Read The mind behind the flower by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

పూల వెనక మనసు

పూల వెనక మనసు

రావులపాలెం కోనసీమకు ముఖద్వారం. అరటిపళ్ళ మార్కెట్ కి ముఖ్యమైన స్థలం. జాతీయ రహదారి మీద ఉన్న ఈ నగరం , అటు విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఇటు రాజమండ్రి వెళ్లే బస్సులు కోనసీమ వైపు వెళ్లే బస్సులు లారీలు టాక్సీ లతో ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. 

సాయంకాలం ఆరు గంటలైంది. ఒక వ్యక్తి సెంటర్లో నిలబడి చేతి మీద మల్లెపూలు దండలు వేసుకుని" మల్లెపూలు మల్లెపూలు అంటూ అరుస్తూ లారీలు, బస్సులు, కార్లు కూడా పరిగెడుతున్నాడు . అతని పేరు కోటయ్య. పేరులో కోటి ఉంది గాని తొడుక్కోడానికి సరైన చొక్కా కూడా లేదు. చేసేది పూల వ్యాపారి దగ్గర పని. ఏ కాలంలో పూలు ఆ కాలంలో అమ్ముతుంటాడు. అది కూడా రహదారి సెంటర్లో ఆగిన వాహనాలు దగ్గరకొచ్చి పట్టుకొచ్చి అమ్ముతుంటాడు.  

ఇంతలో హైదరాబాద్ వెళ్లే బస్సు వచ్చి ఆగింది.బస్సులో నుంచి ఒక స్త్రీ మల్లెపూలు ఎంత? అని అడిగింది. "మూర అరవై రూపాయలు అన్నాడు. ఆమె ఏమి మాట్లాడలేదు . ఇంతలో బస్సు బయలుదేరడానికి సిద్ధమయ్యింది.నలభై రూపాయలకు ఇస్తానమ్మా! అంటూ బస్ కూడా పరిగెత్తాడు. 

"లేదు ముప్పై రూపాయలు అంటూ కిటికీ లోంచి మూడు పదులు తీసి ఇవ్వగా దండ గబగబా కొలిచేసి ఇచ్చేసాడు. అది మూర ఉంటుందో లేదో ఎవరికి తెలుసు.  
"
మనం షాపుల దగ్గర కొనుక్కుంటే మూర ఇరవై రూపాయల అమ్మ ఇక్కడ కొనకూడదు వీళ్ళవన్నీ మోసాలు ఇది మూర కూడా ఉండదు. దండలో పువ్వులు దూర దూరంగా కడతారు. 
అoది పక్కన ఉన్న కూతురు. ఇంతలో ఆ స్త్రీ తన తలలో ఉన్న సగం వాడివున్న మల్లెపూల దండ రోడ్డుమీద పడేసింది . ఆ పక్కనే ఉన్న పూలవాడు కోటయ్య ఆ దండ తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు .  
 
ఇప్పుడే కదే మండపేటలో కొనుక్కున్నావ్. అవి ఇంకా బాగానే ఉన్నాయి కదా అని అడుగుతోంది పక్కనున్న కూతురు తల్లిని

" అవును నాకు తెలుసు ఇవి కడియం పువ్వులు. చూడగానే పెట్టుకోవాలని అనిపించింది అంది ఆవిడ జన్మభూమి మీద అభిమానంతో .

ఆ రోడ్డు మీద వచ్చి ఆగే వాహనాలను బట్టి రేట్లు మారుస్తూ ఉంటాడు కోటయ్య.. లారీల వాళ్ళు అయితే రేటు ఎంతైనా పర్వాలేదు! కానీ వాళ్లకు మల్లెపూల పరిమళం కావాలి. వాళ్ల బ్రతుకు అది. ఆ మత్తులో రేటు గురించి ఆలోచించరు.

పగలంతా కష్టపడి పనిచేసే రైతు కూలీలు, ఆటో డ్రైవర్లు, ఆఫీసు నుండి తిరిగి ఇంటికి వెళ్లే ఉద్యోగస్తులు, షాపులు మూసి ఇంటికి తిరిగి వెళ్లే వ్యాపారులు ఒక మూర మల్లెపూలు కొన్ని పట్టుకెళ్ళకుండా ఉండరు. మల్లెపూలు అంటే వేసవిలో అంత క్రేజీ. ఆకాశాన్నంటే భవనాల్లో పెళ్లిళ్లు, దేవుడి కల్యాణాలు క వేసవిలో ఎక్కువగా జరుగుతాయి. మల్లెపూల జడ పెళ్లికూతురికి అందం. 

అలా వచ్చి పోయే వాహనాలు కూడా పరిగెడుతూ పూలదండల మీద నీళ్లు చల్లుతూ ఆ దండలు బరువుకి చేతులు నొప్పులు పుడుతున్న వాహనాల వెంట పరిగెడుతూనే ఉన్నాడు.
 ఒకపక్క ఆకలి దంచేస్తోంది. ఏదైనా టిఫిన్ చేద్దాం! అంటే ఇది రద్దీ సమయం ఈ సమయంలో బేరాలు పోగొట్టుకుంటే మల్లెపూలు వాడిపోతాయి . వాడిపోతే ఎవరు కొంటారు. మొహం చాటేస్తారు. 

అలా బేరాలు చూసుకుంటేనే పక్కనున్న టీ కొట్టు దగ్గర గబగబా ఒక టీ తాగేసాడు. ఆకలి కొంత చచ్చిపోయింది. మరి తన ఆకలి చచ్చిపోయింది. ఇంటిదగ్గర ఆశగా తను వైపు చూస్తున్న ఆరు కళ్ళుకి తనే జవాబిచ్చుకోవాలి. అయితే తన టార్గెట్ పూర్తి చేయాలి. దానికి తోడు ఇవాళ పెద్ద పిల్ల పుట్టినరోజు. 

