Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

శశివదనే - రెండవ భాగం - 2

దేవదాసి గురించి కొంత విని ఉన్నాడు.

ఆలయానికి కావలసిన ధర్మ కార్యాలు చేయటానికి, ఆలయంలో పూజాది కార్యక్రమాలు నిర్వహించటానికి, స్వామి ని నాట్య గానాలతో అలరించటానికి ఆమె చిన్నతనం లోనే దేవాలయానికి అంకితం అవుతుంది.

శివుడు పడుకున్నాడు కానీ అతనికి నిద్ర పట్టడం లేదు.

“ఇంత చిన్న వయసులో అంత భక్తి భావంతో భగవంతుని సేవకు అంకితం అయిపోవటం సాధ్యమేనా? దానికి ఎంత నిస్వార్థత, నిబద్ధత ఉండాలి” అని అతను ఆలోచిస్తూనే ఉన్నాడు. అతనికి ఆమె పై గౌరవ భావం కలిగింది.

ఆ తరువాత రోజు కూడా గిరిజ ఉదయాన్నే గుడికి వచ్చి అన్ని పూజా కార్యక్రమాలలో పాలు పంచుకుంది. సంగీత నృత్యాలతో భగవంతుని ఆరాధించినది. ఆ రోజు మద్యాహ్నం దేవుడికి నివేదన అయిపోయాక పూజారి గారు శివుడిని పిలిచి – “అబ్బాయి శివుడూ, ఈ ఊరికి క్రొత్తగా వచ్చావు కదా ఈ చుట్టు పక్కల ప్రదేశాల విశిష్టత తెలుసునా?” అని అడిగారు.

శివుడు తెలియదనట్లు తల అడ్డంగా ఊపి తల దించుకున్నాడు.

పూజారి గారు గుడిలో ఉన్న గిరిజను పిలిచి “అమ్మాయి గిరిజ, శివుడు గిరిజా కళ్యాణం ఘట్టానికి సంబంధించిన శిల్పాలు చెక్కుతాడు. అతడికి ఈ గుడి చుట్టు పక్కల ఉన్న ప్రదేశాలను చూపించి ప్రాశస్త్యాన్ని వివరించి చెప్పు” అని ప్రేమగా చెప్పారు. “అన్నట్టు తోడుగా మా చిన్నన్నను కూడా తీసుకు వెళ్ళండి”.

గిరిజ, శివుడు, ఇద్దరి మధ్యలో గెంతుకుంటూ చిన్నన్న అందరూ తుంగభద్రా నది ఒడ్డుకి చేరుకున్నారు. అక్కడి నుండి తెప్ప సహాయం తో నదిని దాటారు. ఆ పైన కాలి నడకన పంపా సరోవరం వద్దకు చేరుకున్నారు. ఆ సరస్సు నిండా విరబూసిన కలువలు, సరస్సు చుట్టూ వాలిన రకరకాల పక్షులతో ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. పంపా దేవి ఆ సరస్సు గట్టు మీద కూర్చుని ఆ కలువలను పరవశం తో చూస్తోంది. శివుడు కూడా నేల మీద చతికలబడ్డాడు. ఆ కలువలను సుతారంగా తాకుతూ

“ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం. ఈ సరస్సు చాలా పవిత్రమైనది అని చెబుతారు. ఇక్కడే పంపా దేవి శివుని కోసం తపస్సు చేసిందిట. అంతే కాదు ఇక్కడే ఆ శ్రీ రాముడు శబరి దేవి ని కలుసుకున్నదిట. ” అని ఆ సరస్సులోని నీటిని తన నెత్తి మీద చల్లుకుంది.

అంతలో ఆ సరస్సులో నుండి ఒక హంస వచ్చి ఆమె పంచన చేరింది. ఆమె ఆ హంసని నిమురుతూ “ఎంత అందంగా ఉందో కదండీ. కానీ దురదృష్టం చూడండి, ఈ సరస్సులో ఇప్పుడు ఒక్క హంసనే మిగిలింది. హంస తూలిక తల్పాల కోసం కొందరు స్వార్థపరులు వీటిని చంపేశారు, చంపేస్తున్నారు, ఎంత అన్యాయం కదా” అంటూ బాధ పడింది.

