Read The change brought by the son-in-law by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అల్లుడు తెచ్చిన మార్పు

అల్లుడు తెచ్చిన మార్పు

 " బాబు రమేష్ మీకు కావలసింది కొనుక్కోండి ఈ డబ్బుతోటి అంటూ సంక్రాంతి పండగకు వచ్చిన అల్లుడికి అత్తగారు రమాదేవి తన బ్యాగ్ లో నుంచి సొమ్ము తీసి అల్లుడు చేతిలో పెట్టింది. "వద్దండి వచ్చినప్పుడు అల్లా ఇవ్వడం ఏం బాగాలేదు. అయినా మాకు సిగ్గుగా ఉంది. దేవుడి దయవల్ల మాకు డబ్బు అవసరమేమీ లేదు ప్రస్తుతం అంటూ తిరిగి డబ్బు ఇచ్చేయబోయాడు అత్తగారికి రమేష్. 

మాకు మాత్రం ఎవరున్నారు చెప్పు ఒక్కగానొక పిల్ల ఇంకెవరికి పెడతాము అంటూ బలవంతంగా జేబులో పెట్టేసారు రమేష్ అత్తగారు. రమేష్ ఏమీ చేయలేక సామాన్లు తీసుకొద్దాం అని గదిలోకి వెళ్ళాడు. అక్కడ సామాన్లు సర్దుకుంటున్న భార్య సుజాత తోటి ఇలా అన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా వీళ్ళు డబ్బు ఇస్తునే ఉన్నారు ప్రతిసారి అంటూ ఫిర్యాదు చేశాడు. సుజాత ఏమి మాట్లాడకుండా ఆ డబ్బు ఇలా ఇవ్వండి అంటూ రమేష్ జేబులోని డబ్బు తీసుకుని తన బ్యాగ్ లో పెట్టుకుంది. ఆ సాయంత్రం రమేషు సుజాత హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయారు. 
రామారావు రవణమ్మల ఏకైక సంతానం సుజాత. రామారావు ఎమ్మార్వో ఆఫీస్ లో ఒక చిరుద్యోగి. వెనక ఆస్తిపాస్తులు లేవు. అద్దె ఇంట్లో కాలక్షేపం చేస్తూ ఉన్న ఒక్క పిల్లని బీటెక్ వరకు చదివించి రమేష్ కిచ్చి పెళ్లి చేశా రు. 

పెద్ద కళ్యాణ మండపం ,ఖరీదైన విందు, వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెళ్ళివారందరికీ ఖరీదైన బహుమతులు ఇలా తమ స్థాయికి మించి పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత రమేష్ నాలుగైదు సార్లు సార్లు అత్తవారింటికి వచ్చాడు. వచ్చినప్పుడల్లా భారీ విందులు, శక్తికి మించి మర్యాదలు వెళ్లేటప్పుడు బట్టలతోపాటు ఇలా ఎంతో కొంత సొ మ్ము ఇవ్వడం చూస్తుంటే రమేష్ కి చాలా బాధగా అనిపించింది.

 అత్తగారు డబ్బిచ్చినప్పుడల్లా రమేష్ భార్య వచ్చి వెంటనే ఆ సొమ్ము తీసుకుని బ్యాగులో పెట్టుకునేది. ప్రతిసారి ఇదే అలవాటు సుజాతకి. అయినా ప్రతిసారి డబ్బు ఎందుకు ఇవ్వాలి ఏదో పండక్కి బట్టలు పెడితే సరిపోతుంది కదా మరి ఈవిడ ఏమిటి ఇలా చేస్తోంది అనుకుంటూ ఉండేవాడు రమేష్ . దానికి తోడు అత్తగారు ప్రవర్తన ఎప్పుడూ డబ్బంటే లెక్కలేనట్లుగా ఉండడం అన్నింటికీ గొప్ప కబుర్లు మామగారు మౌనంగా ఉండడం ఇవేమీ అర్థం కాలేదు రమేష్ కి.  

రమేష్ పుట్టినరోజుకి, సుజాత పుట్టినరోజుకి పెళ్లిరోజులకి భారీగా డబ్బులు పంపుతూనే ఉండేవారు రమేష్ అత్తగారు. అలా సంవత్సరం గడిచింది. ఎప్పటి నుంచో రమేష్ కి మంచి కారు కొనుక్కోవాలని సంకల్పం. ఈసారి సంక్రాంతి పండక్కి కంపెనీ వాళ్ళు ఇస్తున్న ఆఫర్లు చూసి ఒక కారు బుక్ చేద్దామని భార్య సుజాతతో చెప్పాడు . 