మార్కెట్ కి వచ్చేటప్పుడు పెద్ద పోజు కొడుతూ "ఏం కావాలి అమ్మ అని అడిగాడు కోటయ్య. తలలోకి మల్లెపూలు పట్టుకు రా !నాన్న అంది పెద్ద కూతురు. సరేనమ్మా అని చెప్పి పనిలోకి వచ్చేసాడు. 

" ఏరా కోటయ్య రెండు మూరలు మల్లెపూలు ఇస్తావా! దేవుడికి రా! అన్నాడు సైకిల్ నుంచి దిగుతూ వెంకటేశ్వర స్వామి గుడిలో పూజారి. ప్రతిరోజు కోటయ్య దగ్గర పువ్వులు కొంటాడు. దేవుడు అంటే చాలా భక్తి కోటయ్యకి. 

చీకటి పడేకొద్దీ ఆఫీసు నుంచి వచ్చే వాళ్ళు, ఊరు నుంచి దిగేవాళ్లు, ఊరికి వెళ్లేవాళ్ల బేరాలు ఎక్కువగా ఉంటాయి. రాత్రి పదకొండు గంటల వరకు తనకు ఇచ్చిన సరిగా అంతా అమ్మేసి షావుకారు దగ్గర వెళ్ళాడు. షావుకారు రోజు కూలీ లెక్క పెట్టి ఇచ్చేసాడు.

 అప్పుడు జేబులోంచి ఆ మల్లెపూలు దండని తీసి ఆ పక్కనే ఉన్న బకెట్ లోంచి నీళ్లు తీసి చల్లడం ప్రారంభించాడు 
" అదేంటిరా వాడిపోయిన పూలు ఎవరు కొంటారు? ఇంకా దానికి మెరుగులు దిద్దుతున్నావు. పూలన్నీ అమ్మేశాను అన్నావు కదా! అన్నాడు షావుకారు.  

"లేదండి మన పూలన్నీ అమ్మేశాను. మీకు సరిగా నాకు ఇచ్చిన సరుకుకి లెక్క కట్టి డబ్బులు ఇచ్చేసాను కదా! మరి ఈ దండ! . ఈ దండ కథ చెప్పాడు కోటయ్య. మరి దీంతో ఏం చేస్తావ్! మళ్లీ తన కూతురు పుట్టిన రోజు గురించి చెప్పాడు. షావుకారు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి . 

రోజు కొన్ని వందల దండలు అమ్ముతుంటాడు ఈ కోటయ్య. ఎంతో నమ్మకంగా ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్నాడు. మోసం చేయాలంటే ఎంతో పని కాదు అతనికి. కానీ నిజాయితీగా తన కూతురి పుట్టినరోజు కోసం ఎవరో వాడి పారేసిన దండని అంటే అది పూర్తిగా వాడిపోలేదు అయినా సరే బహుమతిగా ఇస్తున్నాడు. ఎంత నిజాయితీపరుడు అనుకున్నాడు షావుకారు.  

మరి వాడిపోయిన దండం ఇస్తున్నావేంటి! వాసన రావటం లేదు కదా! అని అడిగాడు షావుకారు. అది మల్లెపూల దండ అడిగింది. పూల పరిమళం గురించి దానికి తెలియదు అందుకే అలా అన్నాడు కోటయ్య. 

అవును మల్లె పూలు పరిమళం గురించే కదా! కన్నెపిల్లల దగ్గర్నుంచి ముదుసలి వరకు తలలో తురుముకుంటారు . నల్లటి కురులలో తెల్లటి మల్లెపూలు ఎంత అందంగా కనబడతాయి. మధురోహలలోకి తీసుకెళ్లిపోతాయి. కంటికి ఇంపుగా కనిపిస్తాయి. చెప్పలేని సందేశాలు ఎన్నో మోసుకుని వస్తాయి.

రోజు పూల మధ్య ఉండి పూలు అమ్ముతూ జీవితం గడిపే కోటయ్య మూర మల్లెపూలు తన కూతురి కోసం కొనిపెట్టడానికి ఇన్ని తిప్పలు పడుతున్నాడు అనుకున్నాడు షావుకారు. ఒక మూర మల్లెపూలు కొనిపెడితే తన జీతంలో ముప్పై రూపాయలు తగ్గిపోతాయి అది కదా అతని ఉద్దేశం! ముప్పై రూపాయలు అంటే వాడికి ఒకరికి ఒక రోజు టిఫిన్ వస్తుంది. దానిని అనవసరంగా ఈ మల్లెపూల మీద ఖర్చు పెట్టడం ఎందుకు అది వాడి ఆలోచన. సరదా పక్కన పెట్టండి. నాకు వాడు ఒక ఆర్థికవేత్తల కనిపించాడు. ఆలోచన చాలా బాగుంది. వాడికి ఉన్న ఆదాయంలో కుటుంబానికి తిండి పెట్టడానికి ఆలోచిస్తున్నాడు. చాలా బాగుంది అనుకున్నాడు యజమాని.

ఆ తర్వాత బాధ్యత గల యజమానిగా నిజాయితీ గల ఉద్యోగికి ఏం చేయాలి? అదే చేశాడు. అతని నిజాయితీకి తలలో వాడిపోని పువ్వులతో పాటు, నోరు తీపి చేసే కోనసీమ కోవా ఇచ్చిన యజమాని వైపు కృతజ్ఞతలు చూసి ఇంటి దారి పట్టాడు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279