Read Before me by M C V SUBBA RAO in Telugu Short Stories | మాతృభారతి

Featured Books
  • నా కంటే ముందుగా

    నాకంటే ముందుగా!సాయంకాలం నాలుగు గంటలు అయింది. కాకినాడ నగరంలోన...

  • ఉగాది పండుగ

    “ముందుగా అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు” తెలుగువార...

  • నరసయ్య కథ

    నరసయ్య కథ.  " నీ కొడుకు నరసయ్య అంతా వాళ్ళ నాన్న పోలిక. ఆ ఒడ్...

  • మనసిచ్చి చూడు - 16

    మనసిచ్చి చూడు.....16ఆ ఫోన్ కళ్యాణ్ నుంచి రావడం మధుకి చాలా భయ...

  • ఉయ్యాల

    ఉయ్యాల.రాత్రి 8.30 గంటలయింది.కాకినాడ నుంచి లింగంపల్లి వెళ్లే...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా కంటే ముందుగా

నాకంటే ముందుగా!

సాయంకాలం నాలుగు గంటలు అయింది. 

కాకినాడ నగరంలోని జన్మభూమి పార్క్ సందర్శకులతో హడావిడిగా ఉంది.

ఒక మూలగా ఉన్న బెంచి మీద వయసు మళ్లి న భార్య భర్త కూర్చుని ఏదో సుదీర్ఘంగా చర్చించుకుంటున్నారు.

 చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను. ఆ వయసులో పార్కుకి కొచ్చి కూర్చునిఅంత ప్రేమగా కబుర్లు చెప్పుకోవడం నిజంగా ఒక అదృష్టం అనిపిస్తుంది. 

నాకే కాదు ఎవరికైనా అదే మాట అనిపిస్తుంది. సుదీర్ఘమైన దాంపత్య జీవితం. సహకరించే ఆరోగ్యం చూసేవాళ్ళందరికీ ముచ్చటేస్తుంది. 

ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడకునే వాళ్లు ఈరోజు ఏదో సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు.  

ఆయన పేరు రామారావు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మంచి ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. రామారావు గారి భార్య పేరు సీతమ్మ. 

ఇద్దరు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలకి చదువులు చెప్పించి పెళ్లిళ్లు చేసి బాధ్యతలు అన్నీ తీరిపోయి ఆ భార్యాభర్త ఇద్దరూ తన సొంత ఇంట్లో హాయిగా కాలక్షేపం చేస్తూ ఉంటారు.

 రామారావు గారు మహా ఘటికుడు. సీతమ్మ గారి మాటల్లో కొంచెం అమాయకత్వం అలా అని తెలివి తక్కువ ఏమి కాదు.

 అందరికీ మంచి చేయాలని అందరూ మంచివాళ్ళని అనుకుంటుంది కాలానికి తగినట్లుగా ఉండదు. అందుకే కోడళ్ళది ఇష్టారాజ్యం. అత్తవారింటికి వచ్చిన పుట్టింట్లో కూర్చున్నట్టు కూర్చుని అత్తగారు చేత కావలసినవన్నీ వండించుకు తింటూ ఇక్కడ పుల్ల అక్కడ పెట్టరు. 

మాటలతో ఉప్పొంగిపోయే సీతమ్మ గారిని రామారావు గారు ప్రతి సందర్భంలోనూ కాపాడుతూనే ఉంటారు. భార్య సీతమ్మ అంటే వల్లమాలిని అభిమానం ,ప్రేమ రామారావుకి. అందరూ నా వాళ్ళనే అనుకుంటుంది సీతమ్మ. కానీ అవతల వాళ్ల స్వార్ధాన్ని గమనించలేదు. తనని వాడుకుంటున్నారనే మాట కూడా తెలియదు. అత్తగారు గట్టిగా లేకపోతే కోడళ్ళు ఆడిస్తారు అనే విషయం రామారావుకి తెలుసు. 

