ఇది ఒక సాధారణ కుటుంబం లో పుట్టిన అమ్మాయి నిజ జీవిత కథ ..
నా పేరు మీనాక్షి.
నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.
మధ్యతరగతి అంటే… ఒక రోజు పని చేస్తే కడుపు నిండుతుంది, కానీ భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఒక భయం వెంటాడుతూనే ఉంటుంది.
మా నాన్న సాధారణమైన కూలి.
ఎండలోనూ, వానలోనూ కష్టపడుతూ మా కుటుంబాన్ని నిలబెట్టాడు.
అతని చెమట చుక్కలే మా జీవితానికి బతుకు దెరువు.
మా నాన్న కష్టపడే స్వభావం నాకు ఎప్పుడూ గర్వకారణం.
మా అమ్మ ఒక అద్భుతమైన గృహిణి.
అలాగే నాన్న తో కూలి పనికీ వెళ్ళేది, కానీ ఇంట్లో మమ్మల్ని చూసుకోవడంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.
మా ఇంటి అల్లరి, సంతోషం, కష్టాలన్నింటికీ ఆమె ఒక పెద్ద ఆధారం.
మా నాన్న ఒక పట్టణంలో పుట్టి పెరిగాడు.
మా తాతయ్య, నాయనమ్మలకు పెద్దగా ఆస్తులు లేవు.
అందుకే చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు.
మా నాన్నకి ఐదుగురు అన్నదమ్ములు.
ఆ ఐదుగురిలో ఆయన రెండవ వాడు.
చిన్న వయసులోనే ఒక కిరాణా షాపులో పని చేయడం మొదలుపెట్టాడు.
ఆ షాపులోనే చాలా రోజులు పనిచేసి, తనకు వచ్చిన కష్టాన్ని భరించడం నేర్చుకున్నాడు.
మా నాన్న కు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఎంతో ఇష్టం అందులోని హీరో కృష్ణ అంటే చాలా ఇష్టం.
మా నాన్న చిన్నప్పటి నుంచే అప్పుడు కృష్ణ సినిమా రిలీజ్ అయిన వెళ్లి చూడడం అలవాటు.
పెద్దవాడవుతూ తన కుటుంబానికి తోడ్పాటు ఇవ్వడం, అన్నదమ్ముల మధ్య బాధ్యతలు పంచుకోవడం అన్నీ చేశాడు.
కష్టపడి పని చేయడమే ఆయనకు మొదటి గుణం.
ఇంకోపక్క మా అమ్మ జీవితం ఒక పల్లెటూరిలో గడుస్తూ ఉండేది.
మా తాతగారి కుటుంబం వ్యవసాయం చేసే కుటుంబం.
మా తాతకు ఆరుగురు పిల్లలు – ఐదుగురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు.
మా అమ్మమ్మ, తాతగారికి మూడో కూతురు మా అమ్మ.
మా అమ్మ జీవితం పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో సాగింది. ఇటు పక్క నాన్న ది ఒక పట్టణం లో గడుపుతున్న జీవితం.
ఇలా మా అమ్మ–నాన్నల బాల్యం గడిచిపోయింది.
కొన్ని రోజులకు మా పెదనాన్నకు, మా అమ్మవాళ్ల అక్కను ఇచ్చి పెళ్లి చేశారు.
తర్వాత మా అమ్మకు, మా నాన్నకు కూడా పెళ్లి జరిగింది.
అంటే ఒకే ఇంట్లో, మా నాన్నకు – మా పెదనాన్నకు పెళ్లిళ్లు జరిగాయి.
అమ్మా – నాన్న పెళ్లి తర్వాత,
నాన్న ఎక్కడ పని దొరికితే అక్కడికి వెళ్లి పనిచేస్తూ ఉండేవాడు.
నాన్న వాళ్ళు చేసిది ఒక మట్టి పని . ఇల్లు కట్టుకోవడం కోసం గుంతలు తీయడం . పైప్ లైన్ లు వేయడం . మట్టి పనికి సంబంధించింది ఏది అయిన చేసేవారు.
కొన్ని రోజులకు మా అక్క పుట్టింది.
ఆ తర్వాత నేను పుట్టాను.
నేను పుట్టిన కొద్దికాలం తర్వాత,
మా అక్కను మా నానమ్మ – తాతయ్య వాళ్ల దగ్గర ఉంచి,
నన్ను మాత్రమే తీసుకొని ఎక్కడ పని ఉంటే అక్కడికి వెళ్లేవారు.
ఇలా చాలా రోజులు ఊరు ఊరు తిరుగుతూ పనిచేస్తూ జీవితం గడిచింది.
ఇలా కొన్ని రోజులు చేసిన తర్వాత,
ఒక పెద్ద పట్టణానికి కరీంనగర్ కి వెళ్లి అక్కడే పనులు చేస్తూ ఉండేవారు.
ఆ పట్టణంలో, మా ఊరి కులానికి చెందిన వాళ్లు చాలామంది ముందే వచ్చి
ఒక ఖాళీ ప్రదేశంలో గుడిసెలు వేసుకొని ఉండేవారు.
మేం వెళ్లే సమయానికి అక్కడ ఇప్పటికే చాలామంది ఉండిపోయారు.
అప్పటికే నాకు ఏడు సంవత్సరాలు వచ్చాయనుకుంటాను.
నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ఫస్ట్, సెకండ్ క్లాసులు చదువుతున్నాను.
