Read Are Amaindi - 3 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 3

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

కాకపోతే సర్వేశ్వరం అదృష్టం అన్ని విషయాల్లోనూ కలిసి రాలేదు. మంజీరకి పన్నెండేళ్ల వయసు వున్నపుడు కాబోలు, నిర్మల చనిపోయింది. ఎందుకనో ఆ సమయంలో ఆవిడ పిచ్చి బాగా పెరిగి, బ్లడ్ ప్రెజర్ బాగా పెరిగి, ఎదో విపరీతం జరిగి చనిపోయిందని చెప్తారు. అసలు ఎం జరిగిందో అనిరుధ్ కి తెలియదు కానీ, ఆ కుటుంబంలో మాత్రం ఆ తరువాతనుండి చాలా మార్పులు వచ్చాయి. అప్పటివరకూ తన తండ్రితో ఎంతో స్నేహంగా వుండే సర్వేశ్వరం తన తండ్రితో మాట్లాడడం మానేసాడు. నిర్మల చనిపోవడంతో తన తల్లికి ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం రాలేదు. 

నిజంగా ఎక్కువమార్పు మంజీరలోనే వచ్చింది. తను వాళ్ళింటికి వెళ్లి పలకరించినా తనతో మాట్లాడడం మానేసింది. తను ఆ విషయం తన తల్లితో అప్పట్లో ఫిర్యాదు చేసాడు కూడా.

"ఆడపిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నకొద్దీ మగపిల్లలతో అంతా ఫ్రీగా వుండరు. తనసలే తల్లి తోడులేక నానా బాధ పడుతూ వుంది. క్రమంగా మళ్ళీ తను మారుతుంది. నువ్వు తన ప్రవర్తనని సీరియస్ గా తీసుకోకు." అని తన తల్లి చెప్పింది.

అప్పటికి అలాగే అనుకున్నాడు అనిరుధ్. కానీ మంజీరలో ఎంతమాత్రం మార్పురాలేదు సరికదా తనలో పొగరు, అహంకారం బాగా పెరిగినట్టుగా అనిపించాయి. తరువాత కొన్ని సందర్భాలలో తను మాట్లాడడానికి ప్రయత్నిస్తే తనని చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడి హర్ట్ చేసింది కూడా.దానితో అనిరుధ్ తనని పట్టించుకోవడం మానేసాడు.

తననసలు పట్టించుకోక పోవడంతో, తనతో మాట్లాడక పోవడంతో అనిరుధ్ మంజీర ని పట్టించుకోవడం మానేసాడు. కానీ ఆమెవైపు ఆకర్షింపబడకుండా మాత్రం వుండలేకపోయాడు. అందమైన అమ్మాయిలు అనిరుధ్ కి కొత్త కాదు. తనూ హ్యాండ్సమ్ గా వుండడంతో వాళ్ళు తనతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ వుండేవారు. కానీ తనెప్పుడూ వాళ్ళవైపు ఆకర్షింపబడడం కానీ, వాళ్లతో పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించడం కానీ చెయ్యలేదు. తన దృష్టి ఎప్పుడూ బాగా చదువుకుని ఐ ఏ ఎస్ అవ్వాలనే వుండేది.  

కానీ మంజీర విషయంలో మాత్రం అలా వుండలేకపోయాడు. తను తనతో మాట్లాడితే, తనతో స్నేహంగా వుంటే తనగురించి ఏమైనా చెయ్యొచ్చు అన్నట్టుగా వుండేది. కానీ తనుమాత్రం ఆ నిరంజన్ తో స్నేహం గా వుంటూ వచ్చింది. తనకి వాడంటే పీకలవరకూ కోపం, ఇంకా అసూయ వున్నాయి. మనోజ్ చెప్పినట్టుగా మంజీర లాంటి అందమైన అమ్మాయిని అనుభవించగలగడం మామూలు అదృష్టం కాదు.

