Read Yevaru..?-11 by Suresh Josyabhatla in Telugu Crime stories | మాతృభారతి

Featured Books
  • వెంటాడే నీడలు - 5

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • ఎవరు....? - 11

    Part - 1102-జులై-2018మద్యాహ్నం 2:10 గంటలునిత్యం పర్యాటకుల సం...

  • యంత్రం వెనుక మనసు - 13

    "ఇంకేం చేస్తాం అమ్మ.. ఈ అర్ధరాత్రి పూట ఎవరు తింటారు? తీసుకెళ...

  • వెంటాడే నీడలు - 4

    వెంటాడే నీడలు ( ఏ క్రేజీ హాట్ రొమాంటిక్, సైకలాజికల్ అండ్ పార...

  • THE GHOST - 1

    **చీకటి రాత్రి - భయానక ప్రారంభం**స్టోరీ ఓపెన్ చేస్తే... ఒక చ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఎవరు....? - 11

Part - 11

02-జులై-2018
మద్యాహ్నం 2:10 గంటలు

నిత్యం పర్యాటకుల సందడితో కళకళలాడే కృష్ణానదిపై ఉన్న భవాని ఐలాండ్ రిసార్ట్‌లో...

ఒక చోట పాత స్నేహితుల కలయికలతో, నవ్వులతో, జ్ఞాపకాల ముచ్చట్లతో ఒక సమూహం సందడిగా గడుపుతోంది.

వాళ్లంతా పదమూడు సంవత్సరాల క్రితం ఒకే పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు.

కాలం వారిని వేర్వేరు దారుల్లో నడిపించినా.
ఆ రోజు మాత్రం మళ్లీ ఒకేచోటికి తీసుకొచ్చింది.

వాళ్ళలొ 
కొందురు వ్యాపారవేత్తలయ్యారు,
కొందరు ఉద్యోగుస్తులయ్యారు,
కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు,
మరికొందరు కుటుంబ జీవితంలో మునిగిపోయారు.

కాని ఒకరు మాత్రం మిగతావాళ్ళలా ఉత్సాహంగా లేరు. 

చేతిలొ ఒక జ్యూసు గ్లాస్, 
మొఖపై బలవంతపు చిరునవ్వు,
కాని మనసు మాత్రం ఎక్కడో ఉండి.
వాళ్ళతొ తనకు సంబంధం లేనట్టుగా ప్రక్కన ఒక మూలన నిలబడి ఉంది. 

"హే తులసి. ఏం చేస్తున్నవె ఒక్కదానివె ఇక్కడ నించోని" అని తన స్నేహితురాలు పల్లవి వచ్చి అడిగంది.

ప్రక్కన నించున్న పల్లవి వైపు తిరిగి చిన్న చిరు నవ్వు నవ్వింది గాని సమాధానం చెప్పలేదు.

పల్లవి : ఏం ఆలోచిస్తున్నావె ...?

తులసి : ఏం లేదు లేవే 

అని నవ్వుతూ చెబుతుంది.

కాని నిజానికి చాలా ఉంది. 
29 ఏళ్ళ తులసి జీవితం. 
తీపి నుంచి చేదుగా మారిని తన గతం..

"తులసి ఇంటర్మీడియట్ వరకు తన తల్లిదండ్రుల వద్ద ఉండి చదువుకుంది. తరువాత ఏలూరులో నివసిస్తున్న తన మేనత్త "కృపావతి" ఇంటికి వెళ్లింది.

కృపావతి భర్త పదేళ్ల క్రితమే మరణించాడు, అప్పటినుంచి ఆమె తన కుమారుడు "సుధాకర్తో" కలిసి ఏలూరులొ నివసిస్తుంది

తులసి ఏలూరులోని "సి.ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల"లో "బి.ఎస్‌.సి కెమిస్ట్రీ" పూర్తి చేసింది. డిగ్రీ పూర్తయిన కొద్ది రోజులకే, 20 ఏళ్ల తులసిని ఆమె తల్లిదండ్రులు తన మేనత్త కొడుకు అయిన సుధాకర్‌కు ఇచ్చి వివాహం చేశారు.

