Read Are Amaindi - 1 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • ఔను నిజం నువ్వంటే నాకిష్టం

    తెనాలి రైల్వే స్టేషన్‍       అర్ధరాత్రికి ఇంకా అయిదు నిమిషాల...

  • ఆగంతకుడు

    క్యాప్ ని ముఖంపైకి లాక్కుని చీకటిగా ఉన్న భవంతివైపు నడచాడతను....

  • అచ్చిరాని అతితెలివి

    తనను ఎవరైనా చూస్తున్నారేమోనని పరిసరాలను జాగ్రత్తగా కనిపెడుతూ...

  • ఇంటిదొంగలు

    ఎగ్జిక్యూటివ్ ఏడుకొండలు, గన్ మేన్ గఫూర్, వ్యాన్ డ్రైవర్ జోసె...

  • కిల్లర్

    అర్థరాత్రి…ఆ డూప్లెక్స్ గెస్ట్ హౌస్ నిద్రలో జోగుతోంది. మెయిన...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరె ఏమైందీ? - 1

 

మాతృభారతి పాఠకులకి,

నేను రాసిన 'నులివెచ్చని వెన్నెల' ఎంతో చక్కగా ఆదరించినందుకు కృతజ్ఞతలు. ఆ ఆదరణ చూసి ఆనందపడే నేను ఈ 'అరె ఏమైందీ?' నవల వ్రాసి సిరీస్ గా పబ్లిష్ చేస్తూ వున్నాను.  నా 'నులివెచ్చని వెన్నెల' ని ఆదరించినట్టుగానే ఈ నవలని కూడా ఆదరిస్తారని భావిస్తున్నాను. నేను రాసే పుస్తకాలకన్నిటికీ ఇంగ్లిష్ లోనూ, తెలుగు లోనూ కూడా నేనే ఎడిటర్ ని. ఇంకెవరైనా నా పుస్తకాలని ఎడిట్ చేస్తే నాకు రచయితనన్న ఫీలింగ్ రాదు. నా రచనలన్నిటినీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అందువల్ల కొంతవరకూ తప్పులకి అవకాశముంది. కాబట్టి మీకెక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, ఇతర రకాలైన మిస్టేక్స్ కానీ కనిపిస్తే దయచేసి మన్నించండి.

రచయిత

కొట్ర శివ రామ కృష్ణ

రచయిత పరిచయం

రచయిత ఒక రొమాంటిక్ ఇండియన్ ఇంగ్లీష్ రైటర్. ఈయన వ్రాసిన నలభై అయిదు ఇంగ్లీష్  పుస్తకాలు ఈ బుక్స్ గా, ఇంకా పేపర్ బాక్స్ గా అమెజాన్ లాంటి పాపులర్ ఆన్ లైన్ వెబ్సైట్లు లో లభ్యం అవుతూ వున్నాయి. ఈయన వ్రాసిన మొత్తం అన్ని ఇంగ్లీష్ పుస్తకాల లోని పదాల సంఖ్య నలభై లక్షల పైమాటే. ఈయన పుస్తకాలని ఇంగ్లీషులో వ్రాసినా, అవన్నీ తెలుగుతనాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు వాళ్ళకి సంభందించినవే.

కధ సంగ్రహంగా;

