Read Ruby in the soil by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • రెండో భార్య

    ఒక మద్యతరగతి అమ్మాయి తన ప్రమేయం లేకుండా మరొకరికి రెండో భార్య...

  • మారిన పల్లె

    మారిన పల్లె  పల్లెటూరు అనగానే చుట్టూ పచ్చని పొలాలు ,పిల్ల కా...

  • రహస్యం

    తా తలనాటి ఆస్తి, దాయాదుల మధ్య, కోర్టులలో నలిగి నలిగి దివాకరా...

  • పెళ్లి చూపులు

    పెళ్లిచూపులుతెనాలి సంబంధం వాళ్లు ఫోన్ చేశారు అమ్మాయిని చూసుక...

  • వివాహం

    పెళ్ళి అనే పదానికి పెళ్ళి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానము, క...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

మట్టిలో మాణిక్యం

మట్టిలో మాణిక్యం

మధ్యాహ్నం మూడు గంటలు అయింది

  ఇందిరా గాంధీ లేడీస్ క్లబ్ ఆవరణ అంతా హడావిడిగా ఉంది. కార్యకర్తలంతా అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతూ సభా ప్రారంభానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ముఖ్య అతిధి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు . "ఆ బ్యానర్ ఎదురుగుండా కట్టండి అని చెప్పి ఒక్కసారి బ్యానర్ కేసి చూసిన లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అదేమిటి ? ముఖ్యఅతిథి పేరు కింద జిల్లా కలెక్టర్ అని రాయలేదు ఏమిటి? అని అడిగింది. " లేదు మేడం కలెక్టర్ గారు ఒక సాధారణ మహిళ గానే ఈ కార్యక్రమానికి వస్తారట. అందుకని పేరు మాత్రమే రాయమన్నారు అంటూ సమాధానమిచ్చింది లేడీస్ క్లబ్ సెక్రటరీ. 

ఆ జిల్లాకి కలెక్టర్ ఆయన శ్రీమతి సుమతి ఆరోజు ముఖ్య అతిథి. ఇంతకీ జరగబోయే ఫంక్షన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. 

సరే అనుకున్న సమయానికి కలెక్టర్ గారు రావడం వేదిక మీదకి ఆహ్వానించడం అలాగే ఆరోజు సన్మానితులను కూడా వేదిక మీద కలెక్టర్ గారి పక్క న కూర్చోబెట్టడం జరిగింది. 

అతి సామాన్యమైన దుస్తులతో ఏవి అలంకరణలు లేకుండా కనీసం జుట్టు కూడా దువ్వుకోకుండా ఉన్న స్త్రీ ని కలెక్టర్ గారి పక్కన కూర్చోవడం జరిగింది. ఒక్కసారి కలెక్టర్ సుమతి ఆమె కేసి అదోలా చూసింది. రోడ్డు మీద పోయే వాళ్ళని సన్మానించడానికి తీసుకొచ్చినట్టున్నారు. వీళ్ళకి ఎవరూ దొరకలేదా ఏమిటి ? సంఘంలో అనేకమంది ఉన్నత స్థానాలు అలంకరించిన స్త్రీలు ఉన్నారు. వాళ్లందర్నీ వదిలేసి ఎవరినో పట్టుకుని వచ్చారు. ఈ మాత్రం దానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం ఎందుకు? ఈ క్లబ్ వాళ్లే వాళ్లని సన్మానిస్తే సరిపోయేది. అయినా వీళ్ళు జీవితంలో ఏం సాధించారో ఎవరికీ తెలీదు. పనులన్నీ మానుకొని ఇలాంటి కార్యక్రమానికి వచ్చాను ఏమిట్రా దేవుడా !అనుకుంది కలెక్టర్ సుమతి.

అయితే కలెక్టర్ సుమతి పరిస్థితి ఇలా ఉంటే పొద్దుటి నుంచి ఏ పనిలోకి వెళ్లకుండా ఆ క్లబ్ వాళ్ళు చెప్పినట్లుగా అక్కడే కూర్చున్న ఆ సన్మాన గ్రహీత పోచమ్మ మనసంతా దిగులుగా ఉంది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు . రేపు పిల్లలకి ఏం పెట్టాలి ఈరోజు పనిలోకి వెళ్ళలేదు కదా! అంతా నష్టం! ఎందుకు వచ్చినసన్మానాలు నాకు ? ఇవి అనుకుంటూ బాధపడుతోంది పోచమ్మ.ఇంటి దగ్గర ఉండే భర్త పిల్లలు గుర్తుకొచ్చారు. పిల్లల అన్నం తిన్నారో లేదో! అని తనలో తాను బాధపడసాగింది. దానికి తోడు నేల మీద కూర్చోడమే కానీ ఎప్పుడు ఇలాగా కుర్చీలో కూర్చోవడం అలవాటు లేక ఇబ్బంది పడసాగింది పోచమ్మ.

