Read Kshantavyulu - 14 by Bhimeswara Challa in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

క్షంతవ్యులు - 14

క్షంతవ్యులు – Part 14

చాప్టర్ 33

ఒక నెల ఎడబాటు తర్వాత యశోని తిరిగి కలుసుకున్నాను. మనిషి ఎంతో చిక్కిపోయింది. ముఖం మీద అలసట, నీరసమూ స్పష్టంగా కనబడుతున్నాయి. చలికాలం అది. తను నా వులన్ కోటు పట్టుకుని, కాశ్మిర్ శాలువ కప్పుకున్నా, వణకుతూ, ప్లాటుఫారం మీద నా రాక కై ఎదురు చూస్తూంది. రైలు దిగిన వెంటనే నా కోటు ఇచ్చి వెంటనే తొడుక్కోమంది. టాక్సీలో ఇంటికి వెళ్తున్నాము ఒకరినొకరం హద్దుకు కూచుని.

‘‘జబ్బుపడ్డావా అమ్మీ,’’ అడిగాను తన చేయి తీసుగుని.

“లేదే, ఎందుకలా అడుగుతున్నారు?’’ అంది నీరసంగా నవ్వుతూ.

‘‘నీ వాలకం చూస్తే అలానే వుంది,’’ అన్నాను రుగ్దకంఠంతో.

‘‘ఇదంతా విరహం బాదల్ బాబూ. ఇక ఇప్పటి నుంచీ మిమ్మల్ని ఒక్కరినీ ఎక్కడికీ పంపించను. ఎడబాటంటే ఏమిటో తెలిసి వచ్చింది’’ అంది హఠాత్తుగా ఒడిలో తల పెట్టి కళ్లు మూసుకుని.

‘‘నేనెలా అనిపిస్తున్నాను,’’ అన్నాను నా తల త్రిప్పి తన కళ్ళలోకి చూస్తూ

‘‘మీరు ఏమీ మారలేదు, మునుపటి లాగే వున్నారు. నేను లేని లోటు మీకున్నట్లులేదు, ’’ అంది.

‘‘అది కొంత మటుకు సురేఖ తీర్చింది అమ్మీ,’’ అన్నాను.

‘‘సురేఖ కొత్త కాపురమెలాగుంది?’’ అంది.

‘‘అన్యోన్య దంపతుల్లా ఉన్నారు, సురేఖ నాకుచెప్పగా మిగిలిన నీమీద ప్రేమను ఇందులో పొందు పరచిందను కుంటాను,’’ అన్నాను జేబులోంచి ఉత్తరంతీసి.

“ఇప్పుడు కాదు తర్వాత చదువుతాను, నన్ను ఇలాగే పడుకోనివ్వండి. ఈ నెల్లాళ్లూ ఈ సుఖం కోసమే పరితపించాను,’’ నా ఒడిలో పడుకునే కళ్లు మూసుకుని అంది.

‘‘నేను నీకు ఇంత అవసరమని ఎప్పుడూ చెప్పలేదేమి అమ్మీ? చెప్పివుంటే నిన్ను వదిలి వెళ్లేవాడిని కాను,’’ శాలువ సరిగ్గా ఆప్యాయంగా కప్పి అన్నాను.

‘‘అభిమానం అడ్డువచ్చింది. ఇక ఎన్నడూ ఈ పొరపాటు చెయ్యను,’’ అంది నా చెయ్యి గట్టిగా పట్టుకుని.

ఆమాటతో నా హృద‌యం పూర్తిగా కరిగిపోయింది.

“అలాగే చెయ్యి అమ్మీ, నేను ఎప్పుడూ ఇక నీ మాటకు అడ్డుచెప్పను,’’ నెమ్మదిగా ఆమె తలను ముద్దుపెట్టుకుని అన్నాను,

‘‘మీరు ఎప్పుడు అలాగే అంటారు,’’ అంది మెల్లగా.

“కాదు అమ్మీ నిజం చెప్తున్నాను నమ్ము, నీ ప్రేమ విలువ ఇప్పుడు పూర్తిగా గ్రహించగలిగేను,’’ అన్నాను.

