ఇంటి దొంగ
తెల్లారేసరకల్లా ఊరంతా గుప్పు మంది ఆ ఊరి ప్రెసిడెంట్ గారి ఇంట్లో దొంగతనం వార్త. అసలే ఊరు ప్రెసిడెంట్ ఊరు జనం అంతా పరామర్శించడానికి వచ్చి ఆ వార్తలు విని భయంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వేసవి కాలం కదా అప్పట్లో అందరూ వీధుల్లో మంచాలు వేసుకుని పడుకునేవారు. అంత భయాలు ఉండేవి కాదు అంతవరకు. ఆరోజు కూడా అలాగే వీధిలో చల్లగాలి కి నిద్ర పట్టేసి అర్ధరాత్రి బాత్ రూమ్ కి వెళ్ళవలసి వచ్చి లేచిన ప్రెసిడెంట్ రామరాజుకి గదిలో ఏదో శబ్దం అవుతున్నట్లు వినపడింది.
లైట్ వేసేటప్పటి ఎవరో నలుగురు మనుషులు పెట్టె మోసుకుని పారిపోతున్నారు. గబగబా గదిలోకి వెళ్లి చూసేటప్పటికి ఉండవలసిన చోట కావిడి పెట్టి కనబడలేదు. కావిడ పెట్టి నిండా వెండి సామాన్లు . రామరాజు గారి అబ్బాయి పెళ్లికి వచ్చిన సామాన్లు రామరాజు గారు వైద్యం చేసేటప్పుడు పేషెంట్లు ఇచ్చే బహుమతులు పెద్ద కావిడి పెట్టి లో దాచుకున్నారు. పాపం రమారమి 30 సంవత్సరముల కష్టార్జితం.
ఒక్కసారి ప్రెసిడెంట్ రామ రాజు గుండె గుభేలు మంది. ఇంకేముంది లబోదిబో మంటూ అరిచేసరికి చుట్టుపక్కల జనం పోగయ్యారు. అప్పటికే దొంగలు పారిపోయారు. దొంగలు వెళ్లిన వైపు జనం పరిగెడితే పశువులు పాక దగ్గర దొంగలు వదిలేసి వెళ్లిన కావిడి పెట్టి కనబడింది. వెండి సామాన్లు లేవు. నూతి గట్టు మీద అన్నం తెల్లటి పొడి ఒక పేపర్ లో వేసి కనపడింది . అది ఊర కుక్కలకు మత్తుమందు. దొంగతనం చేసే వాళ్ళు కూడా పగడ్బందీగా ప్రణాళిక వేసుకుని బరిలోకి దిగుతారు. లేదంటే ఏముంది. కటకటాలు లెక్క పెట్టవలసిందే.
పోయిన సొమ్ము అప్పట్లో చాలా ఎక్కువ అని ఎన్ని సంవత్సరములు కష్టపడితే అంత సొమ్ము సంపాదించగలమని ఆలోచించి రామరాజు గారు పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. ఇంకేముంది ఊరి ప్రెసిడెంట్ గారు అందులో పోయిన సొమ్ము ఎక్కువ పోలీసులు వెంటనే కుక్కలతో సహా రంగంలోకి దిగారు. అప్పట్లో కుక్కల్ని తీసుకొచ్చేంతటి దొంగతనం ఆ ఊర్లో అప్పటివరకు జరగలేదు. రకరకాల ప్రశ్న లు వేసి రిపోర్ట రాసుకుని కుక్కల్ని వదిలిపెడితే పెరట్లో ఉన్న పశువులు పాక వరకు వచ్చి కుక్కలు అక్కడ నుంచి పొలాల లోకి కొంతవరకు పరిగెత్తి ఆగిపోయే యి. ఆ ఇంట్లో ఉన్న పని వాళ్లని అనుమానంగా ప్రశ్నించారు పోలీసులు. అది మామూలే అంతేగాని ఎవరిని అకారణంగా అరెస్టు చేయలేదు
అప్పటినుండి ఆ ఊర్లో దొంగతనాల కబుర్లు ఎక్కువ అయ్యాయి. మళ్లీ ఎక్కడ దొంగతనం జరగకపోయినా అక్కడ దొంగ ని చూశామని గోడవారగా వెళుతున్నాడని ముసుగేసుకున్నాడని రోజుకో వార్త రచ్చబండ దగ్గరికి మోసుకొచ్చి చూసినట్టు చెప్తున్నాడు శివాలయం పూజారి భాస్కరం. పగలు శివార్చన చేస్తూ రాత్రిపూట చతుర్ముఖ పారాయణం చేస్తుంటాడు సదరు వ్యక్తి. రాత్రంతా నిద్ర లేకుండా మత్తుగా ఊగుతూ చెప్పే మాటలకు ఒకదానికొకటి పొంతన ఉండదు. అయినా ఆ సమయం ఏమో చెప్పలేం అసలు ఒక చోట దొంగతనం జరిగింది.అందుకే పెద్దలు రాత్రంతా లైట్లు వేసుకుని కాలక్షేపం చేసేవారు.
