Read Those three - 4 by LRKS.Srinivasa Rao in Telugu Fiction Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

ఆ ముగ్గురు - 4

B S F గార్డ్స్ అలీ ని క్యాంప్ హాస్పిటల్ కు తీసుకు వచ్చారు. ఎమర్జెన్సీ కేసు గనుక గంట వ్యవధిలో నే మైనర్ ఆపరేషన్ చేసి గాయానికి కట్టు కట్టారు. అలీ I C U లో
ఉన్నాడు. సెడేషన్ ప్రభావం వల్ల స్పృహ లో లేడు. ఓ సీనియర్ ఆఫీసర్ , డ్యూటీ డాక్టర్ I C U లోకి వచ్చారు.
" కండిషన్ ఎలా ఉంది ?"
" స్టేబుల్. హి ఈజ్ అవుటాఫ్ డేంజర్. "
" నార్మల్ కండిషన్ కు ఎప్పుడు రాగలడు ?"
" జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్. కాని రెండు రోజులు రెస్ట్ లో ఉండాలి. డాక్టర్ ఉద్దేశ్యం ఆఫీసర్ కు అర్థమైంది.
" యూ మీన్ , రెండు రోజులు ఫార్మాలిటీస్ తో అతడిని డిస్ట్రబ్ చేయకూడదు.

