Read Wedding looks by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • రెండో భార్య

    ఒక మద్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్య...

  • మారిన పల్లె

    మారిన పల్లె  పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కా...

  • రహస్యం

    తా తలనాటి ఆస్తి, దాయాదుల మధ్య, కోర్టులలో నలిగి నలిగి దివాకరా...

  • పెళ్లి చూపులు

    పెళ్లిచూపులుతెనాలి సంబంధం వాళ్లు ఫోన్ చేశారు అమ్మాయిని చూసుక...

  • వివాహం

    పెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

పెళ్లి చూపులు

పెళ్లిచూపులు

తెనాలి సంబంధం వాళ్లు ఫోన్ చేశారు అమ్మాయిని చూసుకోవడానికి రేపు ఆదివారం బయలుదేరి వస్తున్నామని
అంటూ రామారావు గారు ఆఫీస్ నుండి వచ్చి భార్య సంగీతకి విషయం చెప్పి వాలు కుర్చీలో కూలబడ్డాడు.

ఆదివారం అంటే నాలుగు రోజులే ఉంది అంటూ చేతిలో కాఫీ గ్లాస్ భర్తకి ఇచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ముందుగా అమ్మాయికి ఫోన్ చేయాలి అని చేయవలసిన పనులు ఏర్పాట్లు భర్తతో విపులంగా చెప్పింది. రామారావు గారు అన్ని విషయాలు వివరంగా విని బయటికి వెళ్లి వస్తానని చెప్పి అలా బజార్లోకి వెళ్ళిపోయాడు.

రామారావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగి. చాలా చాందస భావాలు ఉన్న వ్యక్తి .రామారావుకి ఇద్దరు పిల్లలు. పిల్లలు ఇద్దరినీ చాలా క్రమశిక్షణతో పెంచాడు.అమ్మాయి లలిత హైదరాబాదులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. అబ్బాయి రఘు హైదరాబాదులో బిటెక్ చదువుతున్నాడు. లలితకి పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి. లలిత మంచి అందమైన అణుకువ కలిగిన పిల్ల . వరుడు పవన్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. మంచి కుటుంబం మంచి ఉద్యోగం అని మధ్యవర్తి ద్వారా ఫోటోలు జాతకాలు పంపించడం జరిగింది. పిల్ల ఫోటో నచ్చింది. జాతకాలు పట్టింపులు లేవని కబురు పంపారు మగ పెళ్లి వారు.
ఇద్దరు మనుషులను, మనసులను కలిపేందుకు వేదిక పెళ్లి అయితే దానికి మొదటి మెట్టు పెళ్లి చూపులు . పెళ్లిలాగే పెళ్లి చూపులు అంటే బోల్డంత హడావుడి. ఆడపిల్ల వారి మర్యాద మాటతీరు గౌరవం పరిచయాలు అన్ని పెళ్లి చూపుల్లోనే తెలుస్తాయి. అంతవరకు ఫోటో చూసి ఊహల్లో తేలిపోయిన వరుడు తన ఎదురుగా ఉన్న దేవతను చూసి నిర్ణయం తీసుకుంటాడు. మనసులో ఉన్నది కొంత వరకు తెలుసుకుంటాడు. అందుకే పెళ్లిచూపులే ముఖ్యం.

కాలం ఎవరి గురించి ఆగదు. రావలసిన ఆదివారం రానే వచ్చింది. రామారావు గారి అమ్మాయి అబ్బాయి హైదరాబాదు నుండి శనివారమే వచ్చేసారు. చేయవలసిన ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరిగిపోయాయి.

 మగ పెళ్లి వారు మధ్యాహ్నం 3 గంటలకు అమ్మాయిని చూడడానికి ముహూర్తం అని చెప్పి కబురు పంపారు. రామారావు గారు మాటిమాటికి వాచి చూసుకుంటూ వీధిలో కి తొంగి చూస్తున్నారు. ఇంతలో కారు వచ్చి వీధిలో ఆగింది.
కారు లోంచి పెళ్లి కొడుకు తల్లి తండ్రి ఆడపడుచు మధ్యవర్తి దిగారు. రామారావు గారి దంపతులు ఎదురు వెళ్లి స్వాగతం చెప్పి హాల్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు.

పరిచయాలు ,మర్యాదలు పూర్తయ్యాయి. అమ్మాయిని తీసుకురండి అంటూ మధ్యవర్తి రామారావు గారితో చెప్పగానే
రామారావు గారి భార్య సంగీత లలితను తీసుకొచ్చి పెళ్లి కొడుకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చోబెట్టింది. కుశల ప్రశ్నలు అయ్యాయి. 