యశో దీనికి జవాబివ్వలేదు. అలాగే కళ్లుమూసుకుని నా ఒడిలో వుండిపోయింది. కనుకొలుకుల్లో కొంత సేపటికి కన్నీటి బిందువులు కనబడ్డాయి. నెమ్మదిగా, మృదువుగా వాటిని తుడిచి వేశాను.

ఆ రేయి నెల తర్వాతి రేయి. నా నేత్రాలకు యశో అందం ఎన్నటికన్నా చందంగా ఉంది.

" నీకు గుర్తుందా అమ్మీ మన ఆంధ్ర ప్రాంతం చూడాలన్నావు," అన్నాను.

"మీరెల్లాగూ తేసుగెళ్ల లేదుగా, ఇప్పుడెందుకీ ఎందుకీ రెచ్చగొట్టడం," అంది బుగ్గ ముడిచి.

"ఎంత అందంగా ఉన్నవో వెళ్లి ఒమారు అడ్డం చూసుకో," అన్నాను చేయి చూపిస్తూ.

"మీ కళ్ళుండగా నాకు దాని అవసరమేమిటి చెప్పండి,' అంది నా పక్కన కూర్చో బోతూ.

"ఆగు కాస్త నా పెట్టేలోని ప్యాకెట్ తీసుకురా," అన్నాను.

"ఏం తెచుకున్నారేమిటి మీవూరినించి అంత శ్రద్ధగా," అంది ఆ ప్యాకెట్ అందిస్తూ.

"మన ఉప్పాడ చీరలు కట్టుకుని వాటి అందంపెంచుతావని ముచ్చటగామూడు చీరలు తెచ్చాను,"

అన్నాను ప్యాకెట్ విప్పుతూ.

"ఈ లెక్కన మీకు త్వరలో 'సరసశిఖామణి' బిరుదివ్వాల్సొస్తుందేమో," అంది వాట్లని పరిశీలిస్తూ.

"ఉండండి ఇపుడేవస్తా," అని మా మూడవగది లోకి అవి తీసుగెళ్లి, గచ్చకాయరంగు చీరలో తిరిగొచ్చింది యశో ఉల్లసంగా .

"ఎలావున్నాను,"అంది హొయలు మీరుతూ.

"నాకళ్ళు చెప్పటంలేదూ, చీర కెంత చంద మిచ్చావో!" అన్నాను ఆప్యాయంగా.

నాకు అప్పుడు అనిపించింది. యశో నా దగ్గరవుండటము ఎంత సహజమో, ఆమె అందంగా వుండటం కూడా అంత సహజమని తోచింది. అదేదో నా హక్కులాగ భావించేవాడిని.

‘‘మీ అమ్మగారు అందంగా వుండేవారా అమ్మీ?’’ అని అడిగాను

‘‘ఏం అలా అడిగారు?’’ అంది.

‘‘ఏమో, అడగాలనిపించింది, చెప్పు,’’ అన్నాను.

‘‘అవును, మా అమ్మ చాలా అందంగా వుండేదని మా నాన్నగారు చెప్పేవారు. ఆవిడ పోలికలే నాకు వచ్చాయనేవారు, నాకు సరిగ్గా గుర్తులేదు, చాలా చిన్నతనంలో తన్ని కోల్పోయాను,’’ అంది.

‘‘అది నిజమే అయివుండాలి. లేకపోతే ఇంత అందం నీకెక్కడి నుంచి వస్తుంది,’’ అన్నాను.

‘‘నేను అందంగావుంటానా?’’ తన ముఖం వికసించగా అంది నవ్వుతూ అంది.

‘‘నెమ్మదిగా అంటావేమిటి అమ్మీ?’’ అన్నాను.

‘‘కాస్త నా అందం వర్ణించ రాదూ, వింటాను, ‘‘అంది పెదిమ నొక్కిపెట్టి నవ్వుతూ.

