Read Those three - 39 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 39

" మీరే బయలుదేరుతున్నారు. అన్వర్ ఇంటి ముందు నిఘా ఉంటుంది."
క్షణం ఆగాడు ఆదిత్య .
"అన్వర్ ఇంటి ముందే కాదు. మీ సమతా సదన్ ముందు కూడా నిఘా ఉంది. అయినా ఇబ్బంది లేదు. ఇంతియాజ్ తో అన్నూ విషయాలు వివరంగా మాట్లాడాను. "
అరగంట తర్వాత అన్వర్ ఇంటి ముందు ఓ కారు ఆగింది. ఆదిత్య దిగాడు. అప్పుడు సమయం ఉదయం ఏడు గంటలు.
హసీనా (మెహర్ తల్లి) ఆదిత్య ను చూసి పలకరింపుగా నవ్వింది. ఆదిత్య కూడా చిరునవ్వు నవ్వి ప్రక్కనే కూర్చున్నాడు.
" మీ స్నేహితుడు ఎలా ఉన్నాడు ?"
" కోలుకుంటున్నాడు. మరో నాలుగైదు రోజులు రెస్ట్ తీసుకుంటే చాలు." ఆదిత్య గొంతు విని కిచెన్ లో ఉన్న మెహర్ హాల్లోకొచ్చింది.
" అన్వర్ తోనే మా ఇంటికొస్తానన్నావ్ ?" నవ్వుతూ అంది మెహర్ తల్లి.
" ఇప్పుడూ అదే మాట. నా మాటలో తిరుగు లేదు "
అర్థం కానట్లు చూసింది హసీనా
" ఆ రోజు రాత్రి మెహర్ రక్తం ఇచ్చింది అన్వర్ కు " మెల్లగా అన్నాడు ఆదిత్య. ఆమె నమ్మ లేనట్లు చూసింది.
" అన్వర్ కా ? ఆ మాటతో ఆమె మొహం పాలిపోయింది. తూలినట్లు ముందుకు పడబోయింది. మెరుపులా మెహర్ ఆమెను పొదువు కుంది. తనూ చటుక్కున లేచి హసీనా భుజం పై చెయ్యి వేశాడు ఆదిత్య.
" ఆమ్మా ! అన్వర్ కు ప్రమాదం లేదు. తప్పక అతి త్వరలో మామూలు మనిషి అవుతాడు. మీరు జాగ్రత్త. "
ఆమె నుదుటిపై చిరుచెమటలు. మొహం పై అలసట. తను భుజంపై ఉన్న ఆదిత్య భుజం పై చేయి వేసి " వాణ్ణి ఇప్పుడే చూడాలి" అంది.
" తప్పకుండా." ఆదిత్య, మెహర్ ఆమె ను నెమ్మదిగా లేవదీశారు. మెహర్ ఆమె మొహాన్ని శుభ్రంగా తుడిచింది. చల్లటి నీరు త్రాగించింది .
సర్దార్జీ చెల్లెలి ఇంటి ముందు కారాగింది. ముగ్గురూ దిగారు. మేడ మెట్లు ఎక్కుతున్నప్పుడు హసీనా లో మెట్టు మెట్టుకూ
పెరుగుతున్న ఉద్వేగం, గుండె వేగం. అన్వర్ కళ్ళు మూసుకుని పడుకొని ఉన్నాడు. అతడిలో ఆలోచనల కలకలం. తల్లి నుంచి చూడాలన్న ఆరాటం.
సర్దార్జీ మంచం ప్రక్కనే ఉన్న వాలుకుర్చీలో కూర్చొని ఆ రోజు పేపర్ తిరగేస్తున్నాడు.హసీనా గదిలోకి వచ్చింది. వెనుకే మెహర్, ఆదిత్య. సర్దార్జీ ఆమెను చూడగానే లేచి నిలబడ్డాడు.
హసీనా కన్నార్పకుండా కొడుకునే చూస్తోంది. వయసుతో పాటు అన్వర్ వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్క క్షణం .... ఏడుస్తూ ఇంట్లోంచి వెళ్ళి పోయిన ఆనాటి రూపం మదిలో కదిలింది. మొహం లో నీలినీడలు. కళ్ళల్లో తడి.
" అన్వర్" మెల్లగా పిలిచాడు సర్దార్ జీ. అన్వర్ కళ్ళు తెరిచాడు. ఎదురుగా అమ్మీజాన్, మెహర్.
ఉలికి పాటుతో ఒక్క ఉదుటున లేచి కూర్చున్నాడు.
" ఆరామ్ సే డేటా! బురఖా సవరించుకుంటూ అన్వర్ భుజం పై చెయ్యి వేసింది. ఆ స్పర్శ తో అన్వర్ కదిలి పోయాడు.తల్లి గుండె ల్లో తలదాచుకొని ఆమెను ఆర్తి గా పొదువు కున్నాడు.