నిజానికి సర్వేశ్వరం అలాంటి కండిషన్ పెట్టినప్పుడు తనకి చాలా థ్రిల్లింగా అనిపించింది. వెంటనే దానికి ఒప్పేసుకోవాలనిపించింది. కానీ వెంటనే ఆ నిరంజన్ ఇంకా మంజీర ఎలా తిరిగారో గుర్తుకు వచ్చింది. ఇప్పుడెందుకు ఆ లవ్ ఫెయిల్ అయిందో తెలియదు కానీ, తన అందాన్నంతా వాడికెప్పుడో సమర్పించుకునివుంటుంది. తను అంత ఆకర్షణీయంగావున్నా, అలా ఎంగిలి అయిపోయిన అమ్మాయిని తను పెళ్లిచేసుకోలేడు.  అసలు ఒక నిరంజన్ లాంటి వాడివైపు ఆకర్షింపబడిందంటేనే తనకి మంజీర అంటే విరక్తి కలుగుతూ వుంది.

ఏది ఏమైనా తను రేపు ఆ మంజీర ని కలుసుకుని మాట్లాడాలి. తను ఏ రకంగానైనా తనని పెళ్లిచేసుకోవడానికి బలవంతం చెయ్యబడుతోందా అన్నది తెలుసుకోవాలి. ముందు తనని కలుసుకుని విషయం అంతా తెలుసుకుంటే తప్ప, తను ఏ స్టెప్ తీసుకోవాలన్నది ఆలోచించలేడు. ఏవేవో ఆలోచనలు అలాగ వస్తూనే వుండడంతో ఆ రోజు రాత్రి ఒంటిగంట అయ్యేవరకూ అనిరుధ్ నిద్రపోలేకపోయాడు.

&&&

"చెప్పానుగా, నిన్ను పెళ్లిచేసుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ విషయం తెలుసుకోవడానికి అయితే నువ్వు తనని కలుసుకుని మాట్లాడాల్సిన అవసరం లేదు." అనిరుధ్ సర్వేశ్వరాన్ని కలుసుకుని, తను మంజీరతో మాట్లాడాలి అనగానే అయన అన్నాడు.

"ఒక కాబోయే భర్త తన కాబోయే భార్యతో కాసేపు మాట్లాడాలనుకోవడంలో అభ్యంతరపెట్టాల్సినది ఏముంది?" అనిరుధ్ చిరాగ్గా అన్నాడు.

"అంటే మంజీరని పెళ్లి చేసుకోవడానికి నీకెలాంటి అభ్యంతరం లేదన్నమాటేగా." చిరునవ్వుతో అన్నాడు సర్వేశ్వరం.

"ముందు నేను తనని కలుసుకుని మాట్లాడాలి. ఒకవేళ తనకి నన్ను పెళ్లిచేసుకోవడానికి ఏ అభ్యంతరం లేకపోతే నాకూ ఏ అభ్యంతరం వుండదు. కానీ తను తన నోటితో నన్ను పెళ్లి చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదని చెప్పాలి." అదే చిరాకుతో అన్నాడు అనిరుధ్.

"అయితే సరే." అలా అన్నాక సర్వేశ్వరం అక్కడున్న ఒక పనిమనిషిని పిలిచి, అనిరుధ్ ని మంజీరవున్న రూమ్ లోకి తీసుకువెళ్లమన్నాడు.

"రండి బాబూ" అని ఆ పనిమనిషి అని ఒక దిశలో నడవడం ప్రారంభించాక, అనిరుధ్ ఆ పనిమనిషిని అనుసరించాడు. ఆ పనిమనిషి అనిరుధ్ ని మేడ మీద వున్న ఒక రూమ్ దగ్గరికి  తీసుకెళ్లింది. ఆ రూమ్ తలుపులు మూసివుండడంతో వాటిమీద గట్టిగా కొట్టింది. ఎవరో తలుపులు దగ్గరగా వస్తున్నట్టుగా అడుగుల శబ్దం వినపడడంతో గుండె వేగం హెచ్చింది అనిరుధ్ కి. ఇప్పటికి మంజీర ని చూసి ఆరు నెలల పైనే అయింది, ఇప్పుడెలా వుందో తను అని చాలా ఆసక్తిగా వుంది.

