Read Single parent by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • శ్రీరామనవమి

    శ్రీరామనవమి' హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వస...

  • సత్తిబాబు

    సత్తిబాబు " పొద్దుటి నుంచి మన ఇంట్లో కరెంట్ లేదండి. ఇవాళ అసల...

  • సింగిల్ పేరెంట్

    సింగిల్ పేరెంట్." లేదమ్మా సుధని నువ్వు తప్పుగా అర్థం చేసుకున...

  • ఆఖరి ఉత్తరం

    ఆఖరి ఉత్తరంఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధ...

  • అమ్మమ్మ గారి ఇల్లు

    అమ్మమ్మ గారి ఇల్లు" రేపటి నుంచి నా నా కాలేజీకి సెలవులు అoటు...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

సింగిల్ పేరెంట్

సింగిల్ పేరెంట్.

" లేదమ్మా సుధని నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆ అమ్మాయి అటువంటి అమ్మాయి కాదు. పదిమంది కావాలనుకునే అమ్మాయి. నలుగురిలో పెరిగిన పిల్ల. నిన్ను అంత మాట అంది అంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. అలాంటి మాట బయటికి రావడానికి కారణాలు ఏమిటి? నేను పెళ్లయిన మొదటి రోజు చెప్పాను నాకున్న బాధ్యత గురించి. మనం కూడా కొన్ని చూసి చూడనట్టు ఉండాలి. కొత్తగా మన ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనతోటి కలిసిమెలిసి ఉండడానికి కొద్ది రోజులు సమయం పడుతుంది అంటూ కొడుకు రాజేంద్ర చెప్పిన మాటలు వినేటప్పటికీ రాజేంద్ర తల్లి రాధ మంచం మీద పడుకుని ఆలోచనలో పడింది.

"రాజేంద్ర లో ఎంత మార్పు వచ్చింది. ఇదివరకు ఎక్కువగా మాట్లాడే వాడు కాదు. ఇప్పుడు ప్రతి మాటకి విశ్లేషణ ఇస్తున్నాడు. కోడలు సుధని వెనకేసుకొస్తున్నాడు. ఏదో చెప్పాలని చాలా రోజుల నుంచి ప్రయత్నిస్తున్నాడు. చెప్పలేకపోతున్నాడు. నేను బాధపడుతున్నానని పూర్తిగా విషయం చెప్పట్లేదు ఏమో! ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. ఎప్పుడూ అమ్మా అని కొంగు పట్టుకుని తిరిగేవాడు. స్కూల్లో కానీ కాలేజీలో గాని జరిగిన ప్రతి విషయం చెప్పేవాడు. 

 నా ప్రవర్తన వల్ల వాళ్లు ఏమైనా బాధపడుతున్నారా! ఏమో ఎలా తెలుస్తుంది. ఎంత కష్టపడింది వీడిని పెంచడానికి ఒక్కసారి గతం గుర్తుకొచ్చింది రాధకి. 

రాజేంద్రకి తండ్రి శంకర్ చనిపోయేటప్పటికి మూడేళ్లు. శంకర్ . చాలా అందగాడు. పెద్దగా చదువు లేకపోయినా ఏదో చిన్న వ్యాపారం చేసుకుని గుట్టుగా కాలక్షేపం చేసేవాడు. అలాంటిది ఒకరోజు హఠాత్తుగా మలేరియా జ్వరం వచ్చి సరైన వైద్యం చేయించుకోకపోవడంతో గుండె సమస్య వచ్చిన ఆరు నెలలోనే చనిపోయాడు. . 

అంత చిన్న వయసులోనే అంత పెద్ద కష్టం వచ్చినా ఎంతోమంది రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చిన వాడి భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని అలా విరాగిలా బతుకుతూ రాజేంద్ర మీద ఆశలన్నీ పెట్టుకుని భవిష్యత్తు బంగారంలా ఉండాలని కష్టపడి ఇలా పెంచి పెద్ద చేసి గవర్నమెంట్ ఉద్యోగిని చేసి ఒక ఇంటివాడిని చెయ్యడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఒక్కొక్కసారి రాజేందర్ నిద్రలో లేచి నాన్న కావాలని ఏడిస్తే ఏమి సమాధానం చెప్పాలో తెలిసేది కాదు. భర్త లేని ఆడది అంటే అందరికీ లోకువే. బయటకు వెళ్లాలంటే భయం. ఏ మాట ఎక్కడి నుంచి వినాల్సి వస్తుంది అని భయం. ఉద్యోగం చేసే అర్హత లేదు భర్త తరుపు ఆస్తి ఉన్న ,వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఏమిటో !తెలియని అయోమయం. ఈలోగా శంకర్ కు సంబంధించిన ఆస్తివాటా గురించి అత్తవారితో గొడవలు ,ఆర్థిక సమస్యలు .

