Read North by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • అంతర్జాతీయ మాతృ దినోత్సవం

    అంతర్జాతీయ మాతృ దినోత్సవం (ఆంగ్లం: Mother's Day) కని పెం...

  • ఉత్తరం

    ఉత్తరం " ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పద...

  • ఓ మనసా... - 1

    కోట్లాది ఆస్తులకు ఒక గాను ఒక్క వారసుడు. వంటి చేత్తోనే తన వ్య...

  • స్వగతం - 1

    స్వగతం....నేను జీవితంలో చాలా మందిని కలిశాను,కొంత మంది పేర్లు...

  • ఆర్థిక శాస్త్రవేత్త

    ఆర్థిక శాస్త్రవేత్తఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఉత్తరం

ఉత్తరం 

" ఏమిటి ! సాంబయ్య దగ్గర్నుంచి ఉత్తరం వచ్చి అప్పుడే పదిహేను రోజులు అయింది. ఏమీ తోచట్లేదు .కబుర్లు తెలియట్లేదు . ఎప్పుడూ వారం రోజులకోసారి ఉత్తరం రాసేవాడు అనుకుంటూ పోస్ట్ మాన్ కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి గుమ్మం వైపు తొంగి చూస్తోంది కావమ్మ. ఉత్తరం చదివితే సాంబయ్య ను చూసినట్టు ఉంటుంది కావమ్మకి. సాంబయ్య తో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ఆ రోజుల్లో కావమ్మ లాంటి వాళ్ళు ఎందరో!

మళ్లీ ఉత్తరం వచ్చేవరకు ఆ ఉత్తరంలోని సంగతులతో మనసు బెంగ పెట్టుకోదు. ఏంటో ఈసారి చాలా లేట్ అయింది అనుకుంటూ గదిలో మూలగా ఉన్నతీగకు తగిలించుకున్న పాత ఉత్తరాన్ని తీసి చదవడం ప్రారంభించింది. మొదటి వాక్యం లో గౌరవం, ప్రేమ మొదలైంది . ఎడం చేతపక్క తల పైకెత్తి చూస్తే దాని వయసు ఎంతో తెలిసిపోయింది. మీకోసం ఆ ఊరి నుంచి కబురు మోసుకొచ్చాను అని చెప్పింది. 

 క్షేమమాచారాలతో మనసు కుదురుపరచి అక్కడి నుంచి ఆ ఊరి ఊసులన్నీ చెబుతూ ప్రేమ పొంగిస్తూ బాధలను తెలియ చేస్తూ అమ్మ మీద బెంగ ని ప్రకటించే కబుర్లన్నీ తనలో దాచి తలపై మీద ముద్ర వేయించుకుని వచ్చిన తోకలేని పిట్ట ఈ కార్డు ముక్కని చదివి కన్నీళ్లు కార్చింది కావమ్మ. 
ముగింపులో కూడా మదిని పులకరించే గౌరవం కూడా ఉంది. ఉత్తరం రాయడ0 ఎంతో సంస్కారవంతమైన పని. ఇది ప్రేమతో వ్రాసిన ఉత్తరం. అందుకే అది గుండెను ప్రేమగా పలకరించింది . తీగలో భద్రంగా దాచుకుంది కావమ్మ.  

కావమ్మ జీవితంలో ఎన్నో ఉత్తరాలు కబుర్లు మోసుకుంటూ వచ్చాయి.మోసుకొచ్చే కబురు కలత పుట్టిస్తే కార్డు ముక్క వాకిట్లోనే ముక్కలు చేసేది. కావమ్మ చదువుకునే రోజుల్లో తండ్రి దగ్గర నుంచి వచ్చే ఉత్తరం కోసం ఇలాగే ఎదురు చూసేది. ఆ ఉత్తరంలో ఎంత ప్రేమ కురిపించేవాడు. కావమ్మ చేసేది అదే పని పెద్దలను చూసి నేర్చుకునే విషయాలలో ఉత్తరం రాయడం కూడా ఒకటి. 