కొద్దీ క్షణాల్లోనే ఆ గదితలుపులు తెరిచి దర్శనమిచ్చింది మంజీర. అందం విషయంలో మాత్రం అప్పుడెలా వుందో, ఇప్పుడూ అలాగే వున్న మంజీరని చూస్తూ వుంటే క్షణం గుండె ఆగినట్టుగా అనిపించింది అనిరుధ్ కి.

"ఈయన మీతో ఎదో మాట్లాడాలట." ఆ విషయం చెప్పాక అక్కడనుండి వెళ్ళుపోయింది ఆ పనిమనిషి.

ఏమీ మాట్లాడకుండా తెరిచిన తలుపులని అలాగే వుంచి, ఆ రూమ్ లో వున్న బెడ్ దగ్గరికి నడిచి, ఎడ్జ్ లో  చేతులతో మొహం మూసుకుని కూచుంది. కాసేపు ఏం చెయ్యాలో తోచక అలాగే నిలబడ్డాడు అనిరుధ్. తరువాత లోపలికి నడిచి, ఆమెకి ఎదురుగుండా నిలబడ్డాడు. 

"మన జీవితాలకి సంభందించి ఏం జరుగుతూవుందో నీకు తెలిసివుంటుందనే అనుకుంటున్నా. ఎలాగైనా నీతో నా పెళ్లి చేసెయ్యాలనే నిర్ణయానికి వచ్చేసాడు మీ నాన్న. అందుకు నన్ను ఒప్పించడానికి తన బాకీ కోసం నా ఇల్లు స్వాధీనం చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసేంత దూరం వెళ్ళాడు." చేతులతో మూసుకునివున్నతన మొహంలోకి చూస్తూ అన్నాడు అనిరుధ్.

మంజీర నుండి ఏ సమాధానం లేదు. తను తన మొహాన్ని చేతులతో కవర్ చేసుకుని అలాగే వుంది.

"మరొకలా అయితే నాకూ అభ్యంతరం వుండేది కాదు. కానీ నువ్వూ ఆ నిరంజన్ ఎలా వుండేవారో నాకూ బాగా తెలుసు. కాలేజ్ అంతా తెలుసు. నువ్వు వాడిని అంతగా ప్రేమించావు. నిన్నిప్పుడు నేను ఎలా పెళ్లిచేసుకోను?"

మంజీరలో అదే మౌనం. పోశ్చర్ లో ఏ మాత్రం తేడా లేకుండా అలాగే కూచుంది.

"అంతకన్నా ముఖ్యంగా నువ్వు మాత్రం ఆ నిరంజన్ ని మరిచిపోయి నన్ను ఎలా పెళ్లి చేసుకోగలవు? నాతొ ఎలా కాపురం చేయగలవు?" ఆవేశం గా అడిగాడు అనిరుధ్.

ఇంక అలా కూచోలేనట్టుగా మొహంమీదనుండి చేతులు తొలగించి లేచినిలబడింది మంజీర. కాకపోతే అనిరుధ్ ప్రశ్నకి సమాధానం మాత్రం ఇవ్వలేదు.

"నువ్వు ఇలాగె వుండిపోతానంటే కుదరదు. మనిద్దరికీ పెళ్ళయిపోతే, ఆ నిరంజన్ ని మర్చిపోలేక నువ్వు, ఆ నిరంజన్ ని మర్చిపోలేని నీతో కాపురం చెయ్యలేక నేను జీవితాంతం నరకం అనుభవించాలి. నువ్వే ఎలాగైనా ఈ పెళ్లి ఆపించాలి. లేకపోతే నా అమ్మానాన్నా ఎంతో ప్రాణప్రదంగా కట్టుకున్న ఇంటిని కాపాడుకోవడానికైనా నేను నిన్నుపెళ్లిచేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నన్ను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పి ఈ పెళ్లి ఆపించు." సడన్ గా వేడికోలుగా అన్నాడు అనిరుధ్.

