Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

అసంపూర్ణ కావ్యం - 9

బయట ప్రపంచంలో శారదమ్మ వెన్నెల కోసం కన్నీరు మున్నీరవుతుంటే, వెన్నెల మాత్రం తన ఊహల పల్లకిలో ఆ అందమైన ప్రపంచం వైపు ప్రయాణిస్తోంది. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్న వెన్నెలకు కిషోర్ గతంలో అన్న ఆ చిలిపి మాటలు గుర్తొచ్చాయి. ఆ పాత జ్ఞాపకం గుర్తొచ్చి వెన్నెల పెదవులపై ఒక సన్నని, మౌనమైన నవ్వు మెరిసింది. కానీ బయట లోకం మాత్రం కన్నీటితో నిండి ఉంది. పదిహేను రోజులు గడిచినా జ్వరం తగ్గలేదు, వెన్నెలలో చలనం లేదు. "నన్నూ వదిలేసి వెళ్ళిపోతావా అమ్మా?" అని శారదమ్మ లోలోపల కుమిలిపోతోంది. తన భర్తను కోల్పోయిన ఆ తల్లికి, ఇప్పుడు వెన్నెల ఒక్కటే సర్వస్వం. తన దుఃఖాన్ని పైకి కనిపించకుండా దాచుకుంటూ, కూతురి నుదుటిపై చేయి వేసి "తగ్గిపోతుందిలే అమ్మా, ఏం భయం లేదు" అని ధైర్యం చెబుతోంది. కానీ శారద కు ఎవరు దైర్యం చెపుతారు!  లోలోపల తన కూతురిని ఎక్కడ కోల్పోతానో అన్న భయం ఆమెను నిలువునా దహించివేస్తోంది.
వెన్నెల కళ్ళు తెరవదు, శారదమ్మ ఆశ చావదు.. 
ఏదో రోజు తన బిడ్డ ముందులా గా ఉంటుంది అని మళ్ళీ తన మాటలతో , నవ్వుతో ఇల్లు నవ్వుతో నిండిపోతుంది అని తల్లి ఎంత గానో ఎదురు చూస్తుంది.
కాలం మాత్రం నిర్దయగా గడిచిపోతోంది. మరుసటి రోజు ఉదయం శారదమ్మ ఎప్పటిలాగే వెన్నెలను పలకరించడానికి వెళ్ళింది. "వెన్నెలా.. అమ్మ వెన్నెలా! లేవమ్మా.. పొద్దు పోయింది" అని పిలిచినా, ఆ పిలుపుకు అటువైపు నుండి ఉలుకు లేదు, పలుకు లేదు. అదేమిటి వెన్నెల కంటితో సైగ చేసేది ఇప్పుడు అది కూడా లేదు అని భయం భయంతో వణుకుతున్న చేతులతో కూతురి ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది శారదమ్మ.. శ్వాస ఆగిపోయింది. ఆ తల్లి ప్రాణం ఒక్కసారిగా నిశ్చలమైపోయింది. పక్కింటి ఆవిడ వెన్నెలకు ఎలా ఉందో చూడ్డానికి వచ్చి "ఏమైంది వదినా?" అలా ఉలుకు పలుకు లేకుండా నిల్చుని ఉన్నావు అని ఒక ఊపు ఊపేసరికి, శారదమ్మకు స్పృహ వచ్చింది.
