Read Are Amaindi - 7 by sivaramakrishna kotra in Telugu Detective stories | మాతృభారతి

Featured Books
  • అరె ఏమైందీ? - 7

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • అరె ఏమైందీ? - 6

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • అరె ఏమైందీ? - 5

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • అరె ఏమైందీ? - 4

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • అరె ఏమైందీ? - 3

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 7

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

నిరంజన్ మొహంలోకి చూస్తూ. "నేనిప్పుడు మళ్ళీ అయిదు అంకీలు లెక్క పెడతాను. నేను అయిదు అనేసరికి నువ్వు నీ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తావు." అని చెప్పడం మొదలు పెట్టాడు.

"ఒకటి................నువ్వు నెమ్మదిగా ఈ హిప్నోసిస్ లోనుండి బయటకి వస్తున్నావు. రెండు..........నువ్వు పూర్తిగా ఈ లోకంలోకి వస్తున్నావు. మూడు............నీ మనస్సు, నీ శరీరం పూర్తిగా నీ స్వాధీనం లోకి వస్తున్నాయి. నాలుగు..........నువ్వు కళ్ళు విప్పుతున్నావు. అయిదు..........నువ్వు పూర్తిగా మామూలుగా అయ్యావు. ఇంకా ఆ కుర్చీలో ఉండాల్సిన అవసరం లేదు, బయటకి రా."

మంగళాచారి నాలుగు అనగానే కళ్ళు విప్పిన నిరంజన్, అతను అయిదు అనగానే కుర్చీలోనుండి లేచిపోయాడు.

&&&

"ఆ సర్వేశ్వరం భార్యకి, అంటే మా అబ్బాయిని పెళ్లిచేసుకోవాల్సిన అమ్మాయి తల్లికి మనఃస్థిమితం ఉండేది కాదు. ఆ సర్వేశ్వరం ఆవిడని ఎందరో డాక్టర్లకి చూపించాడు కానీ ప్రయోజనం లేకపోయింది. సర్వేశ్వరం ఆవిడ గురించి నా దగ్గర చెప్పి బాధపడుతూ ఉండేవాడు.  ఆ అమ్మాయికి పది, పన్నిండేళ్ల వయసువున్నప్పుడు ఆవిడ చనిపోయింది. అన్నిరకాలుగా అవకాశం వున్నా నా ఫ్రెండ్ మరో పెళ్లిచేసుకుందామని మాత్రం ఆలోచించలేదు. తనకి తన కూతురు అంటే చాలా ప్రేమ." మళ్ళీ అందరూ వాళ్ళ వాళ్ళ కుర్చీల్లో సెటిల్ అయ్యాక మంగళాచారి మొహంలోకి చూస్తూ చెప్పాడు చిదంబరం.

"బహుశా ఆ అమ్మాయికి ఐదో ఆరో సంవత్సరాల వయస్సు వున్నప్పుడు ఆవిడ అంతే వయసు వున్నా అబ్బాయికి ఇచ్చి బొమ్మల పెళ్లి లాంటిది చేసి ఉంటుంది. ఆవిడ అది నిజం పెళ్లిలాగే భావిస్తూ వున్నా ఆ పిచ్ఛావిడ చేసిన పెళ్లిని ఆ తండ్రీ కూతురూ యాక్సెప్ట్ చెయ్యలేదు. అందుకే తన పెళ్లిని మీ అబ్బాయితో నిర్ణయించారు." మంగళాచారి అన్నాడు.

"ఆ పిచ్ఛావిడ ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్ళిచేసిన  ఆ అబ్బాయేవారో తెలుసుకుని వుండాల్సిందంటారా?" శకుంతల అడిగింది.

"ఆ అవసరం లేదు. మీ అబ్బాయి పెళ్ళికి అడ్డుపడుతున్నది ఎవరో తెలిసిపోయింది కదా. ఆవిడ అడ్డు తొలగించుకుంటే చాలు, సమస్య తీరినట్టే." మంగళాచారి అన్నాడు.

