Read Ramanamma by M C V SUBBA RAO in Telugu Motivational Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

రమణమ్మ

రమణమ్మ

తెల్లవారుజామున 5:00 అయింది 

ఆ ఐదుగురు అన్నదమ్ములు గట్టు దిగి వ్యవసాయం చేసే రైతులు కాదు గాని ఆస్తి ఉండి కూలి వాళ్ళని పెట్టి వ్యవసాయం చేస్తూ పశువులను పెంచుకుంటూ ఉండే ఊర్లో ఒక మంచి బ్రాహ్మణ కుటుంబీకులు.   

అలాంటి అన్నదమ్ములు ఉదయమే లేచి పొలాలకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవడం ఒక అలవాటు. ఆరోజు ఎప్పటిలాగే పొలం వెళుతున్న అన్నదమ్ములను చూసి ఆ ఊరి మోతుబరి రైతు వెంకటరెడ్డి ఎదురొచ్చి "ఏవండీ మావయ్య గారు ఈ స్థలం ఇలా వదిలేసారేటండి ?ఇందులో మామిడి మొక్కలు పెంచండి . ఈ మట్టి అందుకు బాగా పనిచేస్తుంది అని చెప్పి సలహా ఇచ్చేవాడు ప్రతిరోజు. 

ఆ అన్నదమ్ములు అందరికీ పొలాన్ని అనుకుని నాలుగు ఎకరాల మెరక ఉండేది. అందులో పిచ్చి మొక్కలు మొలిచిపోయి ఎవరు అందులోకి అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉండేది .

ఆ రైతు చెప్పిన మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదు. మాకు ఇప్పటికీ నలభైఏళ్లు దాటిపోయా యిఅందరికీ ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు ఒకవేళ మామిడి మొక్కలు వేసి అవి కాపు కాసే సమయానికి మనం ఉంటామా ఏమిటి? అనుకునేవారు ఆ అన్నదమ్ములు. 

ఆ అన్నదమ్ముల్లో అందరికంటే పెద్దవాడు పెద్ద సుబ్బారావు. ఆయన యానంలో మన్యం మహాలక్ష్మి వారి సంస్థానంలో పన్ను వసూలు అధికారిగా పనిచేస్తూ ఉండేవాడు. రెండవ ఆయన పేరు గవర్రాజు . ఆయన ఆ ఊరికి పంచాయతీ బోర్డు గుమస్తా గాను మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు చిన్న సుబ్బారావు, కామరాజు, అచ్యుతరామయ్య ఆయుర్వేద వైద్యులు గాను స్థిరపడి ఉమ్మడి కుటుంబంలో కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఐదుగురు అన్నదమ్ముల కన్నతల్లి రవణమ్మ గారు డబ్బైఏళ్ళు దాటినప్పటికీ ఎంతో ఓపిగ్గా అటు ఇటు తిరుగుతూ కోడళ్ళకి ఇంటి పనులు సహాయం చేస్తూ ఉండేది.
అయితే వేసవికాలం వచ్చేటప్పటికల్లా ఆవకాయ కోసం ఎక్కడెక్కడకో తిరిగి కాయ తెచ్చుకోవాల్సి వచ్చింది. అందులోనూ ఉమ్మడి కుటుంబం కదా. చాలా పెద్ద మొత్తంలో ఆవకాయలు పెట్టవలసి వచ్చేది. బోల్డంత డబ్బు ఖర్చు. శ్రమ. అయినప్పటికీ ఊరగాయ లేకపోతే ఆ రోజుల్లో ఎవరికి ముద్ద దిగేది కాదు. ఇంక మామిడిపళ్ళు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. 
ఇంకా రవణమ్మ గారికి మామిడిపండు అంటే చాలా ఇష్టం. వేసవికాలం వెళ్లిపోయే వరకు ప్రతిరోజు మామిడిపండు లేకుండా అన్నం తినేది కాదు . ప్రతి వేసవికాలంలోనూ రవణమ్మ గారు మనకు అంత స్థలం ఉంది . నాలుగు మామిడి మొక్కలు పెంచుకోలేకపోయాము. మీకు దేనికి శ్రద్ధ లేదు రా! అంటూ రోజు సాధిస్తూనే ఉండేది వేసవికాలం అంతా. 