అప్పటికి సుధాకర్ వయసు 25 సంవత్సరాలు. అతను గత రెండేళ్లుగా "ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్" కార్యాలయంలో "అకౌంటెంట్‌"గా ఉద్యోగం చేస్తున్నాడు.

వివాహమైన మొదటి కొన్ని సంవత్సరాలు వారి దాంపత్య జీవితం ప్రశాంతంగానే సాగింది. సుధాకర్ మరియు కృపావతి ఇద్దరూ తులసిని ఎంతో ప్రేమగా చూసుకునేవారు. కొత్త ఇంటికి వచ్చిన కోడలిగా కాకుండా, కృపావతి తనని కూతురిలాగే భావించేది.

అయితే కాలం గడుస్తున్న కొద్దీ పిల్లలు కలగకపోవడం తులసి జీవితంలో పెద్ద సమస్యగా మారింది.

వైద్య పరీక్షలు, మందులు, దైవ ప్రార్థనలు, బంధువుల సూచనలు... ఇలా మూడున్నర సంవత్సరాలు గడిచిపోయాయి. పిల్లలు లేకపోవడానికి అసలు కారణం ఏమిటో స్పష్టంగా తెలియకపోయినా, నింద మాత్రం ఎక్కువగా తులసిపైనే పడేది.

ఒకప్పుడు ఆమెపై అపారమైన ప్రేమ చూపించిన తన భర్త సుధాకర్ కూడా క్రమంగా తనని దూరం పెట్టడం ప్రారంభించాడు. వారి మధ్య సంభాషణలు తగ్గిపోయాయి. మేనత్త కృపావతి కూడా మునుపటిలా ఆమెను పట్టించుకోవడం మానేసింది.

ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ, తాను ఒంటరిగా మిగిలిపోయాననే భావన తులసిని రోజురోజుకూ వేధించసాగింది.

ఆ మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలనే ఉద్దేశంతోనే ఆమె గృహిణి జీవితానికి ముగింపు పలికింది. 6 నెలల తరువాత తన డిగ్రీ స్నేహితురాలు "శ్రావ్య" సహాయంతో, విజయవాడలోని ఒక ఆహార-నాణ్యత పరీక్షా ప్రయోగశాలలో ఉద్యోగం సంపాదించింది. 5 ఏళ్ళుగా ఉద్యోగం చేస్తుంది. కాని తన 9 ఏళ్ళ వివాహ జీవితంలొ పిల్లలు లేరనె వెలితి మాత్రం తులసికి అలాగె ఉండిపోయింది."

ఇలా ఉండగా ఇంతలొ రిసార్ట్ ఎంట్రెన్స్ దగ్గర ఒక చిన్న కలకలం. 

"ఒరేయ్ కుమార్ వచ్చాడు రా....

ఆ మాట విన్న తులసి తన గతం తాలుకు ఆలోచనలనుంచి బయటకు వచ్చింది.

అక్కడున్న కొంతమంది మగవాళ్ళు ఒకేసారి చేతులూపడం మొదలు పెట్టారు.

"ఒరేయ్ కుమార్ మేమంతా ఇక్కడున్నాం రా.. ఇక్కడికి రా..." 

అని ఒకరు కుమార్ ని పిలవగానె. తులసి అటు వైపు చూసింది.

తెల్లటి షర్ట్ 
గ్రే.. కలర్ జీన్ ప్యాంట్
నల్లటి గాగుల్స్ 
ఆత్మ విశ్వాసంతొ కూడిన నడకతొ కూమార్ వస్తున్నాడు.

తులసి చూపు ఒక్కసారిగా ఆగిపోయింది.

ఆ మొఖాన్నీ చివరిసారిగా చూసి దాదాపు 11 ఏళ్ళు అవుతుంది.

అయినా ఒక్కక్షణంలోనె గుర్తుపట్టింది.

"తను కుమార్.." అని మనుసులొ అనుకుంది.

ఇదిలా ఉండగా భాస్కర్ అనె స్నేహితుడు అందుకొని..

భాస్కర్ : ఒరేయ్ కుమార్ ఇంకా ఆలస్యంగా వచ్చె అలవాటు పోలేదు ఎంటి రా...?

