సరోజ
పందిట్లో జట్కా బండి వచ్చి ఆగింది. బండి ఆగగానే పిల్లలందరూ "వదిన వచ్చింది వదిన వచ్చింది "అంటూ ఆనందంగా కేరింతలు కొడుతూ బండి చుట్టూ మూగారు. ఆ బండి లోనుంచి కాళ్ళకి పసుపు రాసుకుని నుదుటన పెద్ద బొట్టు పెట్టుకుని గెడ కర్రకి చీర కట్టినట్లుగా ఉండే అమ్మాయి దిగింది.
అక్కడ ఉన్న పిల్లలందరికంటే ఒక నాలుగు ఐదు ఏళ్లు పెద్ద ఉంటుంది. కానీ చిన్న వయసులోని పెళ్లి చేసేసారు కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబానికి పెద్ద కోడలు అయిపోయింది.
అందరితో ఆప్యాయంగా మాట్లాడడం , పిల్లలందరి తోటి కలిసిమెలిసి ఆడుకోవడం, మాటలో నెమ్మది, పెద్దల పట్ల గౌరవం చూసి మాధవరావు గారికి చాలా మంచి కోడలు దొరికింది అనుకునేవారు ఊరి వారందరూ. ఆ ఇంటి ఇల్లాలు రాజమ్మ నిజమైన వారసురాలు అనుకున్నారు బంధువులు.
ఇంకా పసితనం వీడని వయస్సు భర్త అంటే ఏంటో తెలియని మనసు తల్లి ఆదరణలోనే పెరిగిన పసితనం తప్ప తండ్రి ప్రేమను ఎప్పుడూ రుచి చూడలేదు.
గౌరవ మర్యాదలు గల కుటుంబాన్ని చూసి తండ్రిని పట్టించుకోకుండా ఆ పిల్లని ఇంటి కోడలుగా చేసుకున్నాడు మాధవరావు. కాదు కాదు దేవుడిచ్చిన కూతురులా చూసుకున్నాడు.
ఎందుకంటే ఆ సమయం కొడుకుకి పెళ్లి చేసే సమయం కాదు పెద్ద కొడుకుకి ఉద్యోగం లేదు మిగతా ఏడుగురు పిల్లల్లో దేవుడు పెట్టిన బాధలతో బాధపడే వాళ్లు కొందరు ,మిగిలిన వాళ్లు కొందరు స్కూల్ కి ,కాలేజీకి వెళ్లే స్థాయిలో ఉంటే కొందరు ఇంకా పాలు తాగే పసివాళ్ళు. ఇలా నడి సముద్రంలో ఉంది సంసారం. దానికి తోడు ఉమ్మడి కుటుంబం.
తెల్లవారి లేస్తే ఇరవై మందికి కడుపునింపాలి. ఇది సంసారం. మాధవరావు గారు తమ్ముడు కామేశ్వరరావు కూడా పెద్ద సంపాదనపరుడు కాదు. కుటుంబ బాధ్యత ఆ ఇద్దరి అన్నదమ్ములు ఉన్న కొద్దిపాటి పొలాన్ని వ్యవసాయం చేసుకుంటూ పశువులను పోషించుకుంటు ఆయుర్వేద వైద్యం చేస్తూ ఊర్లో పదిమందికి సహాయం చేస్తూ తలలో నాలికలా ఉంటూ గౌరవ మర్యాదలను కాపాడుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉండేవారు.
అలాంటి కుటుంబ వాతావరణంలోకి అడుగుపెట్టిన ఆ ఇంటి కోడలు సరోజ ఆ కుటుంబ సభ్యులతో పిల్లల్లో పిల్లల్లాగా పెద్దల్లో పెద్దలు లాగా కలిసిపోయింది. కానీ ఏదో వెలితి. అన్నింటికీ మావగారి ఆధారపడి బ్రతకవలసి వస్తోంది.
భర్త చూస్తే ఎప్పుడు పొలం పనులు పశువుల మేపడాలు తప్పితే సొంతంగా ఏ పని చేయడానికి చదువుకున్న వ్యక్తిగా ఆలోచించట్లేదు. వెనక చూస్తే ఆస్తిపాస్తులు లేవు.
తన పుట్టింట్లో తండ్రి ప్రవర్తన తోటి విసిగిపోయిన తల్లి పడిన బాధలు చూసిన అనుభవం, ఎన్ని రోజులైనా మామగారు ఎలా కష్టపడతారు ?ఈ వెనకాల ఉన్న పిల్లలందరి భవిష్యత్తు ఏమిటి పెద్దకొడుకుగా భర్త ఏమి పట్టించుకోవటం లేదు అని దిగులుగా ఉండేది పాపం సరోజకి. సరోజ పెద్దగా చదువుకో పోయిన ప్రాపంచిక విషయాలు పట్ల అవగాహన ఎక్కువ. మావగారికి ఉన్న పొలంలో పండిన ధాన్యం వచ్చినంత కాలం వాడుకోవడం ఆ తర్వాత బియ్యం కొనుక్కోవడం ఇంట్లో ఇబ్బందులు ఇవన్నీ మనసులో కసిని పెంచేయి సరోజ కి.
