Read Nirupama - 2 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నిరుపమ - 2

నిరుపమ

(కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది)

శివ రామ కృష్ణ కొట్ర

“సరే అయితే. మీ అమ్మాయి గురించి ఇంకొంచం వివరాలు చెప్పగలరా?” కుర్చీలో ముందుకు వంగి మొచేతులు మధ్యలో వున్న టేబుల్ మీద ఆనుస్తూ అడిగాడు స్మరన్. 

“ఇరవై ఒక్క సంవత్సరాలు తను చనిపోయే సమయానికి. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ సైకాలజీ ఫస్ట్ ఇయర్ చదువుతూంది. తనకి ఎవరితోటి ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవు. తనకి బాయ్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. ఇప్పటికే చెప్పాను కదా, తనకి ఆర్ధికంగా గాని, ఆరోగ్యపరంగా గాని ఎటువంటి సమస్యలు లేవు. ఆ రోజు పడుకోవడానికి తన గదిలోకి వెళ్లే ముందు కూడా తను మామూలుగానే వుంది.” ఇంక అంతకన్నా తను చెప్పగలిగింది ఏమి లేదన్నట్లుగా నిట్టూర్చాడు  రంగనాథ్.

“ఇప్పుడు మీకు కావలిసిందల్లా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్యే చేసుకుందో మీకు తెలియాలి, అంతే కదా.” రంగనాథ్ ముఖంలోకి సూటిగా చూస్తూ అడిగాడు స్మరన్.

“నేను కచ్చితంగా తెలుసుకుని తీరాలి.” సడన్గా రంగనాథ్ స్వరంలో దృఢత్వం స్మరన్ ని ఆశ్చర్యపరిచింది. “తను ఎందుకు ఆత్మహత్య  చేసుకుంది అన్న విషయం నన్ను విపరీతంగా బాధిస్తూంది. ఆ విషయం తెలుసుకోకుండా నేను ఉండలేను.”

స్మరన్ మరొకసారి కుర్చీలో వెనక్కివాలి కళ్ళు మూసుకున్నాడు.

“మీ గొప్పతనం గురించి విన్నాను. మీ ఫీజు నేను చెల్లించుకుంటాను. దయచేసి తను ఎందుకు ఆత్మహత్య  చేసుకుందో మీరు తెలుసుకుని తీరాలి.”

“ఖచ్చితంగా తెలుసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. కానీ నేను ఆ విషయం గురించి తెలుసుకునే ముందు నాకు ఒకటి చాల స్పష్టంగా అనిపిస్తూ వుంది.” కళ్ళు తెరిచి రంగనాథ్ మొహంలోకి చూస్తూ అన్నాడు స్మరన్.

“చెప్పండి. నేను వినడానికి సిద్ధంగా వున్నాను.” తన ఎక్స్ప్రెషన్ లో తేడా ఏమీ లేకుండా అన్నాడు రంగనాథ్.

“తను ఆత్మహత్య చేసుకున్న కారణం ఏదైనా కానివ్వండి కానీ అది మీ అమ్మాయి మీకు తెలియడానికి ఇష్టపడలేదు. ఆ విషయం మీకు తెలియడానికి తను ఇష్టపడలేదు అంటే అదేదో మిమ్మల్ని చాల బాధపెట్టే విషయం అయివుంటుంది. తెలుసుకున్న తరువాత ఆ విషయం మీకు ఎంతో కొంత రిలీఫ్ ని ఇవ్వడానికి బదులు ఇంకొంచం బాధపెట్టొచ్చు. నిజానికి…” తను చెప్పబోయేది ఇంకొంచం ముఖ్యమైందిఅని చెప్పడానికి అన్నట్లుగా స్మరన్ కొంచం ఆగాడు. “తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం మీకు తెలియడం మీ అమ్మాయికి ఎంతమాత్రం ఇష్టంలేదు అని నాకు అనిపిస్తూంది.”

“మీరు చెప్పింది నిజమే కావచ్చు. కానీ తను ఎందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం నాకు తెలిసే తీరాలి.” మరొక్కసారి రంగనాథ్ స్వరంలో దృఢత్వం వచ్చింది.

“కొన్ని రహస్యాల్ని మనం రహస్యాలుగానే వదిలేయాలి. వాటిని మనం తెలుసుకోకపోవడమే మంచిది.”