"ఆవిడ గురించి ఆలోచిస్తూంటే చాలు, నాకు వెన్నులోనుండి వణుకు పుట్టుకు వస్తోంది. ఆ మంజీర గురించి ఆలోచించినా సరే నా తాట తీస్తానని చెప్పింది." నిరంజన్ మొహం మరోసారి భయంతో నిండిపోయింది.

"ఆ దయ్యాన్ని వదుల్చుకోవడానికి మీరు నా దగ్గరికి కూడా వచ్చారు కాబట్టి, ఈసారి అసలు ఊరుకోదు. మీ అబ్బాయి ప్రాణాలతో పాటు మీ ఇద్దరి ప్రాణాలకి కూడా ప్రమాదం తలపెడుతుంది." మంగళాచారి అన్నాడు.

"మరైతే ఇప్పుడేం చేద్దాం? ఆ అమ్మాయి గురించి మేం పూర్తిగా మర్చిపోతే మాకీ ప్రమాదం తప్పుతుందా?" శకుంతల అడిగింది.

"ఆ అమ్మాయిగురించి పూర్తిగా మర్చిపోవడానికి నేను సిద్ధంగా వున్నాను. నన్ను ఆ రోజు కొట్టిన కొట్టుడు నేనెప్పటికీ మర్చిపోలేను." నిరంజన్ అన్నాడు. 

"కానీ ఆ అమ్మాయి మీ కోడలయితే మీకు చాలా లాభం ఉంటుందన్నట్టుగా చెప్పారు మీ ఆయనగారు." చిదంబరం మొహంలోకి చూస్తూ అన్నాడు మంగళాచారి.

"అది కోడలయితే మా వాళ్ళకి చాలా లాభం వుండొచ్చు. కానీ దాని తల్లిమాత్రం నా ప్రాణాలు తీసేస్తుంది. ఆ దయ్యం పీడ విరగడయ్యేలా, నేను ప్రశాంతంగా వుండేలా చూడండి చాలు." నిరంజన్ అన్నాడు.

"ఇప్పుడు కేవలం మీ అందరూ ఆ అమ్మాయిని మరిచిపోయినంత మాత్రాన, ఆ దయ్యం మిమ్మల్ని మరిచిపోతుందని నాకనిపించడం లేదు. మిమ్మల్ని అంత తేలికగా అది నమ్మకపోవచ్చు." మంగళాచారి కాస్త ఆగాడు. "అంతేకాకుండా ఆ దయ్యానికి భయపడి ఆ అమ్మాయిని మరిచిపోవడం కూడా అవివేకమే. ఆ దయ్యం పీడ వదుల్చుకుని, మీరు ఆ అమ్మాయిని కోడలుగా తెచ్చుకుంటే మీకు చాలా లాభదాయకం కదా."

"అయితే మంచి ఉపాయం ఏదన్నా మీరే మాకు చెప్పండి. మేమూ అంతోఇంతో వున్నవాళ్ళమే. మీ ఉపకారానికి తగ్గట్టుగా సత్కారం చేసుకుంటాం." చిదంబరం అన్నాడు.

"నేను మాత్రం ఆ దయ్యం పీడ పూర్తిగా వదిలేవరకూ ఇంటికి వెళ్ళను. ఇప్పుడు దాని పీడ వదుల్చుకోడానికి మీదగ్గరికి కూడా వచ్చాను కాబట్టి అది నన్నేమైనా చేస్తుంది." నిరంజన్ లో భయం అలాగే వుంది.

"దీన్ని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు, అది ఆరోజు మావాడితో ఎలా ఓ ఆట ఆడుకుందో."శకుంతల అంది.

"మీరు కంగారు పడకండి. నాకు మంచి ప్రావీణ్యం వున్న శిష్యులు కొంతమంది వున్నారు. వాళ్ళల్లో ఒక్కళ్ళు ఈ దయ్యం సమస్య తీరేవరకూ మీతో వుండేలా చూస్తాను." మంగళాచారి అన్నాడు.

"ఇప్పుడే ఎలాగైనా వాళ్ళల్లో ఒకళ్ళు మాతో వచ్చేలా చూడండి. మీరు లేకుండా మేం ఉన్నామంటే అదొచ్చిమమ్మల్ని ఏదన్నా చెయ్యొచ్చు." భయంగా అన్నాడు నిరంజన్.