ఎలాగన్నా ఐ ఏ ఎస్ అవ్వాలన్న లక్ష్యం తో వున్న, రీసెంట్ గా తల్లీతండ్రీ గతించిన అనిరుధ్, అదే లక్ష్యం తో వున్న తన ఫ్రెండ్ మనోజ్ తో కలిసి కంబైన్డ్ స్టడీ కూడా చేస్తూ కష్టపడుతూ వున్నాడు. ఆ సమయం లో ఆ వూళ్ళో వున్న, ఆ ఊళ్లోనూ ఇంకా చుట్టుపక్కల అన్నిఊళ్ళలోనూ, ఇంకా చెప్పాలంటే ఆ రాష్ట్రం లోనే బాగా ధనవంతుడు అయిన సర్వేశ్వరం, తల్లి లేని తన కూతురు మంజీర ని అనిరుధ్ పెళ్ళిచేసుకోవాలని, అలా చేసుకోనట్టయితే అనిరుధ్ తండ్రి తన దగ్గర ఎప్పుడో తీసుకున్న ఎనిమిది లక్షల రూపాయల అప్పుకు గాను కోర్ట్ లో కేసు ఫైల్ చేసి, అతనికున్న ఒక్కగానొక్క ఆస్తి, అతని తల్లీ తండ్రీ ఎంతో ఇష్టపడి కట్టుకున్న ఇంటిని స్వాధీనం చేసుకుంటానని బ్లాక్మయిల్ చేసాడు. మామూలుగా అయితే, నిజంగా అప్సరసలా వుండే మంజీర ని పెళ్లి చేసుకోవడానికి అనిరుధ్ కి అంతగా అభ్యంతరం వుండకపోను. కానీ మంజీర, సర్వేశ్వరం ఫ్రెండ్ కొడుకు ఇంకా తమ క్లాస్స్మేట్ అయిన నిరంజన్ అనే వాడిని లవ్ చేస్తూ వుంది, ఇరుపక్కల పెద్దలు కూడా వాళ్ళిద్దరికీ పెళ్ళిచెయ్యాలని నిర్ణయించుకుని వున్నారు. అంతేకాకుండా చిన్నప్పటి స్నేహాన్ని పురస్కరించుకుని అనిరుధ్ తనతో మాట్లాడ్డానికి ప్రయత్నించిన కొన్ని సందర్భాల్లో మంజీర అనిరుధ్ ని అవమానిస్తూ మాట్లాడి చాలా హర్ట్ చేసింది.  అందువల్ల మంజీర ని పెళ్లి చేసుకోవడం అనిరుధ్ కి ససేమిరా ఇష్టం లేదు. అయితే   వున్న ఆ ఒక్క ఇల్లు తప్ప వేరే ఆస్తులు ఏమీ లేవు ఆ అనిరుధ్ కి ఆ అప్పు తీర్చడానికి. కేవలం ట్యూషన్స్ చెప్తూ, ఆ ఆదాయం మీద జీవనం సాగిస్తూ ఎలాగన్నా ఐ ఏ ఎస్ కావాలన్న లక్ష్యం తో వున్న అనిరుధ్ కి, తన ఇల్లు కాపాడుకుంటూ మంజీర ని పెళ్లిచేసుకోకుండా ఆ లక్ష్యం ఎలా సాధించాలో అర్ధం కాలేదు.. ఒకవేళ తన ఐ ఏ ఎస్ గోల్  ని  పక్కన పెట్టి వుద్యోగం చేసినా, అంత త్వరగా ఆ అప్పు అనిరుధ్ తీర్చలేడు. ఒక వారం రోజుల్లో తన కూతురిని పెళ్లిచేసుకోవడానికి ఒప్పుకోవడమో లేక తన బాకీ పూర్తిగా తీర్చడమే చెయ్యకపోతే, తన తండ్రి చేసిన అప్పుకి కోర్టు లో కేసు ఫైల్ చేసి తన ఇల్లు స్వాధీనం చేసుకుంటానని బెదిరిస్తూ వున్నాడు సర్వేశ్వరం.   మంజీర, నిరంజన్ ల లవ్ విషయం అనిరుధ్  ప్రస్తావించినప్పుడు, అది కేవలం మంజీర భ్రమ మాత్రమేనని, మంజీర నిరంజన్ ని పెళ్లిచేసుకోబోవడం లేదని ఇంకా అనిరుధ్ ని పెళ్లిచేసుకోవడానికి మంజీర కి ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పాడు సర్వేశ్వరం.  తన తల్లీతండ్రీ ఎంతో  ఇష్టపడి కట్టుకుని, ఇంకా వాళ్ళ జ్ణాపకాలతో నిండివున్న తన ఇంటిని వదులుకోవడం ఎంతమాత్రం ఇష్టం లేదు అనిరుధ్ కి. అలాగే తనని అవమానించి, అంతకాలం ఆలా నిరంజన్ తో తిరిగిన  మంజీర ని పెళ్లిచేసుకోవడం కూడా అనిరుధ్ కి ఇష్టం లేదు.  అప్పటి వరకూ నిరంజన్ అన్న వాడితో లవ్ లో వున్న మంజీర ఆ లవ్ ని మరిచిపోయి తననెందుకు పెళ్లిచేసుకోవడానికి సిద్ధపడిందో,  సహజం గా ఎంతో మంచివాడైన సర్వేశ్వరం, కావాలంటే తన కన్నా వెయ్యిరెట్లు మంచి అబ్బాయిని తన కూతురికి తేగల కెపాసిటీ వున్న అతను, తననెందుకు తన కూతురిని అలా పెళ్లిచేసుకోమని బలవంతం చేస్తున్నాడో, అసలు విషయం ఏమిటో తెలుసుకోవడానికి అనిరుధ్ మొదలు పెట్టిన అన్వేషణ కధే ఈ హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ "అరె ఏమైందీ?"