సభ ప్రారంభమైంది. ప్రతి ఏటాఎంతోమంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాల అలంకరించిన మహిళా మణులను సన్మానించుకోవడం జరుగుతోంది మా క్లబ్బులో. అయితే అందుకు భిన్నంగా ఈసారి ఒక ప్రత్యేక వ్యక్తినీ సన్మానించాలని నిర్ణయించడం జరిగింది. అయితే ఒక స్త్రీ నిత్యజీవితంలో అనేక బాధ్యతలు నిర్వహిస్తూ తన కుటుంబాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశానికి మంచి పౌరులను అందిస్తోంది. 

అయితే ఈ స్త్రీలు అనేక రంగాల్లో ఒక లాయర్ గా ,ఒక డాక్టర్ గా, ఒక పైలట్ గా ,అత్యున్నతమైన ప్రతిభ కనబరిచి వివిధ రంగాల్లో రాణిస్తున్నారు. అయితే ఈ వేదిక మీద కూర్చున్న పోచమ్మ అనే స్త్రీ సాధారణ రైతు కుటుంబానికి చెందినది. భర్త ఇద్దరు పిల్లలతో చుట్టుపక్కల ఇళ్లల్లో పాచి పని చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటుంది. అయితే ఈ పోచమ్మ పనిచేసే ఒక ధనవంతులు ఇంట్లో ఆ యజమానురాలు రమ్యకి పిల్లలు లేరు. 

ఏదో జన్మతః వచ్చిన సమస్య కారణంగా రమ్యకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. అన్నీ ఉన్న అదొక్కటే బెంగ వాళ్లకి. అయితే సరోగసీ ద్వారా పిల్లలు పొందాలని చాలా చోట్ల ప్రయత్నం చేశారు. ఎవరు కూడా గర్భం ధరించి పురిటి నొప్పులు పడి బిడ్డను కని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దానికి తోడు అవతల వాళ్ళు ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉంటాయో! అని భయపడుతూ ఉండేది రమ్య.

 డబ్బు ఇస్తానంటే చాలామంది వచ్చి గర్భం దాల్చి పిల్లలను కని ఇస్తారు కానీ ఎవరికి ఎలాంటి రోగాలు ఉన్నాయో తెలియదు.
 ముద్దుగా బొద్దుగా ఉండే పోచమ్మ పిల్లలని చూసి ఆనంద పడుతూ ఉండేవారు రమ్య దంపతులు . ఒకరోజు ధైర్యం చేసి రమ్య పోచమ్మని అడిగింది. "నీకు ఇద్దరు పిల్లల్ని పెంచడం కష్టంగా ఉంది కదా నాకు ఒక పిల్లవాడిని దత్తత ఇయ్యి అని అడిగింది. ఒక్కసారిగా పోచమ్మకి కళ్ళ నీళ్లు వచ్చాయి. డబ్బు లేకపోయినా ఏదో కష్టపడి పిల్లల్ని పెంచుకుంటాం గానీ నాలాంటి వాళ్ళు ఎవరు దత్తత ఇవ్వరు అనుకుంటూ లోపల బాధపడుతూ రమ్య మాటకు ఏమీ సమాధానం చెప్పకుండా అమ్మ ఎవరో చెబితే విన్నాను. అదేదో ఇంజక్షన్ ద్వారా పిల్లలను పుట్టిస్తారట కదా! అని అడిగింది పోచమ్మ.

అప్పుడు సరోగసి గురించి పోచమ్మకు అర్థమైన భాషలో చెప్పి నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను నాకు ఆ సహాయం చేసి పెట్టు ఇది మనిద్దరి కుటుంబాల మధ్య ఉంటుంది అని బ్రతిమాలింది పోచమ్మని రమ్య. ప్రతి రోజు పిల్లల గురించి బాధపడుతున్న రమ్య పరిస్థితి పోచమ్మకు తెలుసు. మాతృత్వం కోసం తపించిపోయే స్త్రీల సంగతి స్త్రీకే తెలుస్తుంది. పురుడు అంటే పునర్జన్మని తెలుసు. ఆరోగ్యం పాడైపోతుంది తెలుసు. అయినా ఒక కుటుంబం కోసం ఈ త్యాగం చేస్తే తప్పేమిటి అనుకుని భర్త రామయ్యకిఈ విషయాలన్నీ చెప్పింది. అలాగే రమ్య చెప్పిన డబ్బు విషయం కూడా చెప్పింది.