"అయితే మీరిక్కడే వుండండి. నేను వెళ్లి నా శిష్యులెవరన్నా అందుబాటులోవున్నారేమో చూసి మాట్లాడి నాకూడా తీసుకొస్తాను." అని కుర్చీలోనుండి లేచాడు మంగళాచారి.

"మీరాపని ఫోన్లోనే మాట్లాడి చెయ్యొచ్చుకదా. మీరిలా మమ్మల్ని వదిలి వెళతారంటే నాకు భయంగా వుంది. నేనెందుకిలా భయపడుతున్నానో నీకు చెప్పక్కరలేదు." మంగళాచారి నిర్ణయానికి సంతోషంగా అనిపించినా, కాస్సేపన్నా అతను లేకుండా ఉండడానికి నిరంజన్ కి భయంగా వుంది. ప్రస్తుతం ఆ దయ్యం అంతు చూడ్డానికి వచ్చారు, అదేమిటో కూడా తెలిసిపోయింది. ఇంకది ఊరుకుంటుందా?

"నా క్లినిక్ అంతా మంత్రం దిగ్బంధం చెయ్యబడి వుంది. ఇక్కడికి ఏ భూతాలు, దెయ్యాలు రాలేవు. కాబట్టి అనవసరంగా భయపడొద్దు." మంగళాచారి నవ్వి అన్నాడు. "ఇది ఫోన్ లో మాట్లాడి సెటిల్ చెయ్యగలిగిన విషయం కాదు. నేను ముఖస్థంగా మాట్లాడి ఒప్పించాలి." అక్కడనుండి బయలుదేరుతూ అన్నాడు.

"డబ్బుల విషయంలో మీరంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము అంతో ఇంతో వున్నవాళ్ళమే. మాకు ఈ సమస్య తీరిపోయి, ఆ అమ్మాయితో మావాడి పెళ్లి జరిగిపోతే చాలు." మంగళాచారి అక్కడనుండి వెళుతూండగా అన్నాడు చిదంబరం.

&&&

"నువ్వు ఈ అవకాశాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే చాలు. నీ ఇద్దరు అక్కల్లాగే లైఫ్ లో సెటిల్ అయిపోయినట్టే." తన కూతురు మల్లిక తో అన్నాడు మంగళాచారి.  "వాళ్ళ వ్యవహారం, వేష భాషలు చూస్తూవుంటే మంచి ఆస్తిపరులు లా వున్నారు. చాలా ఖరీదైన కారులో వచ్చారు. అంతేకాకుండా ఆ అబ్బాయి తండ్రి తాము ఆస్తిపరులమని అన్నాడు."

ఆ సమయం లో హాల్లో భార్య చారులత ఇంకా కూతురు మల్లిక తో కూచుని మాట్లాడుతూ వున్నాడు అతను. మొత్తం విషయం అంతా వివరంచి చెప్పాడు వాళ్ళిద్దరికీ మంగళాచారి.

"వాళ్ళేదో ఆస్తి పరులని అబ్బాయి ఎలా వున్నా నేను కాంప్రమైజ్ అయిపోలేను డాడ్." ప్రమీల అంది.

"అబ్బాయి బాగానే వున్నాడు. నువ్వొక్కసారి వచ్చి చూడు. నీకు నచ్చకపోతే వాడితో పెళ్లివరకూ వెళ్లొద్దు. ఎదో ఇంత డబ్బు చేసుకుని వూరుకుందాం." మంగళాచారి అన్నాడు.

"మీ డాడ్ ఇలా కుదిర్చిన రెండు సంభందాలతో నీ అక్కలిద్దరూ ఎంత చక్కగా కాపురం చేసుకుంటున్నారు.అందులోనూ ఈ అబ్బాయి ఆస్థిపరుడు అని కూడా అంటున్నారు.  నీ గురించి ఈమాత్రం ఆలోచించకుండా మీ డాడ్ ఈ నిర్ణయం తీసుకుని వుంటారా?  ఏదో రాజకుమారుడు కావాలని కాకుండా, నువ్వీ అబ్బాయితో సెటిల్ అయితే నీ లైఫ్ బాగుంటుంది." ప్రమీల తల్లి  చారులత కోపంగా అంది.

