Read Nirupama - 3 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిరుపమ - 3

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

“నీ గురించే ఎదురుచూస్తూ వున్నాను. మాటిచ్చానుగా నువ్వు వచ్చేవరకు నీ ఇల్లు కాపలా కాస్తానని.” నిరంజన్ లేచి నిలబడి నవ్వాడు. “మరింక నాకు సెలవు ఇప్పిస్తే వెళ్ళొస్తాను.”

“థాంక్స్ నిరంజన్.” అన్నాక స్మరన్ వైపు తిరిగింది నిర్మల. “కానీ …..” స్మరన్ మొహంలోకి ప్రస్నార్ధకంగా చూస్తూ అంది.

“తాను నా క్లోజ్ ఫ్రెండ్ స్మరన్. ఇప్పటివరకు విదేశాల్లో వుండి ఈ మధ్యే స్వదేశానికి వచ్చారు.” రంగనాథ్ అన్నాడు.

తన గురించి ఆవిడకి ఎలా పరిచయం చెయ్యాలో ఆల్రెడీ రంగనాథ్ కి చెప్పి వుంచేడు స్మరన్

“నీ క్లోజ్ ఫ్రెండా? ఈ పేరుతో మీకు ఓ క్లోజ్ ఫ్రెండ్ వున్నట్లుగా మీరు నాకు ఎప్పుడూ చెప్పనేలేదు.” నిర్మల భృకుటి ముడిపడింది.

“చెప్పే వుంటాను నువ్వు మర్చిపోయి ఉంటావు. అయినా నేను ఒక వ్యక్తిని నా క్లోజ్ ఫ్రెండ్ అని నీకు పరిచయం చేసాక నువ్విలా మాట్లాడడం సభ్యతేనా?” చిరాగ్గా అన్నాడు రంగనాథ్.

“సారీ. నేనలా మాట్లాడకూడదు.” విచారంగా అంది నిర్మల. “ నా భర్త క్లోజ్ ఫ్రెండ్ మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా వుంది. మీరు కాస్సేపు ఆలా కూర్చోండి. నేను కాఫీ తీసుకు వస్తాను మీ అందరికి.”

“నేను రాగానే నువ్వు నాకు కాఫీ ఇచ్చేసావు. ఇంకా నేను వచ్చి చాలాసేపు అయింది కూడా. నేను వెళ్ళొస్తాను. మీరు మీ మాటలు కొనసాగించండి.” ఆలా చెప్పాక నిరంజన్ అక్కడినుండి వెళ్లి పోయాడు.

తరువాత నిర్మల వంటింట్లోకి వెళ్ళింది కాఫీ తీసుకురావడానికి.

“తనే నా భార్య అని మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటాను. తన పేరు నిర్మల. చెప్పానుగా అన్ని విషయాలలోనూ బాగానే ఉంటుంది. కానీ మా అమ్మాయి నిరుపమ మాత్రం ఇంకా బ్రతికి ఉన్నట్టుగానే భావిస్తూ ఉంటుంది. నేను మా అమ్మాయి చనిపోయిందని తనని ప్రత్యేకంగా నమ్మించాలని చూడలేదు. తను అలాగైనా ఆనందంగా ఉండడం నాకు ఆనందం గా వుంది.”

స్మరన్ తలూపి మౌనంగా వుండిపోయాడు ఏమి మాట్లాడాలో తెలియక. ఈ లోగా ఆవిడ కాఫీ తీసుకుని వచ్చింది.

“నేనొక బిజినెస్ మాన్ని. విదేశాల్లో బాగానే సంపాదించుకున్నాక స్వదేశంలో స్థిరపడాలనిపించింది. అందుకనే వచ్చేసాను.” నిర్మల ఇచ్చిన కాఫీ సిప్ చేస్తూ అన్నాడు స్మరన్.

“మంచిపని చేసారు. పుట్టిన దేశం కన్నా గొప్ప దేశం మనకి ఏది ఉంటుంది చెప్పండి?” నిర్మల నిరంజన్ ఖాళీ చేసిన కుర్చీలో కూర్చుని అంది. “మీ కుటుంబం అంతా కూడా విదేశం నుంచి స్వదేశం వచ్చాసారనుకుంటాను.”

