JAASMI - 6 - Last Part books and stories free download online pdf in Telugu

జాస్మి (JASHMI) - 6 - Last Part

జాస్మి


- బివిడి ప్రసాదరావు

 

EPISODE 6


"మీరు ఈ కాలేజీలోని సుమారుగా ఆరు వేల మంది స్టూడెంట్స్ కు ప్రతినిధిగా ఎంపికకై పోటీ పడుతున్నారు. ఆ స్టూడెంట్స్ వే కాదు, పరోక్షంగా వాళ్ల ఫామ్లీస్ ల భవిష్యత్తు ని కూడా ఏడాది కాలం పాటు మీ చేతుల్లోకి తీసుకోబోతున్నారు. అటు వంటి అప్పుడు మీ రీతి, మీ తీరు పబ్లిక్ గా తెలియాలిగా. అలా తెలియపర్చడం రిపోర్టర్ గా నా భాధ్యత." చెప్పుతుంది జాస్మి.
ఆ ఇద్దరు స్టూడెంట్స్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
"ఒక్కొక్కరుగా చెప్పండి. మీ ఎన్నికల విధం, మీరు చేపట్టబోయే చేతలు అన్నీ వివరంగా వివరించండి." అంది జాస్మి.
వాళ్లు మాట్లాడలేదు.
జాస్మి వాళ్లిద్దరినీ చూస్తూ, "చెప్పండి. మీ వాగ్దాటి కాలేజీ లోపలేనా. మీ వాగ్ధానాలు స్టూడెంట్స్ వరకేనా. అలా కాకూడదు. సో మాట్లాడండి." అంది జాస్మి.
అప్పటికీ వాళ్లిద్దరూ మాట్లాడలేదు.
"మీ ఇద్దరి పేనల్స్ పామ్ప్లట్స్, మేనిపేస్టులు, వగైరాలు చూశాను. స్టూడెంట్స్ ముంగిటి మీ ప్రసంగాలు విన్నాను. అవే ఇక్కడ తిరిగి వల్లించవచ్చు." అంది జాస్మి చిన్నగా నవ్వుతూ.
తర్వాత, ఆ ఇద్దరూ, ఒకరి తర్వాత ఒకరుగా, అట్టివన్నింటినీ పోటా పోటీగా ఏకరవు పెట్టారు.
వాళ్లు చెప్పడం ముగియగా, "థట్స్ గుడ్. వెల్. బట్ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అవి నివృతి పర్చాలి." అంది జాస్మి.
"డౌట్స్ ఏమిటి." అడిగాడు రేవంత్.
"మీ హామీల్లో ఆర్ధిక పరమైనవి కొన్ని ఉన్నాయి. వాటిని మీరు ఎలా నెరవేర్చగలరు." అడిగింది జాస్మి.
"ఏముంది. కాలేజీ ఫండ్స్ ఉంటాయిగా." చెప్పాడు కమలాకర్ ఈజీగా.
"అంతంతే." అన్నాడు రేవంత్.
"అవునా. కాలేజీ ఫండ్స్ అంటున్నారుగా. ఇంతకీ మీ కాలేజీ బడ్జెట్ స్వరూపం, స్వభావం మీకు తెలుసా." ప్రశ్నించింది జాస్మి సూటిగా.
"తెలుసుకుంటాం." చెప్పాడు రేవంత్ విసురుగా.
"అంతంతే." అన్నాడు కమలాకర్.
"అవునా. ముందే ఏమీ తెలుసుకోకుండా మీరు అన్నన్నేసి హామీలు గుప్పించేస్తున్నారు. మరి అంత నిల్వ బడ్జెట్ లో లేకపోతే." ఆగింది జాస్మి.
ఆ ఇద్దరినే చూస్తుంది.
ఆ ఇద్దరూ మొహాలు చూసుకున్నారు.
"చెప్పండి." రెట్టించింది జాస్మి.
"మరి. మరి. మరే. మా ముందోళ్లు ఇలానే, మాలానే చెప్పారుగా." అన్నాడు రేవంత్.
"ఐతే ఆ మీ ముందోళ్లు వాటిని చెప్పినవి చెప్పినట్టు చేశారా. నెరవేర్చారా." అడిగింది జాస్మి టక్కున.
ఆ ఇద్దరూ తిరిగి మొహాలు చూసుకున్నారు.
"ఏదో ఎలాగో ఎవరో కొద్ది మంది బలపర్చడంతో మీ ఇద్దరూ రెండు పేనల్స్ గా విడగొట్టబడి బరిలోకి దిగిపోయి, విచ్చలవిడిగా వాగ్దానాలు చేసేస్తున్నారు. పైగా కేవలం ఒక్క సంవత్సరం కాల పరిమితికి రెచ్చిపోతున్నారు. స్టూడెంట్స్ అందర్నీ రొచ్చున పడేస్తున్నారు. ఇది ఎంత వరకు సమంజసం." ఆగింది జాస్మి.
ఆ ఇద్దరూ ఏమీ అనలేక పోతున్నారు.