"అదికాదు మామ్.........." ప్రమీల ఎదో చెప్పబోయింది.

"నువ్వింకేం మాట్లాడకు. ఈ అబ్బాయి నా అల్లుడు కావాలి. ఈ మాత్రం చేసుకోలేకపోతే నువ్వీమాత్రం అందంగా పుట్టి ప్రయోజనం ఏమిటి?" కోపంగా అంది   చారులత.

"ఒకే మామ్ అలాగే అయితే." ప్రమీల నవ్వుతూ అని మంగళాచారి మొహంలోకి చూసి అంది. "కానీ డాడ్ వాళ్లెవరో అమ్మాయిని కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నారని.........." అంటూ ఏదో అనబోయింది.

"అదంతా జరగనిస్తామా? చాకచక్యంగా నువ్వా అబ్బాయిని నీ మొగుడ్ని చేసుకోకపోతే నీ అక్కలనుండి నువ్వేం నేర్చుకున్నట్టు?" కోపం అభినయించాడు మంగళాచారి.

"ఒకే డాడ్. ఐ యాం రెడీ ఫర్ ది మిషన్." మరోసారి నవ్వింది ప్రమీల.

"మీరు మరీ ఆలస్యం చెయ్యకుండా వెళ్ళండి. వాళ్ళని ఎక్కువసేపు అక్కడ అలా కూచోపెట్టడం మంచిదికాదు."   చారులత అంది.

తరువాత మంగళాచారి, మల్లిక అక్కడనుండి అతని క్లినిక్ కి బయలుదేరారు.

&&&

"ఈ అమ్మాయిపేరు మల్లిక. నా బెస్ట్ స్టూడెంట్. ఇలాంటి పిశాచాలు, భూతాలుతో ఒక ఆట ఆడుకుంటుంది. ఆ దయ్యం సమస్య మీకు పూర్తిగా తీర్చడమే కాదు, మీ అబ్బాయి పెళ్లి ఆ అమ్మాయితో ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూస్తుంది." మల్లికని వాళ్ళ ముగ్గురికీ పరిచయం చేస్తూ అన్నాడు మంగళాచారి. "ఈ అమ్మాయి ఈ క్షణం నుండి మీ అబ్బాయిని ఒక్క క్షణం కూడా వదలకుండా వుంటుంది."

"మీకు మగ స్టూడెంట్స్ ఎవరూ లేరా? ఎంత బెస్ట్ స్టూడెంట్ అయినా ఈ అమ్మాయి మంచి పరువంలో ఇంకా అందంగా కూడా వుంది. మా అబ్బాయిది అసలే చపలచిత్తం." అనీజీ గా అంది శకుంతల.

"వున్నారు కానీ వాళ్ళందరూ ప్రస్తుతం చాలా బిజీ గా వున్నారు. మీకు ఎరేంజ్ చెయ్యడానికి నాకు ఈ అమ్మాయితప్ప వేరే ఎవళ్ళూ దొరకలేదు." మంగళాచారి అన్నాడు.

"మీరేం భయపడకండి ఆంటీ. మీ అబ్బాయిది చపలచిత్తం అయినా నాది కాదు. ఎలాంటి పొరపాటు జరగకుండా చూసుకుంటాను." నవ్వి అంది మల్లిక. "అంతేకాదు, ఆ దయ్యం సమస్య పూర్తిగా తీరి మీ అబ్బాయి పెళ్లి ఆ అమ్మాయితో జరిగేలా చూస్తాను."

"మీరింకేం ఆలోచించకండి. ఈ అమ్మాయిని మీ కూడా తీసుకుని వెళ్ళండి. మీ అబ్బాయితోటె వుండి ఆ దయ్యం గురించిన పూర్తి వివరాలు నాకు ఈ అమ్మాయి చెప్తుంది. అప్పుడు ఆ దయ్యం సమస్య పూర్తిగా ఎలా వదల్చాలా అని నేను ఆలోచిస్తాను." మంగళాచారి అన్నాడు.

