Read Those three - 9 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 7

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 20

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 6

                         మనసిచ్చి చూడు -06అప్పుడే సడన్గా కరెంట్...

  • నిరుపమ - 6

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • అరె ఏమైందీ? - 19

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 9

మతం లాంటి సున్నితమైన విషయాలను ఇలా ఆలోచించి అర్థం చేసుకోవాలి . అకారణంగా ఇతర మతాలను దూషించడం ఒక వ్యసనం గా అలవాటు చేసికోకూడదు . ఇక మత వ్యాప్తి అన్నది చాలా సున్నితమైన అంశం . నేను అధ్యయనం, స్వానుభవంతో తెలుసుకున్న ధర్మసూత్రాలను , జీవిత సత్యాలను ప్రచారం చేసి ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలి . కష్టాలకు , కన్నీళ్ళ కు
కారణం తెలియజేయాలి . అహింసో పరమో ధర్మః అన్న బుద్ధుడి మహా వాక్యాన్ని , మానవత్వపు విలువల్ని ప్రజావాహిని లోకి తీసుకుని వెళ్ళాలి . " అన్న మహదాశయం తో భిక్షువులు తూర్పు ఆసియా దేశాల్లో పర్యటించారు .
వారిది సాత్విక ప్రవృత్తి . హింసకు పూర్తిగా వ్యతిరేకులు .
వాళ్ళ కు రాజ్య కాంక్ష లేదు . కనుక శత్రువులు కూడా లేరు.
సామాన్యుల లో పరివర్తన తేవటం వారి లక్ష్యం . అందుకే బౌద్ధం తూర్పు , దక్షిణాసియా దేశాలలో వ్యాపించింది .
ఇందుకు పూర్తి విరుద్ధం గా , రాజ్య విస్తరణ కు , సాధనంగా
సుల్తానులు ఇస్లాం ను ఈ దేశంలో వ్యాప్తి చేయాలనుకున్నారు . ఒకరి స్వేచ్ఛ ను , మతం విశ్వాసాలను కట్టడి అన్య మత దురభిమానం . అమానుషం , అనాగరికం .
మానవత్వానికి మించిన మతం లేదు . ఈ సత్యాన్ని వివరించడానికి ఒక పోలీసు అధికారి అనుభవం చెబుతాను . పాతికేళ్ల మాట . ఈ నగరం లో రాజకీయ కారణాల వల్ల మత ఘర్షణలు మితిమీరి పోయాయి . ఎక్కడ చూసినా
హింస , అల్లర్లు , అశాంతి . .... నగరంలో కర్ఫ్యూ విధించారు . రాత్రి పూట ముమ్మరం గా పోలీసు గస్తీ లు . ఒకరోజు నేను చెప్పిన పోలీసు అధికారి తన సిబ్బందితో నైట్ పెట్రోలింగ్ చేస్తున్నాడు . అర్థరాత్రి కావటం వల్ల నగరమంతా నిర్మానుష్యంగా ఉంది . ఆ సమయంలో ఒక వీధి లో ఆటో
ఒకటి వేగంగా దూసుకుపోవటం ఆ అధికారి చూశాడు . తను
సిబ్బంది తో ఆ ఆటోను అనుసరించాడు. . ఆటో ఒక షాపు
ముందు ఆగింది. డ్రైవర్ దిగాడు .అతడి చేతిలో సీసా , ఒక పొట్లం కనిపించాయి. . వాటితో అతడేదో చెయ్యబోతున్నాడని ఆ అధికారి కి అనుమానం వేసింది .
మెరుపు లా అతడిని పట్టుకుని ఏం చేయబోతున్నావ్ అని
గద్దించాడు . అతడు బిత్తర పోయాడు . " సార్ ! ఈ షాపు ముందు నా స్నేహితుడు ప్రకాశం పడుకుని ఉన్నాడు . వాడు
అనాధ . అమాయకుడు. . ఈ కర్ఫ్యూ లో వాడి నెవరు పట్టించుకుంటారు సార్ ? అందుకే తిండి లేక చచ్చి పోతాడని వాడి కోసం రొట్టెలు , మంచి నీళ్ళు తీసుకుని వచ్చాను . " అతడి జవాబు. . పోలీసు అధికారి ఆశ్చర్య పోయాడు . తన స్నేహితుడి కోసం " షూట్ ఎట్ సైట్ ఆర్డర్ ఉన్న సమయంలో ఈ డ్రైవర్ ఇంత సాహసం చేశాడా ? నమ్మలేక పోయాడు ఆ అధికారి. అతడి పేరు అడిగాడు." "రఫీ" డ్రైవర్ సమాధానం. ఆగాడు ఇనాయతుల్లా. సభలో సంరంభం సంభ్రమం సంతోషం తో కూడిన కలకలం .