శివుడికి ఆమె చెప్తున్న మాటలు వినిపించటం లేదు. సరస్సులో విరబూసిన కలువల మధ్య, హంస తో ఉన్న ఆమె అతడికి ఆ క్షణం లో దేవతా స్త్రీ లాగా అనిపిస్తోంది. ఆమెని చూస్తూ కంటి రెప్ప వేయటం మరచిపోయాడు. అది పసిగట్టిన ఆమె అతడి వైపు తీక్షణంగా చూసింది. అంతే అతడు చూపుల సంకెళ్ల నుండి బయట పడి “అవును అది ముమ్మాటికీ తప్పే” సిగ్గుతో తలదించుకున్నాడు.

ఆ సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ఎక్కడి నుండో చిన్నన్న కేక వినిపించింది. ఇద్దరూ వెనెక్కి తిరిగి చూసే సరికి చిన్నన్న ని ఒక వానరం అల్లరి పెడుతోంది. శివుడు గబుక్కున లేచి చిన్నన్న చేతిలోని సంచిని దూరం గా విసిరేశాడు. ఆ కోతి సంచిని వెతుక్కుంటూ అందులోని అరటి పండుని తీసుకొని పరిగెత్తింది. చిన్నన్న అప్పటికే భయంతో వణుకుతున్నాడు. శివుడు అతడిని హత్తుకుని “ఏమి భయం లేదు, అయినా ఆ సంచి ఎందుకు తెచ్చావు” అన్నాడు.

“మధ్యలో ఆకలేస్తుందని తెచ్చుకున్నా” అని చిన్నన్న ఏడుపు లంకించుకున్నాడు.

చిన్నన్న శివుడిని విడిపించుకుని గిరిజ వద్దకు పరిగెత్తాడు. “ఆ శ్రీ రాముడు శబరి దేవి దగ్గర పళ్ళు తీసుకున్నట్టు ఆ రామ బంటు నీ దగ్గర ఉన్న పళ్ళ కోసం ఆశ పడ్డాడు. చూశావా, నువ్వెంత అదృష్టవంతుడవో” అని గిరిజ చెప్పేసరికి చిన్నన్న చటుక్కున ఏడుపు మానేసి పరిగెత్తి గిరిజను కౌగలించుకున్నాడు.

కొద్ది సేపటికి వారు అక్కడి నుండి బయలుదేరి పరమ శివుడు, పంపా దేవి కలుసుకున్న హిమ కూటం పర్వతం, అక్కడి నుండి మన్మధ పుష్కరిణి ని సందర్శించి గుడికి తిరిగి వచ్చారు.

గిరిజ రోజూ ఉదయాన్నే గుడికి వచ్చేది. శివుడు శివ పార్వతుల శిల్పాలు అ ఘట్టానికి అనుగుణంగా చెక్కేవాడు. ఆ శిల్పాలను మరింత సజీవంగా మాలచటానికి గిరిజ సలహాలు తీసుకునేవాడు. అలాగే పురాణాలకు సంబంధించిన సందేహాలు వచ్చినప్పుడు ఆమెతో చర్చించేవాడు. అలా ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. మొదటి చూపులో ఆమె అందానికి ఆకర్షితుడైన అతడు ఇప్పుడు ఆమె భక్తికి, ప్రజ్ఞ కి, విజ్ఞానానికి ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణ నెమ్మదిగా ఆరాధన గా మారింది. దూరంగా ఉన్న చందమామని చూసి ఆనందించినట్లు అతడు ఆమెను ఆరాధించటం మొదలు పెట్టాడు.

గిరిజ కూడా అతని శిల్పకళా నైపుణ్యానికి అబ్బురపడేది. చిన్నన్న ద్వారా అతడు సాయంత్ర సమయంలో రహస్యంగా ఒక అద్భుతాన్ని సృష్టిస్తున్నాడని తెలుసుకున్న ఆమె ఒకరోజు అతడిని అదేమిటో చూపించమని ప్రాధేయపడింది.

అతడు ఆమెను గర్భ గుడి వెనుక నున్న మెట్లు ఎక్కించి పైన ఉన్న శాలు మండపం వద్దకు తీసుకు వెళ్ళాడు. ఆ గది చిన్నగా, చీకటిగా ఉంది. గది మూలన చిన్న చీలిక ఉంది. ఆలయ ప్రధాన గోపురం నుండి వచ్చే కాంతి ఆ చిన్న చీలిక గుండా ప్రయాణించి, మండపం లోని గోడ మీద ఆ గోపురం నీడ తలక్రిందులు గా కనిపించింది. “చూడండి ఇదే మాయ. ఆ గోపురాన్ని ఛాయా రూపం లో బంధించగలిగాము.” అని గర్వంగా చెప్పాడు శివుడు.