జవాబుగా డాక్టర్ చిరునవ్వు నవ్వాడు. ఆఫీసర్ చిన్నగా నిట్టూర్చాడు.
" ఓకే , ప్లీజ్ ! టేక్ కేర్ ఆఫ్ ది బాయ్ ! అతడికి స్ప్రహ
వచ్చిన తర్వాత నన్ను తెలియజేయండి.".
డాక్టర్ కు విష్ చేసి ఆఫీసర్ కదిలాడు.
తెలతెల వారు తుండగా అన్వర్ తాను చూసిన గ్రామ పొలిమేరను చేరుకున్నాడు. అలసట, ఆకలి, గుండె లో మెలి పెడుతున్న బాధ. అన్వర్ పరిస్థితి హ్రృదయవిదారకంగా వుంది.
ఈ స్థితి లో ఎవరిని కలవాలి ? వారికి తన గురించి
ఏమని చెప్పాలి ? వారి ప్రతిస్పందన ఎలా ఉంటుంది ?,
తనకు ఆశ్రయం ఎవరు ఇస్తారు ? అన్నీ సమాధానం లేని ప్రశ్న లే . మంచు దుప్పటి ముసుగులో కళ్ళే తెరవని ఆ కుగ్రామం అన్వర్ ఉనికి ని గమనించలేదు. క్షణం ఆగి చుట్టూ పరికించాడు అన్వర్. కాస్తంత దూరంలొ రెల్లు గడ్డి దట్టంగా కప్పిన పెద్ద గుడిసె ఒకటి కనిపించింది. కాళ్ళీడ్చుకుంటూ అక్కడి వరకు వెళ్ళాడు. అదో ఆశ్రమం లా
చాలా శుభ్రంగా, పూల మొక్కలతో, చుట్టూ దడి తో పొందికగా ఉంది. దడి ముందు ఆగాడు అన్వర్. ఎవరిని ఎలా పిలవాలో తెలియటం లేదు. ఏమీ తోచక కాసేపు కదలకుండా ఉండిపోయాడు అన్వర్.
అప్పుడే. ఆశ్రమం తలుపు తెరుచుకుని సాధువు లాంటి
వ్యక్తి బయటకు వచ్చాడు. వయసు అరవై పైమాటే. కాషాయం అంగీలో మంచు తడిసిన మందారం లా ఉన్నాడు.
అన్వర్ ను సాధువు చూశాడు. ఎవరో ఏమిటో చాలా దీనస్థితి లో ఉన్నాడు. ముందు అతడికి ఆశ్రయం కావాలి.. వివరాలు తర్వాత తెలుసు కోవచ్చు. పైగా అతడు మాట్లాడే స్థితిలో లేడు. " అక్కడే నిలుచున్నావేం ? లోపలి కి రా " .
అతడి ఆహ్వానం అమ్రృతం లా అనిపించింది అన్వర్ కు.
క్షణం ఆలస్యం చేయకుండా ముందుకు కదిలాడు అన్వర్.
సాధువు పెట్టింది ఆబగా తిన్నాడు కాస్త ఊపిరి వచ్చినట్లయింది. అంతే మరుక్షణమే అక్కడే పరిచి ఉన్న కంబళి పై ఒరిగిపోయాడు. ఒళ్ళు తెలియనంతగా నిద్ర మైకం కమ్మేసింది. అతడి ని క్షణం పరిశీలనగా చూసిన ఆ సాధువు ఒంటిపై ఉన్ని దుప్పటి కప్పి బయటకు వెళ్లి పోయాడు. అలా పడుకున్న అన్వర్ దీపాల వేళకు లేచాడు .
బడలిక తీరింది. మనసు, శరీరం తేలిక పడ్డాయి.లేచి కూర్చున్నా డు. ఆ కుటీరం లోనే ఈశాన్య మూల ఓ చిన్న వేదిక పై సాధువు ఇష్టదేవతా మూర్తి మురళీక్రృష్ణుడు కొలువు తీరి ఉన్నాడు. ఆ ప్రతిమకు అభిముఖంగా పూర్ణ పద్మాసనం లో తపో ముద్రలో సాధువు.
అన్వర్ కు ఒక వ్యక్తి ని చూడటం ఇదే మొదటిసారి. హైదరాబాద్ లో తన చిన్నప్పుడు గణేష్ నిమజ్జనం జరిగే సమయంలో జరిగే పూజావిధానం చూశాడు. ఆ పద్ధతికి, నేడు తను చూస్తున్న తీరుకు చాలా బేధం ఉంది. తను ముస్లిం. తనకు తెలిసింది క్రమ పద్ధతిలో నమాజ్ చేయటమే.
ఇలా ఏ మాత్రం కదలకుండా ,మౌనంగా , కళ్ళు మూసుకుని కూర్చోవటం చాలా వింతగా అనిపించింది.
కృష్ణుని ప్రతిమను గమనించాడు. ప్రతి అవయవం తీర్చిదిద్ది నట్లు ఉంది. సున్నితం గా , పొడవైన వేళ్ళ మధ్య
అందంగా అమరిన వేణువు. పెదవులపై సమ్మోహన మంద హాసం. కళ్ళలో దివ్య కాంతి. మట్టి ప్రమిదలో నిశ్చలంగా
వెలుగుతున్న దీపం అప్పుడప్పుడు చిరుగాలి కదలికలకు రెపరెప లాడుతోంది. ప్రతిమ ముందు కొద్దిగా పూలు.
ప్రతిమ అణువణువున దివ్యత్వం.
ఆ ప్రశాంత , శీతల సాయం సంధ్య సమయం. సాధువు భంగిమ. ముఖంలో తేజస్సు. ప్రమిద వెలుగులో దివ్య ప్రభావం వలయంలో మెరిసిపోతున్న. ప్రతిమ.
అన్వర్ కు ఏ భాషకు, భావానికి అందని అనూహ్య మైన అనుభూతి , పరమ శాంతిని కలిగించాయి.
అలా ఎంతసేపు ఉన్నాడో అతడికే తెలీదు. కాలం ఆగినట్లు
అనిపించింది. సాధువు మెల్లగా కళ్లు తెరిచాడు. అన్వర్ ను చూసి చిరునవ్వు నవ్వాడు.
" బడలిక తీరిందా ?"
సాధువు ప్రశ్న కు సమాధానం గా తలవూపాడు అన్వర్.
" పాలు తాగుతావా ?" అని అతడి అంగీకారం కోసం
చూడకుండా ఒక రాగి చెంబులో నీళ్లు, ఓ మట్టి పాత్రలో లేత గులాబీ రంగులో మీగడ తేరిన వేడి పాలు , అతడి ముందుంచారు. వేడి పాలు తాగాక ఒంట్లో కాస్త చలనం
కలిగింది.
ఇక తను తన గురించి ఏదైనా చెప్పుకోవాలి. ఆశ్రయం ఇచ్చిన వ్యక్తి పట్ల తన కనీస బాధ్యత అది. " మరి ఎలా చెప్పాలి, ? ఏమని చెప్పాలి ?"
రాత్రి కొండ పైన పేలుళ్లు వినిపించాయి. కంచె దాటుతున్న ఉగ్రవాదులను పహరా జవాన్లు కాల్చివేసినట్లుంది ".
సాధువు అన్వర్ ను సాభిప్రాయంగా చూశాడు. అన్వర్ అవుననలేదు. కాదనలేదు. నవ్వాడు. " నేనెవరో మీకు
తెలిసిపోయింది."
సాధువు అన్వర్ ను రెప్ప ఆర్పకుండా చూస్తున్నాడు."
.నేనెవరో తెలిశాక మీకు భయం లేదూ ?"
సాధువు పెదవులపై మందహాసం." నేనొక సాధువు ను ".
నాకెవరూ శత్రృవులుండరు. నేనెవరికీ భయపడను."
" నిజం ! శత్రువులు లేనివారు ఎవరికీ భయపడరు. భయమే కాదు , కోపం, ఆవేశం కూడా మిమ్మల్ని కదిలించలేవు."
" నా గురించి అంత ఖచ్చితంగా చెప్పావు. నా మీద నీకు సదభిప్రాయం వుంది. మరి--- నేను చెప్పేది వింటావా ?"
అంగీకారం గా నెమ్మదిగా తలవూపాడు.
" పహారా సైనికుల గురి తప్పించుకోవడం నా దృష్టిలో దైవ నిర్ణయం. నువ్వు చేస్తున్న తప్పు లను సరిదిద్దు కోవటానికి అల్లా నీకో అవకాశం ఇస్తున్నాడు ".
సాధువు మాటలు సూటిగా, స్ఫటికం గా ఉన్నాయి.
అన్వర్ ఆలోచిస్తూ ఉండిపోయాడు.
"" ఏమిటి ఆలోచిస్తూ ఉన్నావు.?
" నేను మారాలనుకున్నా నా లాంటి వాడికి ఈ సమాజం ఆ అవకాశం ఇస్తుందా ?"
" తప్పక ఇస్తుంది. అది నీ పరివర్తన, ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మారాలన్న గట్టి సంకల్పం వుంటే చాలు నిన్నెవరూ ఆపలేరు. అయితే అందుకు ఓపిక కావాలి. కష్టం, నష్టాలు, అవమానాలు ఎదుర్కొనే ధైర్యం కావాలి. ఆ ధైర్యం నీకు ప్రసాదించాలని ఆ రాధేశ్యామ్ ను వేడుకుంటాను .
అన్వర్ కృష్ణ ప్రతిమను చూశాడు. పెదవులపై చిరునవ్వు, వెలుగు పువ్వులా మెరుస్తున్న ఆ కళ్ళు అతడికి ధైర్యం చెబుతున్నట్లు అనిపించాయి. ఇది కృష్ణుడి మహిమా ? సాధువు ఓదార్పా ? అర్థం కాలేదు అన్వర్ కు .
" కాసేపట్లో జమ్మూ కు చివరి బస్సు ఉంది. ఈ రాత్రే జమ్మూ కు వెళ్లి పో. ఇక్కడ ఉండటం క్షేమం కాదు. జమ్మూ నుండి బిలాస్ పూర్ చేరాలంటే నీ ఉనికి ఎవరికీ తెలియదు.
అటు తర్వాత ఎటు వెళ్ళాలో, ఏం చెయ్యాలో కాలమే
నిర్ణయిస్తుంది. ఒక్క నిముషం ...... సాధువు ఓ చిన్న సంచి లోంచి కొంత పైకం తీశాడు. అన్వర్ చేతిలొ ఉంచాడు.
" నాకు దీని అవసరం లేదు. అయినా గ్రామస్తులు నాకు
ఇస్తుంటారు. భగవంతుని దయవల్ల నా పోషణ జరిగి పోతోంది. ఎవరిని యాచించి వలసిన అవసరం లేదు. ఈ పైకం నీలాంటి వాళ్ళ కోసం దాచిపెడుతుంటాను. ప్రస్తుతం
దీని అవసరం నీకు చాలా వుంది.". అన్వర్ చేతులు జోడించాడు. సాధువు సున్నితంగా వారించాడు.


Contd 5..............









.