Read Are Amaindi - 4 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 4

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"నువ్వు చెప్పిందీ నిజమే అయినా, నేను ఏమీ ఆలోచించకుండా తనని పెళ్లి చేసేసుకోలేను. నాతో తన పెళ్ళికి వాళ్ళు అంతగా ఆలోచిస్తూండడంలో ఏదో పెద్ద రహస్యం వుందనిపిస్తూంది. అదేమిటో మొదట తెలుసుకోవాలి." అనిరుధ్ సాలోచనగా అన్నాడు.

"దీనికి ఒక మార్గం వుంది. ఇది వర్క్ అవుట్ కావచ్చు కూడా."

"అదేమిటో ముందు చెప్పు. నువ్విలా సస్పెన్స్ మైంటైన్ చెయ్యాల్సిన అవసరం లేదు." చిరాగ్గా అన్నాడు అనిరుధ్.

"నువ్వా నిరంజన్ ని కలుసుకుని మాట్లాడు. నీకూ మంజీర కి పెళ్లి జరిపించడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయని చెప్పు. మంజీరని వదులుకోవడానికి వాడు అంత తేలికగా ఒప్పుకుంటాడని నేను అనుకోను. అందుగురంచయినా వాడు నీకు విషయం అంతా చెప్పొచ్చు."

"వాడి మొహం చూడ్డం అంటేనే నాకు చిరాకు. వాడిని కలుసుకుని మాట్లాడ్డం నాకసలు ఇష్టం లేదు." చిరాగ్గా అన్నాడు అనిరుధ్.

"కానీ నాకింక వేరే మార్గం కనిపించడం లేదు. ఇలాగ అయితేనే నీకు విషయం తెలిసే అవకాశం వుంది."

"ఓకే అయితే." గట్టిగా నిట్టూర్చి అన్నాడు అనిరుధ్. 

&&&

నిరంజన్ ఇంటికి వెళుతున్నప్పుడు చాలా చిరాగ్గా అనిపించింది అనిరుధ్ కి. నిజానికి మంజీర అంటే అంత విముఖత కలగడానికి కూడా కారణం తను వాడితో లవ్లో పడడం. పెద్దగా అందం చందం లేకుండా కేవలం దురలవాట్లు మాత్రమే వున్న నిరంజన్ మీద తనకి లవ్ ఎలా కలిగిందో అనిరుధ్ కి బోధపడలేదు. నిరంజన్ లాంటి వాడితో కాకుండా, కాస్త అందగాడితో, తనకి సరిపోయే వాడితో మంజీర లవ్ లో పడివుంటే తనకి మంజీర అంటే ఇంత చిరాకు వుండేది కాదు. 

ఎదో సందర్భంలో ఏదో పనిమీద తన ఫ్రెండ్ తో పాటుగా నిరంజన్ ఇంటివైపు వెళ్ళాడు. అప్పుడు తన ఫ్రెండ్ నిరంజన్ ఇల్లు చూపించాడు. అందువల్ల నిరంజన్ ఇల్లు టౌన్ లో ఎక్కడవుందో తెలియడంతో తిన్నగా అక్కడికి వెళ్లగలిగాడు.

"నేను నిరంజన్ ని కలుసుకుని మాట్లాడాలి. నేను తను కలిసి చదువుకున్నాం." గేటు దగ్గర సెక్యూరిటీ గార్డ్ కి చెప్పాడు నిరంజన్.

"అబ్బాయిగారి ఆరోగ్యం బాగోలేదు. తను ఎవరినీ కలుసుకుని మాట్లాడడానికి ఇష్టపడడం లేదు." వాడు చెప్పాడు.

అదివిని ఆశ్చర్య పడ్డాడు అనిరుధ్. ఏదెలా వున్నా ఆ నిరంజన్ ఎప్పుడూ ఆరోగ్యంగానే వుండేవాడు. తనకి ఆరోగ్యం బాగోకపోవడం ఏమిటి? "చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను వచ్చానని చెప్పు. నన్ను చూడడం ఇష్టం లేదంటే వెళ్ళిపోతాను." నిరంజన్ అన్నాడు.