"నేను అలా చెయ్యలేను. అది నా చేతుల్లోలేదు." చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా అనిరుధ్ తో మాట్లాడింది మంజీర. ఎంత ఆ సందర్భం వ్యతిరేకంగా అనిపించినా, ఆ గొంతు చాలా తియ్యగా అనిపించింది అనిరుధ్ కి.

"ఏం ఎందుకు చెయ్యలేవు? మన జీవితాల్లో ఏం జరగబోతూ వుందో నీకు బోధపడుతూ వుందా?  మనిద్దరం జీవితాంతం నరకం అనుభవించడం మాత్రమే కాదు, మనిద్దరం భార్యాభర్తలం అయితే ఆ నిరంజన్ కూడా జీవితాంతం నరకం అనుభవించాలి." అనిరుధ్ కోపంగా అన్నాడు.

"మనిద్దరం భార్యాభర్తలం అవ్వాలన్నది నిర్ణయం అయిపోయింది. అదిప్పుడు మనం మార్చలేం. నువ్వు ఈ పెళ్ళికి ఒప్పుకో."

"నువ్వేం మాట్లాడుతూ వున్నావో నీకు బోధపడుతూ వుందా? మన పెళ్లి నిర్ణయం అయిపోవడం ఏమిటి? నువ్వూ నేనూ కాకుండా మన పెళ్లిని నిర్ణయించగలిగింది ఎవరు? మీ అమ్మలాగే నీకూ పిచ్చిగానీ పట్టలేదు కదా." కోపంగా అన్నాడు అనిరుధ్.

"ప్లీజ్. ఈ పెళ్ళికి ఒప్పుకో. మన చేతుల్లో ఏం లేదు." తన మొహాన్ని చేతుల్లో కప్పుకుని , భోరుమంటూ బెడ్ ఎడ్జ్ మీద మరోసారికూలబడిపోయింది మంజీర.

"నువ్వేం చెప్తున్నావో నాకసలు బోధపడడం లేదు." అయోమయంగా, దిగ్భ్రమతో మంజీరవైపు చూస్తూ అన్నాడు, అనిరుధ్.

"నన్నే ప్రశ్నలు అడక్కు. ఈ పెళ్ళికి నాకైతే ఏ అభ్యతరం లేదు. నీకేమైనా అభ్యతరం వుంటే నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. ఇక్కడనుండి వెళ్ళిపో. నువ్వేం చెయ్యగలవో చెయ్యి." చేతులని మొహంనుండి తొలగించి, అనిరుధ్ మొహంలోకి చూస్తూఏడుపు ఆపుకునిఅంది మంజీర.

 "విన్నావుగా నా కూతురు ఏం చెప్పిందో? నిన్ను పెళ్లిచేసుకోవడానికి తనకైతే ఎలాంటి అభ్యతరంలేదు. ఇంకా ఈ విషయంలో నువ్వు అభ్యంతర పడాల్సినది ఏముంటుంది?" అనిరుధ్ ఎదో అనబోయేలోగా, ఆ గదిలోకి అప్పుడే వచ్చిన, సర్వేశ్వరం అన్నాడు. 

"మీ అమ్మాయి ఆ నిరంజన్ ఎంతగానో ప్రేమించుకున్నారు. తనని మర్చిపోయి మీ అమ్మాయి నన్నెలా పెళ్లి చేసుకోగలదు?" సర్వేశ్వరం మొహంలోకి చూస్తూ అడిగాడు అనిరుధ్.

"ఆ ప్రేమ కేవలం ఒక భ్రమ. ఆ విషయం తను గ్రహించింది. తను ఆ నిరంజన్ ని పెళ్లి చేసుకునే సమస్యే లేదు. తను వాడిని మర్చిపోయింది. నువ్వూ ఆ విషయం పూర్తిగా మర్చిపోవచ్చు." సర్వేశ్వరం అన్నాడు.

