Read Kanakaiah's grandfather by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • రాత్రి.. ఆ కోట

    "రాత్రి.. ఆ కోట"-- PART 1** ఒక చిన్న గ్రామంలో, ఒక పాత కోట ఉం...

  • కనకయ్య తాత

    కనకయ్య తాతసాయంకాలం నాలుగు గంటలు అయింది. మండువేసవి కాలం.చల్లగ...

  • క్రుంగి మాల

    కరుంగళి మాల అనేది నల్ల తుమ్మ చెక్కతో తయారు చేయబడిన ఒక రకమైన...

  • మన్నించు - 2

    ప్రేమ ఒకరి మీదే పుట్టి ఒకరితోనే ఆగిపోవాలి అని  లేదు అన్నప్పు...

  • ఫేస్బుక్ రిక్వెస్ట్

    హాయ్‌... ఏంటీ నిన్న టచ్‌లో లేవు... ఎటెళ్లావు?’’‘‘నా బాయ్‌ఫ్ర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

కనకయ్య తాత

కనకయ్య తాత

సాయంకాలం నాలుగు గంటలు అయింది. మండువేసవి కాలం.
చల్లగాలి కోసం వీధిఅరుగు మీద కూర్చున్న కనకయ్య తాతకి గుమ్మo ముందు రిక్షా ఆగి అందులోంచి ఒక జంట దిగుతూ కనబడ్డారు. 
"
రండి బావగారు ఏమ్మా సుమతి ఎలా ఉన్నావ్? ఇద్దరు లోపలికి 
రండి అంటూ హాల్లోకి తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టాడు.
 ఇంతలో కనకయ్య తాత భార్య రవణమ్మ గ్లాస్ తో మజ్జిగ
 తీసుకొచ్చి ఇచ్చింది. కుశల ప్రశ్నలు అయ్యాయి.

 ఇంతలో సుమతి బ్యాగ్ లో నుంచి శుభలేఖ తీసి " అన్నయ్య 
 చిన్నమ్మాయికి కూడా పెళ్లి కుదిరింది. ఈ నెల 30వ తారీఖునపెళ్లి ముహూర్తం. నువ్వు మా పెద్ద పిల్ల పెళ్ళికి ఎంతగానో సహాయం చేసావు. నేను ఆ భోజనాలు సంగతి అసలు పట్టించుకోలేదు.గాడి పొయ్యి దగ్గరకి కూడా రాలేదు. అప్పుడు మగ పెళ్లి వారందరూ భోజనాలన్నీ చాలా చాలా బాగున్నాయి అంటూ ఎంతో ఆప్యాయంగా వడ్డించారు అంటూ ఇప్పటికీ చెప్తుంటారు.ఈ పెళ్లి కూడా నీ చేతుల మీదుగానే జరిపించు అన్నయ్య అంటూ శుభలేఖ ఇచ్చి చేతులు పట్టుకుంది. బావగారు మా మీద కాస్త దయ ఉంచండి అంటూ సుమతి భర్త కూడా చేతులు పట్టుకున్నాడు. లేదమ్మా మీరేమీ భయపడకండి. నేను వారం రోజులు ముందు వచ్చి పెళ్లి పనులన్నీ దగ్గరుండి చూసి పిల్లని కాపరానికి పంపేoతవరకు మీ ఇంట్లోనే ఉంటాను . రేపు దశిమి నాడు గణపతి గారి మనవరాలు బారసాల అది అయిపోయిందంటే నేను ఖాళీయే . పాపం ఆ శేషమ్మ మరీ మరి చెప్పింది . లేదంటే రేపే వచ్చేసి ఉండి వాడిని. ఇది అయిపోయింది అంటే మీ దగ్గరికి సరాసరి వస్తాను అంటూ ఆనందంగా చెప్పాడు కనకయ్య తాత. ఈ మాత్రం దానికి ఇంత దూరం రావాలా అమ్మ ఒక కార్డు ముక్క రాసి పడేస్తే వచ్చేసి ఉండేవాడిని కదా అంటూ చెప్పాడు కనకయ్య తాత. అదేమిటి అన్నయ్య మాకు మాత్రం గౌరవం ఉండొద్దు. నేను వచ్చేటప్పుడు నలుగురు కుర్రాళ్ళు ను తీసుకొని వస్తాను . మనకు వడ్డనికి పనికొస్తారు అంటూ చెప్పాడు కనకయ్య తాత.సరే అన్నయ్య మేం బయలుదేరుతాం అంటూ ఆ జంట ఇద్దరూ రిక్షా ఎక్కి వెళ్ళిపోయారు.

