Read My Heart is for You. - 1 by Kotapati Niharika in Telugu Love Stories | మాతృభారతి

Featured Books
కేటగిరీలు
షేర్ చేయబడినవి

నా మనసు నీ కోసం - 1

మన కథానాయిక అన్విత, ఆమెకు చదువంటే ప్రాణం, అదే ఆమె జీవితానికి ఆనందం. ఒక చిన్న గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తుంది. ఆమె పాఠాలు చెప్పే విధానం చాలా ఆసక్తికరంగా, సరళంగా ఉంటుంది. పిల్లలు ఆమెను ఎంతగానో ఇష్టపడతారు. అందుకే ఆమెకు "ఉత్తమ ఉపాధ్యాయురాలు" అవార్డు కూడా వచ్చింది.
అన్విత తల్లి సునీతకు తన పెద్ద కూతురిని పెళ్లి చేసి అత్తారింటికి పంపించేయాలని తొందర. ఎందుకంటే, ఆమెకు స్వాతి అనే మరో కూతురు కూడా ఉంది, ప్రస్తుతం ఇంటర్ చదువుతోంది. అన్విత పెళ్లి అయితేనే స్వాతి భవిష్యత్తు గురించి ఆలోచించడం సులభం అవుతుందని సునీత నమ్మకం. అన్విత మాత్రం తన టీచర్ వృత్తిని బాగా ఇష్టపడుతుంది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కానీ తల్లి నిరంతరం సంబంధాలు చూడటం వల్ల కొద్దిగా ఒత్తిడికి లోనవుతుంది.
ఇక మన కథానాయకుడు రౌద్రవర్మ. అతని పేరులోనే ఉంది అతని స్వభావం – అతనికి కోపం, ఆటిట్యూడ్, పొగరు చాలా ఎక్కువ. ఈ స్వభావానికి ఒక బలమైన కారణం ఉంది. చిన్నప్పుడు తన కళ్ల ముందే తండ్రి స్నేహితుల మోసం వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సంఘటన రౌద్ర మనసులో లోతైన గాయాన్ని మిగిల్చింది. అప్పటి నుండి, ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదని నిర్ణయించుకున్నాడు.
ఆ గాయంతోనే అతను వ్యాపార ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఒక చిన్న కంపెనీలో చేరి వ్యాపార రహస్యాలు, మెళకువలు అన్నీ నేర్చుకున్నాడు. ఆ తర్వాత తన సొంత కంపెనీని ప్రారంభించి, అతి తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నాడు. రౌద్రవర్మకు తన తల్లి, తమ్ముడు, చెల్లి అంటే చాలా ఇష్టం. వారి సంతోషం కోసమే ఇదంతా చేశాడు. తన కుటుంబానికి ఏ కష్టం రాకూడదని, వారిని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచాలని అతను కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాడు.
అనుకోని చూపులు
అన్విత స్కూల్‌కి వెళ్ళడానికి సిద్ధమవుతోంది. అప్పుడే ఆమె తల్లి గదిలోకి వచ్చి, "అన్వితా, ఈరోజు పెళ్ళిచూపులు ఉన్నాయి. కొంచెం త్వరగా రామ్మా," అంది.
"అమ్మా, నేనిప్పుడే పెళ్లి చేసుకోనని నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వు అసలు నా మాట వినవు కదూ?" అన్విత చిరాకు పడింది.
"అన్వితా, నీకు నేను చెప్పేదేమీ అర్థం కాదు. నీ తర్వాత నీ చెల్లి ఉంది, తన భవిష్యత్తు గురించి కూడా మనం ఆలోచించాలి కదూ? ఈరోజు చాలా మంచి సంబంధం, ఒక్కసారి వచ్చి చూడు. సాయంత్రం త్వరగా రా," తల్లి బతిమాలింది.
"ఆ సరే అమ్మా, చూస్తాను," అంది అన్విత కాస్త నీరసంగా.
ఆలోచిస్తూనే అన్విత నడుచుకుంటూ స్కూల్‌కి బయలుదేరింది. కొంతమంది పిల్లలు ఆమెను చూసి, "హాయ్ మేడమ్, గుడ్‌ మార్నింగ్!" అని పలకరించారు. ఆమె టీచర్స్ రూమ్‌లోకి వెళ్ళింది. అక్కడ ఆమె బెస్ట్‌ఫ్రెండ్ పుష్ప, సహోద్యోగి కుమార్ ఉన్నారు. కుమార్ చాలా కాలంగా అన్వితను ప్రేమిస్తున్నాడు, కానీ ఆ విషయం అన్వితకు తెలియదు. తన మనసులోని మాట చెప్పాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తున్నాడు. అసలు ఏం జరుగుతుందో చూడాలి!
