Read Annapoornamma by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • వీలునామా

    వీలునామా " నాన్న ఇంకా నాలుగు ముద్దలే ఉన్నాయి ఇది మీ తాత ముద్...

  • కన్యాదానo

    కన్యాదానంఉదయం 10 గంటలు అయింది.పరంధామయ్య గారు అప్పుడే టిఫిన్...

  • రక్తం చిమ్మిన రాత్రి

      రక్తం  రాత్రిఉదయం ఏడుగంటల సమయం...ఉత్తరప్రదేశ్‌లోని బడౌత్‌...

  • గురు దక్షిణ

    గురుదక్షిణసాయంకాలం నాలుగు గంటలు అయింది. వీధి అరుగు మీద కూర్చ...

  • అన్నపూర్ణమ్మ

    అన్నపూర్ణమ్మ" చూడు కనకమ్మ రెండో పెళ్లి వాడని ఇంకేమీ ఆలోచించక...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అన్నపూర్ణమ్మ

అన్నపూర్ణమ్మ

" చూడు కనకమ్మ రెండో పెళ్లి వాడని ఇంకేమీ ఆలోచించకు. కుర్రవాడు నాలుగు వేదాలు చదివిన పండితుడు. యజ్ఞాలు యాగాలు చేయించడంలో దిట్ట. వయసు గురించి ఆలోచించకు. ఆ ఊర్లో లంకంత కొంప సొంత వ్యవసాయం ఆవులు గేదెలు చెప్పాలంటే వాళ్లకు ఏమీ లోటు లేదు. మొదట మేనమామ కూతుర్నే చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక కూతురు పుట్టిన తర్వాత చనిపోయింది. కూతురుకి పెళ్లి చేసినప్పటికీ భర్త కూడా పోయాడుట. మేనమామకు ఒక్కతే కూతురు . మేనమామ అతని భార్య ,భర్త పోయిన కూతురు ఈ పెళ్ళికొడుకు దగ్గరే ఉంటారు. కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించకు. మన అన్నపూర్ణమ్మ అన్ని విధాలా తగిన సంబంధం. తండ్రి లేనీ పిల్లలకి సంబంధాలు ఎలా వెతుకుతావ్. నేను నీ మంచి కోరే చెబుతున్నాను అంటూ గబగబా చెప్పేసి కనకమ్మ గారు ఇచ్చిన మంచినీళ్లు తాగేసి వెళ్ళిపోయాడు పెళ్లిళ్ల పేరయ్య నారాయణ శాస్త్రి

నారాయణ శాస్త్రి గారు వెళ్లిపోయిన తర్వాత కనకమ్మ గారు ఆలోచన పడింది. తండ్రి లేని పిల్లలు. తగినంత ఆర్థిక స్తోమత కూడా లేదు. వచ్చిన సంబంధం కాదనుకోవడం ఎందుకు అనుకుంటూ తన అంగీకారం తెలియజేసింది. ఆడపిల్ల వారి పరిస్థితి నారాయణ శాస్త్రి గారి ద్వారా విని పెళ్లికి ఉభయ ఖర్చులు భరిస్తామని పెళ్ళికొడుకు పరమేశ్వర శాస్త్రి కబురువంపాడు. 

ఇంకేముంది వెంకటేశ్వర స్వామి గుళ్లో అంగరంగ వైభవంగా అన్నపూర్ణమ్మ పెళ్లి జరిగిపోయింది. ఊరి వాళ్లంతా అన్నపూర్ణమ్మ చాలా అదృష్టవంతురాలని సంతోష పడ్డారు. పెళ్ళికొడుకు వయసు తెలియట్లేదు చాలా అందంగా ఉన్నాడు పైగా శాస్త్రాలు చదువుకున్నవాడు అంటూ అందరూ గొప్పగా చెప్పుకున్నారు. ఒక శుభ ముహూర్తంలో అత్తవారింట్లో అడుగు పెట్టిన అన్నపూర్ణమ్మకి వయస్సు పదిహేనేళ్లు. పరమేశ్వర శాస్త్రి గారి కూతురు సోమి దేవమ్మ అన్నపూర్ణమ్మ కంటే పెద్దది . ఇలా కాపురానికి వచ్చిన వెంటనే అన్నపూర్ణమ్మ కి ఇనప్పెట్టి తాళాలు ఇవ్వలేదు కానీ వంటింటి తాళాలు మటుకు అప్పచెప్పేశారు. 