“నిరుపమ మాకు పదేళ్ల సుదీర్ఘ నీరక్షణ తరువాత పుట్టింది. తనకి మేము ఏ లోటు చేయలేదు. అడిగిందల్లా ఇచ్చాం. ఆ రోజు రాత్రివరకు కూడా మామూలుగానే వుంది. సడన్గా ఆ రోజు రాత్రి సీలింగ్ ఫ్యానుకి ఉరేసుకుని చనిపోయింది. మా అవిడ తన గదిలోకి వెళ్లి చూసేసరికి సీలింగ్ ఫ్యానుకి వోణి తో ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది. ఏ తల్లితండ్రులికి అయినా ఎలా ఉంటుంది? మా ఆవిడైతే పిచ్చిది అయిపోయింది. తను ఎందుకు అత్మహత్య చేసుకుందో తెలియాలని నేను ఆరాటపడడంలో ఏవైనా ఆశ్చర్యం వుందా?”

“లేదండి. నేను అంగీకరిస్తాను.” స్మరన్ తలూపాడు.

“దయచేసి మీరు నాకు ఈ పని చేసిపెట్టండి. ఆ విషయం నేను తెలుసుకుని తీరాలి. అంతే.”

“ఈ విషయంలో మీ భార్యగారి అభిప్రాయం ఏమిటి? తను కూడా మీలాగే మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలుసుకోవాలని ఆరాట పడుతూందా?”

“చెప్పానుకదా మా అమ్మాయి చనిపోయిన తరువాత తను పిచ్చిదానిలా అయిపోయింది. తన థృష్టిలో మా అమ్మాయి చనిపోలేదు, ఇంకా బతికే వుంది.” నిట్టూర్చాడు రంగనాథ్.

“నిజంగానా? తను చనిపోయిన విషయం మీ భార్య అంగీకరించడంలేదా?” స్మరన్ భృకుటి ముడిపడింది

“అవును. తన దృష్టిలో మా అమ్మాయి అసలు చనిపోనేలేదు. ఇంక తనెందుకు మా అమ్మాయి చనిపోయిందో తెలుసుకోవాలనుకుంటుంది? ఈ విషయం గురించి ఆరాటపడేది నేను ఒక్కడినే.”

“చాలా బాధాకరమయిన విషయం. తను లేకపోతే తన తల్లి ఏమవుతుందో కూడా ఆలోచించకుండా మీ అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు అర్ధం కావడం లేదు.” స్మరన్ మనసులో విచారం అతని మొహంలో బహిర్గతమవుతూంది.

“అందుకనే నేను ఆ విషయం తెలుసుకోవాలని చాలా మధన పడుతూ వున్నను. ఇంత బాధపడే తన తల్లితండ్రుల గురుంచి కూడా ఆలోచించకుండా మా అమ్మాయి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలిసే తీరాలి.” మరొకసారి ధృడంగా వుంది రంగనాథ్ స్వరం.

“నేను ఈ విషయం ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి అంగీకరిస్తున్నాను. కానీ నేను ఏ విషయం అయినా ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకోవాలి అంటే కొన్ని రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. వాటికీ మీరు అంగీకరించాల్సి ఉంటుంది.”

“అవేమిటో తెలియపరచండి. నేను తప్పుకుండా అంగీకరిస్తాను.” కుర్చీలో సర్దుకున్నాడు రంగనాథ్.

“నేను ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఎవర్నైనా ఏ ప్రశ్నలు అయినా అడుగుతాను. ఏ విషయం అయినా పరిశోధిస్తాను. ఏ మార్గం అయినా ఎంచుకుంటాను. ఎవరి సహాయం అయినా తీసుకుంటాను. అవేవి మీరు కాదనకూడదు. అడ్డు తగలకూడదు.”

“అలాగే. నాకు అంగీకారమే.” రంగనాథ్ తలూపాడు.

“సరే అయితే. నేను ఈ మేటర్ ఇన్వెస్టిగేట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి ఇంకొన్ని ప్రశ్నలు ఇప్పుడే అడుగుతాను. మీరు సమాధానం ఇవ్వాలి.” కుర్చీలో వెనక్కి వాలి నిర్ణయానికి వచ్చినట్టుగా అన్నాడు స్మరన్.

“తప్పకుండా అడగండి.” రంగనాథ్ తలూపాడు.