"మనకి కారుఎందుకు అండి అని డబ్బులు మన దగ్గర ఎక్కడ ఉన్నాయి అని ఎదురు ప్రశ్న వేసింది. అడగవలసిన ప్రశ్న అడిగింది ఆఫీస్ వాళ్లు కొంత లోన్ ఇస్తారు . అన్నట్టు మర్చిపోయిన మనకు అత్తయ్య గారు వాళ్ళు చాలాసార్లు డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బు ముందుగా కట్టేసి మిగిలింది లోను తీసుకుందామంటూ భార్యతో చెప్పాడు రమేష్. సుజాత ఏమి మాట్లాడలేదు. అవును ఆ డబ్బులు మొత్తం ఎంత ఉన్నాయి అని అడిగాడు రమేష్ భార్య నీ. ఏమో నండి నేను కూడా లెక్క చూడలేదు అంటూ చెప్పిన భార్య మొహంలో రంగులు మారడం గమనించాడు రమేష్. 

ఆ డబ్బు ప్రస్తావన ఎత్తగానే భార్య మొహం ఎందుకు వాడి పోయిందో అర్థం కాలేదు రమేష్ కి. అలా రెండు మూడు సార్లు ఆ డబ్బు అడిగిన సుజాత ఏం సమాధానం చెప్పలేదు.

ఇలా పది రోజులు గడిచేయి. ఒకరోజు రమేష్ అత్తగారు మామగారు రమేష్ ఇంటికి వచ్చారు . వచ్చేటప్పుడు భారీగా సంచి తో స్వీట్లు హాట్లు మోసుకుంటూ వచ్చారు. ఉండేది ఇద్దరు మనుషులు అన్ని స్వీట్లు ఏం చేసుకుంటాం అనుకున్నాడు రమేష్. రమేష్ అత్తగారు వచ్చిన దగ్గర్నుంచి హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారి అని రోజుకి పది సార్లు చెప్పడం ప్రారంభించింది. ఆవిడ మాటల్లోనీ అర్థం గ్రహించి ఆఫీస్ కి సెలవు పెట్టి హైదరాబాద్ అంతా తిప్పి చూపించాడు. వెళ్లిన ప్రతిచోట ఎదురింటి వాళ్లకి పక్కింటి వాళ్ళకి ఏదో వస్తువులు కొంటూనే ఉంది రమేష్ అత్తగారు. 
ఒకరోజు ఉదయం ఇంకా నిద్ర లేవని రమేష్ కి ప్రక్క గదిలో నుంచి మాటలు వినబడ్డాయి. ఎందుకమ్మా అంత అప్పులు చేసి ప్రతిసారి అన్ని డబ్బులు ఇస్తున్నావ్? ఎవరికైనా సామాన్య సంసారులకి అంత డబ్బు పెట్టడం కష్టమే.నువ్వు డబ్బులు ఇచ్చిన వెంటనే ఆ డబ్బులు నేను పుచ్చు కుని మళ్లీ నీకు ఫోన్ పే చేయడం ఎందుకీ నాటకాలు అంటూ అడుగుతోంది తల్లిని సుజాత. చూడు సుజాత అల్లుడుకి ఏమి పెట్టకపోతే మీ అత్తగారు వాళ్ళు తప్పుగా అనుకుంటారు. అలాగే అల్లుడుకి కూడా ఏమి పెట్టలేదని అనిపించవచ్చు. మన గౌరవం కాపాడుకోవడం కోసం నేను ఇలా చేస్తున్నాను. మనవి అన్ని మధ్యతరగతి బ్రతుకులు. అటు పూర్తిగా లేని వాళ్ళం కాదు ఇటు పూర్తిగా ఉన్న వాళ్ళం కూడా కాదు అంటూ చెప్పిన తల్లి మాటలకి చూడు ఇప్పుడు నేను ఇబ్బందుల్లో పడ్డాను. మా ఆయన ఆ డబ్బు గురించి అడుగుతున్నారు. నేను ఇప్పుడు ఏమి సమాధానం చెప్పాలి? అంటూ తల్లిని గట్టిగా అడిగింది సుజాత.