చిన్నప్పటినుంచి తల్లితో తప్పితే మిగతా ఎవరితోనూ మాట్లాడకుండా పెరిగిన అన్నపూర్ణమ్మకి సవితి కూతురుతో గాని వారి అమ్మమ్మ గారితో కాని మాట్లాడాలంటే భయం భయంగా ఉండేది. ఏది ఎక్కడుందో తెలియదు. ఏమి వండాలో తెలియదు. ఉదయం లేచి తల స్నానం చేసి మడిగట్టుకుని వంట వండితే గాని ఎవరు తినేవారు కాదు. కాఫీ టీలు అసలే లేవు. చద్దన్నం అసలు తినకూడదు. ఉదయం లేచి సంధ్యావందనం చేసుకుని యజ్ఞ యాగాలు చేయించడానికి వెళ్ళిపోయిన భర్త మధ్యాహ్నం ఒంటి గంట రెండు గంటల మధ్య భోజనానికి వచ్చేవాడు. అంతవరకు అన్నపూర్ణమ్మ గారు ఏమి తినడానికి లేదు. సవితి కూతురు సోమిదేవమ్మ శాస్త్రి గారి మొదటి భార్య తల్లిదండ్రులు 11 గంటలకే భోజనాలు చేసి విశ్రాంతి తీసుకుంటూ ఉండేవారు. 
అన్నపూర్ణమ్మ భర్త వచ్చిన తర్వాత ఆయన తిన్న కంచంలో అన్నం తినేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేది. పరమేశ్వర శాస్త్రి గారు భోజనం చేసిన వెంటనే పడగదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకునేవారు. అన్నపూర్ణమ్మ గారు అలా వంటింటి గడప మీద తల పెట్టుకుని నిద్రపోయేది. సాయంకాలం పూట ఎవరూ భోజనాలు చేసేవారు కాదు. ఆ రోజుల్లో ఉప్పి పిండి ఎక్కువగా చేసుకునేవారు. పాపం చిన్న పిల్ల ,ఇంటి దగ్గర అయితే కనకమ్మ గారు రెండు పూటలు అన్నం పెట్టేది. ఇక్కడకు వచ్చిన తర్వాత ఆ టిఫిన్ అరగక అన్నపూర్ణమ్మకి కడుపు నొప్పి కూడా వచ్చేది. 
భర్త నిద్ర నుంచి లేచి మళ్లీ స్నానం చేసి పొలం వెళ్ళిపోయేవాడు. పొలం నుండి తిరిగి వచ్చి టిఫిన్ చేసి తెల్ల లాల్చి పైజామా తొడుక్కుని సెంటు కొట్టుకుని గుర్రం బండి ఎక్కి ఎక్కడికో రోజు వెళ్లేవాడు. వెళ్లే ముందు సవితి కూతురు ఎదో గొణుగుతూ ఉండేది. పరమేశ్వర శాస్త్రి గారు బయటకు వెళ్లే ముందు ఇనప్పెట్టి ఉన్న గదిలోకి వెళ్లి సంచిలో ఏదో పెట్టుకుని వెళ్లి అర్ధరాత్రి ఎప్పుడో తిరిగి వచ్చేవాడు.అప్పుడు ఆయనకి భార్య ఉందనే విషయం అప్పుడు గుర్తుకొచ్చేది
పరమేశ్వర శాస్త్రి గారు ఎక్కడికి వెళ్తున్నారు అనే విషయం అన్నపూర్ణమ్మ గారి కి తెలియదు. పరమేశ్వర శాస్త్రి గారు అలా బయటికి వెళ్ళగానే సవితి కూతురు సోమిదేవమ్మ వారి అమ్మమ్మ తాతగారు ముగ్గురు కలిసి గదిలో ఏదో మాట్లాడుకునేవారు.మళ్లీ అది అన్నపూర్ణమ్మ గారు అదివినకుండా.ఇవన్నీ చూస్తుంటే అన్నపూర్ణమ్మ గారికి ఏo జరుగుతోందో అర్థమయ్యేది కాదు.
 భర్త ఏనాడు అన్నపూర్ణమ్మ గారితో పెదవి విప్పి మాట్లాడలేదు. భర్త గురించి ఎవరిని అడుగుదామన్నా ఇంట్లో ఎవరూ మాట్లాడేవారు కాదు. తల్లికి చెప్పుకుందాం అంటే ఉత్తరం తప్ప మరో దిక్కులేదు. కనకమ్మ గారికి కూడా కూతురు కాపురం చూసి వెళ్లే ఆర్థిక స్తోమత లేదు . వయస్సు పెరిగే కొద్దీ అన్నపూర్ణమ్మ గారికి భర్త ఏదో తేడాగా ఉన్నాడని మటుకు అర్థమైంది. కాలక్రమణా యజ్ఞ యాగాదులు లు తగ్గిపోయేయి. పరమేశ్వర శాస్త్రి గారు మటుకు ఒక్కొక్కసారి పగటి పూట కూడా ఇంట్లో ఉండట్లేదు. భర్త యజ్ఞ యాగాదులలో ముమ్మరంగా పాల్గొనే రోజుల్లో ఇంటి నిండా ఉండే వెండి సామాను క్రమేపి తరిగిపోయింది. ఒకరోజు ఉన్నట్టుండి ఇంట్లో పెద్ద గొడవ అయింది. అన్నపూర్ణమ్మ గారి సవిత కూతురు తాతగారు అమ్మమ్మ గారు పరమేశ్వర శాస్త్రి గారిని గదిలో కూర్చోబెట్టి ఈ పిల్ల బతుకు ఏం చేయదలుచుకున్నావ్. ఉన్నదంతా ఖాళీ చేసేస్తున్నావ్. పొలాలు కూడా అమ్మకం పెట్టినట్లు తెలిసింది. దీని పరిస్థితి ఏం కాను అని గట్టిగా దెబ్బలాడి అప్పటికి మిగిలిన ఉన్న ఆస్తి అంతా సోమి దేవమ్మ గారి పేరు మీద వీలునామా వ్రాయించారు. 

