Read Aruna Chandra - 1 by BVD Prasadarao in Telugu Moral Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అరుణ చంద్ర - 1

రచయిత : బివిడి ప్రసాదరావు

ఎపిసోడ్ 1

"శరణం శ్రీ షిర్డీసాయిబాబా" అని, మలి నమస్కారం చేసి, పూజా గది లోనించి బయటకు వచ్చింది అరుణ.
హాలులో తన అమ్మ, నాన్న ఉన్నారు.
వాళ్లు ఆనందంగా కనిపించారు.
వాళ్ల కాళ్లకు నమస్కరించింది అరుణ, చిరునవ్వుతో.
"శుభమ్." అన్నారు ఆ తల్లిదండ్రులు, నిండుగా.
అరుణ నిల్చోగానే, ఆమెను దరికి లాక్కొని, కౌగిలించుకుంటూ, ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ఏక కాలంన, "పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లీ" అని అన్నారు.
అరుణ, "థాంక్సండీ" అంది, హాయిగా.
వెళ్లి, ముగ్గురూ డైనింగ్ టేబులు ముందు కూర్చున్నారు.
టిఫిన్లు వడ్డించుకుంటూ, తింటూ, మాట్లాడుకుంటున్నారు, చక్కగా.
"ఇరవైఒక్క యేళ్లు గడిచాయి. గడిచిందంతా హాఫీయా" అని అడిగాడు అరుణను తన తండ్రి నవ్వుతూ. ఆయన కృష్ణమూర్తి. ఒక కంపెనీలో ఉన్నత ఉద్యోగి.
"చాలా బాగా నడుస్తోంది లైఫ్. మీ సహకారమే బోల్డు. థాంక్స్ నాన్నా, థాంక్స్ అమ్మా" అంది అరుణ చాలా హుషార్గా.
"థాంక్స్ ఏమిట్రా. నీ కృషి మంచిగా ఉంది. సో, అంతా సవ్యమవుతోంది. అనుకున్న పిజీ చదువు చేశావు. ఆశించిన అడ్మినిస్ట్రేటివ్ జాబ్లో చేరావు. సో, ఆల్మోస్టాల్ యువర్స్, థట్సిట్" అన్నాడు కృష్ణమూర్తి, మనసారా.
అప్పుడే, "నౌ" అంది అరుణ తల్లి, తన వంతు అన్నట్టు. ఆవిడ లక్ష్మి. గృహిణి.
"నౌ, యువర్స్ టైం. మాట్లాడు" అన్నాడు కృష్ణమూర్తి నవ్వేస్తూ, భార్యతో,
"అమ్మ ఇంకేం మాట్లాడుతోంది. నా పెళ్లి గురించే" అనేసింది అరుణ, నవ్వుతూనే.
"కదా. లాస్ట్ నీ బర్త్డే నాడు మాటిచ్చావ్. నెక్స్ట్ ఇయర్ షూర్ అని. సో, ఇక మా ప్రయత్నాలు ప్రారంభిస్తామ్" అంది లక్ష్మి.
"తప్పక" అని అనేసింది అరుణ, నిండుగా.
ఆ వెంటనే, "డబుల్ హాఫీ మొదలైంది" అన్నాడు కృష్ణమూర్తి.
తమ ఏకైక సంతానం, తన పెళ్లితో, తమ కుటుంబ విస్తరణలో త్వరలో పాలుపంచుకో బోతున్నందుకు మిక్కిలి ఆనంద పడుతున్నారు ఆ దంపతులు ఇద్దరూ.
పిమ్మట ఆ ముగ్గురూ హాయిగా నవ్వుకుంటూ లేచారు.
అక్కడ నుండి ఎవరి పనులు వారివిగా కదిలారు.

***

సాయంకాలం, ఆఫీస్లో తన బర్త్డే పార్టీ ముగిసిన పిమ్మట, తన ఇంటికి బయలు దేరింది అరుణ.
అప్పటికే తను చాలా అలసిపోయి ఉంది. అయినా అనీజీగా మాత్రం లేదు.
తను కారు డ్రయివింగ్ సీట్లో కూర్చుంటుండగా, "హలో" అని అన్నాడు చంద్ర. అతడు ఆమె కొలీగ్.
"చెప్పండి" అంది అరుణ, కారు బయటకు తిరిగి వచ్చి.
"ఈ బర్త్డే నాడు చెప్తానన్నారు, లాస్ట్ బర్త్డే నాడు" అన్నాడు చంద్ర, సన్నగా నవ్వుతూ.
"అవును. గుర్తు ఉంది. కానీ, నాడు, నేడే చెప్తాను అని అనలేదు. ఈ నాటి బర్త్డే తర్వాత అన్నాను. సో, మా ఇంట్లో నాకు పెళ్లి సంబంథాలు ఇక చూడడం మొదలు పెట్టమన్నాను. ఏదైనా, వాళ్లు నిర్ణయంకే నేను కట్టుబడి ఉంటాను. ఇదేగా నేను నా లాస్ట్ బర్త్డే నాడు మీకు చెప్పింది కూడా." అని అంది అరుణ, చంద్రతో.
"యయ. నా ప్రపోజల్ని కూడా వారికి తెల్పండి మరి" అని చెప్పాడు చంద్ర, గడగడా.
"వై నాట్. తప్పక." అని అంది అరుణ, నవ్వుతూనే.
పిమ్మట, బై బైలుతో ఇద్దరూ తమ తమ దార్లు వైపు కదిలారు. అరుణ తన కారులో, చంద్ర తన బైక్ మీద.