డిస్క్లైమర్

ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం.  ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, పాత్రల యొక్క పేర్లు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు

అరె ఏమైందీ?

హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

రోజూలాగే ఆ రోజూ తెల్లవారింది. రోజూ లాగే ఆరోజు కూడా వుత్సాహంగానే లేచాడు అనిరుధ్. ఎలాగైనా ఐ ఏ ఎస్ అవ్వాలన్న పట్టుదలతో ప్రతిరోజూ చాలా చక్కగా ప్రిపేరవుతూ వున్నాడు. తనకి చిన్నప్పటినుండీ కూడా సివిల్స్ రాసి ఐ ఏ ఎస్ కి సెలక్ట్ అవ్వాలని కోరిక. తనని చూసే తన క్లోజ్ ఫ్రెండ్ మనోజ్ కూడా ఆ లక్ష్యం పెట్టుకున్నాడు. కుదిరినంతవరకూ ప్రతిరోజూ టౌన్ లో వున్న మనోజ్ తో కలిసి కంబైన్డ్ స్టడీ కూడా చేస్తూ వున్నాడు. అప్పుడప్పుడు మనోజ్ తన ఇంటికి వచ్చి, తన ఇంట్లో కూడా కంబైన్డ్ స్టడీ చేస్తూ వున్నారుఇద్దరూ.ఇద్దరూ కలిసి ఒక్కలాగేప్రిపేర్ అవుతూ వున్నా, మనోజ్ కన్నా కూడా తనే ఎక్కువ కాన్ఫిడెంట్ గా వున్నాడు.ఐ ఏ ఎస్ ని దృష్టిలో పెట్టుకునే, ప్రస్తుతానికి ట్యూషన్స్ చెప్తూ, అలాగే బ్యాంకు లో వున్న డిఫాజిట్స్ తో నెట్టుకు వస్తూవున్నాడే తప్ప ఫుల్ టైం వుద్యోగం ఏదీ చెయ్యడం లేదు అనిరుద్.

అనిరుధ్ తన తల్లితండ్రులకి ఒక్కగానొక్క కొడుకు. చాలా గారాబంగా పెరిగాడు. ఆ ఊళ్ళో ఒక ఇల్లు తప్ప వేరే ఆస్తిపాస్తులు ఏమీ లేవు. అనిరుధ్ నాన్నగారు పరమేశ్వర రావు పక్క టౌన్ లోఒక చిన్న కంపెనీలో వుద్యోగం చేస్తూ వుండేవారు. అనిరుధ్ తల్లి విమలరెండు సంవత్సరాల కిందట కాన్సర్ తో చనిపోతే తండ్రి ఆరు నెలల కిందట హార్ట్ ఎటాక్ తో చనిపోయారు. తండ్రి కూడా చనిపోయిన సమయానికి అనిరుధ్ డిగ్రీ పూర్తి చేసి నెల మాత్రం అయింది. జీవితం మీద ఉత్సాహం పూర్తిగా కోల్పోయి, విచారంతో కొట్టుమిట్టాడుతూ, ఏం చెయ్యాలో తోచని పరిస్థితులలో, తన దృష్టిని తిరిగి సివిల్స్ మీదకి మళ్లించి మళ్ళీ తనలో ఉత్సాహాన్ని నింపింది మోనోజే.