అది విన్నాక కాస్త తటపటాయింపుగా చూసి అక్కడనుండి వెళ్ళడానికి వెనక్కి తిరిగాడు ఆ సెక్యూరిటీ గార్డ్. ఆ సమయంలోనే అక్కడికి ఇంచుమించులో ఒక అరవై ఏళ్ల వయసువున్న ఒక పెద్దాయన వచ్చాడు. బహుశా నిరంజన్ తండ్రి కావచ్చు.

"ఏం జరుగుతోందిక్కడ? ఈ అబ్బాయి ఎవరు?" అనిరుధ్ వైపు చూసి అడిగాడు ఆ పెద్దమనిషి.

"నేను నిరంజన్ ఫ్రెండ్ ని. మేమిద్దరం కలిసి చదువుకున్నాం. తనని కలిసి మాట్లాడాలని వచ్చాను." అనిరుధ్ అన్నాడు.

అది విన్నాక ఆ పెద్దమనిషి మోహంలో కూడా కొంచెం తటపటాయింపు కనిపించింది.

"నేను వచ్చానని తనకి చెప్పండి. తనకి నాతో మాట్లాడాలని లేదంటే నేను వెళ్ళిపోతాను." అనిరుధ్ అన్నాడు మనసులో దేవుణ్ణి నిరంజన్ అలా అనకుండా వుండాలని కోరుకుంటూ.

"సరే. నాతోటి రా." అలా అని ఆ సెక్యూరిటీ గార్డ్ మొహంలోకి చూసి "అతన్ని లోపలి పంపించు." అని అయన అక్కడనుండి నడిచాడు.

ఆ సెక్యూరిటీ గార్డ్ తలుపు తియ్యగానే లోపలి ప్రవేశించి ఆయన వెనకాలే నడవడం మొదలు పెట్టాడు అనిరుధ్.

"ఈ అబ్బాయి ఎవరు? ఎందుకు లోపలికి తీసుకొచ్చారు?" ఇద్దరూ ఇంట్లోకి ప్రవేశించగానే ఒక యాభై ఏళ్లావిడ, బహుశా నిరంజన్ తల్లి కావొచ్చు, ఇద్దరికీ ఎదురొచ్చి అడిగింది.

"నిరంజన్ ఫ్రెండ్. నిరంజన్ తో మాట్లాడాలని చెప్పి వచ్చాడు. నిరంజన్ దగ్గరికి తీసుకువెళుతున్నాను." అయన ఆగి అన్నాడు.

అయన ఆగడంతో అనిరుధ్ కూడా ఆగాడు.

"వాడసలే ఆరోగ్యం బాగోలేక వున్నాడు. ఎందుకు వాడిదగ్గరికి అందరినీ తీసుకు వెళతారు?" చిరాగ్గా అడిగిందావిడ.

"వాడలా వంటరిగా కూచునివుంటే వాడికింకా పిచ్చెక్కుతుంది. వాడిలా వాడి ఫ్రెండ్స్ ని అది కలుసుకుని మాట్లాడుతూ వుంటే మామూల్లో పడతాడు. ఈ అబ్బాయెవరో మంచివాడు కాబట్టి తనతో మాట్లాడడానికి వచ్చాడు." అన్నాడాయన.

"సరే అయితే." అది ఆవిడకి సబబుగానే అనిపించినట్టుంది తలూపి అక్కడనుండి వెళ్ళిపోయింది.

"నువ్వు నాతో రా నాయనా."

అలా అని మళ్ళీ అయన నడవడం మొదలుపెట్టాక అయన వెనకాతలే వెళ్ళాడు అనిరుధ్. తనని తిన్నగా మేడమీద వున్న ఒక గదిలోకి తీసుకుని వెళుతూ వుంటే, మంజీర వున్న గదిలోకి వెళ్లడమే గుర్తుకువచ్చింది అనిరుధ్ కి.

"ఇదిగోరా అబ్బాయ్. నీ గురించి నీ ఫ్రెండ్ ఎవరో వచ్చాడు." అలాని చెప్పి అనిరుధ్ ని ఆ గదిలో వదిలిపెట్టాక అక్కడనుండి వెళ్లిపోయాడాయన.