ఇంట్లో ఉన్న అన్నపూర్ణమ్మ గారికి ఈ విషయం తెలీదు. ఒకరోజు గణపతి గారి ఇంటికి పేరంటానికి వెళ్తే గణపతి గారి భార్య అన్నపూర్ణమ్మని పక్కకు పిలిచి భర్త గురించి అన్ని విషయాలు చెప్పి వీలునామా సంగతి కూడా అన్నపూర్ణమ్మ చెవిలో పడేసింది. గణపతి గారి భార్య అన్నపూర్ణమ్మకి దూరపు బంధువులు కూడా.
గణపతి గారు పరమేశ్వర శాస్త్రి ఇద్దరు కూడ స్నేహితులు.
 కలిసి ఒకే గురువుగారి దగ్గర చదువు నేర్చుకున్నారు. అప్పుడు అర్థమైంది ఆ ఇంట్లో పరిస్థితి అన్నపూర్ణ మ్మకి. ఇదివరకు ఇనప్పెట్టి కి తాళాలు వేసుకుని బయటకు వెళ్లే భర్త ఇప్పుడు తలుపులు బార్లా తెరిచి వెళ్ళిపోతున్నాడు. అందులో చిత్తు కాగితాలు తప్పితే ఏమీ లేవు. పరమేశ్వర శాస్త్రి గారి ఒళ్ళు తో పాటు ఇల్లు కూడా గుల్ల అవుతోందనిఅర్థమైంది . మాయలో పడిన మనిషిని ఆపడం ఎవరి తరం.