***


తన తల్లిదండ్రులుతో కలిసి, డిన్నర్ చేస్తూ, "నాన్నా, కొద్ది గంటలు క్రితం చంద్రగారు తిరిగి కదిపారు, అప్పటి తన ప్రపోజల్ని" అని చెప్పింది అరుణ.
"ఆ అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకోలేదా" అని అంది లక్ష్మి.
"లేదమ్మా, స్టిల్ వైయిటింగ్ ఫర్మి" అంది అరుణ చిన్నగా నవ్వేస్తూ.
"అయ్య బాబోయ్. నిజమా. ఏమిటా అబ్బాయి" అని అంది లక్ష్మి, నవ్వుతూనే.
"గత యేడాది నీ పుట్టిన రోజున ప్రపోజ్ చేసిన ఆ ఆసామి నేటి వరకూ ఆగాడా." అన్నాడు కృష్ణమూర్తి.
"య నాన్నా. ఆ రోజు తర్వాత, ఈ రోజు వరకూ అతను ఆ విషయం నా వద్ద అస్సలు కదపనేలేదు. ఏవో ఆఫీస్ మాటలు తప్పా ఇట్టివి మా మధ్య ఏమీ రాలేదు కూడా" అని చెప్పింది అరుణ.
"ఇంటరెస్టింగ్" అన్నాడు కృష్ణమూర్తి, ఆసక్తిగా.
"ఆ అబ్బాయి ఎలాంటి వాడు. స్టడీ ఏమైనా చేశావా" అని అడిగింది లక్ష్మి.
"లేదమ్మా. నాకా తలంపే లేదు కూడా" చెప్పింది అరుణ.
"ఆ పెరుగు అందించవా" అన్నాడు కృష్టమూర్తి, లక్ష్మితో.
ఆవిడ అందించిన పెరుగు బౌల్ అందుకొని, అందులోని పెరుగును కొద్దిగా అన్నంలో వేసుకున్నాడు కృష్ణమూర్తి.
"మామిడి కాయలు వస్తున్నాయిగా. కొద్దిగా పచ్చి పచ్చడి చేసి పెట్టొచ్చుగా లక్ష్మీ" చెప్పాడు కృష్ణమూర్తి.
"తప్పక, రేపు మార్కెట్టుకు వెళ్లి కాయలు తెస్తాను" చెప్పింది లక్ష్మి.
కృష్ణమూర్తి డిన్నర్ ఐంది. లేచి వాష్బేసినీ వైపు వెళ్తూ, "నేను లాన్లో వేచి ఉంటాను. మీ ఇద్దరూ ఒకమారు అక్కడకు రండి, మీ పనులు త్వరగా పూర్తి చేసుకొని" అని చెప్పాడు.