రాజేంద్ర కి ఆరోగ్య సమస్యలు ఇంకా బయట చెప్పుకోలేని సమస్య లు ఇవన్నీ ఎదుర్కొని ఇప్పుడు హాయిగా ఉందామనుకుంటే ఎందుకో ఇప్పుడు మనశాంతిగా ఉండట్లేదు. ఏదో అలజడి. తప్పు ఎవరిదో అర్థం కావట్లేదు. ఏదో ఒంటరితనం. పెళ్లి కాకముందు రాజేందర్ ప్రతి పనికి తోడు వచ్చేవాడు. ఇప్పుడు వాడి తప్పు కూడా లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయికి న్యాయం చేయాలి కదా. పైగా ఆఫీస్ పనులు. ఒక్క ఆదివారం తప్పితే వాడికి ఖాళీ ఉండటం లేదు.

ఆ మూల గదిలో ఆ మంచం మీద ఒంటరిగా పడుకోవాలి అంటే ఏదో భయం. ఒకప్పుడు రాజేంద్రతో అర్ధరాత్రి వరకు కబుర్లు చెప్పుకొని పడుకునే వాళ్ళం. ఎప్పుడైనా ఏదైనా సినిమాకి వెళ్లాలంటే ఇద్దరూ కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత వాళ్ళిద్దరికీ ఏకాంతం కావాలి కదా మాటవరసకైనా రమ్మని అడగరు. అయినా కానీ ఒక్కొక్కసారి సిగ్గు విడిచి అడగాలనిపిస్తుంది. ప్రతిదిన చర్యలోనూ వంటరితనం కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది. హాల్లో కూర్చుని టీవీ చూసేటప్పుడు ఆ భార్య భర్తలు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ అసలు మూడో వ్యక్తి ఉన్న సంగతే మర్చిపోతారు. పైగా భోజనాల బల్ల దగ్గర అందరూ కలిసి కూర్చుని తిన్న రోజు లేదు. వాళ్ళిద్దరూ కలిసి లేటుగా తింటారు. రాధకి ఉన్న ఆరోగ్య సమస్యలు దృష్ట్యా తొందరగా భోజనం చేయాలి. ఇదివరలో రాజేంద్ర ఆఫీసు నుండి రావడం ఎంత లేట్ అయినా కలిసే తినేవారు. ఎవరూ వడ్డించే వాళ్ళు కూడా ఉండరు. ఏమిటో ఈ సమస్య. 
పైగా రాజేందర్, సుధ ఇద్దరు కూడా ఉద్యోగస్తులే. ఉదయం వెళ్లి సాయంకాలం ఎప్పుడో ఇంటికి వస్తారు. రెండు పూటలా అందరికీ వంట రాధ చేస్తుంది. కనీసం ఉదయం పూటైనా సుధ వంటలో సహాయం చెయ్యదు. దానికి తోడు ఏదైనా పదార్థం నచ్చకపోతే వెంటనే జోమాటో ఆర్డర్లు. అన్ని డబల్ ఖర్చులు. రాను రాను ఇంటి పని అంతా చేయలేకపోతోంది రాధ. అన్ని చూస్తున్న కొడుకు రాజేంద్ర మౌనంగా ఉండడం అర్థం కాలేదు రాధకి.

ఆర్థిక స్వాతంత్రం లేని స్త్రీ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అత్తవారి తరుపున వచ్చిన ఆస్తంతా అమ్మేసి ఇల్లు కట్టడం తప్పు పని చేశాను అనుకుంది రాధ. ఇప్పుడు పది పైసలు కావలసి వచ్చిన కొడుకుని అడగవలసి వస్తుంది. దానికి తోడు ఈమధ్య ఇంట్లో జరుగుతున్న గొడవలు చూసి " మీకు అంత ఇష్టం లేకపోతే మేము వేరే వెళ్ళిపోతాము అంది కోడలు. ఊహించని ఈ రకమైన సమస్యకి మతి పోయింది రాధకి.

ఇన్నాళ్ళు ఎన్నో రకమైన సమస్యలను పరిష్కరించుకున్నాను. ఇప్పుడు ఈ రకమైన సమస్య నా మూలంగానే వస్తుందా! నా ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా! అది కూడా సుధ కాపరానికి వచ్చిన తర్వాతే నాలో మార్పు వచ్చిందా! ఇది ఒక రకమైన ఈర్ష్యా !లేదంటే కొడుకు చేయిజారిపోతున్నాడేమో అని భయమా ! ఏదో నాలో ప్రవేశించింది. కాదు ఎదుటి వాళ్ళ ప్రవర్తన కూడా! 

ఇప్పటి రోజుల్లో ఆడపిల్లలందరూ నా భర్త నాకే సొంతమని ఆలోచిస్తారు. తప్పులేదు. ఇరవై నాలుగు గంటలు తనకి పూర్తి సమయం కేటాయించాలని అనుకుంటారు . కానీ ఆ భర్త కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి.ఆ బాధ్యతలు కూడా కొంత సమయం కేటాయించవలసిన అవసరం ఉంది. అది కూడా ఆలోచించాలి ఈ కాలం పిల్లలు. ఈ కాలం వాళ్ళు చాలా తెలివైన పిల్లలు. ఎదుటి వాళ్ళదే తప్పనే పరిస్థితులు సృష్టిస్తారు.