చూడ్డానికి ఆరడుగుల పొడుగు నల్లటి శరీరం పంచ కట్టుకుని గుండు మీద పిలక పెట్టుకుని చాలా భీకరంగా కనిపించే పెద్దమనిషి పేరు కనకయ్య. ఊర్లో ఉండే సొంతింట్లో కాపురం ఉండి కొద్దిగా ఉన్న వ్యవసాయం చేసుకుంటూ ఆ ఊర్లో ను పొరుగురు లో కూడా అందరికీ వంటావార్పుల్లో సహాయం చేస్తుంటాడు. అది సుమారు 200 గడపలున్న బ్రాహ్మణ అగ్రహారం. ప్రతిరోజు ఎవరో ఒకరి ఇంట్లో తద్దినం బారసాల పురుడు పుణ్యం వేసవికాలంలో ఊరగాయల సమయం పెళ్లిళ్లు పండగలు పబ్బాలు చావులు వస్తూనే ఉంటాయి. 

ఆ సమయంలో నేనున్నానంటూ అందరి ఇళ్లల్లో వంట వార్పు లో సహాయం చేసి వస్తుంటాడు కనకయ్య తాత. పైకి అలా భీకరంగా ఉంటాడు కానీ మనసు వెన్న ముద్ద. ఎవరి దగ్గర పది పైసలు పుచ్చుకోడు. 

తను సహాయం చేయడమే కాదు ఊరిలో ఉండే కుర్ర కారుని కొంతమందిని తన చుట్టూ తిప్పుకొని బీద బ్రాహ్మణులని తను వెళ్ళిన చోట వడ్డనికి ఉపయోగించుకుని పరోక్షంగా వాళ్ళ కడుపు నింపుతుంటాడు. 

కనకయ్య గారికి పిల్లలు అంటే చాలా ఇష్టం. తాత అని పిలిపించుకోవడం సరదా. అందుకే ఊర్లో ఉండే పిల్లలందరిని సాయంకాలం కూడా చుట్టూ కూర్చోబెట్టుకుని కథలవి చెప్తుంటాడు. పిల్లలు అందరూ తాత తాత అంటూ చుట్టూ చేరుతారు. పిల్లలకి ఇంకో ఆశ కూడా ఉంది. ఎక్కడైనా పెళ్లిళ్లు జరిగినప్పుడు సహాయం చేసిన చోట వాళ్లని అడిగి స్వీట్లు అవి తెచ్చి పిల్లలకు పెడుతుంటాడు కనకయ్య తాత. పిల్లలతో పాటు పెద్దవాళ్లు కూడా కనకయ్యతాత అని పిలవడం అలవాటైపోయింది.

అనుకున్న ప్రకారం గణపతి గారి ఇంట్లో బారసాల కార్యక్రమం
 పూర్తి చేసేసి నాలుగు పంచలు నాలుగు తువాళ్ళు నాలుగు అంగ వస్త్రాలు గోనె సంచిలో పడేసుకుని పెరవలి దాకా నడుచుకుంటూ వెళ్లి అమలాపురం వెళ్లే బస్సు ఎక్కి సాయంకాలం ఐదు గంటలకి పెళ్లి వారింట్లో కి అడుగుపెట్టాడు కనకయ్య తాత. 