అక్కడ ఉన్న మిగతా స్టుడెంట్స్ వైపు తిరిగి, "వినండి స్టూడెంట్స్. అర్థ, అంగ బలాలతో మీలోని కొద్ది మందిని పోగేసుకొని, ఎన్నికల పేరుతో మీ ముందుకు వస్తున్నారు ఈ ఇద్దరు. మీరు వీళ్ల ప్రలోభాలకి భ్రమించి, లొంగి వీళ్లలో ఒకరిని ఎంపిక పేరిట మీ నెత్తుల పైకి ఎగేసుకుంటున్నారు. ఆలోచించండి. వీళ్ల ముందోళ్ల చేతల్ని విస్మరిస్తూనే, ఏదోలే అన్నట్టు ఆ తీరునే తిరిగి వీళ్ల రూపాన కోరుకుంటున్నారు. మీ ఓటు గెలిపించుకోవడానికే కాదు, నిలతీయడానికి కూడా వినియోగించుకోండి. అప్పుడే అన్నీ చక్కగా ఫలిస్తాయి, ప్రతిఫలిస్తాయి, ప్రజ్వరిల్లుతాయి." చెప్పింది జాస్మి.
అక్కడ చేరిన స్టూడెంట్స్ లో గుసగుసలు మొదలయ్యాయి.
అప్పుడే, "ఏడాదికి ఒక మారు ఎన్నిక కనుక, ఎవరికైతే ఏమిటి, ఎవరైతే ఏమిటి అన్న ధోరణిలో కాక, ఈ ఇద్దరూ మీకు నచ్చక పోతే, ఓటు వేయడమే మానేయండి. సరైన వ్యక్తి అనిపించే వరకు ఎన్నికను నిలిపేయండి, నివారించండి." తిరిగి చెప్పింది జాస్మి.
అక్కడ స్టూడెంట్స్ లో గుసగుసలు మరింత గోలగా పెరిగాయి.
రేవంత్, కమలాకర్ హైరానా అవుతున్నారు.
"ప్లీజ్. సైలెన్స్. దయచేసి నేను చెప్పేది వినండి." అంది జాస్మి చొరవగా.
అక్కడ గుసగులు మెల్లిగా తగ్గిపోయాయి.
రేవంత్, కమలాకర్ ల వైపు చూస్తూ, "ఇప్పుడు మీ ఇద్దరే ఆలోచించుకోవాలి. నిర్ణయం తీసుకోవాలి. మీరు గుప్పించిన హామీలను నెరవేర్చలేమనుకుంటే, అదే ఇప్పుడు బహిరంగంగా ఒప్పేసుకొని లేదా చెప్పేసి, సాధ్యాసాధ్యాల అనుసారంగా స్టూండెట్స్ సంక్షేమానికై పాటు పడతామని, స్టూండెట్స్ సమస్యల మాఫీకే కృషి చేస్తామని హామీలు ఇవ్వండి. స్టూండెట్స్ శ్రేయస్సుని కోరుకుంటూ ఓటు అడగండి." చెప్పింది జాస్మి.
ఆ వెంబడే, "నాది మరో మాట. నేను ఇప్పుడు చెప్పినవి మీకు సమ్మతమైతే, రెండు పానెల్స్ గా కాకుండా మీ ఇద్దరు కలిసిపోయి ఒకే పానెల్ గా ఏర్పడండి. దాని మూలంగా మీ ఎంపికకై మీరు వెచ్చిస్తున్న మొత్తం మిగులుతుంది లేదా తగ్గుతుంది. కావాలంటే ఆ మొత్తాలన్ని మీ పదవీ కాలంలో స్టూడెంట్స్ క్షేమంకై వినియోగించుకోవచ్చు. ఇది మరింతగా స్టూడెంట్స్ బాగు అవుతుంది. ఆలోచించండి." ఆగింది జాస్మి.
అందర్నీ చూసింది.
తిరిగి, "ఇలా చేయగలిగితే, పేనల్స్ గా మీరు విడడం ఆగిపోతుంది. తద్వారా మీ మధ్య భేదాలు, భేషజాలాలు సమసిపోతాయి. మీ మధ్య కక్షలు, కుంతత్రాలుకు తోవే ఉండదు. పైగా మిమ్మల్ని చూసి మేమూ అట్టి ఆశయాలతోనే ఉన్నామని మరి కొందరు స్వేచ్ఛగా ముందుకు రావచ్చు. అప్పుడు అటు వంటి వారిలో తమకు తప్పక అండగా ఉంటారనుకున్న వారిని స్టూడెంట్స్ నిశ్చలంగా ఎంపిక చేసుకుంటారు. ఇట్టి ఎన్నిక ఎంపిక సఫలమవుతుంది. యోచించండి." చెప్పడం ఆపింది జాస్మి.
పిమ్మట..
తొలుత రేవంతే మాట్లాడగలిగాడు.
"నేను పోటీ నుండి తప్పుకుంటాను." చెప్పాడు.
ఆ వెంబడే..
కమలాకర్ చెప్పాడు. "నేను కూడా తప్పుకుంటాను."
"మీరు తప్పుకుంటే, మీ పేనల్స్ కూడా రద్దయిపోతాయి. పూర్తిగా ఎన్నికే ఆగిపోతుంది." చెప్పింది జాస్మి.
ఎవరూ మాట్లాడలేదు.
"ఒకలా చేయండి. కాలేజీ స్టూడెంట్స్ అంతా కలిసి సమావేశం అవ్వండి. సమిష్టి ఎంపికలతో ఒక పేనల్ తయారు చేసుకోండి. లేదా మీ సంక్షేమంకి నిలుస్తానని నికరమైన హామీతో ముందుకు వచ్చిన మీలో వారిని ఎంపిక చేసుకొని, ఒక ఛాన్స్ ఉమ్మడిగా ఇవ్వండి. అలా మీ తర్జన భర్జనల తర్వాత, మీ యాజమాన్యాన్ని కలిసి మీ తీర్మాణాన్ని తెలిలిపర్చండి. కొత్త ఒరవడిగి నాంది పలకండి." చెప్పింది జాస్మి.
తర్వాత..
కొద్ది సేపటిలోనే అంతా అమోదయోగ్యంగా చప్పట్లు చరిచారు.
జాస్మి సరళంగా అక్కడ నుండి కదిలింది ఆ వార్తతో.