హసీనా కొడుకు ను దగ్గరకు తీసుకుంది. కళ్ళు మూసుకుంది. ఒకరి స్పర్శ ఒకరికి ఓదార్పు లా అనిపించింది. హసీనా కళ్ళు స్రవిస్తున్నాయి. పెదవులు మెల్లగా అదురు తున్నాయి.
మెహర్, ఆదిత్య, సర్దార్జీ వారిద్దరినీ సంభ్రమం గా చూస్తున్నారు.
" అమ్మీ ! అబ్బాజాన్? అన్వర్ కు ఏడుపు ఉప్పెనలా ఉరికింది. కరువు దీరా ఏడ్చాడు. తల నిమురుతూ ఉండి పోయింది.
కాసేపటికి ఇద్దరూ తేరుకున్నారు. అన్వర్ తల్లి హసీనా ప్రక్కనే మంచం మీద కూర్చుంది. అన్వర్ చెల్లెల్ని పిలిచాడు.మెహర్ అతడికెదురుగా కూర్చుంది. ఆమె చేతిని ఆప్యాయంగా చేతిలోకి తీసుకున్నాడు. అతడి కళ్ళల్లో అనురాగపు కాంతులు.
" అమ్మీ ! మెహర్ పరీలా ఉంది. చదువు, సంస్కారం, బాధ్యత నా చెల్లెల్ని బంగారపు బొమ్మను చేశాయి. ...... ఇన్నాళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. తను రక్తం ఇచ్చి అన్న ప్రాణాలు కాపాడింది. నాకు తన ముందు కనీసం నిలుచుకునే అర్హత లేదు. " అన్వర్ కళ్ళల్లో పశ్చాత్తాపం.
" భయ్యా " అప్రయత్నంగా అన్వర్ భుజం పై చెయ్యి వేసింది మెహర్. ఆ చర్య లో, ఆ పిలుపు లో మందలింపు ఉంది. మమత ఉంది. " నువ్వసలు రావనుకున్నాను. మమ్మల్ని మరిచిపోయావనుకున్నాను. అమ్మ కు మాత్రం నువ్వొస్తావని
గట్టి నమ్మకం. ఆ నమ్మకం నాకు లేకున్నా నువు రావని అమ్మ తో వాదించలేదు. ఎందుకంటే ఆ నమ్మకమే ఆమె ఊపిరి " అన్వర్ అమ్మ ను ఆర్తి గా , ఆరాధనగా చూశాడు.
" కారణాలేమైనా నువ్వు వచ్చావు. అమ్మ ను బతికించావు. నాకున్న ఒక్క తోడు ను కాపాడావు. " మెహర్ కళ్ళల్లో కృతజ్ఞత.
అన్వర్ చెల్లెల్నే కన్నార్పకుండా చూస్తున్నాడు. పదేళ్ళ ఆనాటి మెహర్ ఎంతగా ఎదిగి పోయింది.
" ఇంత కాలం నువ్వెక్కడున్నావో, ఏం చేశావో మాకు చెప్పొద్దు. నీ గతం మా కనవసరం . నీలో మార్పే మేం కోరుకునేది. ఆ మార్పు నీలో వచ్చింది కనుకనే నువ్వు మమ్మల్ని చూడాలనుకున్నావు.ఇది చాలు ".
అన్వర్ అమ్మ ను చూశాడు. ఆ చూపు లో భావం ఆమె కర్థమైంది.
" మెహర్ చెప్పింది నిజం. నువ్వు మారావు. పాత జీవితం మరిచిపో. నిన్ను మనిషిని చేసింది ఈ మహానుభావుడు. ( సర్దార్జీ) . నీ ప్రాణం కాపాడింది ఆదిత్య. వారే దారి చూపిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వారి చేతిని వదలకు."
ఆ మాట పూర్తి కాకముందే సమంతా సదన్ ఉమ్మడి పరివారం గదిలోకి బిలబిలమంటూ ప్రవేశించింది. ముందు సలీమా, సునీత, గీత, వెనుకే విశ్వనాథం, రెహమాన్, రాజు.
సలీమా హసీనా కు " ఆదాబ్ " అంటూ సలాం చేసింది. చిరునవ్వుతో గీత చేతులు జోడించింది. సునీత హసీనా ను
అసలు పట్టించుకోలేదు. సూటిగా, బాణం లా అన్వర్ దగ్గరకు వెళ్ళింది. తలకట్టు పై చేయి వేసి " ఎంత పెద్ద గాయం అయింది . ఆ శ్రీమన్నారాయణుడే నిన్ను కాపాడాడు. పెద్ద గండం గడిచింది. నువ్వు త్వరగా కోలుకుంటే కొండకు నడిచి వస్తానని ఏడుకొండల వాడికి ముడుపు కట్టాను. "అంది.