హమ్మయ్య అన్నయ్య వచ్చేసావా నిన్ను చూడగానే నా ప్రాణం లేచి వచ్చిందనుకో అంటూ సుమతి గుమ్మoల్లోనే ఎదురొచ్చి మజ్జిగ గ్లాసు అందించింది. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి అమ్మా అంటూ ప్రశ్నించాడు కనకయ్య తాత. పెళ్లి పిలుపులు అన్నీ అయిపోయా యి. ఇంకా ఆవకాయ పెట్టాలి. ఆ గొడవ నాకు వదిలేయమ్మా ఇవాళ రాత్రి కాస్త విశ్రాంతి తీసుకుని రేపటి నుంచి రంగంలో దిగుతాను అంటూ హామీ ఇచ్చాడు కనకయ్య తాత .అన్నట్టు చెప్పడం మర్చిపోయా ను అన్నయ్య కిరాణా సామాన్లు లిస్టు పాలు పెరుగులు కూరలు లిస్టు నువ్వే చెప్పాలి. నాకు అంతగా అంచనా తెలియదు. రేపు తెప్పించేసి శుభ్రం చేసి లోపల పెట్టేస్తా అంటూ చెప్పింది సుమతి. మరి గాడి పొయ్యలోకి ఎండు పుల్లలు తెప్పించమ్మా క్రితం సారి చాలా ఇబ్బంది అయింది అంటూ చెప్పి నేను ఇప్పుడు స్నానం చేసి వస్తానమ్మా రాత్రికి ఏం చేయాలి అంటూ అడిగాడు.  

మన ఇంట్లో వాళ్ళమే కదా పైవాళ్లు ఎవరూ లేరు బంధువులు ఎవరూ రాలేదు .కాస్త ఉప్పు పిండి చేసుకుందాం అంటూ చెప్పింది సుమతి. ఇంతకీ సుమతి కనకయ్య తాతకి సొంత చెల్లెలు కాదు. ఏదో బీరకాయ పీచు బంధుత్వo. అన్నయ్య ని వరుస కట్టి పిలుస్తుంది.

అలా బావి దగ్గర స్నానం చేసి వచ్చి అంగవస్త్రం కట్టుకుని వంటింట్లోకి వెళ్లి కట్టెల పొయ్యి వెలిగించి గంటలో ఉప్పి పిండి తయారు చేశాడు కనకయ్య తాత. ఎవరి ఇంటికి వెళ్ళినా ఏ ఊరు వెళ్లిన కనకయ్య తాత అసలు ఖాళీగా ఉండడు. తన చేతనైన సాయం చేస్తూనే ఉంటాడు. 

అమ్మాయి నాకు ఆకలేస్తుంది . నాకు ఒక అరిటాకు ఇచ్చేయ్. నేను తినేసి పెoదరాలే మేడమీద పడుకుంటాను అంటూ చెప్పాడు కనకయ్య తాత. అలాగే అన్నయ్య నీకు మేడ మీద పెద్ద పట్టె మంచం పక్కా వేయించాను . శుభ్రంగా రెస్ట్ తీసుకో అంటూ చెప్పింది సుమతి. అమ్మ కాస్త పెద్ద దుప్పటి కూడా ఇయ్యి తెల్లారి గట్ల చలేస్తుంది అంటూ అడిగాడు కనకయ్య తాత. కనకయ్య తాత గురించి తెలిసిన మనిషి కాబట్టి ఆ ఏర్పాట్లు అన్ని ముందుగానే చేసింది సుమతి. టిఫిన్ చేసేసి చేతులు కడుక్కుని పంచె మార్చుకుని మేడ మీదకు వెళ్లి మంచం మీద వాలేడు కనకయ్య తాత. 

అలా మంచం మీద వాలిన కనకయ్య తాతకి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. ఒక్కసారిగా తన పిల్లల గుర్తుకొచ్చారు. తన పిల్లలకి కూడా ఈపాటికి పెరిగి పెద్దవాళ్లయ్యి పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు పుట్టేసి ఉండేవాళ్ళు. విధి తనతో అలా ఆడుకుంది. అంతర్వేది తీర్థానికి వెళ్లడం ఏమిటి, వచ్చేటప్పుడు గోదావరిలో పడవ మునిగిపోవడం ఏమిటి, ముగ్గురు పిల్లలు కళ్ళముందే చనిపోవడం, ఎవరి తలరాతలు ఎలా ఉంటాయో ఎవరికీ తెలుసు.