ఆ గదిలో బెడ్ మీద బాసిపట్టు వేసుకుని కూచునివున్న నిరంజన్ ని ఆశ్చర్యంగా చూసాడు అనిరుధ్. బాగా జబ్బుపడి ఉపవాసాలు చేసినట్టుగా వున్నాడు. అలాగ నిరంజన్ ని ఎప్పుడూ చూడలేదు అనిరుధ్.

"నువ్వా? నువ్వెందుకు వచ్చావ్?" అనిరుధ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు నిరంజన్.

"నేను నీతోటి మాట్లాడాలి." వెళ్లి నిరంజన్ ఎదురుగుండా నిలబడుతూ అన్నాడు అనిరుధ్.

"నువ్వు నాతోటి ఏం మాట్లాడాలి?" ఇంకా అదే ఆశ్చర్యం తోటి అడిగాడు నిరంజన్.

"నాకూ మంజీర కి పెళ్ళిచెయ్యడానికి కంకణం కట్టుకుని కూర్చున్నాడు ఆ సర్వేశ్వరం. మంజీర కూడా ఏం మాట్లాడడం లేదు. నాకు ఏం చెయ్యాలో బోధపడడం లేదు." నిరంజన్ మొహంలోకి చూస్తూ అన్నాడు అనిరుధ్.

"అయితే దానికి నేనేం చెయ్యను?" నొసలు చిట్లించి చిరాగ్గా అడిగాడు నిరంజన్.

"మీరిద్దరూ గొప్ప ప్రేమికులు. మీరిద్దరూ ఎలా చెట్టపట్టాలు వేసుకు తిరిగారో కాలేజ్ లో అందరికీ తెలుసు. తన పెళ్లి నాతో జరిగిపోబోతోందన్నా నీకేం అనిపించడం లేదా?" ఆశ్చర్యంగా అడిగాడు అనిరుధ్.

"అది చక్కగా దబ్బపండులా వుంటుంది. ఆ అందాన్ని అనుభవించొచ్చు అనుకున్నాను. అంతేకాకుండా తనని పెళ్ళిచేసుకుంటే తన తండ్రికున్న కోట్లకొద్దీ ఆస్థి కలిసి వస్తుందనుకున్నాను. అంతే తప్ప తనంటే నాకు ప్రేమ ఎప్పుడూ లేదు."

"తన అందం ఇంకా తన తండ్రి ఆస్తి ఇప్పటికీ అలాగే వున్నాయి. నువ్విలా వూరుకుంటే అవి రెండూ చేజారిపోతాయి. నువ్వు గట్టిగా ముందుకొస్తే తన తండ్రి తనని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చెయ్యలేడు. తన అందం, తన ఆస్తి రెండూ నీ చెయ్యిజారిపోకుండా వుంటాయి."

"అలాగని నా ప్రాణాలమీదకు తెచ్చుకోమంటావా? దాని గురించి ఆలోచించినా సరే ఆ భూతం నన్ను బతకనివ్వదు. ఒకసారి దానితో పెట్టుకున్నందుకే నాకు చచ్చేంత పనైంది." నిరంజన్ అన్నాడు.

"నువ్వు చెప్పేది నాకు అర్ధం కావడం లేదు. ఏదో భూతం నిన్ను బతకనివ్వకపోవడం ఏమిటి? మీరిద్దరూ ఇష్టపడి పెళ్ళిచేసుకుంటే కాదనేవారెవరు?నువ్వు తనని ప్రేమించకపోయినా, తను నిన్ను ప్రేమిస్తూనే ఉంటుంది. " ఆశ్చర్యంగా అన్నాడు అనిరుధ్.

"అది కూడానన్ను ప్రేమించడం లేదు,  ఆలా నాటకమాడిందంతే."

"అలా నాటకమాడాల్సిన అవసరం తనకేమిటి?"