ఇంచుమించులో ఒక ఆరునెలల కిందట వరకూ మనోజ్ తనూ పక్క పక్క ఇళ్లల్లోనే వుండేవారు. మనోజ్ నాన్నగారు ఆ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గా చేస్తూ వుండేవారు. ఆయనకి టౌన్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోవడంతో మనోజ్ కుటుంబం మొత్తం టౌన్ లోకి వెళ్లిపోయారు, ఆ వూళ్ళో వాళ్ళ ఇల్లు లాక్ చేసి టౌన్ లో ఇల్లు అద్దెకి తీసుకుని. ఇళ్ల మధ్య దూరం పెరిగినా అనిరుధ్, మనోజ్ ల మధ్య స్నేహం పెరిగిందే కానీ తగ్గలేదు. తరచూ ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వచ్చి వెళుతూనే వున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం ఈ రోజు అనిరుధ్ మనోజ్ ఇంటికి వెళ్లి అక్కడ ఇద్దరూ కంబైన్డ్ స్టడీ చెయ్యాలి సాయంత్రం వరకూ.

"మిమ్మల్ని మా అయ్యగారు రమ్మంటున్నారు." ఇంక ఇల్లు లాక్ చేసుకుని, ఇంటినుండి బయటపడదామనుకుంటూన్న సమయంలో అనిరుధ్ ఇంట్లోకి వచ్చి సర్వేశ్వరం గారి నౌకరు అన్నాడు.

చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనిరుధ్ కి. సర్వేశ్వరం ఆ ఊళ్ళోనే కాదు, ఆ చుట్టుపక్కల ఊళ్ళ అన్నిటిలోనూ కూడా చాలా పెద్ద ధనవంతుడు. ఆ వూళ్ళో వ్యవసాయంతో పాటుగా, ఇతర చాలా రకాల వ్యాపారాలు కూడా వున్నాయిఆయనకి. ఆ గ్రామం లో అందరికన్నా ఎక్కువ వ్యవసాయ భూమి వున్నది కూడా ఆయనకే. అలాగే ఆ గ్రామంలో అందరికన్నా పెద్ద ఇల్లు వున్నది కూడా ఆయనకే.

ఒకప్పుడు తన కుటుంబం ఇంక సర్వేశ్వరం కుటుంబం చాలా స్నేహంగా ఉండేవి. అలాగే ఆయన కూతురు మంజీర తనూ కూడా చాలా స్నేహంగా వుండేవారు. కానీ కాలంతో పాటుగా తేడాలు వచ్చేయి. ముఖ్యంగా అయన భార్య నిర్మల మరణం తరువాత ఆ కుటుంబంతో తన కుటుంబానికి స్నేహసంభందాలు పూర్తిగా తెగిపోయాయి. అయన భార్య నిర్మల చనిపోయి కూడా పది సంవత్సరాలు పైనే అవుతూ వుంది. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ తన కుటుంబం, ఆ సర్వేశ్వరం కుటుంబం స్నేహంగా మాట్లాడుకున్నది అనిరుధ్ చూడలేదు. అలాంటిది ఇప్పుడెందుకు సడన్గా ఆ సర్వేశ్వరం తననిరమ్మన్నట్టో అనిరుధ్ కి బోధపడడం లేదు.

"దేనికి?" ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు అనిరుధ్.

