Featured Books
  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 8

                     మనసిచ్చి చూడు - 08మీరు టెన్షన్ పడాల్సిన అవస...

  • అరె ఏమైందీ? - 22

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 8

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • రామాపురం హై స్కూల్ రోడ్

    నా పేరు విజయ్ మా గ్రామం పేరు రామాపురం. నేను టెన్త్ క్లాస్ వర...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

శశివదనే - మొదటి భాగం

అది హంపి నగరాన్ని శ్రీ కృష్ణ దేవరాయులు పరిపాలిస్తున్న కాలం.

శివుడు విరూపాక్ష ఆలయంలో ప్రధాన శిల్పిగా ఆ రోజే నియమించబడ్డాడు. శివుడికి ఒక ఇరవై-పాతిక ఏళ్ల వయసు ఉంటుంది. అతడు చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుని పెదనాన్న సంరక్షణ లోనే పెరిగాడు. శివుడికి చిన్నప్పటి నుండి శిల్ప కళ మీద అభిరుచి. అతడు చేసిన శిల్పాలలో జీవం ఉట్టిపడుతుందని అందరూ గొప్పగా చెప్పుకోవటం తో ఆ వార్త రాజు గారి చెవిన పడి ఆయన నుండి పిలుపు వచ్చింది. ఆ రోజు కాలినడకన తన గ్రామం నుండి హంపి నగరానికి చేరుకున్నాడు.

అప్పటి వరకు ఆ నగరం గురించి వినటమే కానీ అదే చూడటం. ఆ మహా నగరాన్ని చూడటానికి అతడి రెండు కళ్ళు చాలటం లేదు. ఆ రోజు కార్తీక పౌర్ణమి కావటం వల్ల వీధులు దీపాల కాంతి తో మెరిసి పోతున్నాయి.

విరూపక్షుని గుడికి చేరువ అయ్యే కొద్దీ ఆ దారి వరుస లో చాలా ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాల లోపల నుండి వినిపిస్తన్న కీర్తనలు వీనులవిందుగా ఉన్నాయి. విరూపాక్ష గుడికి చేరేసరికి గుడి ముందు బజారులలో వజ్ర వైఢూర్యాలు, ముత్యాలు రాశులుగా పోసి ఉన్నాయి. ఎరుపు, పచ్చ, నీలం, తెలుపు రంగులతో నిండిన నవరత్నాలు చూస్తూనే అతడి కళ్ళు జీగేలుమంటున్నాయి, ఎంతైనా రాళ్ళతో అతనికి ఉన్న అనుబంధం అలాంటిది.

శివుడు గుడిలో విరూపాక్షుని దర్శనం చేసుకున్నాక ప్రసాదం తీసుకొని తుంగ భద్రా నది ఒడ్డున కూర్చున్నాడు. అది ఎంత కార్తీక మాసం అయినా చుట్టూ రాళ్ళు, కొండల వల్ల సాయంత్రం అయినా వాతావరణం వేడిగానే ఉంది. తుంగభద్రా నది ఒడ్డున స్త్రీలు మల్లె పూలు అమ్ముతున్నారు. వాటి సువాసనలతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. పైన వినీల ఆకాశంలో చందమామ ఆ మల్లెల వన్నెలతో పోటీ పడుతున్నట్లు ఉంది. తుంగభద్రా నది నుండి వచ్చే చల్లటి గాలులు, మల్లె పూలు, చందమామ, గుడి నుండి వినిపిస్తున్న భక్తి పాటలు ఇవన్నీఅతని మనసుకి చల్లదనాన్ని సమకూరుస్తుంటే అతను హాయిగా సేద దీరుతున్నాడు. అంతలో ఎక్కడి నుండో గజ్జెల సవ్వడి.