"సరే అయితే." శకుంతల అన్నాక ఆ ముగ్గురూ మల్లిక తో పాటుగా కారులో ఇంటికి బయలుదేరారు.

"వాళ్ళమ్మ తన చిన్నతనం లో తనని ఇచ్చి పెళ్లి చేసింది బహుశా ఆ అనిరుధ్ కె అయి వుంటుంది. అందుకనే ఆ సర్వేశ్వరం తనని అనిరుధ్ కి ఇచ్చి పెళ్లి చెయ్యాలని నిర్ణయించుకున్నాడు." తన దగ్గరికి అనిరుధ్ వచ్చి మాట్లాడింది గుర్తు చేసుకుంటూ అన్నాడు నిరంజన్.

"ఆ అనిరుధ్ ఎవడు? నాకేం అర్ధంకావడం లేదు." చిదంబరం అన్నాడు.

అప్పుడు నిరంజన్ అనిరుధ్ గురించి, అనిరుధ్ తనదగ్గరికి వచ్చి మాట్లాడిన విషయం గురించి వివరంగా చెప్పాడు.

"ఆ బాల్య వివాహం నచ్చకే కదా ఆ తండ్రీ కూతురూ నీతో తన పెళ్ళికి అంగీకరించింది. ఇప్పుడు ఆ సర్వేశ్వరం ఎందుకు తన కూతుర్ని మళ్ళీ వాడికిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాడు?" మంగళాచారి రీజనింగ్ గుర్తు చేసుకుంటూ అన్నాడు చిదంబరం.

"అదే నాకూ అర్ధం కావడం లేదు." శకుంతల కూడా ఆశ్చర్యపడింది.

"కారణం ఏదన్నా కానీ, దాన్ని పెళ్లిచేసుకోవడం మాత్రం నాకు ఇష్టం లేదు. ఆ రోజు అది ఎంత భయంకరంగా మారిందో తలచుకొంటూ వుంటే మాత్రం వెన్నులో వణుకు వస్తూంది." నిరంజన్ అన్నాడు.

మంజీర లాంటి అందగత్తె ని అనుభవించకుండా వదిలేయడం ఇష్టం లేకపోయినా, ఆ రోజు అనుభవం నిజంగానే చాలా భయం కలిగిస్తూ వుంది నిరంజన్కి.

"దాన్ని పెళ్ళిచేసుకుంటే కలిసొచ్చే ఆస్తుల గురించి ఆలోచించకుండా అలా భయపడి చస్తావేంట్రా?" చిరాగ్గా అన్నాడు చిదంబరం. ‘అంతేకాకుండా ప్రస్తుతం మనం వున్న ప్రరిస్థితుల గురించి కూడా ఆలోచించు.’ అనబోయి అక్కడవున్న మల్లికకి విషయం బోధపడకూడదని అనలేదు.

"మీరేం భయపడకండి అంకుల్. తన అన్ని భయాలు పోయి ఆ అమ్మాయిని హాయిగా పెళ్లిచేసుకునేలా నేను చూస్తాను." మల్లిక అంది.

"నువ్వలా చేశావంటే నీ మేలు ఎప్పటికీ మరిచిపోము." చిదంబరం అన్నాడు.

ఆ తరువాత వాళ్ళ మధ్య పెద్దగా మాటలు లేకుండానే ఆ ప్రయాణం సాగిందిచిదంబరం డ్రైవ్ చేస్తూవుండగా.   

&&&

ప్రమీల ఆలా మాట్లాడిన తరువాత ఎందుకనో అనిరుధ్ కి మనోజ్ ఇంటికి వెళ్లాలనిపించలేదు. అందుకని మనోజే ఒక రెండురోజుల తరువాత అనిరుధ్ ఇంటికి వచ్చేడు. అనిరుధ్ తన ఇంటికి రాకపోవడానికి కారణం ఏమిటో మనోజ్ కాస్త ప్రెస్ చేసిన తరువాత, అనిరుధ్ చెప్పేసాడు. అలా చెప్పేడమే అనిరుధ్ కి మంచిదనిపించింది.