ఒకసారి మనసులో భయం పట్టుకుంటే చీకట్లో నల్లటి వస్తువు ఏది చూసినా అది దొంగని చాలా రోజులు భయపడే వాళ్ళు ఆ ఊరి వాళ్ళు. అసలే వేసవికాలం దానికి తోడు వెన్నెల ఆ రాత్రివేళ చెంబు పుచ్చుకుని ఖాళీగా ఉన్న పంట చేలోకి వెళ్ళిన ఒక యువతికి ఎదురుగుండా నల్లని ఆకారం కనబడే సరికి దొంగ దొంగ అని అరుచుకుంటూ వచ్చేసరికి అరుగుల మీద కూర్చున్న ఊరి జనం పరిగెత్తుకుని వెళ్లేసరికి అక్కడ నల్లటి ఆవు కనిపించింది. ఆ రోజుల్లో వేసవికాలంలో పంట పొలాల్లో పశువుల మందలు కట్టేవారు.
ఆ సంఘటన చూసి అందరికీ భయం నవ్వు కూడా వచ్చే యి ఇలాంటి సంఘటనల తో భయం భయంగా కాలక్షేపం చేస్తున్న ఆ ఊరి వాళ్లకే తెల్లవారి లేచేటప్పటికి మరో పిడుగు లాంటి వార్త మోసుకొచ్చాడు పూజారి భాస్కరం.. దేవుడి గుడిలో దొంగలు పడ్డారని అమ్మవారి కిరీటం కళ్ళు శఠగోపం వెండి పళ్ళెం శివుడి ధారా పాత్ర దీపపు సెమ్మెలు శివుడి మందిరం మొత్తం పట్టుకెళ్ళిపోయారని పూజారి భాస్కరం చెప్పుకుంటూ వచ్చాడు.
వెంటనే శివాలయానికి వెళ్ళిన రామరాజు ఆలయం అంతా బోసిగా ఉండటం చూసి తాళాలు నీ దగ్గరే ఉన్నాయి గా రాత్రి ఎన్ని గంటలకు తలుపు వేశావు అని ప్రశ్నించాడు పూజారి నీ. రాత్రి ఎప్పటిలాగే 8 గంటలకే గుడి తలుపులు వేశానని గుడి తాళాలు తన దగ్గరే ఉన్నాయి అని చెప్పుకుంటూ వచ్చాడు పూజారి. కానీ తాళాలు బద్దలు కొట్టినట్లుగా కనబడింది. చేసేదేమీ లేక ఆ ఊరి ప్రెసిడెంట్ పోలీస్ కేసు పెట్టారు. ఈ లోగా ఎవరో తన దూరపు బంధువులు పోయారని అందుకుని విజయవాడ వెళుతున్నానని రామరాజుకి చెప్పి భాస్కరం విజయవాడ వెళ్లిపోయాడు.
పోయిన సొమ్ము ఎక్కువ కాకపోయినా పది రోజులు తేడాలో ఆ ఊర్లో జరిగిన రెండో దొంగతనం కారణంగా పోలీసులు కుక్కల్ని తీసుకొచ్చి తనిఖీ ప్రారంభించారు. పోలీస్ కుక్కలు గుడి అంత తిరిగి గుడి వెనకాల ఉన్న పాడుబడిన చెరువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ మొరగడం ప్రారంభించాయి. ఆ చెరువు నిండా కలుపు మొక్కలు చుట్టూ ముళ్ళ పొదలు ఉన్నాయి. ఆ చెరువు వాడడం మానేసి చాలా కాలo అయిందని రామరాజు గారు పోలీసులతో చెప్పారు. అక్కడ కుక్కలు ఎందుకు మొరిగాయో పోలీసులకు అర్థం కాలేదు. చాలాసేపు ఆ చుట్టుపక్కల వెతికిన ఏమీ ఆచూకీ దొరకలేదు.
