కుక్క పిల్లతో చాలా సంతోషంగా ఆడుకుంటున్న అన్విని చూడగానే రాహుల్ మనసులో కలుకుమంది.
“ అసలు ఎలా ఉండగలుగుతున్నావు అన్వి. కన్న వాళ్ళని పోగొట్టుకున్న నువ్వు ఎన్ని కష్టాలు పడి ఉంటావో నేను ఊహించగలను . అసలు ఈ విషయం మీ ఫ్రెండ్స్ కి అయినా తెలుసా లేదా? ” అంటూ ప్రేమగా తన వైపు చూస్తూ ఉన్నాడు.
అలా తన వైపు చూస్తూ ఉండగానే కళ్ళల్లో నీళ్లు గ్రావిటీకి కిందికి దూకుతానన్నట్టు మోరాయిస్తున్నాయి.
“ ఏంటో నేను ఒక డ్రాకులా అన్న విషయం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. మనుషుల్లాగా ఈ మధ్య మారిపోతున్నానని భయమేస్తుంది ” అంటూ తలతిప్పి కన్నీళ్ళను తుడుచుకున్నాడు రాహుల్ .
నేను ఎలాగైనా అన్వి యొక్క అసలు నిజాన్ని తెలుసుకుని తీరాలి . నాకు తెలిసి ఈ విషయాన్ని తన స్నేహితులకు కూడా చెప్పిండదు . కాబట్టి మళ్లీ వెళ్లి ఆ తోటమాలిని అడగాలి అని నిర్ణయించుకొని వాళ్ళవైపు తిరిగాడు.
“ అన్వి ఈరోజు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? ” అడిగాడు సందేహంగా.
“ మాకా? మాకు పెద్ద ప్లాన్స్ ఏముంటాయి .వెళ్తే కాలేజ్ కి వెళ్దాం. లేదంటే ఇంట్లోనే !” అంది తాపీగా.
“ మరి అయితే ఈరోజు కాలేజీకి వెళ్లలేదా? ”
“ ఏమో వేళ్ళమోమో . వద్దు అంటున్నారు కాబట్టి వెళ్ళామేమో? ”
“ సరే మరి స్నూపీని జాగ్రత్తగా చూసుకోండి . నాకు కొంచెం పని ఉంది .నేను సాయంత్రంలోగా తిరిగి వచ్చేస్తాను ” అన్నాడు ఒప్పుకుంటుందా ఒప్పుకోదా? అని చూస్తూ.
“ హో....దానికేం! చూసుకుంటాం. నాకు బాగా నచ్చింది ” అంటూ దాన్ని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటుంది.
చిన్నగా నవ్వుకున్న రాహుల్ అక్కడి నుండి పక్కనే ఉన్న తోటమాలి దగ్గరికి వెళ్ళాడు . రాహుల్ అలా వెళ్లడంతో అభయ్ ; అన్వి చాలా సంతోషంగా ఉన్నట్టుంది . ఇప్పుడు నేను ప్రేమించే విషయం చెప్తే బాగుంటుంది అనుకుంటా! అని మనసులోనే లెక్కలు వేసుకుంటున్నాడు.
పక్కింటికి చేరుకున్న రాహుల్ పనిచేస్తున్న తోటమాలి దగ్గరికి వెళ్ళాడు. ఆయన ఒక్క క్షణం రాహుల్ ని చూసి భయపడుతూ వెనక్కి పడ్డాడు.
“ మీ.....కు ఏం....క....కావాలి ” అన్నాడు బెదిరిపోతున్న గొంతుతో.
“ నాకు కొన్ని విషయాలు తెలియాలి. ఈ ఇల్లు కాలిపోయిన తర్వాత ఇందులో ఉన్న అన్వి, ఏ హాస్టల్లో చదువుకుంది ” అన్నాడు సూటిగా చూస్తూ.
“ నాకేం తెలీదు . ఊర్లో వాళ్ళ అంచనాలను బట్టి ఈ ఊర్లోని ఒక అనాధాశ్రమంలో అన్వి చదువుకుంది అని మాత్రమే తెలుసు ” అన్నాడు భయపడిపోతూ.
