Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నులి వెచ్చని వెన్నెల - 1

నులి వెచ్చని వెన్నెల

కొట్ర శివ రామ కృష్ణ

డిస్క్లైమర్

ఈ నవల పూర్తిగా రచయిత యొక్క స్వంత ఆలోచనలతో వ్రాయబడినటువంటిది. ఏ ఇతర రచయిత యొక్క రచనకి అనువాదం కానీ, అనుకరణ కానీ కాదు. ఈ నవల ఎవరినీ ఉద్దేశించి వ్రాయబడినది కాదు. అలాగే ఏ సంఘటన తోటి ప్రేరణ పొంది రాయబడినటువంటిది కాదు. ఇందులో వున్న పాత్రలు అన్నీ కూడా పూర్తిగా కల్పితం.  ఒకవేళ ఇందులోని పాత్రలు కానీ, కధ కానీ, మెయిన్ కాన్సెప్ట్ కానీ, నవలలో వేరే ఇంకేదైనా కానీ దేనితోనైనా పోలివున్నాఅది కేవలం కాకతాళీయం (co-incidental) మాత్రమే. రచయిత ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు

&&&

అమెరికాలో తమ బిజినెస్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్స్ కోసం మూడు నెలలు ప్లాన్ చేసుకుని వచ్చిన సమీర కి తన డాడ్ ఫోన్ చేసి ముఖ్యమైన విషయం మాట్లాడేది వుందని, వెంటనే ఇండియా కి ఇంటికి బయలుదేరి వచ్చేయమనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయం ఏమిటో చెప్పమని అడిగినప్పుడు, ఏ ప్రశ్నలు అడక్కుండా వెంటనే బయలుదేరి రమ్మని, విషయాలు ఫోన్లో చెప్పేవి కావని తన డాడ్ అనడంతో వెంటనే ఇండియాలో తమ ఇంటికి బయలు దేరింది. కాకపోతే ఇండియా కి వచ్చి, తను తన డాడ్ ని కలుసుకునే లోపే అయన హార్ట్ ఎటాక్ తో చనిపోవడంతో మ్రాన్పడిపోయింది సమీర.

తన డాడ్ చనిపోయారన్న దానికన్నా కూడా ఆయన అంతగా తనతో మాట్లాడదలుచుకున్నది చెప్పకుండా చనిపోవడమే ఎక్కువ బాధకలిగించింది సమీరకి. తనంతగా తనతో మాట్లాడదలుచుకున్నది ఏమిటో తమని ఎంతో ఇష్టపడే, ప్రేమించే తన అత్తయ్య నిర్మల కి కానీ, బావ సంజయ్ కి కానీ, తనకి కూతురు సమానమైన మల్లిక కి కానీ, ఇంకా తన ప్రాణ స్నేహితుడైన డాక్టర్ మనోహర్ కి కానీ తన డాడ్ ఏ కొంచం చెప్పకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది సమీరకి. దానికి తోడు ఇండియాకి వచ్చిన దగ్గరనుండి తనకి కలుగుతున్న విచిత్రమైన అనుభవాలు తనని ఇంకా అయోమయానికి గురి చేశాయి.

తన డాడ్ తనతో అంతగా చెప్పదలుచుకున్నది సమీర తెలుసుకోగలిగిందా లేదా, తన డాడ్ అంత ముఖ్యంగా భావించిన ఆ విషయం ఎటువంటిది, తన ప్రాణ స్నేహితురాలైన మల్లిక, తనని ప్రాణంగా ప్రేమించే అత్తయ్య నిర్మల, బావ సంజయ్ ఇంకా తను ప్రేమించే అనురాగ్ ఆ విషయం తెలుసుకోవడంలో తనకి ఎంతవరకూ సహాయం చేశారు అన్నదే ఈ నవల 'నులి వెచ్చని వెన్నెల'. ఏ స్పైసీ హాట్ రొమాంటిక్ అండ్ సస్పెన్స్ థ్రిలర్!