"అమ్మ వెన్నెలా!" అంటూ గట్టిగా అరిచింది. "నన్ను ఇలా అన్యాయంగా వదిలేసి వెళ్ళడానికి నీకు మనసెలా ఒప్పిందమ్మా.. ఇది నీకు న్యాయమేనా?" అని ఆమె గుండెలు పగిలేలా ఏడ్చిన తీరు ఆ ఊరిని కూడా శోకసంద్రంలో ముంచెత్తింది. అక్కడ ఉన్నవాళ్ళు కూడా వెన్నెల మంచితనానికి వాళ్ళకు కూడా కన్నీరు ఆగడం లేదు కన్నీరు మున్నీరుగా వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఈ లోకంలోని మనుషుల కంటే, తన జ్ఞాపకాల్లోని కిషోరే ఆమెకు మిన్న! "అమ్మ వెన్నెల నిన్ను పల్లకిలో పెళ్ళికూతురిలా ముస్తాబు చేసి ఊరేగించుకోవాలి అనుకున్నాను తల్లి కానీ... కానీ... పాడే మీద తీసుకొని వెళ్ళేలా చేశావు ఏమిటమ్మ! పట్టుచీర కట్టుకొని ముత్తైదువులా మెరిసిపోవాల్సిన దానివి తెల్ల గుడ్డ కట్టుకుని శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతావమ్మా! ఇది నీకు న్యాయమేనా? ఇప్పుడు నేను ఎవరికోసం బతకాలి వెన్నెల నువ్వే చెప్పు వెన్నెల అమ్మ వెన్నెల" అని ఆ తల్లి గొంతు పగిలేలా వేస్తున్న కేకలు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్టుచేమలను సైతం వణికిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రతి కన్ను కన్నీరుమున్నీరవుతోంది. వెన్నెల తన ఊహల్లో సృష్టించుకున్న ఆ స్వార్థం లేని లోకానికే శాశ్వతంగా వెళ్ళిపోయింది.
వెన్నెల శరీరం లోకానికి దూరమైనా, ఆమె ఆత్మ మాత్రం తను నిర్మించుకున్న ఆ అందమైన ప్రపంచంలోనే ఉండిపోయింది. అక్కడ ఆమె మళ్ళీ మొక్కలతో మాట్లాడుతోంది, నవ్వుతూ నీళ్లు పోస్తోంది. ఆ జలపాతం, చల్లటి గాలి ఆమెను ఒక్కటే అడుగుతున్నాయి—"కిషోర్ ఎక్కడ?" అని. కానీ వెన్నెల దగ్గర సమాధానం లేదు. ఆమె మౌనంగా ఆ శిలల దగ్గర నిలబడి, కిషోర్ ఎప్పటికైనా తన లోకానికి వస్తాడని కళ్ళల్లో ఆశతో ఎదురుచూస్తూనే ఉంది. ఆమె లేని లోకంలో గాలి ఆగిపోయింది, మొక్కలు జీవం కోల్పోయాయి.. వెన్నెల విడిచిన ఆ 'నీలం గులాబీ' జ్ఞాపకం మాత్రం గాలిలో రెపరెపలాడుతూనే ఉంది. వెన్నెల కావ్యం అసంపూర్ణంగానే నిలిచిపోయినా, ఆ స్వచ్ఛమైన స్నేహం మాత్రం కాలం ఉన్నంత కాలం ఆ తోటలోని పరిమళమై నిలిచిపోతుంది.
ముగింపు సందేశం:
"లోకమంతా వినిపించే అరుపు కంటే.. ఎవరికీ వినిపించని మౌనం చాలా భయంకరమైనది. వెన్నెల కేవలం ఒక పాత్ర కాదు.. మన చుట్టూ ఉన్న ఎంతోమంది అమ్మాయిల నిశ్శబ్ద ఆక్రందన. ఎదుటివారు ఏమనుకుంటారో అన్న భయంతో, తమ మనసులోని బాధను సమాధి చేసుకుని, లోలోపలే కుమిలిపోతూ ఆరిపోతున్న ఎన్నో దీపాల ప్రతిరూపం ఆమె. అమ్మానాన్నలు గమనించండి.. మీ పిల్లల నిశ్శబ్దం వెనుక ఏదో శూన్యం దాగి ఉందేమో చూడండి. స్నేహితులారా.. పలకరింపుల వెనుక ఉన్న పగుళ్లను గుర్తించండి. ప్రాణం విడిచి 'ప్రకృతి'లో కలిసిపోవడం పరిష్కారం కాదు.. ప్రాణంతో ఉండి మనసులోని బాధను 'ప్రకటించడం' ధైర్యం. గుర్తుంచుకోండి.. మనిషి వెళ్ళిపోయాక ఏడ్చే వేయి కన్నీటి చుక్కల కంటే, మనసు విలవిలలాడుతున్నప్పుడు పలకరించే ఒక్క ఆత్మీయ పదం ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. మౌనం మరణానికి దారి కాకూడదు.. మాట మనిషిని బతికించే మందు కావాలి!"
శుభం