Read Kshantavyulu - 6 by Bhimeswara Challa in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 1

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ -వీర - 5

    వీర ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు, చూసి "వీడా, వీడికి ఎ...

  • అరె ఏమైందీ? - 14

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 3

                                           మనసిచ్చి చూడు...3డీప్...

  • అరె ఏమైందీ? - 13

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

క్షంతవ్యులు - 6

క్షంతవ్యులు – Part 6

చాప్టర్ 16

ఆ ఉత్తరం అందిన ఒక వారం రోజుల తర్వాత ముస్సోరీ బయలుదేరాను. దానిముందర, వెళ్లటమా, మానటమా అని నాలో నేను చాలా తర్కించుకున్నాను. ఏకాంతజీవితంలో పూర్తిగా విసిగిపోయాను. యశో సన్యాసిని అయిందంటే నేను నమ్మలేకపోయాను. ఆమెను చూడాలనే వాంఛ ఆ వార్త విన్న తర్వాత హెచ్చింది. అయినా యశో ఉత్తరం ఒక సన్యాసిని రాసిన దానిలా అనిపించడంలేదు! లఖియా కూడా అక్కడే ఉందని విని ఆమెని చూడాలనే ఆత్రుత కలిగింది. ఆమె కథ నేనెన్నడూ మరువలేదు. యశో, లఖియా అక్కడ కలుసుకోవటం ఎంత ఆశ్చర్యంగా ఉంది. వెళ్లటానికే నిశ్చయించాను. అన్ని భారాలతోపాటు ఇంటిభారం, భూముల భారం బాబయ్యమీద పెట్టాను. డెహ్రాడూన్ చేరుతూ అనుకున్నాను - మొదటి సారి వెళ్ళినప్పుడు నా రాక కోసం యశో ఆమె తండ్రి ఎదురుచూస్తున్నారు రైల్వే ప్లాట్ఫారం మీద, ఇప్పుడు ఆ ఇద్దరిలో ఒకరు స్వర్గంలో ఉన్నాను. ఇంకొకామె ఆశ్రమంలో ఉంది. మొదటిసారి సుశీని మరచిపోవటానికి వెళ్ళేను; రెండో సారి యశోను వెదకటానికి వచ్చాను.

నాకు యశోమీద కోపం వచ్చింది. మూర్ఖురాలు ఆశ్రమం ఎక్కడవుందో, అక్కడకు ఎలా జేరాలో, ఏమీ రాయలేదు. ఈ మాత్రం తెలియదా? ఇప్పుడు నేనెంత బాధపడాలి? నాకు ఒకేఒక ఆశ కలిగింది. సరళను కలుసుకోగలిగితే. ఆమె ఎక్కడుందో యశో రాయలేదు. సహజమంగా అత్తవారింట్లోనే ఉంటుంది ముముస్సోరిలో; బహుశా యశో అందుకే రాయలేదేమో. సామాను క్లోక్ రూమ్ లో వదిలి, ముస్సోరి కి బయలుదేరాను. ముస్సోరి చేరుతూనే చూచాయగా గుర్తున్న సరళా-రాజేంద్ర గృహాన్వేషణ మొదలుపెట్టాను. బజారులోంచీ పోతున్నాను.

రామం బాబూ.’ అని ఎవరో పిలిచినట్లైంది. పక్కకు చూశాను. ఇంకెవరు సరళే! షాపులోంచిబయటికి వస్తూ కనబడింది.

‘‘ఎప్పుడు వచ్చారు రామంబాబూ. తలవని తలంపుగా కనబడ్డారు. ఎక్కడి కిలా వెళ్తున్నారు?’’ అంది దగ్గరకు వచ్చి.

‘‘ఇప్పుడే వచ్చాను సరళా. మీ ఇంటికే బయలుదేరాను,’’ అన్నాను.

‘‘భలేవారే మీరు. మా ఇల్లు బజారులో ఉందని ఎవరు చెప్పారు మీకు? క్రిందటి సారి మా ఇంటికి వచ్చారుగా!’’ అంది నవ్వుతూ.

అప్పుడే రాజేంద్ర కూడా వవచ్చాడు రెండు షాపింగ్ బాగ్స్ తో.

‘‘మీకు ఇంకా తెలియదనుకుంటాను, ఈయనగారు మా శ్రీవారు. మీకు శుభలేక పంపటం ఇష్టంలేక వెయ్యలేద,’’ అంది సరళ రాజేంద్ర చెయ్యి పట్టుకుని .

అందుకు నేను కారణమడుగలేదు కాని ఇద్దరినీ కంగ్రాజులేటు చేశాను.

‘‘రాజేంద్ర, మీకు ఇంకా ఏదో పని ఉందన్నారు కదా. అది చూసుకుని రండి. నేను ఈయనను ఇంటికి తీసుకెళ్తాను,” అంది సరళ.

రాజేంద్ర రెండు షాపింగ్ బాగ్స్ సరళ కిచ్చి ఇంట్లో కలుస్తాను అని చెప్పి వెళ్లిపోయాడు.

