Read Shelter by M C V SUBBA RAO in Telugu పత్రిక | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 13

                   మనసిచ్చి చూడు....13అసలు ఎవరు రా నువ్వు కళ్యాణ...

  • మనసిచ్చి చూడు - 12

    మనసిచ్చి చూడు.....12అసలు ముందు ఎవరో చెప్పు మధు అన్నాడు గట్టి...

  • ఆశ్రయం

    ఆశ్రయం." ఎలాగైనా కుంభమేళాకు వెళ్లి వద్దాం అండి. మన బంధువులంద...

  • వసంతకేళి –హోళి!

    వసంత ఋతువు ఆగమనం మనుషులలో ఉత్సాహమే కాదు ప్రకృతిలో సరికొత్త స...

  • క్షమించు (ప్రేమ కథ)

    "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా?" ఎనిమిది సంవత్సరాల కిందట...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆశ్రయం

ఆశ్రయం.

" ఎలాగైనా కుంభమేళాకు వెళ్లి వద్దాం అండి. మన బంధువులందరూ వెళ్లి వస్తున్నారు. అందరూ మన వయసు వాళ్లే .నాకెందుకో చూడాలని కోరిక బలంగా ఉంది. ఎప్పుడు మిమ్మల్ని ఏమీ అడగలేదు అంటూ కుంభమేళా ప్రారంభం అయ్యే రోజుకు ముందు ఒక నెల రోజుల నుంచి వసంత రోజు పోరు పెడుతూనే ఉంది 

" అంత జన సమర్థంలో మనం వెళ్ళగలమా! దానికి తోడు భాష రాదు. ఇంటర్నెట్లో చూస్తుంటే అన్ని హోటల్స్ ఖాళీ లేవు. వసతి దొరకడం చాలా కష్టం. మనం చాలా ఇబ్బంది పడాలి. ఏదో తిప్పలపడి టిక్కెట్లు సంపాదిస్తాను కానీ. అక్కడ వసతి లేకుండా ఎలాగా. సామాన్లు ఎక్కడ పెడతాము. కనీసం ఒక గంట అయినా విశ్రాంతి తీసుకోవాలి కదా. అలసిపోయి ఉంటాం అన్నాడు వసంత భర్త రాజశేఖర్. 

ఆ కుంభమేళ ఉత్సాహంలో వసంత రాజశేఖర్ మాటలు ఏమీ పట్టించుకోకుండా మొత్తానికి రాజశేఖర్ నొప్పించి ఒప్పించి హైదరాబాదు నుంచి కాన్పూర్ వరకు ఫ్లైట్ ఎక్కి అక్కడి నుంచి రైలులో ప్రయాగ స్టేషన్ లో దిగారు. 

 రైలు ప్రయాణంలో రిజర్వేషన్ బోగి జనరల్ బోగీ ఒకే విధంగా ఉన్నాయి. అందరూ భక్తులే. అందుకే రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎక్కువ నిబంధనలు పాటించకుండా భక్తుల్ని మొత్తానికి ప్రయాగ స్టేషన్ కి చేరవేశారు. 

వసంత ఉత్సాహంగా ఆనందంగానే ఉంది కానీ రాజశేఖర్ కి ఆ జనాన్ని చూసేటప్పటికి దిగులు పట్టుకుంది. ఎలాగా రా బాబు ఈ జనంలో క్షేమంగా క్షేత్ర దర్శనం చేసుకుని తిరిగి వస్తామా అని సందేహం పట్టుకుంది. దానికి తోడు రైలు దిగిన వెంటనే ఎక్కడికి వెళ్లాలి ?ఏం చేయాలో తెలియక ఏదో ఆలోచిస్తూ అలా ఉండిపోయాడు. పక్కనున్న ప్రయాణికుల్ని వసతి ఎక్కడ తీసుకున్నారు ? అంటూ ఆ ఫోన్ నెంబర్లు తీసుకుని ఏదైనా అవకాశం దొరుకుతుందేమో అని ఫోన్ చేయడం ప్రారంభించాడు. కానీ ఇది మామూలు రోజులు కాదు కదా! మహా కుంభమేళ జరిగే రోజులు. ప్రతి చోట నుంచి ఒకే సమాధానం .  

ఆ సమాధానం రాజశేఖర్ లో నిరుత్సాహం , భయం బాగా పెంచేయి. పోనీ రైల్వే స్టేషన్ లో ఏమైనా గదులు దొరుకుతాయేమో !అని ఆశగా వెతికాడు. ఎప్పుడూ లేదు ఈ ప్రయాణంలో అన్ని నిరాశలే. ఏమిటో దేవుడు పరీక్షలు పెడుతున్నాడు.