&&&

సమీర కళ్ళు తెరిచి చూసేసరికి తన బెడ్ రూమ్ అంతా వెలుగుతో నిండిపోయి వుంది అప్పుడు సమయం పదికి తక్కువ అవ్వలేదనిపిస్తూ. వెంటనే పక్కనే టేబుల్ మీద ఉన్నఅలారం క్లాక్ వంక చూస్తే సమయం పదింపావు. తను ఉదయం పూట ఎప్పుడూ ఇలా ఇంతసేపు పడుకున్నది లేదు. ఈ మధ్యనే ఇలా తయారయింది, ఇరెగ్యులర్ గా పడుకోవడం ఇంకా ఇరెగ్యులర్ గా లేవడం. తనెప్పుడూ డాట్ టైమింగ్ రాత్రి పడుకోవడానికి, తెల్లవారి లేవడానికి మైంటైన్ చెయ్యకపోయినా, ఇలా పన్నెండు గంటల వరకు పడుకోలేక పోవడం అలాగే తెల్లవారి పది వరకూ లేవలేక పోవడం ఎప్పుడూ లేదు. ఏ కారణంవల్లనైన రాత్రి పదకొండున్నర, పన్నెండు వరకు పడుకోలేక పోయినా, ఉదయం ఎనిమిది దాటకుండా లేచేసేది.

ఇంత మార్పు తన జీవితం లో తన డాడ్ మరణం తర్వాత మొదలైంది. ఏ కూతురి కైనా, తన తండ్రితో వుండే అటాచ్మెంట్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయమేమి కాదు కానీ సమీర  విషయంలో, తనకి, తన తండ్రి కి వున్నగొప్ప అటాచ్మెంట్ అర్ధం కావాలంటే కొంత చెప్పి తీరాల్సిందే.

సమీర, వర్ధన్ రావు గారికి ఒక్కతే కూతురు. తనని అయన ఎంతగా ప్రేమించారు, ఎంత ముద్దుగా చూసారు అంటే మాటల్లో చెప్పడం కష్టం. ఒకవేళ సమీర ఆరు నెలల వయస్సులోనే తల్లిని పోగొట్టుకుని వుండివుండక పోతే అంతగా ప్రేమించి ఉండేవారు కాదేమో. లేక సమీర కాకుండా ఇంకా ఎవరైనా సంతానం వున్నా కూడా ఆంత అనురాగం తనమీద ఉండేది కాదేమో చెప్పడం కష్టం. కానీ తనెంతో కష్టపడి డెవలప్ చేసి, సంవత్సరానికి మూడువేల కోట్ల లాభంతో, మూడు లక్షల కోట్ల టర్నోవర్ ఉన్న బిజినెస్ కన్నా కూడా సమీరే ఆయనకి ఎక్కువ.

తాను తన డాడ్ ని ఎంతగా ప్రేమించినా, తన మీద తన తన డాడ్ కి ఉన్న అభిమానం గురించి తనకి ఎంతగా తెలిసివున్నా, సమీరకి తన డాడ్ తో బొత్తిగా నచ్చని విషయం ఆ బిజినెస్ కి అంతటికి కూడా తననే బాధ్యురాలిగా చేసేయడం. కేవలం తన డాడ్ కోసం మాత్రమే తను అమెరికాలో ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ లో ఎం. బి. ఏ పూర్తి చేసింది. తనకి ఇష్టం లేకపోయినా తరచు అమెరికాలో బిజినెస్ మీటింగ్స్ కి వెళ్ళింది కూడా తన డాడ్ కోసమే.  

నిజానికి తనకి ఎప్పుడూ ఉండేది ఒక సాధారణమైన ఆడపిల్లలా స్వేచ్ఛ గా, ఆనందంగా   జీవితం గడపాలని. తానేమి బాధ్యతలని ద్వేషించదు. కొద్దో గొప్ప బాధ్యతలు మొయ్యడం అంటే తనకీ ఇష్టమే. కానీ మరీ ఇంతలాన? తమ కంపెనీలో పనిచేస్తూన్న మొత్తం ఉద్యోగుల సంఖ్య లక్షకన్నా ఎక్కువే. వాళ్ళందరి జీవితాలు తన మీద, తన నిర్ణయాల మీద ఆధారపడి వున్నాయి అంటే మాత్రం తనకి చాలా భారం మోస్తున్నట్టుగా, తాళ్లతో బంధించినట్టుగా ఉంటుంది.