అంటు నవ్వుతూ అన్నాడు.

ఈలోపు ఇంకొక స్నేహితుడు శ్రవణ్ అందుకొని. 

శ్రవణ్ : ఏరా ఈసారి ఏవరి మీదకు నెట్టేస్తావు.?

కుమార్ : ఈసారి ట్రాఫిక్ మీదకు నెట్టేస్తా రా...

అని నవ్వుతూ సమాధానం ఇచ్చాడు..

అక్కడున్నవాళ్లు గట్టిగా నవ్వేశారు.

కుమార్ ఒక్కొక్కరిని పలకరిస్తూ ముందుకు వచ్చాడు.

అతని చూపు ఇంకా తులసి మీద పడలేదు.
కానీ...

తులసి చూపు మాత్రం అతని మీద నుంచి తొలగలేదు.

కొన్ని క్షణాల తర్వాత...

కుమార్ చూపు ఆమె మీద పడింది.
అతని అడుగులు క్షణం పాటు ఆగిపోయాయి.

ముఖంపై ఆశ్చర్యం.

ఆ తర్వాత చిరునవ్వు.

కుమార్ : తులసి...?
అని అడిగాడు.

తులసి : అవును కుమార్..
అంది 

ఇద్దరి మధ్య కొద్దిసేపు నిశ్శబ్దం.

పక్కన ఉన్నవాళ్లు మాత్రం వెంటనే ఆటపట్టించడం మొదలుపెట్టారు.

స్నేహితుడు భాస్కర్ : అయ్యో... వీళ్లిద్దరూ ఇంకా ఒకరినొకరు గుర్తుపట్టారు.

స్నేహితుడు శ్రవణ్ : ఎలా మర్చిపోతారు ఆ రోజుల్లొ వీళ్ళు ప్రేమ పక్షులు కదా...

ఆ మాటలకు అందరూ నవ్వారు.

తులసి మాత్రం తలదించుకుంది.

కుమార్ కూడా చిరునవ్వుతో విషయం దాటేశాడు.

కుమార్ : ఎలా ఉన్నావు?

తులసి : బాగున్నాను.

కుమార్ : ఉద్యోగం చేస్తున్నావని విన్నాను.

తులసి : అవును... విజయవాడలోని ఒక ల్యాబ్‌లో. జూనియర్ కెమిస్ట్ గా చేస్తున్నా...

కుమార్ : గుడ్.

ఆ మాటలు చాలా సాధారణంగానే ఉన్నాయి.
కానీ...

ఇద్దరి మనసుల్లో మాత్రం పాత జ్ఞాపకాలు. ఒక్కొక్కటిగా తలుపులు తెరుస్తున్నాయి.

మధ్యాహ్నం భోజనం,
సాయంత్రం టీ,
గ్రూప్ ఫోటోలు,
పాత టీచర్ల గురించి జ్ఞాపకాలు,

అలా ఆ రోజు మొత్తం గడిచిపోయింది.

సాయంత్రం 6 గంటలకి. ఒక్కొక్కరు బయలుదేరడం ప్రారంభించారు.

తులసి కూడా తన బ్యాగ్ తీసుకుంది. బైక్ పార్కింగ్ వైపు నడుస్తూ ఒకసారి వెనక్కి తిరిగి చూసింది.

కుమార్ దూరంగా నిలబడి తన స్నేహితులతో మాట్లాడుతున్నాడు.

కొన్ని క్షణాలు అతన్ని చూస్తూ నిలబడి. తర్వాత మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఆ రోజు రాత్రి తులసి తన స్నేహితురాలు శ్రావ్య ఇంట్లొ ఉండి. ఉదయం తనతొ కలిసి డ్యూటికి పోయి. తరువాత సాయంత్రానికి ట్రైన్ ఎక్కి ఏలూరూ కి వెళ్ళిపోయింది.

ఉద్యోగరిత్యా తులసి ప్రతి రోజు ఏలూరూ నుంచి విజయవాడకు అప్ ఎండ్ డౌన్ చేస్తూ ఉంటుంది.

