Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

జతగా నాతో నిన్నే - 26




రాహుల్ చూపు షాప్ ముందు ఉన్న దానిపై పడింది . అది రాత్రి అవ్వటం వల్ల పెద్దగా జనాలు ఎవ్వరూ లేరు. అది ఒక స్వీట్ షాప్.

దాని యజమాని బయటికి వచ్చి “ పనికిమాలినదాన ....” అంటూ కాలితో కుక్కని తంతున్నాడు.

అది బాధగా “ కుయ్యో ......మోర్రో .....” అంటూ అరుస్తుంది .

“ నువ్వు ఇలా చెప్తే అసలు ఎందుకు వింటావే? నా షాప్ ఒకటే నీకు కనిపిస్తుందా? వేరే ఏది కనిపించదా? ” అంటూ రాడ్ తీసుకోని విసిరాడు. అది నేరుగా వెళ్లి ఆ కుక్క వెనక కాలికి తకింది.

దానితో నొప్పి ఎక్కువ అయ్యి గట్టిగా అరిచింది కుక్క. దాని కాలివెంట నుంచి రక్తం చిన్నగా కారుతుంది . అది చూడగానే రాహుల్ కి ఆ వ్యక్తి పైన చాలా కోపం వస్తుంది.

వెంటనే ఆ కుక్కని చేరుకొని దాన్ని పైకెత్తుకుంటాడు .

“ మీరు అసలు మనుషులేనా? కుక్కని కొట్టడం ఏంటి? మీకు అంత ఇబ్బంది కలిగిస్తే దాన్ని బెదిరించి పంపియ్యాలి .....అంతేకానీ దాన్ని ఇలా హింసిస్తారా? ” అంటూ నెత్తురు వోడ్డే కళ్ళతో చూశాడు .

ఆ కుక్క మాత్రం చిన్నగా మూలుగుతూ రాహుల్ ఒడిలో అతుక్కుపోయింది.

“ పెద్ద చెప్పొచ్చాడు ! నువ్వేమైనా హీరో అనుకుంటున్నావా? ఆ కుక్క రోజే నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది. రోజు నా షాప్ ముందు నిలబడి వచ్చే కస్టమర్లను రానివ్వకుండా చేస్తుంది. వాళ్లు తినేటప్పుడు వాళ్ల వంకే చూస్తూ ఉంటుంది .అది ఎంత ఇరిటేషన్ గా ఉంటుంది ? పోయి .....పని చూసుకో పో ?” అంటే లోపలికి వెళ్ళిపోయాడు.

“ హేయ్ ఆగు ....కుక్క అంటే నీకు అంత అలుసా? దానికి ఇంత పెద్ద షాప్ లో మిగిలిపోయిన కొంచెం అన్నం కూడా లేదా? నీలాంటి స్వార్థపరులకు ఇలాంటి చిన్న చిన్న జీవులు ఏం కనిపిస్తాయి లే! ” అంటూ తన పర్సనల్ నుంచి యాభై రూపాయల నోట్లనీ ఒక పది తీసి అతని మొఖం పైకి విసిరాడు .

“ తీసుకో ఈ డబ్బులోనే మునిగి చచ్చిపో .....” అంటే కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయాడు రాహుల్.

ఆ వ్యక్తికి ఏమాత్రం సిగ్గు లేదన్నట్టుగా కిందపడిన నోట్లను తీసుకొని జోబులో పెట్టుకున్నాడు.

రాహుల్ జాలిగా కుక్కని చూస్తూ నిమురుతూ ఉన్నాడు . అలాగే నడుచుకుంటూ ఆర్గనైజేషన్ దాకా వెళ్ళిపోయాడు. దారి మధ్యలో ఆ కుక్క తినడానికి కొన్ని బిస్కెట్లు , పాలు తీసుకొని మరీ వెళ్ళాడు .

ఆ కుక్క ఎంతో ప్రేమగా రాహుల్ ని చూస్తూ ఉంది . మామూలుగా అయితే కుక్కలకి దయ్యాలు కనిపిస్తే మొరుగుతాయని అంటారు కదా ! మరి ఈ కుక్కేంటో విచిత్రంగా రాహుల్ ఒడిలో ఒదిగిపోయింది.

ఆర్గనైజేషన్ లో మీటింగ్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి, కిచెన్లో ఆ పాలని గోరువెచ్చగా చేసి ఒక గిన్నెలో పోసి.......కుక్క ముందు పెట్టాడు. మరో గిన్నెలో దానికి తినటానికి బిస్కెట్లు కూడా పెట్టాడు.

పాపం అది విపరీతమైన ఆకలితో ఉందనుకుంటా!

అందుకే వాటిని చూడగానే రక్తం కారుతున్న కాలుతో ఈడ్చుకుంటూ వాటి దగ్గరికి రావడానికి ప్రయత్నించింది. దాని బాధని చూడలేక రాహుల్ దాన్ని ఎత్తుకొని వాటి ముందు పెట్టాడు .

