Read Vennela Poolu - 26 by sivaramakrishna kotra in Telugu థ్రిల్లర్ | మాతృభారతి

Featured Books
  • వెన్నెల పూలు - 26

    వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజ...

  • వెన్నెల పూలు - 25

    వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజ...

  • ఎవరు....? - 9

    Part - 9 విజయవాడ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో…..కొండ...

  • యంత్రం వెనుక మనసు - 11

    అంతలో ఆర్య అక్కడికి వచ్చి, "ఏంటి షీలా.. అలా నిల్చుని ఏం ఆలోచ...

  • వెన్నెల పూలు - 24

    వెన్నెల పూలు ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజ...

కేటగిరీలు
షేర్ చేయబడినవి

వెన్నెల పూలు - 26

వెన్నెల పూలు

ఏ స్పైసీ హాట్, రొమాంటిక్, సస్పెన్స్ అండ్ సైకలాజికల్ థ్రిల్లర్

కొట్ర శివ రామ కృష్ణ

"వీడిని ఇప్పుడే చంపి పారేస్తే ఒక పని అయిపోతుంది. వీడు స్పృహలోకి వచ్చి మనవిషయం అంతా గుర్తుకొస్తే మనపని అయినట్టే" స్పృహ కోల్పోయివున్న అరవింద్ దగ్గరకి వెళుతూ అన్నాడు చలపతి.

"ఆగు, నువ్వు నా కొడుకుని ఎమన్నా చేసావో, నీ బండారం అంతా బయట పెడతాను. ఎంతో కష్టపడి, మమ్మల్ని దోచుకుంటూ ఒక చీకటి సామ్రాజ్యం సృష్టించుకుని దానికి చీఫ్ వి అయ్యావు కదా. అదేదీ నీకు లేకుండా చేస్తాను. నేనలా చెయ్యగలను. నీకూ తెలుసు." డ్రెస్ చేసుకోవడం కూడా మర్చిపోయి, చలపతి దగ్గరకొచ్చి గట్టిగా అరిచింది శకుంతల.

"నువ్వు నాతొ ఇలా వ్యభిచారిస్తున్నావని తెలిస్తే నీ మొహం మీద కూడా ఉమ్మేస్తాడు. ఆ విషయం మర్చిపోకు." కోపంగా అన్నాడు చలపతి.

"నాలాంటి పాపిష్టి దానికి అలాంటి శిక్ష పడాల్సినదే. నిజానికి నాకు అలాంటి శిక్ష పడితేనే మనశాంతి గా ఉంటుంది." అలా అంటూ గబగబా డ్రెస్ మార్చుకుని అరవింద్ దగ్గరికి వెళ్ళింది శకుంతల.

చలపతి కి బాగా తెలుసు, తను అంతపనీ చేయగలదని. అందుకనే తనూ డ్రెస్ చేసుకుని కోపంగా అక్కడనుండి వెళ్ళిపోయాడు.

అప్పుడు తను సంతోషించాలో, బాధపడాలో తెలియని విషయం ఒకటి జరిగింది. అరవింద్ స్పృహలోకి వచ్చాడు. కానీ అలా చూస్తూ వుండిపోయాడు. తనకి ఆశ్చర్యం అనిపించలేదు. అటువంటి దృశ్యం చూసిన తరువాత షాక్ తో ప్రాణమే పోయినా ఆశ్చర్యం లేదు.

అప్పుడే తను డాక్టర్స్ సిఫారసు తో అరవింద్ ని బ్లాక్ యాంట్ మెంటల్ కేర్ లో జాయిన్ చేసింది. అక్కడ కూడా సంతోషించాలో, బాధపడాలో తెలియని పరిస్థితి. అరవింద్ తన సెన్సెస్ లోకి వచ్చాడు. కానీ గతమంతా మర్చిపోయాడు. నిజానికి తను ఆనందించింది. అలాంటి గతం గుర్తు చేసుకుని బాధపడేకన్నా దానిని మర్చిపోవడమే మంచిది.