‘‘పదండి రామంబాబూ. మా ఇంటికి దారి చూపిస్తాను,’’ అంది సరళ నా చేయి పట్టుకుని.

మూడు సంవత్సరాలైనా, వివాహిత అయినా ఆమె ఏమీ మారలేదు. నేను నవ్వి ఊరుకున్నాను.

‘‘నాకు రాజేంద్రకు వివాహం అయిందన్న వార్త మిమ్మల్ని ఆశ్చర్యపరచిందా రామంబాబూ,’’ అంది సరళ.

‘‘లేదు సరళా. నాకు అది చాలా సహజంగా కనబడింది. అయినా నాకిది ఇంతకు ముందే తెలుసు, యశో ఉత్తరం రాసింది,’’ అన్నాను.

‘‘యశో ఉత్తరం రాసిందా? ఎక్కడ ఉంది, ఎప్పుడు రాసింది,’’ అంది సరళ ఆశ్చర్యంతో.

‘‘ఉత్తరం ఒక వారం రోజుల క్రితం అందింది. ఎక్కడో డూన్ కి యాభైమైళ్ల దూరంలో ఒక ఆశ్రమంలో ఉంటున్నానని రాసింది. అందుకోసమే ఇక్కడకు వచ్చాను. ఈ సన్యాసినిని వెదుకుదామని,’’ అన్నాను.

‘‘అరె. గమ్మత్తుగా ఉందే. ఇంత దగ్గరలో ఉండి కూడా నాకు తెలియదు,’’ అంది.

నేను కాస్సేపు మాట్లాడలేదు. నడిచిపోతున్నాం సరళ కూడా ఏదో ఆలోచిస్తూవుంది.

‘‘సరళా. లఖియా సంగతి నీకేమైనా తెలుసా?’’ అన్నాను.

లఖియా పేరు విని సరళ తుళ్లిపడింది.

‘‘లేదు,’’ అంది.

‘‘తను కూడా అక్కడే ఉందిట,”అన్నాను.

‘‘ఏమిటి మీరనేది రామంబాబూ. లఖియా యశోదగ్గర ఉందా?’’ అంది, గట్టిగా నాచేయి పట్టుకుని.

‘‘అక్షరాలా నిజం సరళా. యశో రాసిందలా,’’ అన్నాను.

సరళ ఎంతో కష్టం మీద సంతోషాన్ని ఆపుకుంది. కళ్లు జ్యోతుల్లా వెలిగాయి.

‘‘పదండి రామం బాబూ. నేనుకూడా వస్తాను మీతో. రేపు పొద్దున బయలు దేరుదాము,’’ అంది ఉత్సాహం వుట్టిపడే కంఠంతో.

ఇంటి వద్దకు వచ్చేశాము. నా సామాను డూన్ లో వదిలివచ్చిన సంగతి అప్పుడుజ్ఞాపకం వచ్చింది.

‘‘అరే. సరళా . నాసామానంతా డూన్ లో వదలివచ్చాను,’’ అన్నాను.

‘‘ఫర్వాలేదు లెండి, రోడ్డు మీద వదలకపోతే ఏమీ అయిపోవు. మీక్కావాల్సిన సదుపాయాలన్నీ నేనే చేస్తాను. రేపు పొద్దున దారిలో తీసుకుందాము,’’ అంది.

నేనింకేమీ మాట్లాడలేదు.

ఒక గంట పోయిన తర్వాత రాజేంద్రతిరిగి వచ్చాడు. ఆనాడు భోజనాల దగ్గర సరళ ‘‘యశోని చూడటానికి వస్తావా రాజేంద్రా,’’ అంది.

యశో పేరు విని కాస్త కంగారుపడ్డాడు. యశో, యశో అంటూ, ‘‘వస్తాను. అసలు ఎక్కడవుంది, ఏమి సంగతి?’’ అన్నాడు.

‘‘ఇక్కడ ఏదో ఆశ్రమంలో ఉందట. రేపు బయలుదేరుదాం. లఖియా కూడా అక్కడే వుందిట?’’ అంది.

‘‘అయితే రేఫు నీకు కనుల పండుగ,’’ అన్నాడు నవ్వుతూ.

చాప్టర్ 17

యశో అన్వేషణార్దం, ఆ మరునాడు ఉదయం, ముగ్గురమూ బయలుదేరాము. అదృష్ట‌వశాత్తు వాకబ్ చేస్తే డూన్ కి దక్షిణదిశలో ఏవో ఆశ్రమాలున్నాయని తెలిసింది. దారిలో నా సామను కారులోకి ఎక్కించి. తినటానికి టిఫిన్ తీసుకుని బయలుదేరాము. ఒక గంట ప్రయాణం చేసేటప్పటికి ఏవో పర్ణ కుటీరాలు కనబడసాగాయి. కారు దిగి వెళ్లి ఆ ఆశ్రమాల్లోకి వెళ్లి అడిగేవాళ్లం, ‘సుందరి అనే చక్కటి సన్యాసిని ఉందాయని’.