ఏవండీ మీకు అభ్యంతరం లేకపోతే మా అన్నయ్య ఆ అమ్మాయి తోటి విడిగా మాట్లాడుతాడు. మీరు కొంచెం ఏర్పాట్లు చేయండి అంటూ పెళ్లికొడుకు చెల్లెలు రామారావు గారిని అడిగింది. తప్పకుండా అండి మాకు ఏమీ అభ్యంతరం లేదంటూ పక్కనే ఉన్న గదిలో రెండు కుర్చీలు వేయించాడు. పవన్ కుమార్ లలిత ఆ గదిలో ,మగ పెళ్లి వారు ఆడపిల్ల వారు బయట హాల్లో ఒక గంటసేపు మాట్లాడుకున్నారు.

పెళ్ళికొడుకు పవన్ కుమార్ బయటకు వచ్చి తండ్రితో ఏదో చెవులో చెప్పాడు. అమ్మాయి మా అబ్బాయికి బాగా నచ్చింది. అమ్మాయిని కూడా మీరు కనుక్కోండి. నచ్చితే మీరు మిగతా ఏర్పాట్లు చేసుకోండి. మాకు ఏమీ కట్నకానుకలు వద్దు. మాకు చాలామంది బంధువులు ఉన్నారు పెళ్లి బాగా చేయండి పెళ్ళికొడుకు తండ్రి విషయం అంతా సూటిగా రామారావు గారికి చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని కారు ఎక్కి వెళ్ళిపోయారు.

రామారావు గారు ఆలోచనలో పడ్డారు. పెళ్ళికొడుకు చూడడానికి బాగానే ఉన్నాడు. ఆరడుగుల అందగాడు. మంచి ఉద్యోగం మంచి చదువు. మంచి సాంప్రదాయం గల కుటుంబం పిల్ల మౌనంగా తన అంగీకారం తెలిపింది. మరి ఇంకేం ఆలోచించాలి. పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులు ఇద్దరు కుటుంబాల కలిపి సంతోషంగా ఉంచే ప్రక్రియ. చాలా విషయాలు ఆలోచించాలి. ఏ ముఖ్య విషయం మర్చిపోయిన జీవితకాలం బాధపడవలసి ఉంటుంది. అంతర్గత విషయాలు ఎవరికీ తెలియవు. మనసులోని విషయాలు తెలుసుకునే యంత్రాంగం ఎక్కడా లేదు. 
అయితే ఆరోగ్య విషయాలు కూడా ఈ రోజుల్లో ఆలోచించాలి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నంతకాలం పిల్లలు బాగానే ఉంటారు. ఒక్కసారి ఉద్యోగం వచ్చిన తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరి ప్రభావం వారి మీద పడుతుందోమనకు తెలియదు. రోజు అనేక చూస్తున్నాం. వింటున్నాము. ఏ వ్యసనాలు ఉంటాయో తెలియదు. పరిస్థితులు ప్రభావం మనిషిని ఎంతైనా మార్చేస్తుంది. 35 సంవత్సరములు జీతమిచ్చి మన చేత పని చేయించుకునే గవర్నమెంట్ వారు అన్ని అర్హతలు సంపాదించిన కూడా మెడికల్ ఫిట్నెస్ లేకపోతే ఉద్యోగం ఇవ్వరు. అలాంటిది ఇది ఒక అమ్మాయి జీవిత సమస్య పెళ్లి కుమారుడికి టోటల్ బాడీ చెకప్ చేయిస్తే తప్పేంటి. కాలాన్ని బట్టి ఇటువంటివి తప్పనిసరి. ఆరోగ్య పరిస్థితులను బట్టి ఇటువంటివి సిగ్గుపడకుండా అడిగి మంచి చెడ్డ తెలుసుకోవాలి. పైకి చూడడానికి అందరూ బానే ఉంటారు జన్యుపరంగా వచ్చే వ్యాధులు మనకు తెలియవు. తర్వాత ఎప్పుడో బయటపడితే మనం చేయగలిగింది ఏదీ లేదు. సాధారణంగా పెళ్లి కూతురు నచ్చింది అనగానే ఇంకేమీ ఆలోచించరు. గబగబా తర్వాత కార్యక్రమాలన్నీ జరిగిపోతాయి. ఇలాంటి విషయాలు ఎవరు ఆలోచించరు. కాలమాన పరిస్థితులను బట్టి తప్పదు. ఒక మాట సంగీత తో కూడా విషయం డిస్కస్ చేద్దాము అని మనసులో రామారావు గాని అనుకొని మొత్తం విషయం అంతా భార్యకు చెప్పాడు. తన ఆలోచనలో ఏదైనా తప్పు ఉందేమో అని గు లొచ్చి గుచ్చి అడిగాడు. సంగీత కూడా ఏ విషయమైనా సరే ఆచితూచి అడుగు వేస్తుంది. తొందరపడి నిర్ణయం తీసుకోదు. సంగీత కూడా రామారావు గారి నిర్ణయాన్ని ఒప్పుకునిభార్యాభర్తలిద్దరూ కలిసి మర్నాడు ఉదయం తెనాలి బయలుదేరి వెళ్లారు.