 ఆ మత్తులో ఉన్న వాళ్ళకి ఎవరు ఎన్ని చెప్పినా ఆ మాయా ప్రపంచమే కనపడుతుంది తప్పితే సత్యం అర్థం కాదు. ఇంటి పరిస్థితి ఇలా అయిపోతో oది .మరి కట్టుకున్న భార్య ఏమిటి అనే ఆలోచన పరమేశ్వర శాస్త్రి గారికి లేదు. ఆయనకు అన్ని అవసరాలు ఇంట్లో తీరిపోతున్నాయి. ఆ రోజుల్లో ఆడవాళ్ళకి చదువు లేకపోవడం మూలంగా అత్తవారింట్లో చుట్టూ ఉండే పరిస్థితుల్ని చాలా కాలం వరకు అర్థం చేసుకోలేకపోయే వారు. భర్త అంటే ఒక దైవంగా భావించేవారు. భర్త మాటకి ఎదురు చెప్పకుండా ఒక బానిసలా బతికేవారు . కానీ అన్నపూర్ణమ్మ గారికి కొంచెం కొంచెం పరిస్థితి ఇప్పుడే అర్థం అవుతో oది.

 ఇంటి పరిస్థితి చూసి రేపటి రోజున తన పరిస్థితి ఏమిటో అని అన్నపూర్ణమ్మ గారు చాలా బాధ పడేవారు. రేపొద్దున్న భర్త గనుక మరణిస్తే సవితి కూతురు ఇంటి నుంచి గెంటేస్తుంది అనే భయం పట్టుకుంది అన్నపూర్ణమ్మ గారికి. ఇప్పటినుంచి అయినా ఏదో విధంగా జాగ్రత్తపడాలి.
అప్పటికే యజ్ఞం యాగాలు క్రమేపి తగ్గిపోయి పరమేశ్వర శాస్త్రి గారు మామూలు పెళ్లిళ్లు చేయించడం మొదలుపెట్టాడు. వేద పండితుడని చెప్పి కొంచెం ఎక్కువ సంభావన ఇచ్చేవారు. అది కూడా ఆ రోజుల్లో వెండి నాణేలు చలామణిలో ఉండేవి. 

మహా అయితే సంవత్సరానికి ఒక పది పెళ్లిళ్లు చేయించేవారు. అప్పట్నుంచి అన్నపూర్ణ మ్మ తన జాగ్రత్తలో తాను ఉండేవారు. కొన్ని నాణేలు తీసి ఎవరికీ తెలియకుండా దాచిపెట్టుకునే వారు. కానీ ఇది ఒక రకంగా తప్పు అయిన రేపొద్దున్న ఏదైనా జరగరానిది జరిగితే అన్నపూర్ణమ్మ కు గోదావరి తల్లి దిక్కు. ఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళు ఎవరు దేనికి అప్పటివరకు సహకరించలేదు. మనసు విప్పి మాట్లాడలేదు. ఒక మంచి చెడు చెప్పలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపొద్దున్న ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉండేది అన్నపూర్ణమ్మ. రాత్రిపూట బయటకు వెళ్లే పరమేశ్వర శాస్త్రి గారు వారానికి ఒకసారి మాత్రమే వెళ్లడం మొదలెట్టారు. క్రమేపీ శాస్త్రి గారిని పెళ్లిళ్లుకి కూడా పిలవడం మానేశారు. గోదావరి గట్టుమీద నీటి కాసులు తీసుకుంటున్నాడని అందరూ చెప్పుకునేవారు. నీటికాసులు తీసుకోవడం తప్పేమీ కాదు . కానీ అంతా వేద పండితుడు అలా అయిపోయాడని ఊరి వాళ్ళందరూ చెప్పుకునేవారు. కాలం ఎంతటి వాడినైనా మార్చేస్తుంది. అవసరం కూడా అంతే. ఎంత వేద పండితుడు అయితే ఏమిటి.

