Read Kshantavyulu - 13 by Bhimeswara Challa in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

క్షంతవ్యులు - 13

క్షంతవ్యులు – Part 13

చాప్టర్ 31

రాజేంద్ర కారు నడుపుతున్నాడు. నేనతని పక్కన కూచున్నాను.

సరళ కొడుకుని ఒళ్ళో పెట్టుకుని కొద్దిగా ఇరుకుగా యశో దాయి లతో వెనకాల సీట్లో కూర్చుంది.

ఎవరి ఆలోచనల్లో వాళ్ళుండి ఎవరమూ పేదవి విప్పలేదు,పెద్దల మూడ్ గ్రహించేడో ఏమిటోచడి చప్పుడు లేకుండా బాబు నిద్రపోతున్న పోతున్నాడు

లఖియా నా యాచన తిరస్కరించింది. శిక్షాకాలం ఏదో విధంగా గడిచిపోతుంది. ఆ సత్ప్రవర్తన వల్ల అది తగ్గించబడవచ్చుకూడా. ఆ తర్వాత ఆమె మా వద్దకు వస్తుంది. ఇహపరాలను లక్ష్యం చేయకుండా ఆమెను సుఖపెడతాను. జీవితమంతా చీకటిమయం కాదని నిరూపిస్తాను. ఈదారిలో ఎన్ని ఆటంకాలున్నా లెక్కచెయ్యను, అనుకున్నాను. కానీ నా ఆశలన్నీ లఖియా మాటలతో వమ్ములయ్యాయి. ఈమె ఇంకా ఎన్ని కష్టాలు పడాలని రాసివుందో. లఖియాని ధనసహాయం స్వీకరించమని అర్థించగలిగే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరి వద్ద నుంచీ ఏమీ స్వీకరించదు అనుకున్నాను.

చివరికి ఇంటికి చేరేము.

"అయితే లఖియాకు మనము ఏవిధంగానూ సహాయ పడలేమా రాజేంద్ర," అన్నాను కారుదిగుతూ.

"అంటారుగా, తనని తాను హెల్ప్ చేసుగున్న వాళ్ళకే దేముడు సహాయం చేస్తాడని, కానీ లఖియా తన కర్మకు తన్ని వదిలేయమని మొండికేసి కూర్చుంది. అయినా సాయంత్రం లాయర్ని మీరు కూడా కలుద్దురుగాని,' అన్నాడు తను దిగులుగా.

"ఒకవేళ లాయర్గార్కి మీరు కుటుంబ వైద్యులయితే ఆయన ఇక్క్కడికి వస్తారేమో అడగండి, మా అడ సలహాలు కూడాఉచితంగా పొందవచ్చు, ఏమంటావు సరళా,“అంది యశో నవ్వుతూ.

"సరిగ్గా చెప్పేవు యశో అలాగే చేద్దాం,” .అన్నాడు రాజేంద్ర ఫోన్ దగ్గరకు వెడుతూ.

యశో నేను స్నానాలు చేసి వచ్చేటప్పడి కి డైనింగ్ టేబుల్ మీదున్న దిల్ బహదూర్ వేడి వేడి భోజనం

ఆహ్వానం పలికితే రాజేంద్ర వెల్కమ్ న్యూస్ తో రెడీగాఉన్నాడు. భోజనం చేశాక కాసేపు కునుకు తీసి అందరం లాయర్గారి రాక కెదురుచూస్తూ కూచున్నాము.

కార్లోంచి దిగిన రవిప్రకాష్ని రాజేంద్ర మాకు పరిచయం చేసాడు.

”మీట్ ద లైవ్ వైర్ లాయర్,’ అన్నాడు రాజేంద్ర.

"హియర్ ద లైట్నింగ్ స్ట్రయిక్స్," అన్నాడు యశోని రవిప్రకాష్కి పరిచయం చేస్తూ.

“'హూఇజ్ స్ట్రక్," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ .

"బాదల్ బాబు యాని రామంబాబు," అంది సరళ నన్ను చూపిస్తూ.

“అరే, మోస్ట్ ఎలిజిబుల్ బ్రహ్మచారి అన్న విషయం చెప్పడం మరిచాను," అన్నాడు రాజేంద్ర

"అయితే పెళ్ళిచూపులేమైనా ఏర్పాటు చేయకూడదూ," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ.

"మన్మధుడు తలస్తే అవే అవుతాయి, ఏం చెప్పగలం," అంది సరళ నవ్వుతూ.

"మీ కంపెనీ ఎంజాయ్ చేయడానికి వేరో మారు వస్తానుకాని ఇప్పుడు అనుకోకుండా ‘రిట్’ కేసు తగిలింది," అన్నాడు రవిప్రకాష్ .

"మంచిదేగా మరి. వీళ్లూ మాలాగే ఆమెకి శ్రేయోభిలాషులు. వీరికా లఖియా కేసు కాస్త బ్రీఫ్ చేస్తారా," అన్నాడు రాజేంద్ర.

"ఆ కేసులో విశేషమేమిటంటే అందులో అసలు కేసే లేదు. నిన్ననే ప్రభుత్వ ప్లీడర్ చెప్పేడు, ఆ దొంగ సన్నాసిని ఆస్పత్రినించి డిస్చార్జి చేశారని," అన్నాడు రవిప్రకాష్

"అయితే ఇప్పుడు లాఖియాను విడిచిపెడతారా?" అన్నాను నేను ఆతృతగా.

"విడిచిపెట్టరు, విడిపించాలి, అందుకు నాకు ఆవిడ వకాలత్ కావాలి," అన్నాడు రవిప్రకాష్.

"నేనిప్పిస్తా," అన్నాను ఆవేశంగా.

"అది అంత సులువయిన పనికాదు," అన్నాడు రవిప్రకాష్ నాకేసి ఆశ్చర్యంగా చూస్తూ.

"అలాగ ఎందుకనుకుంటున్నారు రవిప్రకాశ్ గారు," అన్నాను, ఆశ్చర్య పడడం నాఒంతవగా.

"లాఖియాదొక మానసిక ఋగ్మత," అన్నాడ రవిప్రకాష్.

"మీరేమంటున్నారు!"అన్నాను అసహనంగా.