ఇవన్నీ నాకు ఎలా తెలిసాయి అని అడిగితే నేను కూడా కాపురం ఉండేది వాళ్ళింటికి రెండు ఇళ్ళు అవతల . రోజు అదే సమయానికి నేను పార్కు వచ్చి కాసేపు ఆ ముసలి వాళ్ళ తోటి కబుర్లు చెబుతూ ఉంటాను. 
పైగా రామారావు మా నాన్నగారికి తమ్ముడు అలా.ఆ దంపతులతోటి చాలా చనువు ఏర్పడింది. ఆ చనువుతోటే ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పంచుకునే దాకా వెళ్ళింది మా అనుబంధం. నా పేరు సుమతి. నా భర్త కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తుంటారు. ప్రతిరోజు నవ్వుతూ తుళ్లుతూ ఉండే రామారావు దంపతులు ఆరోజు ఎందుకో చాలా దిగులుగా ఉన్నట్టు అనిపించింది.
"ఎందుకు బాబాయ్ అలా ఉన్నారు అంటూ పలకరించాను. రామారావు అదోలా నవ్వుతూ నా కేసి చూసి ఇంటింటి రామాయణం అమ్మా అన్నారు. ఆ నవ్వులో ఏదో బాధ ధ్వనించింది.  

ఈ మధ్య మీ పిన్ని మా పెద్దబ్బాయి దగ్గరికి వెళ్దాం అంటూ రోజు చంపేస్తుంది. సరే అని రిజర్వేషన్ చేయించే ముందు మొన్న రాత్రి పెద్దబ్బాయి కి ఫోన్ చేశా. ముందు ఫోన్ తీసిన కోడలు నేను చెప్పిన కబురు విని చాలా ఆనందపడుతూ తప్పకుండా రండి అని చెప్పి కుశ ల ప్రశ్నలు వేసి తర్వాత ఫోన్ పెట్టేసింది. కాసేపటికి మా అబ్బాయి ఫోన్ చేశాడు.

 "మా పిల్లలు ఇద్దరికీ పరీక్షలు ఎవరిని ఇంటికి రానివ్వటం లేదు సీరియస్ గా దగ్గరుండి చదివిస్తున్నాము అంటూ చెప్పాడు. ఆ మాటలు మీ పిన్నికి అర్థం కాలేదు. వెంటనే నేను ఫోన్ తీసుకుని "సరే రా అలాగే అంటూ ఫోన్ పెట్టేసా ను.

 "ఏమిటండీ మనo వస్తున్నట్టు చెప్పలేదు చెప్పకుండానే ఫోన్ పెట్టేశారు అంటూ మాట్లాడిన మీ పిన్ని మాటలకి నాకు ఏడవలో నవ్వాలో తెలియలేదు. 

నిజంగానే మేము వస్తే ఇబ్బంది లేకుండా ఉంటే వాడే ముందుగా మమ్మల్ని అడిగి ఉండేవాడు. ఎప్పుడొస్తున్నారని. కానీ వాడి కి ఉన్న సమస్య వాడు చెప్పాడు. నిర్ణయం తీసుకోవాల్సింది మనం అంటూ విడమర్చి చెప్తే గాని మీ పిన్నికి అర్థం కాలేదు.

అంతకుముందు నెలలో రెండో అబ్బాయి అమెరికాలో ఉంటాడు కదా అక్కడికి వెళ్దామని చూడాలని ఉందని అంటుంటే ఒకరోజు ఫోన్ చేసి చెప్పా. మా కోడలు ఫోన్ తీసింది. నా మనసులో ఉన్న ఆలోచన చెప్పాను. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా మావయ్య గారు వీకెండ్ పార్టీకి వెళ్లి వచ్చి ఇప్పుడే పడుకున్నాం అంటూ రేపు మీ అబ్బాయి చేత ఫోన్ చేయిస్తాను అంటూ సమాధానం చెప్పి మా చిన్న కోడలు ఫోన్ పెట్టేసింది. ఇది జరిగి నెల అయ్యింది. ఫోన్ రింగ్ అయితే చాలు చిన్న కొడుకు దగ్గర్నుంచి అని గబగబా పరిగెడుతుంది మీ పిన్ని. ఈ మధ్య రోజు నన్ను ఫోన్ చేయండి అని చంపుతోంది. "మనం అక్కడికి వెళ్లడం ఇష్టం లేదనుకుంటా అందుకనే వాళ్లు ఫోన్ చేయలేదు అంటూ విడమర్చి చెప్తే గాని తెలుసుకోలేదు ఈ పిచ్చి తల్లి.