కొన్నిచోట్ల, ‘ఆ, వుంది అనే వారు, నా గుండె వేగం హెచ్చేది. సుందరి వచ్చేది, కాని ఈ సుందరి వేరు; వెదకుతూన్న సుందరి వేరు, ఇలా చాలా చోట్ల జరిగింది. లఖియా, రాణీల పేరు చెప్పినా ఫలించలేదు.

తిరిగి తిరిగి అలసిపోయాము. యశో, లఖియాల ఆచూకి దొరకలేదు. నిరాశ, నిస్పృహ‌ల‌తో అందరి హృద‌యాలు నిండిపోయాయి. ఇంతదూరం వచ్చి వట్టిచేతులతో తిరిగి పోతామా? అక్కడ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. అందులో ఎక్కడో యశో ఉందని నాకు నమ్మకంగా ఉంది. కాని ఆమెను వెదకటం ఎలాగ? తెచ్చుకున్న టిఫిన్ అయిపోయింది. ఆకలికూడా వేస్తూఉంది. ఇదంతా వృధా ప్రయాసేనా? రాజేంద్ర నెమ్మదిగా కారు నడుపుతున్నాడు. అందరి ముఖాల మీద నిరుత్సాహం స్పష్టంగా కనబడుతుంది. ఇంతలో హఠాత్తుగా సరళ అరిచింది, “కారు ఆపండి”

రాజేంద్ర సడన్ బ్రేక్ వేసిన కారు సరిగ్గా ఆగకుండానే సరళ తలుపు తీసివెనుకకుక పరుగెత్తింది. మేమిద్దరమూ కారులోంచి బయటికి వచ్చేసరికి సరళ ఒక అపరిచిత యువతి కౌగిలిలో ఇమిడి ఉంది. వాళ్ళని రాజేంద్ర నేను కూడా చేరేము. ఆ యువతి; తెల్లటి శరీరఛాయలో తెల్లటి చీర ఇమిడి ఉంది. ఒక వ్యక్తి ముఖంలో అంత ప్రశాంతతా, చల్లదనమూ వెన్నెల్లా నేను అంతకు ముందు ఎన్నడూ చూడలేదు. ఆ సుందర యువతి నొసటి కుంకుమలేదు. ఆమె లఖియా అని గ్రహించాను.

సరళ కళ్లవెంట కన్నీటిధార కారుతోంది. ‘లఖియా, లఖియా’ అని మాత్రం అంటూ ఉంది. మమ్మల్ని చూసి, లఖియా సరళ కౌగిలినుంచి విడిపించుకుని, చీర చెంగు తల మీద పూర్తిగా కప్పుకుంది.

సరళ అప్పటికి ఈ లోకంలోకి వచ్చింది.

మాఇద్దరినీ లఖియాకి పరిచయం చేసింది. నమస్కార ప్రతి నమస్కారాలయ్యాయి. లఖియా వదనం మీంచి దృష్టి మరల్చుకోలేక పోయాను. ఆమెని చూడాలనీ, కలుసుకోవాలనీ, నాలో వున్న విపరీతమైన వాంఛ అలా హఠాత్తుగా ఫలించేటప్పటికి నేను క్షణ కాలం మూగవాడి నై పోయాను.

‘‘లఖియా, రామంబాబు ఒక సారి నాతో అన్నారు, లఖియా నీకు మళ్లీ కనబడితే నాకు తప్పకుండా కబురుచెయ్యి సరళా; నేను ఎక్కడున్నా, ఎలా వున్న చూడటానికి వస్తాను; ఆ అజ్ఞాత‌ యువతికి నేను జోహారులర్పిస్తున్నాను,’’ సరళ అంది.

అలాంటి మాటలు సరళ ఇంత ఆసందర్భంగా, అనాలోచితంగా మాట్లాడుతుందని నేనూహించలేదు. లఖియాకు కోపం వస్తుందేమోనని భయపడ్డాను. ఆమె తలెత్తి నా కళ్లల్లోకి ఒకసారిచూసింది. ఆ చూపు నాకర్థం కాలేదు. కాని అందులో కోపం లేదు; చల్లటి వెన్నెల వుంది.

‘‘మీరంతామా ఆశ్రమానికి తరలివచ్చారా? అయితే పదండి. సుందరికి ఇవాళ పర్వదినం అవుతుంది,” అంది,అప్పుడు లఖియా.

లఖియాని కారులో ఎక్కించుకుని వాళ్ళ ఆశ్రమానికి బయలుదేరాము. రెండు ఫర్లాంగులు చెట్లు, చేమల లోంచి వెళ్ళేడప్పుడికి చిన్న చిన్న పూలతోటలూ, పర్ణకుటీరాలు ఎదురయ్యాయి.

‘‘ఇదే సుందరి కుటీరం, లోపలికి వెళ్లి కూర్చోండి. నేను వెళ్లి పిలుచుకు వస్తాను,’’ అంది లఖియా.

