Featured Books
  • ఆఖరి ఉత్తరం

    ఆఖరి ఉత్తరంఇల్లంతా నిశ్శబ్దం అయిపోయింది. పది రోజుల నుండి బంధ...

  • అమ్మమ్మ గారి ఇల్లు

    అమ్మమ్మ గారి ఇల్లు" రేపటి నుంచి నా నా కాలేజీకి సెలవులు అoటు...

  • ఇంటి దొంగ

    ఇంటి దొంగతెల్లారేసరకల్లా ఊరంతా గుప్పు మంది ఆ ఊరి ప్రెసిడెంట్...

  • వీలునామా

    వీలునామా " నాన్న ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్...

  • కన్యాదానo

    కన్యాదానంఉదయం 10 గంటలు అయింది.పరంధామయ్య గారు అప్పుడే టిఫిన్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అమ్మమ్మ గారి ఇల్లు

అమ్మమ్మ గారి ఇల్లు

" రేపటి నుంచి నా నా కాలేజీకి సెలవులు అoటు ఉత్సాహంగా "రేపు నేను అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతున్న అoటు కొడుకు కిరణ్ చెబుతున్న మాటలకి నవ్వుతూ ఉండిపోయింది తల్లి సంధ్య. 

కాలేజీకి సెలవిస్తే ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండవు. అమ్మమ్మగారి ఊరు వెళ్ళిపోతాను అంటావు. అక్కడ ఏముందిరా ? నాకంటే నీకు అమ్మమ్మ ఎక్కువా !అని అడిగింది కొడుకుని సంధ్య. 

 అవును అమ్మమ్మ కావల్సినవన్నీ చేసిపెడుతుంది ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రేమగా మాట్లాడుతుంది. ఆప్యాయంగా దగ్గర తీసుకుంటుంది. ఆ ఇల్లు చూస్తే స్వర్గంలా ఉంటుంది అంటూ అమ్మమ్మ గురించి తాతయ్య గురించి కబుర్లన్నీ చెబుతూ ఆ రాత్రి నిద్రలోకి జారిపోయాడు కిరణ్. 

మర్నాడు ఉదయమే ఫస్ట్ బస్సుకి కిరణ్ ని రావులపాలెం దగ్గర ఉన్న వాడపల్లిలో ఉన్న అత్తగారింటికి పంపించాడు కిరణ్ తండ్రి రామారావు. సంధ్య తండ్రి పరంధామయ్య ఇంత వయసు వచ్చినా ఆ ఊర్లోనే ఉంటూ వ్యవసాయం కౌలుకి ఇచ్చేసి కాలక్షేపం చేస్తూ ఉంటాడు.

 పరంధామయ్యకి నలుగురు ఆడపిల్లలే. అందరికీ పెళ్లిళ్లు అయిపోయి ముగ్గురు ఆడపిల్లలు హైదరాబాదులోనూ ఉంటే ఆఖరి కూతురు సంధ్య మటుకు తునిలో ఉంటుంది. సంధ్య భర్త రామారావు అక్కడ హంసవరం హైస్కూల్లో హెడ్మాస్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ దంపతులకు కిరణ్ ఒక్కడే కొడుకు. 

 ఇంటి ముందు ఆగిన ఆటోలో నుంచి దిగుతున్న కిరణ్ చూసి ఒక్కసారిగా నవ్వుతూ ఎదురొచ్చింది అమ్మమ్మ సరస్వతి. ఏరా పరీక్షలు బాగా రాసావా !అమ్మ నాన్న బాగున్నారా! అంటూ ప్రశ్నించేరు తాతయ్య అమ్మమ్మ . అందరూ బాగానే ఉన్నారు! అని ఉత్సాహంగా చెప్పిన కిరణ్ ఆమె ముఖాన్ని చూశాడు. మునుపటిలా ఆలింగనం చేసుకోవడానికి ముందుకు రాని సరస్వతమ్మను చూసి కిరణ్ లో నిరుత్సాహం కలిగింది. తాతయ్య లో కూడా ఇదివరకు ఉత్సాహం కనిపించలేదు. ఆ లంకంత కొంప చాలా నిశ్శబ్దంగా ఉన్నట్లు అనిపించింది. ఇదివరకైతే తాతయ్య వ్యవసాయం చేసే రోజుల్లో పాలేరులతోటి హడావిడిగా ఉండేది

తాతయ్య అమ్మమ్మ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్న కిరణ్ మనసు మనసులో లేదు. అమ్మమ్మ నడవలేక నడవలేక నడుస్తున్నట్లుగా ఉంది. ఎప్పుడు ఈపాటికి మడి చీరలో వంట గదిలో వంట చేస్తూ కనపడేది అమ్మమ్మ. ఇప్పుడు ఎందుకో అలా కులాసాగా కుర్చీలో కూర్చుని ఉంది అనుకున్నాడు కిరణ్. 