"ఆ వివరాలన్నీ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు కావాలంటే తనని పెళ్లి చేసుకో నాకు ఏమీ అభ్యంతరం లేదు." అలా అన్నాక సడన్ గా  నిరంజన్ మొహం విపరీతమైన భయం తో నిండిపోయి, తను బెడ్ మీదనుండి దిగిపోయాడు. "ఆమ్మో అది వచ్చేసింది. నన్ను చంపేస్తుంది. మమ్మీ........డాడీ.........." అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టాడు.

అది చూస్తూనే నివ్వెరపోయాడు అనిరుధ్. ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూన్న సమయంలో ఆ గదిలోకి తన కింద చూసిన ఆ యాభై ఏళ్ల ఆవిడ వచ్చింది.

"ఏం జరిగిందిరా పిచ్చివెధవా ఇలా అరుస్తున్నావు?" నిరంజన్ దగ్గరికి వెళ్లి, వాడి భుజాల చుట్టూ చెయ్యివేసి, వాడి మొహంలోకి చూస్తూ వాడిని అడిగిందావిడ.

"అదిగో మమ్మీ అది ఆ మూలలో వుంది. నన్నింక చంపేస్తుంది." ఆ గదిలో ఓ మూలకి భయంగా చూస్తూ అన్నాడు నిరంజన్.

"ఈ గదిలో ఎవరూ లేరు. నిన్నెవరూ చంపేరు. ఈ పనికిమాలిన వూహల్లోనుండి బయటపడు." అలా అన్నాక ఆవిడ అనిరుధ్ మొహంలోకి చూసి అంది. "మా అబ్బాయి ఆరోగ్యం బాగా లేదు. నువ్వు తరువాత ఎప్పుడన్నా వచ్చి మాట్లాడు."

"నిరంజన్ కి ఏమైంది? తనెందుకిలా భయపడుతున్నాడు?" ఆవిడ మొహంలోకి చూస్తూ అడిగాడు అనిరుధ్.

"ఆ వివరాలన్నీ నీకిప్పుడు చెప్పే ఓపిక నాకు లేదు. నువ్విప్పుడు బయటకి వెళ్ళు." కోపంగా అందావిడ.

చేసేదేం లేక తలూపి అక్కడనుండి బయటకి వచేసాడు అనిరుధ్.

&&&

"అన్నయ్య, అమ్మానాన్నతో కలిసి బయటికి వెళ్ళాడు. ప్రస్తుతం నేను మాత్రమే ఇంట్లో వున్నాను." మనోజ్ ఇంట్లోకి అడుగుపెట్టగానే అనిరుధ్ తో అంది ప్రమీల.

"ఆ విషయం నాకు ఫోన్లో చెప్పొచ్చుకదా. నేనింత దూరం వచ్చేవాడిని కాదు." చిరాగ్గా అన్నాడు అనిరుధ్.

"ఏం అన్నయ్యే తప్ప నేను నీకు ఫ్రెండ్ ని కాదా? అన్నయ్య తోటే తప్ప నువ్వే విషయాలు నాతో షేర్ చేసుకోకూడదా?" నిష్టూరంగా అడిగింది ప్రమీల.

"అలాని కాదులే. మేమిద్దరం సివిల్స్ కి కంబైన్డ్ స్టడీ చేస్తున్నాం అని నీకు తెలుసు కదా. తను లేడని తెలిస్తే నేనింటి దగ్గరే వుండి చదువుకునే వాడిని." హల్లో వున్న కుర్చీలో కూలబడుతూ అన్నాడు అనిరుధ్.

"నిజానికి ఈ మధ్యన చదువు కూడా ఎక్కడ అవుతూంది? మీరిద్దరూ నువ్వా మంజీరనుండి పెళ్లి ఎలా తెప్పించుకోవడం అన్నదాని గురించి ఆలోచించడం తోటే సరిపోతూంది." తనూ అనిరుధ్ కి ఎదురుగుండా ఒక కుర్చీ లాక్కుని, అందులో కూలబడుతూ అంది ప్రమీల.

"అదీ నిజమే. నేనూ చదువుకోకుండా, తననీ చదువుకోనివ్వకుండా చెడగొడుతున్నానిపిస్తోంది." నిట్టూరుస్తూ అన్నాడు అనిరుధ్. 