***


H

 

డోర్ బెల్ మోగుతుంది.
శకుంతల నిద్ర లేచింది. 'అబ్బ. ఇంతగా నిద్ర పట్టేసింది ఏమిటి.' అనుకుంది.
వెళ్లి డోర్ తీసింది.
గుమ్మం ముందు పెట్టిన పాల పాకెట్ తీసుకుంది. దానిని ఫ్రిజ్ లో పడేసింది.
రిప్రెష్ అయ్యేక నేరుగా హాలు లోని గోడ మీది ఫోటో ముందు నిలిచింది.
దాని ముందు భాగాన్ని శుభ్ర పరిచింది. ఆ ఫోటోకి కొత్త పూల మాలను సర్దింది.
ప్రతి రోజులాగే అక్కడి ఆ ఫోటోలోకి తదేకంగా చూస్తూ కొద్ది సేపు నిలిచింది.
పిమ్మట కిచెన్ లోకి వెళ్లింది ఫ్రిజ్ లోని పాల పాకెట్ ను తీసుకొని.
బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి హాలులోకి వచ్చింది. రైటింగ్ టేబుల్ ముందు కూర్చుంది.
దుర్గ ఆశయాన్ని, వ్యక్తిత్యాన్ని ఎఱిగిన శకుంతల వాటిని సృజనాత్మకంగా స్కిట్స్ రూపాన పేరుస్తూ ఒక ప్రముఖ పత్రికకు అందిస్తుంది చాన్నాళ్లుగా. వారు వాటిని తమ పాఠకులకు చేరువ చేస్తున్నారు.
శకుంతల తను సృజించిన జాస్మి పాత్రతో దుర్గను నిలుపుతుంది.
ఆ హాలు గోడ మీది ఫోటోలో ఉంది తన కూతురు దుర్గ.
దుర్గ కరోనా బారిన పడి చనిపోయి రెండేళ్లు అవుతుంది.


***


(సమాప్తం)


***

షేర్ చేయబడినవి

NEW REALESED