ఏరా అన్నం తినేస్తావా ! అని అడిగింది సరస్వతమ్మ తన మనవడిని. అందరం కలిసి తినేద్దాం చాలా రోజులైంది అరిటాకులు కోసుకురానా! అని అడిగాడు కిరణ్. 

 కిరణ్ కి అరిటాకులో భోజనం చేయడం అంటే చాలా ఇష్టం . గూట్లో ఉన్న చాకు తీసుకుని దొడ్లోకి వెళ్లిన కిరణ్ కి పెరడంతా ఖాళీగా కనబడింది. ఆ తోట అంతా క్షీణించిపోయింది. ఒకటో రెండో అరటి మొక్కలు కనబడ్డాయి. ఎప్పుడూ పశువులతో ఉండే పాక నిర్మానుష్యంగా ఉంది. 

బూజు లు వేలాడుతున్నాయి. ఎన్ని పశువులు ఉండేవి. ఎలా ఆడుకునే వాడిని చిన్నప్పుడు వాటితోటి ఏమిటో పాపం పరిస్థితులన్నీ మారిపోతున్నాయి అనుకుని బాధపడ్డాడు కిరణ్. 

అలా అరిటాకులు కోసుకొని కడిగి తీసుకుని వచ్చేటప్పటికి వంటింట్లో టేబుల్ మీద క్యారేజీ విప్పుతూ కనబడింది అమ్మమ్మ. ఎప్పుడు గచ్చు వసారా మీద కూర్చుని అందరూ కబుర్లు చెప్పుకుంటూ అన్నం తినే రోజులు గుర్తుకొచ్చి చాలా బాధపడ్డాడు కిరణ్. కాళ్లు నొప్పులు రా నాకు తాతయ్యకి కింద కూర్చోలేకపోతున్నాం అంటూ అరిటాకు లో ఆ క్యారేజీ నుండి తీసిన పదార్థాలు వడ్డించడం మొదలు పెట్టింది అమ్మమ్మ. ఒకప్పుడు పిల్లలు వస్తే అరిటాకు నిండా పదార్థాలే. ఇప్పుడు ఆకులో బోల్డంత ఖాళీ మిగిలింది.

 పప్పు ఒక కూర చారు అన్నం మజ్జిగ . ఏం తిన్నా పడట్లేదు రా! పైగా ఆ గుప్పెడు బియ్యం కూడా స్టవ్ మీద పెట్టి దింపలేకపోతున్నాను.  

అందుకే మా ఊళ్లో కూడా క్యారేజీ ఇచ్చే వాళ్ళు వచ్చారు. ఇదే బాగుంది హాయిగా. పిల్లలందరూ వచ్చినప్పుడు ఆ కట్టెల పొయ్యి మీద పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకుని రకరకాల పదార్థాలు వండిన అమ్మమ్మ కళ్ళ ముందు కనబడింది . కళ్ళు వెంట నీళ్లు వచ్చాయి కిరణ్ కి.

అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆఖరిన ఒకర్తి కూర్చుని అన్నం తినే అమ్మమ్మ ఇప్పుడు తాతయ్య తో పాటు కూర్చుని భోజనం చేయడం ఏదో కొత్తగా అనిపించింది కిరణ్ కి. 

భోజనాలు అయిన తర్వాత ఆకులన్నీ తాతయ్య బయట పడేసాడు. గిన్నెలు పనిమనిషికి వేసి వచ్చాడు. అమ్మమ్మ నడవలేక నడవలేక నడుస్తూ చెయ్యి కడుక్కుని కుర్చీలో కూలబడి టీవీ చూస్తూ కూర్చుంది. ఒక అరగంట తర్వాత అమ్మమ్మ తాత ఇద్దరు చెరో మంచం ఎక్కారు. రారా !నువ్వు ఇలా పడుకో నా పక్కనే అంటూ అమ్మమ్మ తన మంచం మీద కొంచెం జరిగి చోటు చూపించింది. ఎప్పుడూ అమ్మమ్మ మెడల మీద చేతులు వేసుకుని పడుకోవడం అలవాటు చిన్నప్పటినుంచి.