అందరూ తమ క్లాస్‌రూమ్‌లకి టీచింగ్ కోసం వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత అటెండర్ వచ్చి, "మేడమ్, మిమ్మల్ని ప్రిన్సిపాల్ పిలుస్తున్నారు," అని చెప్పాడు.
"ఆ, వస్తున్నాను," అని అన్విత ప్రిన్సిపాల్ రూమ్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ ఆమె రౌద్రవర్మను చూసింది. వాళ్ళ కళ్ళు ఒకటయ్యాయి. ఇద్దరిలో ఏదో తెలియని స్పందన కలిగింది.
"మేడమ్, ప్రిన్సిపాల్ మిమ్మల్ని పిలిచారు," అటెండర్ మళ్ళీ గుర్తుచేశాడు.
ప్రిన్సిపాల్, "స్కూల్ వార్షికోత్సవ వేడుకల బాధ్యత అంతా మీరే చూసుకోవాలి. మీకు ఓకే కదా?" అని అడిగారు.
"ఓకే మేడమ్," అని అన్విత వెనక్కి తిరుగుతుంటే, ఆమెకు కొన్ని మాటలు వినిపించాయి.
"ఈ విలేజ్‌కి వచ్చి మరి ఇంత డొనేషన్ ఇస్తున్నారు. చాలా థాంక్స్ వర్మ గారూ. మీలాంటి వాళ్ళ వల్ల స్కూల్ డెవలప్‌మెంట్‌కి, పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది," అని ప్రిన్సిపాల్ మాట్లాడుతుండగా అన్విత విని అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
"మేడమ్, మీరు అలా అనకండి. మా నాన్నగారు చదివిన స్కూల్ ఇది. నేను సహాయం చేయకుండా ఎలా ఉంటాను? ఇక ఉంటాను మేడమ్, మా ఫ్యామిలీ అంతా ఫంక్షన్‌కి అటెండ్ అవుతాం," అని చెప్పి రౌద్రవర్మ బయలుదేరాడు. బయట ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకుంటున్నారు. అప్పుడు అన్విత వాళ్ళిద్దరితో మాట్లాడి, వాళ్ళని తిరిగి ఫ్రెండ్స్‌గా ఎలా చేస్తుందో అదంతా రౌద్రవర్మ చూస్తాడు. ఆమెను చూసి మెస్మరైజ్ అవుతాడు. సమయం అవుతోందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
రౌద్రవర్మ తన ఆఫీస్ క్యాబిన్ రూమ్‌లోకి తిరిగి వెళ్లాడు. వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్ (PA)ని పిలిచి, "ఈరోజు ఏమైనా మీటింగ్‌లు ఉన్నాయా?" అని అడిగాడు.
"అవును సార్," అని ఆమె రోజు షెడ్యూల్ వివరించింది.
"ఎల్లుండి జరిగే మీటింగ్‌లన్నీ క్యాన్సిల్ చేయండి. నాకు వేరే ముఖ్యమైన పని ఉంది," అన్నాడు రౌద్రవర్మ.
"సరే సార్," అని చెప్పి PA వెళ్ళిపోయింది.
అప్పుడే వాళ్ళ అమ్మ రేవతి గారు అక్కడికి వచ్చింది. "ఎందుకమ్మా నువ్వు ఇక్కడిదాకా రావడం? నేను వస్తాగా ఇంటికి," అన్నాడు రౌద్రవర్మ ఆశ్చర్యంగా.
"నువ్వు అలాగే అంటావు చిన్న. పొద్దున్న కూడా సరిగ్గా తినమన్నా తినలేదు కదా? ఏమి తినకుండా ఉంటే నేను ఎలా ఉంటానురా?" రేవతి ఆందోళనగా అంది.
"ఇక్కడ క్యాంటీన్ ఉంది కదా అమ్మా. నువ్వు ఎందుకు శ్రమపడటం? నేను ఇక్కడే తినేస్తాను కదా," అన్నాడు రౌద్ర.