"అదెలాగ అవుతుంది? వాళ్లిద్దరూ ఎంతగా ప్రేమించుకున్నారో కాలేజీ లో అందరికీ తెలుసు. ఇప్పుడంత ఈజీగా తనని ఎలా మర్చిపోగలుగుతుంది?" మంజీర మొహంలోకి చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్.

"నా డాడ్ చెప్పింది నిజం. ఇప్పుడు వాడయితే నా మనసులో లేడు. నిన్ను చేసుకోవడానికి నాకయితే అభ్యంతరం లేదు." తలదించుకుని చెప్పింది మంజీర.

తను వింటున్నది కలో, నిజమో అనిరుధ్ కి అర్ధం కాలేదు. మంజీర ఇలా చెప్తుందని తను కలలో కూడా వూహించలేదు.

"ఇంతకన్నా నీకు ఏం కావాలి? తన మనసులో ఇప్పుడు ఆ నిరంజన్ లేడు, తనకి నిన్ను పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం లేదు. ఇది చాలదా నీకు?" సర్వేశ్వరం కోపంగా అడిగాడు.

"సరిపోదు. నాకు ఇంకో ముఖ్యమైన ప్రశ్నకి సమాధానం కావాలి." సర్వేశ్వరం మొహంలోకి చూస్తూ అనిరుధ్ అన్నాడు ధృడంగా.

"ఏమిటది?" నొసలు చిట్లించాడు సర్వేశ్వరం.

"మీకు కావాలనుకుంటే ఆకాశంలో చందమామ ని కూడా తెచ్చి మీకూతురికి ఇవ్వగల శక్తి వుంది. నాకన్నా పదింతలు అన్నిరకాలుగా యోగ్యుడు అయినవాడిని తీసుకువచ్చి మీ కూతురికిచ్చి మీరు పెళ్ళిచెయ్యగలరు. మరి నన్నే ఎందుకు మీ అమ్మాయికి భర్తగా కావాలనుకుంటున్నారు?"

"నీ అన్ని ప్రశ్నలకి సమాధానం ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇప్పటికే నన్ను నా కూతురుని చాలా విసిగించావు. ఇంక నువ్వు వెళ్లొచ్చు." కోపంగా అన్నాడు సర్వేశ్వరం.

చేసేదిలేక అక్కడనుండి నడవడం మొదలుపెట్టాడు అనిరుధ్. మేడ మెట్లు దిగి కిందకివస్తూవుంటే వినిపించింది సర్వేశ్వరం గొంతు పెద్దగా.

"కానీ గుర్తు వుంచుకో. సాధ్యమైనంత త్వరలో నువ్వు మా అమ్మాయితో పెళ్ళికి సిద్ధపడకపోతే, నీ మీద కోర్ట్ లో కేసు ఫైల్ చేసి నేను నీ ఇల్లు స్వాధీనం చేసుకోవడం ఖాయం. అంతేకాకుండా పైన రావాల్సిన డబ్బుల గురించి కూడా నీ మీద అన్ని చర్యలు తీసుకుంటాను."

&&&

"నిన్ను పెళ్లిచేసుకోవడం ఆ అమ్మాయికి కూడా ఇష్టమే. ఇంకా ఎందుకు ఈ విషయంలో ఇంతగా తర్జన భర్జలు పడి ఆలోచిస్తావు? అదృష్టం ఇలా వెదుక్కుంటూ వచ్చినప్పుడు నీలా మోకాలు అడ్డుపెట్టే వాళ్ళని మూర్ఖులు అనే అంటారు." అనిరుధ్ చెప్పినదంతా విన్నాక మనోజ్ అన్నాడు.

ఈ సారి మనోజ్ ఇంట్లో హాల్లో  కుర్చీల్లో కూచుని వున్నారు మనోజ్ ఇంకా అనిరుధ్. వాళ్ళిద్దరితోపాటుగా మనోజ్ చెల్లెలు ప్రమీల కూడా వుంది. అప్పటికి విషయం మనోజ్ ఇంట్లో అందరికీ కూడా తెలిసింది.

"చెప్పాను కదా, నేను నీలా ఆలోచించలేను." చిరాగ్గా అన్నాడు అనిరుధ్.