ఎప్పుడు బయటకు వెళ్లిన గుర్రపు బండి మీద దర్జాగా వెళ్లే ఆ వేద పండితుడు రెండు కాళ్లకు పని చెప్పాడు. ఈలోగా అన్నపూర్ణమ్మ గారి అమ్మగారు కాలం చేస్తే తన పుట్టింటికి వెళ్ళింది అన్నపూర్ణమ్మ. అక్కడికి వచ్చిన తనకంటే పెద్దవాడైన పినతల్లి కొడుక్కి తన కుటుంబ పరిస్థితి అంతా చెప్పి వెండి నాణాలు మూట చేతిలో పెట్టింది. తిరిగి వచ్చేటప్పుడు ముక్కు పచ్చలారని తన చెల్లెల్ని తమ్ముడిని తనతో పాటు తీసుకుని వచ్చేసింది. ఇన్ని జరుగుతున్న శాస్త్రి గారు ఆ ఊరు వెళ్ళలేదు. ఇంటికి తీసుకువచ్చిన పిల్లలను చూసి మౌనంగా ఉండిపోయాడు తప్పితే ఏవి మాట్లాడలేదు. సవితి కూతురు సోమిదేవమ్మ మాత్రం పిల్లల్ని దగ్గరికి తీసుకుంది. ఈ చర్య అన్నపూర్ణమ్మ గారికి చాలా విచిత్రం అనిపించింది.

ఇన్నేళ్లు కాపురం చేసిన అన్నపూర్ణమ్మకి పిల్లలు పుట్టలేదు. సోమిదేవమ్మ గారికి అవకాశమే లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు పిల్లలు రావడంతో సందడి మొదలైంది. ఇప్పుడు ఈ పిల్లలిద్దర్నీ పైకి తీసుకురావాలని ఉద్దేశంతో అన్నపూర్ణమ్మ గారు తమ్ముడిని చెల్లిని ధైర్యం చేసి ఆ గ్రామంలో ఉండే హై స్కూల్లో జాయిన్ చేసింది. 

అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు చెల్లెలు బుద్ధిగా చదువుకుంటూ అక్క గారితో చాలా ప్రేమగా ఉండేవారు . పిల్లలు ఒక్కొక్క క్లాసు పూర్తిచేసుకుని హై స్కూల్ చదువు పూర్తి చేశారు. ఆ రోజుల్లో చదువు గురించి సలహా ఇచ్చే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు
 అన్నపూర్ణమ్మ గారు పెద్దగా చదువుకోలేదు. పరమేశ్వర శాస్త్రి గారి మీద ఆశ లేదు. ఆ ఊరి హై స్కూల్ హెడ్మాస్టర్ గారితో సంప్రదించి పిల్లలు ఇద్దరినీ కాలేజీలో జాయిన్ చేశారు. 