ఆమె హడావిడి లో, కంగారు లో, అమాయకత్వం లో హసీనా కు అమ్మ కనిపించింది. సునీత ను వినోదం గా, అభిమానం గా చూసింది.
" మీ అమ్మ గారా ! నమస్కారమండీ ! నా హడావిడిలో మిమ్మల్ని గమనించలేదు. ఏమీ అనుకోకండి ". అంది
అలాగేనని తలవూపింది హసీనా. అందరి పరామర్శలతో, పలకరింపులతో తడిసి ముద్దయ్యాడు అన్వర్.
" నీ ఆసుపత్రి ఖర్చు మేమందరం భరిస్తామంటే వద్దన్నావట. మేము నీకు పరాయి వాళ్ళమా లేక మా డబ్బు లు తీసుకోకూడదన్న ఆత్మాభిమానమా ?"
విశ్వనాథ శాస్త్రి గారి మాటలకు అన్వర్ చిరునవ్వు నవ్వాడు.
" మనమంతా ఓ కుటుంబం లా ఉంటున్నాం. మనలో ఎవరికి ఏ కష్టం వచ్చినా , నష్టం వచ్చినా తలా ఓ చెయ్యి వెయ్యాలి. ఇది సమిష్టి బాధ్యత " రాజు వివరించాడు.
" నన్ను చూస్తుంటే కోపం రావటం లేదా. పిచ్చి మోసగాడినని అనిపించలేదా.? " అన్వర్ గుండె చప్పుడు అందరూ వినగలిగారు.
" నీలో మార్పు వస్తున్నప్పుడు మా అందరినీ కలిశావు. అందువల్లే మాలో ఒకడిలా కలిసిపోయావు. మా అందరికీ నీవెప్పుడూ అనంత్ రామ్ వే. నీలో మేము ఉగ్రవాది ని కాదు. స్నేహితుడిని చూశాం. చూస్తాం " రెహమాన్ ఓదార్పు గా అన్వర్ భుజం తట్టాడు.
అనంత్ రామ్ ఉరఫ్ అన్వర్ అందరికీ చేతులెత్తి నమస్కరించాడు.
" అన్వర్ భాయ్ ! నీలాంటి మిలిటెంట్ ముస్లిమే. నేనూ ముస్లిమే. కానీ నేను ముస్లిం అన్నది నేను నమాజు చేస్తున్నప్పుడే అనిపిస్తుంది. మీ అందరితో ఉన్నప్పుడు ఆ ఆలోచనే రాదు. ఎందుకో తెలుసా ? నాకు మీ అందరూ కావాలి. మీతో ఒకే కుటుంబం లా కలిసిమెలిసి ఉండాలి.
నా భార్యాబిడ్డల తో ప్రశాంతమైన జీవితం గడపాలి.
ఓ విషయం చెప్పనా! ఆ రాత్రి నీకు ప్రమాదం జరిగి తెలివి తప్పే ముందు నువ్వు అల్లాను తలుచుకునే ఉంటావు. ఆయన నీ ప్రార్థన విన్నాడు. కానీ మరో అన్వర్ ను పంపలేదు. ఆదిత్య ను పంపాడు. అన్వర్ అయినా ఆదిత్య అయినా అల్లా దృష్టిలో సమానమే. ఈ నిజం మనం తెలుసుకోలేక పోతున్నాం. ఎప్పుడు తెలుసుకుంటామో ఏమో ?" రెహమాన్ విశ్లేషణ అతని విశిష్ట వ్యక్తిత్వాన్ని అద్దం లా చూపింది. అక్కడున్న వారి దృష్టి లో అతడి స్థాయి పెరిగింది.
మరి కాసేపు అన్వర్ తో సరదాగా గడిపి సమతా సదన్ పరివారం సెలవు తీసుకుంది.
" మా అందరి దువా తో భయ్యా త్వరగా కోలుకుంటాడమ్మా .
ఇక భయం లేదు." మెహర్ మాటలకు అవునన్నట్లు తల వూపింది హసీనా.
" నువ్వు ఇక్కడకు రానంత వరకూ ఏదైతే పోగొట్టుకున్నావో
ఆ ప్రేమను పూర్తి గా సమతాసదన్ లో పొందగలిగావు. నా కెంతో తృప్ౠ ఉంది అన్వర్ " హసీనా ప్రతి మాటలో ఆ తృప్తే ధ్వనించింది.
హసీనా, మెహర్ లు కూడా వెళ్ళిపోయారు. గదిలో ముగ్గురే
మిగిలారు. అన్వర్,. ఆదిత్య,. సర్దార్ జీ.