 ఒక్కసారి ఒంటి మీద చెయ్యి వేసేటప్పటికి ఎముకలు చేతులకు తగిలేయి. ఏమిటో అమ్మమ్మ పాడైపోయింది అనుకొని కిరణ్ గది పైకప్పు చూసేటప్పటికి బూజులు వేలాడుతూ కనబడ్డాయి. మీ తాతయ్య వ్యవసాయం చేసి రోజుల్లో ఇంటినిండా పనివాళ్ళు ఉండేవారు రా. 
ఇప్పుడు ఎవరూ మాట వినిపించుకోవడం లేదు అంటూ సంజాయిషీ ఇచ్చుకున్నట్లుగా మాట్లాడింది సరస్వతమ్మ. ఆ తర్వాత కిరణ్ కి ప్రయాణ బడలిక వల్ల నిద్ర ముంచుకొచ్చేసింది.

కిరణ్ నిద్ర నుంచి లేచే సరికి సాయంకాలం నాలుగు గంటలు అయింది. కిరణ్ ని చూడగానే సరస్వతమ్మ ఇంత సేపు పడుకున్నవేంట్రా! అంటూ పలకరించి ప్లాస్క్ లో పాలు గ్లాసులో పోసి ఒక ప్లేట్లో బజారు సరుకుపెట్టి చేతికిచ్చింది. ఎప్పుడూ అమ్మమ్మ జంతికలు చేగోడీలు కారప్పూస జేబులో పోసి ఆడుకోవడానికి పంపించడం అలవాటు కిరణ్ కి. అవి తింటూ బయట స్నేహితులతో ఊరంతా బలాదూరుగా తిరిగి రావడం ప్రతి వేసవికాలంలోనీ అనుభవం. 

ఆ ప్లేట్ లో పెట్టిన బజారు సరుకు ఒకటి నోట్లో పెట్టుకునేటప్పటికీ తినబుద్ధి కాలేదు కిరణ్ కి. అమ్మమ్మగారింట్లో ఎంత మార్పు వచ్చింది. ఎప్పుడు బయట సరుకు తీసుకురావడానికి ఇష్టపడని తాతయ్య బజారు సరుకు తీసుకురావడం ఆశ్చర్యంగా ఉంది. కాలం ఎంత మార్పు
 తీసుకొచ్చింది.

 గత సంవత్సరం వరకు కూడా మనవల మీద అభిమానంతో అమ్మమ్మ ఓపిక ఉన్న లేకపోయినా స్వయంగానే స్వీట్లు హాట్లు తయారు చేసేది అని మనసులో అనుకున్నాడు కిరణ్. 

కిరణ్ బట్టలు మార్చుకుని స్నేహితులను కలిసి వస్తానని చెప్పి అలా బయటకు బయలుదేరాడు. ఊరంతా సందడిగా ఉంది. వెంకటేశ్వర స్వామి గుడి అంతా భక్తులతో నిండిపోయింది. రకరకాల షాపులు హోటల్స్ బట్టల షాపులు తో ఊరంతా నిండిపోయింది. భక్తుల కోసం లాడ్జిలు కూడా కట్టారు. ఆటోలు సందడి ఎక్కువైంది.
 చిన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా ఈజీగా జరిగిపోయేది. ఇప్పుడు దర్శనం కోసం లైన్ లో చాలామంది నిలబడి ఉన్నారు. ఊరంతా మారిపోయింది. తారు రోడ్లు వేశారు. చిన్నప్పుడు తిరిగిన తోటలలో పెద్ద పెద్ద బిల్డింగ్ లు కట్టేశారు. పేరుకి పల్లెటూరి కానీ పట్నవాసపు ఛాయలు ఎక్కువగా కనబడ్డాయి. ఇద్దరు స్నేహితులు కనబడ్డారు కానీ ఎందుకో ఇదివరకు ఆప్యాయత కనపడలేదు. అందరూ ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్లే కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి రకరకాలుగా మాట్లాడేస్తున్నారు. ఏమిటో ఈ గొప్ప అర్థం కాలేదు కిరణ్ కి 

అలా వాళ్ళ మధ్య ఎక్కువసేపు గడపలేక ఇంటికి తిరిగి వచ్చేసి స్నానం చేసి వచ్చేటప్పటికి ప్లేట్లో పుల్కాలు పెట్టి కూర వేసి ఇచ్చింది కిరణ్ కి సరస్వతమ్మ. అతి కష్టం మీద టిఫిన్ తిని మజ్జిగ తాగి టీవీ చూడడం మొదలుపెట్టాడు కిరణ్. సరస్వతమ్మ పరంధామయ్య కూడా టిఫిన్ తినేసి గుప్పెడు మందులు వేసుకుని కిరణ్ పక్కన కూర్చున్నారు.  