ఈలోగా పరమేశ్వరి శాస్త్రి గారి మేనమామ వారి భార్య కూడా ఒకరి తరువాత ఒకరు కాలం చేశారు. వాళ్లు పోయిన తర్వాత సోమిదేవమ్మ గారిలో కూడా విపరీతమైన మార్పు వచ్చింది. రోజు అన్నపూర్ణమ్మ గారి తోటి మంచి చెడ్డ మాట్లాడడం తండ్రి గురించి బాధపడటం ఇదివరకు చెప్పని ఇంటి విషయాల్ని పంచుకోవడం అన్నపూర్ణమ్మ గారి తమ్ముడిని చెల్లిని ప్రేమగా చూసుకోవడం మొదలు పెట్టింది. చుట్టపు చూపుగా వచ్చిన అన్నపూర్ణమ్మ గారి పిన తల్లి కొడుకు అన్నపూర్ణమ్మ గారు ఇచ్చిన సొమ్ముతో ఒక ఎకరం భూమి కొని ఆ కాగితాలు ఎవరు చూడకుండా అన్నపూర్ణమ్మ గారికి ఇచ్చారు. అన్నపూర్ణమ్మ గారికి ఒకసారి గా కళ్ళ నీళ్లు వచ్చాయి. ప్రతి యేటా సంక్రాంతికి , శిస్తు తీసుకొచ్చి ఇస్తానని చల్లగా ఒక కబురు చెప్పి వెళ్లారు. ఆ రోజుల్లో అభిమానాలు అలా ఉండేవి. అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు చెల్లెలు కూడా కాలేజీ చదువులు పూర్తి చేసుకుని టీచర్ ట్రైనింగ్ లో జాయిన్ అయ్యారు. ఆ రోజుల్లో టీచర్ ఉద్యోగాలు ఇట్టే వచ్చేసేవి. 
ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. అన్నపూర్ణమ్మ గారి తమ్ముడు చెల్లెలికి కూడా టీచర్లుగా పక్క ఊర్లో ఉద్యోగాలు వచ్చే యి. పరమేశ్వర శాస్త్రి గారికి ఆరోగ్యం పాడయి మంచం పట్టి కొద్ది కాలానికి మరణించారు. 

విధి చాలా విచిత్రంగా ఉంటుంది.అన్నపూర్ణమ్మ గారు తమ్ముడు చాలా శ్రద్ధ భక్తులతో బావగారి కర్మకాండ్లన్నీ పూర్తి చేసాడు. బంధువులంతా వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో సోమిదేవమ్మ గారు లోపల నుంచి రెండు కాగితాలు తీసుకొచ్చి అన్నపూర్ణమ్మ గారి చేతిలో పెట్టింది. 

"చూడు పిన్ని నాన్న పరిస్థితి మొదటి నుంచి నాకు తెలుసు. అమ్మ పోయిన తర్వాత తిరగడం మరీ ఎక్కువైపోయింది. నేను ఈ పెళ్లి చేసుకోవద్దని మొత్తుకొని మరీ చెప్పాను. అందులో మరి వయసు బాగా తేడా. నీ గొంతు కోయొద్దని కూడా చెప్పాను. నాన్న వినలేదు. ఆస్తి కూడా పాడు చేయడం మొదలెట్టాడు. నువ్వు వచ్చిన తర్వాత నీకు ఏమీ ఈ విషయాలు తెలియవు. నీ వయసు కూడా అది అర్థం చేసుకోలేదు. నువ్వు అన్యాయం అయిపోతావ్ అని నాకు ఎప్పటినుంచో మనసులో బాధగా ఉండేది. అందుకే నేను మా తాతయ్య నాన్నతో దెబ్బలాడి అప్పటికి మిగిలి ఉన్న ఆస్తి నీ పేరు మీద వీలునామా వ్రాయించాను. ఊరి వాళ్ళందరూ ఆస్తి నేను వ్రాయించుకున్నానని రకరకాలుగా చెప్పుకున్నారు. నేను అలాంటి వాటికి భయపడను.నాకు నా భర్త ద్వారా వచ్చిన ఆస్తి ఉంది. మా మరిది గారు ప్రతి ఏటా శిస్తు తెచ్చి ఇస్తుంటారు. మా అత్త వారు చాలా మంచివారు. మొదట్లో నువ్వంటే నాకు ఇష్టం లేకపోయినా ఒక సాటి ఆడదానిగా తర్వాత నీకు కూడా సహాయం చేసి ఇంటి పరువుని కాపాడాలని ఉద్దేశంతో నాన్నతో దెబ్బలాడేను.

