అవును ఆయన చనిపోలేదు !.
" నిన్న ఉదయం ఇద్దరం కలిసి వాకింగ్ కి వెళ్లొచ్చాం. ఆరోగ్యం బాగాలేదని ఏమీ చెప్పలేదు. ఇంతట్లో ఇలా అయిపోతాడని ఎలా ఊహిస్తాం అంటూ చనిపోయిన పరంధామయ్య స్నేహితులు మాట్లాడుకుంటున్నారు." ఎంత మంచివాడు ఎప్పుడూ గట్టిగా కూడా మాట్లాడేవాడు కాదు అంటూ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తలోరకంగా చెప్తున్న మాటలు పరంధామయ్య భార్యకి తలకెక్కట్లేదు. ఒకపక్క భర్త పోయిన బాధ ఇంకొకపక్క ఆయన ఆశయం ఎలా నెరవేర్చాలనే భయం బంధువులు ఏమనుకుంటారు అని మరొక పక్క భయం.
పోనీ పరంధామయ్య ఆశయం డబ్బుతో కూడుకున్నదైతే ఏ గొడవ లేదు. ఆ స్తోమత ఉంది కుటుంబ సభ్యులకి. మరి ఆచార వ్యవహారాలకు సంబంధించింది. మరి పరంధామయ్య నాలుగు వేదాలు చదువుకున్నవాడు. తెల్లవారి లేస్తే అందరికీ మంచి చెడ్డ చెప్పే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఇటువంటి కోరిక ఏమిటి?
మరి దీన్ని లోకం ఎలా తీసుకుంటుంది. " ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. దీన్ని కచ్చితంగా నువ్వు పాటించాలి. ఇది నా కోరిక. నా వయసు అరవై సంవత్సరాలు దాటింది. ఎప్పుడు ఎలా ఉంటానో తెలియదు.
మనిద్దరిలో ఎవరు ముందో తెలియదు. కానీ నేనే ముందుగా పోతే నా అవయవాలను రంగరాయ మెడికల్ కాలేజీకి దానం ఇచ్చేయండి. దానికి తగిన ఏర్పాట్లన్నీ నేను తయారుచేసి ఉంచాను. నువ్వు ఆ సమయంలో చెప్పడానికి మొహమాటం రావచ్చు భయం రావచ్చు అందుకే నా అంగీకారాన్ని ఉత్తరం రూపంలో వ్రాసి బీరువాలో పెడుతున్నాను.
దీన్ని మన కుటుంబ సభ్యులకు నువ్వు ఇస్తే చాలు అంటూ భర్త చెప్పిన మాటలకి మొదట్లో విచిత్రంగా అనిపించిన ఆచార వ్యవహారాలకు వ్యతిరేకంగా చేస్తున్నామని అనిపించిన కాలమాన పరిస్థితులను బట్టి వైద్య రంగంలో వస్తున్న మార్పులను బట్టి మనము కూడా ఒక వ్యక్తికి ప్రాణదానం చేస్తున్నామనే భావంతో మనసు తృప్తి పడింది పరంధామయ్య భార్యకి.
ఎక్కడ చూసినా పరంధామయ్య గురించి మాటలే. కుటుంబ సభ్యులు బంధువులు పరంధామయ్య చుట్టూ చేరి ఏడుస్తూ తలోరకంగాను మాట్లాడుకుంటున్నారు.
ఇంతలో పరంధామయ్య భార్య రాజేశ్వరమ్మ కి తన బాధ్యత గుర్తుకొచ్చింది. అప్పుడే పరంధామయ్య పోయి గంటయింది. ఆఖరి కూతురు కోసం చూస్తున్నారు. ఇంకో గంటలో మన సాంప్రదాయం ప్రకారం పనులు ప్రారంభమైపోతాయి.
అవేవీ ప్రారంభించకుండానే పరంధామయ్య ఆశయం బంధువులు ముందు కొడుకుల ముందు కూతుళ్ళ ముందు బయటపెట్టాలి అనుకుని పెద్ద కొడుకు రఘును పిలిచి లోపల బీరువాలో ఒక కవర్ ఉంది తీసుకొని రా అని చెప్పింది.
రఘు ఆలోచన వేరే విధంగా ఉంది అది తండ్రి వీలునామా అనుకున్నాడు. దానికి ఇప్పుడు తొందరేముందమ్మా. కాదురా అది తీసుకుని రా అని చెప్పింది. రఘు బీరువా తెరిచి లోపల ఉన్న కవర్ బయటకు తీసుకుని వచ్చి తల్లికి ఇచ్చాడు. లేదురా ఇది ఓపెన్ చేసి నువ్వు అందరికీ చదివి వినిపించు అంది రాజేశ్వరమ్మ.