‘‘నేనే కవినయితే నువ్వడగాలా భామినీ? అయినా నీకూ, ఇతర వన్నెలకూ వ్యత్యాస మేమనగా నీకు అందమైన కళ్లే కాదు, అందమైన ముక్కు కూడా వుంది. నూరు అందమైన నేత్రాలలో ఎదో ఒక ద్వయానికే సొంపయిన ముక్కుతో జతకట్టే యోగం ప్రాప్తిస్తుందన్న జేన్ ఆస్టిన్ మాటకి నీ ముఖం దర్పణం,” అన్నాను

‘‘మీకవిత్వం నా మనోరంజకం. నన్నుచూసిన ప్రతివారూ, నేను అందంగా వుంటానని అంటారు. కాని మీరెప్పుడూ ఇంతవరకూ అలా అనలేదు. చాలాసార్లు కోపం వచ్చిందికూడా మీ మీద. అయినా మీరు మొదటిసారి చూసినప్పటికీ ఇప్పటికీ ఏమైనా మారేనా చెప్పండి,’’ అంది సగర్వంగా.

‘‘ముమ్మూర్తులా అలాగేవున్నావు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మరీ అందంగా వున్నావు. వయస్సుతో పాటు వయ్యారం, వంకరలూ వచ్చాయి,’’ అన్నాను.

‘‘చాల్లెండి, ఇంకవూరుకోండి, నాకు తెలుసు మీరు ఇతర పురుషుల్లా తళుకు వళుకుల శరీరాలకు లొంగిపోరని, అయినా ఆశ్చర్యపోయేదానిని నా అందం పట్ల మీరింత నిర్లక్ష్యంగా ఎలా వుండగలుగుతున్నారా అని,” అంది.

‘‘ఏమో తొలిచూపులోనే నీ అందం నన్ను అందాంధుడిని చేసిందేమో, అది నీకే తెలియాలి,’’ అన్నాను.

ఆమాటతో యశోకి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. క్షణకాలంలో పచ్చటి ముఖం ఎర్రగా కుంకుమలా అయిపోయింది. మనస్సులోని భావమే ఆమె ముఖం మీద స్పష్టంగా కనబడింది. ముఖం క్రిందకి దించివేసుకుంది.

“అరె, ఇంత సిగ్గెందుకు యశో!” అన్నాను చేత్తో ఆమె ముఖం పైకెత్తి.

‘‘నేను ఆనాడు చెప్పాను మీరు సువాసనగల పుష్పంలాంటివారని, అదే అందరినీ మీలో ఆకర్ఫిస్తుంది. మీకు అందం వుంది. కానీ అది ఎవరినీ మోసపుచ్చదు. మిమ్మల్ని చూసిన మరుక్షణంలోనే మీలోని ప్రత్యేకత కనబడిపోతుంది,’’ అంది కళ్లు క్రిందికి దించుకునే.

“ఇది చెప్పడానికి ఇంత సిగ్గెందుకు అమ్మీ” అన్నాను.

ఆ సంభాషణ ఫలితంగా నేను ఒక విషయం గ్రహించాను. అదేమంటే ప్రతి స్త్రీ తాను అందంగా వున్నానని ఇతరులు - ముఖ్యంగా ఆమెని ప్రేమించేవారు చెప్పాలని కనీసం తనలో తనైనా అనుకుంటుంది. అపరిచితుడు చెప్పినా హృద‌యం ఒకసారి స్పందిస్తుంది. ప్రశంసనీయవాక్యాలు వీనులవిందుగా వుంటాయి. ప్రకృతిసిధ్దంగా పురుషుడు సౌందర్యాన్వేషి కాని స్త్రీ అలాకాదు, లేకపోతే వారిలో చాలా మంది యావజ్జీవ బ్రహ్మచారిణులుగా వుండిపోవాల్సి వస్తుంది. వనిత పురుషునిలో వాంఛించేది అందంకాదు; అతడి ఆదరణ, అనురాగము. యశో నాకు ఆ ఆశ్రమం నించి రాసిన ఉత్తరంలో కొన్నివాక్యాలు తలచుకున్నాను (నేను దాన్ని పూర్తిగా బట్టీ పట్టేను), ‘‘ఎందుకొ అందరూ నా శరీరానికే ప్రాముఖ్యత ఇస్తారు. నేను శరీరాలోచలని కట్టిపెట్టాను. పరులు కొనియాడే నా ఈ శరీర సౌందర్యాన్ని కాపాడు కోవటానికి ఇరవైమూడు సంవత్సరాలు వ్యర్థం చేశానా అనిపిస్తుంది. ఇంకా అజ్ఞానాంధకారంలో పడి కొట్టుకు పోమంటారా? ఆ దశని నేను దాటేశాను.’’