***


లాన్లో, వాల్ఛైర్లో కూచొని ఉన్నాడు కృష్టమూర్తి.
ఈ ఇన్డిపెండెంట్ హోస్ ఆయన తనకు నచ్చినట్టు కట్టించుకున్నాడు, అన్ని మోడరన్ వసతులుతో, ఈ హైదరాబాదు నగర నడుము భాగంన.
తొలుత అరుణ అక్కడకు వచ్చింది. తండ్రికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది.
"ఏదైనా ఎసి అందించే చల్లదనం కంటే, ఈ చెట్లు ఇచ్చే గాలి మంచిగా ఉందిగా తల్లీ" అన్నాడు కృష్ణమూర్తి.
"నిజమే నాన్నా. పగలు బాగా ఎండ ఐనా, చీకటి పడే సరికి ఈ చెట్ల మధ్య వాతావరణం ఎంతైనా నైస్గా ఉంటుంది." అని, "ఇల్లు చుట్టూ ఈ చెట్లుకై మీరు పడ్డ శ్రమ, తపన ఊరకనే పోతోందా. ఏమో అనుకున్నాం కానీ, ఇప్పడు మాకు తెలుస్తోంది ఈ మీ పనితనం" అంది అరుణ, పొందికగా.
"ఆ రోజుల్లో అమ్మ మరీన్నూ. ఎందుకు ఇంత స్థలం ఈ చెట్లుకై వాడుతున్నారని ఒకటే నస కదూ" అని, నవ్వుతున్నాడు కృష్ణమూర్తి.
"మరే, అదే అమ్మ, ఇప్పుడు మాత్రం, ఈ చెట్ల వాతావరణాన్ని తెగ మెచ్చుకుంటుంది నాన్నా" అని, అరుణా నవ్వుతోంది.
అప్పుడే లక్ష్మి వస్తూ, "ఏమిటి తండ్రీ కూతురు అంతగా ముచ్చట పడిపోతున్నారు" అని అంటూ కృష్ణమూర్తి పక్కన కుర్చీలో కూర్చుంది.
"అదేనోయ్ నీ ఈ చెట్ల బాగోతం గురించి తలుచుకుంటున్నాం" అని చెప్పాడు కృష్ణమూర్తి, నవ్వుతూనే.
లక్ష్మీ నవ్వేస్తూ, "మీ చొరవే మేలైందండీ ఇప్పుడు. ఇప్పటి మన చుట్టూ ఈ కాలుష్యాలుకు మంచి విరుగుడైంది మీ ఈ ప్రయత్నం" అని అంది లక్ష్మి, నిండుగా.
పిమ్మట కొద్దిసేపు విరామంలా కొద్దిపాటి మౌనం ఏర్పడింది అక్కడ.
ఆ తర్వాత, కృష్ణమూర్తి, "మీ కొలీగ్ చంద్ర గురించి నీకు తెలిసింది, తెలిసినవి ఏమైనా ఉంటే చెప్పు తల్లీ" అని అడిగాడు, అరుణను.
"ఏమున్నాయి నాన్నా. మంచిగా అగుపిస్తున్నారు. కానీ వాగుడుకాయలా అనిపిస్తున్నారు" అని చెప్పింది అరుణ.
"ఏం మాట్లాడుతాడు అమ్మా అంతగా నీతో" అడిగింది లక్ష్మి.
"నాతోననే కాదు అమ్మా. అందరితోనూ, అన్నిన్నూ. కానీ హస్కులా అనిపించదు. అన్నీ ఇంటరెస్టింగ్ టాఫిక్సే. కానీ అతిగా నాకు అనిపిస్తుంటుంది. అంతే" చెప్పింది అరుణ, చిన్నగా నవ్వుతూనే.
"ఆహారపు అలవాట్లు ఏమైనా గుర్తించావా తల్లీ" అడిగాడు కృష్ణమూర్తి.
"లంచ్కి కెరియర్ తెచ్చుకోరు నాన్నా. కేంటిన్లోనే. అది చూశాను." చెప్పింది అరుణ.
"స్మోకింగ్, డ్రింకింగ్లాంటివి" అడిగింది లక్ష్మి.
"స్మోకింగ్ లేదు అమ్మా. ఎవరైనా ఆఫర్ చేసినా అతను కాదనడం నేను గమనించాను. ఇక డ్రింకింగ్ అంటే తెలియదు" చెప్పింది అరుణ.
"ఇది లేనప్పుడు అదీ లేకపోవచ్చు" అంది లక్ష్మి.
"అతను ఇన్నాళ్లు ఓపిగ్గా, కుదురుగా ఆగాటంటే, అతనినీ మనం పరిశీలిద్దాం. ఏమంటారు" అని అన్నాడు కృష్ణమూర్తి, అరుణ, లక్ష్మిలతో.
"చూడాలి" అంది లక్ష్మి.
అరుణ ఏమీ అనలేదు.
"నీకు అవకాశం ఉంది కనుక నువ్వు అతనితో సూటిగా మాట్లాడు తల్లీ. ఈ లోగా మేమూ అతని తల్లిదండ్రులుతో మాట్లాడతాం" అని చెప్పాడు కృష్ణమూర్తి.
"తొలుత ఆ అబ్బాయిని మన అమ్మాయి చేత, వాళ్ల పట్టింపులు, అభ్యంతరాలు, ఆలోచనలు, అంచనాలు, అభిలాషలు గురించి అడిగించి, అన్నీ సజావు ఐతేనే అతడి పెద్దలుతో మనం మాట్లాడితే బాగుంటుంది" అని చెప్పింది లక్ష్మి.
"అవును, అదీ మంచిదే. అలాగే కానీద్దాం. తల్లీ, నువ్వు ఆ విషయాలు అతని వద్ద కదుపు. అటు క్లియర్గా ఉంటే, మనం మన వైపు ప్రయత్నం మొదలు పెడదాం" అని చెప్పాడు కృష్ణమూర్తి.
"అలాగే" అంది అరుణ.
ఆ తర్వాత, మరి కొంత సేపు, మరో సంభాషణతో అక్కడ వారు గడిపి, పిదప, లేచి ఇంట్లోకి నడిచారు, నిద్రకై.


***

(మిగతాది రాబోవు ఎపిసోడ్ లో...)


***