"నువ్వు అలానే అంటావు, తినవు. నాకు తెలుసు నీ గురించి. అందుకే తెచ్చా," అంది రేవతి తన చేతిలోని టిఫిన్ బాక్స్ చూపిస్తూ.
"సరే, నువ్వు కూడా రా అమ్మా. మనం ఇద్దరం కలిసే తిందాం," అని రౌద్రవర్మ ప్రేమగా చెప్పాడు.
"సరే," అని చెప్పి ఇద్దరూ కలిసి భోజనం చేశారు. భోజనం అయ్యాక, "ఓకే, మా డ్రైవర్‌ని పిలుస్తా. నిన్ను తీసుకెళ్తాడు," అన్నాడు.
"సరే కానీ చిన్న, నీకు పెళ్లి చేయాలని ఉంది. సంబంధాలు చూస్తున్నాను, ఓకేనా?" అని రేవతి అడిగింది.
అప్పుడే రౌద్రవర్మకు అన్విత గుర్తుకొచ్చింది. పెదవులపై ఒక చిరునవ్వు మెరిసింది.
"ఎందుకురా నవ్వుతున్నావు? ఎవరినైనా ప్రేమిస్తున్నావంటే చెప్పు. నాకు కూడా కొంచెం శ్రమ తగ్గుతుంది," అంది రేవతి సరదాగా.
"అదేం లేదు అమ్మా. ఇప్పుడే వద్దు. మా చెల్లి రమ్యకు పెళ్లయ్యాక చేసుకుంటా," అన్నాడు రౌద్ర.
"రమ్య ఇంకా చదువుకుంటోంది కదరా?" అంది రేవతి.
"అవును అమ్మా. తన చదువు అయిపోని. అప్పుడు చేద్దాం పెళ్లి," అన్నాడు రౌద్ర.
"ఇంకా చాలా టైమ్ పడుతుంది కదరా చిన్న. తర్వాత చెల్లిది, ముందు నీది. నాన్న బతికి ఉన్నా ఇదే అనేవాడు. ఆలోచించు చిన్న. సరే, నేను వెళ్తున్నాను," అంది రేవతి.
"సరే అమ్మా," అన్నాడు రౌద్ర.
"జాగ్రత్త చిన్న. సాయంత్రం త్వరగా రా," అని రేవతి చెప్పి బయలుదేరింది.
అదే సమయంలో అన్విత ఇంట్లో...
"త్వరగా రెడీ అవ్వు అన్విత. వాళ్ళు వచ్చే టైమ్ అవుతుంది," సునీత కంగారుగా అన్వితను తొందర పెట్టింది.
"అవుతున్నాను అమ్మా. వచ్చిన వాళ్ళు మనం లేమని ఎక్కడికీ వెళ్ళరు కదా? ఇంకెందుకు అంత కంగారు?" అన్విత శాంతంగా అంది.
"నువ్వు అలానే అంటావు. నా కంగారు నీకేం తెలుస్తుంది!" సునీత నిట్టూర్చింది.
"అక్కా, నువ్వు భలే ఉన్నావ్ తెలుసా," అంటూ స్వాతి (అన్విత చెల్లి) నవ్వుతూ వచ్చింది. అన్విత పెదవులపై చిరునవ్వు మెరిసింది.
"నువ్వు ఎందుకు వచ్చావు స్వాతి? నిన్ను మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నా కదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు?" సునీత కోపంగా అడిగింది.
"ఎందుకు మా అలా అంటున్నావు? ఉండనీ, తనేం చేసింది?" అంటుంది అన్విత.
"నీకేం తెలుసు? నువ్వు వెళ్ళు స్వాతి," సునీత గట్టిగా అంది.
"నేనేం చేశాను ! నేను ఇక్కడే ఉంటాను," అంది స్వాతి పంతంగా.
"వెళ్ళు! లేకపోతే ఒక్కటి ఇస్తా!" సునీత బెదిరించింది.
"వెళ్తున్నాను," అని చెప్పి స్వాతి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.
"ఎంతసేపు టైమ్? వాళ్ళు దగ్గర్లో ఉన్నారంట పంతులు చెప్పారు," అంటూ రాఘవ్ (అన్విత తండ్రి) కల్పించుకున్నాడు. 
"అయిపోయిందండి. అంతా రెడీ," అంది సునీత.