ఆరోజుల్లో ఆమె నిజంగా అలా చేసియుండవచ్చు. కాని అది ఆమెలో అణగారివుంది. అంతరించిపోలేదు. నేను ఆ కుటీరంలో అడుగుపెట్టిన క్షణంలోనే తిరిగి తలఎత్తింది. నేను ఆనాడు అనుకున్నది నిజమే. లఖియాలాగ యశోరాజ్యం ఎప్పుడూ సర్వసంగపరిత్యాగి కాదు. ఈమె ఎన్నడూ సన్యాసిని కాలేదు. లఖియాని ఆ దొంగ గురువు సుందరీ అని పేరుపెట్టి పిలిస్తే ఆమె సహించి వుండేది కాదు. అతగాడు ఆ విషయం గ్రహించి ఆమెకు రాణి అని పేరు పెట్టాడు. యశోని ‘సుందరీ’ అని పిలిస్తే ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఆమె అది నిష్కల్మషమైన హృద‌యంతో పెట్టిన పేరనుకున్నదనే విషయం నిస్సందేహమైంది. అయినా ఆమె సౌందర్యాన్ని ఇతరులు కొనియాడటం స్వాభావికమైనదని ఆమె అనుకొనివుంటుంది. అందుకనే ఆ పేరు ఆమెకి వచ్చిందని నాకు చెప్పింది. కాని ఆ పేరుపెట్టిన వ్యక్తి కల్మష హృద‌యుడని తెలసిన వెంటనే చెవులుమూసుకుని దానిని కాశీలో వదిలేసింది.

కాశీలో కాలం గడిచిపోతూంది మనస్సును బాధించే ఆలోచనలు కట్టిపెట్టాను. ఎందుకు వాటిని గురించి బాధపడాలి? దానివల్ల నాకు కలిగే లాభమేమిటి? జీవితంలో అంత సుఖం నేనెప్పుడూ అనుభవించలేదు. ప్రాణ సమానంగా ప్రేమించే ప్రేయసి, నిందారహితమైన మనస్సు, ఈ రెండూ ఎప్పుడూ నాకు ఇంతకు ముందు కలసిరాలేదు. ఇదివరకు ప్రవాహంలోపడి కొట్టుకుపోయేవాడిని కానీ ఇప్పుడు ప్రవాహంలో పయనించడం అభ్యసించాను. నేను వాంఛించిందంతా నాకు ఆమె వద్ద లభించింది. కాని ఆమె వాంఛించింది నానుండి ఆమెకు లభించలేదు. నేను తప్ప ఇంకెవరైనా ఆమెను సుఖపెట్టేవారు. అలాంటి స్త్రీకి ఏలోటు రానిచ్చివుండేవారు కారు. పిల్లలంటే యశోకి వున్న మమకారం నేను గ్రహించాను, సరళ కొడుకు ‘రామం బాబూ’ గురించి చాలాసార్లు మాట్లాడేది.

“సుశీకి మీకు వివాహం జరిగివుండినట్లైతే మీ మనుమడికి పెట్టుకోవల్సిన పేరది,” అంది

‘‘అప్పుడు బాదల్ బాబూ అనే పేరు నాకు వుండదు యశో. ఇంకెవరికో ఆపేరు పెట్టివుందువు,’’ అన్నాను.

యశో వినివూరుకుంది, ఆమెవుద్దేశం నేను గ్రహించాను. ఆమె అన్న ఆ వాక్యంలో సుశీకి బదులు యశో అని చేరిస్తే సరిపోతుంది. అది ఆమె చెప్పలేక అలా అంది. కాని ఆమెలోని నిగ్రహశక్తి నన్ను ఎంతో ఆశ్చర్యపరిచేది. లేకపోతే ఏం జరిగేదో?

చాప్టర్ 34

ఎదురుచూసిన శుభవార్త రానే వచ్చింది. లఖియా బెయిల్ హియరింగ్ వచ్చే గురువారం ఖాయమయిందని. యశో సంతోషానికి పట్ట్ట పగ్గాలులేవు, లేశమంత శంక అయినా లేదు న్యాయమూర్తి తీసుకోబోయే నిర్ణయంమీద, ఆమెకు రవిప్రకాష్ మాటలు బాగా వంటబట్టాయి.