తన మనసు తెలుసుకుని తనని శాంతిగా ఉంచడానికి అన్నట్టుగానే వ్యవహరించింది తన కోడలు, ఇంకా అరవింద్ సైకియాట్రిస్ట్ సమీర. అందుకనే తను ఎటువంటి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా అరవింద్ కి నాచురల్ గానే గతం అంతా గుర్తుకురావాలని సజెస్ట్ చేసినప్పుడు, తను దానికి అంగీకరించింది.

కానీ తనకి తెలుసు. ఇలాంటి రోజు ఏదో ఒక రోజు తప్పకుండా వస్తుందని. అది తప్పించుకునే వీలు లేదని. అందుకనే తన కోడలు సమీర, తన కొడుకు అరవింద్ ని హిప్నటైజ్ చేసి గతమంతా గుర్తుకు వచ్చేలా చేస్తానంటే తను వద్దనలేదు. తనకి తెలుసు, తన కోడలు కాపబుల్. కచ్చితంగా తన కొడుకుకి ఆ రోజు సంఘటన తో పాటుగా గతమంతా గుర్తుకు వచ్చేలా చేయగలదు. ఆ తరువాత జరగ బోయేది, ఇంక కుర్చీలో కూచుని వుండలేనట్టుగా లేచింది శకుంతల. తను ఎప్పుడూ నోట్ బుక్ పెట్టివుంచే డ్రా దగ్గరకి వచ్చింది. అదే డ్రాలో ఆ రోజు అయన తనకి ప్రేమతో ఇచ్చిన వస్తువు ఒకటి వుంది. ఆ డ్రా ఓపెన్ చేసి, అది మురిపెంగా చేతుల్లోకి తీసుకుని, మళ్ళీ ఆ డ్రా దగ్గరికి వేసింది.

"నాకెందుకండీ ఇది. దీన్ని చూస్తుంటూనే నాకు భయం వేస్తూంది." ఆ రివాల్వర్ ని భయం భయం గా పట్టుకుంటూ అంది తను.

"నువ్వొక పెద్ద కంపెనీ కి మేనేజింగ్ డైరెక్టర్ వి. నీకు శత్రువుల భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకనే నీ పేరుమీద తీసుకున్నాను లైసెన్స్ ఈ రివాల్వర్ కి  ఇది ఎలా ఉపయోగించాలో కూడా నువ్వు పూర్తిగా నేర్చుకోవాలి."

అలా అని ఊరుకోలేదాయన. అది ఎలా ఉపయోగించాలో కూడా పూర్తిగా నేర్పించారు. అది ఎప్పుడూ ఫుల్ లోడెడ్ గా ఉంచుకుని, తనదగ్గరే హ్యాండ్ బాగ్ లో అట్టేపెట్టుకోవాలని చెప్పారు. అది ఎప్పుడూ ఫుల్లీ లోడెడ్ గా ఉంచుతూంది, కానీ తన దగ్గరే ఉంచుకోకుండా ఈ డ్రా లో ఉంచేసింది.      

  ఆ రివాల్వర్ తన రెండు చేతుల్లోకి తీసుకుని చూస్తూ ఉంటే తనకి చాలా శాంతిగా అనిపిస్తూ వుంది. ఒక ప్రాణాలు తీసే మారణాయుధం తో ఇలా శాంతిగా అనిపిస్తుందని తను ఎప్పుడూ ఊహించలేదు. ఇంకా ఈ వెపన్ తో ఎంత అవసరం వచ్చినా, తను ఎదుటి మనిషి ప్రాణం తియ్యగలదని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ తనకి తెలుసు, తనకి చాలా నమ్మకం గా వుంది. ఈ రివాల్వర్ తో తను వాడి ప్రాణాలు తీస్తుంది. ఆ రివాల్వర్ అలాగే పట్టుకుని, మళ్ళీ కుర్చీలోకి వచ్చి కూచుంది శకుంతల. 