"డాడ్, సంజయ్ కి కూడా మీరు బాధ్యతలు ఎందుకు అప్పగించరు? నిజానికి తన డాడ్ పెట్టుబడితోనే కదా మీరు వ్యాపారం ప్రారంభించి ఈ స్థాయికి వచ్చింది. తనకి ఈ ఆస్తులన్నిటి మీద హక్కుతో పాటుగా బాధ్యత కూడా వుంది." ఒకసారి అంది తను తన డాడ్ తో.

"నీకు తెలుసా అలా చేయాలని నేను ఎంతగా అనుకొంటున్నానో? కానీ ఆ సంజయ్ గురించి నీకు తెలుసు కదా. ఇలాంటివాటిమీద ఎంతమాత్రం ఆసక్తి చూపించడు. వాడికి నిజంగా ఏం కావాలో కూడా నాకర్ధం కాదు. నేనెన్నో సార్లు వాడికి చెప్పి విసుగొచ్చి వదిలేసాను. నువ్వేమన్నావాడిని మార్చగలను అనుకొంటే మార్చు." అని వదిలేశారు.

తన డాడ్ చెప్పింది నిజమే. సంజయ్ కి కేవలం అతని డాడ్ పెట్టుబడి తోటే తన డాడ్ బిజినెస్ స్టార్ట్ చేసి డెవలప్ చేశారనే విషయం తెలిసినా, ఎంతమాత్రం ఆ బిజినెస్ మీద ఆసక్తి చూపించడు. తానెన్నో సార్లు సంజయ్ ని అడిగి చూసింది, బిజినెస్ లో తనకి హెల్ప్ చెయ్యమని, బాధ్యతల్లో పాలుపంచుకోమని. నవ్వి వూరుకుంటాడే తప్ప, తనకి హెల్ప్ చెయ్యాలని ఆలోచించడు.

"తనకి ఈ బిజినెస్ విషయాలమీద ఆసక్తి లేకపోతే నాకే బాధా లేదు. కానీ తను ఇంటరెస్ట్ చూపించే విషయాలు నాకు చాలా భయం పుట్టిస్తూ ఉంటాయి." తన ఆంటీ, అదే తన డాడ్ తమ్ముడి భార్య, నిర్మల తరచూ అంటూ ఉంటుంది తనతో.  

ఆ విషయం నిజానికి తననీ డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది. ఆ సంజయ్ కి బ్లాక్ మేజిక్, షాడో వరల్డ్ ఇంకా ఊడూ లాంటివాటి మీద ఆసక్తి ఎలా కలిగిందో చెప్పడం కష్టం కానీ ఎప్పుడు వాటి గురించే ఆలోచిస్తూ, చదువుతూ, ఇంకా పరిశోధనలు చేస్తూ ఉంటాడు. తానెన్నో సార్లు అలాంటి వాటి గురించి ఆలోచించొద్దని, వాటిని వదిలేయమని చెప్పింది. దానికి కూడా నవ్వి వూరుకుంటాడే కానీ  పట్టించుకోడు.

"నువ్వుకూడా ఆలా అంటే ఎలా ఆంటీ? ఆ సంజయ్ కి ఆ పనికిమాలిన వన్నీవదిలేయమని, ఇంకా నాకు బిజినెస్ లో హెల్ప్ చెయ్యమని గట్టిగా చెప్పు." తానొక సందర్భంలో అంది డైనింగ్ టేబుల్ దగ్గర రాత్రి సప్పర్ చేస్తూన్నప్పుడు.

"వాడికి నీకు బిజినెస్ లో హెల్ప్ చెయ్యగలిగేంత తెలివిలేదు. వాడు ఆ బిజినెస్ మేటర్స్ లో ఇంవోల్వ్ అయితే నీకు లాభం కన్నా నష్టమే ఎక్కువే. ఆ పనికిమాలిన విషయాల్ని వదిలేస్తే చాలు." తన ఆంటీ నిర్మల అంది.

"విన్నావుగా మామ్ ఏమందో. నాకు ఆ బిజినెస్ లు వాటిగురించి ఆలోచించేటంత తెలివితేటలు లేవు. నేను ఆ బిజినెస్ లో కలుగ చేసుకుంటే మామ్ చెప్పినట్టుగా నీకు తలనొప్పి ఎక్కువ అవుతుందే కానీ తగ్గదు." చిరునవ్వుతో అన్నాడు సంజయ్.