"డాక్టర్గా రాజేంద్ర అడ్వకేట్గా నేను అప్పుడప్పుడు లఖియాలాని కలుస్తూవుంటాము. మానసికశాస్త్ర రీత్యా వీళ్ళు 'విక్టిమ్స్ అఫ్ మార్టైర్ సిండ్రోమ్'. తామే త్యాగమూర్తులమని భావిస్తూ వీళ్ళు, వాళ్ళ కష్టాల్లోనే సుఖానుభూతి పొందుతారు పరుల సానుభూతితో . వాళ్లని వారి వారి మిధ్యాలోకంవీడి నిజ జీవితం లోకి అడుగుపెట్టించడం బహుశా బ్రహ్మతరంకూడా కాదు," అన్నాడు రవిప్రకాష్ .

రాజేంద్ర తో సహా అందరం నిస్చేస్థితులమయ్యాము.

"ప్రేమకు తరంకాని దేమీ కాదిది. నేను ప్రాణం పణంగా పెట్టయినా లఖియాని ఒప్పిస్తాను," అన్నాను ఆవేశంగా.

"మీకా నమ్మకముంటే తప్పక ప్రయత్నించండి," అన్నాడు రవిప్రకాష్ ఆశ్చర్యపడుతూ.

"ఒకవేళ ఆయన లఖియాను ఒప్పిస్తే మీరు ఆమెను విడిపించగలరా?" అంది యశో.

"అది నా ఎడమచేతి పని అనుకోండి," అన్నాడు రవిప్రకాష్ ధీమాగా.

"అదెలా?" అంది యశో నమ్మ శక్యంకానట్లు.

"గాయపరిచింది ఆత్మరక్షణలో గనుక ప్రైమా ఫేసీ నేరంకాదని, అందునా బాధితుడు కోలుకున్నాడు గనుక ఆమెకు మొదటి హియరింగ్ లోనే బెయిల్ ఇప్పిస్తాను. ఆ తరువాత గురువుగారి మీద మానభంగం కేసు నమోదుచేసిప్లేటుఫిరాయించి కధ అడ్డం తిప్పుతాను. అప్పుడు ఆ సన్నాసి'దొంగ' తీగ లాగితే అన్ని ఆశ్రమాల

'డొంక' కదుల్తన్న భయంతో వాళ్ళ'లాబి'ప్రభుత్వ పప్లీడర్ని'చూసు' కుంటుంది. ఆ తర్వాత కధ కంచికి

లఖియా మీ ఇంటికి," ఆనాడు రవిప్రకాష్ .

"అయితే ఎప్పుడు సుముహూర్తం ?" అంది సరళ.

"రేపైతే కుదరదు ఎళ్ళుండి పెట్టుకుందాం," అన్నాడు రవిప్రకాష్ .

"మరైతే పరీక్షకు తయారవ్వండి రామం బాబు," అంది సరళ.

"నీ నోట్స్ సాహాయంతో," అన్నానునేను

"ఎలాగూ చీటీ లందించడానికి నేనుంటానుగా," అంది యశో నవ్వుతూ.

"సరే, ఈలోగా వార్డెన్అనుమతి పత్రం ఆమెవకాలత్నామావగైరా సిద్ధం చేస్తాను," అన్నాడు రవిప్రకాష్

చేతి వాచీ చూసుకుని.

"ఇంతకీ బెయిల్ ఎప్పుడు ఇప్పించ గలరు?" అంది యశో.

"అంతా సవ్యంగా జరిగితే రెండు మూడు నెలల్లో.ఆతర్వాత ఆమె మీద కేసుకంచికి ఆమె మీఇంటికి ," అన్నాడు రవిప్రకాష్ .

"అల్లాగే అయితే మీ ఫీజు రెండింతలు," అంది యశో.

"డబ్బేమీ చెదు కాదు కానీ ఎందుకది!" అన్నాడు రవిప్రకాష్ .

"లఖియా రెండు నిండు ప్రేమలకు జీవంపోసినందుకు," అంది యశో.

"ఆమె మీదున్న మీ అందరి అభిమానంతో నా భాద్యత పెంచారు," అన్నాడు రవిప్రకాష్ .

"కాస్త వుండండి ప్రకాశ్గారూ, ఐప్పుడే వస్తా," అనిచెప్పి యశో ఆలా వెళ్ళి ఇలా తిరిగివచ్చింది.

"దేనికంత తొందరేమిటండీ," అన్నాడు రవిప్రకాష్ యశో అందించిన కవరు అందుకుంటూ.

రాజేంద్ర,నేను రవిప్రకాష్ని సాగనంపింతరువాత, రాజేంద్ర తన క్లినికి వెళ్లగా నేనుతిరిగి ఇంట్లోకి వెళ్లేను.

"యశో ఏమిటీ నమ్మకం," అంటోంది సరళ.

"ఆయన మీద భరోసా," అంది యశో నన్ను చూపిస్తూ.

"యశో మీమీద చాల భారం మోపింది రామం బాబూ," అంది సరళ.

"లఖియా భగవంతుడి మీద ఆంటే సరి," అన్నాను.

"మా భలేవాడ్నే నమ్ముకుంటున్నారు," అంది తానునవ్వుతూ.

ఒప్పందం మేరకు రవిప్రకాష్ తన కారులో యశోని నన్ను డోన్ జైలు కి తీసుకెళ్ళేడు. దారిపొడుగునా తాను నెగ్గిన కేసుల గురించి చెపుతుంటే యశో నేను శ్రద్ధగా విన్నాము. అతడు సమర్ధవంతుడే నన్న భావన యశో తన కళ్ళతో వ్యక్తపరి చేది.

జైలు కెళ్ళింతరువాత నేను లాఖియాను కలువదానికి వెడుతుంటే యశో ఎంతో ఆశతో పంపించింది,

కాని పట్టుమని పది నిముషాలైనా తిరక్కుండానే తిరిగొస్తున్న నన్ను చూసిన తన ముఖంలో కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు.

కానీ హుటాహుటిగా నేను వారిని చేరి, లాయరుగారి కోసం ‘లఖియా వేచివుంది’ అన్నప్పుడు ఆమె ముఖారవిందం వర్ణనాతీతం.