ఎక్కడికి ప్రయాణమై వెళ్లిన అని ముందుగానే బుక్ చేసుకుని వెళ్లేవాడిని. ఈసారి ఏమిటో !ఇలా అయింది. ఎప్పుడు ఇలా బాధపడలేదు అనుకున్నాడు రాజశేఖర్.

ఎక్కడ చూసినా జనం . మనిషి మనిషి రాసుకుంటూ నడుస్తున్నారు. ఎన్ని రకాలు చూసుకోవాలి. సామాన్లు చూసుకోవాలి. జేబులు చూసుకోవాలి.ముఖ్యంగా మొబైల్ ఫోన్లు చూసుకోవాలి. మనం మన పనిలో ఉంటే వాళ్లు వాళ్ళ పనిలో ఉంటారు. ఎన్ని బాధ్యతలు ప్రయాణంలో. పరాయి రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు పడాలో! ఏటీఎంలో డబ్బులు దొరుకుతాయో లేదో అని సొమ్ము తీసుకుని వెళ్తే దాన్ని కాపాడుకోవడం ఒక బెంగ. ఇన్ని బెంగలతోటి ప్లాట్ ఫామ్ లన్ని దాటి బయటికి వచ్చేటప్పటికి రెండు గంటలసేపు పట్టింది .

రైల్వే స్టేషన్ బయటకు వచ్చేటప్పటికి ఆటో వాళ్ళు, టాక్సీ వాళ్ళు చుట్టూ ముట్టారు. అందరూ హిందీలో మాట్లాడుతున్నారు. ఇంతలో దూరం నుంచి ఖాకి బట్టలు వేసుకుని నుదుటన కుంకం పెట్టుకుని ఒక మధ్య వయస్కుడు వచ్చి "ఎక్కడికి వెళ్లాలి సార్ అంటూ తెలుగులో అడిగాడు. ప్రాణం లేచి వచ్చినట్లు అయింది రాజశేఖర్ కి.

" ఇక్కడ ఏమైనా హోటల్స్ కానీ లాడ్జిలు కానీ గెస్ట్ రూములు గాని దొరుకుతాయా !బాబు. ఒక రోజుకు మాత్రమే అని ఆత్రం గా అడిగాడు రాజశేఖర్ 

" అబ్బో ఇప్పుడు చాలా కష్టం అండి. అసలు జనం చూస్తున్నారా, ఎలా ఉన్నారో అందరూ అడ్వాన్స్ బుకింగ్ చేసేసుకుంటున్నారు అంటూ సమాధానం ఇచ్చాడు ఆ వ్యక్తి. 

ఏం చేయాలో తోచక అలాగే నిలబడిన రాజశేఖర్ ని వసంతని చూసి మీకు అభ్యంతరం లేకపోతే నాతో పాటు వస్తే ఒక చోటికి తీసుకెళ్తాను. మీరేం సందేహించకండి. నన్ను నమ్మండి అన్నాడా వ్యక్తి. 

రోజు ఎన్నో మోసాలు వింటున్నాం. చూస్తున్నాం. అయినా ఎందుకో ఏదో మూల ఆశ. అది గుడ్డి నమ్మకం అయ్యుండొచ్చు. మనసులో ఏదో మూల భయంగా ఉన్నా రాజశేఖర్ వసంత ధైర్యం చేసి అతని ఆటో ఎక్కేశారు. వసంత ఆటో ఎక్కిన దగ్గర్నుంచి భయం భయంగా చూస్తోంది అటు ఇటు. రాజశేఖర్ కి మనసులో కూడా దిగులుగానే ఉంది. ఇంతలో ఇద్దరు పోలీసులు వచ్చి ఆటో ఆపారు. హిందీలో ఏదో అడుగుతున్నారు ఆటో డ్రైవర్ని. ఆటో డ్రైవర్ ఎదో చెప్పాడు వాళ్లకి. ఆ తర్వాత ఆటోడ్రైవర్ మీరు మా బంధువులను చెప్పాను అన్నాడు. 
ఇక్కడ మోసాలు ఎక్కువగానే ఉంటాయి. అందుకే పోలీసుల చెకింగ్ ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు అని చెప్పాడు. 