పెళ్లి కుదిరిన తర్వాత భర్త రాసిన తొలి ఉత్తరం ఇప్పటికీ దాచుకుంది. ఆ రోజుల్లో ఉత్తరం చదివితే ఏదో ఊహల్లో తేలిపోయేది. సమాధానం రాయాలంటే భయం. ఎలా సంభోదించాలో తెలియని అయోమయం. ఎవరినైనా అడిగితే ఆట పట్టిస్తారని మరొక భయం. ఇంక ధైర్యం చేసి తల్లిని అడిగితే ఆ పాత కాలం సంబోధన చెప్పింది. అది నచ్చలేదు కావమ్మకి. శ్రీవారు అందామంటే మూడు ముళ్ళు పడలేదు. ముక్కు పచ్చలారని పిల్లకి సాంప్రదాయ బద్ధంగా పెరిగిన పిల్లకి ప్రేమలేఖ వ్రాయడం ఎలా తెలుస్తుంది పాపం . అయినా ధైర్యం చేసి పేరు ముందు డియర్ తగిలించింది. డియర్ అని రాస్తుంటే ఆ వ్యక్తి నియర్ గా ఉన్నట్టు అనిపించింది.   

ఉత్తరాలు సాధారణంగా క్షేమ సమాచారాలు తెలపడానికి శుభవార్తలు మోసుకొస్తే మరికొన్ని ఉత్తరాలు సంఘoల్లో ఒక ఉద్యోగిగా నిలబెడతాయి. అలా ఉత్తరం మోసుకొచ్చిన కబురుతో కావమ్మ టీచర్ అయిపోయింది. పిల్ల నచ్చిందని చెప్పిన మామగారి కబురు మోసుకొచ్చిన కార్డుతో రాఘవరావుకి ఇంటి ఇల్లాలు అయిపోయింది. 

 భార్యాభర్తలిద్దరూ విద్యార్థులకు పాఠాలు చెప్పే ఉద్యోగాలే. అయితే ఇద్దరి మనసులు దగ్గరైనప్పటికీ కొలువుల మధ్య దూరం యాభై కిలోమీటర్లు. రోజు విడిచి రోజు కబురు మోసుకొచ్చే కవరు జీవితంలో ముఖ్య భాగం అయిపోయింది. కవర్ మోసుకొచ్చే పోస్ట్ మాన్ పరమాత్ముడులా కనబడుతూ ఉండేవాడు. పోస్ట్ మాన్ నీ చూస్తే ప్రాణం లేచి వచ్చినట్లు
 అయ్యేది. పోస్ట్ మాన్ మనల్ని దాటి వెళ్లిపోతుంటే మనసు బాధపడుతూ ఉండేది. మన ఇంటిని మర్చిపోయాడు ఏమో అని ఆశగా సందు చివర వరకు ఎదురుచూసేది కావమ్మ. 

ఉత్తరాల కాపురం చూడలేక గవర్నమెంట్ వారికి దయ కలిగి రాఘవరావుకి కావమ్మ పనిచేసే స్కూల్ కి ట్రాన్స్ఫర్ వచ్చింది. అలా కొద్ది కాలానికి సాంబయ్య పుట్టడం వాడి బాగోగులు చూడడం ఉద్యోగం వీటితోటే సమయం సరిపోయేది. మధ్యలో తల్లిదండ్రుల దగ్గర నుంచి స్నేహితురాలు దగ్గర నుంచి వచ్చిన ఉత్తరానికి వెంటనే సమాధానం వ్రాసేది.

 పెళ్లయిన కొత్తలో కొత్త కాపురం గురించి సాంబయ్య పుట్టినది మొదలు వాడి ఆటలు పాటలు కబుర్లు గురించి తల్లిదండ్రులకి పేజీలు పేజీలు ఉత్తరాలు రాసేది. ఆ తర్వాత కావున భర్త యాక్సిడెంట్ లో చనిపోవడం , కొడుకు డాక్టర్ చదువు కోసం హైదరాబాదు కాలేజీలో చేరడం కావమ్మ ఒంటరిదైపోవడం ఇద్దరి మనసులోని మాటలను అక్షరాల ద్వారా మోసుకొచ్చే ఉత్తరం కావమ్మ కి అదే మానసిక ప్రశాంతతకు ఆధారం. సెలవులకు ఇంటికి వస్తున్నాను అని కొడుకు రాసే కబురు మోసుకొచ్చే ఉత్తరాన్ని ఆనందంగా చూసుకునేది. 