"అసలు నీ లైఫ్ మీద నీకు స్పష్టత వుందా? ఏం చేద్దామనుకుంటున్నావు నువ్వు? ఇలా ఆ షాడో వరల్డ్, ఇంకా బ్లాక్ మేజిక్ వీటినే పట్టుకుని వేలాడతావా?" తను కోపంగా అడిగింది.

"తనని మీ నాన్నేమార్చలేక పోయారు. ఇంక నీ మాట వింటాడా? అనవసరంగా హైరానా పడకు. ఆ బిజినెస్ అంతా చూసుకోవాల్సింది, నువ్వూ మీ నాన్నే. ఆ విషయం మాత్రం గుర్తుంచుకో." తన ఆంటీ అంది

తనకి చాలా ఉక్రోషం వచ్చేసింది తన ఆంటీ మీద, ఇంకా కజిన్ సంజయ్ మీద కూడా. వాళ్ళతో తనకి అలాంటి అటాచ్మెంట్ వుండి ఉండక పోతే ఎదో ఒకటి అనేసి గట్టిగా పోట్లాడేది. నిజానికి తన దృష్టిలో తనని తన డాడ్ ఎంతగా ప్రేమిస్తాడో, అంతగా ప్రేమించేవాళ్లలో తన ఆంటీ, కజిన్ కూడా వున్నారు.

 

తనకి జ్ఞానం వచ్చాక ప్రత్యేకంగా చెప్తే తప్ప, తన ఆంటీ తనకి అమ్మలానే అనిపిస్తూ ఉండేది.  తనని అంత బాగా చూసుకునేది. తన కజిన్ సంజయ్ కి అన్నీ తన తరవాతే. సంజయ్ తనని ఏమన్నాఅంటే ఆంటీ అనేది. "తను నీకన్నా చిన్నది, అందులోనూ ఆడపిల్ల. తనకే నేనెక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇందులో ఎవ్వరిమాట వినేదే లేదు."

సంజయ్ తనకన్నా నాలుగేళ్లు పెద్ద. ఎప్పుడో ఒకటి రెండు సార్లు కంప్లైంట్ చేసాడేమో తప్ప, నిజానికి తనని ఎంత బాగా చూసుకుంటాడు అంటే, తను తనకి స్వంత చెల్లలు కన్నా కూడా ఎక్కువ. నిజానికి ఇంతగా ప్రేమిచే మనుషులు దొరకడం చాలా అదృష్టమైన విషయం. తనకి సంజయ్ హెల్ప్ చేయలేకపోవడం లో కూడా పెద్దగా తప్పు పట్టాల్సినది ఏమీ లేదు. తనకి సిక్స్ ఫీట్ హెయిట్ తో సిక్స్ ప్యాక్ బాడీ వుందే కానీ, బాగా ఆలోచించగలిగే మైండ్ లేదు.

"నీకు తెలీదు. ఏ ఆడపిల్లయినా నీలాగ ఉండాలని ఎంతగా కోరుకుంటుందో." తన గోడు వెళ్లబోసుకున్నప్పుడల్లా, తన స్నేహితురాలు మల్లిక అనే మాట ఇది.

"ఒక సైకాలజిస్టుగా ఒక ఆడపిల్ల మనసు అర్ధం చేసుకోలేవా? ఇరవై నాలుగేళ్ళ వయసులో ఏ ఆడపిల్లైనా ఏం కోరుకుంటుంది? ఇలాంటి మోయలేని బాధ్యతల్నా, లేకపోతే స్వేచ్ఛగా ఆనందించగలిగే జీవితాన్నా?" తను చిరాగ్గా అంది ఒక సందర్భం లో.

"ఓహ్, డియర్. నేను అర్ధం చేసుకోగలను. కానీ నువ్వు అర్ధం చేసుకోవలసింది ఏమిటి అంటే, నువ్వు ఇందులోనుంచి తప్పించుకోలేవు. కాబట్టి నువ్విది ఎంజాయ్ చేస్తూ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేసే ప్రయత్నం చెయ్యాలి. కోట్లకొద్దీ ఆస్తులు, కార్లు, బంగళాలు ఊరికినే రావు. ఒకవేళ అవలా ఊరికినే నీకు వచ్చినట్టుగా వస్తే, ఎలా ఎంజాయ్ చెయ్యాలా అని ఆలోచించాలి తప్ప, ఇలా అలోచించి విచార పడకూడదు."