"చెప్పండి," అంది గోమూగా యశో, రవిప్రకాష్ హుషారుగా వెళ్ళింతరువాత.

"ఉత్తినే చెప్పను," అన్నాను.

"అయితే గట్టిగా అరవండి," అండి నన్ను దూరంగా తోస్తూ.

అప్పుడు యశోని దగ్గరకి తీసుగుని లఖియాతో 'నా మాటకి మాట' చెప్పేను.

"లఖియా నేను ఆత్మహత్య చేసుకుంటే యశో వ్యధ ఊహించలేవా," అన్నాను.

"మహాపాతకం రామంబాబు," అంది చెవులు గట్టిగా మూసుకుని.

"నన్నునమ్ము, నువ్వు నీధర్మం వీడితే నేను నీకదే అంట గడతాను," అన్నాను.

"రామంబాబు, అసలు మీకు నోరెలావచ్చింది నాకు అధర్మప్రవర్తన ఆపాదించడానికి?" అంది కళ్ళలోంచి బటబట నీరుకారుతుంటే.

"ధర్మాధర్మాలు నిర్ణయించవల్సింది న్యాయమూర్తులు, నిందితులుకాదు, దానికి నీ విరుద్ధ వ్యవహారమే నీ అధర్మం. తప్పుపట్టనంటే, అహంకారం," అన్నాను.

"నే నహంకారినా, ఏమంటున్నారు రామం బాబు, మీరు," ఏడుస్తూ అంది.

"నీ అంత సుగుణమూర్తి, త్యాగశీలి వేరే లేదనుకోవటమే నీఅహంకారం," అన్నాను.

"ఏమిటి నా ధర్మం?" అంది మరుక్షణం.

"నీ కృత్యం లోని ధర్మాధర్మ నిర్ణయం న్యాయమూర్తికి విదలడమే నీధర్మం. అయినా రణధీర్ మీద 'నీ వైధవ్యాన్ని కాపాడిన' కృతజ్ఞతా భావాన్ని గౌరవిస్తాను. నువ్వే చేశావన్న అసత్య వచనానికి ధర్మోపాయం, అశ్వద్ధామ హతః కుంజరః," అన్నాను.

"రామం బాబు, నా కళ్ళు తెరిపించేరు, కృతఙయురాలిని," అంది నాచేయి పట్టుగుని.

"నీ కిప్పుడు దారి చూపించటానికి లాయర్ రవిప్రకాష్ గార్ని తోడుతెచ్చింది యశో, ఆయన్ని కలుస్తావా?" అన్నాను.

“యశోని కూడా," అంది.

"లాయర్ని కలిసేక, సరేనా," అంటే, లఖియా తలూపింది.

ఆ 'నా మాటకి మాట' విన్న యశో, ఆనందసంభ్రమాలలో ములిగిపోయింది

"ఇంక' నాకేమి చేతకాదు అమ్మీ' పాట కట్టండి," అంది యశో తన చెక్కిలిమీద కారే ఆనందభాష్పాలు తుడుచుకుంటూ.

"ఇది నా స్వయం ప్రభావం కాదుఅమ్మీ, అంతా నీ సాంగత్య ఫలం," అన్నాను నేనూ ఆమె అనుభూతిని పంచుకుంటూ.

"సరళ కి ఫోన్ చేసి చెప్తేసరి," అంది.

"సరి కాదు బేసి, సరళ ఆనందం ఫోన్ లో మనం కళ్లారా చూ డలేంగా?" అన్నాను.

"నిజంగానే నాకు మతిపోయినట్లుంది," అంది నవ్వుతూ.

"నీకే కాదు సరళక్కూడా, లేకపోతే తన కొడుక్కి నాపేరు పెట్టడం ఏమిటి, రాజేంద్ర ఏమనుకున్నాడో ఏమో," అన్నాను.

"దీన్నే కందకి లేని దురద అంటారు," అంది సాలోచితంగా.

ఆతరువాత రవిప్రకాష్ రాకకు మేము మౌనంగా ఎదురు చూసాం.

మాకు క్షణ క్షణం ఒక యుగంలా గడుస్తూండగా, ఆఖరికి రవిప్రకాష్ మాకు థమ్స్అప్ సూచిస్తూ కనబడ్డాడు అతను ఇంకా మా దగ్గరకు రాకుండానే యశో ఆనందంగా లాఖియాని కలవడానికి పరుగుతీసింది.

యశో తిరిగివచ్చేలోపల రవిప్రకాష్, తను లఖియా దగ్గర సేకరించిన విషయాలు చెప్పి నన్నడిగాడు.

"అయినా ఏం మాయమాటలు చెప్పి ఆమె మనసు మా ర్చగలిగేరు?"

"చెప్పడానికి అవేమి మీ కచేరి వాదనలను బలపరచేవి కావు," అన్నాను నవ్వుతూ.

"ఎదో అనుకున్నానుకాని గట్టివారే మీరు," అన్నాడు చేయి కలుపుతూ.

యశో వచ్చిన తరువాత నేను లఖియా ఏమంది అని అడిగితే తనంది, "మౌనమే మా ఆనందం."

"మీ టిట్ కి మీ ఆవిడ టాట్ బాగుంది," అన్నాడు రవిప్రకాష్ నవ్వుతూ.

అదేమిటంది యశో, తరువాత చెప్తా, అని నేనన్నాను. జైలు వార్డెన్ కి మా ధన్యవాదాలు చెప్పి ముగ్గురం ముస్సోరి ముఖం పట్టాము.

"ఇంటకీ లఖియా మీద మీ అభిప్రాయం ఏమిటో చెప్పలేదు," అడిగాను రవిప్రకాష్ ని.

"చూడడానికి బాగుంది, ప్రస్తుతానికింతే," అన్నాడు.

అతను మమల్ని ఇంటికి చేర్చేసరికి అనుకోకుండా రాజేంద్ర ఎదో పనిమీద బయటకు వెళ్ళాడు. నేనూహించినట్లే, యశోని హత్తుకుని సరళ పొందిన ఆనందానికి హద్దులేదు కానీ తను నన్ను కూడా తన కౌగిల్లో బిగించినప్పుడు నా ఆ శ్చర్యానికి అంతులేదు..