"అవన్నీ మాకు చెప్పి పంపిస్తారా? మీరే వచ్చి తెలుసుకోవడం మంచిది." అలా అన్నాక వెనక్కి తిరిగాడు ఆ నౌకరు. "రావడం మాత్రం మర్చిపోకండి. చాలా ముఖ్యమైన విషయం అనుకుంటాను." అక్కడనుండి వెళ్ళిపోతూ అన్నాడు వాడు.

విషయం ఏమైనా తన ప్రోగ్రాం ని లేట్ చేసుకుని సర్వేశ్వరం ఇంటికి వెళ్లడం అనిరుధ్ కి ఇష్టం లేదు కానీ తప్పదు. సర్వేశ్వరం బాగా ధనవంతుడు మాత్రమే కాదు, తన తండ్రికి ఒకప్పుడుమంచి స్నేహితుడు కూడా. కాబట్టి అతని ఇంటికి వెళ్లి, విషయం ఏమిటో తెలుసుకుని, అప్పుడే మనోజ్ ఇంటికి వెళదామన్న నిర్ణయానికి వచ్చి, ఇంటికి లాక్ చేసి సర్వేశ్వరం ఇంటికి వెళ్ళాడు. అనిరుధ్ ని హాల్లో కూచోబెట్టి సర్వేశ్వరానికి కబురు చెప్పడానికి వెళ్ళాడు అక్కడ ఒక నౌకరు.

"వచ్చేవన్నమాట. అయినా నేను రమ్మంటే నువ్వు రాకుండా వుండవులే." ఒక అయిదు నిమిషాల్లో సర్వేశ్వరం అక్కడకొచ్చి అనిరుధ్ మొహంలోకి చూస్తూ అన్నాడు.

సర్వేశ్వరాన్ని చూస్తూనే గౌరవంగా లేచి నిలబడ్డాడు అనిరుధ్.

"ఫర్వాలేదు కూచో. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామనే నిన్ను రమ్మన్నాను." అక్కడవున్న ఒక కుర్చీని అనిరుధ్ కుర్చీకి ఎదురుగుండా లాక్కుని, అందులో కూలబడుతూ అన్నాడు సర్వేశ్వరం.

"అదేమిటో తెలుసుకోవచ్చా? నేను అర్జెంటు గా టౌన్ కి వెళ్ళాలి. ఆ ప్రయాణం వాయిదా వేసుకుని ఇలా వచ్చాను." మొహంలో అసహనం కనపడకుండా అలాగే నిలబడి అన్నాడు అనిరుధ్.

"నాకూ చాలా ముఖ్యమైన పనులు వున్నాయి. వేగంగానే చెప్పేస్తాను. కానీ కూచో కాసేపు. అలా నిలబడకు." అనిరుధ్ మొహంలోకే చూస్తూ అన్నాడు సర్వేశ్వరం.

ఇష్టంలేకపోయినా మరోసారి కుర్చీలో కూచున్నాడు అనిరుధ్. ఇలా కూచున్నాడో లేదో, ఆ ఇంట్లో పనిమనిషి కాఫీ తీసుకొచ్చి ఇచ్చింది.

"కాఫీ తీస్కో. చాలా కాలానికి వచ్చావు కదా మా ఇంటికి. మా ఇంట్లో కాఫీ బాగానే వుంటుంది."

సర్వేశ్వరం అలా అన్నాక ఇష్టం లేకపోయినా ఆ కాఫీ తీసుకుని సిప్ చెయ్యడం మొదలు పెట్టాడు అనిరుధ్.

"మీ నాన్న నేను మంచి స్నేహితులం. నేను చాలా సందర్భాల్లో మీ నాన్నకిధనసహాయం చేస్తూ వచ్చాను. ఆ డబ్బు ని తను తిరిగి ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోలేదు." ఈసారి అనిరుధ్  అడగకముందే చెప్పడం మొదలుపెట్టాడు సర్వేశ్వరం.