‘‘ఒక వేళ లోపలుందేమో,’’ అంది సరళ

‘‘అబ్బే. ఆ ప్రశ్నకి తావేలేదు, సుందరి ఈ సమయంలో గురువు గారి దగ్గర ఉంటుంది. ఆమె భోజన మైనా మానుతుంది కాని ఇది తప్పదు. ఇప్పుడే తీసుకువస్తాను,’’ అని లఖియా నవ్వుతూ వెళ్లింది.

తలుపు తోసుకుని లోపలికి వెళ్లాము. లోపల మట్టినేల అప్పుడే ఆలికినట్టుంది. గదికి ఒక మూల పూజాసామగ్రి వుంది. ఒక ఎత్తైన మట్టిగోడ ఆ పెద్ద గదిని రెండు భాగాలుగా విభజిస్తోంది. ఇంకొక మూల వంటసామగ్రి వుంది. ఇవికాక ఒక పెద్ద ట్రంకు పెట్టి ఉంది. బహుశా చీరలపెట్టి అయివుంటుంది. పెట్టి దగ్గర రెండు చాపలుకూడా ఉన్నాయి. ఆ కుటీరమూ, ఆ నిరాడంబరత్వమూ చూసి మా ముగ్గురినోట మాట పెగల్లేదు. సరళ చాప పరిచింది. ముగ్గురమూ కూర్చున్నాము. ఎవరికీ ఏమి మాట్లాడాలో తోచటం లేదు.

‘‘భలే ఇళ్లు, వీరిద్దరినీ మనతోటి తీసుకుపోవాలి, ఏమంటారు,’’ అంది సరళ అఖరికి.

జవాబుగా అన్నట్టు, అప్పుడే బయట అడుగుల సవ్వడి అవగా , నేను గుమ్మం వైపు చూసాను.

ఎదురుగా ఏ స్త్రీమూర్తిని చూడటానికి నా మనసు మూడు సంవత్సరాల నుంచీ తహతహ లాడుతోందో, ఆ నా యశోరాజ్యం స్వయానా ప్రత్యక్షమైంది. క్షణమాత్రం గుమ్మంవద్ద ఆగి, మరుక్షణంలో చీర చెంగు తలమీదికి లాక్కుని, గబగబా లోపలికి వచ్చింది. మా ముగ్గురికీ నమస్కరించి.

‘‘ఎంత సుదినం, తలవని తలంపుగా వచ్చారే ముగ్గురూ,’’ అంది.

మూడు సంవత్సరాల క్రితం విన్న అదే కంఠస్వరం ఎంత మధురంగా ఉంది.

‘‘పవిత్రమైన నీ గృహాన్ని అపవిత్రం చేయ లేదు కదా, ’’ అంది సరళ వ్యంగ్యం గా.

‘‘నా గృహం అపవిత్రమవ్వాలంటే నేను అపవిత్రమవ్వాలి సరళా. రాజేంద్రబాబూ, మీరు నన్ను క్షమించాలి. ఇంతకాలం ఇంతదగ్గరుండి కూడా మీకు నావునికి తెలియపర్చనందుకు,’’ అంది యశో.

‘‘అలా అనకు యశో. ఈనాడు చూశాము అదే చాలు’’ అన్నాడు రాజేంద్ర. కంఠంలో కాస్త తొట్రుపాటు వుంది.

అంత వరకూ నా యశో నాతో ఒక్కమాట కూడా మాట్లాడలేదు. అందరినీ పలకరించిన తర్వాత నా వైపు తిరిగి చిరునవ్వు నవ్వుతో.

‘‘మీరు మీరిద్దరినీ ఎక్కడ కలుసుకున్నారు. రాజమండ్రి నుంచీ ఎప్పుడు వచ్చారు?’’ అని అడిగింది యశో.

‘‘నిన్న పొద్దున ముస్సోరీ బజారులో మా ఇంటి కోసం వెతుకుతూ కనబడ్డారు,’’ అంది సరళ నా బదులుగా.

‘‘అబద్దం చెప్పివుంటారు. అలా దేనికోసమైనా వెతకటం ఆయన స్వభావానికే విరుద్దం. అలా నడుస్తూంటే అదే కనబడుతుందనుకుంటారు. ప్రపంచంలో ఏదైనా ఆయన కాలికి వచ్చి తగలాలి. అప్పుడు స్వీకరిస్తారు అంతే కాని దాని కోసం ఆయన వెతకరు,” అంది యశో బలవంతంగా నవ్వు ఆపుకుంటూ.

యశో వెనకాల నుంచుని లఖియా నాకేసి చిరునవ్వుతో చూస్తోంది. అంతమందిలో యశో నా స్వభావాన్ని గురించి చర్చించటం నాకు నచ్చలేదు.

‘‘అది సరే సుందరీ. వీరికి బస ఎక్కడ చూపించుదాం, అదేదో చూడు ఆలస్యమవుతూంది,’’ అంది లఖియా.

‘‘నేనింక వెళ్లిపోవాలి సరళా. నువ్వు తర్వాత ఎప్పుడు వస్తావు,’’ అన్నాడు రాజేంద్ర .