"నా చెల్లెలి తరపున నేను నీకు సారీ చెప్తున్నా. తను చిన్నపిల్ల. తనని క్షమించు." మనోజ్ అన్నాడు. "అది మనసులో పెట్టుకుని నువ్వు మా ఇంటికి రావడం మానేస్తే మాత్రం నేను చాలా బాధపడతాను."

"ఒకే. నేను అలాగే వస్తాను. తను నా గురించి అలా ఆలోచించడం లో కూడా నేను తనని పూర్తిగా తప్పు పట్టలేను. కానీ..................." కాస్త ఆగి అన్నాడు అనిరుధ్. "............నువ్వు తనని చూసినట్టుగానే నేను తనని చూస్తున్నాను. మరొకలా తన గురించి ఆలోచించలేను."

"నా చెల్లెలు లాంటి అమ్మాయి అలా అలా అన్నందుకు నీ ప్లేస్ లో మరొకళ్ళు అయితే అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు. నువ్వు కాబట్టే తను సేఫ్ గా వుంది." మనోజ్ నవ్వాడు. "నేనూ నువ్వు నా చెల్లెలి భర్తవైతే బావుంటుందని చాలా రోజులు ఆలోచించాను. కానీ ఇప్పుడు నేను అలా ఆలోచించక పోవడానికి ఒక బలమైన కారణం వుంది."

"ఏమిటది?" నొసలు మూడేసి కుర్చీలో ముందుకు వంగాడు అనిరుధ్.

"నువ్వు మంజీరని పెళ్లి చేసుకుంటే బావుంటుంది అని నాకు అనిపిస్తూంది.  ఆ సర్వేశ్వరం చాలా మంచి వ్యక్తి. మా కుటుంబం తో సహా చాలా కుటుంబాలకి సహాయం చేసాడు. కారణం ఏదైనా అయన నువ్వు తన అల్లుడు కావాలనుకుంటే, అలా జరగడం మంచిది. అలాగే మంజీర కూడా ఒక మనఃస్థిమితం లేని తెల్లిదగ్గర పెరిగింది. ఆ తల్లినీ పన్నెండేళ్ల వయసులో పోగొట్టుకుంది. ఎదో తనూ సరిగ్గా ఆలోచించలేక ఆ నిరంజన్ గాడితో తిరిగింది. ఇప్పుడు తన ఆలోచన తప్పని తెలుసుకుని నిన్ను పెళ్లిచేసుకోవాలనుకుంటూంది. తను తెలివితక్కువగా బిహేవ్ చేసిందే కానీ చెడ్డది కాదు. తనతో పెళ్ళికి నువ్వు ఒప్పుకోవడమే మంచిది."

"నువ్వు ఆలోచించినట్టుగా నేను ఆలోచించ లేకపోతున్నాను. నేను పలకరించి మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు, నన్నెంతో హీనంగా చూసి వెళ్ళిపోయింది. తను నిరంజన్ తో తిరగడం కూడా నువ్వు తీసుకున్నంత తేలికగా నేను తీసుకోలేను. కారణం ఏమిటో కూడా చెప్పకుండా నేను తనని పెళ్లి చేసేసుకోమంటే అందుకు ఎలా అంగీకరించను?" చిరాగ్గా అన్నాడు అనిరుధ్.

"నువ్వలా మాట్లాడితే నేనేం చెప్పలేను. కానీ ఆ మంజీరని పెళ్లిచేసుకోవడం నువ్వు తప్పించుకోలేవేమోనని నాకనిపిస్తోంది. అంత అప్పుని ఇంత త్వరగా నువ్వు ఎలా తీర్చగలవు? అలాగే నువ్వు నీ ఇంటిని వదులుకోవడానికి కూడా సిద్ధంగా లేవు." మనోజ్ అన్నాడు.

"నేనూ ఏం ఆలోచించలేకపోతున్నాను. ఎనీహౌ నీకొక ముఖ్యమైన విషయం ఇంకా చెప్పలేదు." ముకుందం తో తను మాట్లాడిన విషయాలు గుర్తుకొచ్చి అన్నాడు అనిరుధ్.