మా నానమ్మ చనిపోయిన తర్వాత,
మా నాన్న – మా అక్కను కూడా మా దగ్గరికి తీసుకొని వచ్చాడు.
ఇక నా బాల్యంలోకి అడుగుపెడితే,
నా జీవితం ఎలా మొదలైందో చెప్తాను.
మేము ఉండే గుడిసెలు ఎలా ఉండేవో చెబుతాను.
ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కొక్క గుడిసె ఉండేది.
ఆ చిన్న గుడిసెలో సిమెంటు వేసుకొని, కాళ్లకు మట్టి అంటకుండా చూసుకునేవాళ్లు.
గుడిసె బయట నీళ్లు పోసుకోవడానికి బకెట్లు, డ్రమ్‌లు లాంటివి ఉండేవి.
ప్రతి గుడిసెలో వారి కుటుంబం వాళ్లే ఉండేవారు.
పక్కపక్కనే గుడిసెలు వరుసగా ఉండేవి – మొత్తం ముప్పై, నలభై గుడిసెలు ఉండేవి.
అలాగే స్నానం చేయడానికి పరదలతో కట్టిన బాత్రూములు ఉండేవి.
ఆ నగరంలో నీళ్లు ఒక్క రోజు తప్పించి ఒక్క రోజు మాత్రమే వస్తూ ఉండేది.
నల్ల వచ్చిన రోజు, బిందెలు పట్టుకొని పక్కనే ఉన్న నల్ల దగ్గర క్యూలలో నిలబడి,
ఇరవై–ముప్పై బిందెలు నీళ్లు తెచ్చుకొని ఇంటి దగ్గర ఉన్న డ్రమ్‌లలో నింపుకునేవాళ్లు.
చిన్నతనంలో ఎన్ని బిందెలు తెచ్చినా కానీ,
కష్టంగా అస్సలు అనిపించేది కాదు.
ఆ నీళ్లు తేవడంలో కూడా మాకు ఒక ప్రత్యేకమైన ఆనందం, ఒక ఫీల్ ఉండేది.
మా గుడిసెలకు కొంత దూరంలో ఒక రామాలయం ఉండేది.
సాయంత్రం ఆరు–ఏడు అయ్యిందంటే, మా గుడిసెలో ఉన్న పిల్లలమంతా అక్కడికి వెళ్లేవాళ్లం.
దేవుడికి మొక్కుకోవడానికి కాదు 😄...
అక్కడ వారు పెట్టే రోజూ కొత్త కొత్త వెరైటీ ప్రసాదం తినడానికి!
ఆ గుడి చాలా స్పెషల్‌గా ఉండేది.
అక్కడ రోజు వేరువేరు ప్రసాదాలు పెట్టేవారు –
ఒకరోజు సిరా, ఒకరోజు పులిహోర,
మరొక రోజు దద్దోజనం, ఇంకో రోజు గుడాలు... ఇలా మారుతూ ఉండేది.
ఇవి తినడానికి ఒక గంటసేపు పూజ అయ్యే వరకు కూర్చుని ఎదురుచూసి,
ఆ తర్వాత ప్రసాదం తీసుకొని, అక్కడే తిని వచ్చేవాళ్లం.
ఆ ప్రసాదాల రుచి ఇప్పటికీ గుర్తు చేసుకున్నా, నా నోట్లో నీరూరుతుంది.
మా చుట్టూ ఉన్న వాళ్లు చాలా డబ్బున్న వాళ్లు.
మమ్మల్ని ఒక పురుగుల్లా చూసేవాళ్లు.
కానీ మా లోకంలో మేము మాత్రం చాలా సంతోషంగా గడుపుతున్నాం.
ఎప్పుడైనా టీవీ చూడాలి అనిపించినప్పుడు,
ఎవరైనా ఇంట్లో టీవీ కనిపిస్తే అక్కడికి వెళ్లి చూసేవాళ్లం.
కొంతమంది రానిచ్చేవారు, కొంతమంది బయటికి కొట్టేవారు.
అయినా కొంతమంది పెద్ద మనసున్న వాళ్లు, కూర్చోబెట్టి
సీరియల్ అయ్యేదాకా చూసేలా అనుమతించేవాళ్లు.
ఇక్కడ మేము ఎలాగ వున్న స్కూల్ లో మాత్రం అందరం సమానంగా వుండేవాళ్ళం.
మా ఫ్రెండ్స్ మాతో, మా అక్క వాళ్ల ఫ్రెండ్స్ మా అక్క వాళ్లతో
చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు.
మా అక్క వాళ్ల ఫ్రెండ్స్‌లో ఒక అమ్మాయి చాలా ధనవంతురాలు.
కానీ తనకి మా అక్కంటే చాలా ఇష్టం.
తనకి సరిగా మాటలు రాకపోయేది, కానీ చాలా మంచి మనసున్న అమ్మాయి.
ఆమె దగ్గర చాలా డబ్బు ఉండేది.
అంత డబ్బు కోసం, కొందరు తనని చంపాలని కూడా చూశారు.
స్కూలుకి మాత్రం నేను రోజు వెళ్ళేదాన్ని. కానీ ఇంటి దగ్గర చేసే అల్లరి మాత్రం ఎప్పుడూ మారలేదు.
స్కూల్ లేని టైంలో పేకాట కూడా ఆడేదాన్ని.
పేకాట ఆడడం మాకు కొత్తేమీ కాదు .ఆ ఆట మా అమ్మ నాన్న దగ్గరి నుంచి నేర్చుకున్నాం.
తరువాత భాగం ఇంక వుంది....