Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

శశి వదనే - చివరి భాగం - 3

“అంటే జీవితాంతం మీరు ఇలా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారా? మీరు ఒక తోడు, నీడ, వివాహం..” అని ఆపేశాడు.

“మీ సందేహం నాకు అర్థంఅయ్యింది” అని ఆమె చిన్న నవ్వు నవ్వింది.

**********************

“నన్ను ఇక్కడ నిత్య సుమంగళి గా గౌరవిస్తారు, ప్రతి పెళ్ళిలో నేను మంగళ సూత్రాన్ని తాకిన తరువాతే వధువుకి మాంగల్య ధారణ జరుగుతుంది. నాకు జీవితాంతం వైధవ్యం లేదు. స్వామి వారికి చేసే ప్రతి పూజా కార్యక్రమం నేను లేనిదే జరగదు. సమాజం నుండి గౌరవం, రాచ మర్యాదలతో కూడిన జీవితం. ఇంతకు మించి ఇంకేమి కావాలి?” అన్నది తనకు తాను సమాధాన పరుచుకునేటట్లు.

“సమాజం గౌరవిస్తుందనో లేక రాజ్యం కావాలనుకుంటోందనో కాదు మీ కోసం మీరు ఆలోచించుకున్నారా? మీ బాధలు, సంతోషాలు మీతో పంచుకునే వ్యక్తి ఒకరు కావాలని, వీరే కావాలని మీకు ఎప్పుడూ అనిపించలేదా ” అని అసలు సందేహాన్ని బయట పెట్టాడు శివుడు.

“లే లే లేదు..” అని గిరిజ అతడికి సూటిగా సమాధానం చెప్పలేక మెట్లు దిగి వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.

శివుడు తాను తొందరపడి ఆమెను బాధ పెట్టినందుకు తనను తానే నిందించుకున్నాడు.

అయితే వీరి ఇద్దరినీ క్రింద నుండి పరిశీలిస్తున్న ఆలయ ధర్మకర్తను వారు గమనించలేదు.

అది ఒక అమావాస్య రాత్రి. ఆ రోజు జరిగే ఘొరం చూడలేకే నేమో బహుశా చందమామ ఆ రోజు ఆకాశంలో దాక్కుంది.

శివుడు గుడిలో విశ్రమిస్తుండగా అతడికి ఏదో అలికిడి అనిపించి నిద్ర లేచాడు. దూరంగా అతడికి గిరిజ ఆలయ ప్రధాన మండపం వద్దకు కాగడా తో వస్తున్నట్టు కనిపించింది. గుడి లోపల నుండి కాగడా తీసుకొని బయటకు వచ్చాడు.

ఆమె కాగడా నందీశ్వరుడిని పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఆమెను ఎలా ఉపశమించాలో అర్థం కాక అతడు ఆమెను చూస్తూ ఉండిపోయాడు.

కొద్ది సేపటికి ఆమె అతడిని చూసింది. చెదిరిన జుట్టు , కన్నీళ్ళు, స్వేదం తో తడిసిన ఆమె శరీరాన్ని చూడగానే అతడికి గాబరా పుట్టింది.

“క్షమించండి, మిమ్మల్ని చూడనే లేదు” అని ఆమె అతడి కేసి చూసింది. ఎంత ఆపుకుందామన్నాఆమెకు దుఃఖం ఆగటం లేదు.

“ఏం జరిగింది, భయం లేకుండా చెప్పండి.” అని శివుడు నెమ్మదిగా ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు.

“ నేను దేవుని భార్యని అని చెప్పినప్పుడు ఎంతో గర్వ పడ్డాను. సమాజం నన్ను గౌరవంగా చూస్తోందని మురిసిపోయాను. కానీ ఇలా..”

“నన్ను ఆ నీచుడు బాలాత్కరించబోయాడు.. నువ్వు దేవుడి దాసీవీ కనుక దేవాలయానికి అస్థివి, నా ఆస్థివి అనుకుంటూ నన్ను స్వాధీనపరుచుకోబోయాడు” ఆ తరువాత ఆమె గొంతు పెగలలేదు.

“ఎవరా నీచుడు?” అన్నాడు శివుడు కోపం తో ఊగిపోతూ.

“ఆ ఆలయ ధర్మ కర్త”

“నాతో ఆలయానికి సంబంధించిన కార్యక్రమాలు చర్చించాలని వచ్చాడు. మాటల్లో నా మీద చేయి వేయబోయాడు. అతడి కళ్లల్లో, ఒంటి నిండా నాకు కామం కనిపించింది. నాకు ఆ ఉద్దేశ్యం లేదు అని నేను దూరంగా జరిగాను. అంతే నా మీద రాక్షసుడిలా పడిపోయాడు. నేను నా జడని అతడి మెడకి చుట్టి అతడు ఉక్కిరి బికకిఎరి అయ్యాక ఇలా పారిపోయి వచ్చాను” అంది జీరబోయిన స్వరం తో.

“ఆ రాక్షసుడిని ఇలా వదల కూడదు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి” అని శివుడు ఆవేశంగా లేచాడు.

“మీరు ఆవేశపడకండి. తొందరపాటు వల్ల తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరిగ్గా ఉండవు. తప్పు అతనిది అని చెప్పి నలుగురిలో అతడిని నిలదీయాలి, అంతే గాని కీచకూడిలా ఎవరు దాడి చేశారో కూడా తెలియకుండా అతడు మరణించకూడదు” అని గిరిజ శివుడి ఆవేశాన్ని చల్లార్చే ప్రయత్నం చేసింది.

శివుడు ఆ మాటకు కొంత శాంతించాడు.

మరునాడు ఉదయం న్యాయస్థానం లో.

న్యాయకర్త ముందు గిరిజ, ఆలయ ధర్మ కర్త, శివుడు, పూజారి నిల్చుని ఉన్నారు.

“అసలు జరిగిన విషయం ఏమిటో చెప్పండి” అన్నారు న్యాయకర్త గిరిజ వైపు చూస్తూ.

“నన్ను, ఈ ధర్మకర్త నిన్న బాలాత్కరించబోయాడు. నేను ఎలాగో తప్పించుకుని వచ్చాను. “ అని తలవంచుకుని చెప్పింది గిరిజ.

వెంటనే ధర్మకర్త అందుకుని “ఆమె చెప్తున్నది అబద్ధం అయ్యా. హవ్వా, నేను ఇంత పరువు గలవాడిని, ధర్మ కార్యాలు చేసే పెద్ద మనిషిని నేను ఎందుకు అలా చేస్తానయ్యా. అసలు నిజం నేను చెప్తాను వినండి.

గిరిజ, శివుడు ప్రేమించుకుంటున్నారు. ఆమె దేవదాసి అయి ఉండి అలా చేయటం తప్పు అని అందరూ నిందిస్తారని ఆమె నాపై ఈ తప్పుడు నేరం మోపింది. ఇలా చేస్తే ఆమెకు ఈ గుడి బాధ్యత నుండి విముక్తి కలిగి ఆ శివుడిని పెళ్లి చేసుకోవచ్చునని పన్నాగం పన్నినది అయ్యా” అని రెండు చేతులూ జోడించి వినయం నటిస్తూ.

న్యాయకర్త శివుడి కేసి చూసి “ఏమయ్యా, నువ్వు, గిరిజ ప్రేమించుకోవటం నిజమేనా?” అని అడిగారు.

“నేను ఆమెను ఆరాధించటం నిజమే, కానీ ఆమె నన్ను ప్రేమించటం నిజం కాదండీ. ఈ ధర్మకర్త మిమ్మల్ని తప్పుదారి పట్టిస్తున్నాడు” అంటూ ధర్మకర్త వైపు వేలెత్తి చూపించాడు.

న్యాయవేత్త గిరిజ వైపు చూసి “ఏమ్మా, శివుడు చెప్పినది నిజమేనా?” అని అడిగారు.

గిరిజ అడ్డంగా తల ఊపింది.

“నాకు శివుని మీద అభిమానం ఉంది, కానీ అది నా మనసులోనే గూడు కట్టుకున్న నిజం. అది నా వృత్తి ధర్మానికి ఎప్పుడూ భగ్నం కలిగించలేదు. ధర్మకర్త నన్ను బలాత్కారం చేయబోవటం వాస్తవం. ఆ విషయానికి, శివుడికి ఏమి సంబంధము లేదు” అని ఖచ్చితంగా చెప్పింది.

న్యాయ కర్త పూజారి వైపు తిరిగి “పూజారి గారు, అసలు నిజానిజాలు ఏమిటో మీరు చెప్పండి” అన్నాడు.

“చెప్తాను అయ్యా. శివుడు, గిరిజ మధ్యన ఉన్నది ఒక పవిత్రమైన అనుబంధం. ఒకరంటే మరొకరికి అభిమానం, ఆరాధన. వారి ఇద్దరి మధ్య అనుబంధం శృతి మించటం నేను ఎప్పుడూ గమనించలేదు. ఈ ధర్మకర్త గారికి ఎప్పటి నుండో ఈ పసి దాని మీద మనసు ఉంది. ఆమెను అతడు కామం తో చూడటం నేను గమనించాను. తండ్రి లాంటి వాడు అలా ఎలా ఆలోచిస్తాడు, నేనే భ్రమ పడ్డా నేమో నాని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. మొన్న ధర్మ కర్త శివుడు, గిరిజ మాట్లాడుకోవటం చూసి కోపం తో ఊగిపోవటం చూశాను. ఆమె తన నుండి, ఈ గుడికి దూరం అవుతుందేమో నని ఆవేశం తో ఈ పని చేసి ఉంటాడు అని నాకు అనిపిస్తోంది. నా ఉద్దేశ్యం ప్రకారం ధర్మకర్త ఈ నేరం చేసే ఉంటాడు”.

న్యాయకర్త వెంటనే ధర్మ కర్త వైపు తిరిగి “ఆలయ ధర్మకర్త వి అయి ఉండి ఇటువంటి పాడు పని చేయటానికి నీకు సిగ్గు లేదటయ్యా, వెంటనే ఇతనికి మన న్యాయ ప్రకారం గా ఒక కాలు, ఒక చేయి నరికెయ్యండి” అని ఆజ్ఞాపించాడు.

భటులు ధర్మకర్త ను బలవంతంగా తీసుకొని శిక్షించడానికి వెళ్ళి పోయారు.

ధర్మకర్త శివుడి వైపు తిరిగి “ఏమయ్యా శివుడు, ఒక వేళ నువ్వు పెళ్లి చేసుకుంటే గిరిజని గుడికి దూరం చెయ్యవు కదా.” అన్నారు

“గుడి అన్నా, గుడిలోని పరమ శివుడు అన్నా ఆమెకు ప్రాణం. ఆమె నాతో పెళ్ళికి ఒప్పుకుంటే ఆమె ప్రాణాన్ని ఆమె నుండి దూరం చేయను” అన్నాడు.

అప్పుడు ధర్మకర్త గిరిజ వైపు చూస్తూ-

“చూడమ్మా, దేవదాసి అనేది దేవునికి సేవ చేసుకునే వృత్తి. దేవుని మీద అంకిత భావం తో పని చేయటం కోసం దేవుని తో పెళ్లి అనే ఆచారాన్ని పెట్టారు. అంత మాత్రాన నువ్వు వేరొకరిని వివాహం చేసుకోకూడదని శాస్త్రం ఏమి లేదు. నువ్వు, శివుడు నిజం గానే ప్రేమించుకుంటే మీరు ఇద్దరూ వివాహం చేసుకోవటంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు.” అని తీర్పు ముగించారు.

గిరిజ సిగ్గుతో తల దించుకుంది. శివుడు ఆనందంతో ఆమెకేసి చూశాడు. పూజారి గారు దూరం నుండే ఇద్దరినీ ఆశీర్వదించారు.

ఓక పౌర్ణమి నాడు గిరిజా కళ్యాణం విరూపాక్ష మందిరంలో అత్యంత వైభవంగా జరిగింది.

----------

ఆలయ ధర్మకర్తకు మంచి శిక్షే పడింది కదా, మరి అప్పట్లో ఆడ వారిని అవమానిస్తే శిక్షలు అంత కఠిన్యంగానే ఉండేవిట.

సమాజంలో ఏ ఆచారం అయినా ఒక మంచి ఉద్దేశ్యం తోనే మొదలవుతుంది. అది కొందరు డబ్బు, పలుకుబడి ఉన్న స్వార్థపరుల చేతిలో పడ్డప్పుడే అది దురాచారం అవుతుంది. పేదరికం, నిరక్షరాస్యత వల్ల దానిని గుడ్డిగా నమ్మితే అదే మూఢాచారంగా మారుతుంది. అది సమాజాన్ని పక్క దోవ పట్టిస్తోంది, మానవత్వాన్ని మట్టి కలుపుతోంది అని తెలిసినప్పుడే సంఘ సంస్కర్తలు పుడతారు, ఆ మూఢాచారాలను రూపు మాపుతారు.

దేవదాసీ వ్యవస్థ కూడా అటువంటిదే. దేవాలయాలు అప్పట్లో సాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలు. దేవాలయాలలో ధర్మ కార్యాలు, దేవుని పూజ చేయటానికి, వచ్చే భక్తులను అలరించటానికి కొందరు స్త్రీలు అవసరం అని గ్రహించి దేవదాసీ వ్యవస్థ 7 వ శతాబ్దం లో ఉద్భవించింది. శ్రీ కృష్ణ దేవరాయులు కాలంలో అది ఎంతో అభివృద్ధి చెందినంది. దేవదాసి లకు సమాజం లో ఎంతో విలువ, గౌరవం, సిరి సంపదలు ఉండేవిట. అయితే కాల క్రమేణా కొందరు స్వార్థ పరులు దేవదాసి లు భగవంతుని ఆస్తి కనుక దానిని పౌరులు అందరూ అనుభవించే హక్కు ఉన్నది అని చెప్పి ఆ వ్యవస్థను ఒక నవ్వులాటగా మార్చారు. ఇప్పుడు మనకి తెలిసిన దేవదాసి అంటే ఏదో నామ మాత్రానికి దేవునితో తాళి కట్టించి ఆమె ను వేశ్యగా మార్చిన ఒక వ్యవస్థ. పైగా దేవదాసీని వివాహం చేసుకుంటే ఆ గ్రామం నాశనం అయిపోతుందనే మూఢ నమ్మకాలు. మన ప్రభుత్వం ఈ దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా ఒక బిల్లును పాస్ చేసింది. అయినా కూడా ఇంకా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఈ పిచ్చి దేవదాసి వ్యవస్థ సజీవంగా ఉంది అంటే నమ్ముతారా? 2013 లోని హ్యూమన్ రైట్స్ నివేదిక ప్రకారం మన ఆంధ్ర రాష్ట్రాలలోనే 80 వేల మంది దేవదాసిలు ఉన్నారుట. ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారిని గుర్తించి వారికి పునరావాసం కల్పించే ప్రయత్నం చేస్తోంది.

వితంతులను అగౌరవ పరిచే వ్యవస్థ కూడా అటువంటిదే. ఆ రోజుల్లో వితంతువులను సతీ సహగమనం పేరిట ఎలా సజీవంగా మంటల్లో తోసేవారో చదివితే మనుషులు అప్పుడు మృగాలుగా ప్రవర్తించేవారో అర్థం అయ్యి ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కొందరు సంఘ సంస్కర్తలు పూనుకోవటం వలన ఆ ఆచారానికి తెర పడింది. ఇప్పటికీ వితంతువులను మన సమాజం అవమానిస్తూనే ఉంటుంది. మన ఆచారాలు ఒక మంచి ప్రయోజనం కోసం, ఒకప్పటి సాంఘిక వ్యవస్థ అనుసారం మొదలు పెట్టినవి. వాటి మూలాలు తెలుసుకొని మానవత్వం తో ప్రవర్తిద్దాం. అంతే గాని మూఢాచారాలు పేరిట సాటి స్త్రీల స్వేచ్చా స్వాతంత్ర్యం హరించేలా, వారిని అవమానించే హక్కు మనకు లేదు.

- సమాప్తం