“నా భార్య మూడవ నెల ప్రేగ్నన్ట్ గా వున్నపుడు ఆక్సిడెంట్ లో చనిపోయింది. తరువాత నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించలేదు. నా పేరెంట్స్ కూడా ఎప్పుడో చనిపోయారు. నాకు ఒక అక్క, ఆమె కూతురు తప్ప వేరే చెప్పుకోదగ్గ బంధువులు ఎవరు లేరు.” స్మరన్ దీర్ఘంగా నిట్టూర్చాడు.

“ఎంతటి బాధాకరమయిన విషయం!” నిర్మల మొహం అంతా విచారంతో నిండిపోయింది.

అదే ఫీలింగుతో రంగనాథ్ స్మరన్ మొహంలోకి చూసాడు. అది మాత్రం నిజమే అన్నట్లుగా తలూపాడు స్మరన్.

“నిజానికి ఆ బాధ నుండి తప్పించుకోవడానికే తాను విదేశానికి వెళ్లి పోయింది.” రంగనాథ్ అని స్మరన్ మొహంలోకి చూసాడు. ఆమోదించినట్టుగా స్మరన్ తలూపాడు.

“విచారపడకండి. మీకు మీ అక్కయ్య, ఇంకా ఆమె కూతురుతో పాటుగా మేము కూడా వున్నాం అని భావించండి.” నిర్మల అంది.

“తప్పకుండా అలాగే. మీరు కూడా నాకు ఎంతో ఆత్మీయులు లాగానే కనిపిస్తూ వున్నారు.” చిరునవ్వుతో కుర్చీలో వెనక్కి  జారగిలబడుతూ అన్నాడు స్మరన్.

“మా అమ్మాయి నిరుపమ ఇంటి దగ్గర ఉండివుంటే నేను మీకు పరిచయం చేసేదాన్ని. తాను అందరితోటి ఎంతో తేలిగ్గా కలిసిపోతుంది. కానీ తానిప్పుడు తన ఫ్రెండ్ సమీర దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్లిందంటే తనకి సమయం తెలియదు. ఎప్పుడు ఇంటికి వస్తుందో చెప్పలేం.”

వెంటనే స్మరన్ రంగనాథ్ మొహంలోకి చూసాడు. ‘ఇదీ పరిస్థితి’ అన్నట్లుగా విచారవదనంతో తలూపాడు రంగనాథ్.

“నో ప్రాబ్లెమ్. నేను మరొకసారి వచ్చినప్పుడు తనని కలిసి మాట్లాడతాను. నేను కూడా మీకు దగ్గరలోనే ఉంటున్నాను” .కాస్త ఆగి మళ్ళీ అన్నాడు స్మరన్. “రంగనాథ్ తరచు నిరుపమ గురించి మాట్లాడుతూ ఉంటాడు. తాను చాలా ఏక్టీవ్  ఇంకా ఇంటెలిజెంట్ ట కూడా కదా.”

“అంతే కాదు. తను చాలా అందంగా ఉంటుందని కూడా అందరూ అంటూ వుంటారు. మీరు తనతో మాట్లాడిన తరువాత మీ అభిప్రాయం చెప్పండి.” నవ్వుతూ అంది నిర్మల. ఎంత నవ్వుతూ వున్నా ఎదో విచారం నిర్మలలో గూడు కట్టుకుని కనిపిస్తూ వుంది స్మరన్ కి. “మీరు ఈరోజు మా ఇంట్లో భోజనం చేసి, ఇక్కడే ఉండాలి. ఆలా అయితే మీరు మా అమ్మాయిని చూసి మాట్లాడొచ్చు కూడా.”

“ఈ సారికి మీరు నను క్షమించాలి. నేను మా అక్కకి తనింటికి వస్తానని మాటిచ్చాను. ఇప్పటికే లేటయింది, నేను ఇంక బయలుదేరాలి. చెప్పానుగా, నేను మీకు దగ్గరలోనే ఉంటున్నాను. త్వరలోనే మీ ఇంటికి మళ్ళీ వస్తాను.” కుర్చీలోంచి లేచి నిలబడి అన్నాడు స్మరన్.   

“మీరెప్పుడు వచ్చేది కొంచెం ముందుగా తెలియపరచండి. నేను మా అమ్మాయి కూడా ఇంటి దగ్గరే ఉండేలా చూస్తాను. తన నాన్నగారి క్లోజ్ ఫ్రెండ్ తనకి పరిచయం కావాలి కదా.” నిర్మల కూడా కుర్చీలోంచి లేచి నిలబడింది. నిర్మలతో పాటుగా, రంగనాథ్ కూడా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు.