‘‘ఇప్పుడెక్కడికి వెళ్తారు రాజేంద్రబాబు. మా అతిథ్యానని కొద్ది రోజులైనా స్వీకరించండి, తిరస్కరించకండి.’’ అంది యశో కంగారుపడుతూ.

‘‘అది కాదు యశో, రాజేంద్రను వెళ్లనీ, ఇప్పుడిప్పుడే కొన్ని కేసులు వస్తూన్నాయి. ఇవికూడా సరిగ్గా చూడకపోతే ఉన్న ప్రాక్టీసు కూడా పోతుంది. మళ్లీ వస్తారు. ఇప్పుడు ఈ ప్రదేశం ఆచూకీ తెలుసుకనుక,’’ అంది సరళ భర్త తరుపున సంజాయిషీగా.

‘‘అలా అయితే కాస్సేపాగండి, కాసిని పళ్లు తీసుకుని వెళ్లండి,’’ అని, యశో ఆ మట్టిగోడ చాటుకు వెళ్లి ఒక పళ్లెంలో రకరకాల ఫలాలు పట్టుకువచ్చింది.

‘‘అయితే తిరిగి ఎలా వస్తావు? నన్ను రమ్మంటావా?’’అన్నాడు రాజేంద్ర సరళతో యశో ఫలహారం సేవించి.

‘‘అదంతా మేము చూసుకుంటాము రాజేంద్రబాబూ, మీరు దిగులుపడకండి. కాని ఇది జ్ఞాప‌కముంచుకోండి, మీకు వీలున్నప్పుడల్లా మా ఆతిథ్యం ఎంత అల్పమైనదైనా లభిస్తుంది,’’ సరళ కు బదులుగా యశో జవాబిచ్చింది.

‘‘ఈ విషయం ఈనాడు చెప్పేవుకనుక జ్ఞాప‌కం ఉంచుకుంటాను యశో. సరళా, నేను తరచుగా వస్తాంలే,’’ అని రాజేంద్ర వెళ్లిపోయాడు.

అతని మాటాల్లో కాస్త ఆవేశం పొడచూపింది.

ఆ తర్వాత కాస్సేపు మేము ఎవరమూ మాట్లాడలేదు. అప్పుడు యశోని పరిశీలనగా చూశాను. ఎంత గంభీర సౌందర్యం, ఆ పచ్చటి శరీర ఛాయ, నిండైన విగ్రహం, తీర్చిదిద్దిన రూపం. అన్నీ అలాగే ఉన్నాయి. ఆకుపచ్చరంగు చీరకట్టుకుని ఉంది. జుట్టు విరబోసుకుని ఒక ఎర్రటి రిబ్బను మెడకింద నుంచి లాగి నెత్తిమీద ముడివేసింది. ముఖం మీద చిన్న కుంకుమ బొట్టు ఉంది. ఆ అపురూప సౌందర్యరాశిని అలాగేచూస్తూ కూర్చున్నాను. ఈ స్త్రీనేనా నేను మూడు సంవత్సరాల క్రితం మొదటిసారిగా రైల్వే ప్లాట్ఫారం మీద చూశాను? చెంగుమని నవ్వుతూ నమస్కారమండి అంటే. ప్రతి నమస్కారం చెప్పడం మరచిపోయాను. ఈమేనా ఆనాడు నా కాళ్ళ మీద తన తలపెట్టి, ‘‘ఇక్కడే కొంచెం చోటివ్వండి” అంది! మూడు సంవత్సరాల క్రితం యశోకి ఇప్పటి ఈ సుందరికీ ఒకటే తేడా కనబడుతోంది. ఇప్పుడు ఆమె ముఖంలో ప్రశాంతత ఉంది. క్రోధం హరించి పోయినట్టు కనబడుతోంది.

ఆమైకం లో, నేను నా ఎదురుగుండా కూర్చున్న యశోని గమనించలేదు.

‘‘ఏమిటి, ఇంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు బాదల్ బాబూ?”అన్న యశో కంఠ ధ్వని నన్నీ లోకంలోకి లాక్కొచ్చినట్లయింది. చూడగా, సరళా, లఖియాలు లేరు మాదగ్గర.

“ఏమిటి, యశోకి, సుందరికి పోలికలు కడుతున్నారా?’’ అంది.

అప్పటికి నాకు మత్తు పూర్తిగా వదిలింది.

‘‘నిజం చెప్పావు యశో, కాని, ఇది మొదట చెప్పు. ఇంత శాంతంగా, చక్కగా చిరునవ్వు నవ్వటం ఎక్కడ నేర్చుకున్నావు? నీ ముఖంలో ఇంత ప్రశాంతత ఎక్కడి నుంచి వచ్చింది,’’ అని అడిగాను.