 అంత గంభీరంగా కనిపించే కనకయ్య తాత గుండెల్లో ఇంత బాధ ఉందని కొద్దిమందికే తెలుసు. అప్పటినుంచి మనసు విరిగిపోయి ఏదో వ్యాపకం పెట్టుకోవాలి కదా అంటూ తెలుసున్న విద్యతో అందరికీ ఇహపర బేధం లేకుండా సహాయం చేస్తుంటాడు కనకయ్య తాత. 

అందరితో బంధుత్వాలు కలుపుకుంటూ చొరవగా ఇంట్లో తిరుగుతూ ఇంట్లో మనిషిలా ముఖ్యమైన సమయాల్లో సహాయం చేస్తుంటాడు. ఈ కలికాలంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపిస్తుంది చాలామందికి కనకయ్య తాతను చూస్తే. ఆయనకు ఎక్కువగా ఉండే స్నేహితుల్లో ఆడవాళ్ళు ఎక్కువ. తప్పుగా అనుకోకండి. వంట పనిలో సహాయం చేస్తాడు కాబట్టి ఆడవాళ్ళతోటే పరిచయాలు ఎక్కువ.

 నన్ను ముట్టుకోకు నామాల కాకి అంటూ సహాయం అడుగుతారని భయంతో దూర దూరంగా జరిగిపోయి ఆ ముహూర్త సమయానికి వచ్చి అక్షంతలు వేసి వెళ్ళిపోయే బంధుజనం ఉన్న ఆ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉండేవారు. 

కనకయ్య తాత ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి సుమతికి చాలా ఆనందంగా ఉంది. పనులన్నీ సజావుగా జరుగుతున్నాయి. ఎక్కడ భోజనాల గురించి బెంగ లేదు. వడ్డన గురించి అసలే లేదు. పెండింగ్ ఉన్న పెళ్లి పనులన్నీ ఒకరోజు ఊరగాయలు ఒకరోజు ఒడియాలు ,అప్పడాలు, ఒకరోజు స్వీట్లు, అన్ని తయారు చేసి పెట్టేసాడు కనకయ్య తాత. చెయ్యి తిరిగిన ఏ స్త్రీ కూడా అంత పని చేయలేదు. 
అంత శుచిగా శుభ్రంగా రోజు వండి పెడుతూ పిల్లలందరికీ కావలసినవి చేసి పెడుతూ అసలు వంటింట్లోకి సుమతిని రానిచ్చేవాడు కాదు. అమ్మాయి రేపు ఆ పురోహితులు గారిని అడిగి కావాల్సిన పెళ్లి సామాన్లు లిస్ట్ రాయించుకో. ఎల్లుండి మంచి రోజు ఆరోజు పెళ్లి పెట్టి సర్దుదాం అంటూ చెప్పాడు సుమతితో. 

 మనము పెళ్లికూతురు చేసిన రోజుకి అరిసెలు ఎప్పుడు వండుకుందాం. ఒకరోజు ముందు అయితే బాగుంటాయి. లేదంటే మెత్తబడి పోతాయి అంటూ చెప్పాడు కనకయ్య తాత. అలాగే అన్నయ్య అది నీ చేతుల మీదుగానే జరగనీ. నీ అంత అనుభవం నాకు లేదు అంటూ చెప్పింది సుమతి.
 పెళ్లికి బంధువులంతా రావడం మొదలెట్టారు. బంధువుల్ని ఆహ్వానించడం తప్పితే వాళ్ళ బాగోగులన్నీ వాళ్లకు కావాల్సినవన్నీ చేసి పెడుతూ వాళ్లతో వరుసల కలుపుకొని బంధుత్వం పెంచుకుంటూ అందరి గుండెల్లో ఒక స్థానం సంపాదించుకున్నాడు కనకయ్య తాత. 

ఆ శుభ ముహూర్తం రానే వచ్చింది. కనకయ్య తాత ఊరు నుంచి తెప్పించిన కుర్రాళ్ళని అడ్డం పెట్టుకుని ఆ వచ్చిన పెళ్లి వారందరికీ రెండు పూటలా నలభీమ పాకం వండి పెట్టాడు. వడ్డన కూడా ప్రతి విస్తరి దగ్గరికి వెళ్లి ఆప్యాయంగా పలకరించి ఇది కాస్త రుచి చూడండి ఇది బాగుంటుంది అంటూ వడ్డించారు పిల్లలు. 