“ భయపడకు . నేనేం చేయనులే !” అంటూ అతడిని పైకి లేపి తలపై ఉన్న కండువాని సరి చేశాడు. రాహుల్ దగ్గరికి రాగానే అతడికి చెమటలు పట్టాయి.
దానికి నవ్వుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోయాడు రాహుల్ . అతను చెప్పిన గుర్తులని అనుసరిస్తూ, ఆ ఊరి చివరలో ఉన్న ఆశ్రమానికి చేరుకున్నాడు.
అక్కడ కొంతమందిని విచారిస్తే అది ఒక అనాధ ఆశ్రమం అని తెలిసింది. అందులో మొదటిసారిగా అన్విని చూశారు. తర్వాత తనకి సంజన ఇంకా గీత అనే ఇద్దరు స్నేహితులు పరిచయం అయ్యారు. వాళ్ళ ముగ్గురు అనాధలు.
సొంతంగా చదువుకోడానికి పార్ట్ టైం పనులు చేసుకుంటూ , ఈ ఆశ్రమం నుంచి వెళ్లిపోయారని కూడా చెప్పారు.
“ అయితే వాళ్లు చనిపోయిన తర్వాత అన్వి అనాధ ఆశ్రమంలో చేరిందా? విచిత్రంగా గీత సంజనా కూడా అనాధలేనా ? నిజంగా చాలా గ్రేట్! అందరూ ఉన్న ఈ కాలంలో ఏమి సాధించలేక మిగిలిపోతున్న వాళ్ళు చాలామంది. అలాంటిది ఎవరు లేకపోయినా సొంత కాళ్లపై నిలబడి ఈ స్టేజ్ కి రాగలిగారంటే....” అంటూ మనసులోనే వాళ్ళని గొప్పగా ఉహించుకున్నాడు .
మరు క్షణంలోనే వాళ్ళు పడిన కష్టాలను గుర్తు తెచ్చుకోగానే, గుండె కరిగి ద్రావించినట్లు అనిపించింది.
కొద్దిసేపు ఏకాంతంగా ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు . అలా అక్కడే సాయంత్రం అయ్యే వరకు కూర్చున్నాడు. చివరికి ఏదో నిర్ణయించుకున్న వాడిలాగా....
“ నేను నా స్వార్థం కోసం ఇంత మంచి అమ్మాయిని చంపాలనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు వేరే మార్గం కూడా లేదు . నేను అసలు విషయం చెప్పి తనని ఒప్పించడానికి మాత్రమే ప్రయత్నించాలి. తను ఇప్పటికే చాలా కష్టాలు పడింది. మళ్ళీ నా కారణంగా.....” మాటలు మనసు చెప్తూ ఉంటే అస్సలు ఊహించుకోలేకపోయాడు.
*******
మరోవైపు ఎయిర్పోర్ట్లో నుండి అమెరికాకు చేరుకున్న సోమనాథ్. ఒక పెద్ద బిలినియర్ కంపెనీలోకి వెళ్ళాడు . అది ఆకాశమంత ఎత్తును తలపించేలా ఉంది .
అందులోకి వెళ్ళగానే తనకోసం ఎదురు చూస్తున్న ఒక కమిటీ , ఆయన రాగానే నిలబడ్డారు.
“ ఏమైంది ఎందుకని ఇంత అర్జెంటుగా రమ్మన్నారు? ” అని ప్రశ్నించాడు వస్తూనే!
“ కమిటీలో కొంతమంది అనుకుంటున్నారు. నిజంగానే మౌర్య గారి కూతురు బతికే ఉంది అనీ. తన పేరు అన్వి!
తను ఇండియాలోనే ఒక అనాధగా బ్రతుకుతుంది . ఆ విషయాలు మాకు ఈ మధ్యనే తెలిసాయి . అందుకే ఈ కమిటీ ఆ అమ్మాయికి ఈ బాధ్యతల అప్పగించాలని నిర్ణయించుకుంది. ఇన్ని రోజులు మీరు ఈ కంపెనీకి చేసిన సేవకి, మీకు చాలా ధన్యవాదాలు !.