అది చూసి గిరిజ ఆశ్చర్య చకితురాలు అయ్యింది. “ఇది ఎలా సాధ్యమయ్యింది చెప్పరా” అని వేడుకుంటూ గిరిజ గుడి మెట్ల మీదే కూర్చుండి పోయింది. శివుడు దాని వెనుకనున్న గణితాన్ని, విజ్ఞానాన్ని ఆమెకు విశదీకరించాడు.

అతడు వివరించిన తరువాత కొద్ది సేపటికి గిరిజ “అన్నట్టు చిన్నన్న చెప్పాడు, మీకు చిన్నప్పుడే తల్లి తండ్రి దూరం అయ్యారని - తెలిసి బాధ కలిగింది” అని అతడి కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలదించుకుంది.

“ అవునండి, తలచుకుంటే బాధే. నాన్న గారు చిన్నపుడు ఏదో తెలియని మహమ్మారి తో చనిపోయారు. ఆ తరువాత సతీ సహగమనం అనే మహమ్మారి మా అమ్మ గారిని కూడా పొట్టన బెట్టుకుంది” అతడి కళ్లల్లో నుండి తెలియకుండానే కన్నీళ్ళు వస్తున్నాయి.

గిరిజకు అతడిని ఎలా ఓదార్చాలో అర్థం కాక కాసేపు మౌనంగా ఉండిపోయింది.

“నాన్నగారు ఎలాగో చనిపోయారు. మా అమ్మ సజీవంగా నిప్పులలోనికి దూకింది. తలచుకుంటేనే నా గుండెల్లో అగ్ని పర్వతాలు బ్రద్దలవుతాయి. అమ్మ అలా వైధవ్యం తట్టుకోలేక కావాలనే చేసిందో లేక ఈ సమాజం బలవంతం మీద చేసిందో తెలియదు. ఏదైతేనేనం ఆ తరువాత ఈ సమాజం లో ఎవరికీ దగ్గర కాలేకపోయాను.”

“నా బాధని మరచిపోవటానికి శిలలకు ప్రాణం పోయటాన్ని వ్యాపకంగా మార్చుకున్నాను. నా తోడు, నీడ, నా ప్రాణం అన్నీ అవే”.

అతడి ఎర్రటి కళ్ళు అతడి గుండెల్లో అగ్ని పర్వతాన్ని చూపిస్తున్నాయి.

వాటికి చలించిన గిరిజ “మీరు అధైర్య పడకండి. ఈ గుడిలోని వారు అంతా మీ పరివారం అనుకోండి. మీ కష్ట సుఖాలలో మేము కూడా ఉన్నామని గుర్తుంచుకోండి” అని నిప్పులు చేరుగుతున్న అతడి కళ్ల లోనికి చూస్తూ చెప్పింది..

“క్షమించండి, ఎవరి వద్దా నా వ్యక్తిగత విషయాలు పంచుకోని నేను ఈ రోజు ఇలా.. . ” అంటూ అతడు భుజం మీది తుండు గుడ్డ తో కన్నీళ్ళు తుడుచుకున్నాడు.

“నాది కూడా కొంచెం మీలాంటి కధే. మీరు తల్లిదండ్రులు మరణించారని బాధ పడుతున్నారు. నన్ను మా తల్లిదండ్రులు చిన్న తనం లోనే ఈ గుడికి అంకితం ఇచ్చేశారు. అలా చేస్తే పుణ్యం వస్తుందని ఎవరో చెప్పారుట. పన్నెండు ఏళ్ల ప్రాయంలో నాకు ఈ గుడి లో పరమ శివునితో వివాహం కూడా జరిగింది. అప్పటి నుండి ఈ గుడే నాకు పుట్టిల్లు, మెట్టినిల్లు” అంది గిరిజ శూన్యం లోకి చూస్తూ.

“అవును విన్నాను. మీరు జీవితాంతం ఇలా భగవంతుని సేవలో నిమగ్నమై ఉంటారా? మీరు ఒక వివాహం, సంసారం..” అని శివుడు మధ్యలో ఆపేశాడు.

“మీ సందేహం నాకు అర్థంఅయ్యింది” అని ఆమె చిన్న నవ్వు నవ్వింది.

Disclaimer: The opinions expressed in this post are the personal views of the author. They do not necessarily reflect the views of Momspresso.com. Any omissions or errors are the author's and Momspresso does not assume any liabil