ఏమిటో పాపం అమ్మమ్మ తాతయ్య పరిస్థితి ఏ విధంగానూ బాగోలేదు. నలుగురు పిల్లలు ఉండి ఈ వయసులో ఒంటరిగా ఉండడం ఏమీ బాగాలేదు. ఏదైనా అత్యవసరం వచ్చిన పలికే దిక్కులేదు. పాపం ఆ హోటల్ తిండితోటి ఏదో కాలక్షేపం చేస్తున్నారు. అంటే పిల్లలు ఎవరికి ఈ విషయం తెలియదా !అమ్మ కూడా ఎప్పుడు ఏమి చెప్పలేదు? ముసలి వాళ్ళయిన తల్లిదండ్రుల రోజువారి జీవితం ఎలా గడుస్తుందో తెలియకుండా ఉన్నారా !   
అయినా పరంధామయ్య గారి పిల్లలు ఎవరు ఫోన్ చేసిన వాళ్ల రోజువారి జీవితం ఎలా గడుస్తుందో అని ఎవరు అడగట్లేదు ఏమిటి? అని అనుకున్నాడు కిరణ్. 

అలా ఒక రోజు తాతయ్యని అమ్మమ్మని నేను ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి ఇక్కడ ఒంటరిగా వద్దు. 

అక్కడే వేరే ఇల్లు తీసుకుని ఉందాము అని కిరణ్ అడిగిన ప్రశ్నకి లేదురా! మాకు అలవాటైన ఇల్లు ,అలవాటయిన ఊరు అలవాటైనా మనుషులు ఆ ఊళ్ళల్లో మేము ఉండలేము. మాకు వయసు మీరి పోయింది. రేపు ఎప్పుడైనా ఏదైనా జరగరానిది జరిగితే అద్దె ఇళ్లల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలుసు. మీరు బాధలు పడలేరు అంటూ చెప్పిన సమాధానానికి కిరణ్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు.

మరి ఇప్పుడు ఎలాగా? ఇంతకాలం వీళ్ళు ఇలా బాధలు పడుతున్నారని తెలియదు. తెలిసిన తర్వాత వదిలేసి వెళ్లడం ఎలాగా!.

ఆ రోజు రాత్రి అంతా ఆలోచించి మర్నాడు క్యారేజీ ప్రతిరోజు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే ఏర్పాటు చేసి అమ్మమ్మకి తాతయ్యకి సహాయం గా ఉండడానికి రాత్రి పగలు కూడా అక్కడే ఉండడానికి ఊర్లో బాగా ఎరుగున్న వ్యక్తిని ఒకడిని పెట్టి తాతయ్య బెంగపెట్టుకుంటున్న బ్యాంకు పనులన్నీ పూర్తి చేసి 
ఈ విషయాలన్నీ కుటుంబ సభ్యులందరికీ ఫోన్ చేసి చెప్పి ప్రతి వారం అందరూ గ్రూప్ కాల్ లో తాతయ్య అమ్మమ్మతో మాట్లాడుకునే విధంగా ఏర్పాట్లు చేసి ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాడు కిరణ్. 

 కిరణ్ ఊరికి వెళ్ళిపోయిన కొద్దిరోజులకి సరస్వతమ్మ సంధ్యతో తో ఫోన్ కాల్ లో మాట్లాడుతూ నీ కొడుకు చాలా తెలియని వాడే అమ్మాయి. 
ఇక్కడ వచ్చి మా పరిస్థితులు చూసి మంచి పరిష్కారం చేశాడు. సమయానికి క్యారేజీ ఇంటికి వచ్చేస్తోంది. ఇదివరకు మన దగ్గర పని చేసిన వాడిని మాకు సహాయంగా పెట్టాడు కదా! అలవాటైన మనిషి మమ్మల్ని బాగానే చూసుకుంటున్నాడు అంటూ సంతోషంగా చెప్పిన అమ్మమ్మ మాటలు కిరణ్ కి "లేదు అమ్మమ్మ తాతయ్య సమస్యకి తాత్కాలిక పరిష్కారం చేశాను. 

ఆ చిన్న పరిష్కారానికి వాళ్లు సంతోషపడుతున్నారు. పెద్దవాళ్ల కోరికలు పెద్ద ఖర్చులతో కూడుకున్నవి కాదు. చిన్న చిన్న సహాయాలకే వాళ్ళు ఉప్పొంగి పోతారు. ఈ తాత్కాలిక పరిష్కారం ఈ సమస్యని కొంతకాలం మాత్రమే ముందుకు నెట్టగలదు. ప్రస్తుతానికి నేను చేయగలిగిన సహాయం చేశాను. కానీ కన్న తల్లిదండ్రులని తమతో ఉంచుకోవాల్సిన బాధ్యత ఎప్పటికైనా కడుపున పుట్టిన పిల్లలదే అని అనుకున్నాడు కిరణ్.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279