ఆ రోజు తరువాత సరిగ్గా 11 రోజులకి అంటె 13 - జులై - 2018 తారీకున. 
ఉదయం 8 గంటలకి తులసి డ్యూటికని ఏలూరు రైల్వెస్టేషన్లొ ఉండగా తనకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. మొబైల్ తీసి చూసింది ఏవరిదొ కొత్త నంబర్ నుంచి కాల్.

తులసి : హలొ ఎవరు...?

కుమార్ : తులసి నేను కుమార్ ని...

తులసి : కుమార్ నువ్వా.. ఏంటి ఇలా కాల్ చేశావు...?

కుమార్ : పుట్టిన రోజు శుభాకాంక్షలు తులసి.... 

ఆ మాట విన్న క్షణం...
ఆమె ముఖంపై అనుకోకుండా చిరునవ్వు మెరిసింది. ఆ రోజు తన పుట్టినరోజు అన్న సంగతి మర్చిపోయింది. తన ఇంట్లొ వాళ్ళు కూడా పట్టించుకోలేదు.

తులసి : ఇంకా నా పుట్టినరోజు గుర్తుందా...?

ఫోన్ అవతల కొద్దిసేపు నిశ్శబ్దం. తర్వాత కుమార్ మెల్లగా నవ్వాడు.

కుమార్ : ఎలా మర్చిపోగలను...?

ఆ ఒక్క మాట...

తులసి గుండెల్లో దాచుకున్న ఎన్నో సంవత్సరాల జ్ఞాపకాలను మళ్లీ కదిలించింది.

ఆ ఉదయం
ఐదు నిమిషాల కోసం మొదలైన ఆ ఫోన్ కాల్...దాదాపు గంటన్నర పాటు కొనసాగింది.

అది ముగిసే సమయానికి తులసి ట్రైన్ ఎక్కి విజయవాడకు చేరుకుంది.

ఆ రోజు ఫోన్ కాల్ తర్వాత. కుమార్, తులసి మధ్య సంభాషణలు క్రమంగా పెరిగాయి.

మొదట రోజుకొక్కసారి మాట్లాడుకునేవాళ్ళు. 
తర్వాత రోజుకు రెండు సార్లు.

కొన్ని రోజులకే...
ఉదయం "గుడ్ మార్నింగ్" మెసేజ్‌తో మొదలై, రాత్రి "గుడ్ నైట్ " వరకు కొనసాగేవి.

మొదట పాత స్కూల్ రోజుల గురించే మాట్లాడుకునేవారు. 
తర్వాత ఇంటర్మీడియెట్ కాలేజి జ్ఞాపకాలు. 

ఆ రోజుల్లొ కుమార్ 10వ తరగతి చదువుతుంటె. తులసి 9వ తరగతి చదివేది. అప్పట్లోనె వీళ్ళిద్దరి మద్యన వయసురిత్యా కలిగె ఆకర్షణలు ఉండేవి. 

కుమార్ జాయిన్ అయ్యిన ఇంటర్మీడియెట్ కాలేజిలోనె తులసి కూడా జాయిన్ అయ్యింది. తరువాత కుమార్ తన ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక డిగ్రి చదవడానికి అని గుంటూరు వెళ్ళిపోయాడు. ఆప్పటి నుంచి ఇద్దరి మద్యన కాంటాక్ట కట్ అయిపోయింది

అలా స్కూలు దశలో మొదలైన వీళ్ళ ప్రేమ కధ ఇంటర్మీడియట్ దశలేనె ముగిసిపోయింది.

ఆ తర్వాత ఇద్దరు తమ జీవితాల గురించి మాట్లాడుకునేవాళ్ళు. 

ఒక సాయంత్రం తన డ్యూటి ముగించుకొని విజయవాడ నుంచి ఏలూరు వెళ్తున్న రైలులో కిటికీ పక్కన కూర్చుని తులసి తన ఫోన్లొ మాట్లాడుతోంది.

తులసి : నీకు తెలుసా కుమార్. పెళ్లి తర్వాత మొదటి నాలుగేళ్లు నేను ఇంట్లోనే ఉన్నాను.

కుమార్ : అలానా...?