ఇలా వారం రోజులు గడిచేయి. ఒకరోజు ఉదయమే పూజారి భాస్కరం గుడి వెనకాల చెరువు గట్టుమీద చనిపోయి ఉన్నాడనీ కబురు తెలిసింది రామరాజుకి. రామరాజు వెళ్ళేటప్పటికి భార్య పక్కన ఏడుస్తూ కనబడింది. రాత్రి ఇంట్లోనే పడుకున్నాడని ఎప్పుడు లేచి బయటకు వెళ్ళాడో తెలియదని చెప్పుకుంటూ వచ్చింది. అంటే భార్య కూడా తెలియకుండా రాత్రిపూట బయటకు వెళ్తాడు అన్నమాట అనుకున్నాడు రామరాజు . ఆ తర్వాత కొద్ది కాలానికి దొంగలు దొరికారని పోలీస్ స్టేషన్ నుండి కబురు వస్తే పక్క ఊరికి వెళ్లిన రామరాజుకి దిమ్మతిరిగే కబురు తెలిసింది.
తీరా దొంగల్ని చూస్తే ఆ ఊరి వాళ్లే పైగా రామరాజు గారు పొలంలో ఇదివరకు పని చేసిన వాళ్లే అంతే కాదు రామరాజు గారి ఇంట్లోనీ వెండి సామాన్లతో పాటు దేవుడి గుడిలో నగలను కూడా తామే తీశామని తమలో పూజారి భాస్కరం కూడా ఒక సభ్యుడని ఆశ్చర్యపరిచే విషయం చెప్పి దేవుడి నగలు ఎవరో వస్తున్న అలికిడి అయితే ఆ చెరువులోకి విసిరేసామని చెప్పుకుంటూ వచ్చిన దొంగల మాటలకి ఆశ్చర్యపోయారు రామరాజు. అంతే కాదు పగలు తాము పొలాల్లో పని చేస్తామని రాత్రిపూట దొంగతనాలు చేస్తావని నిర్భయంగా చెప్పారు. రామరాజు గారు సొమ్ము దొరికింది. ఇంటికి వచ్చి చెరువు అంత శుభ్రం చేయించగా దేవుడి సొమ్ము కూడా దొరికింది. అంతవరకు ఏనాడు భర్త గురించి ఒక మాట కూడా చెప్పని పూజారి భాస్కరం భార్య తన భర్తకి సప్త వ్యసనాలు ఉన్నాయి అని చెప్పింది. ఎవరైనా సరే దేవుడు సొమ్ము అన్యాయంగా తింటుంటే దేవుడు కూడా సమయం కోసం వేచి చూస్తాడు. పాముకాటు మూలంగా భాస్కరం చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది . తప్పు చేస్తే దేవుడు ఊరుకుంటాడా. ఆ తర్వాత ఊళ్లో ఎప్పుడు దొంగతనాలు కూడా లేదు. ఇంటి దొంగని ఈశ్వరుడే పట్టుకున్నాడు. ఆ తర్వాత పూజారి భాస్కరం పిల్లలు ఇద్దరు మలేరియా జ్వరం వచ్చి చనిపోయారు. భార్య ఊరు వదిలి ఎటో పోయింది. పూజారి భాస్కరం తల్లి చాలా రోజుల వరకు ఆ ఊర్లోనే దిక్కు మొక్కు లేకుండా అందరి ఇంటిదగ్గర బిక్షం ఎత్తుకుని కాలక్షేపం చేసేది. కొద్దిరోజులకి ఆవిడ కూడా దిక్కులేని చావు చచ్చింది.
దేవుడు ఏమీ మాట్లాడడని మనం ఇష్టం వచ్చినట్లుగా దేవుడు విషయంలో వ్యవహరిస్తే కఠినమైన శిక్ష ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. భగవంతుడు శిష్ట రక్షణ తోపాటు దుష్ట రక్షణ కూడా చేస్తాడు కదా మరి.
రచన మధునా పంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279