"హనుమంతుని హృదయానికి హత్తుకొని రాముడు అన్న మాటలు గుర్తుకొచ్చాయి రామం బాబు," అన్న సరళను నేను నాహృదయానికి హత్తుకోలేకుండా ఉండలేకపోయాను.

"అందుకనే అంటారు ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అని," అంది యశో సరళ భుజం మీద చెయ్యివేసి.

"కానీ కొమ్ముల పరిమితి స్వల్ప మాత్రం అయితే చెవుల పరిధి విశాలం కదా రామం బాబు," అంది సరళ నా కౌగిలి వీడుతూ.

ముస్సోరిలో మరో రెండు రోజులు ఆనందోత్సాహలతో గడిపి (నలుగురం హాక్ మన్స్ కి కూడా వెళ్ళేం) లఖియా బెయిల్ మీద విడుదలయ్యే సమయానికి వస్తామని కాశీకి యశో నేనూ తిరుగు టపా కట్టేము.

చాప్టర్ 32

యశో నేనూ, కాశీకి తిరిగివచ్చి ఒక వారం రోజులై వుంటుంది. ఆనాడు పొద్దున యశో ఓ టెలిగ్రామ్ నాకిచ్చి వెళ్లిపోయింది. అందులో మామయ్యకి చాలా జబ్బుగా వుందనీ తక్షణం బయలుదేరి రమ్మని వుంది.

మళ్లీ ఒక సమస్య ఎదురైంది. తండ్రి తర్వాత తండ్రిలాంటివాడు బాబయ్య, లలిత పిన్నికీ ఇక మగదిక్కెవ్వరూలేరు. అలాంటి సమయంలో ఆమెకు సహాయం అవసరం, అదీకాక నా వ్యవహారాలన్నీ బాబయ్యే చూస్తున్నాడు. వెళ్లకతప్పదు కానీ యశోని తీసుకుని వెళ్లలేను. ఆ సమయంలో అలాంటిపని చేయడంకంటె తెలివితక్కువ పని ఇంకొకటి వుండదు.

టెలిగ్రాం చేత్తోపట్టుకుని లోపలికి వెళ్లాను. యశో వంటచేయడంలో నిమగ్నురాలైంది.

‘‘యశో నన్నేమి చేయమంటావు?’’ అన్నాను నెమ్మదిగా వెనకనుంచొని.

‘‘చేసేదేముంది చెప్పండి. మీరు తప్పకుండా వెళ్లాలికదా? నన్ను కూడా తీసుగెళ్లాలా లేదా అన్నదే సమస్య. తీసుగెళ్తే నేను సురేఖను కూడా చూడవచ్చు,’’ అంది చేస్తున్న పని ఆపి నా వైపుతిరిగి.

‘‘అవును, కాని నేనొక్కడనే వెళ్లాలి యశో. నిన్ను ఇప్పుడు తీసుకెళ్ల లేను, ’’ అన్నాను.

‘‘అదేమంచిది,’’ అంది యశో గరిటె తిప్పుతూ, అంటే ఆమెకికోపం వచ్చిందన్నమాట.

‘‘చూడు యశో,’’ అని బుజ్జగించ బోతే యశో తీవ్రంగా స్పందించి.

‘‘నాకు అంతా తెలుసు, మీరే వెళ్లండి, ఆయనకి స్వస్థత కావాలి, మీరు త్వరలో రావాలని ఇక్కడ నుంచే ప్రార్థిస్తూంటాను,’’ అంది నిర్వికారంగా.

ఆ సాయంకాలమే బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను. ఒక వైపు కర్తవ్యము, రెండో వైపు యశో ...ఈ రెంటి మధ్యా మనస్సు వూగిసలాడింది, కానీ చేసేదేముంది? యశో తన అంతర్యాన్ని, ఆలోచనని బయటపెట్టలేదు. నేనుకూడా వాటిని రేకెత్తించలేదు. అలా చేస్తే అణచివున్న దు.ఖము విజ్రుంభిస్తుంది. అంతకంటె దానివలన ఎవరికీ ప్రయోజనం లేదు.

రైలు బయలుదేరటానికి ఇంకా టైముంది. ఒకరి చెయ్యి నొకరు పట్టుకుని ప్లాటుఫాం మీద నడుస్తున్నాము. యశో నేను చేయాల్సిన పనులన్నీ చెప్పింది.

‘‘నేను మీ ఆరోగ్యంగురించే ఆందోళన పడుతున్నాను. నేను లేకుండా మీకు జరుగదు. అంతమందిలో అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఎవరు చూస్తారు?’’ అంది అప్పుడే జ్ఞాపకమొచ్చినట్టు.

‘‘ఎప్పుడూ ఎవరో ఒకరు ఎందుకు కనిపెట్టి వుండాలి యశో. ఎవరూ చూడకపోతే బహుశా నన్ను నేనే చూసుకుంటానేమో; అలా అయితే ఇది కూడా ఒకందుకు మంచిదే,’’ అన్నాను.

‘‘కాదు మీకు జరుగదు. మీ స్వభావమే అంత,’’ అంది.

ఆమె ఆరోగ్యం సరిగా చూసుకోమనిగాని, జాగ్రత్తగా వుండమని గాని చెప్పే అర్హత నాకులేదు. ఎంతో హాస్యాస్పదంగా వుంటుంది. విని వూరుకున్నాను. రైలు కదలబోయే వేళైంది. యశో పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి బేల అయిపోయింది.

‘‘చూడండి; మీరు నాకు ఎంత అవసరమో నేను ఎప్పుడూ మీతో చెప్పలేదు. త్వరగా వచ్చేస్తారు కదూ,’ నిబ్బరాన్ని గాలిలో వదిలిపెట్టి నా చేతులు పట్టుకుని అంది.

అలాంటి స్థితిలో మాటలు పెంచి లాభం లేదు. మౌనమే దానికి మందు.

‘‘సరే యశో; వెళ్లినవెంటనే ఉత్తరం రాస్తాను,’’ అన్నాను.

యశో పూర్తిగా రైలు కదిలేవరకూ వుండలేదు. గబగబా బయటకు వెళ్లిపోయింది.

