Read Those three - 17 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 17



శీతాకాలం లో పగలు పన్నెండు గంటల సమయంలో ఎండలో నిలబడగలం . యాదగిరి కాలేజీ మెయిన్ గేటు ముందు ఉన్నాడు . అతడి నిరీక్షణ షేర్ ఆటో కోసం. ఆ వీధిలో సహజంగానే రద్దీ తక్కువ . పైగా మిట్ట మధ్యాహ్నం.
యాదగిరి సహనానికి పరీక్షే మరి .
ఎట్టకేలకు ఆ పైవాడు కరుణించాడు. షేర్ ఆటో వచ్చింది.
అందులో ఇద్దరే ఉన్నారు . యాదగిరి ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా కూర్చున్నాడు . ఆటో కదిలింది .
ఆ వీధి చివర చిన్న కిరాణా కొట్టు ఉంది . కొట్టు ముందు చిన్న పందిరి . ఆ పందిరికి అటూ ఇటూ రెండు పొడుగు బల్లలు . ఒకదానిపై ఓ యువకుడు కూర్చొని యాదగిరి నే గమనిస్తున్నాడు . అతడికి అనుమానం రాకుండా . షేర్ ఆటో రాగానే ఆ యువకుడు మెరుపులా కదిలాడు . తన ప్రక్కనే ఉన్న బైక్ దడదడలాడించి ఆ ఆటో వెనుకే తగినంత
దూరంలో ఫాలో కాసాగాడు.
" ప్రతి శుక్రవారం యాదగిరి ఈ టైంలో ఎక్కడికి వెళతాడు . " అతడి సందేహం.
షేర్ ఆటో ఓ పావుగంట ప్రయాణం చేసి ఓ ఇరుకు సందు ముందు ఆగింది . యాదగిరి దిగాడు .ఆటో కదిలింది. యువకుడు ఓ ఇరానీ చాయ్ కార్నర్ ముందు ఆగాడు . యాదగిరి నే చూస్తున్నాడు . యాదగిరి ఆ సందులోకి వెళ్ళాడు . అది ముస్లిం ఏరియా . ఇరుకు సందు లతో , చిన్న చిన్న షాపులతో రద్దీగా ఉంది .
బైక్ స్టాండ్ వేసి కాస్త వడివడిగా అడుగులు వేస్తూ సందు దగ్గరకు వచ్చాడు ఆ యువకుడు . కాస్త చాటుగా ఉండి యాదగిరి నే గమనిస్తున్నాడు . సందులో యాదగిరి తో పాటు మరో అయిదు గురు అటూ ఇటూ తిరుగుతూ వెళుతూ ఉన్నారు . ఆ సందులో మసీదు ఉంది. మసీదు ముందు ఆగాడు యాదగిరి .
అటూ ఇటూ చూసి జేబులోంచి నమాజు టోపీ తీశాడు . సరి చేసి తలకు పెట్టుకున్నాడు. నింపాదిగా మెట్లెక్కి లోపలికి వెళ్ళాడు . ఆ యువకుడి కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి . " యాదగిరి ముస్లిమా !"
క్షణం ఆలస్యం చేయకుండా బయలు దేరాడు. ఇంటికి వెళ్ళి తన గదిలో రిలాక్స్ అయాడు . ఫ్యాను గాలికి బడలిక తీరింది . సెల్ తీసుకొని ఎవరికో రింగ్ చేశాడు .
" హలో రమేష్ ! అవతలి నుండి ఒక మగ గొంతుక.
" సార్ ! యాదగిరి ముస్లిం. హిందువు కాదు ."
" వ్వాట్ ! అవతలి వ్యక్తి స్పందన .
" అవును సార్ ! అతడొక మసీదులో కి వెళ్ళడం చూశాను . " బహుశా తను ముస్లిం స్నేహితుణ్ణి కలవడానికి వెళ్ళుంటాడు. అతడికి ముస్లిం ఫ్రెండ్స్ ఉండొచ్చు గా !"