" ఈ సంఘటన లో స్నేహం మతాల సరిహద్దులను చెరిపివేసింది. . జీహాద్ అంటే ఏమిటి ? మతం పేరిట అమాయకులను చంపడమా ? ప్రపంచంలో ఇస్లాం తప్ప మరో మతం ఉండకూడదన్న కోర్కె న్యాయమేనా ? బాంబులతో , తుపాకుల తో విధ్వంసం సృష్టించి మత వ్యాప్తి చేయాలనుకోవడం అమానుషం కాదా ? పవిత్ర ఖురాన్ లో ఉన్న జీహాద్ కు , ఇప్పుడు జీహాద్ పేరుతో జరిగే మారణకాండ కు ఎలాంటి పోలిక లేదు . రాజకీయ దురుద్దేశాలతో అమాయక ముస్లిం యువకులను పావులుగా వాడుకోవడం మహా దారుణం .
ఎంతో ప్రేమగా కనిపెంచుకున్న తల్లిదండ్రుల కు గర్భశోకం.
మనుషుల ను చంపి , సంవత్సరాల తరబడి శ్రమించి ,కట్టిన ప్రజల ఆస్తులను ధ్వంసం చేసి ఇస్లాం రాజ్యం స్థాపించాలనుకోవటం తెలివైన పనేనా ? పీనుగుల గుట్ట మీద , శిధిలాల కొండల మీద చేసేది పరిపాలన అనిపించుకుంటుందా. ? అభివృద్ధి , మానవ వికాసం కొన్ని దశాబ్దాలు వెనుక బడిన తర్వాత మనం సాధించింది ఏమిటి ? " ఆవేశం తో , కోపంతో ఇనాయతుల్లా మొహం ఎర్రబడింది . సభలో చీమ చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం .
ప్రతి ముస్లిం యువకుడు ఆలోచించ వలసిన విషయమిది. గత వందల సంవత్సరాలు గా ఇస్లాం వ్యాప్తి కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి . హిందువుల ను శారీరకంగా, మానసికంగా హింసించారు . అయినా నేటికీ ఈ దేశంలో అధిక శాతం హిందువులే . ముస్లిం లు కేవలం మైనారిటీలు . ఇది చరిత్ర చెబుతున్న సత్యం. . పైగా మనది లౌకిక రాజ్యం. . మత స్వేచ్చ ప్రాధమిక హక్కు అయినా ఏ హిందువు ఇస్లాం మతం స్వీకరించటం లేదు . హిందూ- ముస్లింలు భాయి భాయి అంటున్నారు . అంటే ముస్లిం లతో సహజీవనం కోరుకుంటున్నారు. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం . విపరీతంగా ,ఉన్మాదంగా ,ఆలోచిస్తూ, భ్రమల్లో కొట్టుకుపోతూ ఇస్లాం రాజ్య స్థాపన జరగాలి జరుగుతుంది అనే ఊహల్లో విహరించకండి . "
సభలో వాతావరణం గంభీరంగా మారిపోయింది .
" మతం జీవితంలో ఒక భాగం. మతమే జీవితం కాదు . జీవితం రంగుల హరివిల్లు లాంటిది . చదువు , జ్ఞానం , విజ్ఞానం, ఆశయాలు , ఆకాంక్షలు , జీవిత లక్ష్యాలు , బంధాలు, అనుబంధాలు, మానవత్వం , సామాజిక బాధ్యత.--- జీవిత సంపూర్ణ రూపం ఇది . ఇవేమీ లేని జీవితం అర్థం లేనిది . దేవుడు ఎక్కడో ఆకాశంలో లేడు. . మన గుండె ల్లో ఉన్నాడు . రాగద్వేషాలు లేని మనసుతో నీ గుండె చప్పుడు గమనించు . దేవుడు వినిపిస్తాడు . ఆయనే అల్లి ....ఎహోవా.... ఈశ్వరుడు. ఆయన విశ్వమంతా అణువణువునా కనిపిస్తాడు . మీ మనసులను కేవలం గుళ్ళ కు , మసీదు లకు చర్చ్ లకు పరిమితం చేయకండి .
సానుభూతి , సహనం , సహృదయం అలవరచుకోండి . అప్పుడు మీరు నేలపై నడిచే జీవరాసుల్లో , గాలిలో ఎగిరే పక్షుల్లో కూడా దేవుడిని చూడగలరు . ఇందు కోసం మీరు జాతి, మతం , వర్గాలు సృష్టించిన ఇరుకు గదుల్లోంచి బయట పడాలి . మీ ఆలోచనా పరిధి విశాలం కావాలి .
మీ చూపు దిగంతాల వరకు వ్యాపించాలి .
నాది ఊకదంపుడు ఉపన్యాసం కాదు . అవలోకనం తో , స్వానుభవంతో చెబుతున్న అక్షర సత్యాలు . ఆలోచించటం ఆత్మ విమర్శ చేసుకోవటం మీ వంతు ." .