అలా కొద్దిరోజులకి సరోజ చెప్పిన శుభవార్త ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆనందపరిచి రోజులు క్షణాల్లో గడిచిపోయి సరోజ పండంటి మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ ఇంటికి వారసుడు పుట్టాడని అందరూ ఆనందం తట్టుకోలేకపోయారు. పూర్తిగా పాతికేళ్లు కూడా ఉండని సరోజ పిల్లాడి పెంపకం కొంచెం కష్టం అనిపించలేదు. కారణం అత్తగారు సరోజ తన మనవడిని కూడా సొంత బిడ్డ లాగా చూసుకునేది. అలా పిల్లవాడికి మూడేళ్లు నిండేయి. కానీ భర్త జీవితంలో ఏ మార్పు లేదు.
ఒకరోజు భర్తను గదిలో నిలదీసి ఎన్నాళ్ళు ఇలా! అని అడిగింది భర్తను సరోజ. మనకి కుటుంబం పెరుగుతోంది. మన బాధ్యతలు కూడా ఆయన ఎలా మోస్తారు? దానికి తోడు మీ వెనకాల ఉన్న పిల్లలందరూ కూడా కాలేజీ చదువుల్లోకి వస్తున్నారు. మనం కూడా మావయ్య గారికి కొంచెం చేదోడువాదోడుగా ఉండాలి. ఎన్నాళ్లు కష్టపడతాడు? ఆయన అని అంటూ అందుకే మొన్న మా ఊరు వెళ్ళినప్పుడు మా ఇంటి ఎదురుగుండా ఉండే వారికి కాకినాడలో పెద్ద మెడికల్ వ్యాపారం ఉంది. వారి షాపులో ఒక చిన్న ఉద్యోగం ఇస్తానని చెప్పారు. నెలకి 150 రూపాయలు జీతం ఇస్తానని చెప్పారు. ఆ తర్వాత మీ ఇష్టం ఆలోచించుకోండి అని చెప్పి గట్టిగా కోప్పడింది.
సరోజ భర్త రామారావు ఆలోచనలో పడి మొత్తానికి ఆ ఉద్యోగo లో జాయిన్ అయిపోయాడు. వరుసగా మూడు గదిలో ఉండే ఇల్లు ఒకటి అద్దెకి తీసుకుని ఒక శుభ ముహూర్తంలో భార్యను తీసుకుని కాపురం పెట్టేసాడు. పల్లెటూరులో పుట్టి పెరిగిన సరోజ కి ఆ ఇరుగు గదుల్లో చాలీచాలని జీతంతో పిల్లవాడికి ఖర్చులతో చాలా కష్టం ఉండేది.అయినా మామగారు ప్రతినెలా వచ్చి తనకి పండే పంటలో కొన్ని బియ్యం తెచ్చి ఇస్తుండేవాడు.
ఇంతలో మాధవ రావు గారి రెండో అబ్బాయి రాజుడిగ్రీ చదవడానికి అన్నగారి ఇంటికి వచ్చేసాడు. అసలే మూడు గదులు ఇల్లు చాలీచాలని జీతం.అలాగే ముందు గదిలో మాత్రమే ఇంటి వారి ఫ్యాన్ ఉండేది. రాజు కి చదువు అంటే చాలా ఇష్టం.
అలా పుస్తకాలు ముందేసుకుని ఎప్పుడు ముందు గదిలో కూర్చుని అర్ధరాత్రి 12 గంటల వరకు చదువుకుంటూ ఉండే వాడు. అప్పటివరకు పాపం ఆ భార్య భర్తలు ఇద్దరు వీధి వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవారు. రోజులు గడవడం ఎంత కష్టంగా ఉన్నా పల్లెత్తుమాట ఆఖరికి తన తల్లితో కూడా చెప్పు కొనేది కాదు సరోజ. ఎప్పటికైనా పరిస్థితులు చక్కబడతాయి అనేది ఆవిడ ఉద్దేశం.