ఇంకా దానికి తనకి ఏమనాలో తెలియక వూరుకుండిపోయింది.

"నేనేం కాదనడం లేదు. నువ్వు మరీ ఇంత రెస్పాన్సిబిలిటీ మొయ్యాల్సి రావడం వల్ల ఒక ఆర్డినరీ ఆడపిల్లలా ఎంజాయ్ చెయ్యలేక పోతున్నావు. కాకపోతే నువ్వు నీ డాడ్ కి హెల్ప్ చేస్తూ ఎంతోమంది కుటుంబాలకి వెన్నుదన్నుగా వున్నావన్న విషయం గుర్తుచేసుకుంటూ ఉంటే నీకు స్వాంతనగా ఉంటుంది. ఒకళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండగలగడం, వాళ్ళ జీవితాల్లో సంతోషం నింపడం చాలా గొప్ప విషయం. అలాంటి అదృష్టం చాలా కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. అలాగా సహాయం చెయ్యగలిగే అవకాశం వున్నా, చేసే మనస్తత్వం మాత్రం మీ డాడ్ ఇంకా నీలాంటి మనుషులకి మాత్రమే ఉంటుంది. లేకపోతే మీ డాడ్ నన్ను నిన్ను చూసుకున్నట్టుగానే ఎలా చూసుకోగలరు? నా పేరెంట్స్ లేని లోటు నాకు ఎప్పుడన్నా తెలియనిచ్చారా? నేను ఏం కావాలంటే అది చెయ్యనిచ్చారు, ఏం చదువుతానంటే అది చదవనిచ్చారు."

మల్లిక తన డాడ్ ఫ్రెండ్ చలపతి ఒక్కగానొక్క కూతురు. తన పేరెంట్స్ ఇద్దరూ తన చిన్నతనం లోనే ఫ్లైట్ ఆక్సిడెంట్ లో చనిపోతే, తన డాడీయే తన బాగువోగు చూసింది. తాను చెప్పినట్టుగానే తనకి పేరెంట్స్ లేని లోటు ఏనాడూ అయన మల్లికకి తెలియనివ్వలేదు. అలాగే తాను సైకాలాజిస్టు అవ్వాలని ఇష్టపడితే, ఒక పెద్ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ లో ఆ కోర్సు చదివించారు. తన ఎడ్యుకేషన్ అంతా తనకి కావాల్సినట్టుగానే చేశారు.

"నువ్వలా మాట్లాడితే నాకు చాలా కోపం వస్తుంది తెలుసా? ఎందుకు ఆస్తమాటూ అది గుర్తు చేస్తావు? నా దృష్టిలో నువ్వు నా ఓన్ సిస్టర్ కింద లెక్క. ఇంకెప్పుడు అలా చెప్పకు." నిజంగానే తను కోప్పడిపోయింది ఆరోజు.

"ఒకే. ఒకే. నువ్వు నాకు ఇలా మాటి మాటికీ అప్సెట్ అవ్వనని మాట ఇస్తే నేను అదెప్పుడూ గుర్తు చేసుకోను, అలాగే నీకు గుర్తు చెయ్యను." గలగలా నవ్వింది తను. "ఏయ్, సమీ. నేనున్నానుగా నీకు. ఇలా బాధ్యతలు మోస్తూ కూడా నువ్వు లైఫ్ ఎంజాయ్ చేసేలా చేసే పూచి నాది. నువ్వు మాత్రం అలా మరోసారి ఫీలవ్వకు. నువ్వు బాడ్ గా ఫీల్ అయితే నాకు బాడ్ గా ఫీలింగ్ వస్తుంది."

"ఆల్రైట్. ఐ ప్రామిస్ యు." తను కూడా నవ్వేసింది. "నేను నీకు మాట ఇస్తున్నాను. ఇంకిలా ఫీల్ అవ్వను."