మేమిద్దరం బుధవారంమధ్యాన్నం ముస్సోరి చేరి యధావిధిగా సరళ ఇంట్లోనే బసచేసాం. మరునాడు రాజేంద్రకు వీలులేకపోవడం వలన, సరళే మమల్ని డోన్ తీసుకెళ్లింది వాళ్ళ కారులో. సరళ కారు డ్రైవ్ చేస్తుంటే దారిపొడుగునా యశో, నేను వంతులేసుగుని 'రామంబాబు' తో ఆడుకుంటూ కోర్ట్ చేరిన విషయమే గుర్తించ లేదు.

"మీరో బుల్లిబాబుని కంటారా లేక నన్ను కని ఇమ్మంటారా?" అంది సరళ కంపౌండులో కారు పార్క్ చే స్తూ.

"మీరంటే వారి నుద్దేశించా లేక నన్నా," అంది యశో.

"ఇద్దరినీ," అంది సరళ.

"కనిపించడం అయన వంతు కనివ్వడం నా తంతు," అంది యశో నవ్వుతూ.

నాకు ఏమనాలో తెలియక నొరు మెదపలేదు.

"మవునం అర్ధాంగీకారం అంటారు, అవునా 'బాదల్ బాబు," అంది సరళ.

అప్పుడే కారు దిగి వచ్చిన రవిప్రకాష్ నన్నుఇరకాటం లోంచి తప్పించేడు.

కోర్ట్ లో అంతా రవిప్రకాష్ చెప్పినట్టే అయింది, ప్రభుత్వ ప్లీడర్ పెద్దగా పెదవి విప్పక పోగా లాఖియాను తక్షణం బెయిల్ మీద విడుదల చెయ్యాలని ఆదేశించడమేగాక, గురువుగారి మీద తాను మోపిన మానభంగ అభియోగం మూడు నెలల్లో పరిశీలించి కోర్టుకు తెలియపరచాలని పోలీసులను ఆగ్రహించారా న్యాయమూర్తి.

కోర్ట్ హాల్ బయటకొచ్చినతరువాత, యశో, సరళ, రవిప్రకాష్ని కౌగలించుకున్నతపని చేశారు.

కొంత సేపటికి రవిప్రకాష్కి కోర్టు ఆర్డర్ చేజిక్కగా, అందరం డూన్ జైలు చేరాము లాఖియాని స్వాగతించడానికి , కానీ రాబోయే సెంటిమెంటల్ తుఫానులో తనెందు చిక్కుకోడం అన్నట్లు రవిప్రకాష్ వార్డెన్ రూమ్ లోనే ఉండిపోయాడు.

మేమంతా గుమ్మంవద్ద నుంచుని పొడుగాటి ఆదారిని అవలోకించాము. లఖియా మలుపుతిరిగి మాకు ప్రత్యక్షమైంది. ఈసారి ఆమె పక్కన పోలీసువాడు లేడు. చేతిలో ఒక చిన్న మూట పట్టుకుని ఒంటరిగానడచివస్తూంది. మావద్దకు రాగానే ముందస్తుగా సరళ కొడుకుని ముద్దాడి, నాకేసి చూస్తూ, అంది, "పేరుకు తగ్గ పెద్దమనిషివి అవ్వరా."

తరువాత, సరళ, యశోల ఆలింగనలలో మునిగి, తేలి, నాదరి చేరి, పాదాభివందనంచేసింది.

'ఇదేమి బాగా లేదు లఖియా," అన్నాను తన్ను లేవదీస్తూ.

"రామంబాబు, ఇంతకంటే విలువైన గురుదక్షిణ నేనివ్వలేను, దయవుంచి స్వీకరించండి," అంది.

"సదా సుఖీభవః లఖియా," అన్నాను తన తలపై నా చెయ్యి ఉంచి.

తరువాత అందరం రవిప్రకాష్ని కలసినప్పుడు నేను లఖియా తో "ఈయన నాగురువు, నీ దైవం" అంటే “నాకు తెలుసు” అని ఆయన కాళ్ళకు కూడా మొక్కింది.