ఇప్పుడు ఈ కంపెనీకి అసలైన వారసురాలు దొరికింది. అందుకే మేము ఆమెని సీఈవో చేయాలని నిర్ణయించుకున్నాము అన్నారు ఏకకంఠంతో. ”
కంపెనీ మెంబర్స్ అందరి మాటలు వినగానే, అతని గుండె రగిలినంత పనైంది . అయినా అదేమీ కనిపించకుండా.....
“ నిజంగా తను బతికిందా ?” ఏమీ తెలియనట్టుగా అడిగాడు సోమనాథ్.
“ తను బ్రతికే వుంది......” అంటూ కనిపిస్తున్న ఒక మానిటర్లో ఆమె ఫోటోని చూపించారు .
“ అసలైన వారసురాలు వస్తే , ఇక నాకు మాత్రం ఏం పని ఉంటుంది . నేను కూడా ఆమెను సాదరంగా ఆహ్వానిస్తున్నాను . మన కొత్త సీఈఓ కి స్వాగతం” అన్నాడు వాళ్ళ ముందు కమట బుద్ధి చూపిస్తూ!
ఆ మీటింగ్ లో పవర్ ఆఫ్ అటానీ సిద్ధం చేశారు. ఆ పేపర్ల పైన ఒక్కసారి అన్వి సంతకం చేస్తే చాలు, ఆ కంపెనీకి తానే సీఈఓ అయిపోయి, ఈ ప్రపంచంలోనే అతి గొప్ప వాళ్ళలో ఒకరిగా నిలబడుతుంది .
వాళ్లకున్న ఆస్తి తనని నెంబర్ వన్ బిలినియర్గా మార్చేస్తుంది .
ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత కమిటీ మెంబర్లు అందరూ బయటకు వెళ్ళిపోయారు. అక్కడే కూర్చున్న సోమనాథ్ కోపంతో, ఏం చేయాలా ? అని ఆలోచిస్తున్నాడు .
ఇంతలో పిఏ బయట నుండి ఫోన్ పట్టుకొని ఆయన దగ్గరకు వచ్చి, “ సార్ ఇండియాలో మన కంపెనీ షేర్లు అన్ని పడిపోతున్నాయి అంటా! ఏదో కొత్తగా వచ్చిన ఫైటింగ్ విత్ మెమోరీస్ అనే కంపెనీ ఇప్పుడు నెంబర్ వన్ పొజిషన్ కి చేరుకుంటుంది అనీ, ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. సార్ దాని సీఈవో అన్వి అని కూడా చెప్పారు” అన్నాడు గాబరాబడుతూ.
అప్పటిదాకా అదుపు చేసుకుంటున్న అతని కోపం కట్టలు తెంచుకుంది . బలంగా టేబుల్ పై కొట్టాడు.
“ అన్వి.........” అంటూ పండ్లు కొరుకుతూ, అమెరికాలో మీ నాన్న , ఇండియాలో నువ్వు నన్ను తొక్కేయడమే పనిగా పెట్టుకున్నారు. ఎంతైనా మౌర్య గారి రక్తం కదా ! ఆ మాత్రం ఉంటుంది. మీ నాన్నకు పట్టిన గతే నీకు కూడా పట్టిస్తా ” అంటూ ఫోన్ తీసుకొని ఒకరికి ఫోన్ కలిపాడు.
“ జెంటిల్మెన్ మనం ఆపేసిన ఆ ప్లాన్ ని ఇప్పుడే అమలు చేయండి. నేను ఇండియాకి వచ్చేలోగా అది నా కళ్ళ ముందు ఉండాలి ” అని ఫోన్ పెట్టేసాడు.
*******
అప్పటికి సాయంత్రం అవుతూ ఉండడంతో కుక్కతో బాగా ఆడుకున్న అన్వి, దానికి తినడానికీ అన్నీ అయిపోవడంతో తీసుకురావడానికి బయటకి వచ్చింది .
