Featured Books
  • స్వగతం - 1

    స్వగతం....నేను జీవితంలో చాలా మందిని కలిశాను,కొంత మంది పేర్లు...

  • ఆర్థిక శాస్త్రవేత్త

    ఆర్థిక శాస్త్రవేత్తఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పు...

  • స్పూర్తి

    స్ఫూర్తిఏ క్షణం ఈ భూమి మీద పడ్డానో అప్పటి నుంచి నడకవచ్చి నాల...

  • మల్లి

    మల్లి "ఏమ్మా మల్లి ఇంత ఆలస్యమైంది అని అడిగాడు పొలానికి క్యార...

  • నడిచే దేవుడు

    నడిచే దేవుడుఉదయం 11 గంటలు అయింది బ్యాంక్ అంతా రద్దీగా ఉంది....

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆర్థిక శాస్త్రవేత్త

ఆర్థిక శాస్త్రవేత్త

ఇల్లంతా ఎంత సందడిగా ఉండేది. అమ్మమ్మ ఎప్పుడూ ఎవరో ఒకరి మీద కేకలు వేస్తూనే ఉండేది ఆ హాల్లో మంచం మీద కూర్చుని. గేటు తలుపు తీసిన చప్పుడైతే ఎవరు అంటూ గట్టిగా అరిచేది. ఆ హాల్ అంతా చిన్న పోయింది. ఇప్పుడేమో ఇలా! వీధిలో చాప మీద పడుకుంటే ఏదోలా ఉంది.అప్పుడే ఆఖరి శ్వాస విడిచి మూడు గంటలు అయింది .

 నిన్నటి వరకు మన మధ్య ఉన్న ఈమె ఇవాళ శవమై వాకిట్లో పడుకుంది అనుకుని బాధపడుతూ కూర్చున్నాడు చనిపోయిన సీతమ్మ గారి మనవడు రఘురాం. సీతమ్మ గారికి నలుగురు ఆడపిల్లలే. మగ పిల్లలు లేరు. అందుకే పెద్ద కూతురు కొడుకుని దత్తత చేసుకుని బంధువుల అమ్మాయిని సరళని ఇచ్చి పెళ్లి చేసింది. రఘురాం ఆ ఊర్లోనే టీచరుగా పనిచేస్తుంటాడు. తాతగారు ఇంట్లోనే కాపురం ఉంటాడు. మళ్లీ రఘురాం కూడా అందరూ నలుగురు ఆడపిల్లలే. 

సీతమ్మ గారు ఆడపిల్లలు భర్తలు పిల్లలతో కలిసి వచ్చారు. బంధువులు స్నేహితులు ఒక్కొక్కళ్ళే రావడం ప్రారంభించారు . ఒకపక్క అంతిమ సంస్కారానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు.

 ఇంతలో సీతమ్మ గారి బంధువు ఒకరు రఘును పిలిచి ఇంకా ఎంతసేపు ! దూరం తీసుకెళ్లాలి కదా! ఆలస్యం అయిపోతుంది రఘుని తొందర పెట్టాడు. రఘు స్నానం చేసి వచ్చిన తర్వాత కార్యక్రమాలన్నీ వరుసగా జరిగిపోయి ఇంటికి వచ్చిన తర్వాత సీతమ్మ గారి బంధువు రఘురాం చేతిలో ఒక తాళం పెట్టాడు. సీతమ్మ గారి కొంగుకి ముడి వేసుకుని ఉంది అని చెప్పాడు.

 ఆ తాళం చూడగానే అవును! ఇది అమ్మమ్మ కొంగుకు ముడి వేసుకుని ఉండేది. అమ్మమ్మ తల దగ్గర ఉండే కావిడి పెట్టిది. దాని తాళం తీయడం ,వేయడం అమ్మమ్మ చేసుకునేది. ఎప్పుడు అందులో ఏమి ఉండేదో ఎప్పుడూ చెప్పలేదు . కానీ దాన్ని ఎప్పుడూ తీయనిచ్చేది కాదు. అది ఎప్పుడూ మంచాన్ని అనుకునే ఉండేది తల వైపు . అది తను కాపురానికి వచ్చేటప్పుడు సీతమ్మ తండ్రి కొనిచ్చాడని అనేకసార్లు చెబుతూ ఉండేది

సీతమ్మ భర్త రామశాస్త్రి అంటే రఘురాం తాతయ్య ఆ ఊర్లోనే టీచరుగా పనిచేస్తూ ఉండేవాడు. అప్పటి రోజుల్లో టీచర్లకి జీతాలు చాలా తక్కువ. బతకలేక బడిపంతులు ఉద్యోగం అనేవారు. రామశాస్త్రి చాలా కష్టజీవి. స్కూల్ నుండి వచ్చిన తర్వాత పిల్లలకి ట్యూషన్లవి చెబుతుండేవాడు. పైగా నలుగురు ఆడపిల్లలు. వారికి చదువులు. పదవ తరగతి వరకు చదివించిన అప్పట్లో పిల్లలందరికీ పుస్తకాల కొనడానికి కూడా ఇబ్బంది పడుతుండేవాడు రామశాస్త్రి. పైగా అద్దె ఇల్లు. 