“మీ అమ్మాయి బాడీకి పోస్ట్ మార్టం జరిగిందా?”

“జరిగింది. అంతా నార్మల్ గానే వుంది. ఏ అఘాయిత్యం తన మీద జరగలేదు. ఫిజికల్ గా ఎలాంటి డిస్టర్బన్స్ లేదు. ఎలాంటి పాయిజన్ కూడా తన శరీరం లో దొరక లేదు.” 

“తన లాస్ట్ ఫోన్ కాల్స్ సెర్చ్ చేశారా? ఎవరెవరితో మాట్లాడింది?”

“తన లాస్ట్ టు ఫోన్ కాల్స్ తన క్లోజ్ ఫ్రెండ్ సమీర కి. అదే రోజు సాయంత్రం. తనప్పుడు చాలా మామూలుగా ఉందని ఏవో సబ్జెక్ట్స్ ఇంకా ఎగ్జామ్స్ విషయమై ఫోన్ చేసిందని సమీర చెప్పింది. వాళ్లిద్దరూ ఒకే కాలేజీ లో ఒకే క్లాస్ లో వుంటారు. చిన్నప్పటినుండి కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళ ఇల్లు మా ఇంటికి దగ్గరే.”

“తన స్మార్ట్ ఫోన్ పూర్తిగా చెక్ చేశారా? ఎలాంటి క్లూ అందులో ఇవ్వలేదా?”

“ తన స్మార్ట్ ఫోన్, ఇంకా తన లాప్ టాప్ కూడా పూర్తిగా, థోరోగా చెక్ చేసాం. సమీర కి ఆ ఫోన్ పాస్ వర్డ్ ఇంక అన్నీ తెలుసు. తన ఫోన్ లో వన్ మంత్ క్రితం వరకు వున్న అన్నీ ఫోన్ నంబర్స్ ఫోన్ చేసి వాకబు చేసాం. ఫొటోస్, వీడియోస్ అన్నీ చెక్ చేసాం. మాకయితే ఎలాంటి క్లూయే దొరక లేదు.” రంగనాథ్ చెప్పాడు. “ఆ ఫోన్, లాప్ టాప్ నా దగ్గరే వున్నాయి. మీకు ఎప్పుడు కావాలన్నా ఇస్తాను.”

“తన సోషల్ ప్రొఫైల్స్ మాటేమిటి? పేస్ బుక్, ట్విట్టర్ లాంటివి? అవి చెక్ చేసారా?”

“తనకి పేస్ బుక్ లో ఒక అకౌంట్, ట్విట్టర్ లో ఒక అకౌంట్ వున్నయి. కానీ వాటిల్ని పెద్దగా వాడదు. తనకి అందులో ఫ్రెండ్స్ ఇంక ఫాలోవర్స్ కూడా చాలా తక్కువ. సమీర కి వాటి పాస్ వర్డ్స్ కూడా తెలుసు. వాటిని థోరోగా చెక్ చేసి చూసాం. నో యూజ్. ఎలాంటి క్లూ వదల్లేదు.” నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.

“తనకి డైరీ రాసే అలవాటు వుందా?”

“తనకి డైరీ రాసే అలవాటు లేదు. ఒకవేళ వున్నాతను అందులోకూడా ఎలాంటి క్లూ వదిలేదని నేను అనుకోను. తను కావాలనే మాకు ఏ విషయం తెలియనివ్వలేదు. తెలియడం తనకిష్టం లేదు.”

స్మరన్ అవునన్నట్టుగా తలూపాడు. “ఈ సమీర కాకుండా ఇంకెవరైనా తనకి క్లోజ్ ఫ్రెండ్స్ వున్నరా?”

“ఈ సమీర ఒక్కతే తనకి క్లోజ్ ఫ్రెండ్. ఇంకా ఒకరిద్దరు ఫ్రెండ్స్ వున్నా వాళ్ళు సమీరంత క్లోజ్ కాదు. సమీరతోనే షేర్ చేసుకోని విషయం వాళ్ళతో కచ్చితంగా షేర్ చేసుకుని ఉండదు.”       

