనే సాదరంగా లోపలికి ఆహ్వానించిన రాఘవరావు ఇదిగోనండీ నా ప్లేస్ లో కొత్తగా వచ్చిన మేనేజర్ గారు పేరు రామారావు. విజయవాడ నుంచి వచ్చారు అని పరిచయ కార్యక్రమాలు పూర్తి చేశాడు. ఆ వచ్చిన పెద్దాయన వెంటనే నా పేరు చిరంజీవి అని పరిచయం చేసుకుని మీరు వచ్చి ఎన్ని రోజులైంది? ఇంకా ఫ్యామిలీని తీసుకురాలేదు అనుకుంటా !మరి భోజనం ఎక్కడ చేస్తున్నారు మా ఊళ్లో హోటల్స్ ఉండవు. తణుకు వెళ్లాలి అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు. లేదండి నేను వచ్చి రెండు రోజులైంది . ఫ్యామిలీని తీసుకురావడానికి ఇంకా రెండు నెలలు పడుతుంది . పిల్లలు చదువులో ఉన్నారు అన్నాడు రామారావు. 

"అయితే మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి భోజనం చేయండి. మీ కుటుంబం వచ్చేవరకు అంటూ ఆహ్వానించాడు. "మీరే మీ మొహమాట పడకండి రామారావు గారు వీరు మన బ్యాంకు కి ఎవరు కొత్తగా వచ్చిన కొంచెం సెటిల్ అయ్యే వరకు వారింట్లోనే భోజనం పెడుతుంటారు. ఇది ఈ బ్రాంచ్ కి ఉన్న గొప్ప వరం అoటు చెప్పుకొచ్చాడు పాత మేనేజర్. అంతవరకు మనసులో ఆందోళన పడుతున్న రామారావు హమ్మయ్య ఒక సమస్య తీరింది. ఇలాంటి పల్లెటూరులో ఒక ఇంటి భోజనం దొరికిందంటే నిజంగా చాలా అదృష్టవంతుడిని అనుకున్నాడు రామారావు. 

పాత మేనేజర్ రాఘవరావుని ఆ రోజే రిలీవ్ చేసేసి రాఘవరావు ఖాళీ చేసిన ఇంట్లోకి రామారావు ప్రవేశించాడు. ఆ పెద్దాయనకి ఎంత చాందస భావాలు ఉన్నప్పటికీ సమాజంలో అందరి తోటి కలిసిమెలిసి ఉండేవాడు. రామారావు ని తన పక్కనే పీటవేసి కూర్చోబెట్టి ఆప్యాయంగా కొసరి కొసరి వడ్డిస్తూ కడుపునిండా ఇంటి భోజనం పెట్టి పంపించేవాడు ప్రతిరోజు. 

ఆ ఇంటి వాతావరణం ఆ ఇల్లాలు చేతి వంట ఆ పెద్దాయన ఆదరాభిమానాలు వల్ల క్రమేపి రామారావు ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. ఇంత మంచి కుటుంబం ఆ ఊర్లో స్నేహితులుగా దొరకడం వల్ల పిల్లలు చదువులో ఉన్నప్పటికీ ప్రతిరోజు స్కూల్ కి పక్కనున్న తణుకుకి రిక్షాలో పంపించేవాడు కానీ ఆ ఊర్లోనే తన కాపురం పెట్టాడు రామారావు. కాలక్రమేణా పెద్దాయన కుటుంబo రామారావు కుటుంబం స్నేహితులయ్యారు. పండగ వచ్చినా పబ్బం వచ్చినా కలిసిమెలిసి చేసుకునేవారు. 

నిజమే బ్యాంకు ఉద్యోగులకి ఎక్కడో మారుమూల పల్లెటూర్లో కొలువు చేయవలసిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఇలాంటి వ్యక్తుల పరిచయం నిజంగా చాలా అదృష్టమని చెప్పాలి. ఎవరు పట్టించుకుంటారు ఇలాంటి కలికాలంలో. అయితే కొంతమంది అతిధి అభ్యాగతులలో దైవం ఉందని అని నమ్ముతారు. అంటే ఎంత విశాలమైన మనసు ఉండాలి. 

నిజానికి ఈ వ్యక్తికి పెద్దాపురం చాoతాడు అంత పేరు ఉన్న అందరూ చిరంజీవి నే పిలుస్తారు . పిలిస్తే పలికే దైవంలా ఆ ఊర్లో ఎవరికి ఒళ్ళు వెచ్చగా ఉన్న , లేదంటే ఇంట్లో వాళ్లకి ఆరోగ్యం బాగా లేకపోయినా వాళ్లు మామూలు మనుషులు అయ్యేవరకు తను నేర్చుకున్న వైద్యం ద్వారా సేవలు చేయడం ఆయన అభిమతం. ఆయనకు సేవలు చేయడం కొత్త కాదు. ఎందుకంటే ఆ కుటుంబంలో చిరంజీవి తల్లిదండ్రులకి పుట్టిన పిల్లలందరూ చిన్నప్పుడే చనిపోగా చిరంజీవి ఒకే ఒక్కడు మిగిలాడు. అందుచేత తన తల్లిదండ్రులకి, పెద్ద తల్లికి, అమ్మమ్మకి అందరికీ ఆఖరి దశలో చిరంజీవి ఒక్కడే దిక్కు అయినాడు . అలా అష్ట కష్టాలు పడి మంచం మీద పడి ఉన్న వాళ్ళందరినీ చంటి బిడ్డలు వలె చూసి తన రుణం తీర్చుకున్నాడు చిరంజీవి.