ఇలాంటి సమయంలో చదవడం ఏంటమ్మా! అందరూ తలో రకంగానే చెప్పుకుంటారు అన్నాడు రఘు. కాదురా ఇప్పుడే చదవాలి అంది రాజేశ్వరమ్మ. చేసేదిలేక రఘు కవరు విప్పి లోపల ఉన్న కాగితాలు బయటకు తీశాడు. అందులో ఉన్నవి చూసి ఆశ్చర్యపడ్డాడు రఘు. అందులో కాకినాడ గవర్నమెంట్ హాస్పటల్ వాళ్ళు ఇచ్చిన డోనర్ కార్డు.రెండోది కుటుంబ సభ్యులకి బంధువులకి ఒక ఉత్తరం కనబడ్డాయి. ఆ ఉత్తరాన్ని గట్టిగా చదవడం ప్రారంభించాడు రఘు.
కుటుంబ సభ్యులకి, బంధువులకి,
ఈ సమయంలో నా మనసులో ఉన్న భావాలు మీకు చెప్పడానికి ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎవరైనా మరణించినప్పుడు మనం ఏడుస్తూ కూర్చుంటా ము. కానీ వారి ఆశయాలు నెరవేర్చడానికి ఏ ప్రయత్నం చెయ్యము. మరణం అనేది పుట్టిన ప్రతి ప్రాణికి తప్పదు. ఆ తర్వాత ఆ నిర్జీవ శరీరాన్ని ఎవరి సాంప్రదాయం ప్రకారం వారు మట్టిలో కలిపేస్తారు. అక్కడ తోటి ఆ వ్యక్తి భౌతికంగా మనకు ఇంక కనిపించరు. మనిషి బ్రతికి ఉన్నప్పుడు అనేక మంచి పనులకి సహకరించిన మన శరీర భాగాలు మనతో పాటే మట్టి పాలు చేయడం మన సాంప్రదాయo. ఒక మనిషి బ్రతికున్నంత కాలము కళ్ళు ఎన్నో అందమైన ప్రదేశాలు చూపిస్తాయి. రహదారుల వెంట నిర్భయంగా నడిపిస్తాయి. దానితోపాటు చెడ్డ వస్తువులు కూడా మన కళ్ళ పడతాయి.
ఇంద్రియాలు అన్నిటిలోకి కళ్ళు ప్రధానమైనవి అని వేదం చెబుతోంది. మన శరీర భాగాలలో అన్నిటిలోకి కళ్ళు ఎంత ముఖ్యమైనవో అంధులని చూస్తే అర్థమవుతుంది. కళ్ళు లేని జీవితం చూస్తే నిజంగా అది భయంకరంగా ఉంటుంది. మనం చనిపోయిన తర్వాత మనతోపాటు మట్టిలో కలిసిపోయే ఈ కళ్ళు ఒకరికి చూపునిస్తాయని తెలుసుకుని నిజంగా ఆశ్చర్యపడ్డాను.
శరీరంలో ఎక్కడో మూల దాక్కుని మన శరీరంలోని రక్తాన్ని శుభ్రపరిచి మలినాలన్నింటిని బయటకు పంపించి మనిషి శరీరానికి అద్భుతమైన సేవ చేస్తున్న రెండుమూత్రపిండాలు బయటకు కనపడకుండా శరీరానికి మహోపకారి చేస్తాయి.. ఇందులో అవసరమైన వారికి ఒక దానిని దానం చేయొచ్చు అని ఒక మూత్రపిండంతో మన జీవితాన్ని గడుపుకోవచ్చని వైద్యులు చెప్పడంతో అవసరమైన వారికి నా నిర్జీవ శరీరం ఇలా ఉపయోగపడుతుందంటే చాలా ఆనందపడ్డాను.
శరీరభాగాలన్నిటికీ అవసరమైన ఎర్రటి రక్తాన్ని సరఫరా చేసే గుండె కాయ అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటి కదా. గుండె నుండి వచ్చే లబ్ డబ్ శబ్దాన్ని బట్టి గుండె పనితీరును కనిపెట్టే వైద్యశాస్త్రం అవసరమైన వారికి గుండెను తీసి మరొకరి గుండెను పెడుతున్నారంటే ఆగిపోయిన నా గుండె మరొకరికి ప్రాణం పోస్తుందని తెలిసి ఇంతకంటే పుణ్యం ఏముంటుందని ఆలోచించుకున్నాను.
ఒక వేద పండితుడిగా పురాణాలు పట్ల వైదిక ధర్మం పట్ల అత్యంత విశ్వాసం ఉన్న నన్ను ఇటీవల కాలంలో ఒక రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి యొక్క బ్రెయిన్ హుటాహుటిని విమానంలో తీసుకొచ్చి మరొకరికి అమర్చిన వైద్యుల ఘనత టీవీలో చూసి చాలా ఆనందపడ్డాను. ప్రాణం పోయలేకపోతున్నారు కానీ అవయవాలు మార్పిడైతే మటుకు చాలా ఈజీగా చేస్తున్నారని మనసులోనే వైద్యుల్ని అభినందించాను.
ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి అవయవ మార్పిడి చేసి భార్యని బ్రతికించుకుందామని ప్రయత్నించిన మా తమ్ముడు గుర్తుకొచ్చి ఈ నిర్ణయం తీసుకున్నాను. సరైన సమయానికి ఎవరు దాతలు దొరకలేదు. ఆ విషయం తన భార్య చనిపోయిన తర్వాత మా తమ్ముడు చెబితే అప్పుడు తెలిసింది.
ఈరోజుల్లో ఎంతోమందికి రోగికి కావలసిన రక్తం గురించి సామాజిక మాధ్యమాలలో ప్రకటన పెడుతున్నారు. అలాంటి ప్రకటన చూసి ఎంతోమంది స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు.
నాకు తెలుసున్న ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ గారికి కిడ్నీ మార్పిడి చేయవలసి వచ్చి రక్తసంబంధీకులతో ఎవరిది సరిపడక భార్య ఒక కిడ్నీ దానం చేయడం విని అంతటి త్యాగమూర్తిని మనసారా అభినందించి వచ్చాను.
నేను జీవితంలో అన్నీ అనుభవించి చివరి దశలో ఉన్నాను. ఇవాళ రేపు తప్పకుండా భగవంతుడు దగ్గర నుంచి పిలుపు వస్తుంది. ఆ తర్వాత నా శరీరంలోని భాగాలు మట్టి పాలు కాకుండా ఎవరికైనా ఉపయోగపడితే నా జన్మ ధన్యమైనట్లే.
రోజు ఎంతోమంది రక్తదాతలు చేస్తున్న త్యాగం చూసి నిజంగా సిగ్గుపడ్డాను. ఎంతోమంది యువత సంఘాలుగా ఏర్పడి అర్ధరాత్రి అపరాత్రి లేకుండా హాస్పిటల్ చుట్టూ తిరిగి అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు. వారు నిజంగా ప్రాణదాతలే.
ఏ పని చేయడానికి అయినా ఒక స్ఫూర్తి ప్రదాత కావాలి. మన రోజు అనేక సినిమాలు చూస్తుంటాం. సినిమాల్లో హీరో హీరోయిన్లు ధరించిన దుస్తులు వేషభాషలు మన యువత అనుకరిస్తారు.
అలాగే పెద్దలు ఇలాంటి దానాలు మనం చేసి చూపిస్తే యువతకికూడా మార్గదర్శకులమవుతామని నా ఆలోచన. ఎవరు కూడా వేరే విధంగా ఆలోచించవద్దు. చాందస భావాలు పెట్టుకోవద్దు.
మట్టిలో కలిసిపోయే నా శరీర భాగం ఒకరికి మళ్లీ జీవితాన్ని ఇస్తుందంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మారే కాలంతో పాటు మనం కూడా మారాలి. పూర్వకాలంలో మన పెద్దలు చెప్పేవారు అన్నదానం, విద్యాదానం, గోదానం, భూదానం ఇప్పుడు అవయవదానం కూడా అలాంటి పుణ్యం ఇస్తుందని
నా అభిప్రాయం. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. అని చదవడం ముగించి రఘు కన్నీళ్ళు కార్చాడు.
రఘు వెంటనే ఫోన్ తీసుకుని హాస్పిటల్ వాళ్లకి ఫోన్ చేశాడు పరంధామయ్య గారి కోరిక ప్రకారం. కొంతమంది ఈ విషయాన్ని ఆశ్చర్యంగాను మరి కొంతమంది స్ఫూర్తిగా ను తీసుకున్నారు. ఎవరేమనుకున్నా సరే పరంధామయ్య కోరిక నెరవేరింది.
అలా రెండు నెలలు గడిచేయి. ఒకరోజు మధ్యాహ్నం కాలింగ్ బెల్ మోగిన చప్పుడుకి వీధి తలుపు తీసిన పరంధామయ్య భార్యకి ఎదురుగుండా ఒక మధ్య వయస్కుడు కనిపించాడు. పరంధామయ్య గారి ఇల్లు ఇదేనా అని ప్రశ్నించాడు. అవునండి అని పరంధామయ్య భార్య సమాధానం చెబుతూ ఆయన పోయి రెండు నెలలు అయింది అండి అని చెప్పింది. లేదండి ఆయన చనిపోలేదు నా కళ్ళల్లోనే ఉన్నారు అని రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు. ఆ మాటలు అర్థం చేసుకున్న పరంధామయ్య భార్య నోట మాట రాలేదు. అవును ఆయన చనిపోలేదు మళ్లీ కొంతమందికి జన్మనిచ్చాడు అనుకుంది. నిజమే మరి !
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279.