ఆ కుక్క ప్రేమగా రాహుల్ వైపు ఒకసారి చూసి, ఆ పాలని తన నాలికతో తాగసాగింది . తర్వాత బిస్కెట్లు కూడా తినేసింది . దాని ఆకలి తీరిన తర్వాత రాహుల్ దాన్ని మళ్లీ ఎత్తుకున్నాడు .

ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి దానికి కట్టు కడదామని కూర్చున్నాడు. మళ్లీ ఇంతలో ఏదో గుర్తొచ్చిన వాడిలాగా , దాన్ని ఎత్తుకొని బయటికి తీసుకెళ్లాడు.

తన గార్డెన్లో ఒక బకెట్ గోరువెచ్చని నీళ్లతో దానికి స్నానం చేయించాడు . అప్పటిదాకా బాగా దుమ్ము కొట్టుకొని పోయి ఉన్న అది; స్నానం చేయగానే దాని అసలైన రూపంలోకి వచ్చింది .

తెల్లగా వెంట్రుకలతో చాలా ముద్దుగా ఉంది. దానికోసం ఒక టవల్ తీసుకొని దాన్ని శుభ్రంగా తుడిచాడు . ఆ తర్వాత దాని సోఫా పైన కూర్చోబెట్టి దానికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు .

రక్తం కారకుండా దానికి ఒక చిన్న బ్యాండేజ్ వేసి కట్టు కట్టాడు రాహుల్ . అందుకే నాకు ఈ మనుషులంటే అసలు నచ్చదు అంటూ చిన్నగా దాని తల పైన నిమ్మిరాడు .

అది కూడా రాహుల్ చేతిని తలతో రుద్దుతూ, ఇంకా దగ్గరగా వచ్చింది .

“ ఇప్పటినుంచి నువ్వు కూడా నాతో పాటే ఉంటావు. నీకు ఒక పేరు పెట్టాలి కదా? ఆగు ఆలోచిస్తా......” అంటూ కాసేపు ఆలోచించాడు .

“ నీ పేరు స్నూపి ! బాగుంది కదా? ” అంటూ దాన్ని మళ్ళీ అడిగాడు.

చాలా బాగున్నట్టుగా చిన్నగా అరిచింది అది. కాసేపు దాంతో ఆడుకున్న రాహుల్ వెళ్తామని పైకి లేచాడు.

కుక్క తననే చూస్తుంది తప్ప! మరి ఏమి చేయట్లేదు . దాన్ని విడిచిపెట్టి , నిద్ర వస్తుండడంతో పైకి లేచాడు . అప్పుడే ఆ కిచెన్లో ఉన్న వాల్ మిర్రర్ తన ప్రతిబింబాన్ని కనిపించేలా చేస్తుంది .

అందులో రాహుల్ పూర్తిగా డ్రాకులాగా కనిపించాడు. తను ఆ గదిలో ఉండి దాదాపు ఐదు గంటల సమయం అయింది. అందుకే ఆ పవిత్ర వృక్షాల కారణంగా తన శరీరం డ్రాకులాగా మారింది.

తనని తాను ఒకసారి చూసుకున్న తర్వాత తను పూర్తిగా డ్రాకులాగా మారాడని అర్థమయింది. నేను మారితే మరి కుక్క ఎందుకు అరవలేదు? అంటూ దాని వైపు చూశాడు .

కుక్క ఇంకా ప్రేమగా తనని చూస్తుంది . రాహుల్ దాని దగ్గరికి వెళ్లి మళ్లీ ఏదో పరీక్షిద్దామన్నట్టుగా దానిని నిమిరాడు. కుక్క ఏమి చేయలేదు ......ఇంకా అతని ప్రేమలో ఒదిగిపోతోంది.

అనవసరమైన మూఢనమ్మకాలన్నీ కలిగిస్తారు. కుక్కలకి మనుషులైనా , మృగాలైనా ఆఖరికి దయ్యాలైనా సరే ఒకటే ! వాటితో ప్రేమగా ఉండాలి. మన వల్ల వాటికి ఏదైనా చిన్న హనీ జరుగుతుందని తెలిస్తేనే అవి రియాక్ట్ అవుతాయి అనుకోని ఆ కుక్కని ఎత్తుకొని తన గార్డెన్ లోకి వెళ్ళాడు రాహుల్ .

అలా గార్డెన్లో నుంచి బయటికి రాగానే పక్కింటి తోటమాలి బయటికి వచ్చాడు . తనని డ్రాకులాగా చూసిన అతనికి గుండె ఆగినంత పని అయింది. ఉన్నచోటనే అలాగే పడిపోయాడు . ఆ విషయం తెలియని రాహుల్ గార్డెన్ లోకి వెళ్ళాడు.