ప్రమీల వైపు చూడ్డానికి చాలా ఇబ్బందిగా వుంది అనిరుధ్ కి. తను వస్తాడని వూహించి, కావాలనే బ్రా వేసుకోనట్టుగా వుంది. దానికి తోడు కట్టుకున్న చీర కూడా చాలా పల్చగా వుంది. ప్రమీల అట్రాక్టివ్ గా అందంగానే వుంటుంది. కానీ అనిరుధ్ తననెప్పుడూ అలంటి దృష్టితో చూడలేదు. తను మనోజ్ కి ఎలా అనిపిస్తుందో, తనకీ అలాగే అనిపిస్తూ వుంటుంది.

"నువ్వీ విషయంలో అంతగా బుర్ర బద్దలు కొట్టుకోవలసినదేముంది? తనని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెగేసి చెప్పేవచ్చు కదా?" ప్రమీల అంది.

"నీకు విషయం పూర్తిగా తెలీదా? నేను తనని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోకపోతే, తనకి తీర్చాల్సిన బాకీ కింద నా ఇంటిని స్వాధీనం చేసుకుంటానంటున్నాడు తన తండ్రి. నా అమ్మానాన్న ఎంతో ప్రేమతో కట్టుకున్న ఇల్లది. అది కోల్పోవడం నాకు ఇష్టం లేదు."   

"అలాగని చెప్పి అలంటి వెధవ తిరుగుళ్ళు తిరిగిన అమ్మాయిని పెళ్ళిచేసేసుకుంటావా? వాళ్లిద్దరూ ఎలా తిరిగారో కాలేజీలో అందరికీ తెలుసు. అదికూడా వాళ్లిదరిమధ్య చాలాసార్లు అయిపోయి వుంటుంది." ఒకరకమైన కసి వుంది ప్రమీల మాటల్లో.

మంజీరని పెళ్లి చేసుకోవడం ఎంత ఇష్టం లేకపోయినా ప్రమీల అలా మాట్లాడ్డం అనిరుధ్ కి నచ్చలేదు.

"ఆ మంజీర తండ్రి కావాలంటే తనకి నాకన్నా వెయ్యిరెట్లు యోగ్యుణ్ణి తేగలడు. నేనే తనని పెళ్ళిచేసుకోవాలని ఎందుకు పట్టుబట్టి కూచున్నాడో నాకు అర్ధం కావడం లేదు. అలాగే ఆ మంజీర ఎప్పుడూ కనీసం నావైపు చూసేది కాదు. అలాంటిది ఇప్పుడు నన్ను పెళ్లిచేసుకోవడానికి అభ్యంతరం లేదంటోంది. దీని వెనకాతల ఏదో పెద్ద రహస్యం వుందనిపిస్తోంది.  అదేమిటో బోధపడడం లేదు." టాపిక్ మార్చడానికి అన్నట్టుగా అన్నాడు అనిరుధ్.

"ఆ నిరంజన్ గాడిని కూడా కలిసి మాట్లాడి చూడకపోయావా?"

"అదీ చేసాను. వాడితో మాట్లాడాక బోధపడ్డానికి బదులు విషయం మరింత జటిలం అయింది." తను నిరంజన్ ని కలిసి మాట్లాడ్డం గురించి అంతా చెప్పాడు అనిరుధ్."అసలు విషయం గురించి నాకెలా తెలుస్తుందో బోధపడడం లేదు. వాళ్ళు నేనే మంజీరని ఎందుకు పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారన్న విషయం తెలిస్తే, నాకా పెళ్లినుండి ఇబ్బందిపడకుండా ఎలా తప్పించుకోవాలన్నది తెలుస్తుంది అనిపిస్తోంది."

"అంటే మంజీరని పెళ్లి చేసుకోవాలని నీకస్సలు లేదు కదా." ఆశగా అడిగింది ప్రమీల.

"లేదు. తను ఆ నిరంజన్ తో ఎలా తిరిగిందో నాక్కూడా తెలుసు కదా."

వెంటనే సంతోషం కనిపించింది ప్రమీల మోహంలో. ఆ సంతోషం ఎందుకోతెలిసి చాలా అనీజీ గా అనిపించింది అనిరుధ్ కి.