చందమామ కు కన్ను కుట్టే అందంతో, మల్లెలకే ఈర్ష్య పుట్టే సుకుమారంతో ఒక పదిహేను పదహారేళ్ళ పడుచు నది వైపుకు నడిచి వెళ్తోంది. ఎర్రటి పట్టు పరికిణీ మీద రెప రెప లాడే పచ్చటి వోణి, మోకాలు వరకు వేలాడుతూ ఆమె ఓణి తో ఆడుకుంటున్న జడ కుచ్చులు, జడ నిండా తురిమిన మల్లెలు. చేతిలోని దీపం కాంతి ఆమె ముఖం మీద పడి ఆమె ముఖం ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఆమె ముఖం చంద్ర బింబం అయితే ఆమె కళ్ళు చంద్రుని రాకతో విచ్చుకున్న కలువలు వలె ఉన్నాయి. ఆమె ముక్కు సంపెంగ పూవులా ఉంది అని ఆమెను చూసే తిమ్మన్న గారు పద్యం రాసి ఉంటారు. ఆమె అధరాలు సూర్యుడి మీద విరహంతో ముడుచుకున్న ఎర్రటి కమలాలు లా ఉన్నాయి. బహుశా పెద్దన గారు ఈమెను చూసే వరూధిని ని వర్ణించారా అనిపించింది శివుడికి ఆ క్షణంలో.

ఆమె చెలియలు అనుకుంటా ఆమెని అనుసరిస్తూ సందడి చేస్తున్నారు. ఆమె, ఆమె చెలియలు నీటిలో దీపాలను వదిలి పెట్టారు. ఆకాశంలో చుక్కలతో పోటీ పడుతూ అవి నీటిలో సాగిపోతున్నాయి. ఆమె నదిలో దీపాలను వదిలి పెట్టి వెనక్కి తిరిగి చూసింది. ఆమె కళ్ళు శివుడి కళ్ళను కట్టడి చేశాయి. అతడి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడుతున్నాయి. ఇంకా కొన్నివందల చందమామలు, కొన్ని వేల మూరల మల్లెపూలు కావాలేమో అతడిని సేద తీర్చటానికి.

దీపాలు నీటిలో వదిలిన తరువాత తిరిగి వెళ్లిపోవాలన్న ఆదుర్దా లో ఆమె తలలోని చందమామ బిళ్ళ జారిపడింది.

శివుడు అది అంది పుచ్చుకుని పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమెకు పడిపోయిన చందమామని అందిస్తూ దానికి ప్రతిఫలంగా "మీ పేరు?" అని అడిగాడు. అనుకోని ఈ సంఘటనకు తొట్రుపడి, అంతలో తెరుకొని "గి గి గిరిజ" అని చెప్పి వేగంగా అడుగులు వేస్తూ ముందుకు కదిలింది.

గుడి చివర సందులోకి తిరిగే ముందు వెనక్కు తిరిగి చూసి ఇంకా అడుగుల వేగం పెంచింది.. శివుడి కళ్ల లో నుండి ఆమె రూపం చెదిరి పోవట్లేదు. ఆ రోజు రాత్రికి గుడిలోనే విశ్రమించాడు. ఆకాశం లో పౌర్ణమి చందమామను చూసినప్పుడల్లా ఆమె రూపమే కళ్ల ముందు మెదులుతోంది.

మరునాడు కార్తీక సోమవారం. శివుడు గుడిలో ప్రధాన శిఖరం పైన తన పనిలో లీనమై ఉన్నాడు. అంత ఎత్తున ఉండటం వాళ్ళ దూరం నుండి గుడి లోనికి గిరిజ రావటం గమనించాడు. ఒక్క క్షణం అతని హృదయం గాడి తప్పి అతడు చిన్నగా జారబోయి తమాయించుకున్నాడు.

ఆమె ను చూస్తూనే గుడిలో అందరూ ఆమెను గౌరవంగా ఆహ్వానించారు. ఆమె గుడిలో విరూపాక్షునికి నమస్కరించి పూజ ప్రారంభించింది.

గుడి లో నుండి ఆమె విరూపాక్షుని కోసం ఆమె భక్తి తో పాటలు పాడుతూ లయ బద్ధంగా నాట్యం చేస్తోంది. ఆ పాట, దానికి తగ్గట్టు కదులుతున్న ఆమె అందేలా సవ్వడి తో జత కలిసి దూరం నుండి వింటున్న శివుడికి చెవుల్లో అమృతం పోసినట్లుగా ఉంది. సాయంత్రం పూజలో అందరూ పాల్గొన్నారు. గుడిలో పురోహితుల వారు విరూపాక్షుని విశిష్టత ను తెలియజేస్తున్నారు.

" పరమ శివుడు పార్వతి దేవి ని పోగొట్టుకున్న దుఃఖం లో ఇక్కడే తపస్సు చేశారు. ఇక్కడే పంపా దేవి గా పుట్టిన పార్వతి దేవి శివుడిని ఇక్కడే రోజూ ఆరాధించేది. ఆమె పార్వతి దేవి అయిన తెలియక చలించని ఆ పరమ శివునిలో ప్రేమను నింపటం కోసం మన్మధుడు తన మన్మధ బాణాన్ని ప్రవయోగించాడుట. అప్పుడు మన్మధుని పై కోపం తో పరమ శివుడు తన మూడవ కంటిని తెరిచి అతడిని భస్మం చేశాడు. తరువాత రతి దేవి బ్రతిమాలి మరలా మన్మధుని బ్రతికించుకుంది. శివుడు మూడవ కంటిని తెరిచారు కనుకనే పరమ శివుడిని విరూపాక్షుడు అని మనం కొలుచుకుంటున్నాం. ఆ తరువాత పంపా దేవి భక్తిని గ్రహించి ఆమెను వివాహం చేసుకునేందుకు విరూపాక్షుడు అంగీకరించాడు అని స్థల పురాణం చెబుతోంది".

కధ ముగించగానే అందరూ విరూపాక్షునికి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ పిమ్మట తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్నారు. ఆ తరువాత అందరూ తలో దిక్కుకి వెళ్ళిపోయారు.

శివుడికి ఆ రోజు రాత్రికి అక్కడే విశ్రమించాలని తన తుండుతో గుడి అరుగు మీద పడుకున్నాడు. ఆకాశంలో చందమామని చూస్తూ, నువ్వే నాకు తోడు అనుకుంటూ కబుర్లు చెప్తున్నాడు. అంతలో వెనుక నుండి ఎవరో పిలవటం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాడు.

" మీ కోసం గుడి లోపల నాన్న గారు పడక ఏర్పాటు చేస్తున్నారు" అని పూజారి గారి చిన్న కుమారుడి మాటలు వినిపించాయి.

ఆ పిల్లాడికి పది ఏళ్ల వయసు ఉంటుందేమో.

“ఇలా రా బాబు, నీ పేరు ఏమిటి?” అని అడిగాడు శివుడు.

“చిన్నన్న” అన్నాడు ఆ పిల్లాడు తడుముకోకుండా.

“పేరు భలే ఉంది” అన్నాడు శివుడు అతడిని దగ్గరకు తీసుకుంటూ.

“నన్ను చిన్న వాడిని అనుకుంటున్నారేమో, నేను పెద్దయ్యాక పెద్దన అంతటి వారిని అవుతాను” అని నిఖారసుగా చెప్పేసరికి శివుడుకి నవ్వు వచ్చింది.

“మీ కోసం గుడి లోపల పడక ఏర్పాటు చేస్తున్నారు నాన్న గారు” అని చిన్నన్న మళ్ళీ చెప్పాడు.

"పరవాలేదు లే బాబు, నాన్న గారికి ఇబ్బంది ఎందుకు, రాళ్ళతో పని చేసే వాడిని ఇలా రాళ్ళ పై పడుకోలేనా?" అని శివుడు చమత్కరించాడు.

“అట్లా అయితే రేపు ప్రసాదం లో మీ కోసం కాసిని రాళ్ళు కలపమంటారా? మీకు రాళ్ళు కూడా అరిగించుకుంటారేమో” అని ఆ పిల్లాడి సమాధానానికి శివుడు పగలబడి నవ్వాడు.

“పిట్ట కొంచెం కూత ఘనం, చమత్కారం ఈ నేల పైనే ఉంది కాబోలు” అని మనసులో అనుకున్నాడు.

సర్లే చిన్నన్న పద అని శివుడు లేచాడు.

“అలా రండి దారికి” అని చిన్నన్న చంకలు గుద్దుకున్నాడు.

“అది సరే గాని, ఈ రోజు గుడిలో పాటలు పాడి నాట్యం చేశారే ఆమె ఎవరు?” అని శివుడు అడిగాడు.

“ఓహ్ గిరిజ అక్కా, అందరూ ఆమెను దేవదాసి అని పిలుస్తారు” అన్నాడు.

శివుడు ఒక్క సారి హతాసుడయ్యాడు. అతడికి తేరుకొనటానికి కొంత సమయం పట్టింది.