అలాగే ఆ గ్రామంలో అర్ధరాత్రి అయినా అపరాత్రైన ఈ లోకంలో ఒక ప్రాణిని తీసుకురావడానికి కష్టపడుతున్న తల్లికి వైద్యం చేసి ప్రాణ బిక్ష పెట్టే ఆ వ్యక్తి అంటే ఊర్లో అందరికీ గౌరవం. తన వల్ల కాకపోతే పక్క ఊరికి తీసుకెళ్లిపోయి వైద్యం చేయించి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేయడం ఒక దీక్షగా పెట్టుకున్న వ్యక్తి. సేవాభావమున్న వ్యక్తికి సంపాదన మీద దృష్టి ఉండదు. అలాంటి ఈ భావమున్న వ్యక్తి కి అవసరమైతే జేబులో ఉన్న డబ్బులు తీసి ఖర్చు పెట్టడం కూడా అలవాటు. అలా అతిధి అభ్యాగతు లను ఆదరించడం, ఒక మంచి మనసు గల వైద్యుడిగా ప్రజల గుండెలో చిరంజీవి గా మిగిలిపోయాడు. 
ఒకరోజు బ్యాంకులో జరిగిన సంఘటన రామారావు గుండెలో చిరంజీవి స్థానాన్ని మరింతగా పెంచింది. బ్యాంక్ అంతా రష్ గా ఉంది. ఇద్దరు మహిళలు డబ్బులు తీసుకునే ఫారం పట్టుకుని బ్యాంక్ అంతా కలియ తిరుగుతున్నారు. ఉద్యోగులు ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఆ మహిళలకి చదువు రాకపోవడం మూలంగా అది ఎలాగా నింపాలో వాళ్ళకి తెలియదు. ఎవరిని అడిగినా చేయటం లేదు. 

ఆఖరికి మేనేజర్ రూమ్ లోకి వెళ్లేసరికి అక్కడ కూర్చున్న చిరంజీవి పరిస్థితి గమనించి వెంటనే ఆ ఫారం నింపి వాళ్లకి ఇచ్చాడు. వెంటనే రామారావు చిరంజీవి స్పందనకి కృతజ్ఞతలు తెలియజేసాడు. అప్పుడు చిరంజీవి "చూడండి మేనేజర్ గారు మనం చేసింది చాలా చిన్న సహాయం. కానీ ఆ చదువు రాని వాళ్ళకి అది పెద్ద సహాయం. మీరు చేస్తున్నది బ్యాంకింగ్ కాదు. భరోసా ఇవ్వడం. ప్రజలకు సేవ చేయడం అని సున్నితంగా చెప్పాడు చిరంజీవి. అలా ఒక రోజు కాదు ఎప్పుడు బ్యాంకుకి వెళ్లినా అవసరమైన వారికి ఏదో సహాయం చేసి వస్తూ ఉండేవాడు చిరంజీవి.

తెల్లవారుజామునే నాలుగు గంటలకు లేచి నీళ్ల పొయ్యి వెలిగించి కాల కృత్యాలు తీర్చుకొని ఇష్ట దైవారాధనలో రెండు గంటలసేపు గడిపి తదుపరి తన దినచర్య యధావిధిగా పూర్తి చేసుకుని శరీరానికి సరిపడే అంత సాత్వికాహారం తీసుకుని ఏదో ఆధ్యాత్మికంగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. 

ప్రతిరోజు ఆ ఊరిలో ఉండే శివయ్యను దర్శించడంతోపాటు వీధిలో వచ్చే పోయే వారిని ఆత్మీయంగా పలకరించడం దినచర్యలో భాగం. మనుషుల్లో దేవుడు ఉన్నాడని, మానవసేవే మాధవసేవని అనేది నమ్మకం.

 కడుపున పుట్టిన అయిదుగురు పిల్లలకి పెళ్లిళ్లు పేరంటాలు చేసి మనవులతో హాయిగా కాలక్షేపం చేయవలసిన వయసులో పాపం కుటుంబంలో ఒక అపశృతి. దైవ నిర్ణయం అలా ఉంది అనుకుని బాధపడుతూ ఉండేవాడు. భగవంతుడు పెంచిన బాధ్యతలను యధాశక్తిగా గట్టెక్కించడానికి కృషి చేస్తూ ఉండేవాడు.  