ఇనాయతుల్లా సృష్టించిన భావలహరి సభికుల్లో చిరు ప్రకంపనలు కలిగించింది . ఇది శుభారంభం
. ముఖ్యంగా యువకుల మొహాలు భావావేశం తో జేగురు రంగు లోకి మారాయి .
" ఇప్పుడు అసలు విషయానికి వస్తాను . ప్రయత్నం మాటలకే పరిమితం కాదు . నా వంతు బాధ్యతగా , సమాజంలో మంచి కోరుకునే సహృదయులైన ముస్లిం పెద్దల సహకారంతో ఓ సంస్థ ను ప్రారంభించ బోతున్నాను . చాలా సందర్భాలలో పేదరికం , కోరుకున్న స్థాయిలో చదువు
కునే అవకాశం , చదువు కున్నా తమ అర్హత కు తగిన ఉద్యోగాలు లేకపోవటం ఉగ్రవాదానికి పునాది . మతోన్మాదుల విషయం వదిలేయండి . వారిని అల్లా కూడా
మార్చలేడు . వారిది వితండవాదం . వారివి విపరీతమైన
పోకడలు. వారిని మినహాయించి మిగతా ముస్లిం యువకులకు ముఖ్యంగా పేదవారికి ఓ దారి చూపగలిగితే
వారు ఉగ్రవాదం జోలికి వె‌ళ్ళరు . కానీ-- మా సంస్థ కేవలం ముస్లిం యువతకే పరిమితం కాదు . ఈ మధ్య కాలంలో అరకు లోయ లో గిరిజనులు కూడా ' ఇస్లాం స్టేట్" ప్రలోభం లో పడి ఉగ్రవాదులు గా మారటం చూస్తున్నాం . ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే కొంత శాతం వరకు ముస్లిం కాని యువతను కూడా మా సంస్థ కు ఆహ్వానిస్తున్నాము .
ఎవరికైనా పేదరికమే అర్హత . ఎలా ఎంపిక చేయాలో , అందుకు పాటించవలసిన నిబంధనలు ఏమిటి , వారి చదువుకు సంస్థ చేసే ఆర్థిక సహాయం లాంటి అంశాలు , పెద్దల తో , సంస్థ సభ్యులతో వివరంగా చర్చించి అతి త్వరలో ప్రెస్ కు మీడియా కు తెలుపుతాం . ఈ సంస్థ కేవలం ఆర్థిక సహాయం చేసి చేతులు దులుపుకోదు . నిరంతరం పలు అంశాల్లో యువతకు కౌన్సెలింగ్ ఇస్తుంది . వారి వ్యక్తిగత అభిరుచులు , సామాజిక బాధ్యత , తన మతం పట్ల స్పష్టమైన అవగాహన , రెలిజిరస్ టాలరెన్స్ అవసరం. .
మానవ సంబంధాల పట్ల ఆసక్తి , పోటీ ప్రపంచంలో తాము అవకాశాలను అందిపుచ్చుకునే వ్యక్తిగత సామర్థ్యం , ఇలాంటి అంశాలన్నింటిలో ప్రముఖ సామాజిక సంస్థలతో
కౌన్సెలింగ్ తప్పనిసరిగా ఉంటుంది . " వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సెలెన్సీ " లాంటి సంస్థల సహకారంతో ఓ యువకుడి నుంచి సంపూర్ణ వ్యక్తి గా తీర్చి దిద్దటం మా సంస్థ ఆశయం . కాని మా ప్రయత్నం కేవలం మా సంస్థ కే పరిమితం కారాదు ."
" సమాజ శ్రేయస్సు , దేశ క్షేమం ఆశించే సంపన్నులు , కార్పొరేట్ సంస్థలు , ఎన్.జీ.ఓలు , సామాజిక బాధ్యత గా ఈ సంస్థ లను స్థాపించాలి. . మన యువత కు ప్రేరణ , పెద్ద దిక్కు కావాలి . కోటానుకోట్ల బిందువులన్నీ మహా సింధువైనట్లు అందరూ తమ వంతు సాయం అందిస్తే యువ
రక్తం తో పొంగుతున్న నవ్య భారతావనికి ఉజ్జ్వల భవిష్యత్తు సాకారమవుతుంది . " వినయంగా తలవంచారు .
సభ చప్పట్ల తో దద్దరిల్లింది . రవీంద్ర భారతి వెలుపల వైడ్ స్క్రీన్స్ ను కళ్ళప్పగించి చూస్తున్న జనం సందడితో , కేరింతలతో ఆ ప్రాంతం హోరెత్తి పోయింది .