"కంగ్రాట్స్ లఖియా, నేచెప్పేనుగా మన కేసుకి ధోకా లేదని. నువ్వు తిరిగి ఈ దరిదాపుల్లోకి రానవసరం ఉండదని. కానీ ఈ వ్యవహారం తేలేవరకు నువ్వు ముస్సోరిలోనే ఉండాలి. దానికి నేను జమానతు యిచ్చాను," అన్నాడు రవిప్రకాష్ లాఖియాను లేవదీసి.

"ఇప్పుడు తనని కాశీ తీసుగెళదామనుకుంటున్నామే," అంది యశో.

"పది పదిరోజులైతే నేను పోలీసుస్టేషన్ లో మేనేజ్ చేస్తాను," అన్నాడు రవిప్రకాష్.

"వారం పది రోజుల్లో వచేస్తాలెండి," అంది లఖియా.

"వెల్కమ్," అన్నాడు రవిప్రకాష్

రవిప్రకాష్తో మాటా మంచికీ నే నాయన కారులో చేరగా, సరళ బాబుని తీసుకుని, యశో, లఖియాలతో తన కారు ఎక్కింది.

దారి పొడుగునా, తను లఖియాతో జరిపిన సంప్రదింపులు, ఆమెలో వస్తున్న చైతన్యం గురించి మాట్లాడిన విధానం రవిప్రకాష్ చెప్తుంటే నాకు వింతగా అనిపించింది.

కాశీకి బయలుదేరే ముందు యశో, నేను ముస్సోరీలో వారం రోజులున్నాము. రవిప్రకాష్ ప్రతి సాయంత్రంవచ్చి , సరళ బలవంతాన భోజనంచేసే వెళ్ళేవాడు. అతను లాఖియామీద చూపుతున్న శ్రద్ధాసక్తులు మేమందరం గమనించాము, లాఖియాతోసహా. నాకుమాత్రం తానేమీ పెద్దగా ఇబ్బంది పడుతున్నట్లనిపించలేదు.

మాతో సరళ కూడా బయలుదేరింది తన 'రామంబాబు' తో సహా, కాని రాజేంద్ర మాతో రావడానికి అంత సుముఖత చూపలేదు, "పనివుండి రాలేనన్నాడు".

అలా మొదలయింది కాశీకి మా తిరుగు ప్రయాణం, రాజేంద్ర వీడ్కోలుతో. సరళ తెచ్చిన కొత్త పేకలతో ఆ రైలు డిబ్బాలో, నలుగురం రమ్మీ ఆడ్డం మొదలెట్టేము ఆడవారి ఛలోక్తులతో. లఖియా తను నెగ్గినప్పుడు పొందిన సంతృప్తిని నే నామెలో ఇదివర కెన్నడు చూడలేదు. లఖియాలోని కోత్తదనం నన్నాశ్చర్యపరచింది. అదే నేనామెతో వ్యక్తపరిస్తే నవ్వి ఉరుకొంది. కొంతసేపటికి బాబు పేచీ మా ఆట కట్టించింది.

అప్పుడు సరళ బాబుని ఊరబెడుతుంటే, కిటికీ పక్కన కూర్చున్న లఖియా, బయటకు చూస్తూ వుంది, ఆలోచనా దృష్టితో.

"ఏమాలోచిస్తున్నావు లఖియా?" అన్నాను, చూసి చూసి.

"జీవితం ఎలా జీవించడమా అని," అంది తలా తిప్పకుండానే.

"మేమందరం ఉన్నామని మర్చి పోయావా?" అన్నాను బాధతో.

"కొత్త జీవితం మొదలెట్టడానికి మీ నలుగురి సహాయం కోరడానికి ఎప్పుడో నిర్ణయించుకున్నాను కాని నేనాలోచిస్తుంది తరువాత జీవితం ఎలా జీవించడమా అని," అంది నాకేసిచూస్తూ.

"కొంచం అర్ధమయ్యేలాచెప్పు లఖియా," అన్నాను.