వయస్సు రీత్యా వచ్చిన అనారోగ్యం, మనసులోని దిగులు ఆంజనేయస్వామి మీద ఉన్న అపారమైన నమ్మకం విచిత్రంగా హనుమజ్జయంతి రోజున ఈ లోకం విడిచి వెళ్లిపోయారు చిరంజీవి. సునాయాస మరణం ఎవరికో కానీ ఇటువంటి మరణం రాదని ఆ ఊరి ప్రజలు ఎంతో బాధపడ్డారు.

ఆ ఊరంతా మూగబోయింది.పచ్చగా ఉండే చెట్టు పలకరింపు లేక తెల్ల ముఖం వేసింది.ఆప్యాయంగా నిమిరే చేతులు లేక
గోడలన్నీ నాచుపెట్టి పిల్లలనుభయపెడుతున్నాయి.
ఉదయాస్తమానాలు నీళ్ల పొయ్యి లోభగభగ మండే అగ్నిహోత్రం చల్లబడిపోయి మార్జాలాలకు నివాసంగా మారిపోయింది.
నీళ్ల గాబు మురికి పట్టి అటకెక్కి కూర్చుంది.

అర్ధరాత్రి అయినా అపరాత్రి అయిన అమ్మా నొప్పి అని ఎవరైనా అరిస్తే ఆదరించే వైద్యుడు లేక రోగి బాధ
అరణ్య రోదనమే అయ్యింది.యజమాని లేక కాలం దాటిన మందులన్నీ మురికి కాలువలో తేలుతున్నాయి. సూదులన్నీ తుప్పు పట్టి చెత్తబుట్టలో చేరాయి.ఊరికి చేరిన ఉన్నత ఉద్యోగిని ఆప్యాయంగా పలకరించి ఆదరించి అన్నం పెట్టే ఆసామి లేక ఉద్యోగి బృందం ఊరు రావాలంటే భయపడుతోంది

దారిన పోయే దానయ్య ముఖం కూడా చిన్న పోయింది.
ఆ వీధిలో పోతుంటే పలకరించే నాథుడు లేక.గుడి తలుపులు తెరవక ముందే శివయ్యను పలకరించే సుబ్రహ్మణ్యస్వామి లేక
పరమేశ్వరుడు పార్వతి వైపు చూస్తూ ఉండిపోయాడు మౌనంగా.

ఆరు నూరైనా నూరు ఆరైనా ఉదయాస్తమానాలు ఆ ఇంట్లో గంట మోగవల్సిందే. దేవునికి నైవేద్యాలు పెట్టవలసిందే. క్రమశిక్షణ కలిగిన జీవితo క్రమం తప్పని పూజా విధానం.
నామధేయం చిరంజీవి ఇహ పర భేదం లేని భక్త జీవి అని ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు 

చిరంజీవికి బంధు కోటి పై ఎనలేని అభిమానం.మనిషికొక ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఆ మనిషిలా ఇంకొక మనిషికి రాదు మానవత్వం.నమ్ముకున్న ఆంజనేయస్వామి తనతో పాటు
రాముని సన్నిధికి చేర్చాడని ఎవరికి తెలుసు.నమ్మకాన్ని వమ్ము చేయకపోవడమే దేవుని లక్షణం అని నమ్మిన చిరంజీవి మరణం ఎంతోమంది గుండెను కలచివేసింది.

"నా జీవితంలో నేను మొదటిసారిగా ఇంతటి సేవాభావంగల వ్యక్తిని మీ ఊర్లోనే చూశాను. ఆయన వల్లే ఈ గ్రామం నాకు ప్రేమగా అనిపించింది. నాలో ఉన్న మనిషి మేలుకొన్నాడు. సాధారణంగా గ్రామాల్లో పనిచేసే ఉద్యోగులకి ప్రజలతో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు పెంచుకోండి ఊరిలో జరిగే జాతరలు వివాహాలకు హాజరుకండి. అందుమూలంగా మనకి ఆ గ్రామంలో ఉండే ప్రజల మనస్తత్వం తెలుస్తుంది. సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. అది మన వ్యాపార అభివృద్ధికి చాలా అవసరమైన విషయమని మా పై అధికారులు చెబుతుంటారు. కానీ చిరంజీవి లాంటి వ్యక్తి ఆయనే వచ్చి మమ్మల్ని మీలో ఒకడిగా చేశారు అని చిరంజీవి సంతాప సభలో కన్నీళ్లు పెట్టుకున్నాడు మేనేజర్ రామారావు.

ఆ ఊరిలో మళ్లీ అటువంటి వ్యక్తి పుడతాడా లేదా అనేది ఒక సందేహం. ఆయన జ్ఞాపకాలు రూపంలో ప్రజల గుండెల్లో నిలిచిపోయాడు. దేవుడిని గుడిలోనే కాకుండా నడిచే మనిషిలో కూడా చూసే ఆ వ్యక్తి చిరంజీవి నిజంగా నడిచే దేవుడు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279