ఈ రివాల్వర్ గురిపెట్టినప్పుడు వాడి మొహం లో ఎక్స్ప్రెషన్, ఇంకా వాడి గుండెల్లో భయం ఊహించుకుంటూ ఉంటే తనకి చాలా తమాషా గా వుంది. ఎంతకష్టపడి తమని దోచుకున్న డబ్బుతో చీకటి సామ్రాజ్యం నిర్మించుకున్నాడు, దానికి చీఫ్ గా మారాడు. డబ్బంటే వాడికెంతో ప్రాణం, తను నిర్మించుకున్న ఆ చీకటి సామ్రాజ్యం అంటే వాడికెంతో ఇష్టం. చచ్చి పోయి వాటిని కోల్పోవడం వాడు కలలో కూడా అంగీకరించలేడు. వాటికి దూరం అయిపోతున్నానన్న బాధ వాడి మోహంలో చూడడం కన్నా తనకి వేరే ఆనందకరమైన విషయం లేదు. అసలు ఇప్పటివరకూ ఇది వాడిమీద ఉపయోగించకపోవడమే తాను చేసిన పెద్ద తప్పు. వాడినెప్పుడో తను చంపి పారేసివుండాల్సింది.

ఆ రివాల్వర్ ని అలాగే రెండు చేతులతో తన వొళ్ళో పెట్టుకుని కుర్చీలో వెనక్కి వాలింది శకుంతల. ఎంత వద్దనుకున్నా వాడి క్రూరత్వం, వాడు తనని మోసం చేసిన తీరు, తనతో ఆడుకున్న తీరు, వాడు తనతో ఆడిన మాటలు తన మనసులో మెదులుతూనే వున్నాయి.

"నన్ను చంపేయాలని వుంది కదా, ముక్కలుగా కొయ్యాలని వుంది కదా. నీ ప్లేస్ లో నేనుంటే నాకూ అలాగే అనిపిస్తుంది." తనకి ఆయనతో పెళ్ళైన కొత్తలో తనతో ఒకరోజు కామవాంఛని తీర్చుకుంటూ అన్నాడు వాడు. "అందుకని నేను నీకొక అవకాశం ఇస్తున్నా. నేను మీకు సర్వెంట్ గా వున్నప్పుడు నువ్వు నన్నెలాగన్నా ట్రీట్ చెయ్యి. తిట్టు. నీ కక్షన్తా తీర్చుకో. నేనేమనుకోను."

తరువాత తన కామవాంఛని తీర్చుకుని, డ్రెస్ చేసుకుని వెళ్ళిపోబోయేముందు అన్నాడు.

"నువ్వు నన్ను నీ సర్వెంట్ గా వున్నప్పుడు చలపతి అని పిలవకు. ఆ వర్ధన్ వర్మ నన్ను ‘టిబ్బూ’ అని పిలుస్తూ ఉంటాడు. నువ్వూ అలాగే పిలువు."

&&&

"అక్కడ కొంపలు ముట్టుకు పోతూ ఉంటే ఇక్కడ నువ్వు ప్రశాంతం గా కూచున్నావా? అక్కడ నీ కోడలు, నీ కొడుక్కి గతం అంతా గుర్తుచేసే ప్రయత్నం చేస్తూ వుంది. ఆ రోజు తను చూసిన విషయం కూడా గుర్తుకువస్తే ఏమవుతుందో ఆలోచించావా?" భళ్ళుమని తలుపులు తోసుకుని లోపలికివచ్చి, శకుంతల మొహంలోకి చూస్తూ గట్టిగా అరిచాడు చలపతి ఉరఫ్ టిబ్బూ 

ఏమీ మాట్లాడకుండా టిబ్బూ మొహంలోకే చూస్తూ వింటూ వుంది శకుంతల.