"ఎలాగైతే జన్మనిచ్చినవారి సంరక్షణ లేనీదే ఏ శిశువు బతికి బట్టకట్ట లేదో అలాగే నా కొత్త జీవన నాందికి ఎవరో ఒకరి సహయం కావాలి. నా రూపం, వయసు అది నాకు లబ్ధిపరచ గలదు కానీ నేను అందుకు నా సర్వస్వాన్ని ఫణంగా పెట్టాలి. ఎలాగయితే తమ సంతానాన్ని బాల్య దశలో తలితండ్రులు ఫలాపేక్ష లేక పెంచుతారో అలాగే మీనలుగురు నా నవ్య జీవినా రంభ అధ్యాయానికి శ్రీకారం చుడతారని నా నమ్మకం. అలాగే, ఎదిగిన పిల్లలు వారి పెద్దల ఋణం తీర్చుకున్నట్లు, నేనూ ఓనాడు నాధర్మం పాటించగలనని నా విశ్వాసం. మీరు చేయగల ధన సహాయంతో, నేనేదో జీవనోపాధి కల్పించుకుని, నా జీవితం నన్నెలా నడుపుతుందో చూస్తాను," అంది లఖియా సాలోచనగా.

"నువ్వు చెప్పిందేమీ కాదనము కానీ అదేదో మా దగ్గరుండే చేసుకోవచ్చుగా?" అన్నాను

"అదెలా సాధ్యమో ఆలోచించి చెప్పండి, తప్పక వుంటాను," అంది లఖియా.

యశో, సరళ, నేను; ఒకరి మొహాలు ఒకరంచోసుగున్నాము.

"ఇంతలో ఎంత ఎదిగావు లఖియా," అంది సరళ ఆఖరికి.

"నేనేదగలేదు సరళా, ఎదిగిపించారు, రామం బాబు నార వేసి, రవిగారు నీరు పోసి," అంది లఖియా క్తుతజ్ఞతాభరిత నేత్రాలతో.

ఆఖరికి కాశీ చేరి మా ఇంటికి వచ్చిన మొదటి అతిథులతో ఖాళీగా పడివున్న మూడవ గదిని ఉపయోగబరచాము. నేనదేమాటంటే సరళ నవ్వుతూ అంది యశో తో,

“మా రామం బాబు, మీ రామం బాబు ఇంట అడుగుపెట్టిన వేళావిశేషం వల్ల త్వరలోనీకడుపు పండుతుందిలే."

"తధాస్తు," అంది లఖియా యశోని కౌగలించుకుని.

మూడురోజులు కాశీ చుట్టుముట్టి, సారనాధ్ పై దండయాత్రకు వెళ్లాం. అప్పటివరకు, అయిదుమైళ్ల దూరంలో వున్న అక్కడికి నేను వెళ్లలేదు, యశో ఇంతకుముందు ఒకసారి ఎవరితోనో వెళ్లి వచ్చింది.

మేమంతా అక్కడి బుద్ధుని విగ్రహాన్ని తదేకంగా చూస్తూవున్నాము. ఒక పక్క లఖియా మరో పక్క యశో తలవంచుకుని వున్నారు. బుద్ధుని ముఖంలోంచి వుట్టిపడే శాంతం, ప్రశాంతతా లఖియా నిమీలిత నేత్రాలలో నాకు కనబడ్డాయి. ఎప్పుడూలేంది సరళ కళ్లుమూసుకుని మౌనంగావుంది.

నాకు ఆ దొంగ గురువు తనను ఆనాడు గౌతమబుద్ధునితో పోల్చుకున్న విషయం జ్ఞాప‌కం వచ్చింది. ఆరోజు నేను తన్ని ధిక్కరిస్తే యశోకి ఎంతో కోపం వచ్చింది. కానీ చివరకు ఇలాగ అవుతుందని ఎవరనుకున్నారు? నన్నునేనపుకోలేక అదేమాట అంటే, కలవపువ్వు లాంటి ఆ కళ్లతో నా కళ్లు వొకసారి చూసి క్రిందికి దించుకుంది. దాని అర్ధం ‘‘ఈ గాయంతో ఇంకా నేను బాధపడుతున్నాను బాదల్ బాబూ. మీరు నాకు ఇంకా అది ఎందుకు జ్ఞాప్తికి తెస్తారు’’ అని నేను గ్రహించాను .

"అనాలోచితంగా పుండ్ల మీద కారంచల్లినందుకు ఈ క్షంతవ్యుడ్ని క్షమించండి," అన్నాను లాఖియాను యశోను ఉద్దే శించి.

