వెన్నెల మాటలకు ముగ్ధుడైన కిషోర్, ఆమె వైపు ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు. ప్రకృతిలో ఇన్ని రహస్యాలు, ఇంతటి నిశ్శబ్దమైన ప్రేమ దాగి ఉన్నాయని ఆమె చెప్పే వరకు అతనికి తెలియదు. "కిషోర్ గారు.. కిషోర్ గారు!" అని వెన్నెల పిలిచేసరికి స్పృహలోకి వచ్చిన అతను, "ఇంత చక్కని విషయాలు చెప్పిన నీకు ప్రతిగా ఏమివ్వాలో ఆలోచిస్తున్నాను వెన్నెలా" అన్నాడు. అప్పుడే అతని చూపు ఆ అరుదైన నీలం రంగు గులాబీ మొక్క మీద పడింది.వెంటనే ఆ చెట్టునే తీసుకొని వచ్చి వెన్నెల చేతిలో పెట్టాడు. "ఇదంటే నీకు ప్రాణం కదా.. మరి నాకెందుకు ఇస్తున్నారు?" అని వెన్నెల ఆశ్చర్యంగా అడిగింది. కిషోర్ పెదవులపై ఒక అర్థవంతమైన నవ్వు చిగురించింది. "నా ప్రాణాన్నే నీకు ఇస్తున్నాను అనుకో.. కనీసం నా ప్రాణాన్నైనా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోలేవా?" అన్నాడు. ఆ మాటల్లోని నిగూఢమైన ప్రేమను అర్థం చేసుకున్న వెన్నెల, సిగ్గుతో తలవంచి "చిత్తం!" అంటూ మురిపెంగా నవ్వింది. ఆ ఇద్దరి నవ్వులని చూసి ఆ తోటలోని గులాబీలన్నీ గాలికి తలలూపుతూ కలిసి నవ్వుతున్నట్టుగా అనిపించింది.రోజులు చాలా అందంగా, ప్రశాంతంగా సాగుతున్నాయి. ఒకప్పుడు వెన్నెలను 'పిచ్చిది' అని హేళన చేసిన నోళ్లే ఇప్పుడు 'అక్కా!' అంటూ ఆత్మీయంగా పిలుస్తున్నాయి. వెన్నెల నిస్వార్థమైన మంచితనం ఊరంతా పాకింది. కానీ, కాలం ఆమెను మళ్ళీ పరీక్షించాలనుకుందేమో! ఆ రోజు ఉదయం సూర్యుడు ఎప్పటిలా హాయిగా కాకుండా, అగ్నిగోళంలా మండిపోతూ ఉదయించాడు. వెన్నెల, కిషోర్ జీవితాల్లో ఏదో పెనుమార్పు జరగబోతోంది అన్నట్టుగా ఆ వాతావరణం భీతి గొల్పుతోంది
వెన్నెల ఎప్పటిలాగే తోటలోకి వెళ్లి మొక్కలకు నీళ్లు పోస్తూ వాటిని పలకరించింది. కానీ, ఆ మూగ జీవాలు ఈరోజు వెన్నెలను చూసి విచారంగా తలలు వాల్చుకున్నట్టు అనిపించాయి. పక్షుల కిలకిలారావాలు మూగబోయాయి. ఏదో విపత్తు పొంచి ఉందన్న సత్యాన్ని ప్రకృతి ముందే పసిగట్టిందా అన్నట్టుగా ఆమె మనసు కీడు శంకిస్తోంది. వెన్నెలకు ఏం జరుగుతుందో అర్థం కాకపోయినా, ఆమె అంతరాత్మ మాత్రం ఏదో జరగబోతోందని పదే పదే హెచ్చరిస్తోంది. ఆ నీలం రంగు గులాబీ రేకులు కూడా మెల్లగా రాలిపోతుంటే, వెన్నెల గుండెలో తెలియని అలజడి మొదలైంది.