అంతేకాదు ఒకసారి చిన్న కొడుకు కోడలు క్రితం సంవత్సరం మా ఇంటికి వచ్చినప్పుడు మీ పిన్ని వంటింట్లో పనులతో సతమతo అవుతుంటే మా చిన్న కోడలు హాల్లో కూర్చుని మొబైల్ తో కాలక్షేపం చేస్తోంది.అమ్మకు సాయం చేయలేకపోయా అని అడుగుతున్నాడు మా కొడుకు. లేదండి అక్కడ పని ఏం లేదు. అత్తయ్య గారికి చాదస్తం. 

అత్తయ్య గారు పని కల్పించుకుని మరీ చేస్తుంటారు అంటూ చెబుతోంది చిన్న కోడలు కొడుకుతో. ఈ మాటల పక్క గదిలో ఉన్న నాకు వినపడ్డాయి. నిజానికి ఆరోజు మా పనిమనిషి కూడా రాలేదు. ఇలా ఉంది మా పరిస్థితి. ఇంక కూతుళ్లు ఏడాదికి ఒకసారి చుట్టూ చూపుగా వచ్చి వెళ్ళిపోతుంటారు. అల్లుళ్ల సంగతి అంతంత మాత్రమే. ఆడపిల్లలను మనo ఏమి ఇబ్బంది పెడతాం. అయినా వాళ్ళకి సంసారాలు ఏర్పడిన తర్వాత వాళ్ల బాధ్యతల మీదే వాళ్లు ఎక్కువగా దృష్టి పెట్టుకుంటారు. ఇది లోక సహజం.నాకు ఎవరి మీద బెంగ లేదు. మీ పిన్ని మన వలని చూడాలని కొట్టుకు పోతుంది.

అంతేకాదు చాలా బాధ కలిగించిన విషయం ఒకసారి మీ పిన్ని అమాయకంగా అడిగిన ప్రశ్నలకి మీ పిన్ని ప్రవర్తనకి కోడళ్ళు చాటుగా వెళ్లి పక పక నవ్వడం గమనించాను. లోకంలో డబ్బున్న లేకపోయినా పర్వాలేదు. కానీ ఎవరు తెలివితేటలు వాళ్లకి ఉండాలి. ఎదుటి వాళ్ళ మాటల్లోనే అర్ధాన్ని గ్రహించుకునే శక్తి ఉండాలి. లేకపోతే మనిషిని అదోరకంగా చూస్తారు. మాటలకు విలువ ఇవ్వరు. లోకువగా చూస్తారు. 
ఒకసారి మా పెద్దబ్బాయి గృహప్రవేశానికి వెళ్ళాము. ఆ సందర్భంలో ఏదో పట్టుచీర సమయానికి కనిపించలేదు. తర్వాత గదిలో పెట్టిన మా సంచీలు వెతుకుతూ
మా పెద్ద కోడలు కనిపించింది. ఇలా కొన్ని సంఘటనలు నా మనసుల్ని బాధపెట్టే యి.

పైగా మీ పిన్నికి కొంచెం చాదస్తం ఎక్కువ. పూజలు పునస్కారాలు దేవుడి మీద నమ్మకo ఎక్కువ. మడి తడి ఆచార వ్యవహారాలు ఎక్కువ. ఈ కాలం వాళ్లకి అవి ఏమీ తెలియదు తెలిసిన పాటించరు. పదేపదే చెప్పడం వల్ల కోపాలు వస్తున్నా యి. మా కాలంలో ఆడవాళ్లు తక్కువగా చదువుకోవడం వల్ల నేటి కాలమాన పరిస్థితుల్ని మీ పిన్ని సరిగా అర్థం చేసుకోలేక పోతోంది. కాలంతో పాటు పరిగెత్తే పిల్లల మనస్తత్వాల్ని అంచనా వేయలేకపోతోంది. ఇంకా అడ్డాలనాటి బిడ్డలని అనుకుంటుంది. ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుంది అమ్మా అమాయకమైన మీ పిన్ని మాటలకి.