కాఫీ అలాగే సిప్ చేస్తూ వింటున్నాడు అనిరుధ్. సర్వేశ్వరం చెప్పింది నిజం. చాలా సందర్భాల్లో తన తండ్రి సర్వేశ్వరం దగ్గరనుండి డబ్బు అప్పుతీసుకున్నారు. కాకపోతే ఆ అప్పు తిరిగి తీర్చేస్తానన్నా తీసుకునేవాడు కాదీయన. అంతమంచి స్నేహం వుండేది ఇద్దరిమధ్యా. సర్వేశ్వరం భార్య నిర్మల మరణం తరువాత రెండు కుటుంబాల మధ్య స్నేహసంభందాలు చాలా పలుచబడ్డా, సర్వేశ్వరం మాత్రం తన డబ్బు గురించి తన తండ్రిని ఏనాడు అడగలేదు. అలాంటిది ఇప్పుడెందుకు ఆ డబ్బు గురించిన ప్రస్తావన తెస్తున్నట్టు?

"మీ ఇల్లు కట్టుకున్నప్పుడు, ఇంకా మీ అమ్మ కాన్సర్ తో బాధపడుతూ వున్నప్పుడు, నా దగ్గర మీ నాన్న చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు అప్పుగా తీసుకున్నాడు. అంతాకలిపి ఇప్పటివరకూ మీ నాన్న నాకు ఇవ్వవలిసినది పదిలక్షలు కన్నా పైనే అయింది."

అనిరుధ్ ఒక్కసారిగా వులిక్కిపడి, చెయ్యి వణికి, చేతిలో వున్న కాఫీ కప్పు కింద పడినంత పని అయింది.పదిలక్షల రూపాయలు కన్నా ఎక్కువ తన తండ్రి ఈ సర్వేశ్వరానికి ఇవ్వవలసి వుందా?

"నాకు ఇవ్వవలసిన మొత్తానికి మీ నాన్న ఒక ప్రామిసరీ నోటు కూడా రాసి ఇచ్చాడు. ఇది దాని తాలూకు నకలు. అసలు వేరొక చోట భద్రంగా వుంది." తన చేతిలోనుండి ఒక కాగితం తీసి అనిరుధ్ కి ఇస్తూ అన్నాడు సర్వేశ్వరం.

అందులో తన తండ్రి ఎనిమిది లక్షల రూపాయలు తన అవసరాల నిమిత్తం సర్వేశ్వరం నుండి అప్పు తీసుకున్నట్టుగా వుంది. సందేహం లేదు, ఆ ప్రామిసరీ నోటు మీద సంతకం తన తండ్రిదే. ఆ ప్రామిసరీ నోటు మీద సాక్షి సంతకాలు మాత్రం తనకి తెలిసున్న వాళ్ళు చేసినవి కాదు.

"ఈ డబ్బు మీ నాన్నకి ఇచ్చి చాలా కాలమే అయింది. మీ నాన్న వారసుడిగా ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత నీకుంది. ఒక వారంలోపుగా నువ్వు ఈ అప్పు మొత్తం నాకు తీర్చేయాలి." సర్వేశ్వరం అన్నాడు. 

అది విని అనిరుధ్ ఎంతగా వులిక్కిపడ్డాడు అంటే, అప్పటికే కాఫీ తాగి కప్పు కిందపెట్టేసాడు కాబట్టి సరిపోయింది కానీ లేకపోతె ఆ కప్పు కిందపడి ముక్కలైపోయేది.

"ఒక వారంలో నేను అంత అప్పు తీర్చాలా?" షాకింగా అన్నాడు అనిరుధ్.

"నేను ఎంతకాలం ఓపిక పట్టగలను? అయినా డబ్బులు తీసుకున్న చాలా కాలానికి ఆ ప్రొమిసోరీ నోటు రాసిచ్చాడు మీనాన్న. నువ్వు నాకు ఒక వారంలోగా నా అప్పు మొత్తం తీర్చాల్సిందే. లేకపోతె నేను నా డబ్బు వసూలు చేసుకోవడానికి కోర్ట్ లో కేసు ఫైల్ చేస్తాను."