"అనిరుధ్ చెప్తున్నది బాగానే వుంది. ఎదో డబ్బు కలిసి వస్తూందని, ఇంకా అందంగా వుందని క్యారక్టర్ లేనివాళ్ళని ఎవరూ పెళ్లి చేసుకోరు. అది ఆ నిరంజన్ గాడితో ఎలా తిరిగేదో అందరికీ తెలుసు. ఆమ్మో, దానికింకా ఎంత పొగరు!" ప్రమీల అంది.

"నువ్వు లోపల ఏదన్నా పనుంటే వెళ్లి చూసుకో. మేమిద్దరం ఎదో మాట్లాడుకుంటూవుంటే నువెందుకు మధ్యలో దూరతావు?" మనోజ్ కోపంగా అన్నాడు.

"తను చెప్పినదాంట్లో కూడా పాయింట్ వుంది కదా. అనవసరంగా కోప్పడకు." అనిరుధ్ అన్నాడు.

"మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ వున్నప్పుడు నేను ఫస్ట్ ఇయర్ చదివాను. వాళ్లిదరిగురించి కధలు కధలు గా చెప్పుకునేవారు. నువ్వు అమాయకమైన నీ ఫ్రెండ్ ని ఆ అమ్మాయిని పెళ్లి చేసేసుకునేలా ప్రోగ్రామింగ్ చేసేస్తుంటే నేను మాట్లాడాను." ప్రమీల అంది.

"సరేలే. నేను ప్రోగ్రామింగ్ చెయ్యగలిగేంత వీక్ కాదు నా ఫ్రెండ్. కాకపోతే సరిగ్గా ఆలోచించడం మాత్రం చేతకాదు." ప్రమీల మొహంలోకి చూసి ఆలా అన్నాక మళ్ళీ అనిరుధ్ మొహంలోకి చూసి అన్నాడు మనోజ్. "మంజీర తో మాట్లాడినప్పుడు నీకెలా అనిపించింది? తనలో అహంకారం, పొగరు అలాగే వున్నాయా?"

"నాకు బాగా ఆశ్చర్యం కలిగించిన విషయం అదే. ఆ అహంకారం, పొగరు మచ్చుకైనా లేవు తనలో. ఏదో అయోమయం, ఏదో విచారం. విషయం తనకే పూర్తిగా అర్ధం కానట్లుగా వుంది."

"నీతో పెళ్ళికి మాత్రం అంగీకరించింది."

"మా పెళ్లి నిర్ణయించబడిపోయిందని, తప్పించుకోవడం మా చేతుల్లోలేదని అని చెప్పింది."

"దానర్ధం ఒకటే. ఏదో బలమైన పరిస్థితులవల్ల తను నిన్ను పెళ్లిచేసుకోవడానికి ఆంగీకరించిందే తప్ప నువ్వంటే ఇష్టపడి కాదు. నువ్వీ పెళ్ళికి ఒప్పుకోకు. ఆ అమ్మాయితో పెళ్లయ్యాక నువ్వు సుఖంగా వుండలేవు." ప్రమీల అంది.

"నువ్వూరుకుంటావా? వాడు ఆలోచించగలడు." మరోసారి ప్రమీల మొహంలోకి చూస్తూ చిరాగా అన్నాడు మనోజ్. "అమ్మ ఇంటిదగ్గర లేదుకదా. వంటింట్లోకి వెళ్లి వంటపని చూడు."

"హు………...ఏదో ఏడవండి." కోపంగా అనేసి అక్కడనుండి వంటింట్లోకి వెళ్ళిపోయింది ప్రమీల.  

ఒకళ్ళ మొహాల్లోకి ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నారు మనోజ్, అనిరుధ్.

"తనకెందుకలా కోపం వచ్చిందో నీకు అర్ధం అయ్యే వుంటుంది." చిరునవ్వుతో అన్నాడు మనోజ్.