బాబాయ్ పరిస్థితి ప్రమాదకరంగానే వుంది. జబ్బుతో పాటు ముసలితనం, ఉబ్బసం, ‘‘కాలం సమీపించిందంటే అన్నీ వస్తాయి,’’ అంది లలిత పిన్ని.

బాబాయ్ ముసలివాడని నాకంతవరకూ తెలియదు. యభై సంవత్సరాలు దాటివుండవు. ఈమె మాటలు వింటూంటే నిర్విచారంగా వున్నట్టనిపించేది. మనిషిని చూస్తే దానికి పూర్తి విరుద్దం. చాలా కాలం నుంచీ స్నానపానాదులున్నట్టు కనబడలేదు. ఎప్పుడూ బాబాయ్ మంచాన్ని అంటిపెట్టుకుని వుండేదట.

‘‘బాబాయ్ చనిపోతూంటేకాని గుర్తురాలేదా రామం?,” అంటూ బాబాయ్ నన్ను చూసి కండ్లనీళ్లు నింపుకున్నాడు.

“లేదు బాబాయ్ అలా అనకు, నువ్వు మళ్లీ కోలుకుంటావు. నీకు అనారోగ్యంగా వుందని తెలియలేదు. లేకపోతే ముందరే వచ్చేవాడిని,’’ అన్నాను దుఃఖం ఆపుకుంటూ.

‘‘అన్నయ్యా కాశీ నుంచి మాకు ఏమి తెచ్చావు?’’అని మారం చేశారు పిల్లలంతా చూట్టూమూగి.

అంతలో పిన్ని హూంకరించేటప్పటికి నలుమూలలా పరుగెత్తారు.

బాబాయ్ రోగవివరాలూ, వైద్యమూ మొదలైనవన్నీ చెప్పడం అనవసరమనుకుంటాను. నేను వచ్చిన పదిరోజుల తర్వాత ఒక ఆదివారం తెల్లవారుజామున బాబాయ్, లలిత పిన్నిని దుఃఖసాగరంలో ముంచి పరలోకయాత్ర చేశాడు. చేయాల్సిన తతంగమంతా చేశాను. బాబాయ్ మరణవార్త విని, పిన్ని తలిదండ్రులు వచ్చారు. తాను బ్రతికుండగా కూతురు విధవవటం చూసి ఆ తల్లి హృద‌యం తరుక్కుపోయింది. దుఃఖం భరించలేక, భర్తను నిందించింది. రెండవ పెండ్లికి ఇవ్వద్దుంటూంటే ఇచ్చారు. దాని ఫలితమే ఇది,’ అంది.

లలిత పిన్ని అక్కడే వుంది .‘అమ్మా’ అని ఒకసారి గట్టిగా అరచి ‘నాన్నగారిని అలాంటి మాటలనకమ్మా. ఎవరి కర్మఫలం వారనుభవించాలి’ అని ఏడుస్తూ తల్లి ఆలింగనంలో ఇమిడిపోయింది.

లలిత ముప్పది సంవత్సరాలు మించని అందమైన వనిత. బయటకు ఏవిధంగా కనబడినా మనస్సు మాత్రం మంచిది. జీవితంలో ఆమెకంటే ఎక్కువ సుఖాన్ని ఎవరూ అనుభవించలేదు. ప్రేమించే భర్త, దైవప్రసాదితులైన ముగ్గురు సుపుత్రులు తన కుటుంబమే స్వర్గమని భావించింది. భర్త మరణించిన మరుక్షణం నుంచీ జీవితమంతా చీకటిమయమయిపోయింది ఆమెకు. ఇద్దరు సవతి పిల్లలూ, ముగ్గురు తనవాళ్లు ఈమె భుజస్కందాలమీద పడ్డారు. వీరిని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యతంతా ఈమెది. సవతి పిల్లలని ఆమె ఎన్నడూ విభేదం చూపించలేదు. నిజం చెప్పాలంటే వారిమీదే ఆమె అనురాగం వ్యక్తపరిచేది .

‘‘ఈ ఇంటిలో అడుగుపెట్టినప్పటి నుంచీ వీరిని నేను పెంచాను, మిగతావారంతా తర్వాత వచ్చారు. పుట్టుకలో ఏముంది?’’ అనేది నవ్వుతూ,

ఒకరోజు, యశో ఇచ్చిన వుత్తరం జేబులో పెట్టుకుని సురేఖని కలుసుకోవటానికి బయలుదేరాను. వివాహమైన తర్వాత సురేఖ తాతగారిని తీసుకుని అత్తవారింటికి వెళ్లిపోయిందని తెలిసింది. అక్కడికీ బయలుదేరాను. ఇంటినిబట్టి, గుమ్మంవద్ద వున్న నౌకరునుబట్టి బాగా కలవారని గ్రహించాను.

‘‘ఎవరు కావాలి?’’ అడిగేడు బంట్రోతు.

‘‘మధుగారున్నారా?’’ అన్నాను.

‘‘చిన్న బాబుగారు, విశాఖపట్నంలో వున్నారు,’’ అన్నాడు వాడు, నన్ను ఒక సారి ఆపాదమస్తకం చూసి.

‘‘పోనీ సురేఖ గారు వున్నారా?’’ అన్నాను.

దానితో వాడి అనుమానం హెచ్చింది. కాస్త చిరాకుగా, ‘‘ఇక్కడే వుండండి’’ అని లోపలికి వెళ్లిపోయారు.

సురేఖ బయటికి వచ్చింది. సురేఖ కళ్లు తళుక్కుమని మెరిశాయి.

‘‘బావగారూ’’ అంది నా దగ్గరకు ఒక గంతువేసి నా చెయ్యి పట్టుకుని.

‘‘మరదలా మీవారు విశాఖపట్నంలో వున్నారట,’’ అన్నాను నవ్వుతూ.

“అవును, ఎంఎస్సీ చదువుతున్నారు, కానీ విశాఖపట్నంలో వున్నారని మీ కెలా తెలుసు?’’ అంది,

“మీ బంట్రోతు చెప్పేడు?” అన్నాను.

‘‘మీరు ఎప్పుడు వచ్చారు? అక్కయ్యని తీసుగులేదా? ఆమె ఎప్పుడూ నా మదిలో ప్రకాశిస్తుందిఅక్కయ్య అరే బయటే నించున్నారు. లోపలికి రండి,’’ ప్రశ్నల వర్షంలో లోపలికి తీసుకెళ్లింది.

