Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 13 - లక్కవరం శ్రీనివాసరావు

పెంట్ హౌస్ చిన్నదైనా పొందికగా, సౌకర్యం గా ఉంది. అనంత్ రామ్ ఆ గదిని చాలా శుభ్రంగా ఉంచుతాడు. చాలా సాదాసీదాగా ఉన్న ఆ గదిలో ఒక ట్రంకు పెట్టె. దాని ప్రక్కనే బోషాణం లాంటి చెక్కపెట్టె. ఆ పెట్టె కు ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. గదికి ఒక వైపు దండెం.పైన వేలాడుతున్న గుడ్డలు. ఓ ప్రక్క చక్కగా అమర్చిన వంటసామాను. చిన్న గ్యాస్ స్టౌ.ఒక మడత కుర్చీ. ఒక ప్లాస్టిక్ నవారు మంచం. ఫక్తు బ్రహ్మచారి నివాసం. ఓ మూల చిన్న స్టూల్.దానిమీద
కృష్ణ విగ్రహం. బేలూరు శిల్పం.
అనంత్ రామ్ స్నానం చేసి శుభ్రం గా ఉన్నాడు. గడ్డాలు మీసాలు లేవు . నున్నగా షేవ్ చేసుకున్నాడు . పైకి దువ్విన క్రాఫ్. విశాలమైన నుదుటిపై మెరుస్తున్న సింధూరపు రేఖ .
ఎడమ కనుబొమపై వెంట్రుకల్లో కలిసిపోయే పాత గాయం తాలూకు మచ్చ. చిరుత కదలికలు . చురుకైన కళ్ళు. మనసులో భావాలను మంచుతెరలా దాచగలిగే చిరునవ్వు. ఉగ్రవాది అన్వర్ మచ్చుకైనా కనుపించడు. వేషం, భాషా,వ్యవహార శైలి పూర్తిగా మారి పోయింది. ఈ విలక్షణ పాత్రలో పరకాయ ప్రవేశం చేసే ముందు చాలా శ్రమించాడు అన్వర్. కృష్ణ విగ్రహానికి నమస్కరించి బయలుదేరాడు. మొదట రెహమాన్ వాటా ముందు నిలబడి 'సలీమా దీదీ ' అని పిలిచాడు . సలీమా, రెహమాన్ బయటకు వచ్చారు .
అనంత్ రామ్ రెహమాన్ కు సలాం చేశాడు. రెహమాన్ " అస్సాం వాఅలైకుం" అంటూ స్పందించారు.
ఈ రోజు తేవాల్సిన వస్తువులేవీ లేవు " సలీమా చిరునవ్వు తో అంది.
అనంత్ రామ్ పేపర్ చదువుతున్న రాజుకు నమస్కరించాడు.చిరునవ్వుతో రాజు ప్రతి నమస్కారం చేశాడు. " గీతా ! అనంత్ రామ్ వచ్చాడు ".కేక వేశాడు.
లోపల్నుంచి చేతులు తుడుచుకుంటూ వచ్చింది గీత .
" వేస్తూ ఓ అరడజను గుడ్లు తీసుకు రా అనంత్ రామ్ !
గీతా జవాబు తో భుజాన సంచి సవరించుకుంటూ చకచకా మెట్లు దిగి వెళ్ళాడు అనంత్ రామ్.
" తెలుగులో......అడగక ముందే సహాయం చేసే వారిని ఏదో అంటారే !"రెహమాన్ ఆగాడు.
" ఆపద్బాంధవుడు " గీత సమాధానం.
" నిజంగా ఆపద్బాంధవుడే ! అడిగి మరీ మన అవుసరం తీరుస్తాడు." రెహమాన్ ప్రశంస .". ఎక్కడి వాడో ఏమో మనలో ఇట్టే కలిసిపోయాడు .
ఆనంత్ రామ్ కు విష్ చేశాడు సుఖదేవ్ సింగ్.
" సార్ మీరు పెద్దవారు . నాకు మీరు విష్ చేయటమేమిటి ? తనూ విష్ చేశాడు అనంత్ రామ్.
" ఇందులో చిన్నా పెద్దా అంటూ తేడా లేదు . రోజులో మొదటి సారి కలుసుకున్నప్పుడు ఇలా విష్ చేసుకోవటం మంచి సంప్రదాయం . సంస్కారం. మన మధ్య ఉన్న తారతమ్యాలు మరచిపోవటానికే ఈ పద్ధతి మన పెద్దలు పెట్టారు ." అనంత్ రామ్ జవాబు గా ఓ చిరునవ్వు నవ్వాడు.