"ఎందుకు ఆ సర్వేశ్వరం నేనే తన కూతురి భర్త కావాలనుకుంటున్నాడన్నది తెలిసే మార్గమే లేదా? ఎందుకు మంజీర కూడా నిరంజన్ కోసం తండ్రిని ఎదిరించకుండా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటోంది?" మళ్ళీ అనిరుద్ధే అన్నాడు.

"వీటికి సమాధానాలు తెలిస్తే ఆ క్యారక్టర్లెస్ అమ్మాయిని చేసుకునే అవకాశం తప్పుతుందని నీ ఆశ అంతే కదా." మంజీర మీద తనకి ఇంకా బాగా విరక్తి కలిగించేలా మాట్లాడ్డానికి వచ్చే ఏ అవకాశం ప్రమీల వదులుకోదని అనిరుధ్ కి అర్ధం అయింది. అది నచ్చకపోవడం వల్ల వచ్చిన చిరాకుని మోహంలో కనిపించకుండా అన్నాడు అనిరుధ్."అవును"

"వాళ్ళ సోషల్ ప్రొఫైల్స్, వాళ్ళ పేస్ బుక్, ట్విట్టర్ ఇంకా ఇంస్టాగ్రామ్ లు సెర్చ్ చేస్తే మనకి ఏదన్న క్లూ దొరికే అవకాశం వుంది." ప్రమీల అంది.

"మంచి ఐడియా ఇచ్చావు. వెళ్లి మీ అన్నయ్య లాప్ టాప్ తీసుకురా. నీ పేస్ బుక్ అకౌంట్ తో లాగిన్ అయి చూద్దాం." ఉత్సాహంగా అన్నాడు అనిరుధ్.

"నా పేస్ బుక్ అకౌంట్ తో ఎందుకు? నీ పేస్ బుక్ అకౌంట్ తో చూద్దాం." కంగారుగా అంది ప్రమీల. "విషయం నీది కదా."

"నాకు పేస్ బుక్ అకౌంట్ వుంది కానీ యూజ్ చేసి చాలా కాలం అయింది. పాస్ వర్డ్ మర్చి పోయాను. ట్విట్టర్ లోను, ఇంస్టాగ్రామ్ లోను అయితే నాకు అకౌంట్స్ అసలు లేనే లేవు." ప్రమీలలో కంగారుని గమనిస్తూ అన్నాడు అనిరుధ్.

"అయితే అకౌంట్ క్రియేట్ చేసుకుని చూద్దాం. అదేం పెద్ద కష్టం కాదు." అని లోపలి వెళ్లి లాప్ టాప్ తీసుకుని వచ్చింది.

ఆ లాప్ టాప్ ప్రమీల ఇంకా మనోజ్ ఇద్దరూ వాడుకుంటూ వుంటారు. అనిరుధ్ కి కూడా లాప్ టాప్ వున్నా, మనోజ్ ఇంటికి వచ్చినప్పుడు మనోజ్ లాప్ టాప్ మాత్రమే వాడుకుంటూ ఉంటాడు. తన లాప్ టాప్ అక్కడకి పట్టుకుని వెళ్ళడు.  అలాగే మనోజ్ అనిరుధ్ ఇంటికి వచ్చినప్పుడు, అనిరుధ్ లాప్ టాప్ వాడుకుంటాడు తప్ప తన లాప్ టాప్ తీసుకురాడు.

చూస్తూవుంటే ప్రమీల ఇలాంటి విషయాల్లో చాలా దిట్టలాగా వుంది. పేస్ బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసాక అంది. "వాళ్ళ అకౌంట్ ఈజీ గా ఫైండ్ అవుట్ చెయ్యాలంటే  ఇంటిపేరుతో సహా సెర్చ్ చెయ్యాలి."

"మంజీర ఇంటిపేరు నాకు తెలుసు కానీ ఆ నిరంజన్ గాడిది తెలియదు."

"వాడి ఇంటిపేరు నాకు తెలుసు." ప్రమీల అంది.

నిరంజన్ ఇంటిపేరు ప్రమీలకు ఎలా తెలుసో అనిరుధ్ కి ఆశ్చర్యం అనిపించింది.