తులసి : అవును. పిల్లలు పుడతారని ఎదురుచూశాం.
"ఒక సంవత్సరం..."
"రెండు సంవత్సరాలు..."
"మూడు సంవత్సరాలు..."

తులసి గొంతు కాస్త బరువైంది.

తులసి : ఆ తర్వాత అందరూ నాలోనే లోపం ఉందనడం మొదలుపెట్టారు.

కుమార్ మౌనంగా వింటున్నాడు.

తులసి : "బంధువులు..."
"పక్కవాళ్లు..."
"ఇంట్లో వాళ్లు..."
"అందరికీ నా గురించి ఒకే ప్రశ్న."
"పిల్లలు ఎప్పుడు...?"

కొన్ని క్షణాలు నిశ్శబ్దం.

తులసి : ఆ ప్రశ్నలు, సూటిపోటి మాటలు భరించలేకపోయాను. అందుకే జాబ్ చేయడం మొదలుపెట్టాను. డబ్బు కోసం కాదు. ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోతుందనిపించింది.

కుమార్ ఏమీ మాట్లాడలేదు. కేవలం వింటూ ఉన్నాడు.

చాలా సంవత్సరాల తర్వాత...
తులసి తన మనసులోని బాధను మరొకరికి చెబుతోంది.

ఆగస్టు 2018

ఒక ఆదివారం.
విజయవాడ.,బెంజ్ సర్కిల్ దగ్గర కాఫీ షాప్.

మొదటిసారి ఇద్దరూ ఒంటరిగా కలిశారు.

కుమార్ : నువ్వు ఎంత మారిపోయావో తెలుసా...

తులసి : నువ్వూ తక్కువేం కాదు.

ఇద్దరూ నవ్వుకున్నారు.

ఆ రోజు రెండు గంటలు మాట్లాడుకున్నారు.
విడిపోతున్నప్పుడు...ఇద్దరికీ ఒక విచిత్రమైన వెలితి అనిపించింది. ఆ తర్వాత కలుసుకోవడం మరింత తరచుగా మారింది.

సెప్టెంబర్ 2018

ఇప్పటికే తులసి జీవితంలో కుమార్ ఒక అలవాటుగా మారిపోయాడు. ఏదైనా జరిగితే మొదట కాల్ చేసేది అతనికే.

ఒక రోజు ల్యాబ్‌లో చిన్న సమస్య వచ్చింది.
సాయంత్రం రైలులో ఇంటికి వెళ్తూ. తులసి కుమార్‌కి కాల్ చేసింది.

తులసి : ఈరోజు చాలా కోపం వచ్చింది.

కుమార్ : ఎందుకు...?

తులసి : ఒక స్యాంపుల్ రిపోర్ట్ వల్ల.

కుమార్ : అయితే ఇప్పుడు అంతా ఓకే... కదా..?

తులసి కాసేపు మౌనంగా ఉంది.

తులసి : నీతొ మాట్లాడాక బాగానే ఉంది.

ఆ మాట విన్న తర్వాత...

కుమార్ కూడా కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.

వాళ్లిద్దరికీ అర్థమైంది. ఇది సాధారణ స్నేహం కాదు అని.

అక్టోబర్ 2018

ఒక రోజు సాయంత్రం. విజయవాడ రైల్వే స్టేషన్లొ. ఏలూరు వైపు వెళ్ళె రైలు కోసం ఎదురుచూస్తున్న తులసి ఒక్కసారిగా అలసిపోయినట్టు కూర్చుంది.

రోజూ ప్రయాణం. ఉదయం ఏలూరు నుంచి విజయవాడ.
సాయంత్రం విజయవాడ నుంచి ఏలూరు.
అయిదేళ్లుగా ఇదే జీవితం.
ఆ సమయంలోనే కుమార్ అడిగాడు.

కుమార్ : ఇలా రోజూ ఎందుకు ఇబ్బంది పడుతున్నావు...?

తులసి : ఏం చేయాలి...?

కుమార్ : విజయవాడలో ఇల్లు తీసుకో.

తులసి నవ్వింది.