“ప్రస్తుతానికి ఇంతకన్నా అడగడానికి నాకు తోచడం లేదు. రేపు మీరు ఇదే సమయానికి రండి. నేను ఒక అగ్రిమెంట్ ప్రిపేర్ చేసి వుంచుతాను. అందులో నేను చెప్పిన రూల్స్ అండ్ కండిషన్స్, ఇంకా మీరు చెల్లించావలిసిన మొత్తమ, నేను ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసే సమయం లాంటివి ఉంటాయి. మీరు అది చదివి సంతకం చేయవలసి ఉంటుంది. నేను సాధ్యమయినంతవరకు రేపటినుండే నా ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తాను.”

“ఆ ప్రకారంగానే చేస్తాను.” రంగనాథ్ కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. “మరి ఈ రోజుకి నేను వెళ్లి రావచ్చా?”

“మీరు వెళ్లి రావచ్చు.” స్మరన్ కూడా కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. “మీరు ఈ ఫోటో ని నా దగ్గరే ఉంచండి.” అప్పటికి ఇంకా టేబుల్ మీదనే వున్నఫోటోని ఆ టేబుల్ డ్రా లో పెట్టాడు  స్మరన్.

“తప్పకుండా మీ దగ్గరే ఉంచండి.” అని చెప్పాక రంగనాథ్ వెళ్లిపోతుంటే గుమ్మం వరకు వెళ్ళాడు. తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్న తరువాత కూడా ఆ అమ్మాయి గురించి ఆలోచించకుండా ఉండలేక పోయాడు. ఫొటో లో చూస్తూ ఉంటే కేవలం చాలా అందంగా మాత్రేమే కాదు, ఇంటెలిజెంట్ లా కూడా కనిపిస్తూ వుంది.  ఎందుకు తన పేరెంట్స్ ని అంత బాధపెడుతూ ఆత్మహత్య చేసుకుంది?

&

ఆ మరుసటి రోజు చెప్పిన టైంకే వచ్చాడు రంగనాథ్ స్మరన్ ఆఫీసుకి.

“నేను ఒక నెలలో ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీరు కావాలనుకున్నది చెప్పగలను. అలాగే మీరుకూడా నాకు పూర్తి సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను.” మరొకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి, అగ్రిమెంట్ మీద సంతకాలు కూడా అయిపోయిన తరువాత స్మరన్ అన్నాడు.

“అందులో మీకు ఏ సందేహం అవసరం లేదు.” రంగనాథ్ అన్నాడు.

“నేను మీతో ఇప్పుడు మీ ఇంటికి వస్తాను. నన్ను మీ క్లోజ్ ఫ్రెండ్గా మీ భార్యకి పరిచయం చెయ్యండి. నేను ఆవిడతో మాట్లాడిన తరువాత ఏం చేస్తే బావుంటుందో ఆలోచిస్తాను. ఇంతకీ ఆ మాత్రం మాట్లాడే పరిస్థితుల్లో వుందా మీ ఆవిడ?” స్మరన్ అడిగాడు.

“తాను అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటుంది ఒక్క నిరుపమ చనిపోయింది అన్న విషయాన్ని అంగీకరించడం తప్ప. తన దృష్టిలో మా అమ్మాయి ఇంకా బ్రతికే వుంది.” నిట్టూరుస్తూ అన్నాడు రంగనాథ్.

“పదండి. మనం ఇప్పుడు మీ ఇంటికి వెళదాం.” స్మరన్ లేచి నిలబడ్డాడు. తరువాత స్మరన్ తో పాటుగా రంగనాథ్ కూడా లేచాడు.

&

అరగంట కన్నా ఎక్కువ తీసుకోలేదు రంగనాథ్ ఇంటికి వెళ్ళడానికి స్మరన్ ఆఫీస్ నుంచి. యిద్దరూ రంగనాథ్ ఇంటిలోకి వెళ్లే సరికి అక్కడ ఒక అరవై ఏళ్ల పెద్ద మనిషి కుర్చీలో కూర్చుని వున్నాడు. బ్లాక్ స్పెక్ట్స్ తో ఇంకా నల్లటి గడ్డం తో వున్నాడు. మనిషి చాలా ఇంప్రెసివ్ గా వున్నా, ఆ అవుట్ అఫ్ ఫాషన్ బ్లాక్ స్పెక్ట్స్ మాత్రం అయన మొహానికి ఆడ్ గా వున్నయి. ఈ ఇద్దరినీ చూడగానే అయన లేచి నిలబడ్డాడు.