నువ్వు కూడా నన్ను తప్పుగా అనుకున్నావు.నాన్నకు ఆరోగ్యం బాగోలేదు అని నాకు ముందుగానే తెలుసు. అందుకే నీ తమ్ముడిని చెల్లెల్ని ఇంటికి తీసుకువచ్చిన మనకి భవిష్యత్తులో సాయంగా ఉంటారని నేను కూడా ఆలోచించాను. మనిద్దరికీ కూడా పిల్లలు లేరు. రేపొద్దున కాలు చేయి వంగితే ఎవరు చూస్తారు అంటూ సోమదేవమ్మ పినతల్లిని పట్టుకుని ఏడ్చింది. చూడు నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. అందరం కలిసే ఉందాం. ఈ పిల్లలు మనకు దేవుడిచ్చిన పిల్లలు అంటూ అన్నపూర్ణమ్మ గారి తమ్ముడిని చెల్లిని దగ్గరకు తీసుకుంది. వాళ్ళ అప్పడికి పిల్లలు కాదు పెద్దవాళ్ళు అయిపోయారు. అన్నపూర్ణమ్మ గారికి గారికి ఎక్కడలేని దుఃఖం పొంగుకు వచ్చింది. చూడమ్మా మీ నాన్నగారు ఏనాడూ ఏ ఆస్తి విషయం చెప్పలేదు. కానీ నాతో ప్రేమగా మాట్లాడడం గాని ఏం సంగతులు చెప్పడం గాని చేయలేదు. ఎప్పుడూ ఆ మోజులోనే ఉండేవారు. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలియదు. అయినా ఇన్నాళ్ళు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా కాలక్షేపం చేస్తూ వచ్చా ను. ఈమధ్య నా గురించి నేను ఆలోచించుకోవడం మొదలుపెట్టి మీ నాన్నగారు సంపాదించిన సొమ్ము కొంత జాగ్రత్త చేసి మా ఊర్లో ఒక ఎకరం భూమి కొన్నాను అంటూ నిజాయితీగా ఉన్న విషయం చెప్పేసింది. అలా అన్నపూర్ణమ్మ గారి నిజాయితీకి సోమిదేవమ్మ మెచ్చుకుని మరింత దగ్గర అయింది

అలా సోమి దేవమ్మ అన్నపూర్ణమ్మ గారు కలిసి తమ్ముడికి చెల్లెలికి పెళ్లిళ్లు పేరంటాలు చేసి కాలక్షేపం చేస్తుంటే కాలం ఆ పెద్ద వాళ్ళిద్దర్నీ తీసుకుని వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ గారు తమ్ముడు అక్క గారితో పాటు సోమి దేవమ్మ గారి రుణం కూడా తీర్చుకున్నాడు.

ఆ రోజుల్లో అత్తవారింట్లో ఎన్ని బాధలు పడినప్పటికీ స్త్రీలు పుట్టింటికి వచ్చేవారు కాదు. ఇక్కడ అన్నపూర్ణమ్మ గారి పరిస్థితి చూడండి . ఒక అయోమయ జీవితాన్ని గడిపిన ఆమె భర్త నుండి విడిపోకుండా అలా గుట్టుగా కాలక్షేపం చేస్తూ తనకి దేవుడిచ్చిన బాధ్యతలు అన్నింటినీ సక్రమంగా నిర్వర్తించి ఒక మహా మనిషిగా లోకం దృష్టిలో మిగిలిపోయింది. అంటే ఆమెకున్న ఒకే ఒక ఆయుధం సహనం. ఎన్నో కష్టాలు అవమానాలు ఓర్చుకుంటూ వచ్చింది. తన జీవితం పాడైన అవసరమైన తమ్ముడికి చెల్లికి తోడుగా నిలిచి జన్మ ధన్యం చేసుకుంది అన్నపూర్ణమ్మ. అటువంటి స్త్రీ మూర్తులు ఎంతోమంది ఉండేవాళ్ళు ఈ లోకంలో ఒకప్పుడు. అందరికీ మరొక్కసారి వందనాలు.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279

.