‘‘ముఖం మనస్సుకు ప్రతిబింబం మాత్రమే బాదల్ బాబూ, మనస్సుని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఇక శరీరానికి రోగాలుకూడా రావు, చూడండి, జనమంతా శరీర సంరక్షణకి ఎన్నో మందులూ మాకులూ మింగుతూ ఉంటారు. అయినా రోగాల దారి రోగాలదే, కాని ఇక్కడకి మాత్రం అవిచొరబడలేవు. అందుకే మేమెంత ఆరోగ్యంగా ఉంటామో చూడండి,’’ అంది, చిరునవ్వుతో

‘‘అయితే ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు అమ్మీ’’ అన్నాను.

‘‘ఇంకెవరూ, మా గురువుగారే, అన్నట్టు మరచాను.. ఉత్తరంలో అమ్మీ అని నాకు కొత్త పేరు పెట్టారు దేనికి? ’’అంది నవ్వుతూ.

“కొత్తగా పేరు పెట్టలేదు, అప్పుడప్పుడు ఆప్యాయంగా అలా పిలవాలని బుద్ధి పుట్టింది. అస్తమానమూ ఒకే పేరుతో పిలుస్తే ఏం బావుంటుంది చెప్పు. ఇప్పుడు నీకు మూడు పేర్లున్నాయి, యశో, సుందరీ, అమ్మీ,’’ అన్నాను.

‘‘అన్నిటిలోకి నాకు అమ్మీ అనే పేరు నచ్చింది తెలుసా,’’ అంది సంతృప్తితో.

‘‘సరే బాగానేవుంది. ఇక్కడ తాగడానికి కాస్త కాఫీ, టీ లాంటి జల పదార్థాలు దొరుకుతాయా? చాలా అలసి పోయాను,’’ అని ఆ చాపమీద చేతులు తలకింద పెట్టుకుని పడుకున్నాను.

‘‘ఆ సదుపాయాలన్నీ రేపటి నుంచి చేస్తాను. ఇక్కడకు పదిమైళ్ల దూరంలో ఇవన్నీదొరుకుతాయి, ఈ సాయంకాలమే రణధీర్‍ని ఆ ఊరికి పంపిస్తాను. ఈ పూటకు పండ్లుతిని గడపాలి,’’ అంది యశో దగ్గరికి వచ్చి నా పక్కన కూర్చుని.

తన కంఠస్వరంలోంచి వ్యాకులత నామీద నాకే కోపం తెప్పించింది.

‘‘వద్దు యశో, ఊరికే అన్నాను. ఇక్కడ నీకు ఎలా గడుస్తుందో అలాగే ఉండనీ. నీకు లభించని సుఖం నాకు అక్కర్లేదు,’’ అన్నాను.

‘‘అలా మీరు ఉండలేరు. వ్యర్ధంగా పంతం కోసమని మీరలాంటి పనులు చేసి బాధపడి నన్ను బాధపెట్టకండి. మీరు ఈ ఆశ్రమంలోని వ్యక్తులు కారు కనుక ఈ నియమాలు మీకు వర్తించవు. ఇంకొకటి ..ఇక్కడ కూడా మీ భారమంతా నేనే వహిస్తాను. ఇక్కడ మీకు లోపాలు చాలా కలుగుతాయి. వాటిని హృద‌యానికి పట్టించుకుని నన్ను కష్టపెట్టకండి,’’ అంది.

‘‘ఎంతో కాలం తర్వాత అలాంటి ప్రేమావాత్సల్య పూరితమైన మాటలు విన్నాను. కరుడు కట్టిన నా హృద‌యం కరిగిపోయింది. నీకు తెలుసు గదా యశో, నేను మానసికంగా ఎంత బలహీనుణ్ణో, ఎంతనిరర్ధకుడినో, ఇలాంటి వాడిని దగ్గర పెట్టుకుని నీవేమి సుఖపడతావు అమ్మీ,’’ అన్నాను.

‘‘అదంతా నా బాధ్యతే బాదల్ బాబూ. మీ బలహీనత నాకు తెలుసు. సర్వవేళలా మిమ్మల్ని ఎవరో ఒకరు కనిపెట్టుకొనుండాలి. కాని మీలో వజ్రంలాంటి కాఠిన్యత వుంది. మీకు కోపం వచ్చిందంటే నాకు తగని భయం. ప్రతి చిన్న విషయాన్ని పట్టించు కోకండి. ముఖ్యంగా గతాన్ని గురించి ఆలోచించకండి,’’ అంది యశో నా చొక్కాగుండీ తిప్పుతూ

ఆమె ముఖం లజ్జా రాగరంజితమైంది. ఈ మూడు సంవత్సరాల నుంచి దాగి ఉన్న ప్రేమా, వాత్సల్యం, అనురాగమూ ఈనాడు పెల్లుబికి వచ్చాయి. ఆ ధాటికి తట్టుకోలేక పోయింది. పళ్లు తీసుకొస్తాను అని లేచి పళ్లెంలో పళ్లూ, మంచినీళ్లు తీసుకువచ్చింది.

‘‘తింటూ ఉండండి. నేను రణధీర్ తో చెప్పి వస్తాను,’’ అని బయటికి వెళ్లిపోయింది.