“నేను ఆ సమీర తోటి మాట్లాడాలి. ఆమె ఎక్కడ ఉంటుంది? నేను ఎప్పుడు ఆమెని కలవొచ్చు?” ఇద్దరూ పూర్తిగా ఇంటిబయటకి వచ్చాక స్మరన్ రంగనాథ్ ని అడిగాడు.

“తన ఇల్లు ఇక్కడకి దగ్గరే. తను కూడా ఇప్పుడు సైకాలజీ ఫస్ట్ ఇయర్ యూనివర్సిటీలో చదువుతూంది. మీరు ఆదివారాల్లో కానీ, ఏదైనా సెలవు దినాల్లోకాని ఆమెని కలవొచ్చు. నేను ఆమె ఫోన్ నెంబర్ మీకు ఇస్తాను. అలాగే తనకి కూడా ఫోన్ చేసి చెప్తాను. తనతో మాట్లాడి వెళ్లి కలవండి.” రంగనాథ్ అన్నాడు. 

“తను నిరుపమకి ఎంతో క్లోజ్ ఫ్రెండ్. తన చావుతో మా కన్నా కూడా ఎక్కువగా అప్సెట్ అయిపోయింది. కొన్నిరోజులపాటు అసలు మనిషే కాలేక పోయింది.” సమీర ఫోన్ నెంబర్ స్మరన్ కి ఇచ్చాక రంగనాథ్ అన్నాడు.

“ఈ ఇన్వెస్టిగేషన్లో నేను ఏ ఏ స్టెప్స్ తీసుకోబోతున్నానో మీకు త్వరలోనే చెప్తాను. నేను అన్న సమయానికే నా ఇన్వెస్టిగేషన్ పూర్తి చెయ్యడానికి ప్రయత్నం చేస్తాను.” ఆలా చెప్పిన తరువాత అక్కడనుంచి వెళ్ళిపోయాడు స్మరన్.


&

మేనక తన బెడ్ రూమ్ లో కూర్చుని తన చేతిలో ఉన్న థ్రిల్లర్ బుక్ ని ఎంత ఇంట్రెస్టింగా చదువుతూంది అంటే తన సెల్ ఫోన్ ఐదోసారి మోగినప్పుడు తప్ప తనకి వినిపించనేలేదు. అప్పటికీ చిరాగ్గా సెల్ ఫోన్ తన చేతిలోకి తీసుకుని స్క్రీన్ వైపు చూసింది. అయితే స్క్రీన్ మీద నెంబర్ చూడగానే తన చిరాకంతా మాయం అయిపోయి, పుస్తకం పక్కన పడసి, బెడ్ మీద స్ట్రెయిట్ గా కూచుంది.

"ఇంత సడన్ గా నేను నీకెందుకు గుర్తుకొచ్చాను అంకుల్?" కాల్ అటెండ్ అవగానే సంతోషంగా అడిగింది మేనక. తన అంకుల్ స్మరన్ తో మాట్లాడ్డం మేనక కి ఎంతో ఆనందం కలిగించే విషయం. స్మరన్ బయటవాళ్ళకే కాదు మేనకకి కూడా ఎంతో ఇంటరెస్టింగ్ క్యారెక్టర్.

"నేను నిన్నెపుడైనా మర్చిపోయినా? తరచూ ఫోన్ చేస్తూనే ఉంటాను కదా. అయినా ఇలా అడుగుతున్నావు." స్మరన్ స్వరం కోపంగా వినిపించింది.

"సారీ అంకుల్. అది నిజమే. కానీ నువ్వు రెండురోజులు మాట్లాడక పోయినా నాకు నువ్వు ఎన్నో రోజులుగా మాట్లాడనట్టుగానే అనిపిస్తూ ఉంటుంది." మేనక అంది.

"అదిసరే. కానీ ఇంతకీ ఏ థ్రిల్లర్ అంత ఇంట్రెస్టింగా చదువుతున్నావు? అంత సేపు ఫోన్ తియ్యలేదు."

"టెల్ మీ యువర్ డ్రీమ్స్. సిడ్నీ షెల్డన్ నవల. చాలా ఇంట్రెస్టింగా వుంది. నువ్వూ చదువుతానంటే ఇస్తాను." ఆ బుక్ ని చేతిలోకి తీసుకుని చూస్తూ అంది మేనక.

"నాకు బుక్స్ చదివేంత సమయం ఎక్కడ వుంది?" స్మరన్ నిట్టూర్చాడు. "కానీ అంతకన్నా ఇంటరెస్టింగ్ విషయం ఒకటి ఉంది చేస్తావా?"