"ఇందువల్ల నాకు మాత్రమే ఇబ్బంది అనుకోకు. నీ పరువు కూడా పోతుంది. నువ్వెలాంటి దానివో తెలిసిన మరుక్షణం నీ మొహం మీద ఉమ్మేస్తారు నీ కూతురు, కొడుకు. నిన్నెంతో గౌరవిస్తూన్న నీ కోడలు కూడా నిన్ను అసహ్యించుకుంటుంది." ఆందోళన వుంది టిబ్బూ లో. ముఖ్యంగా తన బండారం బయటపడకూడదనుకుంటూ వున్నాడు.    

చిన్న చిరునవ్వు వచ్చి చేరింది శకుంతల పెదవుల మీదకి. టిబ్బూ ని అలాగే చూస్తూ వుంది.

"ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వాళ్ళని ఆపు. ఇంక నాకు నీ కుటుంబం తో పని కూడా ఏమీ లేదు. కావాల్సినంత సంపాదించుకుని చీఫ్ గా ఎస్టాబ్లిష్ అయ్యాను. నిన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతాను. కానీ ముందది ఆపు." ఆందోళన ఎక్కువైపోతూంది టిబ్బూ లో.

శకుంతల పెదవుల మీద చిరునవ్వు ఇంకొంచెం విస్తరించింది. కానీ మౌనం మాత్రం వీడలేదు.

"కానీ వాళ్ళకి నిజాలు తెలియడం వల్ల నాకేమన్నా డామేజ్ జరిగితే నేను ఊరుకునేది లేదు. మిమ్మల్నందరినీ ముక్కలకింద నరికేస్తాను. నా సొంత మేనల్లుడైన చింటూ నే నాకు నమ్మకద్రోహం చేసాడని చెప్పి చంపి పారేయించాను. వాడు అడిగినంత డబ్బు ఇవ్వలేదని నన్ను మోసం చేసిన వాడిని ఈ భూమ్మీదే లేకుండా చేసేసాను. నీ పిల్లలిద్దరూ అసలు నా పిల్లలు కానే కారని చెప్పేసావుగా. ఇంకా నేను వాళ్ళగురించి ఎందుకు ఆలోచించాలి?"

శకుంతల పెదవుల మీద చిరునవ్వు, ఇంకా ఆమెలో మౌనం అలాగే వున్నాయి.

"ఈ స్థాయి కి రావడానికి నేనెంతో కష్టపడ్డాను. ఎన్నో అవమానాలు భరించాను. ఇందంతా మట్టికొట్టుకు పోతుందంటే నేను తట్టుకోలేను. మన గురించి తెలిసాక, వాళ్ళు మనల్ని వదిలిపెట్టరు. ప్లీజ్ నీ కొడుక్కి ఆ గతం గుర్తుకు రానివ్వకు. వెళ్లి ఎదో ఒకటి చేసి అది ఆపు." మొదటిసారిగా బతిమాలుతున్నట్టుగా అన్నాడు టిబ్బూ.

"నిన్నిలా బాధపడుతూండగా చూడాలని ఎంతకాలం గా అనుకున్నానో. ఆ కోరిక ఇన్నాళ్ళకి తీరింది." మొదటిసారిగా మనస్ఫూర్తిగా నవ్వింది శకుంతల. "ఇప్పటికి నేనాపినా, ఎప్పటికీ నా కోడలిని నేనాపలేను. అలాగే నా కొడుక్కి ఎదో ఒకరోజు అంతా గుర్తుకురాకుండా ఉండదు. అప్పుడేం చేస్తావ్?"

"ఈ లోగా నేనంతా సెటిల్ చేసుకుని దూరంగా వెళ్ళిపోతాను. అప్పుడు నీ వాళ్లందరికీ మనగురించి తెలిసిపోయినా పర్లేదు. చెప్పానుగా నేను కావాల్సినంత సంపాదించుకుని , ఎదగాల్సినంత ఎదిగాను."