కనకయ్య తాత వంటకి ఆప్యాయంగా వడ్డించే వడ్డనికి పెళ్ళివారు సంబర పడి పోయారు. పనసపొట్టు కూర ముద్దపప్పు కంద బచ్చలి బూర్లు పులిహార అప్పడాలు వడియాలు ఆవకాయలు రుచి చూసిన పెళ్లి వారు మీరు ఎక్కడ ఉంటారు ఒక రోజుకి ఎంత తీసుకుంటారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇంతలో ఎక్కడి నుంచో సుమతి భర్త వచ్చి ఈయన మాకు బావగారు అవుతారు పెరవలి దగ్గరుండే కాకరపర్రు నుంచి వచ్చారు. మా ఇంట్లో మనిషే. అంటూ నవ్వుతూ సమాధానం చెప్పాడు. ఆ వచ్చిన పెళ్లి వారు వంట చాలా బాగుందని మెచ్చుకుంటూ కనకయ్య తాతకి నమస్కారం చేసి వెళ్లారు. పెళ్లి అంతా అంగరంగ వైభవంగా జరిగింది. 
పెళ్లి వారి ఏర్పాట్లకి ఖుషి అయిపోయి మగ పెళ్లి వారి పిల్లను తీసుకుని వెళ్ళిపోయారు. మగ పెళ్లి వారి వెళ్లే ముందు ప్రత్యేకంగా కనకయ్య తాత దగ్గరికి వచ్చి మీరు కూడా సత్యనారాయణ వ్రతానికి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదించండి అంటూ ఆహ్వానించారు. కనకయ్య తాత మగ పెళ్లి వారి ఇంటికి కూడా వెళ్లి తిరిగి వచ్చి అలా మూడు రాత్రులు అయిపోయిన తర్వాత పిల్ల కాపరానికి కావలసిన సామాన్లన్నీ సర్దిపెట్టి స్వీట్లు తయారుచేసి ఇంటికి బయలుదేరాడు కనకయ్య తాత. కనకయ్య తాత బయలుదేరే ముందు ఒక పెద్ద అట్టపెట్టెలో నిండుగా పెళ్లికి చేసిన అన్ని రకాల స్వీట్లు పెట్టి ఆ పిల్లలకు పెట్టు కనకయ్య తాత అంటూ ఇచ్చింది సుమతి. వెళ్లి వస్తానమ్మా అంటూ గుమ్మం దాట పోతున్న కనకయ్య తాత ని చూసి సుమతికి కన్నీరు ఆగలేదు. 

తోడబుట్టిన వాళ్ళు కూడా ఇంత సహాయం చేయలేరు. సాధారణంగా పెళ్లిలో భోజనాల గురించి అందరూ దిగులు పడుతుంటారు. మొన్న మేము సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు మా వియ్యాలవారు వచ్చిన బంధువులందరికీ నీ మాట చెప్పుకుంటూ వచ్చారు అంటూ కాళ్లకు నమస్కారం చేసి చేతిలో బట్టలు పెట్టి కవర్ కూడా చేతికి అందించింది. బట్టలు సరేనమ్మా కవరు పుచ్చుకో ను. ఈ శరీరం ఉన్నంతవరకు ఎవరికైనా సరే ఉచితంగానే వంట చేసి పెడతాను. నా మూలంగా పదిమంది ఆనందంగా తిని ఆరోగ్యంగా ఉన్నారంటే నాకు అదే పదివేలు అంటూ కవరు తిరిగి ఇచ్చేసాడు. నిజానికి కనకయ్య తాతకి ఆ డబ్బు అవసరమే. 
ఈమధ్య ఆరోగ్యం బాగుండట్లేదు. కడుపులో నొప్పి వస్తుంది. తణుకులో డాక్టర్ గారికి చూపించుకోవాలి అని అనుకుంటున్నాడు. జీవితంలో ఆనందాన్ని మిగల్చకుండా కడుపున పుట్టిన పిల్లలను తీసుకుపోయిన ఆ దేవుడు పదిమందికి సహాయం చేసే మంచి బుద్ధి ఇచ్చి కనకయ్య తాత దృష్టిని ఆ దుర్ఘటన మరిచిపోయేలా చేశాడు దేవుడు. అలా అమలాపురం గడియార స్తంభం దగ్గర తణుకు వెళ్లే ప్రైవేట్ బస్సు ఎక్కి సీట్లో కూర్చున్నాడు. ఆ రోజుల్లో ఆర్టీసీ బస్సులు లేవు. అన్ని ప్రైవేట్ యాజమాన్యo నడిపే బస్సులే. ఒకటో రెండో ఉండేవి. ఎప్పుడు ప్రయాణాలు ఎక్కువగా చేసే కనకయ్య తాతకి ఆ బస్సు డ్రైవర్లు కండక్టర్లు బాగా అలవాటే. యధా ప్రకారం కనకయ్య తాత సంచిలోంచి నాలుగైదు స్వీట్లు తీసి కండక్టర్లకి డ్రైవర్లకి పంచిపెట్టాడు. ఏ ఊరు బస్సు ఎక్కిన కనకయ్య తాతకి ఇది అలవాటు. 