అప్పుడే పెళ్లికొడుకు తరపున వాళ్ళు మొత్తం ఐదుగురు అక్కడికి వచ్చారు. "నమస్కారం," అని అందరూ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు.
"సునీతా, అమ్మాయిని తీసుకురా," అని అబ్బాయి తల్లి అంది.
"సరే అండి," అని చెప్పి సునీత అన్వితను తీసుకువచ్చింది. అన్విత అక్కడికి వచ్చి కూర్చుంది. ఆమెకు ఈ పెళ్ళిచూపులు అస్సలు ఇష్టం లేదు కాబట్టి, తల వంచుకొని కూర్చుంది.
అప్పుడు అబ్బాయి తల్లి అడిగింది, "ఏమి చదువుకున్నావు? వంట వచ్చా? పాటలు పాడతావా?" అలా అన్ని అడిగింది. అన్వితకు ఇష్టం లేకపోయినా, మొహం మీద కనపడకుండా అన్నింటికీ సమాధానం చెప్పింది.
"మా అబ్బాయికి ఉద్యోగం చేసే అమ్మాయిలు అంటే ఇష్టం ఉండదు. కాబట్టి నువ్వు మానేయాలి పెళ్లి తర్వాత," అంది అబ్బాయి తల్లి.
ఒక్కసారిగా అన్విత మనసు చివుక్కుమంది. 'నాకు ఎంతో హాయిని, ప్రశాంతతను ఇచ్చే ఉద్యోగాన్ని వద్దు అంటారా?' అని ఎంతో కోపం వచ్చింది. అప్పుడే ఆమె తల్లి సునీత మొహం చూసింది. సునీత కళ్ళతో సైగ చేసింది, 'ఏం కాదులే, ఊరుకో' అని. సరే అని అన్విత నిశ్శబ్దంగా అయిపోయింది.
"చూద్దాంలే," అని ఇంక అబ్బాయి తల్లి మొత్తం మాట్లాడుతుంది. "ఎంత కట్నం ఇస్తారు?" అని అడిగింది.
రాఘవ్ మాట్లాడుతూ, "మాకు ఇద్దరు అమ్మాయిలు. మాకున్న దాంట్లో ఇద్దరికీ సగం సగం ఇస్తాం," అన్నాడు.
"మా కొడుకు గవర్నమెంట్ జాబ్. ఇంకా ఎక్కువ ఇస్తారు బయట. కాబట్టి చూసుకోండి. ఎక్స్‌ట్రాగా కార్ కావాలి," అని అబ్బాయి తల్లి డిమాండ్ చేసింది.
అన్వితకు కోపం ఇంకా ఎక్కువైంది. ఓపిక నశించి పైకి లేచింది. "మీకు బయట బాగా ఇస్తారుగా? అక్కడ చూసుకోండి!" అంది కోపంగా.
"ఏంటి అమ్మా ఇదంతా? నేను ఆల్రెడీ నీకు చెప్పా కదా నేను జాబ్ చేయాలని! మళ్ళీ వీళ్ళ డిమాండ్స్ వింటుంటే నాకు కోపంగా ఉంది. మీరు వెళ్ళండి!" అని అక్కడి నుంచి వెళ్లిపోయింది.
"ఏంటి అన్విత నువ్వు మాట్లాడుతుంది? నువ్వు ఎందుకు లేచావు? మేము మాట్లాడుతున్నాం కదా? కూర్చో," సునీత కంగారుగా అంది.
"ఏంటి మా నువ్వు అనేది? నేను చచ్చినా ఈ పెళ్లి చేసుకోను! నాన్న, నేను ఈ పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటానా నాన్న? అంతా ఆమెదే పెత్తనం. కనీసం మిగతావాళ్ళు మాట్లాడను కూడా మాట్లాడనివ్వట్లేదు!" అనేసి కోపంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది.
"ఇలాగేనా మీరు మీ అమ్మాయిని పెంచేది?" అని ఇంకేదో అనబోతుంటే, రాఘవ్, "మాకు తెలుసు మా అమ్మాయి ఎలాంటిదో. మీరు ఏమి చెప్పకర్లేదు!" అని గట్టిగా అన్నాడు.
అన్వితకు హ్యాపీగా ఉంది, 'హమ్మయ్య' అనుకుంది.
"ఇక్కడే ఎందుకు? మనం వెళ్దాం పదండి," అని అబ్బాయి తల్లి, అక్కడ ఉన్న వాళ్ళతో అంది.