మరోసారి ఆనందంగా నవ్వింది శకుంతల. "ఒరేయ్ నీ ఆందోళన చూస్తూంటే నాకు చాలా ఆనందంగా వుంది. నిజం తెలిసి నా కొడుకు, కూతురు నన్నెంత అసహ్యించుకుంటారో అని బాధగా అనిపించడం లేదు."

"నేను చెప్పినట్టుగా చెయ్యకపోతే ఇప్పుడే నీ ప్రాణాలు తీస్తాను." కోపంగా ముందుకు రాబోయాడు టిబ్బూ.

"ఆగు" శకుంతల సెకను లో తనవైపు గురిపెట్టిన రివాల్వర్ ని చూస్తూనే ఆగిపోయాడు టిబ్బూ. "నాకాయన చాలానే నేర్పారు. అందులో ఇది ఉపయోగించడం ఒకటి. నేనిప్పటివరకూ ఇది ఉపయోగించలేదు. కానీ ఐ యామ్ స్యూర్. ఇది గురితప్పకుండా పేల్చగలను. నీలాంటి వెధవని చంపడం లో నాకు చాలా ఆనందం ఉంటుంది."

"అంతగా నేను చేసిన తప్పేమిటి? ఒళ్ళమ్ముకుంటూ బతకాల్సిన నిన్ను మహారాణిని చేసాను. నేను నిన్ను వర్ధన్ వర్మకి భార్యగా చేసివుండకపోతే, ఈ రోజు నీ పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించు." శకుంతల అన్నంత పనీ చెయ్యగలదన్న భయం టిబ్బూ మొహం లో కనిపిస్తూ వుంది.

"ఒరేయ్, ఆ మంచి మనిషిని అలా బాధపెట్టివుండడం కన్నా, ఒక వేశ్యగా బతకడానికే నేను ఎక్కువ ఇష్టపడతాను. ఇంకాసేపట్లో నా కొడుకు, కూతురు నిజం తెలుసుకుని నరకం అనుభవించడానికి కారణం ఏంట్రా? నేనాయనకు భార్యని కావడం కాదా? దీనికంతటికీ కారణం నువ్వు కాదా?" తన రివాల్వర్ గురిని అలాగే ఉంచి కుర్చీలోనుండి లేచి నిలబడింది శకుంతల.

"తొందరపడకు. నన్ను చంపేస్తే సమస్య తీరిపోతుందనుకోకు. తెలియాల్సిన నిజం వాళ్ళకి ఎప్పుడోఅప్పుడు ఎలాగూ తెలుస్తుంది నేనున్నా, లేకపోయినా.  ఇంకెప్పుడూ నీకు కనిపించను. చాలా దూరంగా వెళ్ళిపోతాను. దయచేసి నన్ను చంపకు." టిబ్బూ మొహం లో చావు భయం చాలా స్పష్టంగా వుంది.

మరోసారి ఆనందంతో విరగబడి నవ్వింది శకుంతల. "నీలో చావు భయం చూస్తూవుంటే నాకు చాలా ఆనందం గా ఉందిరా. ఎంత ఆడుకున్నావు నువ్వు నాతో? నా అరవయ్యేళ్ల వయసులో కూడా నాతో నీ కామతృష్ణ ని తీర్చుకున్నావు కదా." సడన్ గా శకుంతల మొహం కోపం తో నిండింది.

అకస్మాత్తుగా శకుంతల మీదకి రాబోయాడు టిబ్బూ ఆమె చేతిలో రివాల్వర్ లాక్కోడానికి. అది ఊహించినట్టుగా ట్రిగ్గర్ నొక్కింది శకుంతల. బులెట్ తేడా లేకుండా టిబ్బూ గుండెల్లోంచి దూసుకుపోయింది. గుండెల్ని రెండు చేతులతో పట్టుకుని కుప్పకూలిపోయాడు టిబ్బూ.