తులసి : అంత సులభం కాదు.బాబు. మా ఆడవాళ్ళకి ఇంట్లొ సవాలక్ష ప్రశ్నలుంటాయి.

కానీ ఆ ఆలోచన ఆమె మనసులో నాటుకుపోయింది.

కొన్ని వారాల తర్వాత...

విజయవాడలోని ఒక చిన్న కాలనీలో. ఒక సింగిల్ బెడ్‌రూమ్ ఇల్లు అద్దె  తీసుకుంది. ఇంట్లో వాళ్లకి చెప్పిన కారణం:

"తులసి : ల్యాబ్ లొ పని ఎక్కువైంది. ప్రతిరోజు ఏలూరు నుంచి వెళ్ళి రావడం కష్టం. కాబట్టి విజయవాడలోనే ఉంటాను. శని, ఆదివారాలు ఇంటికి వస్తాను."

అని చెప్పింది.

కానీ...
ఆ నిర్ణయానికి అసలు కారణం మాత్రం వేరే.

ఇప్పటికే...
తులసి జీవితంలో కుమార్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేని స్థితికి చేరుకుంది.

ఆ చిన్న అద్దె ఇంటి తలుపు తెరుచుకున్న రోజు...
వాళ్లిద్దరి జీవితాల్లో ఒక కొత్త అధ్యాయం కూడా ప్రారంభమైంది...

డిసెంబర్ 2018 

అప్పటికె తులసి జీవితంలొ కుమార్ స్థానం పూర్తి మారిపోయింది.

ఒక రోజు సాయంత్రం 

ఇంట్లోని బాల్కని వద్ద తులసి ప్రక్కనె ఉన్న కుమార్ భుజంపై తలపెట్టుకొని కూర్చుంది. 

తులసి : మనం పదేళ్ళ క్రితమె కలిసుంటె. ఈపాటికె మన జీవితాలు వేరేలా ఉండేవి. కదా కుమార్

కుమార్ సమాధానం చెప్పలేదు. మౌనంగా ఉన్నాడు.

జనవరి 2019 

ఆ నెల మొదటి వారంలొ తులసికి ఒక వార్త తెలిసింది.

ఆమె గర్భవతి...

రిపోర్ట్ చేతిలొ పట్టుకొని చాలా సేపు ఏడ్చింది. దాదపు 10 ఏళ్ళుగా ఎదురుచూస్తున్న మాతృత్వం ఇవాల్టికి తనకి దక్కినందుకు...

ఈ వార్త మొదట కుమార్ కె ఫోన్ చేసి చెప్పింది.

తులసి : కుమార్ నేను అమ్మని కాబోతున్నాను....

ఫోన్ అవతల కొద్ది సేపు మౌనం. కాసేపటికి..

కుమార్ : సరె జాగ్రత్తగా ఉండు..

అని చెప్పి పెట్టేశాడు. అతని స్వరంలొ ఆనందం కంటె ఆందోళనె ఎక్కవుగా ఉంది.

జూన్ 2019 

అప్పటికె తులసి 6 నెలల గర్భవతి. ఆమె జీవితంలొ సంపూర్ణ ఆనందాన్నీ అనుభవిస్తోంది.

కాని అదె సమయంలొ ఆమె వివాహ జీవీతం మాత్రం పూర్తిగా కూలిపోతోంది.

భర్త సుధాకర్ ప్రవర్తన మారింది.
అతను వేసె ప్రశ్నలు పెరిగాయి.
తనకి అనుమానాలు మొదలయ్యాయి.

ఒక రోజు ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. స్కూల్లో మరియు ఇంటర్మీడియట్లొ జరిగన తన ప్రేమాయణం గురించి ఎవరో తన భర్త సుధాకర్ కి చెప్పారు. 

దాని గురించి తులసిని నిలదీశాడు. కాని తను బుకాయించింది. 

తులసి : ఎప్పుడొ ఇంటర్మీడియట్ లొ జరిగిందాన్నీ పట్టుకొని. ఇప్పుడు అనుమానిస్తావేంటి బావ. ?