తన కోసమే సపరేట్గా నిర్మించుకున్న ఒక చిన్న ఇంటిలో లైట్స్ వేయగానే అందంగా కనిపించింది. దాంట్లో కుక్కని ఒకచోట పడుకోబెట్టి, తాను కూడా నిద్రలోకి జారుకున్నాడు.

ఉదయం తెల్లవారింది . ఎవరో పిలుస్తున్నట్టు అనిపించడంతో రాహుల్ నిద్ర నుంచి మేలుకున్నాడు.

“ రాహుల్ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు. రాత్రంతా ఇక్కడే ఉన్నావా ?” అంటూ ఆశ్చర్యంగా అడిగింది అన్వి.

“ అవును .....” అంటూ తల ఊపి పక్కకి చూసాడు . పక్కన కుక్క పిల్ల లేదు .

“ స్నూపీ.........స్నూపీ.......” అంటూ పిలుస్తూ బయటకు నడిచాడు. అలా వెతుకుతూ ఉంటే తనకి అది ఆ ఇంటి బయట కాలకృత్యాలు తీర్చుకుంటూ కనిపించింది.

దీనికి ఇది ఒక మంచి అలవాటు ఉందా? అనుకొని సైలెంట్ గా అన్వి దగ్గరికి వెళ్ళాడు.

కొద్దిసేపటికి వచ్చిన స్నూపి రాహుల్ కాళ్ళనీ చుట్టుముట్టేస్తూ, ప్రేమగా తిరుగుతుంది.

“ ఏంటి దీని పేరు స్నూపీ నా ? బాగుంది . ఎక్కడ దొరికింది నీకు ఇది? ” అంటూ దాని గురించి వివరాలు ఆరా తీసింది అన్వి.

కొన్ని క్షణాల్లోనే అన్వి కూడా దానికి ఫ్రెండ్ అయిపోయింది . వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుంటూ దానికి టైం పాస్ చేశారు . మిగిలిన వాళ్లు కూడా రావడంతో వాళ్లందర్నీ పరిచయం చేసింది ఆ కుక్కకి!

ఆ కుక్క కూడా అందరి దగ్గరికి వెళ్లి సెకండ్ ఇచ్చింది . దాని మెదడులో వీళ్ళ ఐదుగురి ముఖచిత్రాలు రిజిస్టర్ అయిపోయాయి. అందరిని నవ్విస్తూ అందరితోపాటు ఆడుకుంటూ ఉంది.

#######

మరోవైపు గదిలో సోమనాథ్ చాలా సీరియస్ గా ఒక విషయం గురించి చర్చిస్తున్నాడు . అతని చుట్టూ ఐదుగురు వ్యక్తులు కూర్చున్నారు. అందులో ఒకడు బలిష్టమైన శరీరాన్ని కలిగి టాటూలతో ఉన్నాడు.

మరొకడు అంతే బలమైన శరీరం కలిగి గుండుతో ఉన్నాడు . ఇంకా ఇద్దరు మామూలు వ్యక్తులు ఉన్నారు .

ఇక చివరిగా ఉన్నవాడు అదేదో కంప్యూటర్ మానిటర్ లాగా వర్చువల్ గా కనిపిస్తూ ఉన్నాడు.

ముందర ఒక మ్యాప్ ని పెట్టి దాని గురించి వివరిస్తూ ఉన్నాడు సోమనాథ్! . ఇంతలో తనకి ఫోన్ మోగడంతో దాన్ని తీసుకొని “ ఎక్స్క్యూజ్మీ జెంటిల్మెన్......” అంటూ పక్కకు వచ్చాడు.

ఆ ఫోన్లో వ్యక్తి ఏదో విషయం గురించి చెప్పడంతో కాస్త సీరియస్ ఇంకాస్త సీరియస్ గా మారింది.

“ నేను ఈ రోజే బయలుదేరుతున్నాను” అంటూ ఫోన్ పెట్టేసాడు .

వీళ్ళ వైపు తిరిగి “ నాకు అర్జెంటుగా ఒక పని వచ్చి పడింది . మీరు ఈ విషయాన్ని కొన్ని రోజులు హోడ్లో పెట్టండి ” అంటూ హడావిడిగా బయటికి నడిచాడు.

తండ్రి తో మాట్లాడాలని అక్కడికి వచ్చి అభిషేక్, ఆయన చాలా సీరియస్గా ఉన్నాడని మాట్లాడకుండా నిలబడిపోయాడు.

బయటికి వస్తూనే “ సార్ ఇప్పుడు ఏం చేయమంటారు .....” అని అడిగాడు పిఏ.

“ హెలికాప్టర్ రెడీ చేయండి . నేను అర్జెంటుగా అమెరికాకు వెళ్లాలి ” అన్నాడు అంతే సీరియస్ గా!.

——— ***** ———