"ఎప్పుడో చేయాల్సిన పని చాలా ఆలస్యంగా చేసానురా." అవసరం లేదని తెలిసినా టిబ్బూ గుండెలవైపు గురిపెట్టి మరోమూడుసార్లు రివాల్వర్ పేల్చింది శకుంతల.

"ఇందులో ఇంకా రెండు గుళ్ళు వున్నాయి. నిజానికి ఒకటి చాలు నాకు." రివాల్వర్ తన తలకి గురిపెట్టుకుంటూ అనుకుంది శకుంతల.

అప్పుడు రివాల్వర్ ని ఒకసారి పేల్చిన తరువాత, రెండవసారి పేల్చాల్సిన అవసరం కానీ, అవకాశం కానీ రాలేదు ఆవిడకి. 

&&&

పదిహేను రోజుల సమయం గడిచింది. ఆ రోజు ఆ ఇంట్లో హాల్లో సమీర, అరవింద్, సుస్మిత, శరత్, తనూజ, ఇంకా అభినవ్ కుర్చీల్లో కూచుని మాట్లాడుకుంటూ వున్నారు. 

అక్కడ బంగ్లా లోకి ప్రవేశించాక, శకుంతల ఇంకా టిబ్బూ ల సెవాల్ని చూసాక, జరిగినది అర్ధమైంది అందరికీ. ఓపెన్ చేసిన డ్రా లోనుండి శకుంతల రాసిన బుక్ తీసి చదివాక, ఆవిడ జీవిత చరిత్ర, అసలు విషయమేమిటో, ఆవిడ అంతకాలం ఎంత నరకయాతన అనుభవించిందో బోధపడింది. ఆ పుస్తకం లో ఆఖర్న ఆవిడ రాసిన "అరవింద్ , సుస్మితా. మీరిద్దరూ నన్ను క్షమించొద్దు. నేను మీకు చేసిన ద్రోహానికి మీరు నన్ను జీవితాంతం అసహ్యించుకుంటూనే వుండండి. లేకపోతె నాకు శాంతి ఉండదు."

"అదొక్కటేనమ్మా నేను చేయలేనిది. అసలు దీనంతటిలో నీ పొరపాటు ఏముంది?" కళ్ళవెంట నీళ్లు కారిపోతూవుంటే అన్నాడు అరవింద్.

ఇక్కడ ఇప్పుడు సమావేశమై మరోసారి ఆరోజు మాట్లాడుకున్న విషయాలే మాట్లాడుకుంటూవున్నారు.

"అన్నయ్య చెప్పినది నిజం. ఇందులో మామ్ తప్పేమీ లేదు." సుస్మిత అంది.

"నీ మామ్ ఒక అమాయకురాలు. ఆ వెధవ చలపతి ఆవిడని యూజ్ చేసుకుని అలా  అడ్వాంటేజ్ తీసుకున్నాడు. ఎంతమంది చలపతి లాంటి వెధవలు నీ మామ్ లాంటి అమాయకపు ఆడవాళ్ళని పావులుగా వాడుకోవడం లేదు? నాక్కూడా తనలో ఎలాంటి పొరపాటు కానీ, తప్పు కానీ కనిపించడం లేదు." సమీర అంది.  

"కానీ టిబ్బూ వెధవ ఎంత గొప్పగా నటించేవాడు? ఇంతకాలం మాకు అనుమానం రాకుండా అలా ఉండగలిగాడంటే, డాడ్ ని వాడు అలా మోసం చేయగలగడం లో ఆశ్చర్యం ఏముంది? మమ్మల్ని దోచుకుని చీఫ్ గా ఎదిగాడా? మామ్ వాడికి తగిన శిక్షనే వేసింది." సుస్మిత కోపంగా అంది.