ప్రతిరోజు వాళ్లతో మంచిగా గడపాలని ఆలోచిస్తా. తెల్లవారిసరికి ఏదో ఒక సంఘటన జరిగి అప్రయత్నంగా నోటి వెంట మాటలు వచ్చేస్తున్నాయి. ఆ సమస్య నా ఒక్కదాని మూలాన్ని వస్తుందా కాదు రెండు చేతులు కలిస్తే గాని ఎప్పుడూ చప్పట్లు రావు. అలాగే ఎదుటివాళ్ళు ఒక మాటంటే మనం కూడా ఒక మాట అంటాం. ఎదుటి వాళ్ళకి సపోర్ట్ ఉంది. కొడుకు కూడా తల్లి ది తప్పని మాట్లాడుతున్నాడు. ఇన్నాళ్లు స్వార్థం లేకుండా పెంచి పెద్ద చేసిన కొడుకు తననే తప్పు పట్టడంతో రాధ తట్టుకోలేకపోయింది. 

రాధకి కూడా వయసు మీరి పోతోo ది.ఎప్పటిలాగా చాకిరీ చేయలేకపోతోంది. పోనీ కొడుకు తల్లి పరిస్థితి చూసి ఒక రోజైనా తన భార్యని వంట చేయమని చెప్తాడు అని ఎదురుచూసేది రాధ. ఆ మాట ఎత్తట్లేదు రాజేందర్.

శంకర్ కనక బ్రతికుంటే రాధ పరిస్థితి వేరే విధంగా ఉండేది. మానసికంగా ఎంతో బలం ఉండేది. అనేక సమస్యలకి పరిష్కారం దొరికేది. మనసులో ఉన్న బాధను చెప్పుకోవడానికి మంచి బంధం కదా భర్త. ఇప్పుడు ఎవరిదో చెప్పుకుంటుంది. పైగా ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలు ఎక్కువగా మాట్లాడరు.
భయపడతారు. పోనీ ఈ వయసులో ఇంకో రకంగా ఆలోచిద్దాం అంటే అది కుటుంబాలకు చెడ్డ పేరు తీసుకొస్తుంది అని భయం.కోడలు దగ్గర కూడా లోకువ అయిపోతాము. 

పోనీ ఆశ్రమానికి వెళ్ళిపోదాం అంటే రాజేందర్ ని లోకం అదోలా చూస్తుంది.రాను రాను ఇంట్లో సమస్యలు పెరుగుతాయేతప్పితే మాటలతో ఈ రోజుల్లో సమస్యలు పరిష్కారాలు కావు. ఎవరి స్వార్థం వారిది. కడుపుని పుట్టిన పిల్లలైనా వాళ్ల బాధ్యతలు వాళ్ళకి వచ్చిన తర్వాత కొంత మార్పు వస్తుంది. ఆ మార్పు అనివార్యం. దానికి తోడు ఆరోగ్యం కూడా సరిగా ఉండట్లేదు. ఈ వయసులో ఈ అనారోగ్యంతోటి మనసు ప్రశాంతంగా ఉండాలి అనుకుంది. అసలా ఒక్కసారి హార్ట్ ఎటాక్ వచ్చి తగ్గింది. ఈ మధ్యకాలంలో ఈ సమస్యల తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లా బీపీ మాత్రలు డోసేజ్ పెంచేస్తున్నారు. . ఇది సినిమా కాదు చేతల తోటి చర్యలతోటి మాటలతోటి మనసు మార్చేసుకోవడానికి. ఇలా తీవ్రంగాఆలోచించుకుంటూ జరిగినవన్నీ తలుచుకుని బాధపడుతూ తట్టుకోలేని గుండెను తిట్టుకుంటూ ఒక స్థిర నిర్ణయానికి వచ్చి ఎప్పటికో నిద్రలోకి జారుకుంది రాధ. కానీ అది ఆఖరి నిద్ర అవుతుందని ఆమె కూడా తెలియదు. ఒక దేవుడికి తప్ప.
 "నిన్నటి వరకు బాగానే ఉన్నారే! నిద్రలోనే గుండె ఆగిపోయినట్లుంది అనుకున్నారు అందరూ. కానీ అసలు నిజం తెలిసిన వాళ్లు మౌనంగా ఉండిపోయారు. ఎంతోమంది రాధ లాంటివాళ్ళు జీవితం గడుపుకుంటున్నారు కానీ సుఖంగా మటుకు కాదు. ఇది కొన్ని జీవితాలు పరిశీలించిన తర్వాత వ్రాసింది.

రచన. మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279