ఇనాయతుల్లా మొహం లో సంరంభం . " స్వర్గం ఎక్కడో లేదు . భగవంతుడు సృష్టించిన ఈ భూమే స్వర్గం . మన సంకుచిత భావాలతో మనమే ఈ స్వర్గాన్ని నరకం చేశాం .
మళ్ళీ ఈ భూమి పై స్వర్గం దిగి రావాలంటే మనం మారాలి .
మనసు విశాలం కావాలి . ఈ మార్పు కోసమే ఈ సంస్థ పని చేస్తుంది . అందుకే ఈ సంస్థ పేరు " మిషన్ జన్నత్ " మరోసారి కరతాళజడి .
సమావేశంలో ఉన్న ఇంతియాజ్ , టీ .వీ ముందు కూర్చున్న అన్వర్ ఒక్కసార ఉలిక్కి పడ్డారు . ఆపరేషన్ జన్నత్. ... మిషన్ జన్నత్ ...ఒక్కటేనా ? ఇద్దరికీ ఒకేసారి కలిగిన సందేహం . ఇన్ని ఉన్నత ఆశయాలతో ఊపిరి పోసుకున్న మిషన్ జన్నత్ కు మిలిటెంట్ల అవసరం ఏమిటి ?
ప్రభుత్వానికి , ప్రజలకు తెలివిగా కళ్ళ కు గంతలు కట్టే కుట్రా ఇది ? తమ బలాన్ని ఎలాంటి అడ్డంకులు లేకుండా పెంచుకునే మంత్రాంగమా ఇది ? అర్థం కాలేదు ఇద్దరికీ .
ఈ సమావేశం తర్వాత దాదాపు సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది . ఇంతియాజ్ కు అన్వర్ జాడ దొరకలేదు .
" ఆపరేషన్ జన్నత్" పేరుతో ఎక్కడా హింసలు చెలరేగలేదు. . లోకల్ మిలిటెంట్స్ లిస్ట్ లో అన్వర్ ప్రసక్తే లేదు . అన్వర్
హైదరాబాదీ అయినప్పుడు అతడి వివరాలు లోకల్ మిలిటెంట్స్ ఫైల్ లో ఉండాలిగా ? మరి లేవెందుకని ? ఇంతియాజ్ కు అర్థం కాలేదు . ఆపరేషన్ జన్నత్ కదలికలు ఎక్కడా లేనందున ఇంతియాజ్ తనూ కాస్త రిలాక్స్ అయ్యాడు . అయితే ఒక Anti militant operations expert గా తనే జాగ్రత్తలో తనున్నాడు . సిటీ పబ్లిక్ ప్లేసెస్ లో గట్టి నిఘా ఉంచాడు . నగర శివార్లలో , సెన్సిటివ్ ప్లేసెస్ లో నైట్ పెట్రోలింగ్ ముమ్మరంగా జరుగుతోంది . ఎవరి మీద అనుమానం వచ్చినా , అరెస్టు చేసేందుకు వెనుకాడటం లేదు .
అన్వర్ కంప్యూటర్ ఇమేజెస్ సహాయం తో అతడి జాడ తెలుసుకునే రహస్య ప్రయత్నాలు యధావిధిగా జరుగుతూనే ఉన్నాయి. .
అన్వర్ ఎక్కడ ఏ అవతారంలో ఏ అసైన్మెంట్ లో తలమునకలుగా ఉన్నాడో. ?
మిషన్ జన్నత్ పై నిఘా ఉంచబడింది . ఇద్దరు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ జూనియర్స్ ఆ సంస్థ లో ట్రైనీస్ గా చేరారు . విద్యార్థులు గా మెలుగుతూ సంస్థ కదలికలను , కార్యక్రమాలను ఇంతియాజ్ దృష్టి కి తీసుకు వస్తున్నారు .
మిషన్ జన్నత్ కార్యక్రమాలు చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి . రోజు రోజుకు సంస్థ పేరు, ప్రతిష్టలు పొగమంచు లా వ్యాపిస్తున్నాయి . ఇనాయతుల్లా స్ఫూర్తితో నగరంలో మరో సంస్థ రూపుదిద్దుకుంది . సామాజిక సేవా కార్యక్రమాల్లో అభిరుచి , అనురక్తి ఉన్న వ్యక్తులు , కార్పొరేట్ దిగ్గజాలు , స్వామి కార్యం , స్వకార్యం అన్నట్లుగా ఉభరతారకంగా తమ వంతు సాయం అందిస్తున్నారు . " భారత ప్రభుత్వ " మానవ వనరుల మంత్రిత్వశాఖ " మిషన్ జన్నత్ కు గుర్తింపు నిచ్చి తగినంత ఆర్థిక సాయం చేస్తోంది .

.... కొనసాగించండి 10