రమేష్ గబాలున మంచం మీద నుంచి లేచి సుజాత ఉండే గదిలోకి వెళ్లేసరికి వాళ్ళిద్దరూ టక్కున మాటలు ఆపేసారు. చూడండి మీ మాటలు నేను విన్నాను. మీరు గొప్ప కోసం చేస్తున్న ఈ పనుల వల్ల మీరే ఇబ్బందిలో పడ్డారు. 

ఎవరి మెప్పుకోసమో మీరు చేస్తున్న ఈ పనులేమీ బాగాలేవు. మన ఆర్థిక పరిస్థితి మనకు తెలుసు. దానికి అనుగుణంగా మనం నడుచుకుంటూ ఉండాలి. ఎవరైనా పండక్కి వచ్చిన అల్లుడికి బట్టలు పెడతారు కానీ ప్రతిసారి ఇన్ని డబ్బులు ఇవ్వరు.పోనీ మీ ఆర్థిక పరిస్థితి ఎవరికి తెలియంది కాదు. మనం గొప్ప వాళ్ళు అని పదిమందిలో చెప్పుకోవడానికి ఇటువంటి పనులు చేయకూడదు. దానిలో మావయ్య గారు బాధ్యత కూడా చాలా ఉంది. మీరు ఏ పని చేసినా ఆయన ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం నాకు నచ్చలేదు. అందులో సుజాత పాత్ర కూడా చాలా దరిద్రమైన పాత్ర. ఇలాంటి వాళ్లని నేను ఎక్కడ చూడలేదు. నేను మంచి వాడిని కాబట్టి మీ అమ్మాయి చేసిన పనికి ఏమీ అనకుండా ఊరుకున్నా. ఇంకో వ్యక్తి అయితే పుట్టింటికి వెంటనే పంపించి డబ్బు తీసుకురమ్మని ఉండేవారు. మీరు పిల్లలకి ఇటువంటి ట్రైనింగ్ ఇవ్వకూడదు అని మాటలనేసి తన గదిలోకి వెళ్లిపోయాడు రమేష్.

ఆ తర్వాత రెండు రోజులకి రమేష్ అత్తగారు మావగారు ఊరెళ్ళిపోయారు. మేము చేసింది తప్పేనండి అంటూ రమేష్ కాళ్ళ మీద పడింది సుజాత. చూడు సుజాత ఆ తరం వాళ్ళ ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. ఏదేమైనా మన స్తోమతను బట్టి మనం ఖర్చు చేసుకోవాలి. ఎవరితోటి పోల్చుకోకూడదు. నిజానికి నాకు కారు అవసరం లేదు. అదంతా నాటకం. ఆ మధ్య ఒకసారి నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు ఫోను మోగుతుంటే ఎత్తి మాట్లాడి నీకు వచ్చిన మెసేజ్లు చూసా ను. అందులో ఎక్కువగా మీ అమ్మగారికి డబ్బు పంపిన ఫోన్ పే మెసేజ్లు ఎక్కువ ఉన్నాయి. అంత డబ్బు పంపించవలసిన అవసరం ఏమొచ్చింది . అయినా నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అని ఆలోచించుకుంటే సడన్ గా మీ అమ్మగారు ఇచ్చిన సొమ్ము గుర్తుకొచ్చింది. అసలు విషయం తెలుసుకుందామని ఈ నాటకం ఆడాను. నేను డబ్బు అడిగినప్పుడల్లా నీ మొహoల్లో రంగులు మారడం గమనించాను. ఏదో సమస్య ఉందని అప్పుడు అర్థమైంది నాకు. ఏ తప్పు చేసిన ఎక్కువ రోజులు దాగదు అంటూ చెప్పకు వచ్చాడు రమేష్. ఆ తర్వాత రమేష్ ఎన్నిసార్లు పండక్కి వెళ్లిన బట్టలతో సరిపెట్టేవారు రమేష్ అత్తమామలు.

ఇటువంటి అత్తమామలు చాలామంది ఉంటారు ఈ లోకంలో. కానీ రమేష్ లాంటి అల్లుళ్ళు అరుదుగా ఉంటారు. ఏది ఏమైనా మన ఆర్థిక పరిస్థితికి మించి గొప్ప కోసం పెడితే తిప్పలు తప్ప వు.

రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279

.