“అరె, నిరంజన్ నువ్వెప్పుడు వచ్చావు? నిర్మల ఎక్కడ?” చిరునవ్వుతో నిరంజన్ మొహంలోకి చూస్తూ అడిగేడు రంగనాథ్.

“ నేనొచ్చి అరగంట అవుతూంది. నన్నిక్కడ ఉంచి తను కిరానా షాపుకి వెళ్ళింది ఏవో సామానులు తేవాలని. ఇంతకీ ఈయన ఎవరు?” భృకుటి ముడిచి అడిగాడు నిరంజన్ స్మరన్ వైపు చూస్తూ.

“చెప్పానుగా నేను ఒక డిటెక్టివ్ దగ్గరికి వెళుతున్నానని.” రంగనాథ్ స్మరన్ గురించి చెప్పాడు నిరంజన్ కి.

“మీ గురించి కొంత విన్నాను. మిమ్మల్ని కలుసుకోవడం నాకు సంతోషంగా వుంది.” చిరునవ్వుతో అన్నాడు నిరంజన్.

బదులుగా తాను కూడా నవ్వి రంగనాథ్ మొహంలోకి చూసాడు స్మరన్ ఆ వ్యక్తి ఎవరో చెప్పమన్నట్లుగా.

“మా ఆవిడకి కజిన్ అవుతాడు. కానీ మా ఆవిడకన్నా కూడా నాకే పెద్ద ఫ్రెండ్. ఒకప్పుడు మేమంతా పక్క పక్క ఇళ్లల్లోనే వుండేవాళ్ళము చాలా క్లోజ్ గా.  తను సైకాలజీ ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్ అయ్యాక నేను ప్రత్యేకంగా అడగడంతో ఈ వూళ్ళో ఇల్లు కొనుక్కుని సెటిల్ అయ్యాడు. తను పెళ్లి చేసుకోలేదు. మేం తప్ప చెప్పుకో దగ్గ బంధువులు ఎవరూ లేరు. ఈ వూళ్ళో ఆ ఇంట్లోనే వంటరిగా ఉంటూ ఉంటాడు. ఆ ఇల్లు మా ఇంటికి దగ్గర్లోనే వుంది. “ అక్కడే వున్నకుర్చీలో కూర్చోమని సైగచేస్తూ స్మరన్ కి  చెప్పాడు రంగనాథ్.

“ చాలా మంచిపని చేసారు. మీ ఇల్లు నాకు కూడా దగ్గరే. సైకాలజీ అంటే నాకూ చాల ఇష్టం. నేనూ సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. నేను కావలసినప్పుడల్లా మిమ్మల్ని కలుసుకుని మాట్లాడొచ్చు.” చిరునవ్వుతో అన్నాడు స్మరన్.

“మీరు ఎప్పుడైనా నా దగ్గరికి మాట్లాడడానికి రావచ్చు. మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం. చెప్పానుగా నేను ఆల్రెడీ మీ గురించి విన్నాను.” నిరంజన్ కూడా నవ్వాడు.

“నిరంజన్ చాలా ఆసక్తికరమయిన వ్యక్తి. అయన కంపెనీ చాలా బాగుంటుంది. అందుకనే నేను తనని మా ఇంటికి దగ్గర్లో సెటిల్ అవ్వాలని పట్టుపట్టాను.” తను కూడా అక్కడున్న కుర్చీలో కూర్చున్నాక అన్నాడు రంగనాథ్.

“నిజంగా నన్నెక్కువ అభిమానించింది, ఇష్టపడినిది నిరుపమ.” మునుపు కూర్చున్న కుర్చీని రంగనాథ్ కి స్మరన్ కి దగ్గరగా లాక్కుని అందులో సెటిల్ అయ్యాక అన్నాడు నిరంజన్. “ నన్ను చూసి ఇంప్రెస్ అయి, నా ఇన్స్పిరేషన్ తోనే నిరుపమ సైకాలజీలో జాయిన్ అయింది.”

“అంతేనా? తన క్లోజ్ ఫ్రెండ్ సమీర సైకాలజీలో జాయిన్ అవ్వడానికి కూడా నువ్వే కారణం కదా.” రంగనాథ్ నవ్వాడు.

“అది నిజమే. కానీ నిరుపమ అంతగా నన్ను అభిమానించి, ఇష్టపడిన వాళ్ళు లేరు.” నిట్టూరుస్తూ అన్నాడు నిరంజన్.