అలా కుక్క తినే బిస్కెట్ల కోసం వెతుకుతూ కొద్దిగా దూరం వచ్చేసింది .తనతో పాటుగా కుక్క కూడా నడుస్తూ ఉంది .ఇద్దరు మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్నారు.
సడన్గా వాళ్ళ ముందు ఒక కారు వచ్చి ఆగింది. అందులో నుండి శరవేగంగా నలుగురు వ్యక్తులు దిగారు . వాళ్ళ ముఖాలకి మంకీ క్యాప్స్ ఉన్నాయి.
అందులో ఇద్దరు గన్నులు పట్టుకొని, మరో ఇద్దరూ కత్తి పట్టుకుని ఉన్నారు. వాళ్లు అన్విని పూర్తిగా చుట్టుముట్టేసి.....
“ ఏయ్ మర్యాదగా కారెక్కు ” అన్నాడు ఒకడు.
అన్వి భయపడిపోతూ కుక్కని దగ్గరికి తీసుకుంది.
“ ఎక్కుతావా ? లేదా ?” అని గట్టిగా అరుస్తూ గన్ గురి పెట్టాడు మరొకడు .
ఆ అరుపు పూర్తిగా భయపడి పోయింది .
“ ఇది మాటలతో చెప్తే వినేలా లేదు ” అని జుట్టు పట్టుకొని కార్ ఎక్కించబోయాడు ఇంకొకడు .
వాడు అలా చేయగానే కుక్కకి కోపం వచ్చింది. వెంటనే వాడి పైకి దూకి వాని చేతులు పట్టుకొని కొరకడం మొదలుపెట్టింది .
“ రేయ్ ఏంట్రా ఇది .....” అంటూ వాడు దాన్ని విడిపించడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు. కానీ వాడి వల్ల అవ్వట్లేదు . ఇంతలో మరొకడు వచ్చి, కుక్కని రెండు చేతులతో పట్టుకొని దూరంగా విసిరేశాడు.
అన్వి ఇదే సరైన టైమ్ అని తప్పించుకోవడానికి చూస్తే , మరో ఇద్దరు తనని పట్టుకున్నారు . కుక్కకి ఏం చేయాలో అర్థం కాక వేగంగా , వాడి పైకి ఎగిరి కరిచింది.
వాడికి రక్తం రావడంతో " అమ్మ........." అంటూ అరస్తూ దానిని దూరంగా మళ్ళీ విసిరేశాడు. ఇంకోసారి అది వాళ్ళ పైకి దూకడానికి ప్రయత్నించేసరికి , మూడోవాడు గన్ను తీసుకొని కాల్చాడు .
అది నేరుగా కుక్క తలలో నుంచి శరీరంలోకి వెళ్ళిపోయింది . ఆ బుల్లెట్ వచ్చిన వేగానికి కుక్క రక్తమడుగులో ఈడ్చుకుంటూ అమడ దూరం వెళ్లిపడింది.
చిన్నగా మూలుగుతూ అన్వి వైపు చూస్తూ తన ప్రాణాన్ని విడిచింది.
“ స్నూపీ..........” అంటూ ఏడుస్తున్న కళ్ళతో దాని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించింది అన్వి.
“ రావే .......! ” అంటూ కత్తి పట్టుకున్న ఒకడు చెంపపై బలంగా కొట్టాడు. ఆ దెబ్బకి అతడి వేలి ముద్రలతో పాటు, చేతి పై ఉన్న కత్తి చిన్నగా గీసుకుంది . దాంతో రక్తం చిన్నగా వస్తూ తను సృహతప్పి పడిపోయింది .
వాళ్లు వేగంగా కార్లో అన్విని తీసుకొని వెళ్ళిపోయారు.
అన్వికి ప్రపోజ్ చేద్దామని అభయ్, తనని వెతుక్కుంటూ ఆర్గనైజేషన్ నుంచి బయటికి వస్తున్నాడు. మరోవైపు అంతసేపు ఆలోచించి అసలు నిజం చెప్పి , తనను ఒప్పించాలని రాహుల్ తనకోసం ఆర్గనైజేషన్ వైపుకి బయలుదేరాడు.
——— ***** ———