పెళ్లి కొడుకు తల్లి తండ్రి రామారావుగారిదంపతులనుసాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు బాగా చేశారు. మీ సంబంధం మాకు బాగా నచ్చింది అండి మేము మా పిల్ల అభిప్రాయం కూడా తెలుసుకున్నాము. అయితే మాకు ఒక చిన్న కోరిక ఉంది అంటూ రామారావు గారు తన సందేహాలను ఆలోచనలు అన్ని వివరంగా పెళ్ళికొడుకు తండ్రికి వివరించారు. 

పెళ్ళికొడుకు తండ్రి ఏమీ మాట్లాడలేదు. మొహంలో ఏ భావం కనపడలేదు.. భోజనాలు చేసి తీరిగ్గా మాట్లాడుకుందాం రండి అంటూ భోజనాలకి ఆహ్వానించాడు. భోజనాలు బల్ల దగ్గర పిచ్చా పాటీ మాట్లాడుతూ కొసరి కొసరి వడ్డించి తినిపించారు.
 ఒక గంట రెస్ట్ తీసుకోండి అంటూ గదిలో మంచం చూపించి ఏసి ఆన్ చేసి గది తలుపులు దగ్గరగా వేసి పెళ్లి కొడుకు తండ్రి బయటికి వెళ్ళిపోయారు. రామారావు గారు మంచం మీద పడుకున్నాడే గాని బుర్ర ఆలోచనలతో వేడెక్కిపోయింది. ఆయన ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నాడా ఇందుకు ఒప్పుకుంటాడా లేదా సంబంధం చూస్తే వదులుకో బుద్ధి కావడం లేదు. కానీ తప్పదు. ఒకపక్క భయం అనుమానం పీడిస్తున్నాయి అంటూ కాసేపు కళ్ళు మూసుకుని పడుకుని లేచి కాళ్లు చేతులు మొహం కడుక్కుని ఇద్దరూ తయారయ్యి సంచి తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యారు.