మాట అయితే ఇచ్చింది కానీ అలా ఫీల్ అవ్వకుండా మాత్రం వుండలేకపోయింది. తన తండ్రి మేజర్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటూ వున్నా, తానేదో బాగా భారం మోస్తూన్నట్టుగానే ఉండేది. ఎక్కడికైనా పారిపోయి, హ్యాప్పీగా వుండాలినిపించేది. ఇంక ఇప్పుడు తన డాడ్ కూడా లేక మొత్తం బాధ్యతలన్నీ మీద పడ్డాక వేరే చెప్పాల్సినదేముంది?  

"నువ్వింకాసేపు పడుకుంటానంటే నా అభ్యంతరం ఏమీ లేదు. కానీ సమయం పదిన్నర అవుతూంది తల్లీ."

తన ఆంటీ నిర్మల మాటలు విని చటుక్కున లేచికూచుని ఆమె వైపు చూసింది సమీర.

"సారీ ఆంటీ. నిజంగానే చాలా ఎక్కువసేపు పడుకుండిపోయాను. రాత్రి రెండువరకు నిద్రపోలేకపోయాను, అందువల్లే." మోహంలో ఒక గిల్టీ ఫీలింగ్ తో అంది.

"నాకు తెలుసమ్మా. నువ్వీమధ్యన సరిగా నిద్రపోవడం లేదు, తిండి తినడం లేదు. అంతగా మీ డాడ్ నీతోటి ఏం చెప్పదలుచుకున్నాడు అన్నదే నీ ఆలోచన అయిపోయింది. అదేమిటో నీకు తెలిసిపోయి వున్నా లేదా చనిపోయేముందు మీ డాడ్ నీకు చెప్పేసి వున్నా నీకీ ఆందోళన ఇప్పుడు ఉండేది కాదు." తన ఆంటీ అంది.

"ఎస్ ఆంటీ." బెడ్ మీద నుండి కిందకి దిగి, ఆమె ముందుకు వచ్చి నిలబడి అంది సమీర. "అంత నీతోటి, ఇంకా డాక్టర్ అంకుల్ తోటి, మల్లిక తోటి కూడా షేర్ చేసుకోలేని ఆ విషయం ఏమిటో నాకు బాధపడడం లేదు. డైరీ లో కూడా ఏమీ మెన్షన్ చెయ్యలేదు."

నిజానికి తన డాడ్ సడన్ డెత్ కన్నా కూడా, తనంతగా తనతో ఏం చెప్పదలుచుకున్నాడు అన్నదే సమీర ని ఎక్కువ కలవరానికి గురి చేస్తూ వుంది. 

ఎంత దురదృష్టం కాకపోతే, తనంత ఇమ్మీడియేట్ గా అమెరికా నుండి బయలుదేరి వచ్చినా, తను వచ్చేలోగానే తన డాడ్ చనిపోతాడు? ఆరోజు ఆఖరిసారిగా తనకి తన డాడ్ కి, తాను అమెరికాలో ఉండగా ఫోన్లో జరిగిన సంభాషణ తను ఎప్పటికీ మర్చిపోలేదు.

"డాడ్, చెప్పండి." ఫోన్ ఎత్తగానే తను మామూలుధోరణిలో ఉల్లాసంగా అడిగింది.

"నువ్వు వెంటనే అక్కడినుండి బయలుదేరి ఇంటికి వచ్చేగలవా?"

వేరే ఇంకేం లేకుండా స్ట్రెయిట్ గా ఆలా అడిగేసరికి నిజానికి తాను షాక్ అయిపోయింది. నిజానికి తను, తన డాడ్ చాలా ఆలోచించుకుని తన ఈ టూర్ మూడు నెలలకి ప్లాన్ చేసుకుని తానిక్కడికి రావడం జరిగింది. తానిక్కడున్న తమ డిస్ట్రిబ్యూటర్స్ ని అందరిని సమావేశ పరిచి తమ బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఇంకా కొత్త బ్రాంచీలని ఏర్పాటు చెయ్యడం గురించి చర్చించాలి. అమెరికా లో కూడా తమ బిజినెస్ కి మంచి ప్రాఫిట్స్ వస్తూండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

(ఇక్కడి వరకూ మీకు నచ్చిందని భావిస్తా. తరువాతి భాగం సాధ్యమైనంత త్వరలో అప్డేట్ చేస్తా. దయచేసి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరిచిపోవద్దు.)