"మారాలస్యం లేకుండా అదేమిటో చెప్పు? మనం మన స్టడీ మొదలు పెట్టాలి." మనోజ్ ఆసక్తిగా అడిగాడు.

"మంజీరతో నా ఈ పెళ్లిగోల కాదు కానీ నేను చదువుకోవడం లేదు, నిన్నూ చదవనివ్వడం లేదు. మనం సివిల్స్ పాసయినట్టుగానే వుంది." చిరునవ్వు నవ్వి అన్నాడు అనిరుధ్.

"ఈ సమయాన్ని కంపన్సేట్ చేస్తూ చదివేద్దాం కానీ అసలు విషయం ఏమిటో చెప్పు." మనోజ్ లో ఆసక్తి అలాగే వుంది.

అప్పుడు ముకుందం తనూ హోటల్ లో భోజనం చేస్తూండగా, తను నిరంజన్ మంజీరల గురించి చెప్పినదంతా మనోజ్ కి చెప్పాడు అనిరుధ్.

"నిజంగా మంజీర అలా బిహేవ్ చేసిందా?" ఆశ్చర్యంగా అడిగాడు మనోజ్.

"ఆ నిరంజన్ నాతొ మాట్లాడిన తీరు గుర్తు చేసుకుంటూంటే నాకు వాడు చెప్పినది నిజమే అనిపిస్తూంది." అనిరుధ్ అన్నాడు.

"నువ్వు నిరంజన్ ని కలిసి మాట్లాడావా? ఎప్పుడు మాట్లాడావు?" ఆశ్చర్యంగా అడిగాడు మనోజ్.

"ఆ విషయం కూడా నీకు చెప్పలేదు కదా. నేను నిరంజన్ ని కలిసి మాట్లాడాను. వాడు నాతొ ఏం మాట్లాడింది నీ ఇంటికొచ్చిన రోజున నీకు చెప్దామనుకున్నాను. అప్పుడు ప్రమీల మాత్రమే వుంది. తనకంతా చెప్పాను. తను వాళ్ళ సోషల్ ప్రొఫైల్స్, అంటే పేస్ బుక్, ట్విట్టర్ లో వాళ్ళ అకౌంట్స్ వెరిఫై చేద్దామని చెప్పింది. నీ లాప్ టాప్ లో అవి వెరిఫై చేసాం కూడా. కాకపోతే పనికొచ్చే క్లూ ఏమీ దొరకలేదు." అనిరుధ్ అన్నాడు.

"నువ్వు తన లవ్ యాక్సెప్ట్ చేయలేదన్న కోపంతో కాబోలు, ఆ విషయాలేమీ నాకు చెప్పలేదు." చిరునవ్వుతో అన్నాడు మనోజ్. "ఎనీహౌ ఆ నిరంజన్ నీతో ఏం మాట్లాడాడు? వాడికి చాలా పొగరు. వాడు నీతో మాట్లాడడమే నాకు ఆశ్చర్యంగా వుంది."

అప్పుడు అనిరుధ్ తను నిరంజన్ ని ఎలా కలుసుకున్నది, వాడు తనతో ఏం మాట్లాడింది మనోజ్ కి వివరంగా చెప్పాడు.

"నువ్వు నాకు ముందు చెప్పాల్సింది వెనక, వెనక చెప్పాల్సింది ముందు చెప్పావు." అంతా విన్నాక చిరునవ్వుతో అన్నాడు మనోజ్. "ఏది ఎలా చెప్పినా విషయం లో క్లారిటీ అయితే మాత్రం లేదు. తను ఆ నిరంజన్ గాడితో ఎందుకలా బిహేవ్ చేసింది అన్నది నాకు బోధపడదాం లేదు. కానీ తన చేతుల్లో అలా తన్నులు తిన్న తరువాత ఆ నిరంజన్ అలా భయపడడం లో మాత్రం ఆశ్చర్యం లేదు." ఇంక నవ్వకుండా వుండలేకపోయాడు మనోజ్.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)