"మీరు ఎంత కోర్ట్ లో కేసు ఫైల్ చేసినా, అంత అప్పు తీర్చగలిగేంత డబ్బు నా దగ్గర లేదు." అనిరుధ్ కి ఎలా మాట్లాడుతున్నాడో తెలియడం లేదు. తల తిరుగుతున్నట్టుగా వుంది.

"నువ్వు ప్రస్తుతం వుంటున్నఇల్లు వుంది కదా. నాకు రావలసిన బాకీకి బదులుగా, ఆ ఇంటిని ఇప్పించవలిసిందిగా కోర్ట్ ని అడుగుతాను."

మరోసారి వులిక్కిపడ్డాడు అనిరుధ్. తను, తన తల్లి, తండ్రి ఎంతో ముచ్చట పది కట్టుకున్న ఇల్లది. ఆ ఇంట్లో తన తల్లి, తండ్రి జ్ఞాపకాలు ఎన్నోవున్నాయి. ఆ ఇంట్లో వుంటే తన తల్లి తండ్రితో వుంటున్నట్టుగానే వుంటుంది. తన ప్రాణాలనైనా తేలికగా ఇచ్చేవచ్చేమో గాని ఆ ఇంటిని కాదు.

"మీకు తెలుసుకదా మా అమ్మ నాన్నా ఎంత ముచ్చటపడి ఆ ఇంటిని కట్టుకున్నారో. ఆ ఇంటిని ఎలా వదులుకోగలను?" ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు అనిరుధ్.

"నాకు తెలీదు. నువ్వు ఏదోలా ఒక వరం రోజుల్లో నీ బాకీ మొత్తం తీర్చాలి. లేకపోతే నేను కోర్ట్ లో కేసు ఫైల్ చేసి ఆ ఇల్లు స్వాధీనం చేసుకుంటాను. ఇందులో నీకు సందేహం ఏమీ అవసరం లేదు. " ఆ తరువాత ఇంక చెప్పడానికి ఏమీలేదన్నుట్టుగా కుర్చీలోనుండి లేచి అక్కడనుండి వెళ్ళిపోయాడు సర్వేశ్వరం.

నిస్సత్తువగా కుర్చీలోనుండి లేచి అక్కడనుండి బయట పడ్డాడు అనిరుధ్.

&&&

"మీ నాన్నగారు, ఆ సర్వేశ్వరం ఎంత సన్నిహితం గా వుండేవారో నాకూ తెలుసు. అలా డబ్బులు మీ నాన్నగారు తీసుకుని వుండొచ్చు . ఆ సర్వేశ్వరం వద్దన్నా మీ నాన్నగారే ఆ ప్రామిసరీ నోటు రాసి ఇచ్చి వుండొచ్చు కూడా."

ఆ సమయంలో మనోజ్ స్టడీ రూమ్ లో వున్నారు మనోజ్, అనిరుధ్. మనోజ్ చెప్పిన విషయం అంతా విన్నాక మనోజ్ అన్నాడు.

"ఆ విషయం నేనూ అంగీకరిస్తాను. అలా హార్ట్ ఎటాక్ తో చనిపోయి వుండకపోతే, మా నాన్నగారు నాకు తను ఆ సర్వేశ్వరం దగ్గర చేసిన అప్పు గురించి, ఇంక ఆ ప్రామిసరీ నోట్ గురించి చెప్పివుండేవారు. తను బతికి వుంటానని, తనే ఆ అప్పు తీర్చేద్దామని అనుకుని వుంటారు మా నాన్న." విచారంగా అన్నాడు అనిరుధ్.