రామారావు రాత్రి పగలు లేకుండా యజమాని ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లి యజమానికి తలలో నాలికలా ఉంటూ చాలా కష్టపడి పని చేస్తూ ఉండేవాడు. రామారావుకి చాలా సహనం ఎక్కువ. డబ్బున్న లేకపోయినా ఒకేలా ఉండేవాడు. ఇందులో రాజుకి డిగ్రీ పూర్తయి పై చదువులకి ఆంధ్ర యూనివర్సిటీలో సీటు వచ్చింది. హాస్టల్ ఫీజుకి కాలేజీ ఫీజులకి డబ్బు ఎలాగా అని రామారావు ఆలోచిస్తుంటే సరోజ తన మెడలో నుంచి గొలుసు తీసి ఇచ్చింది. అంతే మరో మాట లేదు. విశాఖపట్నంలో రాజు పై చదువుకు జాయిన్ అయిపోయాడు.
అలా కొద్దిరోజులకి సరోజ. ముగ్గురు బిడ్డల తల్లి అయ్యింది.ఇంతలో ఒక అనూహ్య సంఘటన జరిగింది. రామారావు యజమాని ఒకసారి పిలిచి "చూడు రామారావు ఎన్నాళ్ళు ఇలా నా దగ్గరకు పని చేస్తావు. నీ మంచితనం నీ పనితనం నాకు బాగా నచ్చాయి. నీకు నేను కొంచెం పెట్టుబడి సహాయం చేస్తాను . నువ్వు కూడా కొంచెం పెట్టుబడి పెట్టు. అన్నాడు. నువ్వు ఒక నాకు తెలిసిన వారి హాస్పిటల్ దగ్గర మెడికల్ షాపు పెట్టు. మిగతా విషయాలు అన్నింటికీ నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పి ప్రోత్సహించాడు.
రామారావు షాపు పెట్టుబడి కి సరోజ చేతులకి మట్టి గాజులు వచ్చి చేరాయి. ఒక షాపులో పని వాడి కింద జాయిన్ అయిన రామారావు ఇప్పుడు ఒక మందుల షాపుకి భాగస్వామి అయ్యాడు. బతుకు కొంచెం గాడిలో పడింది. బతుకు మీద ఆశ పెంచింది . పదిమందితో పరిచయాలు ఏర్పడ్డాయి. సమాజంలో ఎలా బతకాలని తెలిసింది. అలాగే ఆ మూడు గదుల్లోనే ముగ్గురు పిల్లలతో వచ్చిపోయే బంధువులతో తర్వాత తమ్ముళ్లు కాలేజీ చదువులకు వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరే రామారావు ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న ఏనాడు భార్య భర్త పల్లెత్తు మాట మాట్లాడకుండా ఉండేవారు.
పాపం అలా మూడు గదుల్లోనూ ఉండలేక ఒకరోజు ఏదో విధంగా మారుమూలనైనా సరే రెండు గదులు ఇల్లు కట్టుకుందామని రోజు భర్తతో అంటుండేది సరోజ. అప్పట్లో అది ఊరికి చివర ఒక మురికిగుంటలా ఉండేది. రోడ్డు కూడా లేదు. వర్షం వస్తే మునిగిపోయేది. అలాంటి స్థలంలో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నారు రామారావు దంపతులు. అది ఇల్లు అనడం కంటే గోడల మధ్య నివసిస్తున్నారని చెప్పొచ్చు. పాపం కరెంటు సౌకర్యం లేదు. గోడలకి ప్లాస్టరింగ్ లేదు. అయినా బుడ్డి దీపాలు పెట్టుకొని ఇంటి చుట్టూ మొక్కలు వేసుకుని పిల్లల్ని చదివించుకుంటూ రామారావు దంపతులు కాలక్షేపం చేస్తుండేవారు. రామారావు పిల్లలు కాలేజీ చదువులకి స్కూల్ కి అలా బురదలో నడుచుకుంటూ వెళ్లేవారు
ఇంతలో రామారావు తమ్ముళ్లు అందరూ ఉద్యోగంలో స్థిరపడడం రామారావు పిల్లలు కూడా పెరిగి పెద్దవాళ్ళయి పెద్ద పిల్లోడు ఎవరో కులం గాని అమ్మాయిని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేక పాపం సరోజ అర్ధాంతరంగానే జీవితం ముగించింది.
భగవంతుడు పుట్టించిన ఒక్కొక్క మనిషి ఒక కుటుంబం అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతాడు అనేది సరోజ జీవితమే ఉదాహరణ. జీవితమంతా ఒడిదుడుకులతోటే నడిచింది. ఒక ఇంటి కోడలుగా తన బాధ్యతలన్నీ సంపూర్తిగా నిర్వర్తించింది.
కొడుకుకి ఆధారం లేకుండా పెళ్లి చేసి కూర్చోబెట్టి కోడల్ని ఇంటికి తీసుకువచ్చిన మాధవరావు గారి సాహసం ఆ కుటుంబానికి ఉపయోగించింది. పెద్దవాళ్లు చేసిన కొన్ని పనులు జీవితంలో ఎలా ఉపయోగిస్తాయో మాధవరావు గారి కుటుంబం చూస్తే తెలుస్తుంది
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279