యశో క్షమా వీక్షణం తరువాత లఖియా తన జ్ఞాన నేత్రం విప్పిండి .

"దుష్టుడికి ఇతరుల నిస్సహాయత అగ్నికి ఆజ్యం లాంటి దైతే, సౌమ్యుడుకి తన లఖియాత అంధుడి చేతి దిక్సూచి లాంటిది. కరువులో చెట్టు నరికి కలప చేయడమే లఖియాత, నిఘంటువులో నాపేరు నేనే చేర్చుకున్నాననే దోషం సరి. నాభర్త అప్పులు తీర్చడం భార్యగా నావ్యక్తిగత ధర్మం కానీ, ఉన్నఇల్లు తెగనమ్మి, నిల్వ నీడ లేకుండా చేసుకోవడం నామూర్ఖత్వం లేక రామాంబాబూ, మీరన్నట్లు, 'నా అంత సుగుణమూర్తి, త్యాగశీలి వేరే లేదనుకోవట మనే అహంకారం' అయివుండలి. నేనేగనక ఆ ఇల్లు నిలబెట్టుకొని అందులో కొంత భాగం అద్దెకిచ్చి, ఎదో చిన్న ఉద్యోగమమో లేక వ్యాపారమో చేసుకుంటూ అప్పులు తీర్చి ఉంటే, ఇహం పరం రెండూ దక్కేవి. కానీ నా లఖియాతతో రోడ్డున పడి, నన్ను నేనే నిస్సహాయురాలిని చేసుకుని నాస్వయంకృతాపరాధంతో నేనే నన్ను బలిపశువుని చేసుకున్నాను. ఈ తప్పు మరెప్పుడు చెయ్యను, అందుకు రామం బాబూ, మీకు, రవిగారికి జీవితాంతం ఋణపడి ఉంటాను,” అంది లఖియా మమ్మల్నందరిని అవాక్కుపరచేలా.

లఖియా, సరళ, బాబు మా ఇంటి కొచ్చి వారం రోజులయింది. ఆరోజే ముస్సోరికి వాళ్ల తిరుగు ప్రయాణం.

యశో,నేనువారిని సాగనంపడానికి రైల్వేస్టేషన్ కి వెళ్ళేము. కొంత సేపటికి వాళ్ళుఎక్కేవలసిన ట్రైన్ ప్లాట్ఫారం కి చేరింది. నేను వారి సామాను తలుపుపక్కనున్న కంపార్టుమెంటులో సద్దిపెట్టాను. వాళ్లిద్దరూ చెరో కిటికీ దగ్గర కూర్చుండగా, మేమిద్దరమూ ప్లాట్ఫారం మీద వారి దగ్గర నిలుచుని ఉన్నాము. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు కానీ నేను మౌనాం వహించాను.

ఇంతలో గార్డ్ పచ్చజండా చుపించగా లఖియా కిటికీలోంచి చెయ్యి వూపు తోంది. నాకెందుకో ఇంక ఆమెను తిరిగి చూడలేనేమో ననే భావం హఠాత్తుగా కలిగింది. అప్పటికే రైలు కదలిపోతూంది. నేనేమి చేస్తున్నానో నాకే తెలియలేదు. రైలు వెంట పరుగెడుతూ పుట్ బోర్డు ఎక్కి అప్రయత్నంగా లఖియావైపు వంగి అన్నాను, ‘జీవితంలో నీకంటే అధికంగా ఎవరినీ ప్రేమించలేదు లఖియా.’’

లఖియా ముఖం మీద అత్యంత ఆవేదనా ఆతురతా కనబడ్డాయి.

ఈలోపుగా రైలుప్లాటుఫారం పూర్తిగా దాటి పోయింది. అది చూసి నేను దిగటానికి ప్రయత్నించాను.

‘‘వద్దు రాంబాబూ దిగకండి’’ అంది లఖియా కంగారుపడుతూ.

ఆమెమాటలు నేను వినిపించుకో లేదు. వెనక్కోసారి తిరిగిచూసాను యశో కోసం, తను రైలుపట్టాల పక్కన పరిగెట్టు కొస్తూ కనబడింది. నాకంగారు మిన్ను ముట్టి వెంటనే కిందకి ఉరికాను. అంతే,తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు.