Read Kshantavyulu - 15 by Bhimeswara Challa in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

క్షంతవ్యులు - 15

క్షంతవ్యులు – Part 15

చాప్టర్ 35

కళ్లుతెరచి చూసేటప్పటికి ఆస్పత్రి మంచం మీద పడుకుని వున్నాను. యశో నాకాళ్ల వద్ద కూర్చుని వుంది. లఖియా, సరళ మంచం వద్ద రెండు కుర్చీల్లో కూర్చొని వున్నారు. అప్పటికి సంగతి గ్రహించాను. రైల్లోంచి దిగే ప్రయత్నంలో కాస్త దెబ్బలు తగిలివుంటాయి. వారంతా పరధ్యానంగా వున్నారు. వారి వాడిపోయిన ముఖాలు చూసేక నా శరీరంలో నీరసం ఇంకా పెరిగిందనిపించింది .

‘‘మీ ప్రయాణం ఆపేశాను కదూ,’’ అన్నాను.

అందరూ ఒక్కసారి తుళ్లిపడ్డారు. క్షణకాలం అంతా నివ్వెరపోయారు. యశో గబగబా లేచివచ్చి నాగుండెల మీద వెక్కివెక్కి ఏడుస్తూ పడిపోయింది. అంత దుఃఖాన్ని నేనింతవరకూ ఎప్పుడూ చూడలేదు.

యశో తల హృద‌యం మీద వుండడంతో ఆయాసం కూడా పుట్టుకు వచ్చింది.

‘‘కాస్త తలతియ్యి యశో ఆయాసంగావుంది, ఎందుకు చెప్పు ఇంత ఏడుపు,’’ అన్నాను.

లఖియా చటుక్కున లేచినించుని యశోని లేవదీసింది. యశో ముఖం చూస్తే నాకెంతో భయం వేసింది. ఎంత పాలిపోయింది? కుడి కాలిలో శూలంపెట్టి పొడిచినట్టయింది. అప్పుడు భయంకరమైన ఆలోచన కలుగగా కాళ్లమీద కప్పివున్న దుప్పటి జరిపి చూశాను. రెండుకాళ్లచుట్టూ కట్లున్నాయి. కుడికాలి క్రింద భాగమంతా ఏదో తెల్లగా వుంది. అది కదపటానికి ప్రయత్నించాను. ఇసుమంతైనా అది నేను చెప్పినట్లు వినలేదు అది ప్లాస్టర్ చేసారని గ్రహించాను. ఎడమకాలు కదిపి చూస్తే కొంచెం కదిలింది..

‘‘నా కాలుకి ఏమైంది?’’ అని గట్టిగా అరచాను.

తలకు కూడా కట్టుకట్టివుందని అప్పుడే గ్రహించాను. మరుక్షణంలో స్పృహ‌తప్పి పోయింది.

తిరిగి స్ప్రుహ వచ్చేక నాపక్కన యశోనాకేసి దీనంగా చుస్తూ కనబడింది అప్రయత్నంగా ఆమె వైపుకు నా చేయి చాచేను; దాన్ని కళ్ల కద్దుకుంటూ తన కన్నీటితో పావనం చేస్తుండగా నాఆ లోచన్లు పరిపరి విధాలుగా సాగాయి.

నేను కుంటివాడినై పోయానా? చిన్నతనంలో ఒకసారి మద్రాసులో ఒక కుంటివానిని గేలిచేస్తే చిన్నపిల్లయినా సుశీ మందలించింది, ”తప్పు రామం పాపం వాడేమిచేయగలడు చెప్పు? నవ్వకూడదు.’’ ఇప్పుడు నా పరిస్థితీ అదే . ఒకవేళ సుశీ గనుక జీవించివుంటే ఏమనివుండును. స్వర్గంలో సుఖంగా వుంది. ఎవరికి తెలుసు బహుశా ఇదంతా యశో మంచికే జరిగిందేమో. మిసమిసలాడుతున్న యవ్వనంలో వున్న ఈ అందాలభరణి దేనికీ కొరగాని అంగవికలుడైన నన్నెందుకు భరించాలి? ఆమెకు నా మీద వున్న ఆశలన్నీ దానితో నేలకూలిపోయివుంటాయి. తను చేసిన పొరపాటు ఈ పాటికి గ్రహించివుంటుంది.

“ఎలావుంది?’’ యశో ఆప్యాయత నాఆలోచనలకి అడ్డకట్టు వేసింది.

"నన్ను క్షమించగలవా అమ్మీ?" అన్నాను నా కళ్ళు నూతులవగా.

“చూడండి ఈనాడు మీరు నాకొక మాటివ్వాలి. దీనిని గురించి మీరేమీ చింతించకండి. అసలు ఆలోచించనేకూడదు. మీ ఎడమ కాలుకేమి ధోకాలేదనీ, కుడికాలు కూడా నిమ్మదిగా దారిలో పడుతుందని డాక్టర్ గారు భరోసా ఇచ్చారు నాకు. అప్పటివరకు మీ ఒక కాలుకి బదులు నా రెండు కాళ్లు, రెండు చేతులూ వున్నాయి. మీకాలు ఎలా వాడుకుంటారో నన్నుకూడా అలా వాడుకోండి. నేను మీకు చాలా సార్లు చెప్పాను. మీదికానిది నావద్ద ఏమీలేదని, మీకు నేనేమీ లోటురానీయను, నా జీవితంలో నాకిక వేరే పనిలేదు,’’ అంది నాజుట్టును చేత్తో సరిచేస్తూ

‘‘నువ్వేంచెపితే అదే చేస్తాను యశో అని నేను మాట ఇవ్వలేను , నన్ను మిధ్యావాదిని కూడా చేయకు, అది నా శక్యంలో లేదు. నీ జీవితంలో కూడా అన్నీ కష్టాలే రాసివున్నాయి. అమ్మీ. నీవు నాతో ఏమి సుఖపడగలవు చెప్పు?’’ అన్నాను.

‘‘ఎందుకు పడలేను చెప్పండి, మీలో ఇప్పుడు వచ్చిన లోటేమిటి? పూర్వం కంటె ఇప్పుడు నామీద కాస్త ఎక్కువగా ఆధారపడతారు. అంతేగా? అదీ మంచిదేగా, పూర్వంకంటే మీ అనురాగము, అభిమానము నాకు ఇంకా ఎక్కువగా లభిస్తాయి. నాకు అంతకంటే ఏంకావాలి? ’’ అంది.

‘‘నేను నీ జీవితంలో ప్రవేశించకపోతే ఎంత బావుండును అమ్మీ. ఎవరినో పెళ్లిచేసుకుని పిల్లలతో సుఖంగా వుండివుందువు,’’ అన్నాను.

ఆ ధోరణితోనే. వెచ్చటి రెండు కన్నీటిబొట్లు నుదిటి మీద పడ్డాయి.

‘‘నన్ను కష్టపెట్టాలని కోరికగావుంటే అలా అనండి, ఎన్నిసార్లు చెప్పినా నా మాటలు మీరు ఎందుకు నమ్మరు చెప్పండి,’’ అంది.

‘‘నమ్మకపోవటం కాదు అమ్మీ. నిన్ను చూస్తూవుంటే నాకు అనిపిస్తూంటుంది. ఇంత అందమూ, బూడిదలో పోసిన పన్నీరై పోయిందిగదా అని, అందుకు బాధగావుంటుంది, ’’ అన్నాను.

‘‘బాదల్ బాబు బూడిదలో ఎందుకు పోస్తారు లేక అందరిమీద ఎందుకు జల్లుతారు? వారి పన్నీరును వారి దగ్గరే దాచుకున్నారు,’’ అంది యశో మెల్లగా నవ్వుతూ.

నేనేమీ జవాబివ్వలేదు, అంగవికలుడననే ఆలోచనపోలేదు. కాలుకేసి చూసినప్పుడల్లా చురుక్కుమని జ్ఞప్తికి వచ్చేది.

‘‘నేనొకప్పుడు ఉద్యోగం చేస్తానంటే వద్దన్నావు. అమ్మీ ఇక నీకా భయం అక్కర్లేదే,’’ అన్నాను.

‘‘అవును, అవసరం వస్తే గడించి పెడ్తాను, అందులో తప్పేముంది. కాని ఆ అవకాశం రాదనే నా నమ్మకం. మీ ఇంటి అద్దే భూముల మీద శిస్తు కలిసి మన ఇద్దరికి గడిచిపోతూంది. నా డబ్బు ఖర్చుచేయటమేలేదు. ఆ తర్వాత ఇంకా నగలున్నాయి. ఇవన్నీ అయిపోతే నా చేతులున్నాయి,’’ అంది.

‘‘నీకొకమాట చెప్పాలి అమ్మీ, రైలు వెంట పరుగెడుతూ లఖియాతో నేను ఏమన్నానో నీకు తెలుసా?’’ అన్నాను యశో కుడిచెయ్యి నా రెండు చేతుల్లోకి తీసుకుని.

‘‘తెలుసును, లఖియా చెప్పింది,’’ అంది.

లఖియా ఆవిషయం చెప్పిందని విని కాస్త ఆశ్చర్యపోయాను సరళ కూడా విందని జ్ఞప్తికి వచ్చి సిగ్గుపడ్డాను.

’’విని ఏమనుకున్నావు, బాధపడ్డావా?’’ అడిగాను.

‘‘బాధపడటానికి ఏముంది చెప్పండి. మిమ్మల్ని గురించి మీ కంటె బాగా నాకే తెలుసు, ఆ విషయం నాకు చాలా కాలం పట్టి తెలుసు,’’ అంది గోముగా.

‘‘ఏమి తెలుసు అమ్మీ,’ అన్నాను కాస్త భయపడుతూ.

‘‘మీ మనస్సు మీకే తెలియదు, మీలో నేనంటే అమితమైన కృత‌జ్ఞత, లఖియా అంటే అమితమైన జాలి వున్నాయి. జీవితంలో మీరు ఎవరినైనా నిజంగాప్రేమించివుంటే ఆమె సుశీ మాత్రమే,’’ అంది.

"అమ్మీ నువ్వు చెప్పిందంతా నేను లఖియాకి 'ఐ లవ్ యూ' చెప్పేరవరకు ముమ్మాటికీ నిజం కానీ తరువాత కాదు," అన్నాను యశోచేయి తీసుకుంటూ.

"అర్ధంకాలేదు," అంది ఆశా ఆశ్చర్య మిళిత వదనంతో.

"ఆ మరుక్షణం నిన్నుతలచుకొని మెడతిప్పి చూశాను నీకోసం. రైలు పట్టాల పక్క నువ్వా వంగ పండు రంగు చీరలో నాకోసం పరుగెత్తుకొస్తుంటే, ఒకవైపు లాఖియా "వద్దు రామం బాబూ దిగకండి’’ అని నన్ను అభ్యర్దిస్తున్నా, నా ప్రేమ నీ వైపు పరవళ్లు తీసి నన్నా ట్రైన్ లోంచి దూకించింది. లేక పోతే, దానిలో ఎక్కి, చైన్ లాగడమో లేక పక్కస్టేషన్లో దిగడమో ఎదో చేసివాడిని. ఇప్పు డర్దమైయిందా అమ్మీ ?"

యశో ఆనందభాష్పాలతో నా హృదయం అంతా నిండిపోయింది.

"నీకు నాకూ తెలియని ఈ వాస్తవం నీ మనసు మొదటే గ్రహించి నీ త్యాగానికి చేయూత నిచ్చింది,"

అన్నాను నా ఆనందభాష్పాలు జత చేస్తూ.

‘‘ఇదంతా త్యాగం కాదు, బాదల్ బాబూ, స్వలాభం కోసమే ఇలా చేస్తున్నాను. మీరులేకుండా నేను ఒక్క రోజు కూడా బతకలేను,’’ అంది యశో కళ్ళు తుడుచుకుంటూ.

నామీద ఆమెకు వున్న ఈ మమతని ఇంతచక్కగా ఎప్పుడూ ఆమె విప్పిచెప్పలేదు. ఆనాడు ఆమె హృద‌యం విప్పి నా ముందర పెట్టింది. లోపల ఏముందోనని కుతూహలంగా తొంగిచూశాను. బాదల్ బాబూ అనే ఒక్క మాట రాసివుంది. పొంగిపొర్లే ఆ నిర్మల ప్రేమను చూస్తూంటే హృద‌యమంతా అనురాగంతో నిండిపోయింది.

‘‘నీకు నేను తిరిగి ఏమీ ఇవ్వలేనా అమ్మీ? ఇవ్వటం తప్ప పుచ్చుకోవటం నీకు చేతగాదా?’’ అన్నాను.

‘‘ఇవ్వగలిగిందంతా ఇస్తున్నారు. నేను అంతకంటె ఏమీ ఆశించను. ఏమీ కోరుకోను’’ అంది.

సరిగ్గా అదే సమయానికి డాక్టర్ స్వరూప్, సిస్టర్ సుగుణ తలుపుతోసుకుని లోపలికి వచ్చారు.

‘‘ఎలావున్నావు రామంబాబూ?’’ అన్నారు డాక్టర్ స్వరూప్ దగ్గరకు వచ్చి.

‘‘చాలా కులాసాగావుంది డాక్టర్ గారు. అంతా మీదయ,’’ అన్నాను.

‘‘నా దయకాదు మిస్టర్ మీ మంచం మీద కూర్చున్న అవిడది. ఈ పది రోజులూ ఈవిడ మిమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుని వుండకపోతే ఏమయివుండునో చెప్పలేం. ముఖ్యంగా మొదటి నాలుగు రాత్రులూ చాలా కష్టపడ్డారు. విపరీతమైన జ్వరం, వొళ్లు తెలియని ప్రేలాపన గిలగిలా కొట్టుకోవడం ఇవన్నీ చూస్తూంటే మా సిస్టర్స్ కే భయమేసింది. ఇంతనిబ్బరమూ, ధైర్యమూ కల స్త్రీని నేనెక్కడా చూడలేదు,’’ అన్నారు ఆయన.

“నేను కూడా మీ కోసం కష్టపడ్డాను. డాక్టరు గారి మాటలువిని నన్ను మరచిపోకండి,” అంది సిస్టర్ సుగుణ నా బిపి చూస్తూ.

"ఆయనకు చెల్లి లేని లోటు తీర్చవని ఎప్పుడో చెప్పాను లే," అంది యశో నవ్వుతూ.

"ఇప్పట్నించి నీకు రాఖీ ఖర్చు పెంచింది నా యశో," అన్నాను

"ఊరికే కట్టించు కుందా మనుకుంటున్నారేమో, అదేంకుదరదు," అంది తను నవ్వుతూ.

చాప్టర్ 36

యశో వెళ్లిన కొంతసేపటికి సరళ వచ్చి నా మంచం దగ్గర కుర్చీలో కూర్చుంది. ముఖమంతా వుద్రేక పూరితంగా వుంది. అభిమానంతోటి, నిర్లక్ష్యంతోటి, కోపంతో వణికిపోతూ ఏమైనా సరే ఈ అవకాశం జారవిడవకూడదని నిశ్చయించుకున్నట్లు కనబడింది. పరిణామాలతో నిమిత్తం లేదనే మొండి ధైర్యం ఆమెలో ప్రవేశించినట్లు కనబడింది. అలాంటిఘడియలు ప్రతివారికి ఎప్పుడో ఒకప్పుడు వస్తాయి.

‘‘భోజనం చేశావా సరళా?’’ అన్నాను.

‘నా శ్రవణాలకి మీ నిరర్ధక సంభాషణ తప్ప వేరే ప్రాప్తి లేదా రామంబాబూ,’’ అంది నా కళ్లలోకి ఒకసారి చూసింది.

‘అల్లా అనడం నీకు తగదు సరళా, యశోకి, లఖియాకి ఆప్తులు ఇంకెవరూ లేరు. నీకు ప్రేమించాల్సిన భర్త, లాలించాల్సిన కొడుకూ వున్నారు’’ అన్నాను.

ఆ ఆఖరి వాక్యం నోరు జారి అన్నాను. అందులో వ్యంగ్యం లేదనుకుంటాను, అయినా అది సరళ కోపాన్ని ప్రేరేపించింది.

‘‘అవును రామంబాబూ. అదే నేను చేసిన పాపం, ఘోర పాపం. సమాజం స్త్రీకి ఎంత అన్యాయం చేస్తుంది. ఒకసారి నేరక చేసిన తప్పుకి జీవితాంతం వరకూ బాధపడాల్సిందేనా. ఒకసారి వుచ్చులో పడితే అందులోంచి కాళ్లు చేతులూ కాకపోయినా కనీసం తల అయినా బయటపెట్టి తొంగి చూడగూడదా? ఇక దీనికి గత్యంతరం లేదా?’’ అంది ఆవేశంగా.

‘‘నువ్వు చేసింది తప్పుకాదు, సరళా. నాకు తెలిసిన వారందరిలోనూ నువ్వే ఎక్కువగా సుఖపడుతున్నావు. నిన్ను చూస్తుంటే జీవితంలో సుఖం కూడా వుందనే విషయం జ్ఞప్తికి వస్తుంది. లేకపోతే అంతా చీకటిమయంగా కనబడుతుంది,’’ అన్నాను.

“సుఖం,” అంది, క్రుత్రిమంగా నవ్వుతూ.

"సుఖానికి నిర్వచన మేమిటి?" అన్నాను

‘‘పెళ్లి చేసుకుని కొడుకుని కంటె సుఖపడుతూందని మీరంటారు. ఆ విషయం మనస్సులో మీరు నమ్మరు, బయటికి తియ్యటి మాటలని వదలించుకోవాలని ప్రయత్నిస్తారు. సత్యాన్ని ధైర్యంగా ఎదుర్కోరు, మీరందరూ ఇంతే రామంబాబూ, మీ రెప్పుడూ అంతే,’’ అంది.

సరళ ముఖం వుజ్వలంగా వుద్రేకంతో ప్రకాశిస్తుంది. ముఖం ముఖ్యంగా, పెదిమలు ఎర్రగా అయిపోయాయి. క్రింది పెదిమ క్షణకాలం వణికింది.

సంబాషణ మార్చాలనే ఆతురతతో మళ్లీ తప్పుప్రశ్న వేశాను.

‘‘నీ కొడుకుకి రామం బాబు అని పేరు పెట్టావు. నేను మాటవరుసకి పరిహాసంగా సరే అన్నాను. పెద్దయిన తర్వాత వాడు అది నా పేరని తెలుసుకుని ఏమనుకుంటాడో ఆలోచించావా?’’ అన్నాను.

సరళ ముఖం ఆవేశంతో ప్రజ్వరిల్లిపోతోంది. కళ్లు మిలమిలా నిప్పుకణాల్లా మెరుస్తూన్నాయి. ‘‘మనస్సులో మీరెప్పుడూ నాకు అన్యాయం చేస్తూనే వున్నారు, రామంబాబూ. నేనంటే మీకేమాత్రమూ కనికరం లేదు. నన్ను ఏమాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. పురుషులు ఎంత కఠిన హృద‌యులు,’’ అంది.

‘‘వద్దు సరళా, నాకు ఒకసారి నీవొక వాగ్దానం చేశావు. జ్ఞాప‌కముందా’’ అన్నాను తను ఇంకా ఏదో చెప్పబోతూంటే.

‘‘అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయారు,” అంది నిస్పృహగా.

‘‘ఏ విధంగా సరళా? మానసికంగానా, శారీరకంగానా?’’ అన్నాను.

‘‘రెండు విధాల కూడా, ఇప్పుడు మీరు కఠిన హృద‌యులైపోయారు. మీరు కూడా అందరిలాగే అయిపోయారు. అయినా మీమీద నాకున్న ఆలోచనలు ఆవేశాలు ఏమీ మారలేదు. దానికితోడు హృద‌యాన్ని చీల్చి వేసే అపరిమితమైన సానుభూతి కూడా దానికి తోడైంది. అందుకనే ఈనాడు అణచివున్నదంతా విజృంభించింది,’’ అంది.

‘‘ఇప్పుడు నాకెంతో మనశ్శాంతి చేకూర్చావు, కృత‌జ్ఞుడుని సరళా,” అన్నాను.

“ధన్యురాలయ్యానని సంతృప్తిచెందమంటారా?’’ అంది వేదనాపూరిత నేత్రాలతో నాకేసి చూస్తూ.

"నన్నిలా ఆడిపోసుకోవడంసబబా సరళా," అన్నాను బాధతో.

“యశో లఖియాల మీదున్న నమ్మకం మీకు నామీదెందుకు లేదు?" అంది.

‘‘చెప్పానుకదా సరళా. నీవు నాకు సరిగా అర్ధం కావని,” అన్నాను.

సరళ ముఖం హఠాత్తుగా మళ్లీ ఎర్రబడిపోయింది.

“ఎందుకు అర్ధం కాను రామంబాబూ, నాలో అంత అర్ధం కానిదేముంది. అందరిలాగే నేను కూడా ఒక సాధారణ స్త్రీని. అయితే మీకు అర్ధమయ్యేటట్లు విడమర్చి చెప్పమంటారా?’’ అంది వుద్రిక్తతతో, కోపంతో.

‘‘వద్దు సరళా వద్దు, ఇలాగే గడిచిపోనీ, దాని వల్ల కలిగే లాభమేమి లేదు,’’ అన్నాను.

సరళ ఏమీ మాట్లాడలేదు, బలవంతాన వుద్రేకాన్ని అణుచుకుంటూన్నట్లు కనబడింది.

“బాబుకి అన్నీ నీ పోలికలే వచ్చాయి కదూ సరళా?’’అన్నాను.

‘‘పోలికలు నావి, పేరు మీది. బాగుంది కదూ రామంబాబూ. మీకు బాబు అంటే చాలా ఇష్టం కదూ,’’ అంది చిరునవ్వులు చిందిస్తూ.

తల్లి ప్రేమంటే ఏమిటో ఆనాడు తెలిసింది. అలాంటి సమయంలో కూడా కొడుకు తలపుకు వచ్చి నవ్వకుండా వుండలేకపోయింది. మాతృ ప్రేమ ఒకసారి పెల్లుబికింది. సరళ ముఖంలో క్షణకాలం పూర్వపు వెలుగు కనబడింది.

“అవును సరళా చాలా ఇష్టం, నాకు పిల్లలంటేనే ఇష్టం అందులో నీకొడుకు కనుక మరీ ఇష్టం. నువ్వు పెద్దైన తర్వాత నిన్ను సుఖపెడతాడు. కానీ సరళా బాబుని నువ్వు కొంత నిర్లక్ష్యం చేస్తుంటావేమో అనిపించింది నాకు. వాడికి తల్లి ప్రేమ కొరవడనియ్యకు,’’ అన్నాను.

‘‘లేదు రామంబాబూ, బయటికి నేను అలా కనబడతాను. కాని నా ఆశలన్నీ వాడిమీదే ఉన్నాయి,’’ అంది

"నా అపోహ తొలి గినందుకు సంతోషం," అన్నాను.

“సంతోషం, కానీ నా సంతోషం మాత్రం మీకు ఏమాత్రం పట్టదు," అంది అందంగా.

“ఇది పరమ అన్యాయం,” అన్నాను.

"కాకపోతే ఆ నా రెండు సంతోష క్షణాలు ఏవో చెప్పండి,’’ అంది రెండు వేళ్ళు చూపిస్తూ.

"నేను స్పందనా రహితుడ ననుకున్నావా?" అన్నాను.

"అయితే శ్రవణానందపరచండి," అంది.

"నీ వీణా భంగిమ, నీ కొమ్ముల వాడి, నన్నెన్నడు విడనాడవే నారీశిరోమణీ," అన్నాను.

"ఈ జీవితానికి ఇది చాలు, అయినాగానీ," అని, తన పెదవులతో నాపెదవులు కల్పింది.

తాను విడిచిన పెదిమలు నేను మెదిపేలోపున సరళ గది గుమ్మం దాటింది.

చాప్టర్ 37

ఆరోజే సరళా లాఖియాల తిరుగు ప్రయాణం. ఇదిగో అదిగో నని పదిహేనురోజులుండిపోయారువవారిద్దరు యశో ని ఆ పరిస్థితులలో విదలలేక. ఇన్నిరోజులూ ఒక్కమాటైనా లఖియా నాతో ఒంటరిగాలేదు, నామటుకునేనూ తన్నిఆపుకోవడానికి ప్రయత్నించానూ లేదు.

"ఇక సెలవు తీసుకుంటాను రామం బాబు," అంది లఖియా, సరళతో బాటు నాకు వీడ్కోలుపలక వచ్చి.

"నన్ను క్షమించాలి లఖియా, నువ్వు రవిప్రకాష్గార్కిచ్చిన మాటవమ్ము చేయించినందుకు," అన్నాను.

"నేను రవిగారికిఫోన్ చేసి పరిస్థితి చెప్పాను, అర్ధంచేసుకున్నారు. మీరు గమ్మునికోలుకోవాలని చెప్పమన్నారు," అంది లఖియా.

"వారికినా ప్రతినమస్కారాలు తెలియచేయి. నన్నుదానిక్కూడా క్షమించు లఖియా," అన్నాను.

"నేను చెప్పదలుచు కున్నది వెళ్లేముందే చెప్పుంటే బహుశా ఈ అరిష్టం పట్ట్టేదేకాదు మీకు. ఉత్తరం ద్వారా తెలియచేద్దామనుకున్నాను కాని ఇప్పుడు తెలుసుకున్నాను ‘ఆలస్యంఅమ్రుతంవిషం’ లోని సత్యం. అందుకు మీరు యశో కలసి నన్ను క్షమించాలి," అంది లఖియా.

"ఏమిటి లఖియా నువుచెప్పాలనుకున్నది?" అడిగాను అందరికంటేముందు కుతూహలంఆపుకోలేక.

"రామం బాబు ఆరోజు మీరిచ్చిన షాక్ తరువాత రవిగారిచ్చిన ట్రీట్మెంట్ నా జీవితంలో జీవం పోయగా నేను జీవితాన్ని జేవితంగా చూడటం మొదలుపెట్టేను. మనం ముస్సోరిలో గడిపిన వారంలో నే అనిచిందేమిటంటే, మనందరిలో ఒక్క రాజేంద్రగారే జీవితాన్ని జీవితంగా జీవిస్తున్నారేమోనని. నేను సాంస్కృతిక కుత్రిమ నీడలో నాజీవితాన్ని కుళ్లబెడుతుంటే మీరు మీ జీవితాన్ని గతస్మృతి మబ్బులో మరుగు పరచేరు గురువుకి పంగనామాలనుకోనంటే, మీకొక మాట చెప్పాలనుంది," అని ఊరుకొంది.

"తప్పక చెప్పు లఖియా, తనను మించిన శిష్యుని కన్నానా,' అన్నాను.

"మిమ్మలిని జీవచ్చవం చేసిన మీ అమర ప్రేమ మీ ఊహే కాకపోతే అక్కడికక్కడే గుండె పగిలి శశిని ఎప్పుడో పరలోకంలో జేరేవారు. అలాగే పాతివ్రత్యమే నాకు పరమార్ధమయితే, వైధవ్యాన్నికాపాడు కోవాలన్న వ్యర్ధ తపన బదులుగా సతికి దిగేదాన్ని. బహుశా మీ మానసిక దౌర్బల్యానికి నేను ప్రతిబింబం గనుకనే అందరికంటే నన్నెక్కువగా ప్రేమించానాని భ్రమపడ్డారు. ఇప్పుడు నేను ఆ లాఖియాను కాదు గనుక మీ ఆప్రేమ ఈపాటికే వాస్తవిక మేఘాలలో మిళిత మయ్యుంటుంది. మరి సరళ అయితే, అందని పళ్లకు అర్రులు చాస్తూ ఇంటనున్న ఫలాన్ని ఫ్రిడ్జిలో పడేసింది. ఇకపోతే యశో, తనకి జీవితంలో ఒక నిర్ధారిత లక్ష్యం వుంది, తాను దాన్ని చేరే మార్గం చేపట్టింది, అంతకంటే ముఖ్యం, ఆ ప్రయాణంలో

ఆనందానుభూతి పొందుతోంది."

"మనందరినీ కాచివడ పోసావు సరే, మరి రవిప్ప్రకాష్ గారి మాటేమిటి?" అంది సరళ.

"ఆయన ఆసక్తి కనబడుతున్నా నేను ఆశ పెంచుగోలేదు," అంది లఖియా యధాలాపంగా.

నే ఆత్మావలోకనంలో చేయి వూపుతుండగా యశో నన్ను విడిచి వాళ్ళను సాగనంపడానికివెళ్ళింది.

చాప్టర్ 38

ఆస్పత్రిలో ఇంకో రెండు నెలలు వున్నాను. యశోకి డాక్టర్ స్వరూప్ గారితో చనువు ఏర్పడింది. ఎవరితోనైనా చాలా సులభంగా స్నేహము చేసుకోగలదు యశో, ఆమె ముఖాన్ని మాటలని మందహాసాన్ని ఎవరూ జయించలేరు.

నాకూ గాయలన్నీ మానిపోయాయి. చెప్పిన విధంగా కుడి కాలి మడమ కింద భాగం నిరర్ధకమై పోయింది. ఈ రెండు నెలల్లో నాకూ డాక్టరుగారితో పరిచయం మరింత బలపడింది. మేమంటే ప్రత్యేక శ్రద్ధ చూపించేవారు. యశో మీద ఆప్యాయత ప్రదర్శించేవారు. యశో కూడా పూర్తిగా అది తిరిగి ఇచ్చేది. ఆమె కోరిక ప్రకారం యశోని ఆయన పేరుపెట్టి పిలిచేవారు.

ఆయన తరచుగా యశో అంత నిబ్బరమూ, ధైర్యమూ కల స్త్రీని నేనెక్కడా చూడలేదు అనేవారు.

‘‘అది ధైర్యమూ నిబ్బరమూ కాదు డాక్టరుగారూ, అదేమిటో మీ భార్య నడగండి,’’ అంది యశో ఒకసారి.

‘‘నా భార్య సంగతి నీకెలా తెలుసు యశో?” అన్నారాయన నవ్వుతూ

“బంగళా వారైనా, బర్మావారైనా స్త్రీ హృద‌యం ఒక రకంగానే వుంటుంది డాక్టరుగారూ,’’అంది యశో.

‘‘మీరు చెప్పింది సత్యం కాదమ్మా, నేనే అనేక మంది రోగులను చూస్తూ వుంటాను. స్త్రీలలో కూడా క్రూరులు, కుత్సితులు వున్నారు. భర్తని వదిలి పరుల వెంట పోయే క్షుద్రమైన స్త్రీలను నేను చాలామందిని చూశాను,’’ అన్నారాయన.

‘‘వారంతా బయటకు కనబడేటంత చెడ్డవారు కాదు డాక్టరు గారూ. ఏదో ఒక బలమైన కారణం లేకుండా స్త్రీ కూడా భర్తను వదలి పెట్టదు. నా వుద్దేశంలో వారు నిర్దోషులు, సరళ ఇప్పుడిక్కడుంటే లేడిలా గంతేసి ‘హియర్ హియర్’ అని వుండును. మీరేమంటారు. రామంబాబూ,’’ అంది యశో.

‘‘చాలా వరకూ యశో చెప్పిందే నిజం డాక్టరు గారూ,’’ అన్నాను.

‘‘భార్య మాట తో ఏకీభవిస్తే ఏ తంటా ఉండదనుకున్నారేమో, ఉండండి డాక్టర్గా నా తఢాకా చూపిస్తా మీకు. సిస్టర్ సుగుణతో చెప్పి ఇవాళ రెండు ఇంజక్షన్లు ఎక్కువ ఇపిస్తాను, " అన్నారాయన నవ్వుతూ.

‘‘డాక్టరుగారు, మాకు మీ ప్రమీల పరిచయ భాగ్యం ఎప్పుడు కల్గిస్తారు?’’ అంది ఒక రోజున యశో.

ఎప్పుడూ నవ్వుతూవుండే ఆయన ముఖం నల్లబడింది.

‘‘యశో. నా ప్రమీల ఆత్మహత్య చేసుకుని మూడు సంవత్సరాలైంది,’’ అన్నారు డాక్టర్ స్వరూప్.

మేమిద్దరమూ దిగ్భ్రాంతులమయ్యాము, ఆయన మాటలను బట్టి వారిద్దరిదీ అన్యోన్య దాంపత్య మనుకునేవాళ్లం, కాసేపు సంశయించి కారణమడిగాను, అభ్యంతరం లేకపోతే చెప్పమన్నాను.

‘‘అభ్యంతర మేముంది రామంబాబూ. చెప్తాను, ప్రమీలను నేను ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. పెళ్లిచేసుకుని ప్రేమించాము. ఇద్దరమూ ఎంతో అన్యోన్యంగా వుండేవాళ్లం. అప్పుడు మేము కలకత్తాలో వుండేవాళ్లం. ప్రమీలది చాలా సున్నితమైన మనస్సు, ఎంతో చక్కగా వుండేది. నాకు యశోని చూస్తోంటే ప్రమీల జ్ఞప్తికి వస్తుంది. ఏవో పోలికలు కనబడుతూంటాయి. పిల్లలంటే మాకు ఎంతో ఆపేక్షగా వుండేది. ప్రమీలకి పసిపాపలంటే ముఖ్యంగా మగపిల్లలంటే నిజంగా పిచ్చిగా వుండేది. పొరుగింటి పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి ఆటలు అలంకారాలు జరిపేది. పెళ్లైన మూడు సంవత్సరాలకి ప్రమీలకి పిల్లలు పుట్టే సూచన కనబడింది. దీంతో మా ఇద్దరి సంతోషానికి అంతులేదు. ఎన్నో కలలు కన్నాము. రేయింబవళ్లు కూర్చుని పిల్లల దుస్తులు కుట్టుతూ వుండేది. అనేక కలలు కంది.

కళ్లల్లో నీళ్లు నిండగా తుడుచుకున్నారాయన.

“ఇలా వుండగా ప్రమీలకు పెద్ద జబ్బు చేసింది. పుట్టకమునుపే గర్భంలోనే శిశువు నశించి పోయింది. ఇక భవిష్యత్తులొ కూడా పుట్టే అవకాశం లేదని తేలిపోయింది. ఆ విషయం ప్రమీలకు తెలియకుండా వుండాలని ప్రయత్నించాను. కాని చెప్పడమే మంచిదని ఒకనాడు చెప్పాను. అది విని ప్రమీల నేను భయపడినంతగా దుఃఖించినట్లు కనపడలేదు. నిజానికి నేనెంతో పొరబడ్డాను. ఆమె ముఖం చూసి నేను జాగ్రత్త పడాల్సింది. దుఃఖ సమయంలో కన్నీరు కంటె మంచిది ఇంకొకటి లేదు. ఆ విషయం నేను అప్పుడు గ్రహించలేదు. డాక్టరు భార్య అవటం వల్ల ఆమెకు అన్ని మందులు గురించీ తెలుసు. ఒకనాటి రాత్రి విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ రాత్రి ఆమె ప్రవర్తన ఎంతో విచిత్రంగా వుంది. నేను మూర్ఖుడిని, మందబుద్ధిని అయి అప్పుడు నేను అది గ్రహించలేదు.

కాస్సేపు మాట మంతి లేక ఉండిపోయారాయన, ఆ సంఘటన నిన్నోమొన్నోజరిగినట్లు.

రాత్రి చాలా సేపటి వరకూ ఎంతో ఆప్యాయంగా కబుర్లు చెప్పింది. పడుకుందామంటే ఇంకొంచెం సేపు ఆప్యాయంగా కబుర్లు చెప్పింది. ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అని చాలా ఆలస్యం చేసింది. ఒకటి రెండుసార్లు కళ్లలో నీళ్లు చూశాను. భుజం మీద చేయివేస్తే గజగజ వణికింది. కారణమడిగితే ఇవాళ మనస్సు బాగోలేదు ఎందుకో భయంగా వుంది అంది. ‘‘పడుకుంటే అన్నీపోతాయి, పడుకో’’ అన్నాను. ‘‘అప్పుడు నాకు ఆలోచన కలుగలేదు. చివరికి నేను బలవంతంగా నిద్రపోయాను. ఎంత క్రూరంగా ప్రవర్తించాను. జీవితంలో ఎన్నో రాత్రులు వ్యర్ధంగా నిద్రపోతూ గడిపివేస్తూన్నాను. ఆ అయిదు గంటలూ నిద్రపోకపోతే నా ప్రమీల దక్కేదేమో, ఆ విషయం నాకు ఏ మాత్రం తెలిసివున్నా ఆమె మనస్సు మార్చివుండే వాడిని. నా మాట ఎప్పుడూ ఆమె కాదనలేదు. నా ప్రవర్తనలో కూడా ఏదో లోటు పాటు వుండి వుంటుంది. లేకపోతే ప్రమీల ఎప్పుడూ అలా చెయ్యదు. ఒక ఉత్తరం రాసి పరలోకం లోకి పయనించింది. అందులో జీవితమంతా సంతతి లేకుండా నేనుండలేను. నలుగురినోట ఆ మాట నేను వినలేను, నా ఆరోగ్య పరిస్థితి కారణంగా మీకు కూడా తండ్రి అయ్యే భాగ్యాన్ని నేను ఇవ్వలేకపోయాను. మన మిద్దరమూ కలసి కన్నకలల్ని నేను తుడివేస్తున్నాను. ఇంటిలోని ఆట బొమ్మలు, దుస్తులు చూస్తుంటే నేను భరించలేను. నేను వెళ్లిపోతాను. నన్ను మర్చిపోండి. నా మీద మీకేమైనా ప్రేమవుంటే మళ్లీ పెళ్లి చేసుకోండి. ఆ విధంగా మీరు చేస్తే నా ఆత్మ శాంతిస్తుందని ప్రార్థిస్తున్నాను. నా అంతిమ కోరిక తీర్చండి. ఇంకొక సంగతి మీకు చెప్పకుండా మీవద్ద శలవు తీసుకోలేను. నేను మిమ్మల్ని ప్రేమించినంతగా ఏ భార్య ఏ భర్తనీ ప్రేమించలేదు, శలవు అని రాసింది. ఆమె వెంటనే నేను కూడా పోదామనుకున్నాను కాని వృద్ధ‌ తల్లిదండ్రులయెడ కర్తవ్యం అడ్డొచ్చింది. ప్రమీల పోయి మూడు సంవత్సరాలైంది.’’ .

డాక్టరుగారు ప్రమీల గాధ చెప్తున్నంత సేపూ సర్వమూ మరచి విన్నాను. అంతా అయిపోయిన తర్వాత యశో ముఖం చూసి చకితుడ నయ్యాను. అంత క్రితం ఎప్పుడూ తనని ఆ విధంగా చూసినట్లు గుర్తులేదు. ఆమెలో దుఃఖం కంటే భయం ఎక్కువగా కనబడింది. ఆమె అంతరంగంలో సాగుతున్న ఆలోచలను ప్రమీల వృత్తాంతం బాహ్య ప్రపంచం లోకి తెచ్చిందా అన్న భావన కలిగింది నాకు. అమ్మీ కూడా ఈ విధంగా ఎప్పుడైనా ప్రమీలలా తలచిందా?

“అయితే మీరు ప్రమీల కోరిక నెరవేర్చరా డాక్టరుగారూ? అంది యశో కొంత సేపు మౌనంగా ఉండి

‘‘ఎన్నటికీ నెరవేర్చలేను, అదే నా దౌర్భాగ్యం,” అన్నారు డాక్టర్ స్వరూప్.

“మరణించిన వారి కోరికలు మనకు సాధ్యమైనంత వరకూ మన్నించాలి డాక్టరు గారూ. అయినా ఇందులో తప్పుకాని, నిందాకరమైనది కానీ ఏమీ లేదు. ప్రమీల చాలా దుర‌దృష్ట‌వంతురాలు, కానీ ఆమె మీకోసం ఎంతో త్యాగం చేసింది. ఇదంతా తనకోసమే అయితే అలా ఎన్నడూ చేసేది కాదనిపిస్తుంది,” అంది యశో.

‘‘అంటే ప్రమీల చేసింది మంచిదంటావా యశో, ఆత్మహత్యను సమర్ధిస్తున్నావా,” అన్నారు డాక్టర్.

‘‘మంచిదా, చెడ్డదా అనే ప్రశ్నకు సమాధానం నాదగ్గర లేదు డాక్టరుగారు. కాని ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అలా చేసుకుందో నేను అర్ధం చేసుకోగలను, ఆత్మహత్య చేసుకుని మీకు ఎంతో దు>ఖాన్ని మిగిల్చి వుండొచ్చు. కొన్ని కొన్ని కార్యాలకి పరిణామాలతోనూ పరులతోనూ, పరలోకంతోనూ నిమిత్తం లేదు,’’ అంది యశో.

ఈ సంభాషణ నన్ను చాలా కలవరపెట్టింది. అంత నిగూఢంగా మాట్లాడటం ఆమె స్వభావానికే విరుద్ధం. ఏదో సమస్య పెట్టుకుని మాట్లాడుతూందని స్ప‌ష్ట‌మైంది. అది ఏమై వుంటుంది. ఆ తర్వాత కొంత కాలం వరకూ యశోలో ఒక విధమైన మార్పు గమనించాను. నేను నిద్రపోయి లేచేటప్పటికీ కిటికివద్ద నిలబడి బయటికి తదేకంగా చూస్తూ వుండేది. పిలిస్తే వులిక్కిపడి “మీరా” అనేది. ప్రమీల గాధ ఆమె హృద‌యంలో తుఫాను లేవదీసిందని గ్రహించాను. నాకు సంబంధించినంత వరకూ ప్రమీల కూడా నా దుఃఖిత స్త్రీల పట్టికలో ప్రవేశ నార్హత పొందింది.

‘‘ప్రమీల చాలా తప్పు చేసింది రామం బాబూ, భర్తకు చాలా అన్యాయం చేసింది. జన్మించటంలో మనకు ఎంత హక్కువుందో మరణించటంలో కూడా అంతే వుంది. ఆలోచించితే ఏమీ లేదని తేలుతుంది. ఆత్మహత్య సమర్థనీయమైన దైతే మానవకోటి క్షీనించివుండేది. ఏదో ఒక దుఃఖ కారణం ప్రతి వారికీ వుంటుంది. జీవితంలో మనకు లభించిన దానిని మనము స్వీకరించాలి. ప్రమీలకు నా సానుభూతి లభిస్తుంది. ఒప్పుదల కాదు భర్తకోసం అలా చేసింది. ఆమె పతివ్రతకాదా? ఆమె వుద్దేశాలు మంచివే రామంబాబూ, కాని ఆలోచనలు తప్పుదారి తొక్కాయి,’’ అంది యశో.