"అంటే దానర్ధం నువ్వు మళ్లీ నన్ను ఎదో ఇన్వెస్టిగేషన్ లో ఇంవోల్వ్ చెయ్యబోతున్నావన్నమాట. అదేమిటో త్వరగా చెప్పు." బెడ్ మీదనుంచి ఉత్సాహంగా కిందకి దిగింది మేనక. అప్పుడప్పుడు స్మరన్ తాను చెయ్యబోయే ఇన్వెస్టిగేషన్స్ లో మేనక సహాయం కూడా తీసుకుంటూ ఉంటాడు.

"నీ ఊహ నిజమే. కానీ ఆ వివరాలేమీ ఫోన్లో చెప్పడం కుదరదు. నువ్వు నా ఆఫీసుకి వీలైనంత త్వరగా రా. నిన్ను ఈ అసైన్మెంట్లో సాధ్యమైనంత త్వరగా ఇంవోల్వ్ చెయ్యాలి."

"ఒక్క అరగంటలో అక్కడ ఉంటాను. సరేనా. బై." ఫోన్ కట్ చేసి తలుపులు తెరుచుకుని వేగంగా బయటకి వచ్చింది మేనక. తాను తన మావయ్యతో కలిసి చేసే ఇన్వెస్టిగేషన్స్ తనకి ఎంతో థ్రిల్లింగా ఉండడమే కాదు, ఆలా హెల్ప్ చేసినందుకు తన మావయ్య తనకి ఎంతోకొంత ఇస్తూ ఉంటాడు కూడా. అందుకనే మేనక ఎప్పుడూ అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.

"రాణిగారు మళ్లీ ఎక్కడకి బయటి బయలుదేరారు? ఏ ఫ్రెండ్నికలుసుకుని గంటలతరబడి అనవసరపు మాటలు మాట్లాడడానికి?" మేనక డ్రెస్ అప్ అయి బయటి రాబోతూ వుంటే ఆమె తల్లి ప్రతిమ అంది ఎదురుగా వచ్చి.

" ఏదో ఇన్వెస్టిగేషన్ లో సాయం చెయ్యాలిట. అంకుల్ రమ్మన్నాడు. వెళ్తున్నాను." పర్మిషన్ కోసం కాకుండా ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టుగా చెప్పింది మేనక. తన మావయ్య దగ్గరకి వెళ్లడం అంటే తన తల్లి ఎప్పుడూ కాదనదని మేనకకి తెలుసు.

"సరే అయితే. వెళ్ళు. కానీ సమయం అంతా అక్కడే కాలక్షేపం చెయ్యకు. ఒక్క సెలవు రోజుల్లోనే కదా నువ్వు నేను కలిసుండేది." ప్రతిమ అంది.

   ఏమాత్రం ప్రమాదం, ఇబ్బంది లేని విషయాల్లో మాత్రమే మేనక సహాయం తీసుకుంటూ ఉంటాడు తన తమ్ముడు స్మరన్. అంతే కాకుండా మేనక గురించి తన కన్నా కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకని ఎపుడైనా ఇటువంటి చిన్న, చిన్న సహాయాలు అడిగినప్పుడు ప్రతిమ అడ్డుపెట్టదు. 

మేనక తన తల్లి దగ్గరికి వచ్చి, ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఆమె ఎడమ బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. "నువ్వు చెప్పింది నిజమే అమ్మా. నేను వేగంగానే వచ్చేస్తాను. సాయంత్రం మనం సినిమాకి కూడా వెళదాం." అంది మేనక.

"నువ్వు వేగంగా రావాలి అంటే, వేగంగా అక్కడకి వెళ్ళాలి కదా." తన కూతురి చేతిని విడిపించుకుంటూ, నవ్వుతూ అంది ప్రతిమ. "మీ అంకుల్ ని అడిగానని చెప్పు. అలాగే నీకో మంచి కుర్రాడిని చూడమని కూడా చెప్పాను. అదెంతవరకు వచ్చిందో కూడా అడుగు."

"అలాగే అమ్మా. తప్పకుండా అడుగుతాను." మరొకసారి తన తల్లిని కౌగలించుకుని, అదే బుగ్గమీద ముద్దు పెట్టి బయట పడింది మేనక.