పొలంలో ఆ ఊరి రైతు వెంకటరెడ్డి ,ఇంటిదగ్గర రమణమ్మ పోరు భరించలేక పెద్ద సుబ్బారావుకి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆచరణలో పెట్టి ఆ ఆ స్థలం శుభ్రంగా బాగు చేయించి వర్షాకాలం వచ్చిన తర్వాత బాగా దున్నించి సిద్ధం చేశారు. 

సరే పొలం రెడీ అయింది. రేపు కడియం వెళ్లి మామిడి మొక్కలు తీసుకుని రండి రా !అంటూ తమ్ముళ్లకు చెప్పి పంపించాడు పెద్ద సుబ్బారావు. అప్పట్లో కడియం వెళ్లాలంటే ఎడ్ల బండి మీద వెళ్లడమే. అలా తిప్పలు పడి నలుగురు అన్నదమ్ములు తమ బంధువుల ఇంటికి చీకటి పడే వేళకు చేరుకున్నారు. బంధువులు మర్యాదలు అన్నీ అయిన తర్వాత అసలు విషయం బయటపెట్టారు అన్నదమ్ములు. అవతల వాళ్ళు ఒకటే నవ్వు. ఏమిటి మామిడి తోటలు వేస్తారా ?. వాటిని పెంచడం మీ వల్ల అయ్యే పని కాదు.
 కూలి వాళ్ళని పెట్టి పెంచాలంటే మన జీవితాలు సరిపోవు అంటూ హేళనగా మాట్లాడారు. అయినా వాళ్ల మాటలను లెక్క పెట్టకుండా మామిడి మొక్కల నర్సరీలోకి వెళ్లారు. ఒకటా రెండా సుమారు వందకు పైగా మొక్కలు కావాలి అలా తిరిగి తిరిగి మొక్కలను ఖరీదు చేసేటప్పటికి సాయంకాలం అయ్యింది. ఆ మర్నాడు ఉదయం ఆ మొక్కలన్ని ఎడ్ల బండి మీద వేసుకొని సాయంకాలానికి ఇంటికి చేరుకున్నారు.

ఆ మామిడి మొక్కల్ని చూడగానే ముసలావిడకి ఏనుగు ఎక్కినంత సంబరం వచ్చింది. దేవుడి దయతలిస్తే ఈ మొక్కలన్నీ బతికి బట్ట కడితే బోల్డు మామిడికాయలు మన కుటుంబానికి. మనం ఎవరికైనా కూడా ఇవ్వచ్చు అంటూ హడావుడి చేసేసింది. 

ఒరేయ్ పెద్దోడా నువ్వు నాలుగు రోజులపాటు ఇంటి పట్టు నే ఉండి మన కుర్రాళ్ళ చేత అంటే మందులను నూరడానికి పెట్టుకున్న నారాయుడు పశువుల కోసం పెట్టుకున్న నాగన్న పొలం చూడడానికి పెట్టుకున్న బూరిగాడిచేత మొక్కలన్ని నాటించండి అoటు చెప్పింది. తల్లి అంటే చాలా భయం భక్తి ఆ అన్నదమ్ములు అందరికీ.

అయితే ఈ నాలుగు ఎకరాల మెరక పొలం కూడా ఆ అన్నదమ్ములు ఉండే ఇంటికి చాలా దగ్గరలోనే ఉండేది. అప్పట్లో ఇంట్లో మలవిసర్జనశాలలు ఉండేవి కాదు. అందరూ చింత చెట్ల దగ్గరికి చెంబులు పుచ్చుకుని వెళ్లేవారు. ఆ చింత చెట్లు దగ్గరికి వెళ్లాలంటే ఈ మెరక దాటుకుంటూ నే వెళ్లాలి. 