సుధాకర్ : ఎప్పుడొ కాదు. ఇప్పుడు కూడా నువ్వు తనతొ కాంటాక్టులొ ఉన్నావంట కదా..? అందుకనెనా నువ్వు విజయవాడలొ ఉంటున్నావు.?

తులసి : బావా నీ అనుమానాలకి అంతు పోంతులేదా.? అయిన కుమార్ ఎక్కడుంటున్నాడొ కూడా నాకు తెలియన్పప్పుడు. మాకు సంబంధం ఎలా అంటగడతావు..?

ఆ రోజు తర్వాత ఇద్దరి మధ్య ఉన్న దూరం మరింత పెరిగింది.

ఆగస్టు 2019 

ఆ నెల 3వ వారంలొ తులసి ఒక ఆరోగ్యవంతమైన ఆడశిశువుకు జన్మనిచ్చింది. 

ఆ చిన్నారిని మొదటిసారి ఒడిలోకి తీసుకున్నప్పుడు.
తులసి కళ్లలో నీళ్లు తిరిగాయి.

తులసి : ఇక నా జీవితంలో నేను ఒంటరిగా లేను.

అని ఆమె మనసులో అనుకుంది.

నవంబర్ 2019 

తులసి ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. తన వివాహ బంధం పూర్తిగా విరిగిపోయింది.

ఒక వైపు చిన్న పాప. మరో వైపు ఒంటరి జీవితం.
అలాంటి సమయంలో...

తులసి మరోసారి కుమార్‌ను కలిసింది.
ఈసారి ఆమె కళ్లలో ప్రేమ కంటే భయం ఎక్కువగా ఉంది.

తులసి : నాకు ఇప్పుడు నువ్వు కావాలి కుమార్. నేను ఇంకా ఈ బిడ్డకి తండ్రి నువ్వే అని మా వాళ్ళకి చెప్పలేదు. ఇప్పుడు చెప్పేద్దామనుకుంటున్నా...

కుమార్ : అలా కుదరదు తులసి. నువ్వు కొంచెం అర్థం చేసుకో

తులసి : కుమార్ నేను ఇప్పటికె చాలా కోల్పోయాను.

కుమార్ : కాని నేను కోల్పోదలచుకోలేను.

తులసి : ఏమంటున్నావు కుమార్.

కుమార్ : అవును. నీకోసం నేను నా భర్యా పిల్లల్ని వదులుకోలేను.

తులసి : ఆలోచించుకొ కుమార్. రెండు రోజుల్లోగా ఏ నిర్ణయానికి రాకపోతె. మన విషయం నేనె నీ భార్యతొ సహా మా వాళ్ళకి మీ వాళ్ళకి అందరికి చెప్పేస్తాను.

అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. 

కుమార్ లొ భయం మొదలైంది. 

కుమార్ : తను ఈ విషయం ఎవరికి చెప్పకూడదు. శాశ్వతంగా తను ఎవ్వరికి చెప్పకూడదు.. 

అని వెళుతున్న తులసిని తన ఇంటి బాల్కని నుంచి కుమార్ చూస్తున్నాడు.

డిసంబర్ 2019 

ఇబ్రహీంపట్నంలోని తన పుట్టింటిలొ ఉన్న తులసికి హటాత్తుగా కడుపు నొప్పి మొదలైంది. 

ఎన్నీ మాత్రలు వేసుకున్న ఆ నొప్పి తగ్గలేదు సరికదా ఆ నొప్పి అంతకంతకు పెరగసాగింది. 

పొద్దున్న మొదలైన ఆ నొప్పి మద్యాహ్నం అయిన తగ్గకపోయె సరికి తనని  హాస్పెటల్ కి తీసుకెళ్ళారు. 

అక్కడ డాక్టర్లు నొప్పి ఎందుకు వస్తోందొ కనుక్కోలేకపోయారు. తరువాత తనని విజయవాడ పెద్ద హాస్పెటల్ కి తీసుకెళ్ళారు. అక్కడ కూడా వైద్యులు ఆమె రోగానికి కారణం కనుక్కోలేకపోయారు. 