ప్రతి నెల కొడుకు ఖర్చులకోసం పంపే బ్యాంకు డ్రాఫ్ట్ కవర్లో పెట్టి పదిసార్లు అడ్రస్ సరి చూసుకుని రిజిస్టర్ పోస్టులో పంపేది. రిజిస్టర్ పోస్టు మీద ఉన్న పేరుకి తప్పితే ఎవరికి అరిచి గీపెట్టిన అది ఇవ్వరు. అలా సాంబయ్య చదువుకున్నంతకాలం బెంగలన్నీ ఉత్తరాలతో పోగొట్టుకుని ఆర్మీ లో డాక్టర్ గా ఉద్యోగం సంపాదించుకున్న సాంబయ్య పెళ్లి చేసి బాధ్యత తీర్చుకుని మళ్లీ ముసలి వయసులో ఇలా ఇదిగో ఉత్తరాల కోసం ఎదురుచూస్తోంది. 

పోస్ట్ కార్డు మీద రాసిన సమాచారం అందరూ చదువుకోవచ్చు. క్షేమ సమాచారానికి పర్వాలేదు. ముఖ్య సమాచారాలన్నీ కవర్ లో బంధించి పంపించేది. ఎడమ చేతి పక్క క్రింద రాసి ఉన్న అడ్రస్ చూసి అమ్మ దగ్గర నుంచి వచ్చిందని ఉబలాటపడుతూ విప్పి చదువుకునేవాడు సాంబయ్య. 

అలా పాత ఉత్తరాలు జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయిన కావమ్మ కి ఒక్కసారి వీధిలోంచి పోస్ట్ అనే కేక వినబడింది. ఒక్కసారిగా వీధిలోకి పరిగెత్తిన కావమ్మకి రెండు కవర్లు ఇచ్చి వెళ్లిపోయాడు పోస్ట్ మాన్. ఆ రెండు సాంబయ్య రాసినవే. అదేమిటి ఒకేసారి రెండు రాశాడు అనుకుని వెనకనున్న పోస్టల్ స్టాంప్ చూసింది ఒక దాని మీద పదిహేను రోజుల క్రితం డేటు ఉంది. గతవారం తేదీ ఒక దాని మీద ఉంది ఏమిటబ్బా! తేడా అని చూస్తే అడ్రస్ లో ఒక దాని మీద పిన్ కోడ్ నంబరు అలవాటులో పొరపాటుగా వాళ్ళ అత్తగారి ఊరు పిన్ కోడ్ రాశాడు. మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తిప్పలు పడి భద్రంగా చేర్చారు ఆ కవర్ ని. ఒక చిన్న తప్పు ఎంత టెన్షన్ పెంచింది అనుకుని కవరు విప్పి సారాంశం చదివి హాయిగా ఊపిరి పీల్చుకుంది.

ఒకప్పుడు మనసు మాట చెప్పేదే ఉత్తరం. చేతికొచ్చిన కాగితంలో, చలికాలపు నీటిబిందువులా దాచుకునే భావాలు ఉండేవి. మానవ సంబంధాల్ని బలంగా కట్టిపడేసిన మాధ్యమం ఉత్తరం. కాలం మారినా, టెక్నాలజీ పుట్టినా, ఉత్తరాల చోటు ఎవ్వరూ తీసుకోలేరు.

తల్లి కొడుకుకి, భార్య భర్తకి, స్నేహితుల మధ్య, ప్రేమికుల మధ్య ఉత్తరాలే నిడివి అయిన బంధాలు ఎన్నో. ఒకసారి రాసిన ఉత్తరం శాశ్వతం. మానవ హృదయం నుంచి వెల్లివచ్చిన భావాలు అక్షరాల రూపంలో నిలిచిపోయే ఉత్తరం, ఒక జ్ఞాపకం మాత్రమే కాదు, ఒక జీవితం.

మూడు పదాల మెసేజ్ కన్నా, మూడువేళ్ల దూరాన్ని తుంచే ఉత్తరం గొప్పది.పలకరించని బాధను పలుకుబడిగా మార్చే శక్తి ఉత్తరానికి ఉంది.

ఇప్పుడు వాట్సాప్ మెసేజ్‌లు, ఇమెయిళ్లు వచ్చాకా మానవ సంబంధాలు సులభమయ్యాయేమో కానీ, లోతులేమిగా మారిపోయాయి. ఉత్తరాల్లో ఉన్న నిరీక్షణ, ఆదరాభిమానాల నిండుదనమేకానీ, ఈ ఆధునిక సంభాషణలలో కనిపించటం లేదు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279