అలా మర్నాడు ఉదయమే మామిడి మొక్కలన్ని పాలేరుల చేత నాటించడం మొదలు పెట్టారు అన్నదమ్ములు. అన్ని వరుసగా నాటకండి. ఈ స్థలాన్ని ఐదు భాగాలుగా చేసి అన్ని రకాల మామిడి మొక్కలు అన్ని భాగాల్లోనూ వచ్చేటట్టుగా నాటండి అని సలహా ఇచ్చింది రవణమ్మ. ఆవిడది చాలా ముందుచూపు ఎక్కువ. ఆ మామిడి మొక్కలన్ని లేత ఆకులతో పొట్టిగా ఉండి చూడడానికి ముచ్చటగా ఉండేవి. అందులో పాపయ్య రాజు గోవా చెరుకు రసం, చిన్న రసం , నీలం , పంచదార కలశ , బుడతలు ,బంగినపల్లి ,కొత్తపల్లి కొబ్బరి ,ఎర్ర కాయలు రకరకాల మొక్కలు అన్నిచోట్ల నాటించింది రవణమ్మ. 

ఇలా మొక్కలు నాటుతుంటే దారి వెళ్ళిపోయే వాళ్ళు ఏదో ఒక వెటకారం ఆడుతుండేవారు. బ్రాహ్మణుల వ్యవసాయం చేస్తున్నారని.  

ఇన్ని మొక్కలు పెంచడం మీ వల్ల అవుతుందా !అని కొందరు ఏదో మాట్లాడుతూ ఉండేవారు.

 అవి మనసుకు బాధ కలిగించిన రవణమ్మకి ఆ మొక్కలను ఎలాగైనా సరే పెంచి పెద్ద చేయాలని సంకల్పం చేసుకుంది. పూర్తిగా నాటడం అయిపోయిన తర్వాత ఆ తోట అంతా చూసేటప్పటికి రమణమ్మ కి ఎక్కడలేని ఆనందం వచ్చింది. ఒరేయ్ పెద్దోడా! ఈ వర్షాకాలం పరవాలేదు గాని కార్తీక మాసంలో ఒక పెద్ద నుయ్యి మాత్రం తవ్వించాలి ఇక్కడ. నువ్వు అది మాత్రం అశ్రద్ధ చేయకు అoటు చెప్పుకుంటూ వచ్చింది. 
ప్రతిరోజు ఉదయం కొడుకులతోపాటు రవణమ్మ మామిడి తోటలో తిరిగి ఆ మొక్కలన్నిటినీ పరిశీలనగా చూసేది. ఒక చంటి పిల్లాడిని తల్లి చూసినట్లుగా. వర్షాలు బాగా కురుస్తుండడంతో మామి డి మొక్కలన్నీ తొందరగానే నాటుకున్నాయి. తలలు ఎత్తి వర్షపు గాలికి అటు ఇటు ఊగుతుంటే స్కూలుకు వెళ్తున్న చిన్నపిల్లాడు టాటా చెబుతున్నట్లుగా అనిపించేది రవణమ్మకి.  

మొక్కలకు నీళ్లు పోస్తాం పశువుల పంట వేస్తాం బాగానే ఉంది మరి చుట్టూ పక్కల ఉన్న ఇంటి వాళ్ళందరికీ పశువులు ఉన్నాయి. మరి వాటి నుండి ఈ తోటను ఎలా కాపాడుకోవాలి ?

అదే పెద్ద సమస్యగా అనిపించింది రవణమ్మకి . చుట్టూ ప్రహరీ గోడ కడదామంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా చుట్టూ కర్రలతోటి ముళ్ళకంచెల తోటి ఒక గోడలా కట్టించి ఏదో సంతృప్తి పడింది రవణమ్మ. 

కార్తీక మాసం రాగానే ఓ మంచి ముహూర్తంలో తోటలో పెద్ద నుయ్యి త్రవ్వించారు రమణమ్మ కొడుకులు. ప్రతిరోజు తెల్లవారుజామున తల్లి కొడుకులు అందరూ కలిసి ఆ తోట దగ్గరకు వెళ్లి ఇద్దరు నీళ్లు తోడుతుంటే ముగ్గురు ఆ మొక్కలకు నీళ్లు పోసేవారు ప్రతిరోజు. ఆ తోటలో ఒక్కొక్క భాగానికి తన కొడుకుల పేరు పెట్టుకుంది రమణమ్మ. మొదటి భాగంలోని మొక్కల్ని "పెద్దోడా " అని పిలిచేది. ఆఖరి భాగంలోని మొక్కల్ని "అచ్యుతం "అని పిలిచేది. ఒరేయ్ పెద్దోడా నీకు దాహం తీరిందా! ఒరేయ్ అచ్యుతం నీకు ఇంకా ఆకలేస్తుందా! అలా ప్రేమగా పలకరించేది రవణమ్మ. చూడరా అచ్యుతం గాడు ఎలా తల ఊపుతున్నాడో ?అంటూ ఆనందపడేది ఆ ముసలమ్మ. ఏమిటో ఆవిడకి ఆ పిచ్చి ప్రేమ ఆ మొక్కలు అంటే. 