రోడ్లన్నీ ఎక్కడ ఖాళీ లేవు. ఆటో నెమ్మదిగా నడుపుకుంటూ జనాల్ని తప్పించుకుంటూ అతి జాగ్రత్తగా ఒక గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత ఒక రేకుల షెడ్డు ముందు ఆపేడు. ఇంచుమించుగా అక్కడ ఉన్న ఇళ్లన్నీ అలాగే ఉన్నాయి. మీరేమీ కంగారు పడకండి భయం పడకండి ఇది నా ఇల్లే అంటూ తలుపు తట్టాడు. లోపలి నుంచి ఒక ముసలమ్మ వచ్చి తలుపు తీసింది. లోపల ఉన్న ఒక గదిలోకి మమ్మల్ని తీసుకెళ్లి సామాన్లు అక్కడ పెట్టుకోమని చెప్పి మీరు స్నానం చేస్తే ఇక్కడ చేయండి అంటూ బయట ఉన్న ఒక రేకుల గది చూపించాడు. 

ఇది ఏమిటి ఈశ్వరా! ఇలా ఇరుక్కుపోయాం అని భయపడుతూ వసంత రాజశేఖర్ ఇద్దరు స్నానాలు కానిచ్చి వచ్చేటప్పటికి వేడి వేడి టీ ,బన్నులు ఒక ప్లేట్లో పెట్టి తీసుకొని వచ్చిందా !ముసలమ్మ. అసలే ప్రయాణం దానికి తోడు మనసంతా భయం వాటన్నిటినీ పక్కన పెట్టేసి గబగబా ఇద్దరు బన్నులు తిని టీ తాగేరు. ఆ ముసలమ్మ ఆత్మీయతకి ఎంతో ఏడుపొచ్చింది వసంతకి. అయినా మనసులో ఒక పక్కన భయంగానే ఉంది. ఇందులో ఏం కలపలేదు కదా వీళ్ళు !
అలా ఆత్మ రాముడిని సంతృప్తిపరిచికావలసిన వస్తువులు తీసుకుని దేవుడికి దండం పెట్టుకుని ఆ బ్యాగులు అక్కడే వదిలేసి కుంభమేళా జరిగే ప్రదేశానికి బయలుదేరుతుంటే "పదండి నా ఆటోలో మిమ్మల్ని తీసుకు వెళతాను! అంటూ ఆటో ఎక్కించుకుని ఒక గంట సేపు ప్రయాణం చేసిన తర్వాత ఒకచోట ఆపి" ఇకనుంచి మీరు నడుచుకుంటూ వెళ్లాలంటూ దారి చూపించి ఇది నా ఫోన్ నెంబరు మీరు వచ్చేవరకు ఇక్కడే ఉంటాను. 
మీరు వచ్చిన తర్వాత ఫోన్ చేయండి అని చెప్పాడు. కొన్ని సందర్భాల్లో మనకు తెలియని ప్రదేశాల్లో ఎవరైనా సహాయం చేస్తే ఇంకా వెనక ముందు ఏమీ ఆలోచించము. ఏదో నమ్మకం కొద్ది ముందుకు వెళ్ళిపోతుంటాం. అలా తిప్పలు పడి వసంత రాజశేఖర్ ఆ నది దగ్గరికి వెళ్లేటప్పుడు అక్కడ కూడా ఇసుకేస్తే రాలనంత జనం. అలాగే ఇద్దరు స్నానం చేసి చేయవలసిన కార్యక్రమాలు పూర్తిచేసి వచ్చేటప్పటికి తీరని కోరిక తీరడంతో వసంత మనసంతా తేలికైపోయింది. రాజశేఖర్ మనసు ఏదో తియ్యని బాధతో నిండిపోయింది. ఎంత అదృష్టవంతులో నా పితృదేవతలందరూ అనుకున్నాడు . 

ఆ త్రివేణి సంగమం చూస్తుంటే మనసు ఉరకలేసింది. పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే ఆ మూడు నదులలో పితృదేవతలు ఆశీర్వదించడానికి వచ్చినట్లుగా అనిపించింది. 
ఆ కుటుంబానికి వారసుడుగా ఏదో గొప్ప బాధ్యత తీరినట్లుగా భావించాడు రాజశేఖర్. అలా తేలికపడిన మనసుతో ఇద్దరు దంపతులు ఆ మహా క్షేత్రం నుండి బయటకు నడుచుకుంటూ వచ్చి ఆటో డ్రైవర్ కి ఫోన్ చేశాడు రాజశేఖర్. ఆటో డ్రైవర్ చెప్పిన సూచనల ప్రకారము ఆటో దగ్గరికి వచ్చి ఆ డ్రైవర్ ఇంటికి బయలుదేరారు. 