డబ్బు మాట ఎత్తగానే రామయ్య కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. డబ్బు తీసుకో పోచమ్మ మన కష్టాలన్నీ తీరిపోతాయి! అని పోచమ్మ ను రెచ్చగొట్టాడు

అయినా రామయ్య మాటలకి పోచమ్మ ఒప్పుకోకుండా అమ్మా మీరు ఏమి నాకు డబ్బులు ఇవ్వద్దు. కేవలం ఆహార సదుపాయం, వైద్య సదుపాయం మాత్రమే చూడండి. ఆ రెండు భరించే శక్తి మాకు ఉండదు అంటూ చెబుతున్న పోచమ్మ మాటలకి రమ్యకి నోట మాట రాలేదు. 

ఆ తర్వాత అద్దె గర్భం ధరించడం పండంటి పిల్లవాడిని కనడం ఓ శుభ ముహూర్తంలో ఆ పిల్లవాడిని వదల్లేక వదల్లేక ఆ తల్లికి అప్ప చెప్పడం అన్నీ జరిగిపోయాయి. ఆధునిక కాలంలో ఇలాంటి మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. కొంతమంది డబ్బులు తీసుకుని కొంతమంది కేవలం అది ఒక పుణ్యకార్యంగా భావించి తమ ప్రాణాల్ని ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తున్నారు. 

రమ్య లాంటి వాళ్ళ జీవితంలో వెలుగు చూపుతున్నారు. ఏదైనా స్త్రీ ఒక ఉద్యోగిగా, ఒక కన్నతల్లిగా ,ఒక పోలీస్ ఆఫీసర్గా, ఒక పైలట్గా ,ఒక లాయర్ గా వివిధ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారే మనకు తెలుసు. కానీ పోచమ్మ లాంటి త్యాగమూర్తులు ఇటీవల కాలంలో చాలామంది ఉన్నారు. ఈ పోచమ్మ చేసిన త్యాగానికి ప్రత్యక్ష సాక్షి మా సెక్రెటరీ రమ్య అంటూ ప్రెసిడెంట్ తన ఉపన్యాసాన్ని ముగించారు.
ఆ తర్వాత అధ్యక్షురాలు సుమతి పోచమ్మ పట్ల కలిగిన హేయమైన భావానికి తనలో తానే సిగ్గుపడుతూ నిజానికి ఉద్యోగిగా ఉన్న స్త్రీ సాధించిన ప్రగతి ప్రపంచానికి తెలుస్తుంది. అలాగే కుటుంబంలో ఒక స్త్రీ సాధించిన అద్భుత విజయాలు ఆ కుటుంబాన్ని చూస్తే తప్ప లోకానికి తెలియదు. పోచమ్మ లాంటివాళ్ళు అద్దెగర్భం ధరించి ఒక కుటుంబానికి చేసిన మేలు నిజంగా మర్చిపోలేనిది. విజ్ఞాన శాస్త్రం ఎంత ప్రగతిని సాధించినప్పటికీ అద్దె గర్భం ధరించే స్త్రీలు లేకపోవడం వలన చాలామందికి పిల్లల కోరిక తీరని కోరిక లాగా ఉండిపోతోంది.

 ఈరోజు ఈ లేడీస్ క్లబ్ వాళ్ళు సన్మానం చేస్తున్న పోచమ్మ లాంటివాళ్ళు నిజంగా సన్మానానికి సత్కారాలకి బిరుదులుకి అర్హులు అంటూ పోచమ్మ రెండు చేతులు పట్టుకుని నమస్కారం చేసి తర్వాత పోచమ్మని శాలువుతో సత్కరించిన తర్వాత సెక్రటరీ రమ్య ఒక పెద్ద గిఫ్ట్ ప్యాకింగ్ కట్టిన ఒక పెద్ద బాక్స్ పోచమ్మ చేతికి అందిస్తుంటే అమ్మా ! నాకు ఈ గిఫ్ట్ లవి వద్దమ్మా! నాకు ఒక రోజు కూలి ఇప్పించండి. లేదంటే రేపు అంతా మా పిల్లలు పస్తులు ఉంటారు. ఈ రోజంతా నేను పనికి వెళ్లలేదు కదా! అంది పోచమ్మ. 

పోచమ్మ మాటలకి అందరికీ కళ్ళ నీళ్లు వచ్చే యి. అవును ఒక స్త్రీ మాత్రమే ఇలా ఆలోచించగలదు. స్త్రీ నిజంగా కరుణామూర్తి.

 ఎప్పుడూ సంఘాల్లో ఉన్నత స్థానాల అలంకరించిన వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు గాని ఇలాంటి మట్టిలో మాణిక్యాలకి సన్మానం జరగడం ఇదే మొదటిసారి అని పేపర్లన్నీ ఆ ఆ క్లబ్ గురించి చాలా గొప్పగా రాశారు. నిజమే కదా !మరి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279