ఒకరోజు రవణమ్మ కొడుకులు కలిసి తోట నుంచి వచ్చేటప్పటికి కోడళ్ళు అందరూ పెరట్లో కబుర్లు చెప్పుకుంటూ కనిపించారు.అలా నాలుగు రోజులు చూసింది . రమణమ్మ కి ఒళ్ళు మండిపోయింది .

 ఏమిటి మేమంతా కష్టపడుతుంటే వీళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు . రేపు కాయలు కాస్తే వీళ్ళు తినరా! అనుకుని ఒకరోజు బాoబు లాంటి వార్త పేల్చింది. మర్నాడు నుంచి కోడళ్ళు ఒక రోజు కొడుకులు ఒకరోజు మొక్కలు కి నీళ్లు పోయాలని హుకుం జారీ చేసింది.

 కానీ రమణమ్మ ప్రతిరోజు వాళ్లకి సహాయం చేసేది. అప్పట్లో ఎరువులు వేయడం ఉండేది కాదు. పెరడు నిండా పశువులు ఉండేవి కాబట్టి ప్రతిరోజు ఆ పశువులపెంట ఆ మొక్కల్లోనే వేయించేది. అలా ఒకరోజు మామిడి తోటలోకి వెళ్ళేటప్పటికి రమణమ్మకి రెండు మామిడి మొక్కలు కింద పడిపోయినట్టు గమనించింది. 
చంటి పిల్లాడు కిందకు పడిపోయినప్పుడు మనం ఎలా బాధపడతామో అలా బాధపడింది రమణమ్మ. అలా ఒకటి రెండు సార్లు పశువులొచ్చి పాడు చేసినప్పటికీ వాటిని మళ్లీ జాగ్రత్తగా కాపాడుకుంటూ కంటికి రెప్పలాగా చూసుకో సాగింది. 
ఏవండీ రమణమ్మ గారు! వ్యవసాయం మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అండి. ఇంతకీ మామిడిపళ్ళు ఎప్పుడు పెడుతున్నారు డు వెటకారంగా మాట్లాడే ఆ ఊరి ప్రజలకు చూడండి మీరే కాదు ఈ మధుర ఫలాలు మా వంశీకులు మూడు తరాల వాళ్ళు తింటారు . చూస్తూ ఉండండి అoటు గట్టిగా సమాధానం చెప్పేది ధైర్యంగా .

అప్పటి కాలంలో ఒక స్త్రీ అయ్యుండి రమణమ్మ అంత ధైర్యంగా మొక్కలు నాటించడం వాటిని చంటి పిల్లలు లాగా పెంచి పోషించడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.

అలా ఐదు సంవత్సరాల కాలం గడిచింది. ఎంతో ప్రేమతో నాటిన మామిడి మొక్కలు బతికి బట్ట కట్టి ఆకులు కొమ్మలతో ఒక చెట్టు ఆకారo లోకి మారాయి. రమణమ్మ శీతాకాలం వచ్చేటప్పటికి ఎక్కడైనా పూత కనబడుతుందేమో అని ఆశగా చూసేది. ఒకరోజు పాపయ్య రాజు గోవా చెట్టుకి చిటారు కొమ్మన పూత కనబడింది. ఇంకేముంది ఆవిడ ఆనందానికి హద్దు లేదు. ఇంటికి వెళ్లి అందరితోటే ఆ విషయం చెప్పే వరకు మనసు ఆగలేదు.