అలా రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి చేరిన కనకయ్య తాత మళ్లీ మంచం నుంచి లేవలేదు. పెళ్లి బడలికి అనుకున్నారు. రోజురోజుకీ ఆహారం తగ్గించేసాడు. ఈ మాట ఆ నోట ఈ నోట విన్న సుమతి మరియు ఆమె భర్త ఇద్దరూ కనకయ్య తాతని చూడడానికి కాకర పర్రు బయలుదేరారు. దారిలో ఊరి దగ్గరికి వచ్చేటప్పటికి వరుసగా ఆడవాళ్లు అందరూ గోదారి గట్టు వైపు వెళుతూ కనిపించారు. ఏమైంది బాబు అంటూ రిక్షా అబ్బాయిని అడిగితే కనకయ్య తాతయ్య గారు నిన్న రాత్రి పోయారండి. మహానుభావుడు తన వంటతో ఎంతమంది ఉపకారం చేశాడో ఎప్పుడూ ఎవరి దగ్గర పది పైసలు పుచ్చుకోలేదుట. 
మా రిక్షా ఎక్కి మాక్కూడా పులిహార బూర్లు కూడా పెడుతూ ఉండేవారండి అంటూ చెప్పుకొచ్చాడు రిక్షా అబ్బాయి. రిక్షా దిగి గోదావరి గట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి అక్కడ ఊళ్లో ఉండే ఆడవాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. కనకయ్య తాత చేసిన సాయం గురించి అందరూ కథలుగా చెప్పుకుంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు. ఒక మనిషి పోయిన తర్వాత కూడా సంపాదించిన డబ్బు రాదు. కట్టుకున్న భార్య రాదు. కన్న బిడ్డల రారు. కానీ ఆ మనిషి ఇతరులకు చేసిన సహాయం వాళ్ల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. కనకయ్య తాత పోయిన తర్వాత ఆ ఊరి వాళ్ళకి చెయ్యి విరిగినట్లు అయింది. ఎప్పటికీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగిన కనకయ్య తాత ని గుర్తు చేసుకోని వాళ్ళు ఉండరు.

ఈ కథలోని కనకయ్య తాత పాత్ర నేను సృష్టించింది కాదు. బ్రహ్మగారు సృష్టించింది. కొన్ని మాత్రమే కల్పితాలు కథ కోసం. 
ఈయన అందరికీ చిరపరిచుతులే. అలాగే అందరికీ సహాయం చేస్తూ ఉండేవారు. 

ఎవరుంటారు ఇలాంటి వాళ్ళు. మనిషితో మనిషి మాట్లాడితేనే సహాయం అడుగుతారు అనే భయంతో తప్పించుకు తిరిగే వాళ్ళు చాలామంది ఈ లోకంలో. మరి ఈ పాత్రధారి గురించి ఇంకా చెప్పడానికి ఆయన కంటే పెద్ద వాళ్ళు ఎవరూ కనపడలేదు నాకు ఆ ఊర్లో. అందుకే నాకు తెలిసినంత వ్రాశాను.
రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు.
కాకినాడ 9491792279