ఇంతలో అల్పాహారం పళ్లెం మరియు కాఫీ తో పెళ్ళికొడుకు తల్లి బయటికి వచ్చింది. అల్పాహారం అయిందనిపించి కాఫీ తాగి లేచి నిలబడ్డారు ఇద్దరు. ఇంతలో పెళ్లి కొడుకు తండ్రి చేతిలో ఒక కవర్ తో గదిలోంచి బయటికి వచ్చి రామారావు గారు చేతులో పెట్టాడు. రామారావు గారు కవరు ఓపెన్ చేసి చూస్తే అవన్నీ పెళ్ళికొడుకు పవన్ కుమార్ మెడికల్ రిపోర్టులు పెళ్లి చూపులు ముందు డేట్ లో ఉన్నాయి. రిపోర్టర్లన్నీ నార్మల్ గా ఉన్నాయి. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు. రామారావు గారి దంపతులు ఇద్దరు చేతులు జోడించి పెళ్లికూతురు తండ్రికి తల్లికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుని గుమ్మం దాటేటప్పుడు బావగారు నేను కూడా మీలాంటి ఆధునిక భావాలు ఉన్న వ్యక్తినే. నాకు కూడా మీలాగే ముందు చూపు ఎక్కువ. మేము ఇప్పటికీ ముగ్గురు అమ్మాయిలను చూసాం. ఇది నాలుగో సంబంధం. 
ప్రతిసారి వాళ్ళు అడిగిన అడగకపోయినా ఇది నా పద్ధతి. 
మీకు మా అబ్బాయి ఆరోగ్యం ఎంత ముఖ్యమో మా ఇంటి కోడలుగా వచ్చే అమ్మాయి ఆరోగ్యం మనస్తత్వం కూడా మాకు అంతే ముఖ్యం. ఎందుకంటే మాకు ఒకే ఒక అబ్బాయి. మేము మా అవసాన దశలో వాడి దగ్గరే ఉండాలి. పిల్ల మాతో కలవకపోతే మమ్మల్ని అర్థం చేసుకోకపోతే మా పరిస్థితి ఏమిటి . ఇదే ఆలోచన విధానంలో మేము కూడా ఉన్నాం. అందరూ పైకి చూడడానికి బాగానే ఉంటారు. బాధ్యతలు మోయవలసి వచ్చినప్పుడు అసలు రంగు బయటకు వస్తుంది. ఈనాడు ఎంతోమందిని తల్లిదండ్రులను చూస్తూనే ఉన్నాం. ఏమీ చేయలేని పరిస్థితిలో అనాధ శరణాలయాలు పట్టుకుని వేలాడుతున్నారు. ఈ పాటికి నా మనసులోని మాట మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫుల్ బాడీ చెకప్ అయితే చేయించొచ్చు కానీ మనస్తత్వాలు అర్థం చేసుకోవాలంటే సైక్రియాటిస్ట్ ని తప్పనిసరిగా సంప్రదించాలి. డైరెక్ట్ గా అమ్మాయి నితీసుకెళ్లడం బాగుండదు. అందుకే మాకు తెలుసన్న ఒక సైక్రియాటిస్ట్ తో ఒక సమావేశం వచ్చే ఆదివారం మీ ఫ్యామిలీ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ కలిపి హోటల్ మానస లో ఏర్పాటు చేశాను. మీరు తప్పకుండా రండి ఈ విషయాలు ఎవరికీ తెలియనివ్వకండి. అమ్మాయి కూడా తెలియనివ్వకండి. ఇది కేవలం గెట్ టుగెదర్ లాంటిది అ ని తన మనసులోని భావాన్ని పెళ్ళికొడుకు తండ్రి సూటిగా చెప్పేశాడు. కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు రామారావు గారి సందేహాలన్నీటికి ఒక పరిష్కారం దొరికింది. 

ఎందుకంటే పెళ్లి అంటే కట్నాలు కానుకలు మంగళసూత్రధారణ సుముహూర్తం తలంబ్రాలు మనుగుడుపులు వీటి గురించి ఆలోచిస్తారు తప్పితే ఈ నూతన విధానంలో ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇవి చాలా ఆరోగ్యకరమైన పెళ్లిచూపులు. రాబోయే తరాలకు వీరు ఆదర్శంగా ఉంటారు. ఎవరైనా మంచి పని చేసేటప్పుడు ధైర్యంగా ఒక్క అడుగు ముందుకేసిన వాళ్ళు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ముందుచూపు ఇందులో ఇమిడి ఉంది.

అనుకున్న విధంగానే డాక్టర్ గారి తోటి సమావేశం జరిగింది . ప్రత్యేకంగా కాకుండా మాటల్లోనే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మనస్తత్వాలను అంచనా వేశారు డాక్టర్ గారు. సంతృప్తిగా తన అభిప్రాయం చెప్పారు. అంగరంగ వైభవంగా తన కూతురు పెళ్లి జరిపించారు రామారావు గారు.

పెళ్లి చూపులు అంటే మెడికల్ రిపోర్టులు మనస్తత్వం శాస్త్ర నిపుణుల రిపోర్టులు అంటే ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఈ రోజుల్లో ఇది తప్పనిసరి. రేపటి భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మన ఆలోచన విధానంలో కూడా మార్పు రావాలి. దీంట్లో చాలా ముందుచూపు ఉంది. మార్పు ప్రతిదాంట్లోనూ వస్తూ ఉండాలి. లేకపోతే కాలానుగుణంగా వచ్చే సమస్యలకి ఆ పాత చట్టాలు సమాధానం చెప్పలేవు. అంటూ మైకు తీసుకుని రామారావు గారి వియ్యంకుడు పెళ్లి మండపంలో విషయం అంతా ఆహ్వానితులకు తెలియచెప్పాడు.

ఇది ఒకందుకు మంచిదే అనుకుంటూ ఆహ్వానితులందరూ వధూవరులు ఇద్దరినీ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి విందు ముగించుకుని ఆనందంగా వెళ్ళిపోయారు

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
          కాకినాడ 9491792279