"మీ తాతగారిని పిలు," అన్నాను.

"తాతయ్య లేడు తీర్థయాత్రలకెళ్ళేడు," అంది.

‘‘అయితే సురేఖా, మధు అక్కడ, నువ్వు ఇక్కడ, మధ్యన మేఘాలు ఏమిటి? నువ్వూ వెళ్లలేక పోయావా?’’ అన్నాను కుర్చీలో కూర్చుంటూ.

‘‘అది ఎలా వీలవుతుంది బావగారూ, నేను దగ్గరవుంటే బొత్తిగా చదవడు. ఇప్పటికీ పదిహేను రోజుల కొకసారి వస్తుంటారు. అది సరే అక్కయ్య ఎలావుందీ? అంతా చెప్పండి’’ అంది సురేఖ సిగ్గుతో తలవంచుకుని.

‘‘ఇది ముందర చదువుకో, ఏమైనా మిగిలితే గిగిలితే తర్వాత చెప్తాను,’’ అన్నాను జేబులోంచి ఉత్తరంతీసి.

సురేఖ ఎంతో ఆత్రుతతో ఉత్తరం చదువుకుంది. చాలా పెద్ద ఉత్తరంలావుంది. చదవటానికి చాలాకాలం పట్టింది. చదువుతూ చాలాసార్లు నాకేసి చూసి నవ్వింది.

‘‘అక్కయ్య అంతా రాసింది బావగారూ, మీ గుట్టు బయటపడింది,’’ అంది ఉత్తరం అంతా చదివి.

‘ఇంటిగుట్టు లంకకు చేర్చకు, మధుకి తప్పఇంకెవరికి చెప్పకు,’’ అన్నాను.

‘‘సరేకాని ఆవిడ ఇక్కడికి రాకపోవడానికి కారణం మీరేనని రాసింది. ఎందుచేత తీసుకురాలేదు. చెప్పండి. అక్కయ్యను చూడాలని ఎంతో కోరికగా వుంది. ఆమె రుణం నేనెలా తీర్చుకోగలను?’’ అంది.

‘‘నేనెలా తీసుకురాగలను సురేఖా, సమాజం ద్రుష్టిలో మీ అక్కయ్య నాకేమీ కాదు. బాబాయ్ చనిపోయాడు. ఇప్పుడు నా పరిస్థితి మరీ అధ్వానంగా వుంది,’’ అన్నాను

‘‘అవును ఆయన చనిపోయారని విన్నాను, అక్కయ్య మిమ్మల్ని త్వరగా పంపించివేయమని రాసింది,’’ అంది.

‘‘త్వరగా ఎలా వెళ్లగలను సురేఖా? ఇప్పటివరకు అన్ని వ్యవహారాలు బాబాయ్ మీద పెట్టి వెళ్లాను. ఇప్పుడు ఎవరి మీద పెట్టగలను? ఏ పనీ స్వంతంగా చేయలేనని మీ అక్కయ్య అంటుంది. ఆమె దగ్గరవుంటే అన్నీ ఆవిడమీద పెట్టేవాడిని, ఇప్పుడెలాగ?’’ అన్నాను.

అదంతా ఏకరువు పెట్టడం అనవసరం. అయినా అప్పుడప్పుడు మనస్సుని వేధించే ఆలోచనల్ని బయటికి పెడితే ఎంతోతేలికవుతుంది. సురేఖ చాలా శ్రద్ధతో అంతావింది.

‘‘ఆ పరిస్థితి నేను గ్రహించాను, మీ గాధ ఎంత విషాదంగా వుంది,’’ అని ఒక నిట్టూర్పు విడిచింది.

అంత చిన్నతనంలో యశో ప్రియసోదరి నా గురించి చింతించడం ఇష్టంలేకపోయింది. యశోని దుఃఖపెడుతున్నాను. అది చాలదా?

‘‘అది సరే సురేఖా, ఆ రాత్రి జరిగిందంతా చాలా గమ్మత్తుగా వుందికదూ?’’ అన్నాను.

‘‘అలా నెమ్మదిగా అంటూన్నారేమిటి బావగారు? మరునాడు అదంతా ఒకకలలా అనిపించింది . తర్వాత కొన్నాళ్లకి అక్కయ్య వద్ద నుంచి డబ్బు వచ్చేటప్పటికి నా ఆశ్చర్యానికి, తాతయ్యసంతోషానికి మేరలేదు. ఒక రాత్రి పరిచయంతో అంత డబ్బు దేవతలు తప్ప ఎవరిస్తారు అనుకున్నాను. అక్కయ్య వివాహానికి రాకపోయేటప్పటికి నేను ఆ రాత్రి ఎంత దు.ఖించానో చెప్పలేను. దానితో సగం సంతోషం హరించిపోయింది. వివాహమంటపం దగ్గర కూడా నాకు కన్నీరు ఆగలేదు. మీరు మానవ మాత్రులు కారేమో అనే అనుమానం కలిగింది. తర్వాత చాలా కాలానికి అక్కయ్య దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. అప్పటికి అనుమానం పోయింది. ఆమె మానవులలోని దేవత అని తెలిసింది,” ఏకరువు పెట్టింది సురేఖ.

‘‘ఆగు సురేఖా; ఇంకా చాలు, కావాలంటే ఇదంతా ఉత్తరంలో రాసివ్వు. సురక్షితంగా నీ అక్కకి అందజేస్తాను. అదిసరే అయితే నాకు మీ ఆయనని చూపించవా?’’ అన్నాను.

‘‘ఎందుకు చూపించను బావగారూ? మీరు ఇంకా వుంటారుగా? ఇవాళే మథుకి టెలిగ్రాం ఇచ్చాను. వచ్చే వీక్ ఎండ్ కు రమ్మనమంటాను,’’ అంది.

‘‘అయితే ఇక నేను వెళ్తాను, ఎన్నాళ్లుంటానో చెప్పలేను. వెళ్లేముందు ఇంకోసారి కనబడుతాను,’’ అని లేచాను.