"వాడికి ఒక చాలా ఇంటిమేట్ గర్ల్ ఫ్రెండ్ నా క్లాస్ లో వుండేది. తనకి వాడి ఇంటిపేరుతో సహా చాలా విషయాలు తెలుసు. అలా గర్ల్ ఫ్రెండ్స్ మైంటైన్ చేసే వాడితో ఏ అరమరికలు లేకుండా తిరిగింది ఆ మంజీర." అనిరుధ్ లో ఆశ్చర్యం కనిపెట్టినట్టుగా అంది ప్రమీల.

"మరి తనలా మంజీరతో తిరుగుతున్నందుకు నీ ఫ్రెండ్ కి ఏం కోపం వుండేది కాదా?" అనిరుధ్ అడిగాడు.

"తనది కేవలం కాజువల్ ఫ్రెండ్షిప్. మనీ గురించి, ఇంకా వాడిచ్చే గిఫ్ట్ ల గురించి. అలాంటి ఫ్రెండ్స్ వాడికి చాలా మందే వున్నారు. నీకు తెలుసు కదా."

"సరేలే. ముందు మనం సెర్చింగ్ మొదలు పెడదాం. ఆ సెర్చింగ్ మంజీర తో మొదలు పెడదాం."

అనిరుధ్ అలా అన్నాక మంజీర ఇంటిపేరుతో కలిపి సెర్చింగ్ మొదలు పెట్టారు. తనకి ఒక పేస్ బుక్ అకౌంట్ వుంది. కానీ అందులో కొన్ని ఫోటోలు తప్ప ఇంకేం పోస్ట్ చెయ్యలేదు. ఆ ఫొటోల్లో కొన్నిట్లో తనూ తన తండ్రి, కొన్నిట్లో తను మాత్రమే వుంది.

తరువాత నిరంజన్ పేస్ బుక్ అకౌంట్ గురించి సెర్చ్ చేశారు. ఇంటిపేరుతో కూడా కలిపి సెర్చ్ చేస్తే ప్రమీల చెప్పినట్టుగా ఈజీ గానే దొరికింది. వాడు కొన్ని వీడియోలు ఇంకా ఫోటోలు షేర్ చేసాడు. అన్నీ వాడి పార్టీలకి సంభందించినవే, ఇంకా వాటిల్లో వాడి గర్ల్ ఫ్రెండ్స్ కూడా వున్నారు. కొన్నిట్లో మంజీర కూడా వుంది. కానీ సభ్యతగాను ఇంకా నిరంజన్ తో ఇంటిమేట్ గా కాకుండా వుంది. అనిరుధ్ కి ఆశ్చర్యం కలిగించిన విషయం, మంజీర కి వాడి గర్ల్ ఫ్రెండ్స్ గురించి తెలిసినా, వాడితో ఫ్రెండ్ షిప్ చెయ్యడానికి ఏమీ అనిపించలేదా అని.

తరువాత ట్విట్టర్ లోనూ, ఇంస్టాగ్రామ్ లోనూ కూడా అకౌంట్ లు క్రియేట్ చేసి సెర్చ్ చేసి చూసారు. వాళ్ళకసలు వాటిల్లో అకౌంట్స్ లేనేలేవు. మొత్తానికి ఈ ఆన్లైన్ సోషల్ ప్రొఫైల్స్ సెర్చింగ్ వల్ల ఉపయోగపడే క్లూ అయితే మాత్రం ఏమీ దొరకలేదు. 

"పెద్దగా వుపయోగపడేలా ఏం దొరకలేదు. కానీ థాంక్స్. నా గురించి శ్రమపడ్డావు." సెర్చింగ్ అంతా పూర్తి చేసి, ప్రమీల లాప్ టాప్ క్లోజ్ చేస్తూండగా అన్నాడు అనిరుధ్.

"నీ గురించి శ్రమపడ్డం లో నాకు ఆనందముంది. ఎలాగైనా  నిన్నా దయ్యం నుండి కాపాడాలని నా కోరిక." అనిరుధ్ మొహంలోకి చూస్తూ అంది ప్రమీల.

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)