తులసి ఆరోగ్యం క్షీణించడం మొదలైంది.
కడుపు నొప్పి తరువాత తన కాళ్ళు విపరీతంగా మండడం మొదలయ్యాయి. 
తర్వాత తన జుట్టు విపరీతంగా రాలిపోయింది..
ఆ తర్వాత తీవ్రమైన ఆరోగ్య సమస్యలు. తనలోని ఒక్కొక్క అవయం పని చేయలేకపోతోంది.

అప్పటికి కూడా తన అవస్తకి కారణం మాత్రం వైద్యులెవరికీ స్పష్టంగా తెలియలేదు. ఇంకా చికిత్స చేస్తునే ఉన్నారు. 

30 డిసంబర్ 2019 

అప్పటికె తులసి హాస్పెటల్లో చేరి దాదాపు నెల రోజులు కావొస్తోంది. 

ఆమె జుట్టంతా ఊడిపోయింది. శరీరం పూర్తిగా ఎముకలగూడులా సన్నగా అయిపోయింది. నరకయాతన అనుభవిస్తూ ఆ రోజు మద్యాహ్నానికి తను కన్నుమూసింది.

అలా 30 ఏళ్ళ వయసులొ తన నాలుగు నెలల పాపని వదిలి తులసి చనిపోయింది. 

తులసి చనిపోయిన తరువాత ఆమె శవాన్నీ పోస్టుమార్టమ్ చేసి. చివరికి ఆమె శరీరంలొ ఏం కలిసిందొ వైద్యులు కనుక్కోగలిగారు.
ఆమె శరీరంలొ "థాలియం" అనె ఒక విషపూరిత రసాయనం కలిసింది అని నిర్ధారించారు. 
ఇది సాధారణ వైద్య పరీక్షలలొ కనిపించదు. అందుకె వైద్యులు ఆమె అనారోగ్యానికి కారణం కనుక్కోలేకపోయారు.

ఇప్పుడు ఇది సహజ మరణం కాదు హత్య అని భావించి పోలీసులు కేసు నమొదు చేశారు. మొదట అందరి అనుమానాలు ఆమె భర్త సుధాకర్ పై వెళ్ళాయి. కాని అతనికి వ్యతిరేకంగా ఎటువంటి ఆధారలు లేవు. 

దీంతొ పోలీసులు ఆ హంతకుడు ఎవరా అని దర్యాప్తు కొనసాగించారు

కాలం గడిచింది.
ఒక సంవత్సరం...
3 సంవత్సరాలు...
5 సంవత్సరాలు...
6 సంవత్సరాలు...
అయినా కేసు పూర్తికాలేదు. 

వర్తమానం 11- జూన్- 2026 

టీ.వీ లొ ఒక వార్త ప్రసారం అవుతోంది.

"న్యూస్ ఏంకర్ : దాదాపు 6 ఏళ్ళ క్రితం జరిగిన తులసి యొక్క అనుమానాస్పద మరణం తాలుకు కేసుకు సంబంధించి పాత ఆధారాలను అధికారులు మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం..."

ఆ వార్తను ఒక వ్యక్తి సోఫాలో కూర్చుని నిశ్శబ్దంగా చూస్తున్నాడు.

అతని వేళ్ల మధ్య సిగరెట్ నెమ్మదిగా కాలుతోంది.
టీ.వీ స్క్రీన్‌పై తులసి ఫోటో కనిపించింది. కొన్ని క్షణాలు అతను అలాగే చూశాడు.
తర్వాత స్వల్పంగా నవ్వాడు.

టీవీ వెలుతురు అతని ముఖంపై పడింది.

అతనె తులసి జీవితంలొ ప్రవేశించిన చివరి వ్యక్తి.

కుమార్ 

అలియాస్

అజయ్ కుమార్ మెంతాడ. ఐ.పీ.ఎస్  (ఏ.సీ.పి .అజయ్)

ఏ.సీ.పి అజయ్ కుమార్ కళ్లలో క్షణం పాటు ఒక విచిత్రమైన మెరుపు కనిపించింది. టీవీలో తులసి కేసు గురించి వార్త ఇంకా కొనసాగుతూనే ఉంది. అతను మాత్రం మౌనంగా కూర్చుని చూస్తున్నాడు...