ఆ ఇంటి యజమాని పిల్లలు కూడా రామ శాస్త్రి దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటూ ఉండేవారు. పాపం అద్దె కట్టలేక ఆ పిల్లలకి ఉచితంగా ట్యూషన్ చెబుతూ ఉండేవాడు రామశాస్త్రి. అయితే ఒక రోజు ఆ ఇంటి యజమాని వేరే ఊరు వెళ్ళిపోతూ" మాస్టారు ఇల్లు అమ్మేస్తున్నాను. మీరు ఇన్నాళ్లు మా పిల్లలకు చదువు చెప్పారు. "కాబట్టి ఏదో రేటు ఇచ్చి మీరు తీసుకోండి ఈ ఇల్లు అని చెప్పి బలవంతంగా తాతయ్య చేత ఇల్లు కొనిపించాడుట తాతయ్య అమ్మమ్మ బంగారం, వెండి సామాన్లు అమ్మేసి ఉన్నదంతా ఊర్చి పాపం ఇల్లు నిలబెట్టుకున్నాడుట.

అలా అయిదారు సంవత్సరాల తర్వాత పిల్లలు ఎదుగుతున్నారని, తాతయ్య రోజు ఖర్చులు తగ్గించమని అమ్మమ్మకి చెబుతూ ఉండేవాడట. అమ్మమ్మకి కూడా కోపం వచ్చేదిట. "ఇప్పుడు జీతాలు పెరిగాయి కదా! మరి మనం ఎందుకు ఇబ్బంది పడడం అనేదిట. 'నీకు తెలియదులే మనం ఆడపిల్ల వాళ్ళం. పిల్లల అసలే పెళ్లీడుకొస్తున్నారు. రేపొద్దున్న పెళ్లి చేసే సమయానికి తగినట్టుగా మనం జాగ్రత్త పడకపోతే చాలా ఇబ్బందులు పడిపోతాము అంటూ నాకు చెప్పి ఆ పిల్లల పెళ్లికి పెట్టవలసిన వెండి సామాన్లన్నీ కొని ఇందులో దాచే వారు.
అలా నలుగురు ఆడపిల్లలకి ఎవరికి వాళ్ళకి పాపం తన చిన్న జీతంతోనే కొని దాచేవారు. ఈ పెట్టే లోనే పెట్టేవారు! అంటూ ఆ కావిడి పెట్టె కధ అంతా చెబుతూ ఆ పెట్టి తాళం ఎప్పుడూ తాళం తన దగ్గరే ఉంచుకునేది.

 అలా రఘురాం అమ్మమ్మ మాటలన్నీ గుర్తు చేసుకుంటూ సీతమ్మ గారి కార్యక్రమాలు పూర్తి చేశాడు. బంధువులంతా వెళ్లిపోయారు. ఆడపిల్లలు కూడా వెళ్లిపోయారు. ఒకరోజు తన దగ్గర ఉన్న తాళంతో పెట్టి తెరిచాడు. అందులో నాలుగు సంచిలు అందులో వెండి సామాన్లు వాటి మీద ఒక కవరు కొంచెం డబ్బు కనబడ్డాయి . కవర్ తీసి చూడగా అందులో ఒక లెటర్ కనబడింది రఘురామ్ కి. 

చిరంజీవి రఘు కి, 

ఇందులో నాలుగు సంచీల తో వెండి సామాన్లు ఉన్నాయి. ఇన్ని వెండి సామాన్లు అమ్మమ్మకి ఎక్కడి నుంచి వచ్చాయని నువ్వు ఆశ్చర్య పడుతున్నావ్ కదూ! . ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులు నేను ఏనాడు ముట్టుకోలేదు. నెలకు ఒకసారి మీ ఆవిడని తీసుకుని బ్యాంకుకు వెళ్లి ఆ పెన్షన్ కి ఎంత వస్తే అంత వెండి సామాను కొని దాచాను.