మనసు కీడు శంకిస్తున్నా, కిషోర్‌ను చూడాలన్న ఆత్రుతలో వెన్నెల అవేమీ పట్టించుకోలేదు. తోటలోని పువ్వుల మౌనం ఆమెకు ఏదో విపత్తు గురించి హెచ్చరిస్తున్నా, ఆమె వేగంగా కిషోర్ ఇంటి వైపు అడుగులు వేసింది. గుమ్మం దగ్గర జానకమ్మ, రాజు ఎదురుచూపులు ఆమె రాకతో ముగిశాయి. "రామ్మా వెన్నెలా! నీ కోసమే చూస్తున్నాం. కిషోర్ ప్రవర్తన ఈరోజు అస్సలు బాలేదు. రాత్రి ఒక ఫోన్ వచ్చాక వాడు పూర్తిగా మౌనంలోకి వెళ్ళిపోయాడు. పొద్దున్న చూస్తే మమ్మల్ని కూడా 'ఎవరు మీరు?' అన్నట్టు ఒక శూన్యమైన చూపు చూస్తున్నాడు. ఒక్కసారి నువ్వైనా చూడమ్మా" అని జానకమ్మ కన్నీళ్ల పర్యంతమైంది.జానకమ్మకు కిషోర్ అంటే ఎంత ప్రాణమో వెన్నెలకు తెలుసు. కన్నతల్లి కాకపోయినా, చిన్నప్పటి నుండి సొంత కొడుకులా చూసుకున్న ఆ తల్లి పడుతున్న ఆవేదన చూసి వెన్నెల మనసు విలవిలలాడింది. కిషోర్ గతంలో తనతో చెప్పిన మాటలు ఆమె మదిలో మెదిలాయి. గుండె నిబ్బరం చేసుకుని, కిషోర్‌ను ఎలాగైనా మామూలు మనిషిని చేయాలన్న పట్టుదలతో ఆమె లోపలికి అడుగుపెట్టింది
వేర్వేరు తల్లులకు పుట్టినా, సొంత అన్నదమ్ముల్లా మెలిగే రాజు, కిషోర్‌ల బంధాన్ని చూసి వెన్నెల ఎప్పుడూ ముచ్చటపడేది. కానీ, ఇప్పుడు కిషోర్ పరిస్థితి విని ఆమె కంగారు పడిపోయింది. పరుగున లోపలికి వెళ్లి "కిషోర్ గారు!" అని ఆర్తిగా పిలిచింది. కిషోర్ మెల్లగా తలెత్తి ఆమె వైపు చూశాడు. అతని కళ్లలో నీరసం, ఒక రకమైన అపరాధ భావం కనిపిస్తున్నాయి. "ఆ.. వెన్నెలా!" అని అతను చాలా నెమ్మదిగా పలికాడు. అతను తనను గుర్తుపట్టడం చూసి వెన్నెలకు కొంత ఉపశమనం కలిగినా, రాజు ఎందుకు అలా అన్నాడో అర్థం కాక అయోమయంగా అతని వైపు చూసింది. రా వెన్నెల తోటలోకి వెళ్దాం అన్నాడు కిషోర్. అప్పుడు జానకి గారు ఇంటి కి వచ్చిన వాళ్ళకు కనీసం టీ, కాఫీ కూడా ఇవ్వనివ్వవ ఏమిటి నువ్వు వెళ్ళు తను వస్తుంది అని కిషోర్ ను ముందే తోట లోకి పంపించేశారు.
కిషోర్ నెమ్మదిగా తోటలోకి వెళ్ళాక, రాజు ఆమెను దగ్గరకు పిలిచి అసలు విషయం చెప్పాడు. "నిన్న ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయ్యాడని కాలేజీ నుండి ఫోన్ వచ్చింది వెన్నెలా. అప్పటి నుండి వాడికి పాత పిచ్చి మళ్ళీ మొదలైంది. తను అందరికంటే వెనుకబడిపోయానన్న భయం వాడిని ఎవరితోనూ మాట్లాడనివ్వడం లేదు. అన్నం ముట్టడం లేదు. నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాం కానీ రాత్రిపూట ఇబ్బంది అని ఆగాం" అని రాజు ఆవేదనగా చెప్పాడు.అది విన్న వెన్నెల కళ్లలో ఒక దృఢ నిశ్చయం మెరిసింది. "నేను చూసుకుంటాను అన్నయ్య.. మీరు దిగులు పడకండి. కిషోర్ గారికి కావాల్సింది ర్యాంకులు కాదు, తనను తాను ప్రేమించుకోవడం" అని ధైర్యం చెప్పింది. కిషోర్ మనసులో గడ్డకట్టుకుపోయిన ఆ చదువు ఒత్తిడిని, ఓటమి భయాన్ని తన స్నేహంతో కరిగించగలనన్న నమ్మకం ఆమె మాటల్లో ధ్వనించింది.