“అయితే మీరు నిరుపమకి చాలా క్లోజ్ అన్నమాట. తాను మీతో అన్నీ విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేదా?” కుర్చీలో వెనక్కి  జారగిలబడుతూ అడిగాడు స్మరన్.

“ఎస్. అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ ఉండేది. కానీ ఆ ఒక్క విషయం మాత్రం నాతో ఎందుకు షేర్ చేసుకోలేదో నాకు తెలియడం లేదు. ఇంత పెద్ద సైకాలజిస్ట్ ని అయివుండి, తనతో అంత క్లోజ్ అయివుండి కూడా తన మనసులో జరుగుతూన్న సంఘర్షణని అర్ధం చేసుకోలేకపోయాను. ఇంతమందిని బాధపెడుతూ తనెందుకు ఆత్మహత్య చేసుకుందో అసలు అంతుపట్టడం లేదు.” కుర్చీలో వెనక్కివాలి కళ్ళుమూసుకుని నిట్టూర్చాడు నిరంజన్.

“ఆ విషయం తెలుసుకోవాలనే నేను స్మరన్ గారిని ఎంగేజ్ చేసింది. నాకు పూర్తి నమ్మకం వుంది, స్మరన్ గారు కచ్చితంగా ఆ విషయం తెలుసుకోగలరని.” స్మరన్ ముఖంలోకి చూస్తూ అన్నాడు రంగనాథ్.

“కానీ ఏం ప్రయోజనం రంగనాథ్, నువ్వెందుకు ఆ విషయం తెలుసుకోవాలని అంతగా ఆరాట పడుతున్నావు?” కళ్ళు తెరిచి రంగనాథ్ ముఖంలోకి చూస్తూ అడిగాడు నిరంజన్. “మనం ఏం తెలుసుకున్నా తనింక తిరిగి రాదు. అంతే కాకుండా ఇంకొక విషయం కూడా స్పష్టంగా అర్ధం అవుతూంది. తనకి ఆ విషయం మనకి తెలియడం ఇష్టంలేదు. అటువంటప్పుడు, నువ్వా విషయం గురించి పూర్తిగా మర్చిపోయి నిర్మల ఆరోగ్యం మీద ధృష్టి ఎందుకు పెట్టకూడదు?”

“నేను అదే సజెస్ట్ చేసాను. కానీ రంగనాథ్ గారు ఆ విషయం తెలుసుకోవాలని చాలా పట్టుదలగా వున్నరు.” తాను కూడా రంగనాథ్ ముఖంలోకి చూస్తూ అన్నాడు స్మరన్.

“నేను నీలా ఆలోచించలేక పోతున్నాను నిరంజన్. తను ఆత్మహత్య చేసుకుంది అన్న విషయం కన్నా కూడా తనెందుకు ఆత్మహత్య చేసుకుంది అన్న విషయమే నన్ను ఎక్కువ బాధిస్తూంది. తనెందుకు ఆత్మహత్య చేసుకుందో నాకు తెలిసి తీరాల్సిందే.” పట్టుదలగా అన్నాడు రంగనాథ్.

“ఓకే అయితే. నీ కోరిక తీరాలనే నేను కోరుకుంటున్నాను.” మరొకసారి కుర్చీలో వెనక్కి జారగిలబడుతూ నిరంజన్ అన్నాడు.

“ఎనీహౌ, నేను నా ఇన్వెస్టిగేషన్ విషయంలో మీతో డీప్ గా మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఎప్పుడు మీ దగ్గరికి రావచ్చు?” స్మరన్ అడిగాడు.

“ఎప్పుడైనా సరే.” నిరంజన్ నవ్వాడు. “నా ఇల్లు ఇక్కడికి చాలా దగ్గర. సైకాలజిస్ట్ నిరంజన్ ఇల్లు అంటే మీకు ఎవరైనా చూపిస్తారు.”

“చాలా సంతోషం.” స్మరన్ ఎదో చెప్పబోతూ ఉండగా ఒక యాభై ఏళ్ళ వయసు వున్న మహిళ అక్కడికి అడుగు పెట్టింది. ఆమె ఎవరో చెప్పకుండానే స్మరన్ అర్ధం చేసుకోగలిగాడు.

(ఇక్కడివరకూ నచ్చిందని భావిస్తా. తరువాత భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)