"మనం అంతగా నమ్మిన టిబ్బూ అలాంటివాడని తేలిన తరువాత, చింటూ అలా చెయ్యడం లో ఆశ్చర్యం లేదు. నా మామ్ ఆ టిబ్బూ తో అలా చెయ్యడం అసలు వూహించగలిగిన విషయమేనా? నాకు మతిపోవడం లో ఆశ్చర్యం ఏముంది?" అరవింద్ అన్నాడు.

"అరవింద్ ప్లీజ్. ఇంక విషయాల గురించి ఆ ఆలోచించొద్దు. నువ్వూ, సుస్మిత మళ్ళీ నార్మల్ లైవ్స్ గడపగలిగినప్పుడే నీ మామ్ అండ్ డాడ్ కి శాంతి ఉండేది. అంతేకాదు మమూత్ ఇండస్ట్రీస్ బాధ్యత నీ మీద వుంది. అది ఎప్పుడూ చక్కగా నడవాలన్నది నీ మామ్ అండ్ డాడ్ ల కోరిక." సమీర అంది.

"అంతే కాదు. నువ్వూ మా ఇద్దరి పెళ్లి జరిపిస్తానని మాట ఇచ్చావ్. మర్చిపోయావా?" సమీర మొహం లోకి చూస్తూ అడిగింది తనూజ.

"అరె, ఈ హడావిడి లో పడి నిజంగానే మర్చిపోయాను." సమీర నవ్వింది. "కంగారుపడకు. నేను అరవింద్ దగ్గరుండి మరీ మీ పెళ్లి జరిపిస్తాం."

"మీరిద్దరూ జరిపించాల్సిన పెళ్లి ఇంకొకటి వుంది. నాదీ, సుస్మిత ది." శరత్ అన్నాడు.

"బ్రో ఇప్పటికైనా మేమిద్దరం ప్రేమికులమని, మా ఇద్దరి పెళ్లి జరిపిస్తానని నువ్వు ఇచ్చిన మాట నీకు గుర్తుకు వచ్చిందా?" అరవింద్ మొహం లోకి చూస్తూ అడిగింది సుస్మిత.

"ఆ గుర్తుకు వచ్చింది. మీ పెళ్లి తనూజ, అభినవ్ ల పెళ్లితో కలిపి చేసేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నా." అరవింద్ అన్నాడు.

"మేమిద్దరం రిజిస్టర్ ఆఫీస్ లో చాలా సింపుల్ గా పెళ్ళిచేసుకోవాలని ఆలోచిస్తున్నాం. మరి సుస్మిత, శరత్ అలాంటి సింపుల్ పెళ్ళికి అంగీకరిస్తారా?" అభినవ్ అడిగాడు.

"అంగీకరిస్తాం. ఆడంబరంగా పెళ్లంటే కొంతకాలం ఓపికపట్టాలి. అలా ఆగే ఓపిక మాకు లేదు." సుస్మిత అంది.

"దేనికి ఓపిక పట్టాలి? పెళ్లితో సంభందం లేకుండా జరగాల్సినవి, జరిగిపోతున్నాయికదా." శరత్ అలా అనగానే అక్కడ అందరూ నవ్వారు, సుస్మిత శరత్ వైపు కోపంగా చూస్తూవుంటే.

అక్కడ అప్పుడు వాళ్ళందరూ అలా చాలా సేపు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వున్నారు, ఇంక తమ జీవితాల్లో ఆనందం మాత్రమే ఉంటుందనట్టుగా         

శుభం

(ఇక్కడితో ఈ నవల పూర్తయింది. మీకు నచ్చిందనే ఆశిస్తున్నా. మీకు నచ్చే మరో నవలతో మళ్ళీ కలుస్తా. ఈ నవలకి రేటింగ్ ఇచ్చి రివ్యూ రాయడం మరచిపోవద్దు)