"తనని నువ్వెలా చూస్తావో నేనూ అలాగే చూస్తానని ఎప్పుడో అర్ధం అయ్యేలా చెప్తాలే." తనూ చిరునవ్వు నవ్వాడు అనిరుధ్. అంతలోనే అనిరుధ్ మొహం సీరియస్ గా మారింది. "మంజీర తో మాట్లాడాక విషయం కాస్త తేలిక పడుతుందనుకున్నాను. కానీ ఇంకా జటిలం అయింది."

"నాకు మరీ ఆశ్చర్యం గా అనిపించడం లేదు." మనోజ్ అన్నాడు. "ఆ నిరంజన్ గాడు ఒక రాస్కేల్. వాడెంత తాగుబోతు, తిరుగుబోతు అన్నది మనకి తెలుసు. ఏదో పొరపాటున వాడితో ప్రేమలో పడ్డానని అనుకున్నా, తన తప్పు తెలుసుకుని బ్రేక్ అప్ చేసుకుని వుంటుంది. ఇంక నీ విషయానికి వస్తే..........." కాస్త ఆగాడు. ".........ఒక్క వాళ్ళలా ఆస్తిపాస్తులు లేవన్న మాట తప్ప అందంగా వుంటావు. బుద్ధిమంతుడివి. అందులోనూ మీరిద్దరూ చిన్నప్పుడు కలిసి ఆడుకున్నారు కూడా. ఇప్పుడు మంజీర నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడడం లోను, అందుకు వాళ్ళ నాన్న ఒప్పుకోవడం లోను నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించడం లేదు." 

"ఇది కేవలం వాళ్ళు నన్ను ఇష్టపడడం కాదు. నాతొ తన పెళ్లి వాళ్ళు ఒక తప్పించలేని ఇంకా జరిపి తీరాల్సిన విషయం గా అనుకుంటున్నారు. అలా వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారో నాకు బోధపడడం లేదు."

దానికి ఏం చెప్పాలో తెలియక మౌనంగా వుండిపోయాడు మనోజ్.

"అందులోనూ ఆ నిరంజన్ ఇంకా తనూ అంతకాలం అలా కలిసిమెలిసి తిరిగారు. వాళ్ళమధ్య ఏం జరక్కుండానే వుండివుంటుందంటావా? రేప్పొద్దున్న మళ్ళీ ఆ ప్రేమ తిరిగి చిగురించదని మాటేమిటి? ఇవన్నీ ఆలోచించకుండా ఎలా తనతో పెళ్ళికి ఒప్పేసుకోను?" నొసలు చిట్లించాడు అనిరుధ్.

దీనిక్కూడా ఏం చెప్పాలో తెలియక అలాగే మౌనంగా వుండిపోయాడు మనోజ్.

"ఇక్కడ ఆలోచించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం వుంది. వాడితో లవ్  మంజీర బ్రేక్ అప్ చేసేసుకోవడం వల్లమంజీర కి వాళ్ళ నాన్నకి వచ్చే  నష్టం ఏమీ లేదు. కానీ అలాంటి అందాన్ని వదిలేసుకోవడానికి నిరంజన్ సిద్ధంగా వుంటాడంటావా? అతని ఫ్యామిలీ కూడా రిచ్చే అయినా, సర్వేశ్వరం ఫ్యామిలీ అంత కాదు. మంజీరని తను పెళ్లి చేసుకోవడం వల్ల వచ్చే లాభాన్ని వదులుకోవడానికి అతని ఫ్యామిలీ అంత త్వరగా సిద్ధపడుతుందా? నేనేదో మంజీరని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించినా, నిరంజన్, అతని ఫ్యామిలీ ఏవో ఇబ్బందులు సృష్టిస్తారేమోనని నాకనిపిస్తోంది."  

"వాళ్ళు సర్వేశ్వరం అంత స్ట్రాంగ్ కాదు. అతనికి వ్యతిరేకంగా వాళ్ళు ఏమీ చెయ్యలేరు. నువ్వు అలా అలోచించి ఆందోళన పడకు." మనోజ్ అన్నాడు.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)