తన కూతురు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది ప్రతిమ. తన భర్త చనిపోయిన తరువాత తన కూతురే తన లోకం అయిపోయింది ప్రతిమకు. తాను బ్యాంకు లో ఉద్యోగం చేస్తూ ఉండడంవల్ల ఫైనాన్సియల్ గా ప్రాబ్లెమ్ ఏం లేదు. కానీ ఏ స్త్రీ కైనా భర్త లేని లోటు ఇంకా ఏ ఆడపిల్లకైనా తండ్రిలేని లోటు పూడ్చలేనిది.

తన తమ్ముడు స్మరన్ కి తను అన్నా, తన కూతురు అన్నా ఎంతో ఇష్టం. కానీ తన జీవితం కూడా అలాగే ఉంది. భార్య మూడోనెల గర్భిణిగా వున్నప్పుడు ఆక్సిడెంట్ లో చనిపోవడం ఎంత దురదృష్టకరమైన విషయం! తనెంత బలవంత పెట్టినా మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించనే లేదు స్మరన్. నిట్టూరుస్తూ వంటింట్లోకి వెళ్లి పోయింది ప్రతిమ.

&

"నేను నీకు ఇప్పటి వరకు హెల్ప్ చేసిన అసైన్మెంట్లు అన్నిట్లోనూ ఎంతో థ్రిల్లింగా, ఉత్సాహంగా ఫీలయ్యాను. కానీ ఈ అసైన్మెంట్ విషయంలో ఆలా ఫీల్ అవ్వలేక పోతున్నాను." తన చేతిలో ఉన్న నిరుపమ ఫోటోని చూస్తూ అంది మేనక. ఒక్క అరగంటలో మొత్తం విషయాన్నీ, ఇంకా మేనక ఏం చెయ్యాల్సి ఉంటుందో కూడా చెప్పేసాడు స్మరన్. "తన తల్లి తండ్రులు ఎంతగా హర్ట్ అవుతారు అన్న ఆలోచన కూడా లేకుండా ఎలా సూసైడ్ చేసుకుంది? అంత హార్ట్-లెస్ గా ఎలా ఉండగలిగింది?" చూస్తూన్నది కేవలం ఫోటోలోనే అయినా ఆ అమ్మాయి ఆలా ఆత్మహత్య చేసుకుంది అంటే మేనక తట్టుకోలేకపోతూవుంది. నిరుపమ చాలా అందంగా ఇంటెలిజెంట్ లా కనిపిస్తూ వుంది మేనక కి.   

"అదే ఆమె తండ్రి రంగనాథ్ ని కూడా దహించేస్తోంది. మనం ఆ కారణం తెలుసుకుని ఆయనికి తెలియ చెయ్యాలి. ఇంతకీ నేను చెప్పినట్టుగా చెయ్యడం నీకిష్టమేనా?" కుర్చీలో వెనక్కి జారగిలబడి అడిగాడు స్మరన్.

"నువ్వు చెప్పినపని నేనెప్పుడైనా కాదంటానా అంకుల్?" తను కూడా కుర్చీలో జారగిలబడి అంది మేనక. "అలాగే. నేను ఆ రంగనాథం ఇంట్లో ఉంటాను. ప్రతీ విషయం కీన్గా అబ్సర్వ్ చేసి నీకు తెలియపరుస్తాను." 

"అంతే కాదు. నువ్వింకొంచం పనులు కూడా చెయ్యాల్సి ఉంటుంది. నేను వాటిని నీకు ఫోన్లో కాని, లేదా మనిద్దరం కలుసుకుని మాట్లాడుకున్నపుడుకానీ తెలియపరుస్తూ ఉంటాను."

"ఇది నేను ఊహించిందే. నా పని కేవలం అక్కడే స్టే చేసి నీకు రిపోర్ట్ ఇవ్వడంతో పూర్తవ్వదని నేను ముందే అనుకున్నాను." గల గలా నవ్వింది మేనక. "నువ్వేం చెప్పినా నేను చెయ్యడానికి సిద్ధంగానే ఉంటానని నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా."

"ఆల్రైట్. నేను నిన్ను రేపే రంగనాథం ఇంటికి తీసుకు వెళ్తాను. ఈ అసైన్మెంట్ విషయం నేను అమ్మతో మాట్లాడతాను. నాకు హెల్ప్ చెయ్యడానికి అంటే అమ్మనిన్ను ఎందులో ఇంవోల్వ్ చేసినా కాదనదని నాకు తెలుసు."