నేను ఉన్నంతకాలం ఆమెను కాపాడుకోవడం నా బాధ్యత. మేము పెద్దవాళ్ళు అయి ఉన్నాం. ఎవరు ముందు ఎవరు వెనుకో. ఒకవేళ నేనే ముందు అయితే మీ పిన్ని పరిస్థితి ఏమిటి? అందుకే దేవుడిని రోజు నాకంటే ముందు మీ పిన్నిని తీసుకెళ్లి పొమ్మని కోరుకుంటూ ఉంటాను. ఇలాంటి కోరిక ఎవరు కోరరు . లేదంటే ఇటువంటి వాతావరణంలో ఆమె జీవనయానం ఎలా గడుపుతుందో అని నాకు చాలా భయంగా ఉంటుంది.

 ఆర్థికపరమైన ఇబ్బందులు లేకుండా చేయగలను గాని ప్రస్తుతం ఉన్న కాలమాన పరిస్థితులలో కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందో అని నా భయం. ప్రస్తుతం సమాజంలో కానీ కుటుంబంలో కానీ గట్టిగా మాట్లాడిన వాళ్ళదే రాజ్యం. స్వార్థంగా ఉంటేనే కాలం గడుస్తుంది. 

ఒక అడవిలో సింహం ఉన్నంతకాలం ప్రతి జంతువు అదుపులో ఉంటుంది. ఆ తర్వాత కుందేలుకి కూడా కొమ్ములు వస్తాయి. అలాగే కుటుంబం కూడా. చెప్పవలసిన వాడు చెప్పక చెప్పేవాడు లేక అల్లకల్లోలం అయిపోతుంది. భర్త లేని భార్య మాట అరణ్య రోదనమే. మీ పిన్ని లాంటి వాళ్ళ మాటలు అసలు ఎవరూ పట్టించుకోరు. ఇది మా కుటుంబం లోని పరిస్థితి . అంటూ ఏడుస్తూ చెప్పాడు రామారావు. 

ఆ మాటలు వింటున్న సీతమ్మ పెద్దగా ఏడుస్తూ నేను చనిపోతే మీకు వేళకి అన్నం పెట్టే వాళ్ళు ఉండరండి. మీరు అసలే ఆకలికి ఆగలేరు. అన్ని టైమింగ్స్ అంటూ చెబుతున్న సీతమ్మ మాటకి సుమతికి నవ్వు ఆగలేదు. సీతమ్మ తన మీద ఆధారపడిన రామారావు గురించి రామారావు సీతమ్మ గురించి ఆలోచించుకుంటున్నారు. ఎంత అద్భుతమైన దాంపత్యం అనుకుంది సుమతి.

ఒక్కొక్కసారి కొంతమందికి గుండెల్లో బాధ ఎక్కువైనప్పుడు . కనపడిన వ్యక్తి వాళ్ళకి సంబంధం లేకపోయినా చెప్పుకుని బాధపడతారు ఆ వయసు వాళ్ళు అనుకుంది సుమతి. ఇంటికి వెళ్ళిన సుమతికి మనసంతా పాడైంది. నిజానికి దాంపత్య బంధం అంటే ఇలాగే ఉండాలి. మనల్ని నమ్ముకుని వచ్చిన ఒక ఆడదానిని చివరి వరకు కాపాడవలసిన బాధ్యత తాళి కట్టిన బర్తడే. రామారావుది ఎంత మంచి ఆలోచన. ఆయన తన స్వార్థం తాను చూసుకోలేదు. 

జీవితమంతా తన స్వార్థానికి వాడుకున్న భార్యని చివరి రోజుల్లో కూడా కష్టపెట్టకుండా ఉంచాలని తాపత్రయ పడుతున్నాడు రామారావు అనుకుంది సుమతి. 

ఆ తర్వాత వారం రోజులు పాటు ఊరికి వెళ్లి తిరిగి వచ్చిన సుమతికి ఒక పిడుగు లాంటి వార్త తెలిసింది. రామారావు దంపతులు చనిపోయారని. కానీ ఇద్దరు ఒకేసారి ఎలా చనిపోయారు అనే ప్రశ్నకి సుమతికి సమాధానం దొరకలేదు. కానీ ఇలాంటి దాంపత్యం చూసి చాలా నేర్చుకోవాల్సింది ఉందని అనుకుంది సుమతి.

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు
కాకినాడ 9491792279