రమణమ్మకి అప్పటికే మూడు పదుల సంఖ్యలో ఆడ మగ మనవలు ఉన్నారు. అలా క్రమేపీ తోటలోని చెట్లని పూతతో నిండు గర్భిణీలా కనబడ్డాయి రమణమ్మకి. నిజానికి అంత పెద్ద తోటకి నీరు తోడి పోయడం మొక్కలను శ్రద్ధగా పెంచడం చాలా కష్టమైన పని. 

ఒక కుటుంబంలో ఉన్న వాళ్ళు పెద్దవాళ్లు ఆస్తి సంపాదించడానికి తన వారసులుకి ఇవ్వడానికి చాలా కష్టపడతారు. కానీ ఒక మామిడి తోట పెంచి తన వారసులకి ఇవ్వడానికి కష్టపడిన రవణమ్మ లాంటి వారు చాలా తక్కువగా ఉంటారు. 
అలా తోట అంతా పూతతో మెరిసిపోయినప్పటికీ కొంత పూట మంచుకు మాడిపోయేది. అలా మిగిలిన పూత ప్రాణం పోసుకుని చిన్నపిందిగా మారి రోజురోజుకి ఎదుగుతుంటే రమణమ్మ కుటుంబం చాలా ఆనందపడుతూ ఉండేది. అప్పటికే రమణమ్మ కి డబ్బై ఐదు ఏళ్లు వచ్చేసాయి. అయినా కాంక్ష మటుకు తగ్గలేదు. ఓపిక ఉన్న లేకపోయినా ఒక బకెట్ నీళ్లు అయినా సరే ఆ మొక్కలకు పోయకుండా ఉండేది కాదు. 

 ఒకరోజు తోటలో నీళ్ళు తోడుతూ అలాగే కూలబడి పోయింది రమణమ్మ . కర్మ కాండకి వచ్చిన బంధువులందరూ రమణమ్మ పెంచి న తోట చూసి ఆశ్చర్యపడ్డారు. తోటల పెంపకంలో రవణమ్మ ఆ ఊరి వారికి ఆదర్శం అయ్యింది. అదే బాటలో చాలామంది తోటలు పెంచారు ఆవిడ తర్వాత. 

ఆ తోటలో పండిన మొదట కాయలు తింటూ కుటుంబ సభ్యులు ఒకపక్క ఆనందపడుతూ మరొకపక్క ఇంత శ్రమపడి పెంచిన మామిడి తోటలో కాసిన పండు ఒకటి కూడా రుచి చూడకుండా చనిపోయిన రమణమ్మని తలుచుకుని ప్రతి ఏట బాధపడుతూనే ఉండే వారు. అయితే అప్పటినుంచి ఆ తోటలో పండిన మామిడిపళ్ళని మొదట ఒక బీద బ్రాహ్మణునికి ఇచ్చి నమస్కారం చేసి మామిడిపండు తినేవారు ఆ అన్నదమ్ములు.
అలా తన కుటుంబంతో కలిసి పెంచిన మామిడి తోట ఇచ్చిన మధుర ఫలాలను రవణమ్మ వంశీకులు రెండు మూడు తరాల వారు కడుపునిండా తింటూ కావాల్సిన వాళ్ళకి ఇస్తూ దూర ప్రదేశంలో ఉన్న తమ బంధువులకి పంపిస్తూ ఆనందం అనుభవించారు .

ఈ కథ కొంత కల్పితమైనప్పటికీ ఆ మధుర ఫలాలు ఇచ్చే మామిడి తోటను పెంచిన వాళ్ళు మా ఐదుగురు తాతలు అయితే ఆ ఫలాలను తింటూ మధురానుభూతి పొందిన వాళ్లలో నేను కూడా ఒకడిని. 

ఏ వయసుకి ఆ వయసులో అంటే మామిడి పిందిగా ఉన్నప్పుడు ఒక రకమైన వంటకాన్ని కొంచెం పెరిగి పెద్దయిన తర్వాత పప్పుతో కలిపి మరొక వంటకాన్ని పూర్తి కాయగా మారిన తర్వాత ఆవకాయ గాను పండిన తర్వాత మామిడి పండు గాను ఇలా రకరకాల దశల్లో ఉపయోగపడిన ఆ మామిడి చెట్టు అందించిన మధుర ఫలాల్ని ఎలా మర్చిపోతాం.

 రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279