 ముసలి దానివి నీకెందుకు ?ఇంత తాపత్రయం అని అడగొచ్చు. ఇది మీ తాతయ్య నేర్పిన విద్య. నువ్వు నలుగురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి. ప్రస్తుతం అందరూ చదువుల్లోనే ఉన్నారు. దానికి తోడు మీ తరానికి ఖర్చులు ఎక్కువ. సెలవులు ఇచ్చినప్పుడల్లా మీరు ఏదో ఒక టూర్ కి వెళ్ళిపోతున్నారు. దానికి తోడు ఇంట్లో నెలవారీ ఖర్చులు కూడా చాలా ఎక్కువ.

 మీ తరంతో పోలిస్తే మా తరానికి ముందు చూపు చాలా ఎక్కువ. ఉదాహరణకు చెప్తున్నాను విను ఎవరైనా పూర్వకాలంలో పెళ్లిళ్లకు వచ్చే అతిధులు ఏదో ఒక వెండి వస్తువు బహుమతిగా పెట్టారు. మీ తరం వాళ్ళు ఏదో ఒక గిఫ్ట్ పేరుకు మాత్రం ఇస్తున్నారు. బట్టలు కొనుక్కోవడానికి మీ తరానికి సమయం సందర్భం అక్కర్లేదు. ఎప్పుడు పడితే అప్పుడు కొనుక్కుంటున్నారు. ఎందుకు పనికిరాని స్టీల్ ముక్కలు పిల్లలకి అలంకరణ వస్తువులుగా కొంటున్నారు డబ్బులు తగలేసి. చెబితే మీకు తెలియట్లేదు. పొదుపు అంటే పిసినారితనం కాదు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా ఉండడం . అప్పటి రోజుల్లో నాకు తెలియకపోయినా తాతయ్య కూర్చోబెట్టి భవిష్యత్తు గురించి పాఠాలు చెప్తుండేవారు. 

అలా తాతయ్య ముందుచూపుతో చేసిన పనుల వల్లే నా ఆడపిల్లలందరి పెళ్లిళ్లు ఏ కష్టమూ లేకుండా చేయగలిగాము.
నీ పిల్లలకు కూడా అలాగే ఏ లోటు రాకుండా పెళ్లిళ్లు చేసి అత్తవారింటికి పంపాలనే ముందుచూపుతో ఈ పని చేసాను. నువ్వు డబ్బు ఖర్చు ఎక్కువగా చేస్తుంటావు. ముందు వెనకలు ఆలోచించవు. అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెట్టేస్తావని ఈ వెండి సామాన్య విషయం నీకు చెప్పలేదు.ఇంట్లో ఉన్న పెద్దవాళ్లు పిల్లల చేత డబ్బులు ఖర్చు పెట్టించి తమ సరదాలు తీర్చుకోకూడదు. అది మంచిది కాదు. దాని మూలంగా ఖర్చు అలవాటైపోతుంది తప్పితే పొదుపు విషయం తెలియదు. ఇంక డబ్బు ,నా మూలంగా ఏర్పడే ఖర్చులకి నువ్వు బాధపడకుండా 

 ఇట్లు అమ్మమ్మ.

అవును అమ్మమ్మకు వచ్చే పెన్షన్ గురించి ఎప్పుడూ నేను అడగలేదు. ఒకవేళ నేను అడుగుంటే నా చేతిలో ఖర్చయిపోయేది. కానీ అమ్మమ్మ ఇచ్చిన ఈ బహుమతి నేను కోల్పోయే ఉండేవాడిని. ఇప్పుడు రూపాయల్లోకి మార్చుకుంటే ఎంత ఖరీదైన బహుమతి అమ్మమ్మ ఇచ్చిందో అర్థం అవుతుంది అనుకున్నాడు రఘురాం. ఇంతలో వెనకనుంచి వచ్చిన రఘురాం భార్య "అమ్మమ్మ చాలా తెలివైనది ముందుచూపు చాలా ఎక్కువ నాకు ఎన్నో విషయాలు నేర్పింది . నేను అమ్మమ్మ బజారుకెళ్ళి ఈ వస్తువులన్నీ కొన్నాం. మీకు చెప్పద్దు అని చెప్పింది. అమ్మమ్మ మనకి బంధువు కాదండి! మన ఇంట్లో ఉన్న ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది రఘురాం భార్య. 

మరి ఇంట్లో ఉండే ఆ పెద్దతరం వాళ్ళు ఎప్పటికీ మనకి ఆర్థిక శాస్త్రవేత్తలే. వాళ్ల మాటలు కొట్టిపడేయకండి సలహాలు పాటించండి. గుమ్మం దాటించకండి. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279