‘‘ఒకసారి ఏం బావా. రోజూరావాలి మీరు, లేకపోతే మీ ఇంటికి వస్తాను. అరె మరచి పోయాను, కాస్సేపాగండి ఇప్పుడు వస్తాను,’’ అని లోపలికి వెళ్లిపోయింది.

కాఫీ తీసుకొచ్చింది. అడ్డుచెప్పకుండా తాగేశాను.

‘‘మా అత్తమామలనీ చూడరా బావగారూ,’’ అంది బయటకు వస్తూంటే సురేఖ.

“మళ్ళీ వచ్చినప్పుడు చూస్తాను,’’ అన్నాను.

గుమ్మంవరకూవచ్చి సాగనంపింది.

‘‘సురేఖా’’ అని పిలిచాను బయటకు వచ్చేస్తూ వుంటే జ్ఞప్తికి వచ్చి.

ఆమె వెనుదిరిగి దగ్గరకు వచ్చింది.

‘‘అన్నట్టు మాయింటికి వస్తానని చెప్పావు, ఇప్పుడు అలా చెయ్యటం మంచిది కాదు, వీలున్నప్పుడు నేనే వస్తుంటాను. మధు వస్తాడుగా,’’ అన్నాను.

సురేఖ ముఖం దిగజారిపోయింది.

‘‘ఈ లోపున ఇంకోసారి వస్తానులే సురేఖా. అలాంటి ముఖం మాత్రం పెట్టకు,’’ అన్నాను.

సురేఖను త్వరలో కలవడానికి వీలుపడలేదు. అనేకవ్యహరాలు చూడాల్సివచ్చింది. స్వతహాగా సోమరిపోతును నేను. అయినా అప్పుడు గత్యంతరంలేక అన్ని పనులూ చేశాను. రోజువిడిచి రోజు యశోకి ఒక వుత్తరం రాసేవాడిని. ఆ పనిమట్టుకు క్రమం తప్పకుండా చేసేవాడిని, అలా చేస్తానని వాగ్దానం చేశాను. మాట తప్పితే ఆమె చాలా బాధపడుతుంది. బయలుదేరి వచ్చేసినా రావచ్చు. యశోని నేను పొందిన తర్వాత ఇదే మొదటి ఎడబాటు మాకు, ఇది ఆమె ఏవిధంగా సహిస్తోందో? ఆమె మనస్సంతా ఇక్కడే వుండి వుంటుంది. నా గురించీ, సురేఖ గురించీ ఆలోచిస్తూ కూర్చుని వుంటుంది. ఒంటరిగా ఆమె ఏమి చేస్తూ వుంటుంది? శరీరాలు దూరంగా వుంటే మనసులు దగ్గరకు వస్తాయంటారు. మా హృద‌యాలు ఎప్పుడో ఏకమయ్యాయి కానీ మా శరీరాలే దగ్గరగా ఉండికూడా విలీన మవలేదు. ఈ ఎడబాటువలన మాకు వేరే కలిగే నష్టమేమిటి?

అనుక్షణం యశో మనస్సులో మెదిలేది. కావలసింది లభించకపోయినా, వేళకి ఏమైనా జరుగకపోయినా నామనస్సడిగేది. ‘యశో వుంటే ఇలా జరగనిచ్చునా?’ అంటే నాకు లోపాలు కలిగాయని కాదు. లలిత పిన్ని నన్ను ఎంతో ఆప్యాయంగా చూసేది. అయినా ప్రియురాలు యశోరాజ్యం వేరు, పిన్ని లలితాదేవి వేరు.

అన్నట్లుగానే ఆ ఆదివారం సురేఖ ఇంటికి వెళ్ళేను.

సురేఖ తంతి అందుకుని మధు మెయిల్లో వచ్చాడు. సురేఖ ఆ రాత్రి మధు ఆ వూరిలో అందరికన్న అందంగా వుంటాడని చెప్పింది. నేను అంతదూరం పోను, కాని ఈ యువకుడు అందంగానే వుంటాడు. సురేఖ మధు ఒకరి పక్కన ఒకరు నించుని నవ్వుతూంటే నామనస్సు సంతోషంతో నిండిపోయింది. ఎంత చక్కని జంట వారిది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు వీరు; నా అనుభవంలో ఇది వక్కటే ఇలా పరిణమించింది. వారి వివాహపు బాటలో ఆటంకాలు లేవు. మనస్పర్థలులేవు. ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. సురేఖకి సుజాతకీ ఎంత విభేదముంది. ఈ సుఖ పరిణామానికి బాధ్యులెవరు? యశో రాజ్య మంటే ఒక వుత్తమనారీమణి? కాని ఈ సుఖమే, ఈ దాంపత్య సౌఖ్యమే ఆమెకు లభ్యంకాలేదు, అందుచేతనే ఆమెను నాతో తీసుకరాలేక పోయాను. దీనికంతకీ కారకుడిని నేనే, నేనే.

‘‘మమల్ని దీవించండి, బావగారూ,’’ అంది సురేఖ మధుతో కలిసి నా కాళ్ళకి మొక్కబోతూ.

‘‘అలాంటి పనులు చేయకు సురేఖా. నేనేమంత పెద్దవాడిని కాను. నన్ను అప్పుడే ముసలివానిని చెయ్యకండి,’’ అన్నాను నా ఆలోచనలకు స్వస్తి పలుకుతూ ఒక్క అడుగు వెనక్కి వేస్తూ.

‘‘అలా అడ్డుపెట్టకండి బావగారూ. అక్కయ్యలేదు. ఇక మమ్మల్ని మీరైనా ఆశీర్వదించండి. వివాహ సమయంలో మాకిది లభించలేదు,’’ అంది.

ఇక నేను అడ్డుచెప్పలేదు. మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకున్నాను. వీరిద్దరినైనాకష్టమూ దుఃఖమూ అనేవి అంటకుండా చూడమని.

‘‘మీకు ఏ విధంగా కృత‌జ్ఞత వెల్లడించాలో తెలియటం లేదని సురేఖ చెప్పింది,’’ అన్నాడు మధు.

‘‘పొరబడుతున్నావు మధూ, నువ్వు నాక్కాదు ఈ సత్కారాలన్నీ చేయాల్సింది. ఆవిడ వేరొకచోటవుంది, మీ కృత‌జ్ఞతకి మీ నమస్కారాలకీ అర్హురాలు ఆమె,’’ అన్నాను.