" నో సార్ ! అతడు ముస్లిమే . మసీదు లోకి పోయేముందు నమాజు టోపీ పెట్టుకున్నాడు .
ఆ వైపు నుండి వెంటనే రెస్పాన్స్ రాలేదు . క్షణం తర్వాత ఫోను లో రమేష్ కు అవతలి వ్యక్తి నిట్టూర్పు స్పష్టంగా వినిపించింది .
". ఓకే . ! కానీ అనుకోని మలుపు తిరిగింది . సర్లే . మళ్ళీ కలుద్దాం . నువ్వు రెస్ట్ తీసుకో . " అవతలి వ్యక్తి సెల్ ఫోన్ కట్ చేశాడు .
విహారి తో కలిసి ఇంతియాజ్ సూచించిన ఇద్దరు అన్వర్ అన్వేషణ లో పడ్డారు . ముందు ముస్లిం ఏరియాస్, స్లమ్స్ జల్లెడ పట్టారు . శ్రమ తప్ప ఫలితం కనిపించలేదు . ఇప్పుడు నగరం శివార్లలో అలుపెరుగని
పయనంలో , ప్రయత్నం లో ఉన్నారు .
సాయంత్రం ఆరు గంటలు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. " సిటీ అవుట్ స్కర్ట్స్ లో " చిన్న కాలనీ మెయిన్ స్ట్రీట్ లో విహారి బైక్ మీద వెళుతున్నాడు.
ఒక సెంటర్ లో ఆగాడు . ఎవరినో ఏదో అడిగాడు . వారు చెప్పారు . థ్యాంక్స్ చెప్పి ముందుకు వెళ్ళాడు.
ఆ కాలనీ పోలీస్ స్టేషన్ ముందు బైక్ ఆగింది . విహారి దిగి లోపలికిళ్ళాడు.
స్టేషన్ ఆఫీసర్ కు తనను పరిచయం చేసుకున్నాడు . ఎస్ ఐ చిరునవ్వు తో చేయి కలిపాడు . విహారి కూర్చున్నాడు.
" చెప్పండి" ఎస్ ఐ అడిగాడు.
పెద్ద ఉపోద్ఘాతం లేకుండా తనకు కావలసింది సూటిగా అడిగాడు.
అప్పటిదాకా ఎక్కే గడప , దిగే గడప వ్యవహారంతో అలసిపోయి ఉన్నాడు విహారి.
" దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం ఒక టీనేజ్డ్ బాయ్ ఇల్లు వదిలి వెళ్ళాడు . అతడు ముస్లిం . ఎందుకు వెళ్ళిపోయాడో కారణం తెలీదు . ఇంతవరకు ఇంటికి రాలేదు . ఆ మిస్సింగ్ కేసు వివరాలు కావాలి ."
" వాళ్ళ పేరెంట్స్ కంప్లయింట్ ఇచ్చారా ?"
" కొడుకు తిరిగి రాకపోతే కంప్లయింట్ ఇవ్వరా ?" విహారి నవ్వాడు.
" ఆఫ్ కోర్స్ ." ఎస్ ఐ కి నవ్వక తప్పింది కాదు.
" రండి . రికార్డ్ రూం కు పోదాం ." ఎస్ ఐ లేవబోయాడు.
" నో...నో... మీకెందుకు శ్రమ. రైటర్ ని పంపండి."
స్టేషన్ ఆఫీసర్ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ వచ్చి సహాయం అడిగితే పోలీసు వెంటనే రెస్పాండ్ కారు . సవాలక్ష ప్రశ్నల
తో నిలదీస్తారు.
" ఏ ఆధారం లేనిదే వెతకటం ఎలా ?" అని వారి అభ్యంతరం. మరి విహారి.....ఏ మ్యాన్ ఫ్రం స్పెషల్ బ్రాంచ్.

కొనసాగించండి 18