" ఇంతియాజ్ కు ఫోన్ చేస్తాను " అన్వర్ ను కన్నార్పకుండా చూస్తూ అన్నాడు ఆదిత్య. అన్వర్ ఆదిత్య ను ప్రశాంతంగా చూశాడు. అతడు అన్నింటికీ సిద్ధం గా ఉన్నాడు.
" ఫోన్ చేసే అవసరం లేదు . ఒకసారి అలా బయటకి చూడు ఆదిత్యా" సర్దార్జీ క్రిందికి చూపుతూ అన్నాడు. ఆదిత్య సర్దార్జీ
చూపిన వైపు చూశాడు.
విశాలమైన రోడ్డు కు అటువైపు కారు డోరు నానుకొని నిలబడి ఉన్నాడు ఇంతియాజ్. కృష్ణుని సహజపాద ముద్రలో గదివైపే చూస్తూన్నాడు.
ఆదిత్య గది బయటకు వచ్చి ఇంతియాజ్ ను చూసి చెయ్యి ఊపాడు.
ఇంతియాజ్ మెట్లెక్కి గదిలోకి వచ్చాడు. వెనుకే విహారి.
ఇంతియాజ్ అన్వర్ కు ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు.
" ఎలా ఉంది ?"
" చాలా వరకు తగ్గింది సార్. లేస్తే కళ్ళు తిరుగుతున్నాయి." అన్వర్ సర్దుకొని నిటారుగా కూర్చున్నాడు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దం.
" నీ నెట్ వర్క్ లో హ్యాకర్స్ ను ఏదో ఒక సాకుతో ఒకచోట చేర్చగలవా ?"
లేదు సార్. అలా అందరినీ సమావేశ పరిచి మాట్లాడే అధికారం నాకు లేదు. అసలు వారెక్కడ పని చేస్తున్నారో, ఏ కాలేజీ కి పని చేస్తున్నారో నాకూ తెలీదు. మా వ్యవహారాలన్నీ ఫోన్ కాల్స్ ద్వారా నే జరుగుతాయి. నేను ఫోన్ చేస్తాను. వాళ్ళు నేను చెప్పిన చోట కలుస్తారు. క్షణాల్లో నగదు, సరుకు చేతులు మారతాయి. అంతే మా మధ్య మాటలుండవు. ఈ వ్యవహారం జరిగినంతసేపు మాపై నిఘా ఉంటుంది. అందరినీ సమావేశ పరిచే అధికారం నా ఇమీడియేట్ హెడ్ రహీం కు మాత్రమే ఉంది. అతడు చెప్పినట్లు నేను నడుచుకోవాలి. "
" రహీం కు హెడ్ ఎవరు ?"
నవ్వాడు అన్వర్.
" నాకు తెలీదు. ఏ సలహా అయినా, సూచన అయినా రహీం ద్వారానే. ఐ యామ్ ఇన్ ఎ స్పాట్ లైట్."
" ఇదే మాట యాకూబ్ కూడా చెప్పాడు. అవును. నిన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తే మీ వాళ్ళు అలెర్ట్ అయిపోతారు కదా "!
" మళ్ళీ నవ్వాడు అన్వర్.
" ఈ బెడ్ రెస్టే అరెస్ట్. అయినా మిమ్మల్ని కాదని నేనెక్కడికి పోగలను సార్ ! ఒకసారి చేసిన తప్పుకు నా వాళ్ళ కు దూరమయ్యారు. రెండో సారి అదే తప్పు చేస్తే నాకు నేనే దూరమవుతాను."
నిట్టూర్చాడు ఇంతియాజ్.
"ఈ రియలైజేషన్ ప్రతి ఉగ్రవాదికి ఉంటే ఈ లోకమే జన్నత్ అవుతుంది. ఓకే ! మీ రహీం కు ఏదో ఒకటి చెప్పి నీ రెస్ట్ పీరియడ్ పొడిగించుకో. ఈ లోపల జరగవలసింది జరిగి పోతుంది. ఆ తర్వాత నిన్ను అరెస్ట్ చేయవలసిన అవసరమే
ఉండదు. " ఇంతియాజ్ లేచాడు.
" అన్వర్ ! వీరిద్దరి పై నమ్మకం ఉంది కాబట్టే నీ మీద నిఘా పెట్టలేదు "
" సార్ ! మీరు నన్ను ట్రేస్ చేశారని మా హైకమాండ్ కు తెలిసిన వెంటనే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. నాకు రక్షణ ఇక్కడే "
అవునన్నట్లు తల వూపాడు కానీ అన్వర్ పై నిఘా ఉంది. ఇంతియాజ్ లో "పోలీ‌సు ఎవరినీ నమ్మాడు.