"అసలు ఆ సర్వేశ్వరం దగ్గర అప్పుగురించి మీ నాన్నగారు సీరియస్ గా ఆలోచించాల్సిన అవసరం ఏమిటి? మీ నాన్నగారు అతనికి ఎంత మంచి స్నేహితుడంటే, ఆ సర్వేశ్వరం మీ నాన్నగారిని డబ్బులు తిరిగి ఇవ్వమని ఎప్పటికీ అడగడు. చెప్తున్నాగా. మీ నాన్నగారే రాసి ఇచ్చివుంటారు కానీ ఆ సర్వేశ్వరం ప్రామిసరీ నోట్ రాయమని మీ నాన్నగారిని ఎప్పటికీ అడగడు." మనోజ్ అన్నాడు.

"లేదులే. అయన భార్య చనిపోయాక మా కుటుంబాల మధ్య స్నేహసంభందాలు పూర్తిగా తగ్గిపోయాయి."

"అయితే మీ నాన్నగారు అతని దగ్గర అంత మొత్తంలో డబ్బులు తీసుకుని వుండరంటావా?"

"చెప్పలేను. మా నాన్నగారు కలుసుకుని వుండి వుండొచ్చు, డబ్బులు తీసుకుని వుండివుండొచ్చు, అలాగే నువ్వు చెప్పినట్టుగా వద్దన్నా మా నాన్నగారు ఆ ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చి వుండొచ్చు." చిరాగ్గా అన్నాడు అనిరుధ్."ఏం జరిగి ఉంటుందో కచ్చితంగా చెప్పలేను." 

"ఇప్పటికీ నాకు అర్ధం కానీ విషయం, ఆ సర్వేశ్వరం నిన్ను అలా అడగడం ఏమిటి? అయన స్థానంలో ఇంకెవరున్నా నేనిలా ఆశ్చర్య పడను. కానీ ఆ సర్వేశ్వరం అందరికీ సహాయం చేసే వ్యక్తి. ఎన్నో కుటుంబాల్ని నిలబెట్టాడు. అలాంటిది, తన స్నేహితుడి కొడుకువి, ఒక వారంరోజుల్లో ఆ అప్పు తీర్చకపోతే నీ ఇల్లు స్వాధీనం చేసుకుంటాననడమేమిటి? అతనికున్న మొత్తం ఆస్తుల విలువ వంద కోట్లకి దగ్గరగానే వుంటుంది. ఈ పదిలక్షల రూపాయలు అతనికి పెద్ద లెక్కా?"

"నాకూ అదే విషయం బోధపడ్డం లేదు. అంతేకాకుండా వారం రోజుల్లో ఈ పదిలక్షల రూపాయల పై చిలుకు బాకీ ఎలా తీర్చాలో కూడా అర్ధం కావడం లేదు." విచారం ఇంకా ఎక్కువ అయిపోయింది అనిరుధ్ లో. "అలాగే మా అమ్మానాన్న అంత ప్రాణప్రదంగా కట్టుకున్న ఇంటిని వదులుకోవడం కలలో కూడా వూహించలేను."

ఏం మాట్లాడాలో ఇద్దరికీ బోధపడక పోవడం తో నిశ్శబ్దం అలుముకుపోయింది అక్కడ. కాస్సేపటి తరవాత ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ అన్నాడు మనోజ్.

"అక్కడ వుండగా మంజీరని ఎమన్నా చూసావా?"

"మధ్యలో తన వూసెందుకు ఇప్పుడు?" చిరాగ్గా అరిచేడు అనిరుధ్.

"అంత అందమైన అమ్మాయి, ఎందుకనో ఆమె వుండే చోటుగురించి రాగానే ఆలోచించకుండా వుండలేకపోయాను." మనోజ్ అన్నాడు. "మీరిద్దరూ మంచి స్నేహితులు కూడా కదా."

(ఇంతవరకూ మీకు నచ్చిందని భావిస్తా. తదుపరి భాగం సాధ్యమైనంత త్వరలోనే అప్లోడ్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి, రివ్యూ రాయడం మర్చిపోవద్దు.)