అలా ఆటోలో బయలుదేరిన దంపతులు "చూడు బాబు నువ్వు చేసిన మేలు నిజంగా మర్చిపోలేము. మా యాత్ర ఇంత సుఖంగా జరిగిందంటే నువ్వే కారణం. ఇప్పుడున్న సమాజంలో నీలాంటి వాళ్ళు ఉండడం చాలా అరుదు. ఇది మాయా ప్రపంచం. ఈ మాయా ప్రపంచంలో అందర్నీ మాయ మనుషులే అనుకుంటున్నాం. కానీ నూటికో కోటికో ఒకరు నీలాంటి వారు ఉంటారు. మాకు నిన్ను దేవుడే చూపించాడు. నిజంగా ఎంత భయపడ్డా మో అంత సులభంగా జరిగింది మా యాత్ర. నువ్వు ఇంత సహాయం చేశావు కదా !ఏమిటి నీకు లాభం ?అని అడిగాడు రాజశేఖర్. 

ఆ డ్రైవర్ నవ్వి తన కథ చెప్పుకుంటూ వచ్చాడు . మేము ఎప్పుడో ఆంధ్రా నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. నాకు భార్య ఇద్దరు పిల్లలు ఒక తండ్రి ఉండేవారు. 
మా నాన్నగారిది చిన్న హోటల్ వ్యాపారం. బజార్లో ఒక చిన్న ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో హోటలు పైన మేడ మీద రెండు గదులు యాత్రికులకు అద్దెకిస్తూ కాలక్షేపం చేసే వాళ్ళం. అలా పది సంవత్సరాల క్రితం మేమందరం నదికి వెళ్లి స్నానం చేసి వస్తుంటే ఒక లారీ యాక్సిడెంట్లో మా నాన్న, నా భార్య ,ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత జీవితంలో అనేక నష్టాలు వచ్చి వ్యాపారం మూసేసి ఇల్లు అమ్మేసి ఇదిగో ఇలా చిన్న ఆటో కొనుక్కుని మా అమ్మతో కాలక్షేపం చేస్తున్నాను. ప్రతి శనివారం ఇలా అడిగిన వాళ్ళకి సహాయం చేయడం ఒక వ్రతం గా పెట్టుకున్నాను. దాని మూలంగా మనశ్శాంతి పొందుతున్నాను. మీలాంటి వాళ్ళు ఎంతోమంది దూరం నుంచి వస్తారు. ఏదో నాకు చేతనైన సాయం అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు. 

ఇంతలో ఆటో రేకుల షెడ్డు ముందు ఆగింది. వసంత రాజశేఖర్ ఇద్దరూ లోపలికి వెళ్లి బ్యాగులు తీసుకుని చూసుకొని సంతృప్తి పడి ఆ ముసలమ్మ కాళ్ళకి నమస్కరించి రెండు వేల రూపాయలు చేతిలో పెట్టారు. ఆ ముసలమ్మ వద్దని గొడవ చేసింది. అయినా వినిపించుకోకుండా రాజశేఖర్ దంపతులు ఆటోలో రైల్వే స్టేషన్ కి బయలుదేరి స్టేషన్ కి చేరారు

రాజశేఖర్ జేబులోంచి ఏదో తీసి ఇవ్వబోతుంటే ఆటో డ్రైవర్ వద్దని వారిస్తూ " ఎవరికైనా ఆశ్రయం కోరి వచ్చే వాళ్ళకి లేదంటే సహాయం కోరేవాళ్ళకి మీకు తోచినంత సహాయం చేయండి సార్. కనీసం మాట సహాయమైనా చేయండి. నేను ప్రతిసారి ఇదే చెప్తుంటాను రైల్వే స్టేషన్ లో దింపిన ప్రయాణికులు అందరికీ. మిమ్మల్ని భగవంతుడు పరిచయం చేశాడు నాకు ఒకరికి సేవ చేయడానికి అవకాశం కల్పించాడు అని చెప్పిన ఆటో డ్రైవర్ మాటలకి నేను ఎంతో నేర్చుకోవాల్సింది ఉంది అని సిగ్గుపడ్డాడు రాజశేఖర్. 

ఒక స్నేహితుడి బంధువుకి నిజంగా ప్రయాగరాజ్ లోజరిగిన అనుభవ సారాంశమే ఈ కథ. ఎంతోమంది ఎన్నో తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు. అలాంటి తీర్థయాత్రల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు జరుగుతుంటాయి. ఆ అనుభవాలను బట్టి తన జీవన శైలిని మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో మన కథానాయకుడు రాజశేఖర్ కూడా ఒకడిగా చేరిపోయాడు. 

రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు 
కాకినాడ 9491792279