‘‘అవును బావగారూ మీరు చెప్పింది నిజమే, మా అక్కయ్య నిజంగా పూజ్యురాలు, కాని ఆమెకు మీకంటే ఆప్తులు లేరు. ప్రాణం కంటే మిన్నగా మిమ్మల్ని ప్రేమిస్తూంది. అందుకని మీరు పూజ్యులే,’’ అంది సురేఖ.

‘‘సరే సురేఖా, అయితే అయ్యాను కాని ఆపనిమటుకు చెయ్యకు. కావాలంటే ఫోటో ఒకటి ఇస్తాను. దానికి చెయ్యండి,’’ అన్నాను నవ్వుతూ.

‘‘నిజమే బావగారూ. అక్కయ్య మీరు కలసివున్న చిత్రం ఒకటి ఇవ్వండి,’’ అంది సురేఖ.

‘‘వుంటే తప్పకుండా ఇద్దును, కాని మేమిద్దరమూ కలసివున్న చిత్రమేలేదు. చివరకు మీ అక్కయ్య ఫోటో కూడా లేదు నావద్ద,” అన్నాను వాళ్లిద్దర 'తెల్ల' ముఖాలు చూస్తూ.

వాళ్ళతో కాసేపు కబుర్లాడి (అదృష్టవశాత్తు మధు తల్లితండ్రులు ఇంట్లోలేరు) పిన్నిఇంటికి చేరేను,

ఆ తరువాత సురేఖతో నా పరిచయం ఎక్కువైంది. వీలున్నప్పుడల్లా వాండ్ల ఇంటికి వెళ్లేవాడిని, అక్కచెల్లెళ్లు లేనికొరత సురేఖ ఆరోజుల్లో తీర్చింది. అది నాకొక కొత్త అనుభూతి. యశోలో, తల్లి, సోదరి, ప్రేయసి ఇవన్నీ మిళితమై వుండేవి. ఆమెకూడా దగ్గరవుంటే ఎంతో బాగుండును. చెల్లెలూ, మరిది తనను పువ్వులలో పెట్టి పూజిస్తుంటే ఆమె ఎంత సుఖించేదో? నేనెంత ఆనందించేవాడిని.

రాజమండ్రి వచ్చి ఒక నెల కావచ్చింది. లలితపిన్ని తలిదండ్రులు కూతురుతో అక్కడ వుండిపోవటానికి ఒప్పుకున్నారు. దానితో నామీద వున్న బరువు తీరింది. మిగతా సమస్యలు సులభంగానే పరిష్కారమవుతాయని ధైర్యం కలిగింది. మా ఇంటి అద్దె తిన్నగా కాశీ అందేటట్టు ఏర్పాటు చేసుకున్నాను. భూముల మీద వచ్చే రాబడికి కూడా అదే ఏర్పాటు చేసుకున్నాను. పనులన్నీ అయిపోయిన మరునాడే బయలుదేరటానికి నిశ్చయించుకున్నాను. యశోకి తంతి ఇచ్చాను.

ఆరోజే నా ప్రయాణం. రైల్వేష్టేషన్లో ఎవరివద్దో ఒకరి నుంచీ నా తిరుగుళ్లలో కన్నీళ్లతో వీడ్కోలు తీసుకోటం నాకు పరిపాటి అయిపోయింది. హృద‌య విదారకమైన అనేక సంఘటనలకి అది రంగస్థలమైపోయింది. ఇలాంటి వాటితో నా హృద‌యం కరడుగట్టిపోయింది. సురేఖ ఇంకా లేతయవ్వనంలో వుంది. ఇప్పటివరకూ జీవితంలోని వెలుగు మాత్రమే చూసింది. అలాంటి స్థితిలో నాకు వీడ్కోలు చెప్పటానికి స్టేషన్ కు వచ్చింది. నేను వద్దనలేదు. ఇక రాజమండ్రితో చాలా వరకూ నా సంబంధము తీరిపోయింది. మరలా ఈమెను తిరిగి చూస్తాననే నమ్మకం లేదు. దాని గురించి నేనట్టే చింతించలేదు. సురేఖకి భవిష్యత్తులో కష్టాలు, కన్నీరు ఎదురు కాకూడదని వాంఛించాను. యశో సరళా, లఖియా, సుజాతా వీరందరికీ ఏవో దుఃఖ కారణాలున్నాయి. సురేఖ మాత్రమే ఇప్పటి వరకు ఈ దుఃఖాలలో చిక్కుకోలేదు. మునుముందర ఆమె బాటలో కూడా ముళ్లులేకుండా వుండాలి. అదే నా వాంఛ.

‘‘ఈ నెల్లాళ్లూ అక్కయ్య మనతో వుంటే ఎంత బాగుండేది’’ అంది సురేఖ తనలో తను అనుకున్నట్టుగా.

‘‘ఎందుకు బాగుండదు సురేఖా. చాలా బాగుండేది,’’ అన్నాను.

‘‘అక్కయ్యని చూడాలని వుంది, బావగారూ,’’ అంది.

‘‘దానికి మీరు కాశీ రావాలి సురేఖా,’’ అన్నాను.

‘‘అది చాలా కాలం తర్వాత మాట,’’ అంది సురేఖ దీర్ఘంగా నిట్టూర్చి.

‘‘అక్కయ్యను మరచిపోవాలి సురేఖా. ఆమె నీకు అందుబాటులో లేదు. ఇక ముందు వుండ కపోవచ్చుకూడా. ఆమె నాకు చాలా అవసరం. ఇలాంటి వాటిని గురించి నీవు ఆలోచించకూడదు. ఇంకా చిన్నపిల్లవి. నీకు అన్నిటికన్నా మిన్నగా మధు వున్నాడు. ఈ వూరిలో అందరికంటే అందగాడు, అయినా నీ బావ ఎలా వుంటాడు సురేఖా ఎప్పుడు చెప్పలేదు,’’ అన్నాను ఆమె భుజం మీద చెయ్యి పెట్టి.

"అక్కయ్యని అడిగి చెపుతా బావా," అన్న సురేఖ వణికే పెదవుల మీద చిరునవ్వు వెలసింది.