కొంత సేపటికి లఖియా ‘‘సుందరీ’’ అంటూ లోపలికి వచ్చి, నన్ను చూసి గుమ్మం వద్ద ఆగిపోయింది.

‘‘సుందరి ఎక్కడికి వెళ్లింది రామం బాబూ? ’’ అని అడిగింది.

‘‘ఇప్పుడే వస్తుంది. లోపలికి రండి,’’ అన్నాను నేను లేచి.

“మీ కొక మాట చెప్దామనుకున్నాను రామంబాబూ. సరళనీ, సుందరినీ పిలిచినట్లే నన్ను కూడా పేరు పెట్టి పిలవండి,’’ అంది లఖియా లోపలికి వచ్చి నవ్వుతూ.

‘‘తప్పకుండాఅలాగే చేస్తాను లఖియా, మూడు సంవత్సరాల క్రితం నీ వృత్తాంతం విన్నప్పట్నుంచీ, నీ గురించి చాలా ఆలోచించాను. అనేకసార్లు కన్నీరు కూడా కార్చాను. నీలో ఇంత సహనమూ, పేర్మి, ఔదార్యమూ ఎక్కడివి? అని అనుకునేవాడిని,’’ అన్నాను.

లఖియా ఈ అప్రస్తుత ప్రశంసకి సిగ్గుపడింది.

‘‘మీ దయకూ, అభిమానానికీ కృత‌జ్ఞురాలిని రామంబాబూ. కాని నాలో కూడా లోపాలు చాలా ఉన్నాయి. కళ్లకు కనబడేటంత మంచిదానను కానేమో,’’ అంది ముఖం క్రిందకి దించుకుని,

‘‘అది సరే లఖియా, జీవితంలో ఇప్పటివరకూ నువ్వు అష్టకష్టాలు అనుభవించావు. ఇక ఇప్పటినుంచీ నైనా సుఖపడాలని నా కోరిక,’’ అన్నాను.

లఖియా ఏమీ జవాబివ్వలేదు.

“నువ్వు యిల్లు వదలి వచ్చిన తరువాత వెంటనే ఇక్కడికి వచ్చావా?’’ అన్నాను సంభాషణ దారి మళ్లిద్దామని.

‘‘లేదు,’’ అంది.

‘‘అయితే తర్వాత జరిగిందేమిటో వినాలని కోరికగా ఉంది. లఖియా,’’ అన్నాను.

‘‘అలా కోరికగా ఉండటము అస్వభావికమేమి కాదు రామంబాబూ, ఇప్పుడుకాదు, మరోసారి చెప్తాను,’’ అంది లఖియా తల పైకెత్తి మందహాసము చేస్తూ.

‘‘చాలా ఆలస్యమయిపోయింది. ఏం చేస్తూన్నారు?’’ అంటూ లోపలికి వచ్చింది.

యశో వెనుక ఒక పద్దెనిమిది పందొమ్మిది సంవత్సరాల యువకుడు నెత్తిమీద ఒక మంచం పెట్టుకు నుంచున్నాడు.

‘‘అరే. రాణి, సరళను వదిలి వచ్చావా ఇక్కడికి,’’ అంది యశో లఖియాను చూసి.

‘‘చిన్నక్కా, మంచం ఎక్కడ పెట్టను?’’ అన్నాడు కుర్రాడు.

‘‘ఆ గోడపక్కన పెట్టి, పెట్టి బాబుగారికి నమస్కరించు,’’ అంది యశో అతనికి దారిస్తూ.

అక్కగారి ఆదేశాన్ని ఆ తమ్ముడు పాలించాడు. నాకు ఏమని ఆశీర్వదించాలో తెలియక మెదలకుండా వూరుకున్నాను.

‘‘అలా చూస్తారేంటి? రణధీర్‍ మీ కోసం ఈ మంచం చాలా దూరం నుంచీ తీసుకొచ్చాడు. ఏమైనా చెప్పండి. ఎక్కడైనా, ఎప్పుడైనా మీరు ఇంతే. సృష్టిక‌ర్త‌ ఈ ప్రపంచాన్నిమీ సేవకోసం సృష్టించాడని మీ ఉద్దేశం,’’ అంది యశో

యశోకి ఈ అలవాటు మొదటి నుంచీ ఉంది. నా లోపాలను గురించి ఇతరుల వద్ద ఎంతో మమకారంతో మాట్లాడుతుంది. దానివలన, ఆమెకు అదొక విధమైన మానసిక సంతృప్తి లభిస్తుందను కుంటాను.

‘‘అదేమిటి సుందరీ. రామంబాబు మీద ఎందుకు అలా చాడీలు చెప్తావు,’’ ఆ అభియోగానికి ఈసారి లఖియా జవాబు చెప్పింది.

‘‘మన కర్మ రాణి, చెపితే ఎవరూ నమ్మరు, బయటికి ఎంతో అమాయకుడిలా కనబడతారు, నీకు తెలియదు. మూడు సంవత్సరాలుగా ఆయన నన్నుఎంత దుఃఖపెట్టారో, హృద‌యం పగిలిపోయ్యేటట్టు కుమిలిపోతూంటే ఈయన ఒక సానుభూతి మాటైనా చెప్పలేదు. ఏడిచే దానిని ఇంకా ఏడిపించి పోయారు. పైగా నన్ను మరచిపో అని సలహా ఇచ్చారు,’’ అంది యశో.