అతడి చూపులు చురుగ్గా ఆ పరిసరాలను చుట్టేశాయి . వరండాలో ఒక చిన్న కాగితం ముక్క కనిపించింది. ఆ ముక్కను చేతికి తీసుకున్నాడు. సర్ధార జీ మొహం వెలిగిపోయింది .
" పరిశుభ్రత లో నా నిజమైన వార‌సుడివి నువ్వే అనంత్ రామ్ !" అనంత్ రామ్ భుజం తట్టాడు. అనంత్ రామ్ వినయంగా నవ్వుతూ శాస్త్రి వాటాలో అడుగు పెట్టాడు .
" సర్ధార్ జీ ని బుట్ట లో దించావా ? ఈ ప్రశ్నను సైగలతో వ్యక్తం చేసింది అమల.
" తప్పదు మరి . కొండ లాంటి వాడిని అద్దం లో చూపించాలంటే కాకా పట్టాల్సిందే " చిరునవ్వు తో వివరణ ఇచ్చాడు అనంత్ రామ్ .
శాస్త్రి సతీమణి సునీత హాల్లోకొచ్చింది . కడిగిన ముత్యంలా ఉన్న ఆమె గాజు కప్పు , అందులో పాయసం, ఓ చెంచా .
" ఈ రోజు పౌర్ణమి. మహావిష్ణువు కు పాయసం నైవేద్యం పెట్టాను . కాస్త నోట్లో వేసికో. " కప్పు ఆనంత్ రామ్ కు ఇచ్చింది.
" పాయసం అదిరింది . ఏమైనా నీ చేతిలో అమృతం ఉంది సునీతక్కా ! ఆ పొగడ్త కు ఉబ్బి తబ్బిబైయింది సునీత.
"మీ అక్కయ్య ను పొగిడితే చాలు ప్రాణమైనా ఇస్తుంది. ఈ కిటుకు నువ్వు తెలుసుకున్నావా ?"
సంధ్య వార్చే వేషధారణ మారింది. విశ్వనాథం చేతిలో కాఫీ గ్లాసు.
"ఈ కిటుకు తోనే గా నన్ను ఇన్నాళ్ళు బొమ్మ లా ఆడించారు. " సునీత చురక .
" నీ బలహీనతే నా బలం. అదే నాకు శ్రీరామ రక్ష." విశ్వనాథం వ్యాఖ్యానం.
" పౌర్ణమి లా నా వ్యాపారం పెరగాలని ఆశీర్వదించండి." కప్పు అమలకు ఇచ్చి తలవంచి నమస్కరించాడు అనంత్ రామ్.
" నీవి జగన్నాథ రథ చక్రాలు. అవి ఆగే ప్రసక్తే లేదు. నా బండిలో సరుకు ఒక్కటి కూడా మిగలకుండా అమ్ముడు పోతాయి." దీవించాడు శాస్త్రి. అనంత్ రామ్ బయలుదేరాడు.
" కొద్దో గొప్పో చదువు కున్నాడు . అసలు భేషజం లేదు.
తోపుడు బండి తో ఇల్లిల్లూ తిరుగుతూ వ్యాపారం చేసుకుంటున్నాడు. నిజంగా బ్రతుకు విలువ తెలిసిన వాడు. " అనంత్ రామ్ వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు విశ్వనాధం
" ఎక్కడో గ్రామం లో ఉండే తన కుటుంబానికి తానొక్కడే ఆధారం. కానీ ఎంత కష్టం వచ్చినా ఏనాడూ భయపడలేదు.
ఎంత గుండె నిబ్బరమో చూశారా ?". అవునన్నట్లు తలూపాడు విశ్వనాథం.
ఇలా ఇంతమందిలో స్థానం సంపాదించడం సామాన్యమైన విషయం కాదు. పైగా ఓ ముస్లిం ఉగ్రవాది హిందువుగా నటించటం చాలా చాలా కష్టం. అవసరానికి
అన్వర్ ఎంతకాలం తన ఆత్మను మభ్యపెట్టగలడు ? ఎంత కాలం తనని ఓ మంచి దోస్తులా అభిమానించే వ్యక్తుల్ని మోసం ?
అన్వర్ లో హ్యూమన్ ఎమోషన్స్ కు స్పందించే హృదయం ఉంది . సమతా సదన్ సభ్యుల అభిమానానికి ,. ఆదరణకు ఆ హృదయం ఎంతకాలం స్పందించకుండా ఉండగలదు ?
కొనసాగించండి. 14