"అది నిజమే. మమ్మల్నిద్దరిని ఎంతో అభిమానించే మనిషివి నువ్వు. నువ్వు ఏం చెప్పినా మేమిద్దరం కాదనం." మేనక అంది. "ఇంకా మామ్ నిన్ను అడిగినట్లు చెప్పమంది."

"ఎప్పుడూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం. అయినా ఈ ఫార్మాలిటీలా?" నవ్వాడు స్మరన్. "ఎనీహౌ అమ్మ చూడమందని నీకొక మంచి కుర్రాడిని చూసాను. నువ్వొకసారి చూసి ఒకే అంటే అమ్మతో మాట్లాడతాను. మేము ఏ స్టెప్ తీసుకోవాలన్నాకూడా ముందు నీకు నచ్చాలి కదా."

"ఏమిటి అంకుల్ మామ్ లాగే నువ్వూ మాట్లాడుతున్నావు? నేనిప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాను కదా. ఏం.ఏ. ఎకనామిక్స్ చెయ్యాలి, పి.హెచ్.డీ చెయ్యాలి, తరువాత లెక్చరర్ గా వుద్యోగం చేయాలన్నది నా కోరిక." మేనక కోపంగా అంది.

"నీ పై చదువులకి మాకిద్దరికి అభ్యంతరం లేదు. కానీ పెళ్లి చేసుకోవాల్సిన వయసులో చేసుకోవడం అన్నివిధాలుగా మంచిది. నీకు ఇప్పుడు ఇరవై ఒకటి. మర్చిపోకు."

"ఎలా మర్చిపోతాను? నువ్వూ అమ్మ కూడా అదేపనిగా గుర్తు చేస్తూ ఉంటే." ఇంకా కోపంగానే వుంది మేనక.

"నీ నాన్నగారు చనిపోయాక అమ్మ చాలా బాధ పడింది. నువ్వే తనకి లోకం అయిపోయావు. నీకొక మంచి భర్తని సంపాదించి పెట్టడం తన ధ్యేయం. ఇప్పటినుంచి చూస్తేనే కానీ మంచి కుర్రాడిని వెదికి పట్టుకోలేం. ఒకవేళ మంచి అబ్బాయి వేగంగా దొరికేస్తే కాదనకమ్మా." వేడుకోలుగా చూసాడు స్మరన్.

"సరే అంకుల్, ఆలోచిస్తాను." కుర్చీలోంచి లేచింది మేనక. "నేను వెళ్లి ఈ రోజంతా మామ్ తో గడపాలి. రేపటినుండి ఎంతకాలం ఆ ఇంట్లో ఉండాలో తెలియదు. నేను కూడా మామ్ కి విషయం చెప్పి ప్రిపేర్ చేస్తాను."

"రేపు మార్నింగ్ పదికల్లా ఇక్కడకి వచ్చేయి. ఇక్కడినుంచి మనిద్దరం రంగనాథం ఇంటికి వెళదాం." స్మరన్ కూడా కుర్చీలోంచి లేచాడు.

&

"చెప్పాను కదా నేను ఇక వస్తూనే ఉంటానని. అందుకనే మళ్ళీ వచ్చాను." స్మరన్ నవ్వుతూ అన్నాడు. తను, మేనక రంగనాథం ఇంటికి వెళ్లి ఒక్క ఐదు నిముషాలు అవుతూంది. అప్పటికి మేనకని తన అక్క కూతురిగా పరిచయం చేసేసాడు. "అంతేకాదు ఈ సారి మీరు నాకో సహాయం కూడా చేసిపెట్టాలి."

"మేము మీకు ఏ సహాయం అయినా చెయ్యడానికి సిద్ధంగానే ఉన్నాం. కాని మనం అదంతా మీరు కొంచం కాఫీ తాగిన తరువాత మాట్లాడుకుందాం." నిర్మల కూడా నవ్వుతూ అంది. రంగనాథం, స్మరన్ ఇంకా మేనక కుర్చీల్లో కూర్చుని ఉంటే తను మాత్రం వాళ్ళకి అపోజిట్ గా నిలబడి వుంది.

"ముందు మీరు నా మాట విని దానికి అవునంటే తప్ప నాకు మనసు శాంతిగా ఉండదు." అన్నాడు స్మరన్.

"అయితే సరే. అదేమిటో తెలియచేయండి." అక్కడున్న ఇంకో కుర్చీని వాళ్ళకి అపోజిట్ గా లాక్కొని అందులో కూర్చుంటూ అంది నిర్మల.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)