యశో మాటల తీరు నాకు నచ్చలేదు.

‘‘రణధీర్‍ నిన్ను ఆశీర్వదించలేదని మీ అక్కకు కోపం వచ్చింది. అందుకని ఆశీర్వదిస్తాను అక్కగారి సేవలో సుఖంగా ఉండు,” అన్నాను మాటలు తప్పించుకుందామని.

‘‘బాగా ఆశీర్వదించారు రామంబాబూ. అన్నట్టు మా రణధీర్ ఎన్ని యుద్ధాల్లో పాల్గొన్నాడో మీకు తెలుసా, ఒకసారి ఆశ్రమం చూడటానికి వచ్చిన మూడు పెద్దపులులను తరిమివేశాడు. ఇంకోసారి ఒక నక్క...’’ లఖియా నవ్వుతూ ఏదో చెప్తూంటే, రణధీర్ అడ్డువచ్చాడు.

‘‘పెద్దక్క ఎప్పుడూ ఇంతేనండీ, నన్ను వేళాకోళం చేస్తుంది. ఆమె మాటలు నమ్మకండి,’’ అన్నాడు.

‘‘సరే చిన్నక్కతో పాటు ఈ యువకుడికి పెద్దక్కకూడా ఉందన్నమాట. కుర్రవాడు మంచివాడులాగే ఉన్నాడు. శరీర దారుఢ్యం కలవాడని స్పష్టంగా కనబడుతోంది. యశో, రణధీర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందర సరళను చూద్దాం పదండి, లేకపోతే ఎక్కడికైనా వెళ్లిపోతుంది,’’ అన్నాను

ముగ్గురమూ సరళ వద్దకు వెళ్లి తనతో సహా ఆ సాయంసంధ్యలో గంగాతీరం చేరి, బాగా చీకటి పడిన తర్వాత ఆశ్రమానికి తిరిగి వచ్చాము. భోజనాలైన తర్వాత సరళ లఖియాతో వెళ్లిపోయింది.

పనులన్నీ ముగించుకుని యశో నా పక్క వేస్తోంది. అప్పటివరకూ నాకు ఈ మాటే గుర్తుకురాలేదు. ఆ ఒక్క గదిలో మేమిద్దరమూ ఎలా పడుకుంటాము. ఈ ఆశ్రమంలోని సన్యాసులు, ఇతరులు, మమ్మల్ని చూసి ఏమనుకుంటారు? ముఖ్యంగా లఖియా ఏమనుకుంటుంది. ఈ సమస్యకు పరిష్కారం నాకు ఏమీ కనబడలేదు.

‘‘నేను బయట పడుకుంటాను యశో,’’ అన్నాను నెమ్మదిగా, భయపడుతూ.

యశో పక్క వేయటం మాని నాకేసి ఒక క్షణం తీక్షనంగా చూసింది.

‘‘ఈ చలిలో బయట పడుకుంటారా? మీకంత మీలో నమ్మకం లేకపోతే, మీకంత భయమైనట్లైతే నేను బయట పడుకుంటాను. మీరలా చేయాల్సిన అవసరం లేదు,’’ అంది ఆఖరికి.

నేనేమీ మాట్లాడలేదు, ఏమనాలో తెలియలేదు. నేను భయపడిందేమిటంటే.. దీని ఫలితంగా యశో మీద అపవాదు పడుతుందేమోనని, ఒక అరగంట పోయిన తర్వాత, యశో ఒక చాప తీసుకుని బయటికి వెళ్లిపోతుంది. అది నేనెలా సహిస్తాను. నేనెలాంటి వాడినైనా పాషాణ హృద‌యుడిని కాదు, నేనెవరిని, ఆ ఇంటిలో ఒక అతిథిని, అది మరచిపోయి అలాంటి పని జరగనిస్తానా?

‘‘నాకూ హృద‌యమంటూ ఒకటి వుంది అమ్మీ, పద లోపలికి, ఈ రేయినుంచీ మనం ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభిద్దాము,’’ అన్నాను నేను యశో చేయిపట్టుకుని.

యశో మాట్లాడలేదు. ఒక సారి నా కళ్లలోకి చూసి తల వంచుకుంది. అప్పుడు నేనే ఆమె చేతిలోంచి చాప తీసుకుని గదిలో మట్టిగోడకు ఆవలివైపున పరచేను.

ఆమె ఇంకా గడప దగ్గరే ఉంది. నేను ఆమె దగ్గరకు వెళ్లి, చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకు వచ్చాను. అయినా, తనకు ఇంత సిగ్గు హఠాత్తుగా ఎందుకు వచ్చిందో? నా మగత నిద్రలో ఆ రాత్రంతా ఊహిస్తూ నే ఉన్నాను.